Site icon Sanchika

సైకత శిల్పి

[dropcap]అ[/dropcap]లా నడుచుకుంటూ నడుచుకుంటూ సముద్రపు ఒడ్డును సమీపిస్తున్నాను. కథా వస్తువు కోసం కలియ చూస్తున్నాను. పీతలు నన్ను చూసి సముద్రుడికి కబురు అందించాయి. చేప పిల్లలు ఎవరిని పట్టించుకోకుండా వంగుడు, దూకుడు ఆటలాడుతున్నాయి. సముద్రపు చల్లనిగాలి నన్ను సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. ఇసుకరేణువులు అత్తరు, గవ్వలు గులాబీల తివాచీ పరిచాయి. నీటి అలలు రమ్మంటు పిలిచి, అడుగు పడగానే సిగ్గుతో తలవంచి వెనుకకు వెళ్ళి పోతున్నాయి. సముద్రపు హోరు పెరిగేకొద్దీ వెలుతురు చిన్నగా జారుకుంటుంది. నాలుగు దిక్కులు చీకటి తెరలను పట్టుకుని నిలుచున్నాయి. నక్షత్రాలు మేఘాల చాటునుంచి తొంగిచూస్తున్నాయి. చంద్రునితో మేఘం ఢీకొట్టి పడిపోగానే విజయానందంతో చంద్రుడు నవ్వుతున్నాడు. ఆకాశం ఆ కాంతితో తెల్లబడింది.

అన్ని దిక్కులకు ఆలోచనల పగ్గాలు వేసి కథా వస్తువు కోసం చూస్తూ ఉండిపోయాను. చీకటి గంతలు కట్టి చిలిపిగా నవ్వుతుంది.

“చెలీ! నన్ను క్షమించు. కాస్త ఆలస్యం అయ్యింది. మన్నించు. నన్ను చూసి మూతి ముడుచుకోకు. నా వైపు తిరిగి చూడు. కోపంలోను నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ కురులు గాలి తాకిడికి తెరచాపలాగా ఎగురుతున్నవి. నీ చూపుల చుక్కాని నన్ను నీ దాకా తీసుకు వచ్చింది. నీ స్పర్శ తగలగానే తనువుకు తన్మయమేదో అల్లుకుంటుంది. నిన్ను తాకిన గాలి నన్ను తాకగానే గుండె వెయ్యిరెట్లు కొట్టుకుంటుంది. నా స్వరపేటిక స్వరాలను తప్ప ఏ సంగతులు ఎరుగదు. నీ అందని అందాన్ని కనులార్పకుండా చూసిన తనివి తీరట్లేదు.

ఏ మంత్రం వేసావో గాని, నీ మాటలు తప్ప వేరే వారివి వినబడవు. నీ చేష్టలు తప్ప ఇంకెవరివి కానరావు. నీతో ఉన్న కొన్ని క్షణాలైనా సాగర తీరాన్ని సాధించినట్లు ఉంటుంది. నీ పేరు ఎంత తియ్యగా నా పెదవులు పలుకుతాయో నీకు తెలుసా. అందరిలో ఉన్న ఒంటరినై పోతాను. నీతో ఉంటే అందరిలో ఉన్నట్లుంటుంది. నువ్వు వేసిన అడుగులు నా ఎదపై ముద్రలయ్యాయి. నీ పెదవిపై చిరునవ్వు పూయగానే తేటినై ప్రదక్షణలు చేస్తూ ఉంటాను. కనురెప్ప వేయకుండా చూసే నీ చూపుకు ఎదురు దాడి చేసి ఎన్నో సార్లు ఓడిపోతాను. నీ బుగ్గలకు దిష్టి తగలకుండా కాటుక చుక్కనై పోవాలనుకుంటాను. నుదుటి పై చెమట చుక్కగా రాలి ముత్యమై పోవాలనుకుంటాను. ప్రేమంటే ఇంత గొప్పగా ఉంటుందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అది నీ ప్రేమలో పడ్డాకే. ప్రేమించడం రాని నన్ను ప్రేమ దేవతకు పూజారిని చేశావు. నా ఎదపై మాయని గీతను గీసిన సీతవు నువ్వే.”

ఆ మాటలన్నీ కవిత్వమై నన్ను కలం పోటు కంటే కత్తిపోటులా పొడుస్తున్నాయి. కొన్ని గిలిగింతలు పెడుతున్నాయి. కవ్విస్తున్నాయి కొన్ని. నవ్విస్తున్నాయి కొన్ని. ఇతను కవితా ప్రేమికుడా! కన్యకా ప్రేమికుడా!! ఖచ్చితంగా చూడాలని అడుగులు వేస్తున్నాను. దగ్గరయ్యే కొద్దీ చీకటి మరింత ముదిరి ముసలిదైపోయి కఱ్ఱపట్టుకుని నడుస్తుంది. చల్లని గాలి వణుకు పుట్టిస్తోంది. పిట్టల కిలకిలలు ఎక్కువయ్యాయి. సముద్రపు హోరు జోరుగా సాగుతోంది. అలలు కాళ్లను తగిలి వినయంగా వెనుదిరిగిపోతున్నాయి.

ఒక్కసారిగా చూసి ఆశ్చర్యానికి గురికావడం నా వంతయింది. కళ్ల నుంచి కాళ్ల దాకా ఏ అవయవం పనిచేయడం లేదు. రెప్పలు పడడం లేదు. గాలి ఆడడం లేదు. నోరు డోరు తెలియకుండానే తెరుచుకుంది. చేతిలో ఉన్న కలం కాగితం ఈ ద్వంద్వ పరికరాలను అశోకుడు యుద్ధం చేయడం వదిలేసినట్టు వదిలేసి నేలతల్లికి సమర్పించుకున్నాను. కాళ్ళు బరువుగా ఇసుకల్లో ఇరుక్కుపోయాయి.

కొన్ని క్షణాలు..

బలవంతంగా గుటకలు వేసి లాలాజలాన్ని దిగమింగాను. కన్నులు పెద్దవి చేసి చూస్తే అదీ సైకత ప్రేయసి శిల్పం. పక్కనే ప్రేమికుడు. తన మనసులో మాట నేరుగా ప్రేయసికి చెప్పడానికి భయపడ్డ ఈ శిల్పి. ఇసుక విగ్రహం చేసుకొని తన ప్రేమను వ్యక్త పరుస్తున్నాడు.

నీటి అలలు అరి కాళ్ళ కింద ఇసుకను లాగేశాయి. చల్లగాలి ముందుకు తోసేసింది. కథా వస్తువు దొరికిందంటూ వెళ్ళిపోయాను..

Exit mobile version