Site icon Sanchika

సహాయం

[శ్రీమతి మంగు కృష్ణకుమారి రచించిన ‘సహాయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సు[/dropcap]గుణకి తన పుట్టింటివారు, అత్తింటివారు అన్న తేడా లేదు. మరిది నారాయణ తోటికోడలు లత అన్నా, ఆడపడుచు విద్య అన్నా చాలా ప్రేమగా ఉండేది.

హఠాత్తుగా నారాయణ చనిపోడంతో ఆమె తోటికోడలు లత భర్త చనిపోయిన తరవాత ఫేమిలీ గ్రౌండ్స్ మీద క్లర్క్ ఉద్యోగంలో జాయిన్ అయి తన కొడుకు అభి‌రాం, కూతురు శిరీషల పెంపకంలో పడి కాస్త దూరం పాటించడం మొదలెట్టింది. ఆమెకి కాస్త పుట్టింటి బలగం ఎక్కువ. వాళ్ళతోనే ఎక్కువ రాకపోకలు సాగిస్తూ పిల్లల పెంపకంతో ఖాళీ లేదనటం మొదలెట్టింది.

నిజమే కాబోలు అని సుగుణ సరిపెట్టుకున్నా, విద్యకి ఒక్కోసారి కోపం వచ్చేసేది. “నీ ఆరాటమే గానీ చిన్నవదిన, అసలు మనం ఎవరో అన్నట్టు చూస్తుంది. ఆ పిల్లల కోసం కాకపోతే తనతో మనకి ఏమీ లేదు వదినా” అంటుంది బాధగా.

“పోనీలే విద్యా! లతకి అయి‌న నష్టం మాత్రం తక్కువా” అనిసి ఊరుకుంటుంది సుగుణ.

అభికి పెళ్ళి, పెళ్ళికి మూడు రోజుల ముందు వడుగు. లత ఎంతో ఇదిగా ఫోన్‌లో రమ్మని పిలిచింది. సుగుణ సంతోషంగా పెళ్ళికి రాడమే కాదు, వడుగుకి తను తప్పకుండా సహాయం చేస్తానని చెప్పింది.

విద్యా ఆమె భర్తా అమెరికాలో ఉన్నారు. సుగుణ భర్త శేఖరంకి సరిగ్గా పెళ్ళి రోజున ఆఫీస్‌లో ఇన్‌స్పెక్షన్ ఉంది. వచ్చేందుకే ప్రయత్నం చేస్తాను అన్నాడు.

విద్య అమెరికా నించీ ఫోన్ చేసి అభి పెళ్ళి గురించి మాటాడుతూ “వదినా! నీకు తెలుసా! వడుగు పీటల మీద వాళ్ళ అక్కా బావా కూచుంటారుట. పాపం వాళ్ళకి కొడుకులు లేరట కదా! స్నాతకం పీటల మీద వాళ్ళ చెల్లీ మరిదీ కూచుంటారుట. వాళ్ళ చెల్లికి సరదాలెక్కువట” అంది కసిగా!

“పోనీలే విద్యా! తనిష్టం కదా!” అనేసింది సుగుణ.

“ఊరుకో వదినా! ఇంటి పేరు వాళ్ళు.. పెద్దవాళ్ళు అన్నయ్యా, నువ్వు ఉంటే! న్యాయానికి మిమ్మల్నే కదా పీటల మీద కూచోపెట్టాలి” విద్య గొంతులో కోపం. సుగుణ ఏం మాటాడలేకపోయింది.

సుగుణ తనయినా ముందు వెళ్ళాలని‌ బయలు దేరింది.

లత ఆదరంగానే ఆహ్వానించింది. ఇల్లంతా ఆమె అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలతో హడావిడిగా ఉంది. ఆమె పెద్ద చెల్లి, అక్క బాధ్యతంతా తీసుకున్నట్టు ఉన్నారు. ఏది కావాలన్నా లత వాళ్ళనే అడుగుతున్నాది.

సుగుణ ఫ్రెష్ అయి కాఫీ టిఫిన్ చేసి బంధువులు అందరినీ ఓసారి పలకరించింది.

“లతా! నాకు కూడా ఏదన్నా పని అప్పచెప్పు” అనడిగింది. లత మొదట నవ్వేసి ఊరుకుంది.

కాసేపయిన తరవాత “అక్కయ్యా! మీరు ఎలాగూ ఏదో‌ ఒక పని చేస్తానంటున్నారు కదా! ఇలా రండి” అని బైటకి వచ్చింది. ఎక్కడకి రమ్మంటుందో అనుకొని చెప్పులు వేసుకొని లతని అనుసరించింది.

లిఫ్ట్‌లో లత మీద అంతస్తులో ఒక ఫ్లాట్ లోకి తీసికెళ్ళింది. అక్కడ ఓ మంచంమీద లతా వాళ్ళమ్మగారు కూచొని ఉన్నారు. సుగుణ ఆవిడని “నమస్కారం పిన్నిగారు! బాగున్నారా” అని పలకరించి “ఇదేమిటి లతా! అమ్మ ఇక్కడ ఒక్కరూ ఉన్నారేమిటి?” అంది.

“అమ్మకి చప్పుళ్ళు కేకలు చెవులకి పడటం లేదక్కా! ఈ ఇంటివాళ్ళు ఊర్లో లేరు. నాకు తాళం చెవి ఇచ్చేరు. కాస్త అమ్మకి తోడు ఉండండి మీరు.” అని ఆవిడకి వెయ్యాల్సిన మందులు అప్పచెప్పి అంతవరకూ అక్కడ ఉన్న కుర్రాడిని “ఒరే బాబీ నువ్వు రారా! బజారుకెళ్ళి పువ్వులు తేవాలి” అంటూ వెళ్ళిపోయింది.

డబల్ బెడ్ రూమ్ ఇల్లు. రెండు బెడ్ రూమ్సూ తాళాలు వేసి ఉన్నాయి. ఒక బాల్కనీ కిచెన్ ఒక బాత్ రూమ్ మాత్రం ఉన్నాయి.

ఒక్క మంచంమీద లతా వాళ్ళమ్మ వరదమ్మగారు వాలి ఉన్నారు. సుగుణ తప్పనిసరిగా కుర్చీలో కూచుంది. ఆమెకి ఫేన్ గాలి చలిట. టివి చికాకుట. సుగుణకి ఒక గంట గడిచేసరికి ఏమీ తోచక విసుగు వచ్చేసింది.

భోజనాల వేళకి లతా వాళ్ళ చెల్లి, ఇంకో అబ్బాయి కలిసి నాలుగయిదు రకాలు వంటకాలు తీసుకొచ్చి వరదమ్మగారికి మెల్లగా వడ్డించేరు.

వీళ్ళు వచ్చేరు కాబట్టి తను కిందకి వెళ్ళొచ్చు అని చెల్లికి చెప్పి కిందకి వెళ్ళింది. కింద భోజనాలు అవుతున్నాయి. లత “రండక్కా! మీరూ తినీండి” అని ఓ విస్తరి ముందు కూచొ‌పెట్టింది. తన పక్కన కూచున్నది ఎవరో కూడా తెలీదు. వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు జోక్‌లూ వేసుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఒక్కసారి నీరసం వచ్చేసింది సుగుణకి. వంటకాలు ఎంత బాగున్నా తినాలని అనిపించలేదు.

భోజనాలయి తాంబూలం వేసుకుంటూ ఉండగానే లత పెద్దక్క “చిన్నీ ఏది? పెట్టె తాళం కావాలి. దాని దగ్గరే ఉంది” అని కంగారుగా అడిగింది.

వెంటనే లత “అక్కయ్యా! మీరు వెళ్ళి ఒకసారి చిన్నీని రమ్మనరా?” అంది. మళ్ళీ సుగుణ మేడ మీదకి. మిగతా అందరూ కిందకి.

మర్నాడు ఒడుగు. పెళ్ళికి ఇంకా మూడు రోజులు టైముంది. అసలు వాళ్ళ అన్నయ్య దగ్గరనించీ దేనికి తల్లిని తెచ్చిందో లత. ఆవిడకి ఏ హడావిడీ పనికి రానప్పుడు అన్న ఇంట్లో ఉంచవచ్చును కదా! ఇంతా చేస్తే ఆ వదిన కనపడేలేదు.

రాత్రి ఒక కుర్రాడు కొంత ఉప్మా, చెట్నీ రెండు స్వీట్స్, అరటి పళ్ళు తెచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేడు. సుగుణే ఆవిడకి వడ్డించింది.

ఆవిడ తినేసి మందులు మింగి అభిమానంగా సుగుణ చెయ్యి పట్టుకొని “నీకు ఇబ్బంది అవుతున్నాదే అమ్మా! ఏకంగా పెళ్ళికి వస్తానర్రా అంటే మొదట మా కోడలే ఒప్పలేదు. తెచ్చి దింపేసింది. కిందనా అసలు జాగావే లేదు. నేనా అస్తమానం బాత్ రూమ్‌కి తిరుగుతూనే ఉంటాను. కళ్ళు సరిగా కనపడక దేనిమీద పడతానో భయం” అమాయకంగా ఆవిడ అంటూ ఉంటే సుగుణకి చాలా జాలి వేసింది.

ఆవిడని పడుకోమని మిగిలిన ఉప్మా ఓ అరటిపండు తిని సోఫా మీద నడుం వాల్చింది. ఓ గంటకి ఓ కుర్రాడు వచ్చి “లతత్త మిమ్మలని భోజనానికి రమ్మంది. మళ్ళా మీరొచ్చేదాకా నేను మామ్మ దగ్గర ఉంటాను” అన్నాడు.

“వద్దులే! నేను తినేసానని చెప్పు. ఈ గిన్నెలు తీసుకుపో” అనేసింది.

తెల్లారే వడుగు ముహూర్తం. పొద్దుటే ఒకబ్బాయి సుగుణ లగేజ్ తెచ్చి ఉంచి “ఆంటీ మీ బ్రష్ పేస్ట్, ఇందులో ఉన్నాయట కదా” అన్నాడు.

కిందనించీ సన్నాయి నాదం మధురంగా వినపడుతున్నాది. ఇల్లు కోలాహలంగా ఉన్నాదని తెలుస్తోంది. లత వాళ్ళ పిన్ని కాఫీలు తీసుకొని వచ్చి పెద్దావిడని మొహం కడిగించిందికి తీసుకెళ్ళింది.

సుగుణ తనూ ఓ కప్పు కాఫీ తాగుతూ కూచుంది. లత పిన్ని తన అక్కకి కాఫీ ఇచ్చి, “మీరు కూడా ఫ్రెష్ అయిపోతారా! నేను కాసేపు ఉంటాను” అంది. సుగుణ మాటాడకుండా బట్టలు తీసుకొని స్నానం చేసి వచ్చింది. వచ్చినావిడ లత తల్లిని తయారు చేసి జరీ చీర కట్టి మరీ వెళ్ళింది. కిందకి రమ్మంటారేమో అని చూసింది.

బిక్ష వేళకి ఇద్దరినీ కిందకి తీసుకెళ్ళేరు. అభికి బిక్షకి అని కొన్న వెండిగ్లాసు ఇచ్చింది సుగుణ. ఓ గంటసేపు అక్కడే ఉంది. అక్కడ ఉన్నా ఎవరూ తనని పెద్దగా పట్టించుకోటం లేదు. సుగుణ వెంటనే ఒక నిర్ణయానికి వచ్చింది.

లతతో “లతా! మా పిన్నీ చిన్నాన్నా, తమ్ముడూ ఈ ఊళ్ళోనే ఉన్నారు. రమ్మని తెగ బలవంతం చేస్తున్నారు. నేను ఇప్పుడు వెళ్తాను. మళ్ళీ పెళ్ళికి వస్తాలే” అని చెప్పి బాబీ వేపు తిరిగి “బాబీ! నా పెట్టె బేగ్ మేడమీద ఉన్నాయి. రా నాతో తెచ్చుకుందాం” అని చరచరా మేడ మీదకి కదిలింది.

బాబీ సాయంతో కేబ్ బుక్ చేసుకొని లగేజ్ కిందకి తెచ్చి లతకీ అందరికీ చెప్పేసి వస్తుంటే లత మేనత్త “అవును మరి, ఓ వేడుకా ముచ్చటా, చూడనివ్వకుండా మేడమీదే బంధించేసింది లత. పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తుంది” అనడం వినిపించింది‌.

Exit mobile version