సాధించెనే ఓ మనసా!-23

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 23వ భాగం. [/box]

[dropcap]“మీ[/dropcap]రు తప్పు చేశారు, శివా. నిజంగా పెద్ద తప్పు. అందుకు మీరు తగిన మూల్యం చెల్లించబోతున్నారు.”

ఈ మాటల ఆంతర్యాన్ని శివ అర్థం చేసుకోలేకపోయాడు. సూపర్ స్టార్‌కి కోపం వచ్చిందని మాత్రం అతనికి అర్థమైంది.

27 లక్షల రూపాయల విలువైన చీరలను బూడిద చేస్తే ఎవరికి కోపం రాదు? డబ్బు పోవడంతో పాటు, పెళ్ళికొడుకు తరఫున వాళ్ళు దాన్ని అపశకునంగా భావిస్తే?

పద్మ, మాల్య భయంతో వణికిపోయారు.

శివ మరోసారి సూపర్ స్టార్ వైపు చూసి చేతులు జోడించాడు. ఈసారి అతని కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఎందుకంటే తాను ఆయనను అన్ని విధాలుగా నిరాశపరిచాడు.

సూపర్ స్టార్ శివ చేతులు విప్పి కౌగిలించుకున్నాడు.

“అవును, శివా, మీ బాబాయిల ఆట కట్టిద్దామని ఒక నెల క్రితమే చెప్పాను. కానీ మీరు అలా చేయాలనుకోలేదు.

వారేం చేశారో చూడండి. వీటన్నిటి వెనుక ఆ విలన్లు ఉంటారని నాకు తెలుసు. ఈ విధ్వంసంలో పోలీసులు మానవ ప్రమేయాన్ని గట్టిగా అనుమానిస్తున్నారు.

ఇప్పుడు నేను చేసేది నన్ను చేయనివ్వండి. నేను ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్‌తో మాట్లాడాను. కొద్ది గంటల్లో ఎస్.పి. ఇక్కడకు వస్తాడు. అతను మీ నుండి వ్రాతపూర్వక ఫిర్యాదు తీసుకుంటాడు.

మీ బాబాయిలపై బలమైన అనుమానం ఉందని వ్రాసివ్వండి. అప్పుడు చట్టం దాని పని అది చేసుకుపోతుంది.”

ఆ గొప్ప వ్యక్తి అభిమానానికి శివ కదిలిపోయాడు. అయినా తన అభిప్రాయాలను స్థిరంగా నిలుపుకున్నాడు.

“అలా ఎలా చేయగలను సార్? ఆధారాలు లేనప్పుడు నేను వాళ్ళపై అభియోగాలు ఎలా మోపను? ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చు.

ఇది చాలావరకు సాధ్యమే, సర్, ఎందుకంటే ఎలక్ట్రికల్ మెయిన్స్ నుండి మంటలు పుట్టుకొచ్చాయి. నా దగ్గర కొంత రుజువు ఉంటే తప్ప వారిని నిందించడానికి నేను ఇష్టపడను.”

“అప్పుడు విచారణకి బోలెడంత సమయం పడుతుంది. కానీ నేను మిమ్మల్ని బలవంతం చేయను, శివా. ఇంత జరిగాకా కూడా మీరు మీ అమాయకత్వాన్ని కోల్పోలేదు.”

‘అందుకు కారణం నాకు దేవకన్య ప్రేమ దొరకడమే.’ ఆ విషయం సూపర్ స్టార్‌కి బహిరంగంగా చెప్పడానికి శివ ఇష్టపడలేదు.

***

తర్వాత శివ పద్మ, మాల్యలను సూపర్ స్టార్‌కి పరిచయం చేశాడు. సూపర్ స్టార్ చిరునవ్వు నవ్వి మహిళలకి నమస్కరించారు.

కళ్ళల్లో కన్నీళ్లతో సూపర్ స్టార్‌ని వేడుకుంటుటూ మాల్య చేతులు జోడించింది.

“సర్, మీ అమ్మాయి పెళ్ళి కోసం తమ్ముడు డిజైన్ చేసి, తయారు చేసిన చీరలన్నీ నాశనమయ్యాయని విన్నాను.

పైగా శివ మీ నుండి మొత్తం డబ్బును ముందుగానే తీసుకున్నానని చెప్పాడు. సర్, దయచేసి మాకు కొంత సమయం ఇవ్వండి.

ఆస్పిరన్ గార్డెన్ రోడ్‌లో మాకు పెద్ద బంగ్లా ఉంది, ప్రస్తుతానికి మాకున్న ఏకైక ఆస్తి అదే. మేము దాన్ని అమ్మి…”

సూపర్ స్టార్‌కి ఇప్పుడు నిజంగా కోపం వచ్చింది.

“ఏం మాట్లాడుతున్నారు? మీరు ఆ ఇంటిని ఎందుకు అమ్మాలి? నిన్న ఉదయాన్నే శివ నాకు చీరలు ఇచ్చారని అనుకుందాం.

అతని దుకాణంలో జరిగిన ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ నా ఇంట్లో జరిగిందనుకుందాం. అప్పుడు నేనేం చేస్తాను? ఇప్పుడు నేను అదే పని చేయబోతున్నాను.”

సూపర్ స్టార్ మనసులో ఏముందో ఎవరికీ అర్థం కాలేదు. శివ భుజాలపై చేతులు వేసి వివరించారు.

“నేను అన్నీ ఆలోచించాను, శివా. మా అమ్మాయితో సహా నా కుటుంబానికి చెందిన పది మంది మీతో వస్తారు. నా సెక్యూరిటీ గార్డులు కూడా ఉంటారు.

మీరందరూ విమానంలో బెంగళూరు వెళ్తారు. బెంగళూరులోని ఉత్తమమైన పట్టు-చీరల షాపులను ఎంచుగొని, చీరల ఎంపికలో మా వాళ్ళకి సహాయం చేయండి.

నేను బెంగళూరు ఎందుకు అంటున్నానంటే – మేము చెన్నైలో చీరలు కొంటే, అది మీకు, నాకు చెడ్డ పేరు తెస్తుంది. చీరల డబ్బు నేను చెల్లిస్తాను.”

“కానీ సర్, మీరు ఇప్పటికే మీరు మాకు చీరల కోసం రూ. 27 లక్షలు చెల్లించారు.”

“మీరు నిపుణులైన డిజైనర్ కదా? మీ రంగంలో మీరు ఉత్తమమని నేను విన్నాను. మీరు నా వాళ్ళతో దాదాపు ఒక వారం గడపడానికి; సరైన ఎంపిక చేయడానికి వారికి సహాయం చేయబోతున్నారు. ఆ 27 లక్షలు మీ సేవలకు ఫీజు.”

శివ, మాల్య, పద్మ గొంతులను సవరించుకోడానికి ప్రయత్నించారు, కానీ ఘోరంగా విఫలమయ్యారు.

***

సూపర్ స్టార్ శివని మళ్ళీ కౌగిలించుకున్నారు.

“మీ జీవితానికీ, నా జీవితానికీ మధ్య చాలా సారూప్యత ఉంది శివా. నేను ఈ రంగంలోకి ఎలా వచ్చానో మీకు చెప్తాను, నేను ఎవరికీ చెప్పని రహస్యం ఇది.

నేను మా కుటుంబపు ఆస్తి అయిన ఇంటిని అమ్మి, నాకు నటనకు అవకాశం ఇచ్చినందుకు మొత్తం డబ్బును దర్శకుడికి ఇచ్చాను. అతను నిజాయితీపరుడు. నిర్మాణ పనులను ప్రారంభించాడు.

అయితే పెద్ద ఆటంకం ఎదురయింది. నాతో నటించడానికి ఏ హీరోయిన్ ఇష్టపడలేదు. నేను నల్లగా ఉన్నాను, అందంగా లేను కాబట్టి నాతో నటించి కెరీర్‌ను రిస్క్ చేయడానికి ఏ నటి కూడా సిద్ధంగా లేదు.

నా డైరెక్టర్ కూడా ఒక మాజీ కథానాయికను అడిగే స్థాయికి చేరుకున్నాడు. ఆమె కూడా నిరాకరించింది.

నాకు వేరే మార్గం లేకపోయింది. డైరెక్టర్ 80% డబ్బును తిరిగి ఇస్తానని చెప్పాడు. నేను నా గ్రామానికి తిరిగి వెళ్ళాలని అనుకున్నాను.

ఆ సమయంలో పరిశ్రమలోని అగ్రశ్రేణి హీరోయిన్ నన్ను అకస్మాత్తుగా పిలిచింది. ఎలాగూ ఆమె ఖచ్చితంగా తిరస్కరిస్తుందని భావించి, మేము ఆమెను ఇంతకు ముందు అడగలేదు.

తను నాతో నటించడానికి సిద్ధంగా ఉందని ఆమె నాకు చెప్పింది. ఆమే లేకపోతే, ఈరోజు నేను దక్షిణాదిలోని మారుమూల గ్రామంలో గుర్తింపు లేని రైతుగా ఉండేవాడిని.

మీ ఋణం ఎలా తీర్చుకోగలను అని నేను ఆమెను భయంగా అడిగాను. ఆ అందమైన దేవదూత నాతో ఏం అన్నారో తెలుసా?

మీరు జీవితంలో పైకి వస్తారని నాకు తెలుసు. మీరు అగ్రస్థానంలో ఉన్నప్పుడు – ఏదోక రోజున మీరు ఈ రోజు ఉన్న పరిస్థితిలో ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలవవచ్చు. అప్పుడు ఇదే సాయాన్ని మీరు వారికి చేయడం మర్చిపోవద్దు.

నాకీ భిక్ష పెట్టిన ఆ దేవదూత చెప్పినట్లే నేను చేస్తున్నాను, శివా. దయచేసి దీనిని కొనసాగించండి. ఈ ప్రపంచాన్ని జీవించడానికి మంచి ప్రదేశంగా చేద్దాం.”

శివ ప్రశంసాపూర్వకంగా సూపర్ స్టార్ వైపు చూస్తూండిపోయాడు.

“రండి, పాపం ఆ అమ్మాయిని చూద్దాం.”

***

సంజన మేల్కొనే ఉంది. ఆమె సూపర్ స్టార్‌ని చూసి చేతులు జోడించింది. ఆ దయాళువు ఆమె పక్కన మంచం మీద కూర్చుని, ఆమె చేతులను పట్టుకుని స్నేహపూర్వక స్వరంలో ఆమెతో మాట్లాడారు.

“ఏంటమ్మాయి ఇది? నా కూతురికి తోడిపెళ్ళికూతురుగా మిమ్మల్ని అనుకున్నాను. మీరేమో విరిగిన కాలు, కాలిన ముఖంతో ఇక్కడ పడుకుంటున్నారు, ఎలా?”

సూపర్ స్టార్ స్వరం అకస్మాత్తుగా తీవ్రంగా మారింది.

“మిమ్మల్ని ఇలా చేసిన పాపాత్ముల మనస్సులో విషం నిండి ఉంది. ఆ విషం త్వరలోనే వారి శరీరాలకి వ్యాపించి వారి మరణానికి కారణమవుతుంది. ఇది నా మాటగా తీసుకోండి. వాళ్ళకి మంచి చావు రాదు.”

సంజన ఆయన వైపు చూసి నవ్వింది.

“మీకు ఏదైనా కావాలా? ఏది ఏమైనా, ఎక్కడ ఉన్నా, నేను మీ కోసం తెస్తాను. ఇది నా వాగ్దానం.”

సంజన తల ఊపింది.

“అడుగమ్మా…”

“సలహా”

సంజన స్వరం చాలా బలహీనంగా ఉంది.

సూపర్ స్టార్ ముఖంలో ప్రశ్నార్థకం!

“అవును సర్. ఈ దుర్మార్గుడు, ఇప్పుడు మీ పక్కన ఉన్నవాడు, నేను స్పృహలో లేనప్పుడు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పాడు.

నాకన్నా ఐదేళ్ళు చిన్నవాడు. చాలా అందగాడు. నేనేమో నల్లదాన్ని, పైగా ఈ అగ్ని ప్రమాదం నా ముఖాన్ని ఇంకా వికారంగా చేసింది. చెప్పండి సార్, నేను ఇతనిని పెళ్ళి చేసుకోడం బాగుంటుందా?”

“శివ మీకు చెప్పినదంతా మర్చిపొండి. చెప్పండి, మీరు అతన్ని ప్రేమిస్తున్నారా?”

“నేను అతన్ని పిచ్చిదానిలా ప్రేమిస్తున్నాను. కానీ…”

“మీరు ఒకరినొకరు ప్రేమిస్తే వేరే సమస్యే లేదు. మా పెద్దమ్మాయి తనకన్నా వయసులో చిన్న అతన్ని పెళ్ళి చేసుకున్నట్లు మీకు తెలుసా. వాళ్ళెంతో సంతోషంగా ఉన్నారు. నేను ఓ విషయం చెబితే మీ ప్రియుడు ఏమీ అనుకోడు కదా?”

“అతను ఏమనుకుంటే మనకి ఏంటండి? మీరు చెప్పండి సార్.”

“మీ ఇద్దరిలో మీరే చాలా అందంగా ఉన్నారు. మీ నలుపు రంగు మీకు వైభవమైన రూపాన్ని ఇస్తుంది.”

“హే, శివా… విను… విను. సర్, నేను దీన్ని నా బయో డేటాలో ఉంచుతాను.”

సూపర్ స్టార్ నవ్వారు. శివ సిగ్గుపడుతూ నవ్వాడు.

“సర్, నేను మిమ్మల్ని ఇంకొకటి అడిగవచ్చా?”

“ఖచ్చితంగా సంజనా. అడగండి. “

“నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి.”

“ఇప్పుడా?”

“అవును.”

“ఎక్కడ సంతకం చేయను? మీ దగ్గర పేపర్ లేదా నోట్ బుక్ ఉందా?”

“అవసరం లేదు సార్. ఈ కట్టుపై సంతకం చేయండి. నేను అద్దంలో చూసినప్పుడల్లా మీ గురించి ఆలోచిస్తాను. కట్టు తొలగించినప్పుడు నేను భద్రంగా ఉంచుకుంటాను సర్. శివా రా. మంచిపిల్లాడివి కదా, సంతకం పెట్టడానికి సర్‌కి పెన్ను తెచ్చివ్వు.”

***

తనకు లభించిన నిరంతర వైద్య సంరక్షణ వల్ల పాక్షికంగా; మాల్య, పద్మ, ఇంకా తన శివ తనపై చూపిన ప్రేమ కారణంగా, సంజన చాలా వేగంగా కోలుకుంది.

ఐదవ రోజు ఆమెను ఐసియు నుండి ఓ గదికి మార్చారు. పదిహేనవ రోజున డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

శివ డాక్టర్ కన్నప్పన్‌తో ఉద్వేగభరితంగా ఓ అభ్యర్థన చేశాడు.

“సర్, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీరు ఏమీ అనుకోకపోతే సంజనను మాతో పాటు మా ఇంటికి తీసుకెళ్లమా? సంజన అంటే మా అమ్మకీ, అక్కకీ, పిన్నికీ ఎంతో ఇష్టం.

ఆమెను తమ సంరక్షణలో ఉంచాలని; స్వస్థత సమయంలో ఆమెను బాగా చూసుకోవాలని కోరుకుంటున్నారు. సర్, దయచేసి…”

“అయితే శివా, పెళ్ళి కాకుండానే మీ ఇంటికి రావడం…”

“సర్, సంజనకి పూర్తిగా నయం కాలేదు. ఆమె ఒకటి లేదా రెండు నెలలు మంచం మీద ఉండాలి. కఠినమైన ఫిజియోథెరపీ చేయించుకోవాలి. ఆమె ప్రాథమిక కదలికలకు కూడా సహాయం అవసరం కావచ్చు.

మాకు అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు, అందరూ ఆమెపై తమ ప్రేమను కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు, ఆంటీ ఈ వయసులో ఎందుకు మీరే శ్రమించాలి… సర్…”

“సంజన అంగీకరిస్తే నాకు ఇబ్బంది లేదు.”

“చాలా చాలా ధన్యవాదాలు, సర్” అంటూ శివ ఆయనకి చేయి అందించాడు.

***

పూర్తిగా నయం కావడానికి సంజనకి రెండు నెలల సమయం పట్టింది. ఆమె ఆ మొత్తం కాలాన్ని శివ ఇంట్లో గడిపింది, ఆ ముగ్గురు మహిళలు చూపించిన ప్రేమలో మునిగిపోయింది.

సంజన ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా శివ సూపర్ స్టార్ కుటుంబంతో వెళ్లి పెళ్ళి చీరలను ఎంచుకోవడానికి సహాయం చేశాడు.

సూపర్ స్టార్ తన సొంత ఖర్చుతో శివ ఫ్లాట్‌కి రక్షణగా సాయుధ దళాలను ఏర్పాటు చేశారు.

ఆ రెండు నెలలు శివ-సంజన ప్రేమలో ఉత్తమ కాలం. ఆమె మేల్కొనే ఉన్నంత సేపూ శివ ఆమెను ఒంటరిగా ఉండనీయలేదు.

సంజన తనకోసం ఒక ప్రత్యేక గదిని తీసుకోడానికి నిరాకరించింది. పద్మ, మాల్యలతో ఒకే గదిలో నిద్రించేందుకు పట్టుబట్టింది. ఆ ముగ్గురు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తోచిన ప్రతి విషయం గురించి మాట్లాడుకునేవారు.

సంజన ప్రతిరోజూ ఫిజియో థెరపిస్ట్‌తో రెండు బాధాకరమైన గంటలు గడపవలసి వచ్చింది. శివ రోజంతా ఆమెతోనే ఉంటాడు. సంజన మంచం మీద నుండి దిగి మొదటి అడుగు వేయడానికి ప్రయత్నించినప్పుడు నొప్పితో బాధపడేది.

ఆమె కళ్ళలో కన్నీళ్ళు వచ్చేవి. శివ ఆమె వద్దకు పరిగెత్తుకు వచ్చేవాడు. అతను ఆమె భుజాలపై చేయి వేసి ఆమె చెవుల్లో గుసగుసలాడేవాడు. “కన్నా, ఐ లవ్ యు రా.”

సంజన నవ్వి, తరువాత అడుగు వేస్తుంది. బాధించే నొప్పి మళ్ళీ వస్తుంది. శివ అదే పదాలు పునరావృతం చేసేవాడు.

పద్మ, మాల్య రాత్రి ఏడు గంటలకి పని నుండి తిరిగి వస్తారు. కుటుంబం మొత్తం ఆ తర్వాత రెండు గంటలు మాట్లాడుకునేవారు.

తర్వాత వారంతా కలిసి భోజనం చేసి, 11 గంటలకు మంచం ఎక్కే ముందు మరో దఫా కబుర్లు చెప్పుకుంటారు.

శుక్రవారం సాయంత్రం వారు పిజ్జాలు, బర్గర్‌లను ఆర్డర్ చేస్తారు. అది సంతోషకరమైన సమయం. రెండు నెలలు రెండు నిమిషాల లాగా గడిచిపోయాయి.

***

ఆ శనివారం మధ్యాహ్నం పూటని శివ తన జీవితాంతం మర్చిపోలేడు. పద్మ, మాల్యా ఆఫీసుల నుండి తిరిగి వచ్చారు. సమయం సాయంత్రం 5 గంటలు.

ఎప్పటిలాగే కుటుంబమంతా చాలా విషయాల గురించి మాట్లాడుతూ డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు.

భవిష్యత్ చర్యల గురించి శివ మొదటిసారిగా తన ఆందోళనను వ్యక్తం చేశాడు.

“పిన్నీ, గత రెండు నెలలుగా లోన్ ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించలేదు. మనం తిరిగి చెల్లించాల్సిన మొత్తం 20 లక్షలు అని నాకు తెలుసు.

ఇన్సూరెన్స్ వాళ్ళు విషయాన్ని ఇంకా లాగుతున్నారు. క్లెయిం ప్రాసెస్ చేయడానికి ముందు వారికి స్పష్టమైన పోలీసు రిపోర్ట్ కావాలి.

పోలీసులు విచారణ ఆలస్యం చేస్తున్నారు. నన్ను క్షమించు, పిన్నీ, నేను ఎగవేతదారుల జాబితాలో చేరాను. నీకు చెడ్డ పేరు తెచ్చాను.”

“బాధపడకు శివా. మీ లోన్ ఎకౌంట్ అప్ టు డేట్‍గా ఉంది. ”

“ఏమంటున్నావు పిన్నీ?”

“మాల్య ఒక ఇన్‍స్టాల్‌మెంట్ కట్టింది, ఇంకొకటి నేను చెల్లించాను. లోన్ అప్‌డేటెడ్‌గా ఉంది. బకాయిలను ఒకసారి నేను, ఒకసారి మాల్య చెల్లించి లోన్‌ని క్లోజ్ చేద్దాం. దాని గురించి బాధపడకు శివా. ఇది సంతోషంగా ఉండవలసిన సమయం.”

“అయితే పిన్నీ, అక్కా, ఇది న్యాయం కాదు. నా బాధ్యతలని మీరే ఎందుకు మోయాలి? నేను ఇప్పటికే కుటుంబానికి తలకు మించిన బరువుగా మారాను. దీనికి అదనంగా, ఈ రుణ భారం కూడా ఉంది.

నేను ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని అనుకుంటున్నాను. ఎలాగూ నాకు ఎకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్‌లో తగినంత అనుభవం ఉంది.”

“నోరు మూసుకో, శివా. ఇంకెప్పుడూ అలా మాట్లాడకు.”

“శివా, నేను మా నాన్నని కొంత డబ్బు అడగనా?”

శివ సంజన వైపు చూశాడు.

“అది కూడా అప్పులానే తీసుకుందాం శివా. బ్యాంకు లోన్‍ని తిరిగి చెల్లించమని నాన్నని అడుగుదాం. షాపుని పునర్నిర్మించడానికి 30 లక్షలు కావాలి. ఆ డబ్బుని సులభ వాయిదాలలో తిరిగి చెల్లిద్దాం.”

శివ స్పందన కోసం మాల్య, పద్మ ఆత్రంగా అతని వైపు చూస్తున్నారు.

ఇంతలో పరిమళ సంభాషణలో జోక్యం చేసుకున్నారు.

“అవును, శివా, సంజన చెప్పేది సరైనదే. మనం మన ఇంటిని లోన్‍కి సెక్యూరిటీగా ఇద్దాము. డబ్బు తిరిగి చెల్లించిన వెంటనే మనం దాన్ని తిరిగి పొందవచ్చు.”

శివ ఏదో చెప్పబోయాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.

***

పరిమళ తలుపు తీశారు.

గుమ్మంలో ఉన్నవాళ్ళని చూసి పరిమళ కోపంతో విరుచుకుపడ్డారు. పద్మ, మాల్య, శివ తలుపు దగ్గరకు పరిగెత్తారు. సంజన కదలలేకపోయింది.

“మీరా, రాక్షసుల్లారా! ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా దగ్గర మిగిలిన వాటిని కూడా పట్టుకోవాలనుకుంటున్నారా?”

“దయచేసి మమ్మల్ని క్షమించు, అక్కా.”

“క్షమించాలా, మిమ్మల్నా… మీకా అర్హత లేదు. మీరు నా భర్తను చంపారు, మీరు నా కొడుకిని రోడ్డుకి లాగారు. ఇంకా ఏం చేయాలని వచ్చారు?”

ఆ వచ్చినవాళ్ళని మాల్య ఇప్పుడే గుర్తించింది.

ఆ ఆడవాళ్ళిద్దరూ మురుగేశన్, సెల్వకుమార్‌ల భార్యలు.

మాల్యా తల్లిపై కోప్పడింది.

“అమ్మా, దయచేసి ఇక్కడ సీన్ క్రియేట్ చేయవద్దు. ఇరుగుపొరుగు వారంతా మనల్నే చూస్తున్నారు. చూడమ్మా. ”

వచ్చినవాళ్ళలో ఒకరు మాల్యతో మాట్లాడారు.

“మీ అమ్మ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను, మాల్య. కానీ మాకు కేవలం ఐదు నిమిషాలు టైమ్ ఇవ్వమని వేడుకుంటున్నాం. మేము చెప్పాల్సింది మేం చెబుతాం. ఆ తరువాత వెళ్ళిపోతాం, మళ్ళీ రానే రాము.

మేము మిమ్మల్ని బాధపెట్టడానికి రాలేదని మా పిల్లలపై ప్రమాణం చేస్తున్నాము. మేము మీకు ఇవ్వడానికే వచ్చాము, తీసుకోడానికి కాదు.”

“దయచేసి లోపలికి రండి. మీరు కూడా.”

ఆమెని పిన్నీ అని సంబోధించడానికి మాల్య ఇష్టపడలేదు. తన తండ్రి మరణం, ఆమె భర్త కారణంగా తమ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తు చేసుకుంది.

మురుగేశన్ భార్య గొంతు సవరించుకుని ఏదో చెప్పబోయింది. మాల్య జోక్యం చేసుకుంది.

“ఒక్క నిమిషం. మీ బిందీ సరిగా లేదు. నేను కొంత కుంకుమ తెస్తాను.”

“అవసరం లేదు మాల్య. మా పసుపు కుంకుమలు శాశ్వతంగా పోయాయి.”

“పిన్నీ”

మాల్య దాదాపుగా అరిచింది. వచ్చిన ఆ ఇద్దరు మహిళలు క్రితం రోజు జరిగిన సంఘటనలను క్లుప్తంగా వివరించారు.

అయితే జరిగిన వాటిలో వారికి కొంత భాగం మాత్రమే తెలుసు. ఆ పై వాడికి మాత్రమే క్రిందటి రోజు ఏం జరిగిందో పూర్తి అవగాహన ఉంటుంది.

ఆయన పాలనలో చిరుగాలికి కదలాడే ఓ చిన్న గడ్డి పోచ – మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాన్ని ప్రభావితం చేయగలదు. ప్రతి చర్య, మంచిదో చెడ్డదో – ముందూ వెనుకగా – దాని సహజ పరిణామాలను పొందుతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here