అటు ఇటు కానీ, హృదయంలేనీ సైనా..

2
2

[dropcap]ఇ[/dropcap]టీవలి కాలంలో హిందీ సినీ ప్రపంచంలో ఒకటివెంట ఒకటి వస్తున్న ఆటల ఆధారంగా నిర్మించిన సినిమాల జాబితాలో చేరే మరో సినిమా సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా నిర్మించిన “సైనా”. భారతదేశంలో మహిళలు బాడ్మింటన్ వైపు విపరీతంగా ఆకర్షితులవటం వెనుక సైనా సాధించిన అత్యద్భుతమయిన విజయాలున్నాయన్నది నిర్వివాదాంశం. సైనా ప్రపంచంలోనే నంబర్ వన్ బాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎదగటం, తరువాత పీవీ సింధూ ఒలంపిక్ పోటీల్లో వెండిపతకం సాధించేందుకు బాటను సుగమంచేసింది. అలాంటి క్రీడాకారిణి జీవితం ఆధారంగా సినిమాను నిర్మించటం అంటే మరోసారి ప్రజలను, ముఖ్యంగా బాలికలను ఉత్తేజితులనుచేసి బాడ్మింటన్ వైపు పెద్ద ఎత్తున ఆకర్షించే వీలు లభించటమే. కానీ, అమోల్ గుప్తే దర్శకత్వం వహించిన సైనా చూస్తూంటే ఉత్తేజమూ కలగదు. ఉత్సాహమూ కలగదు. నిర్భావంగా తెరపై జరుగుతున్నవాటినీ చూస్తూండిపోతూంటాము.

బయాగ్రఫీ సినిమాల నిర్మాణం అంత సులభం కాదు. ముఖ్యంగా జీవితులై వుండి కళ్ళెదురుగానే తిరుగుతున్నవారి జీవితాలను తెరకెక్కించటం కష్టం. సైనా సినిమా చూస్తూంటే ఆమె జీవిత చరిత్ర పుస్తకంలానే సినిమా తీయటంలోకూడా తొందరపడ్డారనిపిస్తుంది.

సైనా సినిమా ఆసక్తికరంగానే సాగుతుంది. తెరపై కనబడే దృశ్యాలను ఆసక్తిగానే చూస్తూంటాం. కానీ ఏ ఒక్క దృశ్యానికి స్పందించలేకపోతాము. ఏ ఒక్క పాత్రతోనూ మమేకం కాలేకపోతాము. ఇలాంటి సినిమాల్లో ప్రధానపాత్ర పట్ల ప్రేక్షకులకు అభిమానం కలగాలి. ఆ పాత్ర పట్టుదల, దీక్ష, లక్ష్య సాధన కోసం చేసిన త్యాగాలవంటి అంశాలపై ప్రేక్షకులకు అవగాహన కలగాలి. అంటే సినిమా చూస్తూ ప్రేక్షకులు తమకు తెలియకుండానే పాత్ర మనసులో దూరిపోవాలి. అది సైనా సినిమాలో జరుగదు. ఇందుకు ప్రధాన కారణం సినిమా స్క్రిప్టు – సైనా మనస్తత్వం, వ్యక్తిత్వం వంటి విషయాలలోతులోకి వెళ్ళకపోవటం, అందుకు తగ్గ దృశ్యాలను రచించకపోవటం. ముఖ్యంగా స్క్రిప్టు రచయితకు కానీ, దర్శకుడికి కానీ, తాము ఏ విషయంపై ఫోకస్ చేయలన్న విషయంపై స్పష్టమైన అవగాహన లేకపోవటం. సాధారణంగా ఆటలు కేంద్రంగా కల సినిమాలంటే స్క్రిప్ట్ రచనలో వుండాల్సిన అంశాలను గతంలో హిట్ అయిన సినిమాలు స్థిరపరచాయి. ప్రధానపాత్ర మధ్యతరగతి దిగువ మధ్యతరగతికి చెంది వుండాలి. తల్లితండ్రులు అతడు ఆటలాడటాన్ని వ్యతిరేకించాలి, లేకపోతే, కఠినంగా వుంటూ ఆటలు ఆడించాలి. ఆపై ప్రత్యర్ధులు అతనికన్నా శక్తిమంతులై వుండాలి. హీరో ఓడిపోతాడనిపించాలి. గెలుపు అసంభవం అనిపించాలి. కోచ్‌ హీరోకు వ్యతిరేకంగా వుండాలి. వీలయితే కీలకమైన మాచ్ ఆడేప్పుడు హీరోకు సన్నిహితులయినవారి ప్రాణాలు ప్రమాదంలో వుంటే ఇంకా మంచిది. ప్రధానంగా స్క్రిప్ట్‌లో వుండాల్సిన ఎలిమెంట్స్ ఇవి. వీటిని దర్శకుడు ప్రతిభతో మెరిపిస్తే, నటీనటులు, సంభాషణల రచయిత, సంగీత దర్శకులు తమ నైపుణ్యంతో మురిపిస్తే సినిమా హిట్ అవుతుంది. సరిగా, సైనాలో లోపించినవి ఇవే…

సైనాను నంబర్ వన్ క్రీడాకారిణి చేసేందుకు ఆమె తల్లితండ్రులు ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టం ఈ సినిమాలో కనబడదు. ఒక్క దృశ్యంలో తండ్రి పీఎఫ్‌కి అప్లై చేయటం వుంటుంది. అంతే, రోజూ ఉదయం అయిదింటికే ఎనిమిదేళ్ళపిల్ల ప్రాక్టీస్‌కి వెళ్ళటం, ఇతర పిల్లల్లా బాల్యం అన్నదే లేకుండా ఆటకే అంకితమయిపోవటం ఎంతకష్టమో సినిమాలో చూపలేదు. సైనా పుట్టినప్పటి నుంచే ఆటలో ప్రావీణ్యం కలది అన్నట్టు చూపారు. తరువాత దృశ్యంలో ఆమె టోర్నమెంటులు గెలిచేస్తూంటుంది. దాంతో సైనా పట్టుదల, దీక్ష, కథినమైన శిక్షణ వంటి విషయాలవల్లా ఆ పాత్ర ప్రేక్షకులకు చేరువ అయ్యే వీలులేకుండా పోయింది. అంతేకాదు, బాడ్మింటన్ ఆటలో ప్రావీణ్యం సంపాదించాలంటే పడాల్సిన కష్టం, ఆటలో మెళకువలను ప్రేక్షకులకు పరిచయంచేసే అవకాశం లేకుండా పోయింది. అలాంటివి తెలిసివుంటే ఆట దృశ్యాలను మరింతగా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. అంతేకాదు, కోచ్‌లతో ఆటగాడికివుండే అనుబధం కూడా తెలిసే వీలులేకుండా పోయింది.

సైనా రాజన్ అకాడెమీలో చేరుతుంది. గెలవటం ఆరంభిస్తుంది. అంతే… పేరు రాగానే ప్రకటనల మోజులో ప్రాక్టీస్ వదిలేస్తుంది. ఓడిపోతుంది. కొత్త కోచ్ దగ్గర చేరుతుంది. గెలుస్తుంది..ఇలా కట్టె కొట్టె తెచ్చెలా సాగుతుంది సినిమా.

వివాదాలకు దూరంగా వుండాలన్న తపనతో కోచ్ పుల్లెల గోపీచంద్ పేరును రాజన్‌గా మార్చారు. ప్రకాశ్ పదుకొనే ప్రస్తావనే రాదు. గోపీచంద్‌కూ, సైనాకూ కాశ్యప్ విషయంలోనూ, గోపీచంద్ పీవీ సింధూకు ప్రాధాన్యం ఇస్తున్నాడన్న విషయంలోనూ పొడసూపిన వివాదాలను స్పృశించలేదు. కాశ్యప్ విషయంలో సైనాను కోచ్ హెచ్చరించిన తరువాత సన్నివేశంలో త్యాగాల గురించి సైనా మాట్లాడితే ప్రేక్షకుడు స్పందించడు. ఎందుకంటే, ఆమెకానీ, ఆమె తల్లితండ్రులుకానీ చేసిన త్యాగాలగురించి ప్రేక్షకుడికి తెలియదు. ఆమె విజయాలూ సులువుగా వచ్చేశాయి.

ఇక కాశ్యప్‌కూ, సైనాకూ నడుమ పెరుగుతున్న సాన్నిహిత్యం కూడా సరిగా ఎస్టాబ్లిష్‌ కాలేదు. కాశ్యప్ ఎప్పుడు చూసినా సైనా ఇంట్లోనే వుంటాడు. నిజానికి స్వయంగా కాశ్యప్ చక్కటి ఆటగాడు. సినిమాలో ఆ ప్రసక్తేలేదు. అంతేకాదు, సైనా పేరు మార్మ్రోగుతున్న సమయంలోనే పీవీ సింధూ మరోవైపు ఎదుగుతూవస్తోంది. ఆ ప్రసక్తీ లేదు. అంటే, కనీసం బాడ్మింటన్ నేపథ్యం కూడా సరిగ్గా చూపలేదన్నమాట. ఈ రకంగా సినిమా చూస్తూంటే బాగానే వుంటుంది కానీ, చూసిన తరువాత ఉత్సాహం కలగదు. మరోసారి చూడాలనిపించదు. తలచుకోవాలనిపించదు.

దర్శకత్వం విషయానికొస్తే, సినిమా అటు సినిమాగానో, ఇటు కనీసం డాక్యుమెంటరీగానూ ఎదగలేక అటూ ఇటూ కాకుండా చతికిలపడింది. దర్శకుడు స్లో మోషన్‌ను సృజనాత్మకంగా వాడుకుని క్లిష్టమయిన షాట్‌లను అలా చూపించివుంటే ప్రేక్షకుడికి ఆట అర్ధమయ్యేది. కానీ, క్లిష్టమయిన షాట్‌లే లేకుండా గెలిచేస్తుంది సైనా సినిమాలో. ముఖ్యంగా నంబర్ వన్ అయ్యేందుకు గంటపైగా జరిగిన పోటీని చిత్రీకరించిన తీరు సాధారణంగా వుంది. గెలుపునిచ్చిన చివరి పాయింట్ ఆట తెలియనివారికి వివరించాల్సివస్తుంది. దర్శకుడు సినిమాకు ఫోకస్ నిర్ణయించటంలో విఫలమవటంతో ఒక చక్కని దర్శనానుభవంలా ఎగదాల్సిన సినిమా మామూలు సినిమాగా మిగిలిపోయింది.

నటన విషయానికి వస్తే , సైనా తల్లిగా మేఘ్నా మాలిక్ నటన ఉత్సాహంగా వుంది. ఈ సినిమాలో కాస్తయినా జీవం వున్నదీమెకే. పుల్లెల గోపీచంద్ బదులుగా రాజన్ అన్న కోచ్‌గా మానవ్ కౌల్ గౌరవప్రదంగా నటించాడు. మిగతా ఎవ్వరూ రిజిస్టర్ కారు. సైనాగా పరిణీతి చోప్రా అస్సలు సరిపోలేదు. సైనాను అనుకరించాలని ప్రయత్నించినా బలహీనమైన స్క్రిప్ట్ , సైనాను అస్సలు పోలని రూపం ఆమె నటనను బలహీన పరిస్తే, ఆమెకు బాడ్మింటన్ అస్సలు రాదని కోర్ట్‌లో ఆమె కదలికలు నిరూపిస్తాయి. ముఖం కోపంగా పెట్టటం, ఏడుపు ముఖం పెట్టటమే అత్యద్భుమయిన నటన అనుకుంటే తప్ప ఆమె నటనను మెచ్చటం కష్టం. కానీ, నిజాయితీగా సైనాలా నటించాలని ప్రయత్నించినందుకు అభినందించాలి.

ఇలాంటి సినిమాల్లో నేపథ్య సంగీతం, పాటలు సినిమా వ్యాపార విలువను పెంచేందుకు, ఉత్కంఠను పెంచేందుకు ఉపయోగపడతాయి. కానీ, సైనాలో సంగీతం కానీ, పాటలు కానీ, ఏమాత్రం ఆకర్షణీయంగాలేవు. నిజానికి వింటున్నప్పుడే ఎక్కవు పాటలు. నేపథ్య సంగీతాన్ని పట్టించుకోము. అయితే, పిల్లలతో ఒక్కసారి తప్పకుండా చూడాల్సిన సినిమా సైనా. కనీసం పిల్లల దృష్టి ఆటవైపు కాస్సేపయినా మళ్ళుతుంది. ఈ సినిమా చూసిన తరువాత త్వరలో మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తయారవుతున్న షభాష్ మిథూ, విశ్వనాథన్ ఆనంద్ జీవితం ఆధారంగా తయారయ్యే సినిమాలను తలచుకుంటే ఎలావుంటాయో అన్న భయం వేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here