[dropcap]ప్ర[/dropcap]ముఖ స్వాతంత్ర సమర యోధులు, పారిశ్రామికవేత్త, సాహితీవేత్త, సాహితీ పోషకులు శ్రీ అంగలకుదిటి సుందరాచారి గారు తన ఇంట్లోని శుభకార్యాలకు పండితులను, కవులను ఆహ్వానించి అష్టావధానాలు చేయించేవారు. వారి అమ్మాయి అక్షరాభ్యాసానికి (1973) శ్రీ వంగవోలు ఆదిశేష శాస్త్రి గారితో అష్టావధానం చేయించారు. అలాగే అమ్మాయి రాణి బారసాలకు పులివర్తి శరభాచార్యులు గారితో గణితావధానం చేయించారు (1969). అలాగే కుమారుడు మల్లిక్ అక్షరాభ్యాసానికి (1979) పూసపాటి నాగేశ్వర రావు గారిచే అష్టావధానం నిర్వహించారు.
తాను నిర్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర రైస్ మిల్ ప్రారంభోత్సవంలోనూ (1973), శ్రీ సుందరాచార్య రైస్ మిల్ ప్రారంభోత్సవం లోనూ (1979) అష్టావధానాలు చేయించారు. శ్రీ వంగవోలు ఆదిశేష శాస్త్రి, శ్రీ పూసపాటి నాగేశ్వర రావు గార్లతో అష్టావధానాలు చేయించారు. సాహితీ సభకు విచ్చేసిన కవులు పృచ్ఛకులుగా వ్యవహరించేవారు.
‘శ్రీ అంగలకుదిటి సుందరాచారి చారిటీస్’ స్థాపించి వందల పుస్తకాలకు ఆర్థిక సాయం అందించారు. ఏటా నలుగురు కవి పండితులకు పురస్కారాలను ఇచ్చి ప్రోత్సహించినారు. నాగభైరవ కోటేశ్వర రావు, నందమూరి లక్ష్మీ పార్వతి, డా. రావూరి భరద్వాజ, విశ్వనాథ సత్యనారాయణ, ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ, వి.వి.ఎల్. నరసింహారావు వంటి ప్రముఖులు సత్కారం స్వీకరించిన వారిలో ఉన్నారు.
కుమార్తె రాణి వివాహానికి (1989) కవి పండిత సభను ఏర్పాటు చేసి కవులు అందించిన ఆశీస్సులను ‘కళ్యాణ కౌముది’ అనే పేరుతో ఒక పుస్తక రూపంలో తీసుకువచ్చారు. కళా ప్రపూర్ణ కొండూరి రాఘవా చారి, ఏర్రోజు మాధవా చారి, శ్రీరాం భుజంగ రాయ శర్మ, చిర్రావూరి నాగభూషణ శర్మ వంటి ప్రముఖులు కవితలు ఆ పుస్తకంలో చోటు చేసుకున్నాయి.
ఎందరో పేద కవుల పుస్తకాలకు అచ్చు రూపం కల్పించి ఆర్థిక సాయం అందించి కవి పండిత లోకంతో అభినవ సమాజభోజ, వదాన్య శేఖర, కవికుల తిలక, సాహితి పోషక భోజ రత్న అనే బిరుదులు పొందారు. స్వాతంత్ర్యం రాక ముందు పెళ్ళి చేసుకొని భార్యను చదివించిన ఆదర్శమూర్తి. స్వాతంత్ర్య సమరంలో తాను పాల్గొనుటయే గాక భార్యను సైతం స్వాతంత్ర్యం కోసం చేసినా పోరాటంలో నిలిపారు. గాంధీజీ వేటపాలెం సందర్శించినపుడు వారి వెంట కుటుంబమంతా నడిచారు.
స్వాతంత్ర్య సమరంలోనూ, కవులకు సాహితీ విలువలున్న గ్రంథరాజాలకూ లక్షల రూపాయలను దానం చేసిన సాహితీరత్నం. డిశంబరు 30వ తేదీ 1993వ సంవత్సరంలో చీరాలలో మరణించారు. వారి పేరు మీదుగా ‘శ్రీ అంగలకుదిటి సుందరాచారి స్మారక బాల సాహిత్య పురస్కారం’ పేరుతో తెలుగు విశ్వవిద్యాలయంలో బాలసాహిత్య పురస్కారాన్ని వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం ముదావహం.