సాధించెనే ఓ మనసా!-24

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 24వ భాగం. [/box]

[dropcap]సూ[/dropcap]పర్ స్టార్ సిఎం సెల్ ద్వారా ఒత్తిడి చేయించినప్పటికీ, శివ సిల్క్స్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ నెమ్మదిగా సాగుతోంది.

ప్రాథమిక పరిశోధనలలో లతను ప్రధాన అపరాధిగా గుర్తించారు, సంఘటన జరిగిన రెండు రోజుల తరువాత ఆమెను అరెస్టు చేశారు. వెల్డింగ్ కుమార్ పరారీలోనే ఉన్నాడు.

లతని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. అయితే ఆమెకి తన జీవితం కన్నా కుమార్‌ ప్రేమ ఎక్కువ ముఖ్యం.

ఆమె తప్పు పేర్లు చెప్పింది, తప్పుడు ప్రస్తావనలు చేసింది, కాని కుమార్ పేరును కొంచెం కూడా బయటపెట్టలేదు. కుమార్ ఆమె ప్రేమికుడని, ఈ పని చేయటానికి ఎవరో కుమార్‌‌ని నియమించి ఉంటారని పోలీసులు భావించారు.

ఈ విషయం దగ్గర విచారణ ఆగిపోయింది. లత అరెస్టు తర్వాత గణనీయమైన పురోగతి సాధించలేదు.

సిఎం సెల్ నుండి ఒత్తిడి కారణంగా పోలీసు సూపరింటెండెంట్ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

తన ప్రియురాలిని పోలీసులు హింసించారని వెల్డింగ్ కుమార్‌కు తెలుసు. మొదట అతనికి ఆమె మూర్ఖత్వంపై కోపం వచ్చింది – మంటలు రేగక ముందే అందరికీ ఫోన్ చేసింది.

కానీ అప్పుడు అతను ఆమె మంచితనాన్ని గ్రహించాడు. ఈ కుట్ర తనకి ఇష్టం లేకపోయినప్పటికీ, అతనిపై తన ప్రేమని వెల్లడించేందుకే లత ఈ పనికి ఒప్పుకుందని కుమార్ గ్రహించాడు.

ఈ కేసులో రంగనాథన్ తమ్ముళ్ళను ఇరికించడానికి అతను ఒక తెలివైన ఆలోచన చేశాడు.

వాళ్ళు తనకి పని అప్పగించినప్పుడు కుమార్ వాళ్ళ మాటలను రికార్డ్ చేశాడు. సంభాషణలో తన భాగాన్ని జాగ్రత్తగా తొలగించిన తరువాత అతను రికార్డింగ్‌ను ఒక సిడిలోకి బదిలీ చేశాడు.

“శివ సిల్క్స్ కేసులో కీలకమైన సాక్ష్యం” అని కవర్‌పై వ్రాసి, ఆరోపితుల గుర్తింపుతో ఒక నోట్‌తో పాటు సిడిని ధైర్యంగా పోలీసు కమిషనర్‌కు పంపాడు.

కవర్ పై వ్రాసినదాన్ని చూసి కమీషనర్ ఆ కవర్‌ని టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న ఎస్పీకి ఇచ్చారు. సిడిలోని విషయాలను పరిశీలించడానికి కమిషనర్‌కు సమయం లేదు.

కమీషనర్ ఇచ్చిన కవర్‌ని ఎస్.పి. స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లో భాగమైన డీఎస్పీకి అందజేశాడు.

ఆ డీఎస్పీ పేరు జయబాలన్.

అతను డిపార్టుమెంటులో అత్యంత అవినీతి అధికారులలో ఒకడు. పోలీసులలోని లంచగొండులలో ముఖ్యుడు.

అతను సిడి లోని విషయం విన్నాడు. ఇప్పుడు అతనికి ఈ కేసులో ఇప్పటి దాకా కనిపించని ఆధారాలు దొరికాయి. లత ద్వారా ఈ పని చేసిన వ్యక్తి వెల్డింగ్ కుమార్ అని వారికి ఇప్పటికే తెలుసు.

ఇప్పటిదాకా దొరకని ఆధారం ఏంటంటే – ఈ పనికి వెల్డింగ్ కుమార్‌ను పురమాయించిన వాళ్ళ గుర్తింపు. ఈ సిడి దానిని అందించింది. నేరస్థులను పట్టుకోవడంలో మరియు వారిని న్యాయస్థానం ముందు హాజరుపరచడంలో సరదా ఏం లేదు(డబ్బు రాదు అని చదవుకోండి).

జయబాలన్ ఆ సిడిని భారీగా డబ్బు సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశంగా పరిగణించాడు.

***

మనస్సులో ఒక పాపిష్టి ప్రణాళికతో అతను నేరుగా రంగా సిల్క్స్ షాపుకి వెళ్ళాడు జయబాలన్.

భాగస్వాముల క్యాబిన్లోకి ప్రవేశించి, “శివ సిల్క్స్‌కు నిప్పు పెట్టడానికి మీరు వెల్డింగ్ కుమార్‌ను ప్రేరేపించినట్లు మాకు తెలిసింది” అన్నాడు అస్పష్టంగా.

సోదరులు మొదట తమకేమీ తెలియదంటూ బుకాయించారు.

“ఆ షాపు ఎక్కడుందో కూడా మాకు తెలియదు సార్.”

“ఈ అబద్ధాలను న్యాయస్థానంలో చెప్పడానికి ప్రయత్నించండి. కుమార్ ప్రియురాలు లత మా అదుపులో ఉంది. ఆమె చాలా వివరాలు చెప్పింది. పైగా ఈ కేసులో సూపర్ స్టార్ ఆసక్తిగా ఉన్నారు.

సిఎం సెల్ మాపై ఒత్తిడి తెస్తోంది. మీ ఇద్దరిని ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. మీపై ఆస్తి దహనం, కుట్ర, హత్యాయత్నం ఇంకా ఐపిసిలోని ఇతర విభాగాల కింద అభియోగాలు మోపబడతాయి.

కనీసం పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది. అయితే మా విచారణ చాలా సంచలనంగా ఉంటుంది. మీకు జీవితకాలం ఖైదు వచ్చినా నేను ఆశ్చర్యపోను” అన్నాడు జయబాలన్.

అన్నదమ్ములు నిజంగానే బెదిరిపోయారు.

వాళ్ళు కుర్చీల నుండి లేచి “సర్, దయచేసి, మీరే మమ్మల్ని రక్షించాలి” అంటూ జయబాలన్‌ను వేడుకొన్నారు.

“నేను ఇక్కడికి అందుకే వచ్చాను. నా సేవలకు మీరు ఎంత చెల్లించగలరో చెప్పండి.”

సెల్వకుమార్ తన ఔదార్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడు.

“పూర్తిగా పది లక్షలు. క్యాష్ రూపంలో. ఇప్పుడే.”

జయబాలన్ అతనిని తిట్టాడు.

“ఆ డబ్బు దాచుకోండి. మీ లాయర్ ఫీజులకు ఉపయోగపడుతుంది. నేను పనికిమాలినవాడినని అనుకుంటున్నారా? ఈ నేరానికి మీరు కుమార్‌కి ఇంతకంటే ఎక్కువే చెల్లించారని నాకు తెలుసు.”

జయబాలన్ వెళ్ళడానికి లేచి నిలబడ్డాడు.

“ఓకే, జెంటిల్మెన్, రేపు వారెంట్, బేడీలతో కలుద్దాం. రేపు 11 గంటలకు నేను మిమ్మల్ని అరెస్టు చేస్తే, మీ ఫొటోలు సాయంత్రం పేపర్లలో ప్రముఖంగా వస్తాయి. నేను కొందరు విలేకరులను, ఫోటోగ్రాఫర్‌లను కూడా తీసుకువస్తాను.”

ఆ సోదరులిద్దరికీ ఇప్పుడు చావంటే భయం కలిగింది.

“అయ్యో సార్. ప్లీజ్ సార్.. మామీద దయ చూపండి. ఎంత కావాలో మీరే అడగండి. మేము ఇస్తాము.”

“అదీ! ఇప్పుడు మీరు వ్యాపారుల్లా మాట్లాడుతున్నారు. నాకు వంద లక్షలు అంటే ఒక కోటి రూపాయలు కావాలి.”

“కోటి రూపాయలా?” అంటూ విస్తుపోయాడు సెల్వ.

మురుగేశన్ అతన్ని నిశ్శబ్దంగా ఉండమని సంకేతాలు ఇచ్చి, చర్చని కొనసాగించాడు.

“మీకు కోటి రూపాయలిస్తే మాకేం చేస్తారు?”

“మంచి ప్రశ్న. లత మా అదుపులో ఉందని మీకు తెలుసు. ఆమె వెల్డింగ్ కుమార్ ప్రియురాలు. ఆమె మీకు వ్యతిరేకంగా ఉన్న ఏకైక సాక్ష్యం. నేను స్పెషల్ ఫోర్స్ బాధ్యత వహిస్తున్నాను.

నేను ఆమెను విచారణ కోసం నగరం బయటకి తీసుకువెళతాను. అప్పుడు ఆమెను పారిపొమ్మని చెప్తాను. పారిపోతునప్పుడు నేను ఆమెను కాల్చేస్తాను. ఆమె చనిపోతే మీకు వ్యతిరేకంగా ఉన్న అన్ని ఆధారాలు నాశనం అవుతాయి.

పోలీసులు మీకు కనీసం ఒక మైలు దూరం కూడా రారు. మేము కేసును మరో మూడు నెలలు సాగదీసి, ‘ఎలక్ట్రికల్ షార్ట్-సర్క్యూట్’ అనే సాధారణ వ్యాఖ్యతో మూసివేస్తాము.”

“సర్, ప్రస్తుతం మా దగ్గర కోటి రూపాయలు లేవు. మేము మూడు, నాలుగు బ్యాంకుల నుండి డబ్బు తీసుకోవాలి. ఇంకా వివిధ ప్రాంతాల నుండి డబ్బు సేకరించాలి.”

“ఇంకా ఎంత సేపు పడుతుంది?”

“రెండు గంటలు.”

“సరే, నేను ఇక్కడ వేచి ఉంటాను. నేను మళ్ళీ ఇక్కడకు రావడం చాలా కష్టం అవుతుంది. అది మీకు సమస్య అవుతుంది. ”

మురుగేశన్ తన మనుషులకు ఆదేశాలు ఇచ్చాడు. వచ్చిన పోలీసు అధికారికి సెల్వకుమార్ కాఫీ ఆర్డర్ చేశాడు.

***

రంగా సిల్క్స్‌కు దూరంగా ఉన్న ఒక వీధిలోని ఆటో గ్యారేజీలో దాక్కున్న వెల్డింగ్ కుమార్ వారి సంభాషణను వింటున్నాడనే విషయం ఆ ముగ్గురు విలన్లకు అసలు తెలియదు.

‘అత్యాశాపరుడా! నీ దురాశకు నా లతను బలి కానీయను’ అంటూ కుమార్ మనసులో ప్రతిజ్ఞ చేశాడు. ఆ పోలీస్ అధికారి, ఆ ఇద్దరు సోదరులు మరో రెండు గంటల పాటు ఒకే స్థలంలో ఉంటారని ఇప్పుడు కుమార్‌కి ఖచ్చితంగా తెలుసు.

కుమార్ లాంటి తెలివైన నేరస్థుడికి రెండు గంటలంటే చాలా ఎక్కువ సమయం! ఆ సమయంలో అతను ఏదైనా చేయగలడు.

కుమార్ కేవలం పది నిమిషాల్లో ఓ ప్రణాళిక రూపొందించాడు.

***

జయబాలన్ కోరిన కోటి రూపాయలు ఏర్పాటు చేయడంలో రంగా సిల్క్స్ ఉద్యోగులు తీరిక లేకుండా ఉన్నారు.

ఒప్పందం కుదిరింది కాబట్టి, మురుగేశన్, సెల్వకుమార్ – డిఎస్పితో స్నేహపూర్వక సంభాషణలో నిమగ్నమయ్యారు.

ఒక గంట గడిచింది. జయబాలన్ చాలా సంతోషకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు. మరో గంటలో అతను కోటీశ్వరుడు అవుతాడు.

అతను పదవీ విరమణ చేయడానికి మరికొన్ని నెలలు మాత్రమే ఉంది. తన సొంత పట్టణం తంజావూరులో అతిపెద్ద ఇల్లు కొనడానికి ఆ డబ్బును ఉపయోగించుకుందామనుకున్నాడు.

రంగా సిల్క్స్ యూనిఫాం ధరించిన బాలుడు ఒక ట్రేలో మూడు గ్లాసుల తియ్యటి నిమ్మరసంతో క్యాబిన్లోకి ప్రవేశించాడు.

మురుగేశన్ అవాక్కయ్యాడు.

“మేము జ్యూస్ అడగలేదుగా.”

“నాకు తెలియదు సార్. మీకు జ్యూస్ ఇవ్వమని మేనేజర్ నాకు చెప్పారు.”

“డిఎస్పి సార్ మీకు తెలుసా, మావాళ్ళు అవసరం లేని పనులు చేయడంలో నిపుణులు” అని, “మాకు జ్యూస్ వద్దు. తీసుకువెళ్ళిపో” అన్నాడు సెల్వ.

“అడగకుండానే జ్యూస్ వస్తే సమస్య ఏముంది? మనకు దాహంగానే ఉందిగా? మనం గంటకు పైగా మాట్లాడుతున్నాము. మన గొంతులు ఎండిపోయాయి.

మీకూ, ఈ జ్యూస్‍కీ మధ్య మీ అహాన్ని అడ్డు రానీయకండి. అబ్బాయి రా, మాకు జ్యూస్ ఇవ్వు. తీసుకోండి సర్, ఇది మీ ఆరోగ్యానికి మంచిది, మీకు కూడా తెలుసు” అన్నాడు జయబాలన్.

డీఎస్పీ ఉత్సాహం అందరికీ అంటుకొంది. ముగ్గురూ జ్యూస్ తీసుకుని దాని రుచిని ఆస్వాదించడం ప్రారంభించారు.

కొద్ది నిమిషాల తరువాత అదే కుర్రాడు క్యాబిన్‌కు తిరిగి వచ్చాడు. ముగ్గురు వ్యక్తులు తమ కుర్చీల్లో జారిపోయి అచేతనంగా ఉండడం చూశాడు.

అతను ప్రతి ఒక్కరి ముక్కు క్రింద తన చేతిని ఉంచాడు. శ్వాస ఆడడం లేదని నిర్ధారించుకున్నాడు. జ్యూస్ గ్లాసులను తిరిగి తీసుకొని చిరునవ్వుతో బయటకు వెళ్ళిపోయాడు.

షాపులో ఉంచిన కెమెరాలన్నింటినీ ఆ అబ్బాయి లాఘవంగా తప్పించుకున్నాడు. అతను ధరించిన అసాధారణ పెద్ద సైజు టోపీ అతని ముఖం కెమెరాలకి చిక్కకుండా చేసింది.

అరగంట తరువాత క్యాషియర్ డబ్బు సిద్ధంగా ఉందని చెప్పడానికి లోపలికి వచ్చినప్పుడు, వాళ్ళని చూసి గట్టిగా అరిచాడు.

మరుసటి రోజు ఆ మృతదేహాలపై నిర్వహించిన శవపరీక్షలో ముగ్గురూ జ్యూస్‌లో స్వల్ప మోతాదులో పొటాషియం సైనైడ్ కలవడం వల్ల మరణించారని తేలింది.

***

“అవునక్కా. వాళ్ళు తమ సొంత అన్నయని చంపి, నీకు పసుపు కుంకుమలు దూరం చేశారు. ఇప్పుడు దేవుడు మా పసుపు కుంకుమలను తీసుకుపోయాడు.”

పరిమళ హృదయం కరిగిపోయింది.

“అంత్యక్రియలు చేయడానికి మీరక్కడ ఉండాలి కదా?”

“మృతదేహాలు ఇంకా రాలేదు. ఇది పోలీసు కేసుగా మారింది. శవాలను రేపు ఉదయమే ఇస్తామని వారు హామీ ఇచ్చారు. దాంతో మా కర్తవ్యాన్ని నిర్వహించడానికి మాకు విలువైన సమయం దొరికింది. ”

“ఏంటా కర్తవ్యం?”

పిన్నులిద్దరూ ఇంకా నిలబడే ఉన్నారని శివ గమనించాడు.

“దయచేసి కూర్చోండి పిన్నీ.”

శివ మృదువైన స్వరానికి వారు కదిలిపోయారు. మురుగేశన్ భార్య శివకి కొన్ని కాగితాలు ఇచ్చింది.

“శివా, ఇవి నీవే. మేము నిన్న రాత్రి లాయర్లు, ఆడిటర్లతో కూర్చుని ఆస్తులను విభజించాము.

మా సూత్రం సరళమైనది, ప్రధాన దుకాణం మినహా అన్ని ఆస్తులను మూడు భాగాలుగా విభజించాము. ఇప్పుడు మూడవ వంతు వాటాను నీకు ఇస్తున్నాము.

మేము ఇప్పటికే నీ పేరు మీద ఆస్తులను రిజిస్టర్ చేశాము. ఆ పనులన్నీ ఈ ఉదయం పూర్తయ్యాయి. ఇదిగో లాయర్ విజిటింగ్ కార్డు. రేపు నువ్వు అతన్ని కలిస్తే అతను నీకు అన్ని వివరాలు చెబుతాడు.”

గది పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది.

‘షాపుని ఎందుకు అట్టేపెట్టుకున్నారు? భర్తలను కోల్పోయిన తరువాత కూడా వీళ్ళు పాఠాలు నేర్చుకోలేదు’ అనుకుంది పరిమళ. అలా ఆలోచించడంలో ఆమె తప్పేం లేదు.

పరిమళ మనసులోని ప్రశ్నకు సెల్వకుమార్ భార్య తన చర్యలు, మాటల ద్వారా సమాధానం ఇచ్చింది.

ఆమె శివ చేతుల్లోకి కాగితాల బొత్తిని కదిలించింది.

“మేము షాపుని, జిఎన్ చెట్టి రోడ్‌లోని ఆస్తితో పాటు, చీరల నిల్వలు, కాంచీపురంలో ఉత్పత్తి సౌకర్యాలతో పాటు ముడి-పట్టు, జరీ, బ్యాంక్ డిపాజిట్లు, ఇంకా ప్రతిదీ, లాక్, స్టాక్, బారెల్‌ అన్నీ నీ పేరు మీద రాసేశాం.

ఇవిగో కాగితాలు, శివా. ఇప్పటినుండి రంగా సిల్క్స్ యొక్క ఏకైక యజమాని నువ్వే. నువ్వు మీ నాన్నగారి కంటే మరింత ఎత్తుకు చేరుకోవాలని మేము ఆశీర్వదిస్తున్నాము.

వీటన్నిటికీ కృతజ్ఞతలు చెప్పడానికి మీరు దేవుని ముందు నిలబడినప్పుడు దయచేసి మా అమ్మాయిల మేలు కోరండి చాలు. హీన స్థాయి నేరస్థుల పిల్లలుగా జన్మించిన పాపానికి పిల్లలు బాధపడకూడదు.”

ఆమె ఇప్పుడు పరిమళ వైపు తిరిగింది.

“అక్కా, షాపు, ఇంకా ఆస్తిలో ప్రతి మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉండవచ్చని న్యాయవాది మాకు చెప్పారు.

మాకు తెలుసు, అక్కా, మా భర్తలు దురాశతో బావగారి చావుకు కారణమయ్యారు. మేము బావగారిని తిరిగి బ్రతికించలేము. మేం చేయగలిగిందల్లా పూర్తి వ్యాపారాన్ని వారి కొడుకుకు ఇవ్వడమే.

పై నుంచి బావగారు ఇదంతా చూస్తారనీ; ఇప్పటివరకు ఈ విషయంలో ఏమీ చేయనందుకు మమ్మల్ని దయతో క్షమిస్తారని నాకు తెలుసు.”

పేపర్లు ఇచ్చేసి, మనసు విప్పి మాట్లాడిన ఆ ఇద్దరు స్త్రీలు ఆ ఇంటిని విడిచిపెట్టి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు.

***

మొదటగా తేరుకున్నది పద్మ. ఆమె శివ నుండి కాగితాలను తీసుకుని అతనికి కేటాయించిన ఆస్తుల వివరాలను చూసింది.

బెంగళూరులోని త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్, బెంగళూరులోని కన్నింగ్‌హమ్ రోడ్‌లో 1200 చదరపు అడుగుల వాణిజ్య భవనం, చెన్నైలోని స్పెన్సర్ ప్లాజాలో 3000 చదరపు అడుగుల ప్రీమియం కమర్షియల్ స్పేస్, ఓల్డ్ నాథమ్ రోడ్, మదురైలోని 5000 చదరపు అడుగుల ఇల్లు, కోయంబత్తూరులో కమర్షియల్ రియల్ ఎస్టేట్… ఇలా జాబితా కొనసాగింది. అవన్నీ 20 కోట్ల రూపాయల విలువైనవి.

రంగా సిల్క్స్ భారీ కాంప్లెక్స్, స్టాక్స్, ఇంటీరియర్ డెకరేషన్, గుడ్‌విల్, కాంచీపురంలో తయారీ సౌకర్యాలు ప్రస్తుత ధరల స్థాయిలో రూ.200 కోట్లకు పైగా ఉంటాయి.

ఆమె శివని కౌగిలించుకుని అతని నుదిటిపై ముద్దు పెట్టుకుంది.

“సాధించావు శివా. నీ వాటా కంటే నీకు చాలా ఎక్కువ లభించింది. నువ్విప్పుడు బిలియనీర్‌వి, శివా” అంది.

మాల్య సంజనను హత్తుకుని ఆమె చెంపలపై ముద్దు పెట్టుకుంది.

“సంజనా, నువ్వు మా మహాలక్ష్మివి. నీ రాక మాకు చాలా సంపదని తెచ్చించి చూడు” అంది.

వారు ఆనందంతో ఏవేవో విషయాల గురించి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు.

చివరకు పరిమళ వారిని అడిగింది, “ఈ రాత్రికి వంట ఏం చేయను? వేడుక చేసుకోడానికి మీకు ప్రత్యేకంగా ఏదైనా కావాలా?”

“అక్కా, నాకు ఒక ఆలోచన వచ్చింది. మనమందరం తినడానికి ఎందుకు బయటకి వెళ్ళకూడదు? నేను లే రాయల్ మెరిడియన్ హోటల్‌లో మన కోసం టేబుల్ బుక్ చేస్తాను?”

“శివా, నేను ఎలా రాగలను?” సంజన విచారంగా అడిగింది.

“నిన్ను నా భుజాలపై మోసుకెళ్తాను.”

“ఛీ…”

“సంజూ నువ్వు ఆ వాకర్‌తో నడవడం ప్రారంభించావు కదా. లేదంటే నేను నీ కోసం చక్రాల కుర్చీ ఏర్పాటు చేస్తాను.”

“థాంక్స్, మాల్య. నేను వాకర్‌ వాడుతా.”

“నేను ఒక షరతుతో హోటల్‌కు వస్తాను” అంది పద్మ.

ప్రతి ఒక్కరూ ఇప్పుడు పద్మ వైపు చూశారు.

“ఏమైంది పిన్నీ?” శివ ఆందోళనగా అడిగాడు.

“ఇప్పుడు టైమ్ ఆరు గంటలే అయింది. మనం మరో పదిహేను నిమిషాల్లో బయల్దేరి నేరుగా అయోధ్య మండపం వెళ్తాము.

అక్కడ మాతా అంబికా దేవి ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇస్తున్నారు. అది 8 గంటలకు ముగుస్తుంది. మనం ఆమెను కలిసి, ఆమె ఆశీర్వాదం తీసుకుందాం. తరువాత లే మెరిడియన్‌కి వెళ్దాం.”

“అలాగే పిన్నీ” అన్నాడు శివ.

“పిన్నీ, తన ఇన్నోవా పంపమని నాన్నని నేను అడుగుతాను, అప్పుడు మనమందరం ఒకే కారులో కలిసి వెళ్ళవచ్చు.”

పద్మ ఇప్పుడు సంజనకు కూడా పిన్నిగా మారింది.

***

పెప్పర్ గ్రే కలర్ ఇన్నోవా అయోధ్య మండపం దగ్గర ఆగింది.

వారు కారు నుండి దిగుతుండగా, హాల్ వెలుపల ఉంచిన స్పీకర్ల ద్వారా అంబికా దేవి యొక్క కంచుకంఠాన్ని వినగలిగారు.

నా ప్రభువు కృష్ణుడు ఒక దొంగ. జేబుదొంగ మాత్రం కాదు. కానీ అసాధారణమైన చోరుడు. పైగా కొంటె కోణంగి కూడా.

మీ చేతిలో ఇత్తడి నాణెం ఉంటుంది. ఆ నాణాన్ని కాపాడమని మీరు అతనిని నిరంతరం ప్రార్థిస్తూ ఉంటారు.

అతను మీ ముందు అమాయక కుర్రవాడిగా ప్రత్యక్షమవుతాడు, వేణువు ఊదడం ప్రారంభిస్తాడు. మీరేమో పరధ్యానంలో ఉంటారు.

మీరు తిరిగి స్పృహలోకి వచ్చినప్పుడు మీ డబ్బు పోయిందని గ్రహిస్తారు. అతను మీ నుండి తీసుకున్నాడు.

మీరేమో, “ఇది ప్రేమా? ఇది కరుణా? ఆ ఇత్తడి నాణెం తప్ప నా దగ్గర ఏమీ లేదు. పైగా నువ్వు నాకున్న ఏకైక ఆస్తి దోచుకున్నావు. నా ఆహారం కోసం నేను ఏం చేయాలి? కన్నయ్యా, ఈ దుఃఖం ఎందుకు కలిగించావు?” అని అడుగుతారు

కొంతకాలం తర్వాత మీరు అతనిపై అరవడం, శపించడం, సాధ్యమైనంత చెడ్డ భాషను ఉపయోగించడం ప్రారంభిస్తారు. అయితే నా ప్రభువుకి అది మీ ప్రార్థనా గీతం వలె మధురంగా ​​ఉంటుంది.

అతన్ని తిట్టడం పూర్తయ్యాకా, అతన్ని దూషించడం ముగిసాకా, ఇకపై ఆయనను మీరు ఆరాధించమని ప్రకటించాకా, అతను నిశ్శబ్దంగా ప్రపంచంలోని అన్ని విలువైన బంగారం, ఇంకా వజ్రాలను మీకందిస్తాడు.

ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నది మీరు మొదట కోల్పోయిన ఇత్తడి నాణెం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ విలువైనది.

ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా మీకు తెలియదు. మీరు ఏడుస్తూ ఉంటారు. మీరు దుఃఖిస్తారు. మీరు అమితంగా ప్రేమిస్తారు.

నా ప్రియమైన మిత్రులారా! ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, కృష్ణుడు మీ చేతులని ఖాళీ చేస్తాడు, తద్వారా మీకు మొదట్లో ఉన్నదానికంటే చాలా విలువైనదాన్ని ఇస్తాడు.

మొదట పోగొట్టుకోగానే నా ప్రభువును శపించటానికి, దూషించడానికి సిద్ధంగా ఉండే మూర్ఖులకు కొదువ లేదు.

నా ప్రభువు వారందరినీ ఆశీర్వదిస్తాడు. నా ప్రభువు వారిని సంతోషంగా, సంపన్నులుగా చేస్తాడు. నా ప్రభువుని ప్రేమను అనుగ్రహించనివ్వండి.

ఆ ఉపన్యాసం వింటున్న రెండు వందలకు పైగా జనాలలో ఒక మహిళ మాత్రమే దుఃఖించసాగింది. ఆమే పద్మ.

(అయిపోయింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here