Site icon Sanchika

సాధించెనే ఓ మనసా!-3

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది మూడవ భాగం. [/box]

[dropcap]రం[/dropcap]గనాథన్ చాలా వేగంగా కోలుకున్నాడు. మూడవ రోజు నాటికి ఆయన ఇంటి చుట్టూ నడవగలిగాడు. ఏడవ నాటికి అతను తోటలో తన ఉదయాన్నే నడక ప్రారంభించాడు. ఇంట్లో అంతా మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంది.

రంగనాథన్ కవల సోదరులు ప్రతిరోజూ ఆయనను సందర్శించి అతని ఆరోగ్యం గురించి నిరంతరం ఆరా తీస్తున్నారు. రంగనాథన్ వ్యాపారంలో అమ్మకాలు మరియు ఇతర ముఖ్యమైన సమస్యల గురించి అడిగాడు.

సోదరుల స్పందనలు నిరుత్సాహంగా, తప్పించుకునేవిలా ఉన్నాయి. తన సోదరులతో వ్యాపార సంబంధం పెట్టుకున్నందుకు జీవితంలో మొదటిసారిగా అసౌకర్యంగా భావించాడు రంగనాథన్.

మూడు వారాల తరువాత డాక్టర్ రంగనాథన్‌ను పనికి వెళ్ళటానికి అనుమతించాడు కాని నెమ్మదిగా ఉండమని గట్టిగా సలహా ఇచ్చాడు. మరీ ఎక్కువగా నిమగ్నమవడం లేదా విభ్రాంతికి లోనవడం చాలా ప్రమాదం.

రంగనాథన్ పంచాంగం చూసుకుని, తన పనిని తిరిగి ప్రారంభించడానికి ఒక మంచిరోజుని నిర్ణయించాడు.

ఆయన ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచాడు. ఉదయపు నడకకి వెళ్ళలేదు. చన్నీటి స్నానం చేసి, ఆపై ఇంటి అందమైన పూజ గదిలోకి వెళ్ళాడు. కళ్ళు మూసుకుని దైవం ముందు కూర్చున్నాడు.

సాధారణంగా ఆయన ఆ గదిలో ప్రశాంతంగా, కలత లేకుండా ఉంటాడు. కానీ ఆ రోజు అతను అసాధారణంగా కలత చెందాడు. ప్రశాంతంగా ఉండటానికి చేసిన ప్రయత్నాలు విఫలంగా కాగా, వాటిని విరమించాడు. పరిమళ వద్ద సెలవు తీసుకుని దుకాణానికి బయలుదేరాడు.

మాల్య, పద్మ చాలా ముందుగానే ఆఫీసులకి వెళ్ళిపోయారు.

“పరి, ఇన్నాళ్ళు నేను చప్పిడి తిండి తిన్నాను. భోజనంలో ఏదైనా మసాలా చెయ్యవా? ఏం చేస్తావంటే… కారా కుళంబు (పచ్చి మిర్చి, ఉల్లి, టమాటాలతో చేసే పులుసు), ఇంకా బంగాళాదుంప కూర…” భార్యతో అన్నాడు.

ఎందుకంటే ఆయన తీసుకునే ఆహారంపై వైద్యులు ఎటువంటి నిర్దిష్ట ఆంక్షలు విధించలేదు.

“అలాగే తప్పకుండా. మీరు భోజనానికి త్వరగా ఇంటికి రండి. మరీ శ్రమపడకండి. అన్నీ మీ తమ్ముళ్ళకు వదిలి విశ్రాంతి తీసుకోండి.”

***

రంగనాథన్ యొక్క ముదురు నీలం సి-220 మెర్సిడెస్ బెంజ్ జిఎన్ చెట్టి రోడ్‌లోని విశాలమైన రంగా సిల్క్స్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించింది.

సమయం ఉదయం తొమ్మిది గంటలు దాటింది. కస్టమర్‍ల పార్కింగ్ స్థలం దాదాపుగా నిండిపోయింది. వెనుక వైపున ఉన్న యజమాని కార్ పార్కింగ్ లోకి ప్రవేశించడానికి డ్రైవర్ వాహనాన్ని తిప్పాడు.

విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు వాహనాన్ని అడ్డుకున్నాడు. కస్టమర్ల పార్కింగ్ వద్ద కారును పార్క్ చేయమని అతను డ్రైవర్‌కి చెబుతున్నాడు.

డ్రైవర్ అయోమయంలో పడ్డాడు. అతను గార్డుకి చాలా దగ్గరగా నడుపుతూ నెమ్మదిగా మాట్లాడాడు.

“ఏయ్ నాగరాజూ, ఏమైంది నీకు? నిన్న రాత్రి తాగింది దిగలేదా? ఇప్పటికీ మైకంలో ఉన్నావా? లేదా మర్చిపోయావా? ఇది మన పెద్దాయన వాహనం. పక్కకు జరుగు. నేను లోపలికి వెళ్లాలి.”

“ఈ కారుని అనుమతించవద్దని నాకు ఆదేశాలు ఉన్నాయి.”

డ్రైవర్ లోగు కిందకు దిగాడు.

“నీకు పిచ్చి పట్టిందా? పెద్దాయన, మన యజమాని రంగనాథన్ గారు కారులో ఉన్నారు. గేట్ తెరువు, చెప్తున్నాగా. ”

గార్డు తన మాట మీద మొండిగా ఉన్నాడు. డ్రైవర్ ఇక ఆగలేకపోయాడు. గార్డును చొక్కా కాలర్ పట్టుకొని అతనిపై అరవడం ప్రారంభించాడు.

రంగనాథన్ సోదరులు దుకాణం నుండి బయటకు పరుగెత్తుకు వచ్చారు. రంగనాథన్ వాహనం నుంచి దిగాడు. తన సోదరులను చూసి సంతోషించాడు.

“మురుగా, ఇప్పుడే ఈ గార్డును ఉద్యోగం లోంచి పీకేయండి. తలపొగరు వెధవ! వీడు నా కారునే అడ్డుకుంటున్నాడు.”

“అన్నయ్యా, ఆవేశం వద్దు. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. డాక్టర్ చెప్పింది మీకు గుర్తులేదా?”

“ఎవరిది ఆవేశం? ఈ మూర్ఖుడు యజమాని కారును లోపలికి అనుమతించడానికి నిరాకరిస్తున్నాడు. అతని చెంప మీద కొట్టి, బయటకు లాగేసే బదులు, మీరు నాకు సలహా ఇస్తున్నారు. మురుగా, మీకు ఏమైంది? ”

సెల్వకుమార్ స్వరం మృదువైనది కాని భీతిగొలిపేది.

“అన్నయ్యా, ఈ సమయంలో మీకు ఇక్కడ ఏ పని? మేము మిమ్మల్ని రమ్మని ఎప్పుడూ అడగలేదే.”

“సెల్వా, మీకు ఏమైంది? ఇది మన దుకాణం కాదా? ఇది మన కుటుంబ వ్యాపారం కాదా? ఇది మనం ముగ్గురం సమాన భాగస్వాములుగా ఉన్న సంస్థ కాదా? మురుగా, మనం ప్రస్తుతం సెల్వను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి అని అనుకుంటున్నాను. వీడి ఆరోగ్యం బాలేదని అనిపిస్తోంది. రండి, నా కారులో వెళ్దాం. సెల్వా, రా. ”

రంగనాథన్ గొంతు దయనీయంగా ఉంది.

మురుగేశన్ గొంతులో దృఢత్వం భయానకంగా ఉంది.

“వాడు అనారోగ్యంతో లేడు. ఆరోగ్యం బాలేనిది మీకే. మా వ్యాపారంలో ఆటంకం కలిగించడానికి మీరు ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? ఇది పండుగ సీజన్ అని మీకు తెలియదా? దుకాణం కస్టమర్లతో నిండి ఉంది.”

రంగనాథన్ ఎడమ చేతిలో ఒక విభిన్నమైన నొప్పి కలిగింది.

“మురుగా, మీరు ఏమంటున్నారు?”

“నిజం, అన్నయ్యా. మీరు వ్యాపారం నుండి రిటైర్ అయ్యారు. మీరు ఇప్పటికే మీ వాటాగా డబ్బు పొందారు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు బాధపెడుతున్నారు?”

చేతిలో నొప్పి భుజం వరకు పాకింది. నెమ్మదిగా అది అతని గుండె వైపు ప్రసరించడం ప్రారంభించింది.

సెల్వకుమార్ చెప్పడం కొనసాగారు.

“మీరు రిటైర్‌మెంట్ డీడ్, రెలిన్‌క్విష్ డీడ్, ఇంకా సంస్థ పేరిట ఉన్న ఆస్తుల రిలీజ్ డీడ్‌లపై సంతకం చేశారు.”

“మీకు వ్యాపారంలో లేదా సంస్థ యొక్క ఆస్తులు, రంగా సిల్క్స్‌లో హక్కు లేదని మీరు రిజిస్ట్రార్ ముందు వ్రాశారు. ప్రస్తుతానికి మురుగేశన్, నేను మాత్రమే సమాన భాగస్వాములం..”

“దేవుడా! ఇదంతా ఎప్పుడు జరిగింది?  ఆ పాపిష్టి కాగితాలపై నేను సంతకం చేశానా?”

“అన్నయ్యా, మీరు విషయాలు మరచిపోతున్నారని అనుకుంటున్నాను. వయస్సు పెరుగుతోంది, పైగా పక్షవాతం కూడా కారణమై ఉండాలి.

“క్రిందటి సంవత్సరం ఇండోనేషియాకు వెళ్ళినప్పుడు మీరు వదినకు జనరల్ పవర్ అటార్నీ ఇచ్చారు. మీ తరపున ఏదైనా పత్రంలో సంతకం చేయడానికి మీరు ఆమెకు అధికారం ఇచ్చారు.”

“ఆమె సంతకం మీ సంతకంలానే చెల్లుబాటవుతుంది. అన్ని పేపర్లలోనూ వదిన సంతకం చేశారు.”

ఇప్పుడు నొప్పి మరింత తీవ్రంగా ఉంది.

రంగనాథన్‌కి బాగా చెమట పడుతోంది.

మురుగేశన్ స్వరం రాజీ ధోరణిలో ఉంది.

“చూడండి, అన్నయ్యా, మీకు పక్షవాతం వచ్చినప్పుడు వదిన కలత చెందారు. వ్యాపార సమస్యల వల్ల కలిగే టెన్షన్ వల్ల ఇదంతా జరిగిందని ఆమె అనుకున్నారు.”

“కాబట్టి ఆమె మా నుండి పది లక్షలు తీసుకున్నారు. ఇక మీ కుటుంబానికి ఈ వ్యాపారం లేదా ఆస్తులతో ఏమీ సంబంధం లేదని మాకు చెప్పారు.”

“ద్రోహుల్లారా…”

ఛాతీ ప్రాంతంలో నొప్పి ఎక్కువై, రంగనాథన్ తన ఛాతీపై చేయి ఉంచుకోవలసి వచ్చింది.

ఆయన హృదయం ఆయన జీవిత నాటకంలో చివరి సన్నివేశాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, అతని మెదడు ఇంకా పని చేస్తునే ఉంది.

కిందటి నెలలోనే సంస్థ యాజమాన్యంలోని అన్ని ఆస్తుల ప్రస్తుత విలువను మానసికంగా లెక్కించాడాయన. వాటి విలువ దాదాపు నూట యాభై కోట్లకు వచ్చింది.

ఇంకా వ్యాపారం – రిటైల్ అవుట్లెట్, దాని భారీ ఇన్వెంటరీ హోల్డింగ్, గుడ్‌విల్, కనెక్షన్లు, ఇంకా చేనేత కార్మికులకు అడ్వాన్స్‌తో కూడిన ఉత్పాదక సదుపాయం, నూలు మరియు జరీల నిల్వలు కలిపితే మరో నూట యాభై కోట్లు విలువైనవి.

తమ్ముళ్ళు కేవలం పది లక్షల నగదు చెల్లించి 300 కోట్లు మోసం చేశారు. అయితే ఆ అవివేకి ఎందుకు సంతకం చేసింది?

పరిమళ చదువుకున్న స్త్రీ. కాగితాలలోని విషయాలు తెలిసి ఉంటే పరిమళ ఖచ్చితంగా సంతకం చేసి ఉండేది కాదని రంగనాథన్ అనుకున్నాడు.

ఈ ద్రోహులు ఆమెను మోసం చేశారు. ఈ హృదయం లేని రాక్షసులు తమకు తల్లి కంటే ఎక్కువైన వదినిని దోచుకున్నారు.

పాపం పరిమళ, ఆమె వారిని గుడ్డిగా విశ్వసించి చేయమన్న చోటల్లా సంతకం చేసి ఉండాలి.

“మురుగా, సెల్వా, నేను మిమ్మల్ని నా పిల్లల్లా పెంచాను! అందుకు చక్కని కృతజ్ఞత చూపించారు! మీరు నా ప్రేమకు ద్రోహం చేసారు! మీరు నా కుటుంబాన్ని మోసం చేసారు! మీరు నా సంపదను మోసం చేసారు! మీ ఇద్దరికీ దీవెనలు! మీరు నా కుటుంబాన్ని వీధికి లాగేసారు! మీరు అమ్మలాంటి మీ వదినతో అబద్దం చెప్పి, ఆమె సంతకాలు తీసుకొన్నారు…”

“నేను శివకి ఏం చెప్పాలి? ప్లీజ్ .. ప్లీజ్ .. మీరు నన్ను ఇష్టపడకపోతే, నన్ను రిటైర్ అవనివ్వండి. అయితే దయచేసి నా వాటాను శివకి ఇవ్వండి.”

“వాడు సంస్థకు ఓ ఆస్తిగా ఉంటాడని నాకు తెలుసు. మన చీరలను వాడిని డిజైన్ చేయనివ్వండి. వాడో అద్భుతమైన డిజైనర్. తక్కువ సమయంలోనే వాడు మన ఆస్తుల్ని పెంచుతాడు. వాడు ప్రతిభాశాలి! మురుగా, దయచేసి సెల్వకు చెప్పు. దయచేసి.. మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించండి… “

“అన్నయ్యా, మేం చాలా చేయాల్సి ఉంది. సంపదను పెంచడంపై మాకు నిపుణుల సలహా అవసరమైనప్పుడు, మేం శివని సలహా అడుగుతాం. ప్రస్తుతం మా దగ్గర ఉన్నది మాకు సరిపోతుంది.”

“ప్లీజ్.. దయచేసి నన్ను నిరాశపరచవద్దు.”

“అన్నయ్యా, మీరు ఇక్కడ ఎందుకు గొడవ చేస్తున్నారు? మీకు పది లక్షలు ఉన్నాయి. దానితో మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి. మేము రోజంతా పని చేయాలి. అది మాకు తప్పదు. మీకు అవసరం లేదు. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి.”

“మళ్ళీ ఇక్కడకు వచ్చే పొరపాటు ఎప్పుడూ చేయకండి. ఈసారి మేము మిమ్మల్ని బయటకు నెట్టడానికి పోలీసు బలగాలను పిలుస్తాము. సెల్వా రా, వెళ్దాం. మనకు చాలా పనులు ఉన్నాయి.”

తన సోదరులు ఒకరినొకరు చేతులు పట్టుకుని దుకాణంలోకి వెళ్ళడం రంగనాథన్ చూస్తున్నాడు. కొందరు కస్టమర్లు, కొందరు సిబ్బంది అక్కడ గుమిగూడారు.

ఇప్పుడు రంగనాథన్ శరీరం చెమటతో స్నానం చేసినట్టుంది. ఛాతీ నొప్పి భరించలేకపోయాడు. ఎత్తైన ఆరు అంతస్తుల భవనం వైపు చూశాడు.

ఈ దుకాణం యొక్క ప్రతి అంగుళాన్ని ప్లాన్ చేయడానికి ఆర్కిటెక్ట్‌తో రాత్రింబవళ్ళు కూర్చున్న రోజులు గుర్తుకు వచ్చాయి. భవనంలోని ప్రతి రాయి రంగనాథన్ పని, అతని నిజాయితీ, ఇంకా అంకితభావానికి నిదర్శనం.

ఇప్పుడు అన్నీ పోయాయి. తన చెమట మరియు రక్తంతో నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం యొక్క ద్వారాల వద్ద నిలబడి ఉన్న బిచ్చగాడి స్థాయికి ఆయన తగ్గించబడ్డాడు.

ఈ వెన్నుపోటు దారుణమైనది. గాటు చాలా లోతుగా దిగింది, పైగా కత్తి చాలా పదునైనది, అది వెనుక నుండి శరీరంలో ప్రవేశించి గుండెకు చేరుకుని గుచ్చింది.

ఆయన ఆరోగ్యంలోని అస్థిరతని తట్టుకునే శక్తి మెదడుకి ఉంది, కానీ తమ్ముళ్ళ పట్ల ప్రేమ నిండిన ఆ హృదయం ఈ వంచనని భరించలేకపోయింది.

ద్రోహుల చేతుల కన్నా శక్తివంతమైన కృతఘ్నత ఆయన్ని లొంగదీసుకుంది. రంగనాథన్ పతనం ప్రారంభమైంది.

తన యజమాని కింద పడటం చూసిన లోగు అతని రక్షణకు పరిగెత్తాడు. అతన్ని తన చేతుల్లో పట్టుకున్నాడు.

ఎవరో కారు తలుపు తెరిచారు. లోగు అతన్ని కారు లోపల పడుకోబెట్టాడు. చెమటను చూసిన అతను ఇంజన్ ఆన్ చేసి ఎసి పూర్తిగా పెట్టాడు.

తన యజమాని చాలా అనారోగ్యంతో ఉన్నాడని లోగుకు తెలుసు. అతను కారును అతివేగంగా అపోలో హాస్పిటల్స్ వైపు నడిపాడు.

ఈఆర్ (ఎమర్జెన్సీ రూమ్) వద్ద డ్యూటీ డాక్టర్ రోగిని చూశాడు. ప్రాథమిక పరీక్షతో కేస్ షీట్‌ను – DOA – డెడ్ ఆన్ అరైవల్ – అనే మూడు చల్లటి అక్షరాలతో మూసివేయడానికి అతనికి కేవలం 90 సెకన్లు పట్టింది.

రంగనాథన్ అక్షరాలా పగిలిన హృదయంతో మరణించాడు.

“ఆఫీసుకి బయలుదేరినప్పుడు చాలా సాధారణంగా కనిపించారు. భోజనంలో కొన్ని మసాలా వంటకాలు ఉండాలని అడిగారు. కారా కుళంబు, బంగాళాదుంప కూర కావాలని గట్టిగా కోరుకున్నారు. ఇప్పుడు ప్రాణం లేని శరీరాన్ని మోసుకువచ్చారు! నేను ఏం చేయాలి?”

పరిమళ దుఃఖాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. మాల్య, పద్మ ఆమెకు ఇరువైపులా కూర్చుని ఆమెను ఓదార్చడానికి తమ వంతు ప్రయత్నం చేశారు.

రంగనాథన్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆరు గంటలు గడిచాయి. స్నేహితులు మరియు బంధువులందరికీ సమాచారం పంపించారు. ఇల్లు జనాలతో, వీధి కార్లతో నిండి ఉంది.

పద్మ ఈ వార్తని శివకి సున్నితంగా అందించి, అందుబాటులో ఉన్న తదుపరి విమానంలో రమ్మని కోరింది. పాపం, అతని సెమిస్టర్ పరీక్షలు ఆ రోజున ప్రారంభం కానున్నాయి. అతను పరీక్షలు ఏవీ రాయలేడు.

డ్రైవర్ లోగు మొదటగా ఈ వార్తని తెలిపింది మాల్యకి. ఆమె తమ వారందరితో ఈ వార్తను పంచుకుంది. ఆమె తన బాబాయిలకు వారి మొబైల్స్‌కి ఫోన్ చేసి కబురందించింది.

వారు దిగ్భ్రాంతికి లోనయినట్లు అనిపించింది, ‘తక్షణమే’ అక్కడ ఉంటామని హామీ ఇచ్చారు. కానీ వారు ఎప్పటికీ రాలేదు.

పరిమళ మాల్యను డజను సార్లు అడిగింది. “మీ బాబాయిలకు చెప్పావా?”

మొదట సందేహం పద్మకే కలిగింది. రంగనాథన్‌కి పక్షవాతం వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు తమ్ముళ్ళు పది నిమిషాల్లోనే అక్కడ ఉన్నారు.

మరి వారు ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? రంగనాథన్‌ది సహజ మరణం కాదని ఆమెకు గట్టి అనుమానం వచ్చింది. చివరి కాలంలో రంగనాథన్‌తో లోగు ఉన్నాడని ఆమెకు జ్ఞాపకం వచ్చింది. అసలేం జరిగిందనేది అతడే చెప్పగలడు.

ఆమె కళ్ళు తుడుచుకుని మాల్య చెవుల్లో నెమ్మదిగా చెప్పింది.

“మాల్య, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆమెను ఒంటరిగా వదలవద్దు. శివని తీసుకురావడానికి నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తాను.”

“పద్మా, నువ్వు ఎందుకు వెళ్ళాలి? డ్రైవర్‌ని వెళ్లనీ. దయచేసి నాతో ఉండు. నాకు భయంగా ఉంది.”

“లేదు మాల్యా, ఇది భయపడాల్సిన సమయం కాదు. నిభాయించుకో. నేను వెళ్ళాలి. కారణం తరువాత చెప్తాను. శివ ఒక్కడే రావాలని నేను కోరుకోను. నేను బెంజ్ తీసుకువెళ్తాను.”

తికమకగా ఉన్న మాల్య తన అంగీకారాన్ని తెలిపింది.

కిల్‌పాక్ నుండి మీనాంబక్కం విమానాశ్రయానికి నలభై నిమిషాల ప్రయాణ సమయంలో లోగు జరిగిన ప్రతి విషయం చెప్పాడు.

ఆ రోజు తన కళ్ళముందు జరిగిన మోసపు నాటకాన్ని వివరించేటప్పుడు ఆ నమ్మకస్తుడైన డ్రైవర్ బాధతో ఏడ్చాడు, వెక్కిళ్ళు పెట్టాడు, గట్టిగా అరిచాడు.

పద్మ స్తంభించిపోయింది. ఆమె కడుపులో ఏదో వింత అనుభూతి! గట్టిగా వాంతి అయ్యేలా ఉన్న ఆ అనుభూతిని అణిచివేసేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించింది.

రంగనాథన్ తమ్ముళ్ళ పట్ల ఆమెకు ఎన్నడూ ఉన్నత గౌరవం లేదు. వాళ్ళు తన అక్క మరుదులని మాత్రమే సాధరణ మర్యాద కలిగి ఉంది. మసలుకోడానికి వారు సరైన వ్యక్తులు కారని ఆమెకి హృదయంలో తెలుసు.

అప్పుడు కూడా వారు ఇంత తెలివిగా, అంత కుట్రతో, ఇంత నిర్దయగా ఉండవచ్చని ఆమె ఎప్పుడూ అనుకోలేదు.

పద్మ వేగంగా ఆలోచించింది.

అంత్యక్రియలు మరియు సంబంధిత కార్యక్రమాలు ముగిసే వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని మాల్యకు, తరువాత శివకి, చివరగా పరిమళకు సున్నితంగా తెలియజేస్తుంది.

కొన్నిసార్లు విధి రంగనాథన్ కవల సోదరుల కంటే క్రూరమైనది. తన క్రమమైన వెల్లడింపు ప్రణాళికతో పద్మ ముందుకు సాగకూడదని నిర్ణయించింది.

“లోగు, దీని గురించి ఎవరికీ చెప్పద్దు, శివకి కూడా. బావ అంత్యక్రియల్లో ఎలాంటి గందరగోళం వద్దు. పదహారో రోజు కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరికీ చెప్తాను.”

“సరే మేడమ్. కానీ నేను మీకు చెప్తున్నాను మేడమ్, ఆ దుర్మార్గులు దారుణమైన చావు చస్తారు. అధ్వాన్నమైన మోసగాళ్ళచే వారు చంపబడతారు. వారు అన్ని ప్రాణాంతక వ్యాధులతో బాధపడబోతున్నారు. వారి కుటుంబం… ”

“ఆపు లోగు. వారిని శపించడంలో అర్థం లేదు.”

“మేడమ్, నేను కేవలం మీ డ్రైవర్‌ని. నాకే చాలా కోపంగా, నిరాశగా ఉంటే, ఇంక శివ గారి గురించి ఆలోచించండి. ఆయన ఏం చేస్తారు, మేడమ్? ఆయన తన కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకుంటారు?”

పద్మ వెన్ను గుండా ఒక జలదరింపు.

(ఇంకా ఉంది)

Exit mobile version