[dropcap]స[/dropcap]కల వేదాల సారం, అందరి మహనీయుల ప్రవచనా సారంశం ఒక్కటే. ‘మానవుడు తన దేహం, బుద్ధి, మనసు, అహంకారం కాదు. ఆతని సత్య రూపం నామ రూపాలు లేని పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం త్రిగుణ రహితమైనది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రవచించినట్లు శస్త్రముల చేత ఛేదింపజాలనిది, నీటితో తడుపజాలనిది, జనన మరణముల కతీతమైనది’. కాని ఈ సత్యం ఏ ఒక్క సాధకుడికీ అనుభవంలో లేదు.
అందుకు కారణం అజ్ఞానము, అహంకారములు అనే మత్తు అతనిని కప్పేసాయి. మత్తు పానీయములు సేవించిన వారు మత్తులో వుండగా ఏమి చేస్తారో వారికే తెలియనట్లు, మానవుడు ఈ అజ్ఞాన, అహంకారములనే మత్తులో మునిగి వునప్పుడు తనేమి చేస్తున్నాడో తెలుసుకోలేడు. ఒక సమర్థుడైన సద్గురువు దివ్యానుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన సాధకుడు ఈ మాయ, మత్తుల నుండి విడిపడ్డాక తన గత ప్రవర్తనను చూసుకొని ఆశ్చర్యపోతాడు. ఇంతటి మూర్ఖంగా ఎందుకు ప్రవర్తించానా అని నివ్వెరపోతాడు. ఫ్రస్తుత కాలంలో మనవులకు వివిధ రకములైన సమస్యలు రావడానికి కారణం అహంకారం అనే పొర వారి మనసులను కప్పివేయడమే.
ఆ త్రిమూర్తులను సైతం పట్టి పీడించే ఆ మాయా శక్తికి ఒక రూపం అహంకారం లేదా వ్యక్తిత్వం. నేను ఒక అధికారిని, నా క్రింద ఇన్ని వందల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. నాకు ఇంతటి అధికారం, పలుకుబడి, హోదా, పదవి వుంది, నాకు ఇన్ని లక్షలు విలువ జేసే ఆస్తిపాస్తులు వున్నాయి, నేను ఫలనా ఉన్నత కులంలో పుట్టాను, నేను ఇన్ని గొప్ప చదువులను చదివాను అని మిడిసిపడడమే అహంకారం. ఈ అహంకారం మానవులలో ఎన్నో పొరలలో వుండి వారి యొక్క సహజస్వరూపమైన ఆనంద తత్వాన్ని కప్పేసి, అనుక్షణం ఎన్నో రకాలుగా హింసకు గురి చేస్తుంది. ఈ కలియుగంలో ఎందరో తాము ఆత్మ సాక్షాత్కారం పొందిన వారమని, సకల విద్యా పారంగతులమని ప్రచారం చేసుకుంటూ, గురువులుగా చెలామణీ అవుతుంటారని పరాశర మహర్షి ద్వాపర యుగంలోనే సాధకులను హెచ్చరించారు. తనను గురువుగా ప్రకటించుకోవడం కూడా ఒక విధమైన అహంకారమే. సద్గురువు దివ్యాశ్సీసులతో ఆ అహంకారాన్ని సమూలంగా నాశనం చేసుకొని అహం బ్రహస్మి అన్న అనుభూతిని పొందడమే ఆధ్యాత్మికత అంటే.
మానవులను అనుక్షణం చిత్రహింసలకు గురి చేసే ఈ అహంకారాన్ని తొలగించుకోవాలంటే మనము ఏమి చెయ్యాలో కలియుగ దైవం, సమర్థ సద్గురువు అయిన శ్రీ సాయినాథులు తన భక్తులకు అపూర్వమైన రీతిలో తెలిపారు “నీవు, నేను అన్న భావనే గురు శిష్యుల మధ్య వుండే ఈ గోడ. దీనిని కూల్చితే గాని ఇదరి మధ్య ఏకత్వం ఏర్పడజాలదు. నేను ఈ శరీరాన్ని గాని, మనస్సును గానీ కాదు. నేను సాక్షాత్ పరబ్రహ్మాన్ని అన్న అనుభూతిని సాధించి అహంకారాన్ని విడిచి పెడితే గాని మనిషికి ముక్తి లభించదు. వెలుగు వున్న చోట చీకటి వుండనట్లు, బ్రహ్మత్వం ఉన్న చోట అహంకారం వుండదు.”
అహంకారమును నాశనం చేసుకునేందుకు ముందుగా ఒక సర్వ సమర్థుడైన గురువును ఆశ్రయించాలి. అటు తర్వాత, శరీరం, మనసు, బుద్ధి, అభిరుచులు, ఆశయాలను, ఒక్క మాటలో చెప్పాలంటే మనలను సంపూర్ణంగా ఆ సద్గురువు పాదాలకు సమర్పించుకొని సర్వస్య శరణాగతి చెయ్యాలి. శ్రీ సాయి ప్రవచించినట్లు సుఖదుఃఖాలు, కష్టనష్టాలు, పూర్వ జన్మ ప్రారబ్దానుసారమే వస్తాయి. ప్రతీ మనిషి జీవితంలో చీకటి వెలుగుల వలే ద్వంద్వాలు రావడం అతి సహజం. ఈ సత్యాన్ని అవగతం చేసుకొని, సుఖ దుఃఖాలకు లోను కాకుండా, ఏది జరిగినా మన మంచికేనని భావించి, ఇచ్చేది పుచ్చుకునేది ఆ భగవంతుడేనన్న ప్రసాద భావంతో జీవిస్తూ, సదా ఆ పరమాత్మకు కృతజ్ఞులై వుండి , తమ భారమంతటినీ ఆ సద్గురువు పాదాల వద్ద విడిస్తే జీవితంలో శాశ్వతమైన ఆనందానికి లోనై అతి త్వరగా పరమార్థం పొందుతారు.
ఈ సాధనా మార్గంలో మన సద్గురువు మనలను మన విశ్వాసం ఏపాటిదో చూదడానికి ఎన్నో పరీక్షలకు గురి చేస్తారు. ఊహించలేని కష్ట నష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ, బంధు మిత్రులతో కలహాలు, ఆస్తి నష్టం ఇటువంటివి ఒకదాని వెనుక మరొకటి వస్తాయి. ఏది జరిగినా అది సద్గురువు అనుగ్రహ ఫలమని గట్టిగా విశ్వసించి నిమిత్త మాత్రునిగా వున్న సాధకులకే అంతిమ విజయం లభిస్తుంది. గురువు అగ్ని లాంటి వారని భావించి, ఆ అగ్నిలో నీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోవాలి. గురువు ఆయుస్కాంతం వంటి వారని భావించి ఇనుము ముక్క వలే తన ప్రమేయం లేకుండానే నిస్వార్థంగా అయన పాదాలవైపు ఆకర్షింపబడాలి. సంసారంలోనే వుంటూ సంసార సుఖాలను ధర్మబద్ధంగా అనుభవిస్తూ నిరంతరం గురువు నామస్మరణ చేస్తూ, గురువు చూపిన అధ్యాత్మిక మార్గంలో అలుపెరుగని ప్రయాణం చేసే వారికే అంతిమ విజయం ప్రాప్తిస్తుంది. శ్రీ సాయి భక్తాగ్రేసరుడు అయిన హేమాద్‌పంత్ తన సాయి సచ్చరిత్రలో శ్రీ సాయినాధుని సందేశాన్ని ఏ విధంగా అందించారో చూడండి. “నువ్వు నీ అహంకారాలన్నింటినీ వదిలి పెట్టి నాకు సంపూర్ణ శరణాగతి చెయ్యి. అప్పుడు మీ అజ్ఞానం సమూలంగా నాశనమౌతుంది. అజ్ఞాన అహంకార రహితులై ఎవరు ప్రవర్తిస్తారో వారిపై నా అనుగ్రహం శ్రీఘ్రంగా వర్షిస్తుంది. అప్పుడు అటువంటి భక్తుల హృదయంలో నేను సదా నివసిస్తాను. వారిని చివరి కంటా గమ్యం చేర్చి వారి ఋణం తీర్చుకుంటాను”.
సర్వేజనా సుఖినోభవంతు.
సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు.