[dropcap]భా[/dropcap]రత జాగృతి నిర్వహించిన తెలంగాణ సాహిత్య సభల్లో పాలమూరు జిల్లాకు చెందిన పరిశోధకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ పత్రసమర్పణ చేశారు.
జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో జూన్ 21, 22 లలో తెలంగాణ సాహిత్య సభలను నిర్వహించారు. ఈ సాహిత్య సభల్లో భీంపల్లి శ్రీకాంత్ ‘తెలంగాణ నవలా సాహిత్యం (1900-1932)’ అనే అంశంపైన పత్రసమర్పణ చేశారు.
తెలంగాణ నవల ఆవిర్భావ, వికాసాల గురించి తెలియజేశారు. తెలంగాణ తొలి నవల ‘ఆశాదోషం’ పాలమూరు జిల్లాలోనే పురుడు పోసుకున్నదన్నారు. తొలి తెలంగాణ మాసపత్రిక ‘హితబోధిని’ని తీసుకువచ్చిన బరారు శ్రీనివాస్ శర్మనే ‘ఆశాదోషం’ నవలను రచించారన్నారు.
అనంతరం సభాధ్యక్షులు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మెమెంటో, శాలువా, ప్రశంసాపత్రం లతో భీంపల్లి శ్రీకాంత్‌ను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా విచ్చేసిన శాసనమండలి సభ్యులు, గాయకులు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అయాచితం శ్రీధర్, చారిత్రక పరిశోధకులు కుర్రా జితేంద్రబాబు, ప్రముఖ కవయిత్రి అనిశెట్టి రజిత, తంగేడు పత్రిక సహ సంపాదకులు డాక్టర్ కాంచనపల్లి రాజు, జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, వ్యాఖ్యాత ఘనపురం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.