[box type=’note’ fontsize=’16’] ఉగాది 2022 సందర్భంగా సంచిక నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథ. [/box]
[dropcap]“ఏం[/dropcap]టీ కంప్లైంట్..” యథాలాపంగానే పేపర్ పెన్ను తీసాడు..
“రేపు సేసిండు”
“రేపా, ఎల్లుండా? విసిగించక కంప్లైంట్ చెప్పవమ్మా!”
“ఆడు నన్ను రేపు సేసిండు… ఓటీ, రెండూ కాదు… 300సార్లు చేసిండు.”
ఉలిక్కి పడినంత పనిచేసి తలెత్తి చూసాడు యస్.ఐ. పంచానన అగర్వాల్.
ఓ బిచ్చగత్తె, చింపిరిజుట్టు, చిరిగిన గుడ్డలు. బట్టలనిండా అట్టలు కట్టిన నెత్తురు మరకలు, లోతుకుపోయిన కళ్ళు,నల్లగా ముడతలు పడిన ముఖం…
‘ఇంత వికృత మైన రూపాన్ని కూడా ఆశించాడు, వాడెంత నికృష్టుడో’ అనుకుంటూ,
“ఎవడాడూ” అన్నాడు.
“తెల్దు, గుబురు మీసాలోడు, ఆడ ఆ సంస్థానంలో ఉంటాడంట.”
“పేరు తెలీదా! పోనీ రేప్ అంటే ఏంటో తెలుసా?”
“బలాత్కారం…. పచ్చని చేలోకి మదించిన ఎద్దు, చేను ఇష్టం లేకుండా, ఛిన్నాభిన్నం చేసి మేసేయటం… ఇంకా”… రేప్ జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు చెబుతోంది.
“చాలు ఆపు. నీ అవతారానికీ, నీ మాటలకూ పొంతన లేదూ! ఇంత తెలివైన దానివి, ఎలా అన్ని సార్లు మోసపోయావ్?”
“నాను ఆ పాడుబడ్డ కోటలోనే పడుంటా ఆడూ…..”
***
దిగ్గున మెలకువ వచ్చి… ముచ్చెమటలు పట్టిన తన ముఖాన్ని తుడుచుకున్నాడు పంచానన అగర్వాల్.
ఇదేం కల… లేచి ముఖం కడుక్కుని, అద్దంలో చూసుకుని… ఎ.సి.ని పెంచి, మళ్ళీ పడుకుని, కలను నెమరువేసుకున్నాడు. ఈ కల ఎందుకు వచ్చింది. ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయాడు, పంచానన.
పోలీస్ సర్వీస్‌లో ఎన్నో ఊళ్ళు తిరుగుతూ ఈ చారిత్రాత్మకమైన ఈ ఊరు వచ్చి, మూడు రోజులయింది. ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. భార్యా పిల్లలను ఇంకా తీసుకురాలా.
***
“ఏంటీ కంప్లైంట్?”
“రేపు చేసిండు”
కలలో తను విన్న అదే గొంతు. చివాలున తలెత్తి చూసాడతను. అదే మనిషి, అదే రూపం… స్టేషన్‌లో తన ముందు.
గుఢ్లు తేలేసి, “ఏయ్ ఫోర్నాట్ టూ.. ఆమె గోలేంటో చూడయ్యా” అన్నాడు, పంచానన.
“ఎవరి గోల సార్” ఎంతో వినయంగా అడిగాడు కానిస్టేబుల్.
“అదిగో కనిపించట్లేదా!? చింపిరి, దెయ్యం లాంటి ఆడమనిషి”
“ఇక్కడ ఎవరూ లేరుగా సార్”
“ఏయ్ అమ్మాయ్! మా కానిస్టేబుల్‌కి చెప్పి కంప్లైంట్ రాయించు” అని అటు చూసి వేళ్ళు చూపించాడు పంచానన.
“సార్! ఎవరితో మాట్లడతున్నారూ?! గాలిలో చేతులు ఊపుతూ, మీలో మీరే మాట్లాడుకుంటున్నారేం” ఇంకో కానిస్టేబుల్ అడిగాడు.
“అదేంటి? ఎదురుగా అంత స్పష్టంగా, వినబడి కనబడుతుంటే” ఆశ్చర్యపోతూ అరిచాడు, పంచానన.
అరుపుకి బయటి కానిస్టేబుల్స్ కూడా పరుగున లోపలికి వచ్చారు కానీ, అందరి ముఖాలలోనూ, అక్కడ ఇంకో ఆడమనిషెవరూ లేరనే ఫీలింగే కనబడి పంచాననకి ముచ్చెమటలు పోసాయ్.
ఆ దెయ్యం ఆడమనిషి “నేను సెప్పింది ఆబద్దం కాదని, మీరు ఊరిచివర, కోటకి వస్తే చూపిత్తా” అంటూ వెళ్ళిపోయింది.
సింహపురం రాజావారి కోట ఊరికి దూరంగా ఉంది. అందులో దయ్యాలుంటాయని పుకారు లేచి.. అటుగా పగలుకూడా ఎవరూ వెళ్ళరు.
తను భ్రమ పడ్డానేమో అనుకుని, మౌనంగా ఉన్నాడు. కానీ వారం రోజులనుండీ అదే కల, స్టేషన్ కి వస్తే అదే దయ్యం రూపం. అదే కంప్లైంట్ కలవర పెట్టేస్తున్నాయ్.
తన క్రింది ఉద్యోగుల ముందు చులకన ఔతాననీ మెదలకుండా తన పని తను చూసుకుంటున్నాడు, కానీ ఆ అమ్మాయి తనకే ఎందుకు కనిపిస్తోందీ? ఓసారి అక్కడికి వెళ్ళి చూస్తే…..
ఆదివారం సెలవు రోజు… సహజంగానే చారిత్రక కట్టడాలమీద ఆసక్తి గల పంచానన ఆగర్వాల్… కాళ్ళు అటువైపు లాగేసినాయ్.
అడవిలా ఉన్న ఆ ప్రాంతమంతా.. పట్టపగలు కూడా జీబురుమంటూ ఎంత ధైర్యవంతునికైనా భయం గొల్పేటట్లు ఉంది. చెట్లూ, తుప్పలూ దాటుకుంటూ కోట గేటు దగ్గరకి వచ్చాడు. ఎంతో బలమైన, ఎత్తైన, గేటు. తాళం కూడా లేదు.
ఇంత పెద్ద రాజసౌధం, జులాయిలకూ, ఆకతాయిలకూ ఆలవాలమై పోయిందా? గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుంటే, ఇందులో ఎన్ని ప్రభుత్వ సంస్థలు నడపవచ్చునో?! అనుకున్నాడుగానీ, తన సంకల్పానికి తానే కర్తృత్వం వహించాల్సి వస్తుందని ఆ క్షణంలో అతడు ఊహించలేకపోయాడు.
పెద్ద బురుజులున్న కోట తలుపులు తోసుకుని లోపలికి అడుగుపెట్టగానే గబ్బిలాల వాసన గుప్పుమంది. బూజు, దుమ్మూ దులుపుకుంటూ, సభామంటపంలో అడుగుపెట్టి, నిలబడి చుట్టూ చూసాడు. మసక వెలుతురులో అస్పష్ట వస్తువులు కనిపిస్తున్నాయ్.
దగ్గరకెళ్ళి పరిశీలిస్తున్నాడు. రెండు గదులు దాటాక బల్లపై మాసిపోయిన పేపర్లకట్ల దుమ్మూ, ధూళితో, కనిపించింది. దానిమీద చేయివేసి, దులిపి పై పేపర్ తీసాడు. పాతది. రంగుమారింది.. దానిమీద ఎవరిదో ఫొటో… సెల్ ఓపెన్ చేసి, లైట్ వెలుగులో చూసి, ఉలిక్కిపడ్డాడు.
ఆ పేపర్లో తన ఫొటోనే… వసంత జైశ్వాల్ నిర్యాణము…. భయంతో పేపర్ వదిలేసాడు. లైట్ కాంతికి గబ్బిలాలు, ఎగిరినాయ్.
సెల్ లైట్ కాంతి లోనే రెండు గదులకవతలకి నడిచాడు. జనసంచారమే లేని నిశ్శబ్దం భయం గొల్పుతోంది. ఎదురుగా దృశ్యం చూసి మ్రాన్పడి పోయాడు.
నిలువెత్తున కాళీవిగ్రహం…. ఎవరు పెట్టారో. దీపం వెలుగులో గోళీల్లాండి కళ్ళు మెరుస్తుండగా, నాలుక చాచి, ఓ చేతిలో పుర్రెతో, ఓ చేతిలో శూలంతో….
దగ్గరకు వెళ్ళాడు. సర్రుమనే శబ్దంతో, నల్లత్రాచు బుస్సున లేచి, పడగవిప్పి, అతనిలో కదలిక కనబడక పోసేసరికి, పాక్కుంటూ పోయింది. అక్కడి బొట్టుతీసి పెట్టుకున్నాడో లేదో వికటమైన నవ్వు వినబడి, వెనుదిరిగి చూసాడు.
ఆ చింపిరి దెయ్యం ఆడమనిషి అక్కడ నిలబడి ఉన్నది.
“వచ్చావా? రావనుకున్నా!” అంది.
“నిన్నెవరో ఏదో చేసారన్నావ్. ఇక్కడ ఎవరూ కనబడటల్లేదూ!” అన్నాడు.
“వచ్చావుగా! ఇక చూపిస్తా… జన్మజన్మల పాపాన్నీ కక్కిస్తా” అంటూ పక్కనే ఉన్న కత్తి తీసి.. మీది కురికింది.
ఏం జరుగుతోందో అర్థమవటానికి క్షణకాలం మాత్రమే పట్టింది. ద్వారంవైపు దూకి బయటికి పరుగెత్తి.. వెనుదిరిగి చూస్తే ఆమె లేదు. వెనక్కి చూస్తూ వగరుస్తూ…. పరుగెత్తుతూ…ఎవరినో ఢీ కొట్టాడు.
ఇక్కడ మనుష్యులా!? అనుకుంటూ పరిశీలనగా చూసాడు. ఎవరో సన్యాసి. జడలుకట్టిన జుట్టు, కాషాయవస్త్రం, నుదుట విభూతిలాంటి చిక్కని బూడిద.
చింతచిప్పులాంటి కళ్ళతో నిప్పులు కురిపిస్తూ, “నీచుడా! మళ్ళీ వచ్చావా?” అన్నాడు.
పంచానన ఆగర్వాల్ ఆగి అతని ముఖంలోకి చూసాడు.
ఆ సన్యాసి పంచాననను తేరిపార చూసి, “ఆ పిశాచి నిన్ను చంపకుండా వదిలిందంటే నీ నుదుటన నువ్వు పెట్టుకున్న ఆ బొట్టే కారణం.” అన్నాడు.
పంచానన “ఎవరు మీరు? ఏం జరుగుతోందిక్కడ?” పోలీస్ ఆఫీసర్ హోదాలో అడిగాడు.
“తెలుసుకోవాలనుందా? అటు చూడు..” అని గాలిలోకి విభూతి విసిరాడు.
అందులో గుబురు మీసాల ఆజానబాహుడు… స్ఫురద్రూపి నడిచి వస్తూ కనిపించాడు.. అచ్చం తనలాగే ఉండటం చూసి పంచానన ఆగర్వాల్.. దిమ్మెరపోయాడు.
“నేను… నేను… ఇక్కడ ఎలా?” అన్నాడు.
“అది ఇప్పటినువ్వు కాదు.. దాదాపు వంద సంవత్సరాల క్రితం… సింహపురం సంస్థానాధిపతి.. వసంత జైస్వాల్… జల్సారాయుడు. స్త్రీ లోలుడు. సంస్థానం వదిలి, కొన్నాళ్ళు ఎటో పోయేవాడు. వచ్చేటప్పుడు సరుకుల లాగా ఆడపిల్లను తెచ్చేవాడు. వారితో నెల రోజులు మాత్రమే గడిపేవాడు. తర్వాత ఆమె ఏమయ్యేదో తెలీదు. మళ్ళీ ఇంకో అమ్మాయి. పెళ్ళి మాత్రం చేసుకోడు. ఇలా ఎంతో మంది ఆడపిల్లలు కొంతమంది డబ్బుకోసం, కొంతమంది బలవంతంగా ఇతడి కామానికి బలయ్యారు. అలాగే చంద్రగిరి కోటను ఆక్రమించి… ఆ సంస్థానాధీశుని కూతురు ప్రియంవదను తీసుకువచ్చాడు. ఆమె మహా సౌందర్య రాశి. మెుదట ప్రతిఘటించినా లొంగిపోయింది. పెళ్ళి చేసుకోమని అడిగింది. పెళ్ళీ గిళ్ళీ తనవల్ల కాదన్నాడు.ముఖం చాటేసాడు. పట్టుపట్టింది. నిరాహారదీక్ష చేసింది. ఈ అరాచకం దివాణం లోనూ, ఊరూవాడా అంతా గుప్పుమంది. కానీ జైస్వాల్‌కి భయపడి ఎవరూ మాట్లాడలేదు.
ప్రియంవద పడిన బాధ, చేసిన గొడవ అంతా ఇంతా కాదు. కానీ జైస్వాల్ దిగిరాలేదు. అందరికీ తెలిసేటట్లుగానే, అగ్నిరాజేసి.. దాంట్లో దూకేసి ఆత్మహత్య చేసుకున్నది. చేసుకునేటప్పుడు ‘రేయ్! చచ్చిదయ్యమయినా నీ మీద పగ సాధిస్తా…’ అని ప్రతిఙ్ఞ చేసింది.”
“ఎంతమంది ఉసురుపోసుకున్నాడో!…కానరాని జబ్బుతో చనిపోయాడు. ఆ వార్త అప్పుడప్పుడే కొత్తగావస్తున్న పత్రికలో ప్రచురణ ఐంది. అది చదివి అందరూ పండగ చేసుకున్నారు.”
“ఇప్పుడు నీకు కనబడింది ఆమె ఆత్మే. ఒకే పోలికలో ఉన్న మనుషులు ఉండవచ్చు కానీ…. నీ వెనుక పడిందంటే నువ్వేనని గుర్తుపట్టేసిందన్నమాట.” అంటూ ఆపాడు.
నిలువెత్తు పంచానన అగర్వాల్ కుప్పకూలిపోయి చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తున్నాడు.. “నాకు ఇంత నీచమైన జన్మపరంపర ఉందా? ఓ గాడ్! ఇంత పాపానికి పరిహారం లేదా? హయ్యో ఇప్పుడు నేనేం చేయాలి?”అన్నాడు.
“ప్రియంవదను పెళ్ళి చేసుకోవాలి” అన్నాడు….సన్యాసి.
ఉలిక్కిపడి.. ఏడుపు ఆపి.. లేచి నుంచుని..
“న్నో… నేను పోలీసు ఆఫీసర్‌గా ఎంత సిన్సియరో, భర్తగానూ… అంతే…ఇద్దరు పిల్లలు కూడా… కానీ మీరెవరూ? ఇక్కడేం చేస్తున్నారు ?ఈ కథ మీకెలా తెలుసూ” అని అడిగాడు.
“నేనో భూతవైద్యుణ్ణి, హిమాలయాల్లో అఘోరాల దగ్గర, ఎన్నో మెళుకువలు నేర్చుకుని, దేశమంతా తిరుగుతూ, ఇక్కడికివచ్చి, ఇక్కడ ఏదో విషయం కనబడి ఆరునెలల క్రితం నుండీ ఇక్కడే ఉన్నాను. ఈరోజు నువ్వు కనిపించావ్…”
“ఓ భూతానికీ, మనిషికీ ఎక్కడా సంయోగం కుదరదు. కానీ బ్రతికి బయటపడాలంటే, ప్రియంవదను పెళ్ళి చేసుకున్నట్లుగా నైనా నమ్మించి, వదిలించుకోకపోతే, నిన్ను ఇక్కడ చూసింది కాబట్టి, నువ్వు ఎక్కడున్నా వదలదు.”
“మరి నేనేం చేయాలి?”
“వెనక్కి కోటలోకి వెళ్ళి.. కాళిక ముందు నిలబడి ‘ప్రియంవదా! రేపు ఇదే సమయానికి నిన్ను పెళ్ళి చేసుకుంటాను..’ అని గాలిలో చెప్పి వచ్చేయ్.. మిగతాది నేను చూసుకుంటాను.. నిన్ను నేను రక్షిస్తాను. వెళ్ళు” అన్నాడు సన్యాసి.
“ఎలా? ఊళ్ళో ఎవరికీ తెలియకుండా ఇక్కడ ఇంత సాహసం సాధ్యమా?”
“ఊళ్ళో నాకు చాలా మంది శిష్యులున్నారు. అల్లరి కాకుండానే పని జరిపిద్దాం” అని హామీ ఇచ్చాడు.
పంచానన లోపలికి వెళ్ళి… కాళీమాత విగ్రహం దగ్గర నిలబడి…”ప్రియంవదా! రేపు నిన్ను ఇదే చోట పెళ్ళి చేసుకుంటాను!” అని అరిచాడు. బయటికి వచ్చేసి, తనుండే ఇంటికి వచ్చేసాడు.
కానీ ఆరోజే ఊరువిడిచి పారిపోవాలను కున్నాడు. అన్నీ సర్దేసాడు.
డోర్ తీస్తే రాలా. అన్ని తలుపులూ లాక్ ఐపోయి ఇంట్లోనే బందీ అయ్యాడు. సెల్ ఫోన్‌లో నెంబర్స్ డయల్స్ ఏవీ సిగ్నల్స్ లేక చతికిలపడ్డాయ్. వికటాట్టహాసం చెవులల్లో ప్రతిధ్వనించింది.
“నువ్వు ఎటూ పోలేవ్, వెళ్ళినా ఇక్కడికే తెస్తా! ఇన్నాళ్ళు నీ కోసమే చూస్తున్నా..” అని.
“నేను ట్రాన్స్‌ఫర్‌పై ఇక్కడికి రాకపోతే ఏం చేసేదానివీ?”
“చచ్చినట్టు వస్తావ్.. నీ ఖర్మ ఫలం లాక్కువస్తుంది” ఓ ఆడగొంతు గొంతు చించుకు అరిచింది.
తెల్లవారి… స్టేషన్‌కి వెళ్ళి సంతకం చేసి, రైడింగ్ పేరుతో కోటకు వెళ్ళాడు.
సన్యాసి రెడీగా ఉన్నాడు. లోపల కాళిక ముందు అగ్నిగుండం రెడీ చేసాడు. నుదుటిబొట్టు పెట్టి “ఎట్టి పరిస్థితులలోనూ ఆ బొట్టు చెరపకు!” అని చెప్పి, దూరంగా నిలబడి మంత్రం చదివి ప్రియంవదను ఆవాహన చేసాడు.
ఎంతో సౌందర్య దేవతగా వచ్చింది ప్రియంవద. ఆమె అందం చూసి ముగ్ధుడైపోయి.. రెప్పవేయకుండా చూస్తుండిపోయాడు. కానీ ఎంత సౌందర్య రాశి ఐనా, తను ప్రేతాత్మ… తను వివాహితుడు….
కాళీ సాక్షిగా ఆమె మెళ్ళో తాళికట్టాడు. అగ్నిచుట్టూ ప్రదక్షిణం చేసారు. ఇంతలో అగ్ని లోంచి జ్వాల ఆగిపోయి పొగ రావటం మెుదలయింది. కళ్ళల్లోకి, పోయి, గాలి ఆడక ఉక్క మెుదలయింది. తట్టుకోలేక పంచానన పక్కనే ఉన్న వాటర్ బోటిల్ లోని నీరు ముఖంమీద జల్లుకుని, కడుక్కున్నాడు
అంతే… ప్రియంవద… తను మెుదట చూసిన బిచ్చగత్తెగా మారిపోయి, “పదపోదాం” అంది.
పంచానన ఆగర్వాల్ “ఎక్కడికీ” అన్నాడు ఆశ్చర్యంగా.
“మనం భార్యాభర్తలం కదా! శృంగార యాత్రకి” అంటూ గుండెలమీద ఒక్క చరుపు చరిచింది.
ఆ దెయ్యం పిడికిలి దెబ్బకు… వెనక్కి కాళీ విగ్రహం పాదాలవద్ద పడ్డాడు.
సన్యాసి పరుగున ఏదో మంత్రం చదువుతూ వచ్చాడు. ఏ అవకాశమూ సన్యాసికి ఇవ్వకుండానే, మళ్ళీ నిప్పు రాజేసి, ఏ జ్వాలలో ఐతే తను ఆహుతి అయిందో, అదే ప్రాజ్వల్యమానమైన మంటలో పంచానను పడేసి. తనూ మాయమైంది.
ఇదంతా చూస్తున్న సన్యాసి, పంచానను కాపాడలేక మూర్ఛపడిపోయాడు.
మళ్లీ కళ్ళు తెరిచి చూసేసరికి… ఊళ్ళోని పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు,అతడే పంచాననని ఏదో చేసాడనే నేరం మీద.
మర్నాటి పేపర్లో ‘కోటలో దయ్యాల పీడ వదిలించడానికి, జీవితాన్నే పణంగా పెట్టిన త్యాగధనుడు పంచానన ఆగర్వాల్’ వార్త సంచలనమయింది.
***
‘పంచానన ఆయుర్వేదపంచకర్మ హాస్పటల్’
‘అగర్వాల్స్ గవర్నమెంట్ హాస్పటల్’
‘పంచానన ఆగర్వాల్…పోలీస్ స్టేషన్’
సింహపురం సంస్థానం గవర్నమెంట్ పరమై దానిలో, పంచానన ఆగర్వాల్ పేరుమీద అన్ని ప్రభుత్వరంగ సంస్థలూ, స్థాపించబడి నేటికి, పది సంవత్సరాలు. వార్షికోత్సవ సందర్భంగా, నిలువెత్తు పంచానన కాంస్యవిగ్రహాన్ని పూలమాలలతో ముంచెత్తారు ప్రజలంతా. పంచానన త్యాగపురుషుడై ఈరోజు ఇక్కడ పూజలందుకున్నాడు.
కానీ పాపపుణ్యాల చిట్టా, ప్రకృతి ఎన్ని జన్మలెత్తినా, మరిచిపోదనే సాక్షీభూతంగా కాళిక అక్కడే కొలువై చూస్తోంది. మతి భ్రమించిన ఓ సన్యాసి అమ్మ పాదాల చెంతనే ఎప్పుడూ ఉంటాడు.
కానీ అతనెవరో ఎవరికీ తెలీదు. అతను చెప్పలేడు. పంచానన భార్యాబిడ్డలు ఏమై పోయారో ఎవరూ పట్టించుకోలేదు.