[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 8వ భాగం. [/box]
[dropcap]“శి[/dropcap]వా.. ఏమైంది? నిన్ను ఎవరు కొట్టారు? ఓహ్, మై గాడ్! ఇంకా రక్తం కారుతోంది. ఏం జరిగిందో చెప్పు?”
ఆత్రుతగా ఉన్న మాల్య శివని కౌగిలించుకుని ఆప్యాయంగా అడిగింది. ఆమె అరవడం విన్న పద్మ, పరిమళ లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు కూడా శివ భుజాలపై చేతులు వేసి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది చూసిన సంజన కదిలిపోయింది.
“దీనికి నేనే కారణం. మీరంతా నన్ను క్షమించాలి. ”
వారందరూ సంజన వైపు తిరిగారు.
“మేడమ్, ఈమె మా అక్క, మాల్య, ఇంటీరియర్ డెకరేటర్. తను మా అమ్మ. ఈవిడ మా పిన్ని పద్మ, బ్యాంకు మేనేజర్. మరి ఈవిడ డాక్టర్ కన్నప్పన్ గారి కూతురు. మేడమ్ సంజన. నా బాస్.”
నల్లని, అందమైన, పొడవైన, సన్నని అమ్మాయిని చూడగానే ముగ్గురు మహిళలు వెంటనే ఇష్టపడ్డారు. వాళ్ళిప్పుడు శివని విస్మరించారు, అతని యజమాని చుట్టూ చేరారు.
శివ చేసిన ఘనకార్యాన్ని సంజన వివరించింది. అతను మోసాన్ని కనుగొన్న పద్ధతి, సెక్యూరిటీ గార్డుతో దెబ్బతిన్నది అన్నీ చెప్పింది.
ఆడవాళ్ళు ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. అరగంట అరనిమిషం లాగా గడిచిపోయింది.
“మేడమ్, మీరు ఇంకాస్త సమయం వేచి ఉండగలిగితే, మనమందరం కలిసి భోంచేయవచ్చు.”
“మాల్య, నేను మీ తమ్ముడికి బాస్‌ని; మీకు కాదు. దయచేసి నన్ను సంజన అని పిలవండి. నేను కూడా మీలాంటి సంతోషకరమైన, ప్రేమ నిండిన కుటుంబంతో భోంచేయడానికి ఇష్టపడతాను. కానీ ఈ రోజు కాదు.”
“ఎందుకు, సంజనా?”
“మీ తమ్ముడు నాకు బాగా పని కల్పించాడు. నాకు మరో గంటలో ఆసుపత్రి ఆడిటర్లతో సమావేశం ఉంది. చేయాల్సింది చాలా ఉంది. మీతో సమయం గడపడానికి, మీ అందరితో కలిసి భోంచేయడానికి నేను వీలైనంత త్వరలో ఇక్కడకు వస్తాను. బై, మాల్య. బై బై, ఆంటీ. శివా, బై.”
ఆ రోజు డైనింగ్ టేబుల్ వద్ద సంభాషణాంశం సంజన మాత్రమే. ఆడవాళ్ళందరూ ఆమె అందం, ఆమె ఆకర్షణీయమైన కళ్ళు, మెరిసే చర్మం మరియు ఆమె నిస్సంకోచమైన స్వభావాన్ని ప్రశంసించారు.
“పద్మా, ఈ అమ్మాయి శివ కన్నా పెద్దదా?” అడిగింది పరిమళ
“ఆఁ, నాకన్నా ఐదేళ్ళు పెద్దది” శివ చెప్పాడు.
“అయినా అక్కా, ఇప్పుడీ విషయం ఎందుకు?” అంది పద్మ.
“ఆమె చిన్నదైతే, శివకి సరైన జోడీ అయ్యేది కదా?”
“అయ్యో అమ్మా” అంటూ మాల్య విసుగ్గా చూసింది.
కానీ పరిమళ ఉద్దేశం అందరి మనసుల్లోకి, ముఖ్యంగా శివ హృదయపు లోతుల్లోకి వెళ్ళింది.
***
మర్నాడు ఉదయం జెకె ఆసుపత్రిలో శివకి ఘన స్వాగతం పలికారు.
“రా శివా. నాన్న నిన్ను చూడాలనుకుంటున్నారు. ఆడిటర్లు, పోలీసులు అంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు. నాతో రా.”
సంజన అతన్ని డాక్టర్ కన్నప్పన్ గదికి లాక్కుపోయింది.
“డిఎస్‌పి సర్, ఈ అబ్బాయే. జరిగిన మోసం కనుగొన్నాడు. పేరు శివ. మా దగ్గర చేరి మూడు నెలలే అయింది. అంబికా దేవి సిఫార్సు చేశారు.”
డిఎస్‌పి, ఆడిటర్ శివని ప్రశంసించారు. మోసం గురించి, దాన్నతను ఎలా పసిగట్టాడు అనే దాని గురించి చాలా వివరాలను అడిగారు. ఒక గంట తర్వాతే శివని బయటకు పంపించారు.
ఆ రోజు తెల్లవారుజామున రాజశేఖర్‌ను అతని ఇంట్లోనే పట్టుకున్నారని, దొంగిలించబడిన మొత్తం డబ్బును తిరిగి పొందే అవకాశం ఉందని సంజన శివకి చెప్పింది.
ఆ రోజు ఏ పని చేయడానికైనా శివ చాలా ఉత్సాహంగా ఉన్నాడు.
సమయం మధ్యాహ్నం ఒంటిగంట. శివ స్టాఫ్ రూంలో ఉన్నాడు. అతను తన లంచ్ బాక్స్‌ని తెరిచాడు.
ఇంతలో సంజన ఆ గదిలోకి దూసుకొచ్చింది. అతని లంచ్ బాక్స్‌ను మూసేసింది.
“అయ్యయ్యో సారీ, శివా. నువ్వు ఈ రోజు నాన్నతో కలిసి భోజనం చేస్తున్నావు. నాన్న ఉదయమే నాకు చెప్పారు. నేను పూర్తిగా మర్చిపోయాను. నేను నీ బాక్స్ ఎవరైనా వార్డ్ బాయ్‍కి ఇస్తాను. దయచేసి నాన్న గదికి వెళ్ళు శివా. ఈ తికమకకి నన్ను క్షమించు” అంది.
ఆ గదిలోకి అడుగుపెట్టగానే, శివని పలకరించడానికి డాక్టర్ కన్నప్పన్ తన సీటు నుండి లేచి నిలబడ్డారు. గది మూలలో ఒక పెద్ద టేబుల్ వేయబడింది. రెండు అరటి ఆకులు పెద్దవి టేబుల్‌పై ఉన్నాయి, ఇంకా రెండు కుర్చీలు ఉన్నాయి.
“రా, శివా, భోంచేద్దాం.”
శివ ఎంత ఉత్సాహంగా ఉన్నాడంటే, డాక్టర్ కన్నప్పన్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సరిగా స్పందించలేక పోయాడు కూడా.
ఒక స్టాఫ్ నర్సు శివ ఆకులో రుచికరమైన వంటలను వడ్డిస్తుండగా, విధి తనదైన శైలిలో అతని జీవితపు పళ్ళెంలో అదృష్టాలను వడ్డించింది.
“నేను నిన్ను రాజశేఖర్ పోస్టులోకి ప్రమోట్ చేశాను. ఈ నెల నుండి నీ జీతం పదిహేను వేలు. ఈ మోసాన్ని కనుగొన్నందుకు అదనంగా, నేను పది వేల రూపాయల ప్రత్యేక బోనస్‌ను కూడా మంజూరు చేశాను.
అంతేకాదు, నీకు నచ్చిన కొత్త ద్విచక్ర వాహనం తీసుకో, దాని నిర్వహణా బాధ్యత ఆసుపత్రిదే. ఇంకా మొబైల్ ఫోన్ ఇస్తాం. సంతోషమేగా?” అడిగారు డా. కన్నప్పన్.
శివ నోరు ఆహారంతో; కళ్ళు కన్నీటితో; హృదయం కృతజ్ఞతతో నిండిపోయాయి. ఆ స్థితిలో అతను చేయగలిగింది, అంగీకారంగా తలాడించడమే.
డాక్టర్ కన్నప్పన్ శివ మానసిక స్థితిని గ్రహించారు, తరువాత పెద్దగా మాట్లాడలేదు.
ఇద్దరు స్టాఫ్ నర్సులు వాళ్ళిద్దరికీ ఉత్తమమైన ఆహారాన్ని అందించడంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.
వారు తినడం ముగించిన తరువాత, ఆ గది నుండి వంటకాలు, పాత్రలను బయటకు తీసుకువెళ్ళిన తరువాత, డాక్టర్ కన్నప్పన్ శివతో చాలా మృదువైన స్వరంలో మాట్లాడారు. సంజన జీవితంలో జరిగిన విషాదాల గురించి చెప్పారు. శివ విస్తుపోయాడు – ‘ఈ విషయాల గురించి నాకు ఎందుకు చెప్పడం?’ అనుకున్నాడు
“కారణం ఉంది, శివా. ఎందుకంటే నువ్వు ఇప్పటి నుండి ఆమె పిఏ అవబోతున్నావు. ఆమె నిన్న మీ ఇంటి నుండి తిరిగి వచ్చిన తరువాత నేను ఆమె ముఖంలో ఒక ప్రత్యేక మెరుపును చూడగలిగాను. గత ఒకటిన్నర సంవత్సరాలలో నేను ఆమెను ఇంత ఉత్సాహంగా చూడలేదు.
ఇప్పుడు, నువ్వు నాకో సహాయం చేయాలి. నీకు సమయం ఉన్నప్పుడల్లా ఆమెతో మాట్లాడుతూ ఉండు. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండేట్టు చూడు. వచ్చే ఏడాది ఆమె కోసం ఒక పెళ్ళికొడుకుని వెతకాలని అనుకుంటున్నాను. ఒక విధంగా నువ్వు ఆమెను పెళ్ళికి సిద్ధం చేయాలి.”
“సార్, ఇవన్నీ నేనెలా చేయగలను… మీకు తెలుసు…”
“నీకు సంజన గురించి తెలియదు. తను సాధారణంగా ఎవరినీ ఇష్టపడదు. కానీ ఆమె ఎవరినైనా ఇష్టపడితే వారి కోసం ఏం చేయడానికైనా ఆలోచించదు.
నువ్వు ఆమెతో వ్యవహరించిన పద్ధతి, నిన్ను గార్డు కొట్టిన విధానం, నువ్వు మీ వాళ్ళను ఆమెకు పరిచయం చేసిన పద్ధతి, మీ ఇంట్లోవాళ్ళు… ముఖ్యంగా మీ అక్క, పిన్ని… సంజన వాళ్ళ గురించే ఆగకుండా మాట్లాడుతోంది… తను నిన్ను ఇష్టపడుతోందని నేను అనుకుంటున్నాను శివా. సంజనకి నచ్చజెప్పేలా నువ్వేదైనా చెబితే తను వింటుందని నాకు ఖచ్చితంగా తెలుసు. ఆమె నీ మాటలకు విరుద్ధంగా నడుచుకునే ధైర్యం చేయదు. సరైన సమయంలో నేను ఆమె కోసం ఎంచిన వరుడి గురించి నువ్వు తనతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ”
“నేను నా వంతు కృషి చేస్తాను సర్.”
సంజన వంటి ప్రపంచ స్థాయి అందగత్తెను వివాహం చేసుకోబోయే ఆ అదృష్టవంతుడిపై కొద్దిగా అసూయపడ్డాడు శివ.
తన తండ్రి మరణం తరువాత మొదటిసారిగా జీవితంతో ప్రేమలో పడటం ప్రారంభించాడు.
అయితే అతని రోజులు పనితో నిండిపోయాయి. ఉదయం 8 నుంచే పని చేయాల్సి వచ్చింది. అతను చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఆలస్యమైనా కూర్చుని పనిని పూర్తి చేసి వెళ్ళాలనుకునేవాడు శివ.
కానీ సాయంత్రం 6 గంటలు దాటాకా శివ ఆసుపత్రిలో ఉండటానికి సంజన అనుమతించలేదు. శివ ఆ రోజుకి బయలుదేరాడని నిర్ధారించుకున్న తర్వాతే ఆమె ఇంటికి వెళ్తుంది.
***
కాలం ఎవరికోసం వేచి ఉండదు. ముందుగా నిర్ణయించిన, మార్చలేని వేగంతో కదులుతుంది. శివ దాదాపు సంజనకి కుడి భుజం అయ్యాడు.
డాక్టర్ కన్నప్పన్ తన ఆసుపత్రిని విస్తరించాలని అనుకున్నారు, అతను తన ఆసుపత్రి వెనుక ఉన్న పెద్ద భూమిని కొనగలిగారు. ఆ స్థలంలో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించాలనుకున్నారు, ఆసుపత్రిలో గదుల సంఖ్యను పెంచాలి.
టర్మ్ లోన్ కోసం డాక్టర్ కన్నప్పన్ దరఖాస్తును ప్రాసెస్ చేయించేందుకు గాను శివే అన్నీ తానై పరుగులు తీస్తున్నాడు.
చివరకు శివ కావలసిన కాగితాలను బ్యాంకుకు సమర్పించాడు. అవి దిగువ స్థాయిలో ఆమోదించబడ్డాయి. పేపర్లు ఇప్పుడు బ్యాంక్ జనరల్ మేనేజర్ – క్రెడిట్ యొక్క డెస్క్ వద్ద ఉన్నాయి, వారు డాక్టర్ కన్నప్పన్ వ్యక్తిగత ఆస్తులపై కొంత రహస్య సమాచారం కావాలని అడిగారు.
సంజన వ్యక్తిగతంగా సమాచారాన్ని ఇవ్వగలిగితే ఋణ దరఖాస్తు ఏ సమయంలోనైనా ఆమోదించబడుతుందని ఆయన శివకి సూచించారు.
ఆ సోమవారం ఉదయం పదిన్నర గంటలకు సంజన బ్యాంక్ జనరల్ మేనేజర్‌ని కలిసేడట్టు శివ సమావేశం ఏర్పాటు చేశాడు.
ఆ రోజు సంజన మూడ్ అస్సలు బాలేదు.
“మేడమ్, నేను బ్యాంక్ జింఎమ్‌తో ఉదయం 10.30 గంటలకి సమావేశాన్ని ఏర్పాటు చేసాను. ఈ రోజు విషయాలు సక్రమంగా జరిగితే, మనం వారంలోపు ఋణం పొందవచ్చు. ఆపై రెండు వారాల్లో నిర్మాణ పనులను ప్రారంభించవచ్చు.”
“లోన్ ఎవరికి కావాలి? ఋణం రాకపోతే ఏమవుతుంది? ఆసుపత్రిని విస్తరించడంలో పెద్ద విషయం ఏమిటి?”
“మేడమ్ ఏమైంది మీకు? బాగానే ఉన్నారు కదా?”
“నాకు ఏదీ కలిసి రావడం లేదు. జీవితం పట్ల నాకు అసహ్యం కలుగుతోంది, శివా. నేను ఈ రోజు చాలా నిరాశగా ఉన్నాను.”
“మేడమ్, దయచేసి ఆశ వదులుకోవద్దు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో నిరాశకు లోనవుతాం. మా నాన్న నాకు సలహా ఇచ్చేవారు, ‘నువ్వు నిరాశకు గురైనట్లయితే, మంచి హోటల్‌కు వెళ్లి, ఉత్తమమైన ఆహారంతో కడుపు నింపుకో. నీ కోసం కొన్ని ఖరీదైన దుస్తులు కొనుక్కో. నిరాశ తొలగిపోతుంది’ అని” అన్నాడు శివ.
సంజన ఈ కొత్త పద్ధతిని ప్రయత్నించాలనుకుంది.
“మీటింగ్ ఎప్పుడు శివా?”
“10.30కి మామ్. అప్పుడే 9.45 అవుతోంది మేడమ్. మనం ఇప్పుడే బయలుదేరాలి. మీకు తెలుసు కదా, మేడమ్, సోమవారం ఉదయం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ హెడ్ ఆఫీస్ కాలేజ్ రోడ్‌లో ఉంది.”
“సమావేశం ఎంతసేపు జరుగుతుంది?”
“రెండు మూడు గంటలు, మేడమ్.”
“సరే పద. కానీ సమావేశం తరువాత నేను నేరుగా ఇంటికి వెళ్తాను. ఏదైనా పేపర్లు లేదా చెక్కులపై నా సంతకాలు కావాలంటే ఇప్పుడే తీసుకో. సరేనా?”
“అంత అర్జెంటు సంతకాలు ఏమీ లేవు మేడమ్.”
శివ అంచనాలకు విరుద్ధంగా జనరల్ మేనేజర్‌తో సమావేశం 11 గంటలకు ముగిసింది. సంజన తనకు అవసరమైన వివరాలు ఇచ్చింది. పేపర్ వర్క్ పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
సంజనకి షేక్‍హ్యాండ్ ఇచ్చి, రాబోయే మూడు రోజుల్లో ఋణం మంజూరవుతుందని చెప్పారు.
సమావేశం ముగిసాకా సంజన మూడ్ అకస్మాత్తుగా మారిపోయింది. ఆమెలో ఇప్పుడు ఉత్తేజం! కారు ఎక్కగానే ఆమె చిన్నపిల్లలా ఉత్సాహంతో డ్రైవర్‌తో చెప్పింది.
“డ్రైవర్, జిఎన్ చెట్టి రోడ్‌లో ఉన్న రంగా సిల్క్స్‌కి వెళ్ళు” అని, “శివా, నేను మీ నాన్నగారి సలహాను పాటించబోతున్నాను. నా కోసం ఖరీదైన పట్టు చీర కొంటున్నాను.
నేను బ్యాంకుకు రావాలని నువ్వు కోరుకున్నావు, నేను వచ్చాను. ఇప్పుడు చీరను ఎంచుకోవడంలో సహాయపడటానికి నువ్వు నాతో షాపుకి రావాలని నేను కోరుకుంటున్నాను. సరేనా?”
“రంగా సిల్క్స్, ఓ మై గాడ్! అక్కడికి వద్దు, ఇంకెక్కడికైనా వెళ్దాం మేడమ్, ప్లీజ్… ప్లీజ్.. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.”
శివ ముఖంపై చెమట బిందువులను సంజన చూసింది. శివ ముఖకవళికలు – ఆకలితో ఉన్న సింహానికి అకస్మాత్తుగా ఎదురైన కుందేలుగా ఉన్నాయి.
“హే శివా, ఏమైంది? నీకు బాగుందా? రంగా సిల్క్స్‌కి ఎందుకు వద్దు?”
“అది పెద్ద కథ, మేడమ్. నేను ఏదో ఒక రోజు మీకు చెప్తాను.”
“సరే, అప్పుడు నువ్వే నాకు వేరే దుకాణం సూచించు. మనం నల్లి లేదా కుమారన్‌కి వెళ్దామా?”
“పాండీ బజార్‌లో శ్రీనివాస్ సిల్క్స్ అనే చిన్న దుకాణం ఉంది.”
“ఆ కొట్టు పేరు ఎప్పుడూ వినలేదే.”
“ఇది నా స్నేహితుడిది. ఒక బొటీక్ లాంటిది. అక్కడికి వెళ్దాం మేడమ్. అక్కడి చీరలు మీకు నచ్చకపోతే, అప్పుడు నల్లికి వెళ్తాము. ”
ఆ దుకాణం నిజంగా చిన్నది, సుమారు 900 చదరపు అడుగులలో ఉంది, భారీ వస్త్ర సముదాయాలకు భిన్నంగా ఇతర దుకాణాల నుండి కొన్ని మీటర్ల దూరంలో ఉంది.
“మేడమ్, నా స్నేహితుడు శ్రీనివాస్ వినాయక్ అలియాస్ ‘వినూ’ని కలవండి. మేమిద్దరం కాలేజీలో కలిసి చదువుకున్నాం.”
వినూ చాలా పొడవైనవాడు, సుమారు 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు. ఇంకా అతని ముఖంలో చిన్నపిల్లల తాజాదనం ఉంది.
“వినూ, మేడమ్ నా బాస్. ఆవిడ మంచి పట్టు చీర కొనాలనుకుంటున్నారు. ”
“బడ్జెట్ ఎంత, మేడమ్?”
“20 వేల కంటే ఎక్కువ కాదని అనుకుందాం.”
తన అందమైన కస్టమర్‌ను కంగారు పెట్టడానికి వినూ కౌంటర్లోని వందలాది చీరలను ఆమె ముందు పోగు పోయలేదు.
బదులుగా అతను ఒక కప్పు బోర్డులో ఒక పెట్టెను తీసుకొని, దానిలో నుంచి స్కై బ్లూ కలర్ సిల్క్ చీరను తీసాడు. దాని బోర్డర్ కూడా అదే రంగులో ఉంది.
జరీ చాలా తక్కువగా ఉంది, కానీ వింతగా అది చీర యొక్క ఆకృతిని మెరుగుపరిచింది. పల్లులోని డిజైన్ కొత్త రకానికి చెందినది. చీర అంతటా తేలికపాటి జరీ చుక్కలు ఉన్నాయి.
ఆ చీర సంజనకి నచ్చింది. అయితే చాలామంది మహిళల మాదిరిగానే చూపించిన మొట్టమొదటి చీరనే తీసుకోడానికి ఆమె ఇష్టపడలేదు.
“వినూ, మేడమ్‌కి ఆ బ్రైట్ రెడ్ శారీ చూపించు.”
ఆ చీరను తీసుకురావడానికి వినూ పక్కకు వెళ్ళగానే సంజన శివతో గుసగుసలాడింది.
“నాకు బ్రైట్ రెడ్డా? హే, శివ, నేను నల్లగా ఉన్నాను. అది నాకు సరిపోదు.”
శివుడి ప్రతిస్పందన కూడా ఒక గుసగుస. కానీ మాటలు వృత్తిపరమైన సాధికారతతో బయటకు వచ్చాయి. ఎందుకంటే, ఇది అతని ఇష్టమైన, స్వంత కార్యరంగం కాబట్టి.
“నల్లటి వ్యక్తులు ప్రకాశవంతమైన రంగులను ధరించకూడదనేది పాత సిద్ధాంతం, మేడమ్. మేము ఢిల్లీలో ఒక ఫ్యాషన్ పరేడ్ నిర్వహించాం, అక్కడ మేము ఒక ఆఫ్రికన్ అమెరికన్ మహిళకు ప్రకాశవంతమైన పసుపు రంగు చీర ధరింపజేసి ర్యాంప్‌పై నడిపించాము. అది గొప్ప హిట్ అయింది. ప్రకాశవంతమైన ఎరుపు రంగు మీ తీక్షణమైన ముఖ కవళికలను ప్రస్ఫుటం చేయడానికి ఉపయోగపడుతుంది.”
సంజనకు చాలా ఆహ్లాదకరమైన అనుభూతి కలిగింది, ఆమె దానిని వర్ణించలేకపోయింది.
ఇంతలో ఆమె ముందు చీరని పరిచాడు వినూ. చీర ప్రకాశవంతమైనది, స్వచ్ఛమైన జరీ అంచుతో ఎరుపు రంగులో మెరుస్తోంది.
పల్లుపై క్లిష్టమైన కళాకృతులు ఉన్నాయి. అది సంజనకు మొదటి చూపులోనే నచ్చేసింది. ఆమె తన భుజంపై చీర వేసుకుని అద్దంలో చూసుకుంది. ఆమె పదిహేను సెకన్లలో నిర్ణయించుకుంది.
“నేను దీనిని తీసుకుంటున్నాను.”
వినూ బిల్లు సిద్ధం చేయడంలో బిజీగా ఉండగా శివ సంజనతో మాట్లాడుతున్నాడు.
“మేడమ్, మీరు ఒక పెద్ద దుకాణానికి వెళ్తే వాళ్ళు మీ ముందు వందల చీరలు విసురుతారు. మీరు అయోమయంలో పడతారు. అదే మీరు యజమాని ఉన్నపుడు ఇలాంటి దుకాణానికి వస్తే, ప్రత్యేకించి యజమాని స్వయంగా సమర్థుడైన డిజైనర్ అయినప్పుడు, మీరు ఉత్తమమైనదాన్ని పొందుతారు, అది కూడా తక్కువ సమయంలోనే.”
వినూ ఆమె వద్ద నుండి క్రెడిట్ కార్డు తీసుకుని, దాన్ని స్వైప్ చేసి ఆమెకు తిరిగి ఇచ్చాడు. అతను చీర ప్యాకెట్ ఉన్న జనపనార సంచిని అందజేస్తూ, చిరునవ్వుతో ఆమెతో చెప్పాడు.
“ఇది మీ శుభ దినం, మేడమ్. మీరు దేశంలోని అత్యుత్తమ పట్టుచీరల డిజైనర్‌తో చీర కొనడానికి వచ్చారు. అతను డిజైన్ చేసిన బెస్ట్ శారీని మీరు ఎంచుకున్నారు.”
శివ స్వల్పమైన కోపంతో తన స్నేహితుడి వైపు చూశాడు.
సంజన ఆనందంతో విస్తుపోయింది, కొత్త అభిమానంతో శివ వైపు చూసింది.
(ఇంకా ఉంది)