సమాజం!

0
2

[dropcap]స[/dropcap]హారా ఎడారిలో మండుటెండలో
కాళ్ళకి సంకెళ్లు వేసి నన్ను లాక్కెళుతున్నారు

చెమట ఓడ్చి ఓడ్చి దానికే చెమటొచ్చినట్టుంది
చేతులు రెండూ ఇనప సంకెళ్ళకి అటూ ఇటూ కట్టి
నేను ససేమిరా అన్నా నన్ను లాక్కెళుతున్నారు

అసలు నేను చేసిన నేరం ఏంటో తెలీదు
కానీ నాకు వేసే శిక్ష మాత్రం ఊహిస్తున్నా
అందరి ముఖాలు కప్పేసి వున్నాయి
అసలు ముఖం చూపాలని పిరికి వాళ్లకి నాతో ఏం పని?

కొందరు నవ్వుతున్నారు
కొందరు గట్టిగా మాట్లాడుకుంటున్నారు
కొందరు నాపై చేసే అన్యాయం చూడలేక
కళ్ళు మూసుకుంటున్నారు
కొందరు కన్నీరు కారుస్తున్నారు

దాహంతో గొంతు ఎండుకుపోతున్న నాకు
వీరి మీద కుతూహలదాహం ఎక్కువైంది
ప్రాణం మీద మోజుకన్నా పాత్రల మైల తెలవాలన్న
దప్పిక ఎక్కువైంది

ఇంతలో జనమంతా ఆగారు
వాణ్ని ఇక్కడ వదిలేయండి తిండిలేక చస్తాడు
పెద్ద అరుపు వినిపించింది
అందరూ నోరు మూసుకున్నారు
నిశ్శబ్దం సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం
మౌనం అంగీకారం అయింది

పోయేముందు ఆఖరి కోరిక కోరుకో, సింహ గర్జన
నన్నెందుకు బంధించారు?, చిట్టి ఎలుక సవ్వడి

నువ్వు చేసిన తప్పు –
అన్య కులం లో పుట్టడం
మా మతానికి చెందకపోవడం
మా వాడివి కాకపోవడం
మా ఊరోడివి కాకపోవడం
మా పై పోటీ చెయ్యడం
మా ఇంటి పిల్లని చూసి నవ్వడం
నీ రంగు వేరుగా ఉండడం

ఇలా ప్రతి చిన్న గుంపూ ఒక్కోసారి అరిచారు
తాము చెప్పే కారణమే గొప్పదని
ప్రతి గుంపు కొట్టుకోవడం ప్రారంభించారు
తామే గొప్ప అని
అప్పుడర్ధమైంది దాని పేరు సమాజం అని
నేను అందులో ఇమడని చింత పిక్క అని

ముసుగు దొంగలు చెప్పిన సాకుల గందరగోళంలో
నేనంటే నేనే అంటూ కొట్టుకుంటున్నారు
ఇంతలో ఎవరో చిన్ని పాప వచ్చి నా సంకెళ్లు విప్పేసింది
వేయి కళ్ళు వాదులాటలో నిమగ్నం
దేవదూత దృష్టి నా విమోచనం

ఇక క్షణం ఆలోచించకుండా
ఆ ఇరుకైన సమాజంలోంచి బయటపడి
ఈ మహా ప్రపంచంలో
మరో చిన్ని జగత్తులోకి అదృశ్యం అయ్యా

చిగురు వేసే ప్రతి మొక్కా కలుపు కాదు
సాగు చేసే ప్రతి వేరూ పనికి రాదు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here