[box type=’note’ fontsize=’16’] “మొత్తం మీద వొక మంచి అనుభూతిని, తృప్తిని ఇస్తుంది ఈ చిత్రం” అంటున్నారు పరేష్. ఎన్ దోషి “సాల్ట్ బ్రిజ్” సినిమాని సమీక్షిస్తూ. [/box]
“…యెందుకో తెలిస్తే అవ్వాక్కవుతారు” ఇలాంటి వీడియోలు మనకు చాలానే యెదురవుతూ వుంటాయి. ఒక రకమైన కుతూహలం కొద్దీ వాటిని చూసి నిరాశ పడతాము. అసలు ఈ మానసిక అవస్థ యేమిటి? మనకు యేం కావాలి? మనకు ఇలాంటివే వడ్డిస్తూ వుంటే, మనలో నశించని ఆ ఆసక్తి యెందుకు? ఇలాంటి సూక్ష్మ విషయాల గురించి అంతర్ముఖంగా చూసుకునే వీలు కల్పిస్తుంది ఈ చిత్రం.
రొమాంటిక్ ప్రేమ తప్ప వేరే కథలతో సినెమాలు తక్కువే వస్తాయి. అలాంటి వాటిలో ఇదొకటి.
ముందు కథను క్లుప్తంగా చూద్దాం. భార్య లిపి (ఉషా జాధవ్), పదేళ్ళ కొడుకు రిజు తో బసంత్ (రాజీవ్ ఖండేల్వాల్) ఆస్త్రేలియాలోని సాల్ట్ బ్రిజ్ కు వెళ్తాడు. అక్కడ వొక లేబ్ లో రీసర్చ్ స్కాలర్ గా పని. సాల్ట్ బ్రిజ్ లో కూడా వో చిన్నపాటి భారతీయుల సమూహం వుంటుంది. స్వదేశానికి దూరంగా వుండడం కారణంగా వారు తమ దేశీయ పధ్ధతులు, సంప్రదాయాలు వగైరా కొనసాగించే ఉద్దేశంతో పండగలప్పుడు, ఇతర సందర్భాలలోనూ కలిసి సంబరం చేసుకుంటుంటారు. ఒకోసారి సాస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వుంటారు. వొక సందర్భంలో బసంత్ అంటాడు కూడా : వాస్తవానికి ఇండియా చాలా మారిపోయింది, ఇండియన్లు కూడా, వాళ్ళు గనుక స్వదేశానికి వెళ్తే ఆశ్చర్యపోవడం తప్పదు అని.
అక్కడ కారు లేకుండా వుండడం కష్టం, బస్సుల మీద ఆధార పడేట్టు వుండదు. ఆఫీసుకు వెళ్ళి రావాలంటే, కారు తప్పదు, దానికంటే ముందు డ్రైవింగ్ లైసెన్సు తప్పదు. అయితే ఇక్కడిలా కాకుండా అక్కడ డ్రైవింగ్ లైసిన్సు సాధించడం కష్టమే. కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం విషయంలో మధురిమ (చెల్సీ ప్రెస్టన్ క్రేఫోర్డ్) అన్న ఆమెతో మాట ఖరారవుతుంది. ఆమె న్యూజీలేండ్ నుంచి సాల్ట్ బ్రిజ్ కొచ్చి వుంటున్నది. భర్త భారతీయుడు. తనకు కొంచెం కొంచెం హిందీ వచ్చు. ఈ డ్రైవింగ్ కోసం కలుసుకుంటున్న క్రమంలో ఇద్దరి మధ్యా స్నేహం కుదురుతుంది. అతను కవి. తన బ్లాగులో హిందీ కవితలు ప్రచురిస్తూ వుంటాడు. ఆమె అతని బ్లాగులో ఆంగ్లంలో వున్నంత మట్టుకు చదివి, అతని పట్ల ఆసక్తి కనబరుస్తుంది. తనకి హింది వచ్చినా అంతంత మాత్రం. ఆమె తన హింది మెరుగు పరచుకోవాలి అని అన్నప్పుడు, నేర్పడానికి ముందుకొస్తాడు బసంత్. సినెమా మొత్తం చాలా నెమ్మదిగా, యెలాంటి తొందరా లేనట్టుగా సాగుతుంది. వాళ్ళిద్దరై మధ్య స్నేహం కూడా చాలా నెమ్మదిగా కాని బలంగా తయారవుతుంది. చిత్రం మొదటి నుంచీ బసంత్ కి వొక దృశ్యం గుర్తుకొస్తూ వుంటుంది. వొక అమ్మాయి, వొక అబ్బాయి బహుశా పది పదిహేను యేళ్ళ మధ్య వుండవచ్చు వయసు, రైలు పట్టాలకు పక్కగా పరిగెడుతూ వుంటారు. ఆమె ముందు, అతను వెనుక. అతను మనసులో అనుకుంటాడు నీకంటే ముందు నేను పరిగెట్టగలను కాని, నువ్వు వోడిపోయావని యేడుస్తావు అది నేను చూడలేను, అని. కావాలనే నెమ్మదిగా పరిగెడుతుంటాడు. మధూ అంటూ మధ్యమధ్యలో పిలుస్తూ. ఆకాశం మేఘావృతమై వుంటుంది. మొట్టమొదట్లో కేవలం వాళ్ళ కాళ్ళు, తర్వాత్తర్వాత వాళ్ళ ముఖాలు ఇలా వొక పరిణామంతో ఆ సంఘటనను మన ముందు పెడతాడు దర్శకుడు. మధురిమ గర్భం దాలుస్తుంది. భార్యా భర్తలు సంతోషిస్తారు. బసంత్, మధురిమ ల మధ్య చనువు ఆమె మరిదికి నాచ్చదు. అక్రమ సంబంధంగా భావిస్తాడు. వొక సారి బసంత్ కారు నడుపుతూ బాల్యం గుర్తుకొచ్చి మధురిమనే చూస్తూ కారు నడపడం వల్ల ప్రమాదం జరుగుతుంది. ఆమెకు స్వల్పంగా గాయాలవుతాయి. కాని అక్కడి భారతీయుల సముదాయంలో వీళ్ళ గురించే చర్చ. అక్రమ సంబంధం వుందనీ, అతను కావాలనే దురుద్దేశంతో ఏక్సిడెంటు చేశాడనీను. వో రోజు మధురిమ మరిది ఇంటికి వచ్చి మరీ బసంత్ ను కొట్టి వెళ్తాడు. స్కూల్ లో రిజుతో యెప్పుడూ ఆడుకునే పిల్లలు కూడా మాట్లాడటం మానేస్తారు. ఇవన్నీ లిపి ని కూడా కలవరపెడతాయి. వొకరాత్రి నిలదీస్తుంది, నువ్వెందుకు యెదురు తిరగలేదు, నీ తప్పేమీ లేదంటున్నావు కదా, ఇంత జరిగాక కూడా వాళ్ళనే సమర్థిస్తున్నట్టు యెందుకు ప్రవర్తిస్తున్నావు అని. అతను వున్న విషయం ఆమెతో చెబుతాడు. ఆ క్షణం నుంచి ఆమె అతనికి మరింత చేరువ అయి అతన్ని అన్నివిధాలా సపోర్ట్ చేస్తుంది. ఈ చిక్కు ముడి యెలా వీడుతుంది అన్నది మిగతా కథ.
దీనితో సమాంతరంగా మరో కథ. స్త్రీ పురుషులు యేకమై వో కొత్త ప్రాణాన్ని సృష్టించినప్పుడు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించిన mitochondria నుంచే బిడ్డకు అవసరమైన శక్తి వస్తుంది. యెందుకంటే వాస్తవానికి మైటోకాండ్రియానే వొక పవర్ హౌస్. మరి తండ్రి నుంచి సంక్రమించిన మైటోకాండ్రియా మాత్రం మాయమైపోతుంది. యెందుకలా? అదేమన్నా బిడ్డ కోసం తండ్రి చేసిన త్యాగంగా భావించవచ్చా? ఈ విషయాల మీద బసంత్ నిరంతరం ఆలోచిస్తూ వుంటాడు. ఇది కొంత బసంత్ స్వభావాన్ని కూడా అర్థం చేసుకోవడంలో సాయపడుతుంది. తను పని చేసే లేబ్ లో కూడా అన్నీ సౌకర్యాలు అనుకూలంగా వుండడం చేత అక్కడ ఇదే రీసర్చ్ పనిలో మునిగితేలుతూ వుంటాడు. అది తెలిసిన తర్వాత అతన్ని ఉద్యోగంలోంచి తీసేస్తారు, యెందుకంటే అతనికి జీతం ఇస్తున్నది వొకందుకు, తనేమో తన సొంత ఏజెండా పెట్టుకుని ఇలాంటి రీసర్చులు చేస్తున్నాడు.
యెంత స్లోగా వున్నా ఆసక్తికరంగానే వుంది ఈ చిత్రం. దర్శకుడు అభిజిత్ దేవ్‌నాథ్ సంగీతం కూడా సమకూర్చాడు. ఇతను ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటిలో విజిటింగ్ ఫేకల్టి. కొన్నాళ్ళు బేంకింగ్ రంగంలో పని చేశాడు. సైన్సులో రీసర్చ్ ఇతనికి ఇష్టం. స్వతహాగా వొక జియాలజిస్టు. ఈ చిత్రం అతని తొలి చిత్రం. తన తొలిచిత్రం స్క్రిప్టునే మార్గరెట్ హెరిక్ లైబ్రరి ఆఫ్ అకాడమిలో భద్రపరిచారు. అలాగే ఇందులోని యేడు పాటలను అకాదమీ అవార్డులకు నామినేట్ చేశారు. పాటలూ, గజళ్ళూ వ్రాసింది కూడా దర్శకుడే.
బసంత్ చెప్పే కవితలు కూడా. సాహిత్య స్థాయి గాని సంగీత స్థాయి గాని చూసుకుంటే చాలా మంచి పాటలనే చెప్పాలి. కథకు మంచి గోడచేర్పు. ఇక మిగ్వెల్ గల్లఘెర్ చాయాగ్రహణం అందంగా వుండడమే కాకుండా ఆస్ట్రేలియా అందాలను మన ముందు పెట్టి కనువిందు చేయిస్తుంది. విసిరేసినట్టున్న అక్కడి ఇళ్ళు, అక్కడి పచ్చదనాలు, ఆ అందాలన్నీ కూడా సమాంతరంగా వొక సంభాషణను మనతో నిరంతరాయంగా చివరిదాకా నెరపుతూనే వుంటాయి. ఉద్దేశ్యపూర్వకంగా. బాహ్య ప్రకృతి ఆంతరిక ప్రకృతి తో అభేద్యంగా కదా వుండాల్సింది. మనకున్న మంచి నటులలో రాజీవ్ ఖండేల్వాల్ వొకడు. ఇందులో అతని నటన యెప్పటిలానే చాలా బాగుంది. (ఆమిర్ గుర్తుందా?) ఉషా జాధవ్, చెల్సీల నటన కూడా బాగుంది.
మొత్తం మీద వొక మంచి అనుభూతిని, తృప్తిని ఇస్తుంది ఈ చిత్రం.