[అంబడిపూడి శ్యామసుందర రావు గారి – సహస్ర బాహుల ‘కార్తవీర్యార్జునుడు’ – అనే రచనని అందిస్తున్నాము.]
కార్తవీర్యార్జునుడు త్రేతాయుగానికి చెందిన వాడు. ఇతని కథ మనకు మహాభారతంలో మూడు విడతల్లో కనిపిస్తుంది. ఒకసారి ఉత్తర రామాయణంలో కనిపిస్తుంది. రావణుడు యుద్ధ గర్వంతో కార్తవీర్యునితో యుద్ధం చేయదలచి దండెత్తుతాడు. ఆ సరికి అతను భార్యలతో నదిలో స్నానాలు చేస్తూ క్రీడిస్తూ ఉంటాడు. రావణుడు అతడు వచ్చేవరకు ఆగకుండా అక్కడకే వెళతాడు. అర్జునుడు కోపించి, రావణుడిని ఓడించి బంధిస్తే, పులస్త్యుడు వచ్చి ఇద్దరికీ సంధి చేస్తాడు.. పరశురామావతారానికి ముందుగానే కార్తవీర్యుడు జన్మించాడు.
పరశురాముడి కథ, కార్తవీర్యార్జుని కథకూ దగ్గర సంబంధం ఉంది. అరణ్య పర్వంలో ఈ ప్రస్తావన వస్తుంది. లోమస మహామునితో పాటు ధర్మరాజు, అర్జునుడు కాక మిగిలిన ముగ్గురు పాండవులు, ద్రౌపది తీర్థయాత్రలు చేస్తూ మహేంద్రగిరి చేరుకుంటారు. అక్కడ పరశురాముని సన్నిహితుడయిన అకృతవ్రణుడి ద్వారా పరశురామ వృత్తాంతం వింటారు. ఆ సందర్భంలో కార్తవీర్యార్జునుడి వృత్తాంతం కూడా కొంత వస్తుంది.
కార్తవీర్యుని పేరు అర్జునుడు. తండ్రి పేరు కృత వీర్యుడు. ఇతడు హైహయవంశ రాజు. ముందు హైహయ వంశం గురించి తెలుసుకుందాము. యదువు పెద్దకొడుకు సహస్ర జిత్తు. రెండో కొడుకు క్రోష్టుడు. శ్రీకృష్ణుడు తదితర యాదవులందరూ క్రోష్టువు వంశంలో వారే. సహస్ర జిత్తు వంశంలో, అతని కొడుకు శతజిత్తు, అతని కొడుకు హేహాయుడు. అతని పేరు మీద హైహయ వంశం వచ్చింది. ఆ వంశంలో మహేష్మంతుడు జన్మించాడు. తర్వాత రాజులలో కృత వీర్యుడు, అతని కొడుకు కార్తవీర్యార్జునుడు. ఇతడు శాపవశాన చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సు చేసి, దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకుని, వెయ్యి చేతులు పొంది మహావీరుడు అయినాడు. కార్తవీర్యార్జునుని పరాక్రమం లోక ప్రసిద్ధి గాంచింది. ఆ తరువాతి కాలంలో క్షత్రియులను పొగడవలసివస్తే .’అర్జునుడంతటి’ గొప్పవాడు అనడం కనిపిస్తుంది. అతని కొడుకులు అందరూ పరశురాముడి చేతిలో చనిపోవడం వల్ల హైహయ వంశం నాశనమయ్యింది. అతని పురోహితుడు గర్గ మహర్షి.
కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయునికి పరమ భక్తుడు, ప్రీతి పాత్రుడు. ఆయన అనుగ్రహం ద్వారా బంగారు విమానం (రథం), యుద్ధంలో వేయి చేతులతో ఆయుధాలు విసరగల వరాన్ని పొందుతాడు. వరబలంతో అతడు అన్ని ప్రాణుల మీద అధికారం సంపాదించి ఇంద్రుడిని కూడా పీడించాడు. దత్తాత్రేయుడు అన్ని వరాలు వచ్చాక బల మదంతో అర్జునుడు రథంలో ప్రయాణిస్తూ, “ధైర్యం, వీర్యం, శౌర్యం, యశస్సు, విక్రమం, ఓజస్సు, వీటిలో నాతో సమానుడెవ్వడు?” అన్నాడు. వెంటనే ఆకాశంలోంచి వాయుదేవుని మాటలు వినబడ్డాయి “మూర్ఖుడా, క్షత్రియుని కన్నా బ్రాహ్మణుడే శ్రేష్ఠుడని తెలుసుకోలేకపోతున్నావు”. అర్జునుడు ఒప్పుకోలేదు.
తన తర్కాన్ని వివరించి, “నేటి వరకు బ్రాహ్మణ ప్రధానమయిన లోకాన్ని క్షత్రియ ప్రధానంగా చేస్తాను” అన్నాడు. ఆ తర్కంలో అర్జునుడు, వాయుదేవుడిని “క్షత్రియుడి కన్నా గొప్ప బ్రాహ్మణులు ఎవరు?” అని ప్రశ్నిస్తే, అంగీరసుడు, గౌతముడు, ఔర్వుడు, దత్తాత్రేయుడు, కశ్యపుడు, ఉతధ్యుడు, అగస్త్యుడు, వసిష్ఠుడు, అత్రి, చ్యవనుడు వంటి వారి కథలు చెబుతాడు
అర్జునుడు అంగీకరించి “నేను ఎల్లవేళలా బ్రాహ్మణుల ప్రయోజనాలను గౌరవిస్తాను, వారికి నమస్కరిస్తాను” అని ఒప్పుకుంటాడు. అప్పుడు వాయుదేవుడు అతనికి శుభం పలికి అతనికి భవిష్యత్తులో భృగు వంశీయుల వల్ల తీవ్రమైన భయం ఏర్పడుతుంది అని హెచ్చరించాడు.
దేవతలు అతనిని చంపడానికి విష్ణుమూర్తిని ప్రార్ధించారు. ఇదే పరశురాముని జననానికి కారణభూతమయ్యింది. పరశురాముని తండ్రి జమదగ్ని వద్ద చక్కటి హోమధేనువు ఉంది. అనూప దేశ రాజైన అర్జునుడు, పరశురాముడు లేని సమయంలో, దూడను బలవంతంగా తీసుకొని పోయాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన పరశురాముడికి సంగతి తెలిసి యుద్ధంలో అర్జునుని వెయ్యి చేతులు బాణాలతో నరికి చంపేశాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పరశురాముడిని పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు పరుశ రాముడు. దీనికి కారణం మైత్రావరుణుని శాపం.
ఒకసారి అగ్ని తనకు ఆహారం కావలెను అని కార్తవీర్యార్జునుడు అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమం కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపం వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను. కార్తవీర్యుని కొడుకులు పరశురాముడు లేని సమయంలో వచ్చి జమదగ్నిని చంపేశారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 సార్లు గుండెలు బాదుకుంటుంది. తర్వాత వారందరినీ పరశురాముడు చంపేశాడు, పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. దశరథుని వంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పించుకున్నారు. తర్వాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
శాంతిపర్వంలో కార్తవీర్యార్జుని ప్రస్తావన భీష్ముడి నిర్యాణానంతరం వస్తుంది. కృష్ణుడు, పాండవులు కురుక్షేత్రం వెళ్లారు. అక్కడ కొద్ది దూరంలో ఉన్న మడుగులు చూపిస్తూ, వాటిని ‘రామ హ్రదాలు’ అని అంటారని చెపుతాడు. పరశురాముడు 21 సార్లు క్షత్రియ వధ జరిపి రక్తంతో పితరులకు తర్పణం చేసాడని చెప్తాడు. యుధిష్టరుడు అడిగిన మీదట, తాను ఋషుల ద్వారా విన్న పరశురాముని వృత్తాంతం చెబుతాడు. ఇక్కడ మళ్ళీ కార్తవీర్యార్జున ప్రసక్తి వస్తుంది.
ఇక్కడ కొత్తగా తెలిసిన విషయాలు ఏమిటి అంటే అర్జునుడు మహా తేజస్వి. ధర్మవేత్త. అశ్వమేధ యాగం చేసి జయించిన భూమినంతటినీ విప్రులకు దానం ఇచ్చాడు. అగ్ని ఇతనిని దప్పిక గొని అడిగితే అతనికి గ్రామాలు, నగరాలు, గొల్ల పల్లెలు భిక్షగా ఇచ్చారు. అతని సహాయంతో అగ్ని అన్నింటినీ యథేచ్ఛగా దహనం చేస్తూ, వశిష్ఠుడి ఆశ్రమం కూడా దగ్ధం చేస్తాడు. వసిష్ఠుడు కోపించి పరశురాముడు యుద్ధంలో నీ బాహువులను నరికి వేయు గాక అని శపించాడు.
దాత, శూరుడు అయిన అర్జునుడు ఆ శాపాన్ని లెక్క చేయలేదు. కానీ దురాత్ములయిన అతని పుత్రులు జమదగ్ని హోమధేనువు దూడను తీసుకెళ్లిపోయారు. పరశురాముడి కార్తవీర్యుడిని చంపడం, అతని కొడుకులు జమదగ్నిని చంపడం ఇవన్నీ మొదట చెప్పిన విధంగానే జరిగాయి.
అనుశాసన పర్వంలో మూడవసారి కార్తవీర్యార్జునుని ప్రస్తావన వస్తుంది. మాహిష్మతీ నగరంలో ఉంది సమస్త ప్రపంచాన్ని పాలించిన అర్జునుడు, దత్తాత్రేయుని తపస్సు ద్వారా సంతోష పరుస్తాడు. దత్తాత్రేయుడు మూడు వరాలు కోరుకోమంటాడు. ఇలా కోరుకుంటాడు అర్జునుడు – “యుద్ధరంగంలో నేను వెయ్యి చేతులతో కనపడాలి. ఇంట్లో మామూలుగా ఉండాలి. నన్ను సైనికులందరూ సహస్ర బాహువు గానే పరిగణించాలి. నేను సమస్త భూమండలం జయించాలి. అలసత్వం లేకుండా పాలించాలి”. ఈ మూడు వరాలతో పాటు నాలుగో వరము కూడా కోరుతాడు అది ఏమిటి అంటే “నేను మార్గం తప్పి ప్రవర్తించినప్పుడు సాధువులు నన్ను సన్మార్గంలో ప్రవర్తింప చేయాలి.”
ఇదండీ కార్తవీర్యార్జుని కథ.