సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-1

1
2

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

అధ్యాయం-1

[dropcap]ఈ[/dropcap] ఉదయకాలం ఎంత ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంది. కిటికీలో నుండి పెరడు, అందులో వివిధ రకాల పూలమొక్కల సౌందర్యాన్ని అవలోకిస్తున్న హిమబిందు అనుకుంటోంది. మందారాలు చెట్టు నిండా విరగబూసి ఉన్నాయి. కనకాంబరాలు ఎరుపు, పసుపు రంగుల కలయికతో కనువిందు చేస్తున్నాయి. మల్లె, సన్నజాజి తీగలకి పువ్వులు విరగబూసి మంచి ముత్యాల్లా మెరుస్తున్నాయి.

ఈ పువ్వులంటే స్పూర్తికి ఎంత ఇష్టం? ‘ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, నునులేత రెమ్మనై’ అనే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటని కూనిరాగంలా పాడుతుంది. స్ఫూర్తికి ప్రకృతి అంటే ఎంత ఇష్టం?

కూతురు తలంపుకి రాగానే హిమబిందు కూతురు గది వేపు చూసింది. బారెడు పొద్దు ఎక్కినా స్ఫూర్తి ఇంకా నిద్ర లేవనేలేదు. ఇంజనీరింగు కాలేజీలో జాయనయి నెల రోజులే అయింది. “మాఁమ్! నేను కాలేజీకి వెళ్ళను. ర్యాగింగ్ నన్ను కలవరపెడుతోంది. బాధకి గురి చేస్తోంది” అని పడుకోయేముందు స్ఫూర్తి అన్న మాటలు బిందుకు గుర్తుకు వచ్చాయి.

ఇవే మాటలు ఒకానొక సమయంలో తను కూడా తన తల్లితో అంది. తల్లి తలంపుకి రాగానే ఎదురుగా దండ మధ్య ఉన్న తల్లి ఫోటో అగుపడింది. ఫోటోలో కూడా తల్లి వదనం మీద అదే గాంభీర్యం. దాని వెనుక నున్న ఆత్మవిశ్వాసం. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, అవరోధాలు ఎదుర్కుని జీవన బాటలో నడిచాను అని ఉద్బోధిస్తున్న భావన.

తల్లి తలంపుకి రాగానే బిందూ కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లాడింది. మొన్నమొన్నటి వరకూ తల్లి తమతో ఇంట్లో తిరుగుతూనే ఉన్నట్లనిపించింది. ఇప్పుడు కూడా తమ మధ్యనే ఉన్నట్లు భ్రమ.

“అందరూ యాత్రలకి వెళ్తున్నారు. నేను కూడా బద్రీ, కేదార్ వెళ్ళి వస్తాను” అని మరీ పట్టుబట్టి వెళ్ళింది. అక్కడికీ తను వద్దంది. తన మాట వింటే కదా! తన మనస్సు ఏదో కీడు శంకిస్తూనే ఉంది. అయితే తల్లి పట్టుదల ముందు తనేం అనలేకపోయింది. ఫలితం ఉప్పెనలో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకుంది.

పైకుబికి వస్తున్న కన్నీటిని పైట చెంగుతో తుడుచుకుంది. అప్పుడే అక్కడికి సిద్ధార్థ వచ్చాడు.

“ఇదే నాకు నచ్చని విషయం బిందూ. జరిగిన వాటిని పట్టుకుని ఇలా బాధపడిపోతావు. అంతా విధి లీల. విధి ఆడించిన వింత నాటకంలో మనం పాత్రలు మాత్రమే. ఆ విధే అత్తయ్య చేత యాత్ర చేయమని ఉసిగొల్పింది. దాని ఫలితమే అత్తయ్య మరణం. ఆమెను ఎలాగూ తిరిగి తీసుకురాలేము. అయితే ఇప్పుడు మన కర్తవ్యం ఆమె ఆశయాలు నెరవేర్చడం. ఆమె నడిచిన బాటలోనే మనం పయనించడం. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే ఆమె ఆత్మకి శాంతి కలుగుతుంది”.

సిద్ధార్థ బిందు భుజం మీద చేయివేసి మృదువుగా అనునయిస్తున్నట్లు రాస్తూ అన్నాడు. దుఃఖాన్ని ఆపుకోలేక అతని గుండెల్లో తలదూర్చి బోరున ఏడ్చింది బిందు. అతను ఆమెను ఓదార్చకుండా మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే గుండెల్లో గూడుకట్టుకున్న బాధంతా కన్నీటి రూపంలో బయటకు వచ్చేసిన తరువాత మనస్సంతా దూదిపింజలా తేలిక పడుతుంది అని అతని ఆలోచన.

కొంతసేపటికి బిందూ ఊరుకుంది. తిరిగి కూతురు విషయం జ్ఞప్తికి వచ్చింది. “సిద్ధూ! స్ఫూర్తి నిద్ర లేవలేదు. కాలేజీలో ర్యాగింగ్ జరుగుతోందట. దానికి బయపడి కాలేజీకి వెళ్ళనంటోంది” బిందు అంది.

సిద్ధార్థ భావోద్వేగంతో ఆలోచిస్తున్నాడు. ‘నేను ఈ పనిని చేయలేను అని అనుకుంటే మనం ఓ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నట్లు, మనకి ఈ పని చేయడం చేతకాదని లేదా మనకి ఈ పని చేయడం ఇష్టం లేదని అర్థం. కొంతమందికి కష్టపడే మనస్తత్వం ఉన్నా పరాజయం ఎదురవగానే మనం పనికిరామనే భావం వాళ్ళలో కలుగుతుంది. బలపడుతుంది కూడా. అంతేకాదు నిరాశా నిస్పృహలు ఆవరిస్తాయి. దానితో వారు లక్ష్యం నుంచి తప్పుకుంటారు. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుంటే పరాజయాన్ని సవాలుగా తీసుకుని పనిచేస్తే ఎప్పుడూ విజయం దానంతట అదే వస్తుంది.’

స్ఫూర్తి గురించి ఆలోచించకుండా తను ఇలా భావోద్వేగంతో ఆలోచిస్తున్నాడేఁటి? తన ఆలోచనలలోనే స్ఫూర్తి విషయం కూడా ఉంది. స్ఫూర్తి కూడా భయపడకుండా లక్ష్యం వేపు అడుగులు వేయాలి. ఓటమి ఎదురయినా దాన్ని సవాలుగా తీసుకోవాలి. తిరిగి అనుకున్నాడు సిద్ధార్థ.

స్పూర్తి విషయమే కాదు. ‘నేటి యువతలో కలలు కనేవాళ్ళే ఎక్కువవుతున్నారు. కలలకి, వాస్తవిక జీవితానికి చాలా తేడా ఉంటుందని తెలుసుకోలేకపోతున్నారు. తాము కన్న కలల్ని సార్థకం చేసుకునే దిశగా కృషి చేసే వాళ్ళు మాత్రం తక్కువే. దీనికి కారణం లక్ష్యం వేపు చూపించే శ్రద్ధా, ఆసక్తులు లక్ష్య సాధన వేపు చూపించడం లేదు’ – నేటి యువత గురించి సిద్ధార్థ భావన ఇది.

అంతేకాదు ఈ సృష్టిలో సాధించలేనిది ఏదీ లేదు. అయితే దానికి కావల్సింది పట్టుదల. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో పయనిస్తే ఎదురయ్యే ఆటుపోట్లకి, ఎత్తు పల్లాలకి, భీతిల్లే మనస్తత్వం మనికి లేనప్పుడు విజయ తీరాలకు చేరుకోవడం కష్ట సాధ్యమేమీ కాదు.

తనయితే పెద్దవాడు కాబట్టి ఇలా ఆలోచిస్తున్నాడు కాని పాపం చిన్న పిల్ల స్ఫూర్తికి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి. అనుభవంలో అన్నీ తెలుసుకుంటుంది స్ఫూర్తి.

అయినా తమ సమయంలో ఈ ర్యాగింగ్ అనే ప్రక్రియ ఎంత హాయిగా, మనోహరంగా వినోద భరితంగా ఉండేది? ఆ బాల్యం రోజులు, ఆ కిశోరావస్థ దాటి ప్రారంభ యవ్వనావస్థలో చేసిన చేష్టలు, విద్యాధ్యయన సమయం రోజులూ తలుచుకుంటూ ఉంటే మధురానుభూతి కలుగుతుంది.

ప్చ్..! ఇప్పటి రోజుల్లో ర్యాగింగ్ హింసాత్మక దోరణిలో సాగుతోంది. వికృతి రూపం దాల్చింది.

“శ్రీవారు ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్ళినట్టున్నారే!” చిన్నగా నవ్వుతూ అంది హిమబిందు. సిద్ధార్థ కూడా చిన్నగా నవ్వాడు.

“ఇవాళ సెలవు కాబట్టి అంత కూల్‍గా ధీమాగా ఉన్నావు సిద్ధూ! లేకపోతే ఉరుకులు, పరుగులే కదా నాకు. మొదట మీ అమ్మాయిని నిద్ర లేపి గీతోపదేశం చేయాలి. లేకపోతే నేను పడిన తిప్పలే స్ఫూర్తి పడవల్సివస్తుంది.”

“అప్పుడు నీవు అంతగా బెంబేలెత్తి పోయావా?” ఆమె వేపు తమకంగా చూస్తూ అన్నాడు అతను. అతనికి ఏఁ జవాబూ ఇయ్యకుండా వంటింటి వేపు నడిచింది బిందు.

సిద్ధార్థ పెరటిలో పూల మొక్కల మధ్య కూర్చుని చల్లగాలిని ఆస్వాదిస్తున్నాడు. అతిని మదిలో అనేక భావాలు. ఒక్కసారిగా అతని అంతరంగం గతం వేపు పరుగులు తీసింది.

అధ్యాయం-2

తెల్లగా తెల్లారింది. మబ్బు తెరలు తొలిగిపోయి ఉషాకిరణాలు గురి చూసి వదిలిన బాణంలా వసుధ వేపు దూసుకు వస్తున్నాయి. ఉదయాచల రథంపై ఎక్కిన బాలబానుడు తప్పటడుగులు వేస్తున్నట్లు నెమ్మది నెమ్మదిగా ఆ రథాన్ని తోలుకుంటూ వస్తున్నాడు.

పచ్చటి ఎండ చిక్కగా పుడమినంతా పరుచుకుని ఉంది. ఆ ఎండలో తళతళ మెరుస్తున్నాయి లతలకున్న లేలేత ఆకులు. మొక్కలు, ఆ లతలకున్న పూలపై ఆ బాల భానుని కిరణాలు పడగానే కెంపులు – వజ్రాలు రత్నాలు పగడాలు పొదిగిన నగల్లా వింత శోభనిస్తున్నాయి. గోమాత నోటి నుండి జారుతున్న తెల్లని నురుగులా భానుని కిరణాలు పుడమి వేపు దూసుకుపోతున్నాయి.

ఆ అందమైన మనోహరమైన వేళలో ఎక్కడో దూరంగా ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి పాడిన మీరా భజన శ్రావ్యంగా వినిపిస్తోంది.

“బిందూ.. బిందూ! ఇంకా తయారవలేదా? కాలేజీ బస్సు వచ్చేస్తుంది. ఇలాగయితే ఎలాగే తల్లీ” అంది ఆ తల్లి కూతురితో.

“తయారవుతున్నాను మమ్మీ! టిఫిను చేసి బస్సు ఎక్కేయడమే ఇక” అంది కూతురు హిమబిందు తల్లి ఉమాదేవితో.

“జీవితంలో మనం ఎన్నో వాటి కోసం ఎదురుచూస్తూ ఉండాలి. ఇవాళ నీవు బస్సు కోసం ఎదురు చూస్తే ముందు ముందు భవిష్యత్తులో ఎన్నో వాటి కోసం ఎదురు చూడాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం బస్సు కోసం ఎదురు చూడాలి కాని బస్సు మన కోసం ఎదురు చూడదు.

ఇకపై అన్ని విషయాల్లో నీవు ముందుండాలి. నిన్ను చూసి కన్న తల్లిగా నేను పొంగిపోవాలి. గర్వించాలి. ఈ రోజు బస్సు కోసం నిరీక్షణ చేస్తే భవిష్యత్తులో మరికొన్ని వాటి కోసం నిరీక్షించే అవకాశం రావచ్చు.”

‘ఏంటో? మమ్మీ మాటల్లో ఎప్పుడూ వేదాంత ధోరణే అగుపడ్తుంది. అయితే తన వయస్సు వాళ్ళకి ఇలాంటి వేదాంత ధోరణి మాటలు నచ్చవు. అలాంటి మాటలు వినదానికే ఎలర్జీ’ బిందు ఆలోచిస్తోంది.

“నా మాటలు నీకర్థం కావే. అర్థమయితే అప్పుడే ఆ మాటల్లో విలువ నీకు తెలుస్తుంది. మమ్మీ నగ్న సత్యం చెప్పింది అని అనుకుంటావు.”

ఇదేంటి మమ్మీ తన మనస్సులో మాట కూడా చెప్పేస్తోంది. ఏంటో మమ్మీ ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క విధంగా ఉంటుంది మాట్లాడుతుంది. ముఖ్యంగా డాడీ ప్రస్తావన తను తెచ్చినప్పుడు మూడీగా మారిపోతుంది. చాలా బాధ పడ్తుంది. ఆ రోజంతా బాధ పడ్తునే ఉంటుంది. అందుకే  తను సాధ్యమైనంత వరకూ డాడీ ప్రస్తావన తేవడం మానుకుంది.

“ఏంటే ఆ ఆలోచన్లు?”

“ఏం లేదు మమ్మీ! అవును కాని ఈ రోజు టిఫిను ఏంటి?”

“ఈ రోజు నేను చేసిన ఐటమ్సు అన్నీ నీకు నచ్చినవే.”

“అంటే?”

“టిఫినుగా దోసెలు పోసాను. దాంట్లో నంజుకోడానికి అల్లం చట్నీ, కొబ్బరి చెట్నీ.”

“అచ్ఛా! మరి అన్నంలోకి ఆదరువులో?”

“అవీ నీకు ఇష్టమయినవే. గుత్తి వంకాయ కూర. గోంగూర పచ్చడి, ముద్ద పప్పు”.

“హాయి.. హయి.. అన్నీ నాకిష్టమైనవే. మా మమ్మీ ఎంత మంచిది?”

“చాల్లే! నీ పొగడ్తలు. త్వరగా టిఫిను కానియ్యి. ఇంజినీరింగు కోర్సులో జాయినయ్యావే కాని నీలో చిన్నప్పటి ఛాయలింకా సమసిపోలేదు. ఇలా ఒకళ్ళని మరొకరు పొగుడ్తూ కూర్చుంటే  బస్సు వచ్చి వెళ్ళిపోతుంది. ఇంట్లో గోళ్ళు గిచ్చుకుంటూ కూర్చోవాలి.”

ఇంట్లో కూర్చోవాలి అన్న తల్లి మాటల్తో ఒక్కసారి ఉలిక్కిపడింది బిందు. అవును ఈ రోజు తను కాలేజీకి వెళ్ళకూడదని నిన్ననే అనుకుంది. కాలేజీలో ర్యాగింగ్ జరుగుతోంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా హెచ్చరికలు చేసినా ఈ జాడ్యం మాత్రం పోలేదు. బయటకి పొక్కకుండా గుంభనంగా ఈ ర్యాగింగ్ జరుగుతోంది కాలేజీలో.

ఈ ర్యాగింగు పేరుతో ఎన్నో అత్యాచారాలూ అరాచకాలు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్సు తాము కూడా ఓనాటి జూనియర్సుమన్న విషయాన్ని మరిచి జూనియర్సుని పావులుగా చేసుకుని వారి జీవితాల్తో ఆటలాడుకుంటున్నారు. కొంతమంది సీనియర్సు ర్యాగింగు ముసుగులో జూనియర్సు దగ్గర డబ్బును కూడా హస్తగతం చేసుకుంటున్నారు. ఏమన్నా అంటే మమల్ని ధిక్కరిస్తావా అని చేతివాటం చూపిస్తున్నారు. ప్రెషర్సు డే వరకూ ఈ బాధలు – తిప్పలు తప్పవు.

వినోదం పేరుతో అరాచకాలు జరుగుతున్నాయి. ఈ ఆగడాలకి తట్టుకోలేక సున్నిత మనస్కులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హింస తట్టుకోలేక కాలేజీ వదిలి పారిపోతున్నారు.

ఈ పైశాచిక ప్రవృతి పోవాలని ఎంతమంది ఎన్ని విధాల ప్రయత్నం చేసినా అది విజృంభించి విలయ తాండవ నృత్యం చేస్తోంది. ఎందుకు సీనియర్సు ఇలా జూనియర్సుని ఇబ్బంది పాల్జేస్తున్నారు అని ప్రశ్నిస్తే జూనియర్సులో ఉన్న భయాన్ని, క్రొత్తదనాన్ని, బెరుకుని పోగొట్టి తమలో ఒకరిగా చేర్చుకుందుకే అని సమాధానం ఇస్తారు సీనియర్సు. వాళ్ళ సమాధానం సంతృప్తినీయదు. తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అని ప్రశ్నిస్తే దూడ గడ్డికి అని సమాధానం ఇచ్చినట్టే ఉంటుంది వాళ్ళ జవాబు.

ఈ ర్యాగింగ్ గూర్చి తను వింది. ఎక్కువ రోజులు నరకయాతన పెట్టి హింసించకపోయినా ఆ కొద్ది రోజులూ పెట్టిన నరకయాతన చాలు. అందుకే తను ఈ రోజు కాలేజీకి డుమ్మా కొట్టాలనుకుంది.

“బిందూ! ఏంటి ఆలోచిస్తున్నావే?”

“ఏం లేదు మమ్మీ! ఈ రోజు నేను కాలేజీకి వెళ్ళను.”

ఒక్కసారి కూతురి నోటి వెంబడి ఈ మాటలు విన్న ఉమాదేవి చకితురాలైంది. ఇంతవరకూ బాగానే ఉంది. ఒక్కసారి దీనికి ఇలాంటి బుద్ధి పుట్టిందేంటి? అని ఆలోచిస్తోంది. ఆమె కనులు ముడిపడి విడిపోయాయి.

“ఏం ఎందుకు వెళ్ళవు? క్షణ కాలంలోనే నీ మూడ్ మారిపోయిందేఁటి? ఏం ఒంట్లో బాగులేదా?” అడిగింది ఉమాదేవి కూతుర్ని.

“ఊఁ.. ఊఁ..!” తల అడ్డంగా తిప్పింది బిందు.

“మరి?”

“కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నారు” అలా అంటున్నప్పుడు బిందు ముఖంలో భయం తొంగి చూసింది.

కూతురు మాటలు వినగానే పెద్ద బరువు గుండెల మీద నుండి దింపినట్లు ఊపిరి పీల్చుకుంది ఉమాదేవి.

“ఓస్ ఇంతేనా? ర్యాగింగ్‍కి భయపడి ఈ రోజు తప్పించుకుంటావు. రేపు నిన్ను ఆటపట్టించకుండా వదులుతారా? భయపడకుండా ధైర్యంగా ఎలాంటి పరిస్థితినయినా ఎదుర్కొనే గుణం నీలో అలవర్చుకుంటే ఎవ్వరూ నిన్పు ఏం చేయలేరు” ఉమాదేవి కూతురికి హితబోధ చేసింది.

“నీవు నీ అనుభవంతో చెప్తున్నావే కాని నీలో ఉన్న ఆపాటి ధైర్యం, ఓర్పు, ఓపిక, పట్టుదల గుణాలు నాలో దివిటీ పెట్టి వెతికినా కనిపించవు. నేను ఈ ఇంజినీరింగ్ చదవనంటే పట్టుబట్టి నన్ను ఈ కోర్సులో చేర్పించావు.” బిందు మారాం చేస్తున్నట్లు అంది.

“నీలో ఉన్న ఈ పిరికితనమే నాకు నచ్చదు. నీలో చిన్నపిల్ల మనస్తత్వం పోలేదు. లక్షలకి లక్షలు ఖర్చు పెట్టకుండా మెరిట్ మీద నీకు గవర్నమెంటు కాలేజీలో సీటు వచ్చింది. అది నీ అదృష్టం అనుకో. అంత సులువుగా సీటు రావడం వలన దాని విలువ నీకు తెలియకుండాపోయింది. మెరిట్ సంపాదించడానికి నీ కృషి ఉందనుకో కాదనను. అయితే ఇంత చిన్న విషయానికి నీవు ఇలా డీలా పడిపోవడం నాకు నచ్చలేదు.”

“సారీ! తప్పయిపోయింది మమ్మీ!” తల్లిని బాధ పెట్టేను అన్న భావం – పశ్చత్తాపం బిందులో అగుపడ్డాయి.

అలా అంటూ బాధపడ్తున్న కూతురి ముఖం చూడగానే ఆ తల్లి కరిగిపోయింది. ఒక్క క్షణం ఆలోచన్లలో పడింది.

గత స్మృతులు తనని వెంటాడుతూ ఉండగా గంభీరంగా – ఆవేదనగా ఆలోచనా తరంగాలలో మునిగి తేలుతూ ఉంది ఉమాదేవి. తల్లి వేపే చూస్తున్న బిందు కంగారు పడింది. తన వల్ల ఎంత పొరపాటు జరిగిపోయింది ఈ రోజు. తన మాటల్తో, ప్రవర్తనతో తల్లి మనస్సు గాయపరిచింది.

ఎన్నడూ తనకి జీవితంలో ఏ కష్టం రాకుండా అపురూపంగా చూసుకునే మమ్మీ ఏంటి ఈ రోజు ఇలా మూడీగా అయిపోయింది. తన వల్ల తప్పకుండా తల్లికి కష్టం కలిగింది. తన భవిష్యత్తు కోసం తల్లి ఎంతో ఆరాట పడుతోంది. ఇలా సాగిపోతున్నాయి బిందు ఆలోచన్లు.

“నన్ను క్షమించు మమ్మీ! నిన్నెంతో కష్టపెట్టాను.”

కూతురు మాటలకి ఉమాదేవి చిన్నగా నవ్వింది. ఆ నవ్వు వెనుక గాంభీర్యం తొంగి చూసింది. ఆ భావం బయటకి కనబడనీయలేదు.

“పాపా! ఒక్క మాట చెప్తాను విను. కొంతమంది జీవితం వడ్డించిన విస్తరాకు అయితే మరి కొంతమంది జీవితం ముళ్ళపాన్పు. అయితే నీ జీవితం నా జీవితంలా ముళ్ళపాన్పు కాకుండా వడ్డించిన విస్తరాకు అవాలనేదే నా తపన, ఆరాటం. నా సమస్యలు నాకున్నాయి. అవసరమయినప్పుడు చెప్తాను నా సమస్యల గురించి. ఇప్పుడు మాత్రం నీ కర్తవ్యం తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. నీ జీవితం సుఖమయంగా మలుచుకోవాలి.

ఇది స్వార్థం కాదు. ఓ కన్న తల్లిగా నా తపన. అయినా ఆపాటి స్వార్థం లేకుండా నేటి నాగరిక ప్రపంచంలో మనుగడ సాగించడం కష్టం. నేటి కలియుగంలో స్వార్థం మొదట పుట్టింది, తరువాత మనిషి పుట్టాడు. అయితే నా కోరిక నేను స్వార్థం అనుకోవడం లేదు. అని మరోసారి చెప్తున్నాను.” గంభీరంగా అంది ఉమాదేవి.

“ఏంటో మమ్మీ! నీ మాటలు అంతగా అర్థం కావటం లేదు. చాలా తమాషాగా మాట్లాడుతున్నావు.”

“నా మాటలు నీకు తమాషాగా అనిపిస్తున్నాయా? అయితే నా జీవితంలా నీ జీవితం అవకూడదు. నీ జీవితం చూసి గర్వంగా తల పైకెత్తుకుని తిరగాలి నేను. నా ఆశలూ ఆశయాలూ అడియాశలవకూడదు. నా కోరికలు సఫలీకృతం చేయాలి నీవు”, తిరిగి గంభీరంగా అంది ఉమాదేవి.

తల్లి మాటలకి కూతురు మనస్సు చలించింది ఒక్కక్షణం. తల్లి చేతిలో చేయి వేస్తూ “ప్రామిస్ మమ్మీ! నీవు గర్వంగా తల పైకెత్తి తిరిగేటట్టు, నన్ను నీ కూతురని గర్వంగా చెప్పుకొనేటట్టుపై స్థాయికి చేరుకుంటాను. నీ కలలు  సఫలీకృతం చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను.” అంది.

కూతురు భరోసాకి ఆ తల్లి కళ్ళు తృప్తిగా మెరిసాయి.

“మమ్మీ! రోజూ బస్సులో ఇలా వెళ్ళి వచ్చే కన్నా అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటే బాగుంటుందనిపిస్తోంది. సమయం కూడా చదువుకోడానికి లభిస్తుంది. సమయం వృథా కాదు.”

“నీకు కష్టమవుతోందని నాకూ తెలుసు. అంత పెద్ద దూరంగా లేదు నీ కాలేజీ. సమయం నీవు అనుకున్నంత వ్యర్థం కాదు. ముఖ్యంగా నేను నీ కోరిక అంగీకరించలేకపోతున్నాను. దానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను.”

తల్లి మాటలు కూతురి కోరికలపై నీళ్ళు చల్లాయి. హాస్టల్ జీవితాన్ని ఊహించుకుని సంతోషపడిపోతుంది. హాస్టల్లో స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండచ్చు. ఆ జీవితం చాలా బాగుంటుంది. రకరకాల స్నేహితుల్తో – రకరకాల మనస్తత్వాలు కలిగిన అమ్మాయిల మధ్య మెలగొచ్చు. ఇలా ఊహించుకుంటున్న బిందుకి తల్లి మాటలు నిరాశను కలిగించాయి.

“నాదో మాట మమ్మీ!”

“ఏంటి?”

“మన ఇద్దరు మామయ్యలు వైజాగ్‌లో ఉన్నారు కదా. వాళ్ళ ఇంటిలో ఉండి చదువుకుంటాను. చిన్న మామయ్య కూతురు స్వప్న అంటే నాకెంతో ఇష్టం కూడా. మేమిద్దరం మంచి స్నేహితుల్లా ఉంటాము కూడా.”

కూతురు మాటలకి ఆ తల్లి వదనంలో రంగులు మారుతున్నాయి. తల్లి ముఖకవళికలు ఓ లిప్త కాలం పరిశీలిస్తోంది బిందు.

“పాపా! ఇటువంటి ప్రస్తావన మరో పర్యాయం నా వద్ద తేవద్దు. ఒక సామెత ఉంది తెలుసా? అయిన వాళ్ళకి దూరంగా, నీటి వసతులకి దగ్గరగా ఉండాలిట. అయిన వాళ్ళకి దూరంగా ఉంటేనే మనకి మర్యాదలు గౌరవాలు లభిస్తాయి. ఈ విషయం నా స్వానుభవం మీద చెప్తున్నాను. నా మాట విను. నా నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు. పదేపది సార్లు చెప్పించుకోవద్దు.”

తల్లి మాటలకి బిందు ముఖం కోపంతో ఎర్రబడింది. కూతురు ముఖం చూడగనే చిన్నగా మనసులో నవ్వుకుంది ఆ తల్లి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here