[dropcap]సా[/dropcap]హితీ జగతిలో ఇదో చారిత్రక ఘట్టం అవుతుంది. కథా నేపథ్యంలో ప్రజలకు పాఠనాభిరుచి కలిగించే ఉద్దేశంతో నాలుగు రోజులుపాటు 80 కిలోమీటర్ల పాదయాత్రను చేసాము. రచయితలు, విద్యార్థులు, ప్రజలు మా పాదయాత్రను అర్థం చేసుకున్నారు, ఆదరించారు. ఈ విశేష యాత్రలో నేను భాగస్వామి నైనందుకు గర్వంగా ఉంది.
కథ మనిషిని ఆలోచనాపరుడిని చేస్తుంది. నేటి సమాజంలో వ్యక్తులకు, పఠనాశక్తి పెంపొందించాలన్న ఆలోచనతో ‘కథ కోసం కాలినడక’ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నెల 6వ తేదీ ఉదయం 6 గంటలకు విజయనగరంలోని గురజాడ గృహం వద్ద రాష్ట్ర సాంస్కృతిక శాఖ పాలకులు, సంచాలకులు డాక్టర్ డి. విజయ భాస్కర్ గారు ఈ ర్యాలీని ప్రారంభించారు. విజయనగరంలో చారిత్రిక ప్రాంతాలను కలుపుకుంటూ నెల్లిమర్ల, రామతీర్థం, సతివాడ, బొప్పడం, రణస్థలం, మరియు కాళీపట్నం రామారావు గారి స్వగ్రామమైన మురపాక, మీదుగా ఎచ్చర్ల నుండి శ్రీకాకుళంలోని కథానిలయంకు ఫిబ్రవరి తొమ్మిది ఉదయం 10 గంటలకు చేరుకున్నాం. మా బృందంలో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు. ఆ రోజు కథానిలయం ట్రస్ట్ సభ్యులు, పురప్రజలు, విద్యార్థులు మా బృందానికి స్వాగతం పలికారు.
దారి పొడుగునా అనేక విద్యాలయాలలోను విద్యార్థినీ విద్యార్థులతో కథ ప్రాముఖ్యతను, మా బృందం సభ్యులు వివరించడం జరిగింది.
కథలను చదవడం వల్ల పిల్లల్లో ఊహాశక్తి పెంపొందుతుంది. అలాగే జీవన నైపుణ్యాలు పెరుగుతాయి, మానసిక వికాసం చెంది భిన్న కోణాలలో సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి దారి ఏర్పడుతుంది, మానసిక వికాసం కలిగి మంచి పౌరులుగా ఎదుగుతారు.
పాశ్చాత్య దేశాలలోని విద్యాలయాలలో ప్రతిరోజు ఒక గంట వారికి నచ్చిన కథను పిల్లలతో చదివిస్తారు. ఇక్కడ అలాంటి వాతావరణం మనకు లేదు.
వ్యవహారిక భాషలో తొలి తెలుగు కథ రాసిన వారు విజయనగరంలోని గురజాడ అప్పారావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన తెలుగు కథలు అన్నీ నిక్షిప్తం చేసినది, శ్రీకాకుళంలోని కథానిలయం. అందుకనే ‘కథ కోసం కాలినడక’ పేరుతో మా పాదయాత్ర చారిత్రక నేపథ్యం అవుతుందన్న ఆలోచనతో, ఈ కథా యాత్రను ప్రారంభించాము. దారి పొడుగునా విద్యాసంస్థలలో విద్యార్థులతో మమేకమై అనేక అంశాలలో వారికి అవగాహన కల్పించడమే, కాకుండా వారు కూడా వారికి తెలిసిన సాంస్కృతిక ప్రదర్శనలను ఇవ్వడమే కాక వారికి తెలిసిన కథలను చెప్పారు. ఇలా యాత్ర ఎంతో ఉత్సాహంగా సాగింది. కథ పైన అవగాహన కల్పించడంలో మేము సఫలీకృతులమయ్యామని చెప్పవచ్చు.
మా బృందంలోని సభ్యులను కథానిలయంలో కాళీపట్నం రామారావు గారు పేరుపేరునా పలుకరించి అభినందించడం మాకు గొప్ప అనుభూతినిచ్చింది. ఈ యాత్రలో సహజ సంస్థ తరఫున ఎన్.కె.బాబు, సాహితీ స్రవంతి తరుపున దివాకర్, క్రియ సంస్థ తరఫున జగన్నాధరావు, ఢిల్లీ సాహితీ వేదిక తరపున అమరేంద్ర, కథానిలయం తరఫున కాళీపట్నం సుబ్బారావు గారు యాత్ర నిర్వహణతోపాటు, సహకారాలు అందించారు.