[ఖలీల్ జిబ్రాన్ రచించిన ‘Half life’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి]
~
[dropcap]అ[/dropcap]సంపూర్ణమైన.. సగం జీవితం జీవించకు.
అలాగే అసంపూర్ణ మరణమూ వద్దు.
నువ్వు నిశ్శబ్దాన్ని ఎన్నుకుంటే.. సరే నిశ్శబ్దంగానే ఉండు నీ ఇష్టం.
కానీ నువ్వు మాట్లాడినప్పుడు మాత్రం..
చెప్పాలనుకున్నది పూర్తయ్యేదాక మాట్లాడు!
నువ్వు దేన్నైనా అంగీకరిస్తే.. దాన్ని ఖచ్చితంగా.. హృదయ పూర్వకంగా అంగీకరించు.
దానికి మరో ముసుగు వేయకు.
నువ్వు దేన్నైనా తిరస్కరిస్తే..
దాని గురించి పూర్తి స్పష్టతతో ఉండు.
అటూ ఇటు కాకుండా.. ఉభయచరంలాగా
బలహీనమైన అంగీకారాన్ని తెలపకు.
అరకొర పరిష్కారాన్ని కూడా అంగీకరించకు
అర్థ సత్యాలను అసలు నమ్మకు.
కనీసం కలల్ని అయినా పూర్తిగా కనడం నేర్చుకో..
వొట్టిగా ఆశలు ఉహించుకోవడం ఎందుకు చెప్పు?
ఇక నడక పూర్తి చేయకుండా.. దారి మధ్యలో ఆగిపోయావనుకో..
అది నిన్ను ఏ దరీ చేర్చదు.. చౌరస్తాలో ఏకాకిగా మిగిలిపోతావు.
నువ్వు ఒక సమగ్రమైన మనిషివి.. జీవితాన్ని సంపూర్ణంగా జీవించ వలసిన వాడివి.
నిన్ను నువ్వు నమ్ము..
అసంపూర్ణ జీవితాన్ని..
జీవించడాన్ని తిరస్కరించు!
★★
ఆంగ్ల మూలం: ఖలీల్ జిబ్రాన్
తెలుగు అనుసృజన: గీతాంజలి