Site icon Sanchika

సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-11

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[సన్నబడడానికి తను చెప్పిన సూత్రాలు పాటిస్తోంది సుందరి అని అనుకుంటుంది శకుంతల. కొద్దిగా లావు తగ్గిందని అంటుంది. లావు తగ్గడానికి తను చేస్తున్న ప్రయత్నాలు వివరిస్తుంది సుందరి. బాగా చదువుకోమని శకుంతల చెప్తే, సుందరి తేలికగా తీసిపారేస్తుంది. తన వాదనను సమర్థించుకుంటూ, విద్యావ్యవస్థలోని లోపాల గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత కాసేపు తమకి ఉన్న నిక్‍నేమ్స్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరూ అలా చాలా సేపు మాట్లాడుకోవడం చూసిన పద్మ, సుర్యం – సుందరికి చదువు మీద ఆసక్తి లేదని, తన వల్ల శకుంతల చదువు పాడవుతోందని అనుకుంటారు. ఆ మాటలు విన్న సుందరి బాధపడుతుంది. కొన్ని రోజుల తర్వాత కూతురి చదువెలా సాగుతోందూ చూడ్డానికి వస్తారు శంకరం, కాత్యాయిని. చదువెలా ఉందని తండ్రి అడిగితే, తానూహించినంత గొప్పగా లేదని, బోర్ గా ఉందని, తనకి స్వేచ్ఛ లేదని, తనది బానిస బ్రతుకయిందని అంటుంది సుందరి. ఆ మాటలు విని కాత్యాయిని కోపగించుకుంటుంది. తనని తాను సమర్థించుకుంటుంది సుందరి. ఇంజనీరుకి కాబోయే భార్య తన కూతురని శంకరం అంటే, ఆ అబ్బాయి ఈ పెళ్ళికి ఇష్టపడడు అంటుంది కాత్యాయిని. మన డబ్బుతో చదువుకుంటున్న వాడు, నన్నెందుకు పెళ్ళి చేసుకోడు అని అంటుంది సుందరి. కోపం పట్టలేక సుందరి చెంప చెళ్ళుమనిపిస్తుది కాత్యాయిని. కూతురులో ఏ మార్పు రాలేదని గ్రహించి, ఇక చదువు అక్కర్లేదు వెళ్ళిపోదాం పదమని అంటుంది. సుందరి రోషంతో లోపలికి వెళ్ళిపోతుంది. సుందుని కొట్టడం తప్పని అంటుంది పద్మ. తాను తప్పు చేయలేదని, తప్పు జరగక ముందే మేల్కొన్నానని అంటుంది కాత్యాయిని. శంకరం ఏమీ మాట్లాడడు. కాత్యాయిని స్థిర నిర్ణయం తీసుకుంది. ఇక చదవండి.]

అధ్యాయం-21

[dropcap]సుం[/dropcap]దరిని ఆమె తల్లిదండ్రులు చదువు మాన్పించి తమ గ్రామానికి తీసుకుపోయారు. మొదట బాధపడ్డా పద్మకి, సూర్యానికి ఇది కూడా ఒకందుకు మంచిదే అని అనిపించింది. సుందరి స్వభావం ఆమె ప్రవర్తన చూసిన తరువాత బొత్తిగా ఈ అమ్మాయికి చదువంటే ఇష్టం లేదు. శకూ చదువు కూడా డిస్ట్రబ్ అవుతుందని మనస్సులో అనుకునేవారు. అయితే బయట పెట్టలేదు వారు.

కాగల కార్యం గందర్వులే తీరుస్తారు అన్నట్లు, వాళ్ళ చేతికి మట్టి అంటకుండా సుందరిని తల్లిదండ్రులు తీసుకువెళ్ళడం వాళ్ళకి సంతోషం కలిగించింది. సుందరికే చదువు మీద శ్రద్ధ ఉంటే ఎలాగో అలాగ తల్లిదండ్రుల్ని వాళ్ళు ఒప్పించి ఉండేవారు. సుందరి చదువు నిమిత్తం తమ ఇంటిలో ఉండడానికి ఇష్టపడి ఉండేవారు.

సుందరి చదువు మాసేసి వెళ్ళిపోయినందుకు సంతోషించే వాళ్ళలో సిద్ధార్థ కూడా ఉన్నాడు. అమ్మయ్య! అని అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. సుందరికి దూరంగా ఉండాలని అతని మనస్సు కోరుతోంది.

కొన్ని మనం అనుకున్న సంఘటనలు జరగవు. అనుకోని సంఘటనలు కాకతాళీయంగా జరుగుతూ ఉంటాయి. సిద్ధార్థ మనస్సు సుందరికి దూరంగా ఉండటానికి, బిందుకి సమీపంగా ఉండడానికి కోరుకుంటోంది.

శకుంతలకి, బిందుకి సుందరి వెళ్ళిపోవడం సంతోషాన్ని కలిగించలేదు. పాపం సుందరి అదో రకమైన బోళా మనిషి అనుకుని జాలిపడ్డారు.

సిద్ధార్థ అంటే బిందులో ఏదో తెలియని ఆకర్షణ, అభిమానం. ఆమెను కట్టి పడేస్తున్నాయి. అతనికి దూరంగా మసలాలి. అతను సుందరికి కాబోయే భర్త అని అనుకుంటుంది. రాత్రి సమయంలో కాని, మరుసటి రోజు సిద్ధార్థ పలకరించేటప్పటికి ఆమెకి తన నిర్ణయం మార్చుకునే పరిస్థితి వస్తోంది.

‘నేను అతడ్ని ప్రేమిస్తున్నానా’ అని ఏకాంతంలో బిందు తనలో ప్రశ్నించుకునేది. ‘అవును’ అని అనుకునేది. మరుక్షణంలో, ‘ఈ ప్రేమ రొంపిలోకి దిగకూడదు. ఇప్పుడు నా కర్తవ్యం కేవలం ఏంటో తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి’ అనుకునేది. తల్లి తనతో అన్న మాటలు గుర్తుకు వచ్చేవి. “పాపా! నా జీవితంలా నీ జీవితం అవకూడదు. ఎవ్వరూ అందుకోలేనంత ఉన్నత స్థాయికి ఎదిగిపోవాలి నీవు,” అని తన తల్లి అనేది, కాని తన జీవితంలో ఏం జరిగిందో ఒక్కసారి కూడా తనతో మనస్సు విప్పి మాట్లాడలేదు, చెప్పనే చెప్పలేదు.

“ఏమిటి హిమబిందుగారూ! ఒంటరిగా నిలబడి కలలు కంటున్నారు. ఎవరి కోసం ఆ కలలు? ఆ అదృష్టవంతుడు ఎవరో?” నవ్వుతూ పలకరించాడు సిద్ధార్థ.

‘నా గురించేనా?’ అని అనుకున్న అతనికి “అబ్బే..! ఏం లేదండీ!” అన్న మాటలు నిరాశ కలిగించాయి.

“మా మమ్మీ గురించేనా ఆలోచనంతా.”

“మీ మమ్మీ అంటే మీకు అభిమానం ఎక్కువను కుంటాను. ఆవిడ మీద శ్రద్ధా భక్తులు ఉన్నట్టు కూడా అగుపడుతోంది.”

“అవునండి, నేను నేడు సమాజంలో ఈ స్థాయికి రావడానికి కారణం ఆవిడే. నాకు మమ్మీ ఒక్కొక్కసారి వరాలిచ్చే దేవత అనిపిస్తుంది. కష్టం అంటే ఏమిటో తెలియనీయకుండా పెంచిది మమ్మీ. తన హృదయాంతరాల్లో దుఃఖాన్ని చింతల్ని దాచుకుని, నాకు మాత్రం సుఖాన్ని అందించిన అమృతమూర్తి మమ్మీ!”

“మీ ఫాదరో?” అతని ఈ ప్రశ్నకి బిందూ బాధగా కనులు వాల్చేసుకుంది.

“సారీ! మీకు బాధ కలిగించాను,” నొచ్చుకుంటూ అన్నాడు సిద్ధార్థ.

“అలా అడగడంలో మీ తప్పేం లేదు. అయితే ఒక్క విషయం ఇప్పటి వరకూ మా ఫాదరెవరో నాకే తెలియదు.”

బిందూ మాటలు వినగానే ఆశ్చర్యంలో కూడిన అనేక సందేహ భావాలు సిద్ధార్థ వదనంపై ఒక్కసారి కదలాడి మాయమయ్యాయి.

“మా ఫాదర్ గురించి మమ్మీని రెండు మూడు సార్లు అడగడానికి ప్రయత్నించి విఫలురాలునయ్యాను. ఫాదర్ గురించి అడిగితే ఆవేశంతో నా మీద చేయి చేసుకుని, ఆ తరువాత పశ్చత్తాప పడింది. కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లాడగా, నేను చిన్న దానినని చూడకుండా క్షమాపణ కూడా కోరింది. ‘చిన్నదానివయినా దయచేసి ఆ ప్రస్తావన తేకు’ అని ప్రాధేయపడినట్లు మాట్లాడింది. అందుకే నాకు వచ్చిన సందేహాన్ని మనస్సులోనే దాచుకున్నాను.” బాధగా కనురెప్పలు క్రిందకు వాల్చేసి అంది బిందు.

“సారీ!” క్షమాపణ చెప్పాడు సిద్ధార్థ.

అతను వెళ్ళిన తరువాత బిందు కాలేజీ లైబ్రరీ హాలులో కూర్చుని ఆలోచిస్తోంది. ఇంతలో శకుంతల వచ్చింది. “ఏంటా దీర్ఘ ఆలోచన? అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం,” శకుంతల అంది. ఇద్దరూ బయటకు వచ్చి చెట్ల నీడలో కూర్చున్నారు.

“సుందరి, సిద్ధార్థ గురించే నేను ఆలోచిస్తున్నాను బిందూ!” శకుంతల అంది.

“ఇప్పుడు ఏంటయింది?”

“సుందూకి చదువు మీద శ్రద్ధ లేదు. చదువుకోవాలన్న కోరిక కూడా లేదు. ఎంతసేపూ దాని దృష్టి అంతా పెళ్ళి మీదే. సిద్ధార్థ చదువు అయిన తరువాత ఇద్దరికీ పెళ్ళి జరగచ్చు.”

తన మాటలకి బిందూ రియాక్షను ఎలా ఉంటుందో తెలుసుకోడానికి అంది శకుంతల. ఎందుకంటే బిందు సిద్ధార్థను ఇష్టపడుతోందని గమనించింది శకుంతల. ఆమె మాటలకి బిందు ఏం జవాబియ్యలేదు. ఆమె ముఖం గంభీరంగా మారింది. మౌనంగా కూర్చుని పుస్తకం మీద పిచ్చిగీతలు గీస్తోంది. అందుకే బిందూ మనోభావాలు శకుంతలకి అవగతమవలేదు.

“ఏఁటా దీర్ఘాలోచన? ఏదో పొగొట్టుకున్నట్లు,” శకుంతల అంది.

శకుంతల మాటలకి బిందు ఉలిక్కి పడింది. “అబ్బే..! ఏం లేదు,” తత్తరపాటుతో సర్దుకుని కూర్చుంది. బిందు మనోభావాలు అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది శకుంతల.

“సిద్ధార్థకి సుందరిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదనిపిస్తోందే!”

“అని నీతో చెప్పాడా?”

“నో.. నో..! నాకెందుకు చెప్తాడు. నా ఆలోచన మాత్రమే,” కంగారులో తత్తరపడ్తూ అంది బిందు.

“అతని కిష్టమున్నా లేకపోయినా తప్పకుండా జరిగి తీరుతుంది ఈ పెళ్ళి. సిద్ధార్థని అల్లుడుగా చేసుకుందుకి అంగీకరించిన తరువాతే అంకుల్ అతడ్ని చదివిస్తున్నారు.”

శకుంతల మాటలు వింటూ గంభీరంగా ఆలోచిస్తోంది బిందు.

“ఏం అమ్మాయి గారి మనస్సు అతని మీదకు పోలేదు కదా!” హాస్యంగా నవ్వుతూ అంది శకుంతల.

“నా మనస్సు అతని మీదకు ఎందుకు వెళ్తుంది? అయినా మమ్మీ ఇష్టం. ఆమె హెచ్చరిక నా చెవిలో గింగిర్లాడుతూనే ఉంటుంది. ఆమె ఆశయాలూ, ఆకాంక్షలు, దగ్గర నా ఆశలు – అభిలాషలు నిలబడవు.”

బిందుకి తల్లి మీదున్న అభిమానం, విశ్వాసానికి సంతోషం కలిగింది శకుంతలకి.

“మీ మమ్మీ అంగీకరిస్తే?”

“ప్లీజ్! ఆ విషయం వదిలి వేసేయ్ శకూ!”

ఇద్దరూ మాటలాపి పుస్తకాల్లో తల దూర్చారు. బిందూ దృష్టి పుస్తకాల్లో ఉండే అక్షరాల వేపు కాకుండా ఆలోచన్ల మీదకి పరుగులు తీస్తోంది. నిజమే! తను సిద్ధార్థను ప్రేమిస్తోంది. అతని సామీప్యంలో తనకి అంతులేని ఆనందం కలుగుతోంది. అతని మాటలు అలా వినాలనిపిస్తోంది. ఈ సుందరే అడ్డు లేకపోతే చక్కా సిద్ధార్థ తన వాడయ్యేవాడు. ఈ విషయంలో మమ్మీని ఎలాగో అలాగే తను ఒప్పించి ఉండేది. సుందరి మా మధ్య అడ్డుగోడగా నిల్చింది. ఇలా ఆలోచిస్తున్న బిందూకి సుందరి తలంపుకి రాగానే బిందూ ముఖంలో లిప్త కాలం అసూయ భావం తొంగిచూసింది.

‘బిందూ గడుసుదే, సిద్ధార్థ మీద తన అభిప్రాయం తెలియనీయకుండా వాళ్ళ మమ్మీ ఇష్టం అని సాకు చెప్పి తప్పించుకుంది’ ఆలోచిస్తోంది శకుంతల.

ఇద్దరూ కాలేజీ ప్రాంగణంలో అడుగుపెట్టి ముందుకు అడుగులేస్తున్నారు.

“శకూ.. శకూ..!” ఓ అమ్మాయి పిలిచింది. ఈ మధ్య తనని నిక్‌నేమ్‌తో పిలవటం మానేసారు అనుకుంది శకుంతల.

“ఆ సిద్ధార్థ నీకు బందువుట కదా! అందరూ ఈ విషయం గురించే చెప్పుకుంటున్నారు,” అంది ఆ అమ్మాయి.

తనని నిక్‌నేమ్‌తో పిలవకపోవడానికి ఇది కూడా ఓ కారణమా? అనుకుంది శకుంతల.

“అవును, అతను నాకు బావ అవుతాడు.”

“అబ్బో! వరసలు బాగా కలిసాయే! బావా మరదళ్ళన్నమాట,” ఓ అమ్మాయి గలగల నవ్వుతూ అంది. ఆ నవ్వులో మిగతా వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు. గర్వంగా నవ్వుకుంటూ బిందూతో ముందుకు సాగింది శకుంతల.

మధ్యాహ్నం లీజరు పిరియడులో కాలేజీలో పూల మొక్కల్ని తదేకంగా చూస్తోంది శకుంతల ఒంటరిగా.

“శకుంతల గారూ!” పిల్చాడు సిద్ధార్థ. అతడ్ని చూడగానే క్షణ కాలం తత్తరపాటు పడింది. అంతలోనే సర్దుకుని “ఏంటి బావా?” అంది.

ఆ సంబోధన అతడ్ని నిశ్చేష్టుడ్ని చేసింది. అంతలోనే ఆమెతో తనకున్న బంధుత్వం గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకున్నాడు.

“మన బంధుత్వం తెలిసిన తరువాత ఇలా మన్నించుకుంటూ పిల్చుకోవడం బాగా లేదనిపించింది,” అంది శకుంతల నవ్వుతూ, అతను కూడా చిన్నగా నవ్వాడు.

“శకూ! నీతో మాట్లాడాలి. ఆ చెట్టు నీడలో కూర్చుని మాట్లాడుకుందాం,” అంటూ అతను ముందుకు వెళ్తుంటే అతడ్ని అనుసరించింది.

“శకూ! ఓనాడు నన్ను నీవు ఓ మంచి స్నేహితుడుగా భావించి నీ జీవితంలో దాగి ఉన్న ఆవేదనని నాకు వివరించావు. ఆ రోజు మనిద్దరి మధ్యా ఉన్న బంధుత్వం తెలియదు. ఒకరి కష్టసుఖాలు మరొకరు చెప్పుకునే మంచి స్నేహితులం మాత్రమే. బంధుత్వం కంటే స్నేహమే గొప్పది. అందుకే నా ఆరాటం, ఆలోచన నీకు తెలియజేస్తున్నాను శకూ!” ఆమె ముఖం వేపు పరిశీలనగా చూస్తూ అన్నాడు సిద్ధార్థ. ఆమె మౌనంగా అతను చెప్పింది వింటోంది క్షణకాలం ఇద్దరి మధ్యా మౌనం రాజ్యమేలింది.

“శకూ! నేను బిందుని ఇష్టపడ్తున్నాను. దానికి ప్రేమ అని అనుకోవచ్చు. మరేదేనా అనవచ్చు. ఏ అమ్మాయిని చూసినా చలించని నా మనస్సు బిందును చూడగానే స్పందించింది. పెళ్ళి చేసుకుంటే ఆమెనే చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళి వరకూ ఈ పరిస్థితి ఇలాగే ఉంటే,” అతని మాటల్లో దృఢత్వం అగుపడింది.

శకుంతల మౌనంగా ఉండటం చూసి “నా మాటల మీద విశ్వాసం లేదా? అపనమ్మకమా?” అని అడిగాడు సిద్ధార్థ.

“లేదు నమ్ముతున్నాను. అయితే బిందూ అభిప్రాయం కూడా తెలుసుకుంటే మంచిది.”

“ఆ భారం నీ మీద వేస్తున్నాను.”

“అమ్మో! నా మీదే! పరిస్థితులు అసలే బాగులేవు. నిప్పుతో చెలగాటం అంటారు దీనినే. ఒక వేపు స్నేహితురాలు, మరోవేపు చెల్లెలు లాంటి సుందరి. నన్ను ఈ విషమ సమస్య అనే చదరంగంలో పావుగా మార్చద్దు ప్లీజ్!”

“ఆ సుందూ అంటే నాకు ఇష్టం లేదు. మొదట్నించి ఈ విషయం నిజం శకూ!”

“అంత ఇష్టం లేనప్పుడు మొదటే చెప్పి వేయవల్సింది. ఇప్పుడు ఈ విషయం సుందూకి, అంకుల్‌కి తెలుస్తే ఎంత రభస అవుతుందో తెలుసా.”

“తెలుసు, అన్నీ ఎదుర్కోడానికే నిర్ణయించుకున్నాను” దృఢమైన నిర్ణయం సిద్ధార్థ వదనంలో అగుపడింది.

“ఏంటో? నాకు చాలా భయంగా ఉంది. ఏ సమస్యలూ లేకుండా చక్కగా చదువుకోవల్సిన సమయంలో చుట్టూ అన్నీ సమస్యలే.”

“సమస్యలన్నిటికీ కాలమే పరిష్కరిస్తుంది శకూ!” అన్నాడు సిద్ధార్థ.

అధ్యాయం-22

సాయంత్రం క్లాసులు అయిపోయిన తరువాత బిందూ కాలేజీ బయటకు అడుగులేస్తోంది. “బిందూ గారూ! మీతో మాట్లాడాలి. మీ బస్సు వెళ్ళిపోయినా మిమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చే పూచీ నాది. ప్లీజ్ కాదనరు కదూ!”

“నాతోనా?” అంది బిందు సిద్ధార్థతో.

“అవును మీతోనే, శకుని వెళ్ళిపోనీయండి. మనిద్దరం అలా కూర్చుని మాట్లాడుకుందాం,” తిరిగి అన్నాడు.

కాలేజీలో అందరూ సిద్ధార్థ వ్యక్తిత్వాన్ని ఎంతో మెచ్చుకుంటారు. అందరూ అతడ్ని గౌరవిస్తారు. అభిమానిస్తారు. ఆ కాలేజీ అంతటికి అతను హీరో అంతటివాడు. అలాంటి సిద్ధార్థ స్వయంగా ఈ రోజు ఆమెను అభ్యర్థిస్తున్నాడు. అనే మాట తలంపుకి రాగానే ఒకవేపు సంతోషం. మరోవంక గర్వంగా ఆమె హృదయం ఉప్పొంగింది.

“సరే!” అంది. ఆమె అంగీకారం అతని కళ్ళల్లో కోటి కాంతులు ఒక్కసారి వెలిగినంత సంతోషం. ఇద్దరూ బీచిలో ఎదురెదురుగా కూర్చున్నారు. ఆమె చూపులు క్రిందకి వాల్చి ఇసుకలో పిచ్చి గీతలు గీస్తోంది. అతను ఎగిరెగిరి పడ్తున్న కెరటాల వంక – నింగి, సాగరం కలిసి ఉన్నట్టు కనిపించే వేపు తదేకంగా చూస్తున్నాడు. జనాలు పల్చగా ఉన్నారు బీచ్‌లో.

“బిందూ!” అతను పిల్చాడు. తల పైకెత్తి చూసిందామె. ఆ ఏక వచన సంబోధన అతను తనకి మరింత చేరువవుతున్నాడా అన్న ఆలోచన వచ్చిందామెకి.

“బిందూ! ఐ లవ్ యూ! ఐ లైక్ యూ!” అంటూ సిద్ధార్థ ఆమె అరచేతిని గట్టిగా పట్టుకుని ఉద్వేగంతో ఊగిపోతూ అంటున్నాడు. అతని ఆ ఉద్వేగం తారాస్థాయికి చేరుకుంది. ఆమె చేతిని తన పెదవులకి ఆనించుకున్నాడు. ఆమెను దగ్గరగా తీసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు.

ఈ ఆకస్మిక పరిణామానికి ఆమె మెదడు ఒక్క క్షణం మొద్దు బారిపోయింది. అతని కళ్ళల్లో అగుపడ్తున్న కాంక్ష, ఆమెను కలవర పెట్టింది. అతని వంక చూసే ధైర్యం ఆమెకి లేకపోయింది. అయస్కాంత శక్తికి ఆకర్షింపబడ్డ వస్తువులా అతని చూపులకి ఆమె ఆకర్షితురాలవుతోంది. ఆ శక్తి నుండి తప్పించుకోడానికి చప్పున తన చూపులు మరల్చుకుని సున్నితంగా తన భుజం మీదున్న అతని చేతుల్ని తొలిగించింది.

బాహ్య జగత్తులోకి అడుగుపెట్టిన అతను తను చేసిన పనికి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. మరు క్షణమే తన ఆవేశానికి – తన ప్రవర్తనకి సిగ్గుపడ్డాడు. ఇప్పుడు అతని కళ్ళల్లో కదలాడుతున్నది కాంక్షకాదు పశ్చత్తాపం.

“సారీ!” అన్నాడు.

ఆమె ఏం మాట్లాడలేదు. మాట్లాడే స్థితిలో లేదు. భావోద్వేగానికి గురయింది. ఇసుకలో పిచ్చి గీతలు గీస్తోంది.

“బిందూ! నన్ను క్షమించు. ఒక్కసారి భావోద్వేగానికి లోనయ్యాను. నీ మీదున్నది నాకు కాంక్ష కాదు. అచంచలమైన ప్రేమానురాగాలు. ఆరాధన నన్ను విచలితుడ్ని చేసింది. ఎన్ని అవాంతరాలు అడ్డు వచ్చినా నిన్ను నేను నాదానిగా చేసుకుంటాను.” ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కుతూ అన్నాడు. అతను అలా అంటున్న సమయంలో అతని ముఖ మండలంపై స్థిరమైన భావాలు తొంగి చూశాయి.

“ఈ రోజు మీ ప్రవర్తన నన్ను భయస్థురాలిగా చేసింది. మీరు భావోద్వేగానికి లోనవడం నేను ఎప్పుడు చూడలేదు. అయినా మీ మగవాళ్ళు ఏ నిర్ణయమైనా చప్పున తీసుకున్నట్లు ఆడవాళ్ళు అంత తొందరగా ఏ నిర్ణయం తీసుకోలేరు. అందులోనూ ఏ నిర్ణయం తీసుకోవడంలో నేను అసమర్థురాల్ని. ఎందుకంటే నేను స్వతంత్రురాల్ని కాను. మరొకరి ఆధీనంలో ఉన్న అస్వతంత్రురాల్ని. మమ్మీ నిర్ణయమే నా నిర్ణయం. అంతే కాదు సుందరికి ద్రోహం చేయలేను,” స్థిరంగా అంది బిందు.

బిందు అలా అనడంలో నిజాయితీ ఉంది. వాస్తవికత ఉంది. యథార్థం ఉంది.

“నీ పరిస్థితి అర్థం చేసుకోగలను. అయితే నీవూ నా పరిస్థితిని అర్థం చేసుకో. ఇది ఇద్దరి మనుష్యుల జీవిత సమస్య. ఇష్టం లేని పెళ్ళి చేసుకుని గానుగెద్దు లాంటి జీవితం గడిపే కన్నా నాకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకుని జీవితం ఆనందంగా గడపాలని నాకనిపించదా?” సిద్ధార్థ అన్నాడు.

మౌనంగా వింటోంది బిందు. పడమటి దిక్కులో అస్తమిస్తున్న అగ్ని గోళంలాంటి సూర్యబింబం నెమ్మది నెమ్మదిగా కనుమరుగు అవుతోంది. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున లేచి ఎగిరెగిరి పడ్తున్నాయి. ఆ సముద్రం ఒడ్డునున్న ప్రేమికులిద్దరి మనస్సుల్లోనూ ఉద్వేగమే. బీచ్‌లో జనాలు పల్చబడ్తున్నారు. నింగి వేపు చూసింది బిందు. నింగి వాళ్ళ మనస్సుల్లా కాకుండా నిర్మలంగా ఉంది. నీలంగా ఉంది. సాయంకాల గాలులు శరీరానికి హాయిని కలిగిస్తున్నాయి.

“బిందూ!”

“ఊఁ!”

“నీ నిర్ణయం వినాలని ఉంది.”

“నా నిర్ణయం నేను మొదటే చెప్పేను. మమ్మీ ఏం చెప్తే అదే చేయడమే నా నిర్ణయం.”

బిందూ మాటలు విన్న అతని కనుబొమ్మలు క్షణకాలం ముడిపడి విడిపోయాయి. ఆమె మీద విసుగుదల – కోపం కలిగాయి. అయితే ఆ భావాలు కనబడనీయకుండా జాగ్రత్త పడ్డాడు.

“అన్ని విషయాల్లోనీ మీ మమ్మీ ఇష్టమే నీ ఇష్టం అనడం మంచిది కాదు. పెద్ద వాళ్ళ మాటలకి గౌరవం ఇవ్వద్దని నేను అనను. అయితే మన వ్యక్తిగత జీవితానికి గౌరవానికి లింకు పెట్టకూడదు. నీకూ నీ స్వంత నిర్ణయం ఉండాలి. రేపొద్దున్న మీ మమ్మీ ఇంతమంది పిల్లల్ని కనాలి. అంటే మీ మమ్మీ ఆజ్ఞ ప్రకారం చేస్తావా?” పరిహాసంగా అన్నాడు.

“యస్!” నవ్వుతూ అంది బిందు. అతనూ గట్టిగా నవ్వాడు. ఇద్దరి మనస్సులూ తేలికపడ్డాయి.

“ఓకే, సమయం వచ్చినప్పుడు మీ మమ్మీనే అడుగుతాను” అతని దవడ ఎముక కదలిక బట్టి అతని స్థిర నిర్ణయం వెల్లడి అయింది. ఆమెను బస్టాప్‍లో దించడానికి అతను లేచాడు. ఆమె అతడ్ని అనుసరించింది.

(ఇంకా ఉంది)

Exit mobile version