[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ కవి, రచయిత ప్రసాదమూర్తి గారి ‘సగం పిట్ట’ పుస్తకానికి పి. సత్యవతి, తల్లావజ్ఝల శివాజి, రమణజీవి గార్లు వ్రాసిన ముందుమాటలు ఇవి. [/box]
గుండె తట్టే వాయులీనం
[dropcap]దే[/dropcap]శం లేని ప్రజలు, చేనుగట్టు పియానో, పూలండోయ్ పూలు,మాట్లాడుకోవాలి, నాన్నచెట్టు,కలనేత వంటి కవితా సంపుటాలు వెలయించిన కవి ప్రసాద మూర్తి. అతను రాసిన కథలు ఇవి. అందుచేత ఆ కవిత్వం తాలూకు వస్తువు, శైలీ ప్రభావం తప్పకుండా వుండే కథలు.
నాలుగురోడ్ల కూడలిలో
చేతుల్లో క్యారియర్లు పట్టుకుని
చీమలు నిలబడతాయి
ఆ రోజు ఏ ధరకు అమ్ముడు పోతాయో
తెలియక తికమక పడతాయి
చీమలుకాదు మనుష్యులే
కాస్త కళ్ళతో పరామర్శించు.
……………………..
అన్నట్టు చిలకలే కాదు
తాగి తాగి వాంతులు చేసుకున్న రాత్రికి
కన్నీళ్లను వేన్నీళ్ళుగా మార్చి స్నానం చేయించి
వెక్కి వెక్కి ఏడ్చే కాపురాలను కళ్ళల్లోనే కుక్కుకుని
హడావుడిగా పనులకుపోయే తల్లులు కూడా కనపడతారు
కొంచెం కర్చీఫ్ కూడా నీ చేతుల్లో పెట్టుకో
……………………………………..
డ్యూటీ ఆఫీస్ లోనే కాదు రోడ్డుమీద కూడా చెయ్యాలి. జీవితమే జీతం.
……………………………………..
ఈ కవిత దేశంలేని ప్రజలు సంకలనంలోది.
రచయిత అందరు మధ్య తరగతి బుద్ధి జీవుల్లాగే ఉదయపు నడకకు వెడతాడు. కానీ అతనికి పచ్చని చెట్లూ సీతాకోక చిలుకల్లాంటి బడిపిల్లలూ “బాలభానుని పసిడి కిరణాలూ బంగారు రశ్మి తో పాటు అనేక జీవన దృశ్యాలు కనపడతాయి. కదిలిస్తాయి. కవిత్వంలోనే కాదు కథల్లోనూ. కదిలించేది కవిత్వమే కాదు కథలు కూడా.
ప్రస్తుతం గ్రామాలను కట్టి కుదుపుతున్నది విస్తాపన. గ్రామీణ వృత్తులు, మానవ శ్రమ తో అయ్యే పనులూ యంత్రాలు లాక్కోగా నగరాలకు యువత వలస పోక తప్పని పరిస్థితిలో అటు నగరంలో ఇమడలేక, ఇటు గ్రామాల్లో వృద్ధాప్యపు వొంటరి తనంలోనూ ఇమడలేక అవస్థపడే వ్రుద్దాశ్రమాలయ్యాయి గ్రామాలు.ఇంకి పోయిన చెరువులు, పండని పొలాలు నీటికరువు, కులరాజకీయాలతో కునారిల్లుతున్నాయి. పైరు పచ్చని గ్రామాల మీద స్వచ్ఛమైన గాలిమీద చెరువుల్లో కలువ పూల మీద కవితలు వ్రాసే రోజులు అంతరించాయి. తల్లి తండ్రులు, పిల్లల మధ్య ఎడబాటు ఒకరికోసం ఒకరి ఆరాటం, కలిసి వుండలేని పరిస్థితులు. ఇదిలా వుంటే మంచి ఉద్యోగాలు చేసి పిల్లల్ని మంచి ఆర్థిక స్థాయిలో నిలబెట్టి ఏమీ తోచక ఫోన్ల మీద, ఉదయపు సాయంకాలపు నడకలతో టీవీలతో కాలక్షేపం చేసే తరగతి ఒకటి. కొంచెం చికాకు పెట్టే తరగతి. వీళ్ళు తమ కాలక్షేపం తాము చూసుకోడంతప్ప మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించరు. జాలిపడక్కర్లేని తరగతి. ప్రస్తుతం అభివృద్ధిపథంలో నడుస్తున్నామని అనుకుంటున్న భారతదేశంలో అత్యధిక పీడితులు శ్రామిక వర్గపు స్త్రీలు. వాళ్లకి ఆర్థిక స్వావలంబన వున్నా వాళ్ళ ఆర్జన మీద వాళ్ళకే పెత్తనం వుండదు. పైగా ఒక్క రోజు మగవాడు నాలుగు లాలన కబుర్లు చెబితే కరిగి నీరై పోతారు. చదువు అందువల్ల వచ్చే జ్ఞానంతో ఇచ్చే ధైర్యమూ వుండదు. వారుణి వాహిని నిరంతరంగా నిరంభ్యంతరంగా పారుతున్న పల్లెల్లో పట్నాల్లో నగరాల్లో స్త్రీల సంపాదన పురుషుల సంపాదనతో కలిసి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నందున బసమ్మ వంటి స్త్రీల కష్టార్జితం చిన్న చిన్న కోరికలు కూడా తీర నివ్వదు. స్రవించే కన్నీరు రెప్పల చాటున ఇగరబెట్టాల్సిందే. బసమ్మ చెవికమ్మలు కథ అది. అట్లాగే బంగారమ్మ తను అమితంగా ప్రేమించిన అరెకరం పొలాన్ని ఆమె భర్త ఆమెకు చెప్పకుండా రొయ్యల చెరువుకు లీజు కిచ్చేస్తే దాన్ని వెతుక్కుంటూ పోయి నిద్దట్లోనే ఆ చెరువులో పడి చనిపోతుంది. లీజు లో వచ్చిన డబ్బుతో కోడిపందాలాడి ఓడిపోతాడు ఆమె భర్త. పల్లెల్లో వచ్చిన భయంకరమైన మార్పులు ఇవి. ధ్వంసం అయిపోయిన కొల్లేటి సౌందర్యాన్ని చెప్పే కథ వుంది.
పల్లెలో చేతనైన పనిని యంత్రాలు కొట్టేస్తే పొట్ట చేతబట్టుకుని నగరాల్లో పనికోసం సెంటర్లలో నిలబడే జనాన్ని చూస్తూనే వుంటాం. తమని తాము ఆరోజుకి అమ్ముకోడానికి కొనే మనిషి కోసం ఎదురు చూస్తూ నిలబడతారు వాళ్ళు. రచయితా స్నేహితుడిని అక్కడ చూసి నివ్వెరపోతాడు .
బ్రతుకులు పరుగు పందాల్లా మారిన ఈ కాలంలో పక్క మనిషి గురించి పట్టించుకోడం, మాట కలపడం మృగ్యమై పోయింది. ఎవరిమటుకు వారు పక్క వాళ్ళు తనతో మాట కలపడం లేదనుకుంటారు కానీ తమ వంతు ప్రయత్నం చెయ్యరు.
ప్రసాద మూర్తి గారు ఈ కథల్లో వర్తమాన సమాజంలో ప్రవర్తిల్లుతున్న అనేక విషయాలను స్పృశించారు. దళిత జీవన సంక్లిష్టతను, ఉన్న చోటే నిలబడి పోరాడ వలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు వెలి అనే కథలో. వందరెక్కలతో పొదివి పిల్లల్ని పెంచిన స్త్రీలకూ ఆ రెక్కలు తాము స్వేచ్ఛగా ఎగరడానికి పనికి రావు. వంద రెక్కల స్త్రీ కథలో భార్గవి దాంపత్య జీవితంలో స్నేహం ఎరగదు. కర్తవ్య నిర్వహణే జీవితంగా బ్రతుకుతుంది. భర్త చనిపోయాక ఆమెకు కొంత స్వేచ్ఛ, ఒక స్నేహం దొరుకుతుంది. ఆమె ఆ స్వేచ్ఛనూ స్నేహాన్నీ పోగొట్టుకుని మళ్ళీ పెళ్లి అనే పెత్తనం క్రిందకు పోదల్చుకోలేదు. మంచి నిర్ణయం తీసుకుంది.
వృద్ధాప్యపు సమస్యలు, దాన్ని సుందరంగా మలచుకున్న వాళ్ళు చికాకు పరుచుకున్న వాళ్ళు, వీధులపాలైన వాళ్ళు బిచ్చగాళ్ళుగా మారిన వాళ్ళు అన్ని వర్గాలనూ స్పృశించారు ప్రసాదమూర్తి తన కథలలో. ఉద్యోగంలో జీవిక కోసం ఎన్ని వేషాలు వేసినా అంతరంగంలో తనను తాను కాపాడుకుని ఆర్త్రంగా నిలవాలనే కథ వుంది. చేసే వుద్యోగం వేలెత్తి చూపేదైనా అది కేవలం ఉద్యోగమే ననీ దాని తాలూకు రంగు ఆ వ్యక్తికీ అంటించకూదనీ అర్థం చేయించే కథ వుంది. కాపురాలు నిలబెట్టడానికి కొన్ని తరాల పాటు స్త్రీలు పడిన కష్టం, మింగిన కన్నీళ్లు తొలిప్రేమిక కథలో కళ్ళకి కడతాయి. ఇవాళ స్త్రీలు ఏ కొంచెమో తల ఎత్తుకో గలుగుతున్నారంటే దాని వెనుక ఎన్నితరాల స్త్రీల కష్టం వుందో! ప్రసాదమూర్తి కథలు ఆయన కవిత్వం లాగే వుంటాయి(కానీ ఆయన కవిత్వం ఇంకా కదిలిస్తుంది) అన్ని కథలూ జీవిత దర్పణాలే. కొన్ని కథలు “మోరల్ డాగింగ్” వంటివి వ్యంగ్యంతో కూడిన వాస్తవిక చిత్రాలు. ప్రసాద మూర్తి గారి కవిత్వం అందరికీ తెలుసు. కథలు కూడా తెలుసుకోడానికి ఇందులోకి ప్రవేశించండి. ఇది చేనుగట్టు పియానో కాదు, గుండె లోతును తాకే వాయులీనం.
పి.సత్యవతి
***
కథలు కావు – నగ్న చిత్రాలవి
ఈ పత్రికల్లో, ఆ పత్రికల్లో మీరు ప్రసాదమూర్తి కథలు చదివే వుంటారు. ఇప్పుడీ సంకలనంలో వాటినన్నింటినీ ఒకచోట కూర్చి మన ముందు పెట్టారాయన. పండితుడు, రచయిత, కవి, ఆ పై పాత్రికేయుడూ గనుక వట్టినే ఇంటి పట్టున ఉండిపోరు కదా. రాత్రనక,పగలనక, రైలనకా బస్సనకా, బండనకా, నడకనకా వీచే గాలి వలె విస్తృతంగా పర్యటించి తాను చవి చూసిన జీవన దృశ్యాలను కథతనానికి లోటు రాకుండా ఇలా కథలు రాసేరాయన..కథనంతో మనం కరచాలనం చేసినంతగా.
ఈ కథలన్నీ ప్రాణ వాయువు గలవి. మన మనసుకి, మెదడుకీ హితవు చేసేవివి. కొండకోనలు, పంటభూములు, వనవాటికలు దాటి చల్లగా పారుతూ తన రుచిని చూపే మంచినీటి వంటివి. కథల నిండా కవన దారుల్లో వర్ణనలు మెరిపించినా వీటిలో పాత్రలు మాత్రం పెంపుడు జంతువులకు మల్లె మన చుట్టూనే తిరుగుతాయి. తరచు ప్రయాణాల్లోనో, ఆఫీసుల్లోనో, మార్నింగ్ ఈవెనింగ్ వాక్ లలో వాక్కు స్వతంత్రించి పలకరించేవే ఇవి. బంగారమ్మ కావచ్చు, పరిచయం లేని మనిషి కావచ్చు.. ఈ కథలలో పాత్రల లోతులు చీకటి గుయ్యారాలు, అద్దరి చూపని ప్రవాహాలు.. కొన్ని స్నేహం చేస్తాయి.. కొన్ని మనసు వికలం చేస్తాయి. ఆపై ఈ కథలన్నిటా పర్యావరణ, జీవావరణ, జీవ వైవిధ్య, పరస్పరాశ్రిత చిత్రాలుంటాయి. వాటి జీవన మార్గాంతరాలు నగ్నంగా నిలిచి కొత్త ప్రశ్నల్ని పుట్టిస్తాయి. ఇంతే గాదు, ప్రసాదమూర్తి అంతఃకరణ, ప్రకృతి సూత్రం పెనవేసుకుని ముడిపడి వున్నట్టే మనం ఖాయం చేసుకోవచ్చు. ఈ కథల బహిరంతర ప్రకృతి మన స్పందనను, తెలివిడిని, కనీస బాధ్యతనూ నిలదీస్తాయి. ఈ కథల్లోని చిన్నపాటి వెలుగు మన స్పృహ మీద పడుతుంది. నేనొక పాఠకుడిగా ఇది గమనించినందువల్లనే మిత్రులందరినీ ఈ కథలు చదవమని చెప్పక తప్పదు.
-తల్లావజ్ఝల శివాజి
***
జల్లెడ రాల్చిన కిరణాలు
ఇంత ఎండ పేజీ నిండా, చీకటిని చెరిగేసి! ఎంత దు:ఖ్ఖాన్నో ఎంత సంతోషాన్నో ఎంత సౌందర్యాన్నో ఎంత మురికినో మోస్తున్న ఈ నేలని తడిమితడిమి అక్షరాల్ని ఏరిఏరి… చెమ్మగిల్లే కళ్లనీ, వూగే ఆకుపచ్చల్నీ, పెనవేసుకున్న మనిషీ జంతువు ముడుల్నీ, సంఘర్షణల్నీ, పసినవ్వుల్ని కోసి చిదిమే నెత్తుటి చేతుల్నీ ఇంకా జీవిత సకల వైపుల్నీ చెక్కిన కాగితశిల్పం ఈ పుస్తకం.
పూర్తి పిట్ట రాసిన కథలివి. ప్రకృతి పట్ల అపారప్రేమతో, ఘనీభవించిన మానవుడి పట్ల తీవ్రనిరసనతో! కవి జేబులో మొలకెత్తిన ఈ కథలు చదువరుల గుండెల్లో పుష్షించి… భుజాన చెయ్యెయ్యడంతో ప్రారంభమై ధడేల్ ధడేల్మని మన తలుపుల్ని తెరిచి విరిచి సరళంగా సూటిగా స్నేహభాషణలా సాగే కథనం! మరచిపోయిన మనలోపలి ప్రాంతంలో చీకటిమూలల్లో వికసించబోతున్న కిరణాల మధ్య మనల్ని సుకుమారంగా వొదిలేసి వీడ్కోలు తీసుకుంటూ… ఈ సగం పిట్ట! ఇక మనలో మనం… మనతో మనం… సరికొత్త అనుభవాలకు లోనవుతూ…
-రమణజీవి