[‘సగటు మనిషి స్వగతం’ అనే కాలమ్‍ని అందిస్తున్నాము.]
[dropcap]నే[/dropcap]ను సగటు మనిషిని.
సగటు మనిషి అంటే ఎవరు? వాడికి నిర్వచనమేమిటి? లక్షణాలేమిటి? కొలతలేమిటీ? ఇలాంటి ప్రశ్నలడగకండి. సగటు మనిషిని కదా.. నాకు అన్నీ తెలుసు, అడగకుంటే! ఏమీ తెలియదు, అడిగితే!!!!
ప్రతి విషయం మీదా నాకు నాదైన స్వంత అభిప్రాయం వుంటుంది. కానీ, ఎవరేమి చెప్పినా అదే నమ్ముతాను. కానీ, నేనన్నదే నిజం అని ఇంకా గాఢంగా నమ్ముతాను.
లేకపోతే చూడండి.. టీవీ మెదడుని పాడు చేస్తుంది. నిద్ర పుచ్చుతుంది, టీవీ చూడద్దు అని మొన్ననే మా ఆఫీసులో ఉపన్యాసం ఇచ్చి ప్రైజు కొట్టేశా..కానీ, ఇంటికి వచ్చాక టీవీ చూడకపోతే సమయం ఎలా గడపాలో తెలియటంలేదు. ఈ మధ్య చీటికీ మాటికీ కరెంటు దాగుడు మూతలాడుతూ చెడ్డ చిరాకు పెడుతోంది. అంత చిరాకునూ, కరెంటు రాగానే టీవీ పెట్టి మరచిపోతా.. మళ్ళీ కరెంటు పోగానే తిట్టుకుంటా!!!!
టీవీ పెడితే ఏం చూడాలో తెలియదు. అవే సీరియళ్ళు, అవే సినిమాలు.. అవే వార్తలు, అవే ఆటలు.. అన్నీ రిపీటెడ్లీ రిపీటింగ్ రి రిపీటెడ్ కార్యక్రమాలే.. ఒక్కటీ చూడబుధ్ధి కాదు.
సరే వెరయిటీగా వుంటుందని ఐపీఎల్ చూస్తే, ఎంతకాలమండీ అది. నెలల తరబడి ఒకే ఆటను ఒకేలాగ ఆడుతూంటే, రోజూ పని మానుకుని ఏం చూస్తాం?
అయితే వీర బాదుడు, లేకపోతే వీరలెవెల్లో పెవిలియన్‌కు వాకుడు.. లైను గట్టి.. అంతే.. ఒక ఆట.. ఓకే.. రెండో ఆట ఓకే.. ప్రతి ఆటా అలాగే అయితే నాటోకే!!!
ఏమిటో ఈ మధ్య అన్నీ ఇలాగే సాగతీతీతీతీతల్లా అనిపిస్తున్నాయి.
ఎన్నికల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇన్ని రోజులు ఎన్నికలా????
పాపం సంగతేమీ లేకున్నా తప్పనిసరిగా ప్రచారంలో ఏదో ఒకటి మాట్లాడాల్సివచ్చి నాయకులు ఏదేదో మాట్లాడేస్తున్నారు. అలా మాట్లాడటానికి జెయిలు నుంచి బెయిలు తీసుకుని మరీ వస్తున్నారు. తీరా చూస్తే వీళ్ళు మాట్లాడేదేముంది? ఏమీ లేదు.. ఒకసారి మంగళ సూత్రం అంటే, ఇంకోసారి రిజర్వేషన్లంటారు..ఒకసారి నియంతృత్వాన్ని నశింపచేయాలంటే, ఇంకోసారి రాజ్యాంగాన్ని బ్రతికించుకోవాలంటారు…
ఎక్కడయినా ఒకటే మాట్లాడుతూంటే, ఈ ప్రచారాల వార్తలు తప్ప మరో వార్త టీవీలో కనబడకపోతే.. ఎంతకాలమనీ ఎన్నికల మాటలు వింటూంటాం.. ఈ ఎన్నికలు చూస్తూంటే, ఎవరికీ ఏం చేయాలో తెలియదు. ఏమీ ఆలోచనలేదు. కానీ, ఎన్నికల్లో పాల్గొనాలి. గెలవాలి. అధికారం చేపట్టాలి. ఎందుకు పాల్గొనాలి? ఎందుకు గెలవాలి? ఎందుకు అధికారం.. ఎవరికీ తెలియదు.
ఇంతకు ముందు అధికారంలో వున్న వాడికొక గౌరవం, మర్యాదలుండేవి. ఇప్పుడెవరికీ ఎవరంటే గౌరవం లేదు. మర్యాద లేదు. ఎవరికెంత తోస్తే అంత ఎవరి గురించయినా మాట్లాడేయవచ్చు. తల్లితండ్రులంటేనే గౌరవం, భయం, భక్తులు లేవు. ఇంక వేరే ఎవరంటే ఏం గౌరవం వుంటుంది? ఎవరి నుంచి ఏం గౌరవం ఆశిస్తాం చెప్పండి? పెద్ద పెద్ద వారంటేనే గౌరవం మర్యాదలు లేనప్పుడు సగటు మనిషంటే ఏం గౌరవం వుంటుంది? ఏం మర్యాద వుంటుంది?
అందరూ అన్నిటి కోసం పోరాడుతున్నారు. పనికొచ్చే విషయమా, పనికిరాని విషయమా, అన్న ప్రసక్తి లేదు. అందరూ ఆందోళనలో వుంటూ ఆందోళన జీవులే అయిపోతున్నారు. మరి సగటు మనిషి ఎందుకని ఆందోళన జీవి కాకూడదు? కాబట్టి, నెల నెలా ఈ కాలమ్ ద్వారా.. సగటు మనిషిగా సగటుమనుషులందరికీ ఆందోళనకు పిలుపునివ్వబోతున్నాను. ఆందోళన ఏందుకు? దేనిగురించి అని అడగకండి. గోడలు పగులగొట్టటమే తప్ప గోడలు నిలబెట్టే ఆలోచనలేని సమాజపు సగటు ప్రతినిధిని నేను… విరగ్గొట్టడం, విమర్శించటం, వెక్కిరించటమే తెలుసునాకు.
నేను కొడతా…నువ్వు తిరిగి కొడితే అన్యాయం అంటా….నేను తిడతా…నువ్వు తిరిగి తిడితే..నేరం అంటా…నేను వెక్కిరిస్తా..నువ్వు తిరిగి వెక్కిరిస్తే అక్రమం అంటా….నాకు అన్ని సౌకర్యాలు కావాలి. నువ్వు సౌకర్యం అడిగితే మోసం అంటా.. మనం గొప్పవాళ్ళం అంటే వొప్పుకోను. వేరేవాళ్ళ గొప్పతనం ఏమీలేని చోట కూడా గొప్ప చూస్తా.ఇలాంటి సమాజంలోని సగటు మనిషిని నేను…
‘సగటు మనిషి స్వగతం’ వినిపించటం ద్వారా, ప్రపంచంలోని సగటు మనుషుల ఆలోచనలను ప్రకటించటం ద్వారా ప్రపంచ సగటు మనుషులందరినీ ఏకం చేయాలనుకుంటున్నాను.
ఏకం చేసి ఏం చేస్తావని నన్నడగకండి..
ఏకం చేస్తా.. పాకం పూస్తా.. నాకం తెస్తా.. లోకం చూస్తా..
ప్రపంచంలోని సగటు మనుషులారా ఏకం కండి.. పోరాడండి.. పోతే మనం పోతాం అంతే.. సగటు మనిషి ఇక్కడే వుంటాడు..
(మళ్ళీ కలుద్దాం)