సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-13

0
2

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[సుందరిని వాళ్ళ ఊరు తీసుకువెళ్ళిపోయాకా, సిద్ధార్థకి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఇంతలో ఒకసారి ఊరికి వచ్చివెళ్లమని శంకరం సిద్ధార్థకి కబురుచేస్తాడు. బిందూ, సిద్ధార్థ బీచ్‍లూ కూర్చుని ఉండగా చూసిన వ్యక్తి ఒకరు ఆ వార్త శంకరానికి అందజేస్తారు. మేనల్లుడు చేజారిపోతాడేమోనని భయం వేస్తుంది. అందుకే వచ్చివెళ్ళమని సిద్ధార్థకి కబురుచేస్తాడు. ఈ వార్త తెలిసిన సుందరి ఈర్ష్యాద్వేషాలతో మండిపోతుంది. సిద్ధూ ఇంటికి రాగానే అతని మీద విరుచుకుపడుతుంది. స్వార్థపరుడనీ, ద్రోహి అనీ, విశ్వాసఘాతకుడనీ తిడుతుంది. సిద్ధార్థ కూడా కోపగించుకుని, ఎవరిది ద్రోహమని, ఎవరిది స్వార్థమని ప్రశ్నిస్తాడు. తనని పావుగా వాడుకుంటున్నారని అంటాడు. మా నాన్న డబ్బు పంపకపోతే మీ గతి ఏమిటని అడుగుతుంది సుందరి. తన పేదరికం పట్ల కోపగించుకున్న సిద్ధార్థ మావయ్య తన మీద డబ్బునంతా వడ్డీతో సహా తీర్చేస్తానని చెప్పి అక్కడ్నించి బయల్దేరిపోతాడు. ముందు చదువు మానేయాలనుకుంటాడు. ఈ విషయం కాలేజీలో అందరికీ తెలిసిపోతుంది. స్నేహితులంతా కారణం చెప్పమని బ్రతిమిలాడుతారు. అవసరమైతే డబ్బు సాయం తాము చేస్తామంటారు. అయినా సిద్ధార్థ ఒప్పుకోడు. సిద్ధార్థ చదువు మానేస్తున్న సంగతి నీకు తెలుసా అని సుకుమారి బిందును అడుగుతుంది. బిందూ వెళ్ళి శకుంతలని అడుగుతుంది. అవునంటుంది శకుంతల. సిద్ధార్థ ఈ నిర్ణయానికి తానూ ఒక కారణమేమో అని అంటుంది బిందు. కావచ్చు, సిద్ధూ నిన్ను ప్రేమించాడు, అందుకే సుందరిని కాదన్నాడు, ఆమె అతని హృదయాన్ని గాయపరిచింది అని శకుంతల చెప్తుంది. ఏది ఏమైనా సిద్ధూ చదువు మానేయకూడదని, అవసరమైతే ఆ డబ్బు తానిస్తానని అంటుంది బిందూ. మీ అమ్మ గారికి తెలిస్తే? అని అడుగుతుంది. అమ్మని ఒప్పిస్తానని చెప్పి, తనిచ్చే డబ్బు సిద్ధూ తీసుకునేలా చేసే బాధ్యత శకుంతల మీద పెడుతుంది బిందూ. ఇక చదవండి.]

అధ్యాయం-25

[dropcap]సి[/dropcap]ద్ధార్థ కాలేజీ ప్రాంగణంలో చెట్టు క్రింద కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. శకుంతల అతడ్ని చూసి అతని వేపు అడుగులేసింది. ఆమెను చూసి చిన్నగా నవ్వాడు సిద్ధార్థ. ఆ నవ్వు వెనక విషాదాన్ని గుర్తించింది ఆమె.

“ఓ ముఖ్య విషయం మాట్లాడాలి.”

“నీవు మాట్లాడదల్చుకున్న విషయం నాకు తెలుసు,” నవ్వుతూ అన్నాడు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నా అతని మనస్సుకి మాత్రం ప్రశాంతత లేదు. ఆ ప్రశాంత వాతావరణంలో ఒకరి వ్యథలు మరొకరికి తెలుసుకోడానికి సాధ్యమవుతుంది.

ఆహ్లాదకరమైన వాతావరణంలో సిద్ధార్థ మనస్సు చిందర వందరగా ఉంది. కలతబారిన హృదయం, చెప్పనలవి కానంత బాధ. ఇదీ సిద్ధార్థ మానసిక స్థితి.

“క్షమించండి బావా!”

“దేని గురించి?”

“కాత్యాయిని ఆంటీ అన్ని విషయాలూ చెప్పారు. సుందరి తొందరబాటు మనిషే కాని బోళా మనిషి కూడా. దాని తరుపున నేను క్షమాపణ కోరుతున్నాను.”

సుందరి ప్రస్తావన రాగానే అతని కను బొమ్మలు ఒక్కక్షణం ముడిపడి విడిపోయాయి.

“సుందరి అన్న మాటల్లో నిజం లేకపోలేదు. వాళ్ళలాంటి ధనికులు మాలాంటి పేద వాళ్ళు జీవితాల్తో ఆటలాడుకుంటారు. వాళ్ళు వేసిన వలలో చిక్కుకున్న చిరు చేపల్లాంటి వాళ్ళమి మేము. వాళ్ళు ఉచ్చు విసురుతే ఆ ఉచ్చులోపడి బిగుసుకుపోయి గిలగిల్లాడుతున్న మూగ జీవాల్లాంటి వాళ్ళమి మేము. కోరికలు, ఆశలు, ఆశయాలు, అభిలాషలు అన్నీ ఉన్నా వాటిని చంపుకుని జీవచ్ఛవాల్లా జీవితం గడిపి వేసే బడుగు జీవితాలు మావి. మా వ్యక్తిత్వాన్ని పరిహసిస్తూ – మా ఆత్మగౌరవాన్ని అణగద్రొక్కేస్తూ – మా జీవితాల్తో చెలగాటం ఆడుతూ తమ స్వార్థం కోసం మమ్మల్ని పావులుగా వాడుకుంటున్న స్వార్థపరులు వాళ్ళు.”

తన మనస్సులో ఉన్న ఆవేశం దానితో పాటు ఆవేదన చిన్నపాటి ఉపన్యాస ధోరణిలో అంటున్న అతనిలో బాధ సుడులు సుడులుగా బయటకు వస్తోంది. శకుంతల మౌనంగా కూర్చుని అతని మనోవేదన అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది.

“నిన్ను నా మాటల్తో విసిగించేను. బాధ పెట్టేనేమో!”

“లేదు.. లేదు..!” అంది శకుంతల.

“బంధుత్వం కన్నా స్నేహబంధమే మిన్న అని నమ్ముతున్న వాడిని. అందుకే నా ఆవేదన ఆత్మీయురాలిగా భావించి నీకు చెప్పేను శకూ! ఇలా చెప్పుకుంటే బాధ కొంతయినా తగ్గుతుంది మనస్సు తేలిక పడ్తుందని నా భ్రమ.” ఇలా చెప్తున్న సమయంలో అతని కంఠంలో దుఃఖ జీర అస్పష్టంగా గుర్తించ గలిగింది.

“మనమందరం మధ్య తరగతి మనుష్యులమే. అలాంటప్పుడు నీవు నిన్ను ఎందుకు అలా కించపరుచుకుంటావు బావా!”

“అందరి విషయం ఎలా ఉన్నా నా తండ్రి మాత్రం దిగువ మధ్య తరగతి మనిషి. దానికి తోడు సంతానం కూడా ఎక్కువే. అటువంటి పరిస్థితిలో చదువుకోవాలన్న నా కోరిక. ఇంటర్లో మంచి మార్కుల్తో పాసై ఎమ్‌సెట్లో ర్యాంకు సంపాదించిన నన్ను ఇంజనీరింగు చదివించాలని పెద్దవాళ్ళ కోరిక.

నా తల్లిదండ్రులు ఆర్థికంగా, సంఘంలో మంచి పలుకుబడి, రాజకీయంలో కూడా పరపతి ఉన్న మామయ్యని నా చదువుకి సహాయం చేయమని అర్థించారు. మామయ్య కూడా ఏ ఉద్దేశంలో ఉన్నాడో కాని అంగీకరించాడు. అయితే అతను అలా అంగీకరించడంలో అతని ఉద్దేశం నాకు ఆ తరువాత తెలిసింది. తన కూతురు సుందరిని నాకిచ్చి పెళ్ళి చేయడానికి, దానికి బదులుగా అతను నన్ను చదివించడానికి ఇదీ అతని షరతు. సుందరంటే నాకు ఇష్టం లేదు. అయితే నా తల్లిదండ్రుల బలవంతం మీద విధిలేని పరిస్థితిలో అంగీకరించవల్సి వచ్చింది అతని షరతు.

ఒక విధంగా నాకు ఇష్టం లేకపోయినా డబ్బుకి అమ్ముడు పోయాను. డబ్బు దగ్గర నా వ్యక్తిత్వం, ఆశలు, అధికారాలు – ఆకాంక్షలు అన్నీ అమ్ముడు పోయాయి” సిద్ధార్థ ముఖంలో బాధ అగుపడుతుందో అలా అంటున్న సమయంలో.

“ఒక్కవిషయం నాకు ఆనందం కలిగిస్తోంది. నేను బలిపశువునయినా పరవాలేదు. నా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నాడు మామయ్య. దీనికి కారణం అతని స్వార్థం. ఆ స్వార్థమే తన కూతుర్ని నాకు అంటగట్టాలని”.

“సుందరి ఇంత అహంకారిగా తయారవుతుందని నేను ఊహించలేదు. సుందరి అలా తయారవడానికి కారణం పుట్టి పెరిగిన వాతావరణం. ఈ విషయం తెలిసి బిందు కూడా చాలా బాధపడుతోంది.” అంది శకుంతల.

బిందు ప్రస్తావన రాగానే అతని వదనం సంతోషంతో ఒక్కసారి వెలిగిపోయింది. తన కోసం బాధపడే వ్యక్తి ఉంది అన్న ఆలోచన అతనికి సంతోషాన్ని కలిగించింది. అతని హృదయం గర్వంతో ఉప్పొంగింది.

“తన వల్లనే ఇంత రాద్ధాంతం అంతా జరిగిందని తెగ బాధపడిపోతోంది.”

“అలా ఆలోచించడం ఆమె ఉన్న పరిస్థితిలో సహజమే కాని అలా ఆలోచించడం అవివేకం అని నేను అంటాను. ముఖ్యంగా బిందూ పరిచయం వలన నాకు మంచే జరిగింది. నా జీవితంలో బిందు ప్రవేశించకపోతే సుందరి మెడలో మూడు ముళ్ళూ వేసి జీవితాంతం నరకయాతన అనుభవించేవాడిని,” అన్నాడు సిద్ధార్థ.

“నాకయితే చాలా భయంగా ఉంది. మీరు మీ మనస్సుకి అలా సర్ది చెప్పుకోవచ్చు కాని అయితే దీని పర్యావసానం ఎలా ఉండబోతోందో? ముందు ముందు ఎన్ని గొడవలు వస్తాయో అన్న భయం కలుగుతోంది. ఈ విషమ పరిస్థితిలో ఆ భగవంతుడు మీ ఇద్దరికీ తగినంత మనోబలం ఇవ్వాలి. మీ ఇద్దరూ ఒకటయితే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తూ ఉంటాను,” అంది శకుంతల.

మన ఆలోచన్లు, మన ఊహలు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలోచన్లు, ఊహలుగాను మిగిలిపోతాయి. మన ఆలోచనకి జరుగుతున్న సంఘటనలకి పొంతం లేకుండా పోతుంది ఒక్కొక్క సమయంలో.

“నీ మనస్సు మంచిది కాబట్టి అలాగ ఆలోచిస్తున్నావు. నీలాగే సమాజంలో అందరూ అంత నిర్మలమైన మనస్కులు కాదు. అలాంటి వాళ్ళే అందరూ అయితే ఇంత అశాంతిని ఎదుర్కొనే పరిస్థితి వచ్చి ఉండేది కాదు.”

సిద్ధార్థ మాటలకి శకుంతల ఏం సమాధానం ఇయ్యలేదు. చెట్ల సందుల్లో నుండి భూమి మీదకు పడ్తున్న సూర్యకిరణాలు వంక చూస్తోంది.

“ఏం మాట్లాడ్డం లేదు. నిన్ను పొగడ్తల్తో ముంచెత్తుతున్నానని ఇబ్బందిగా ఉందా? ఇవి పొగడ్తలు కావు. నీలో ఉన్న మంచి గుణాల్ని తెలియజేస్తున్నాను అంతే.”

“మంచి చెడు అనేవి మనలో ఉన్న గుణాలే. అయితే మనం చూసే దృష్టి, మనస్సు, ఆలోచన మొదలైన వాటిని బట్టి ఈ మంచి చెడులుంటాయి. ఒకరి దృష్టిలో మంచిదయినది, మరొకరి దృష్టిలో అది చెడు అవచ్చు. మంచి చెడులు నిర్ణయించడం మనిషి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది,” అంది శకుంతల.

“నీవన్నదీ నిజమే శకూ!”

శకుంతలకి బిందూ మాటలు గుర్తుకు వచ్చాయి. ‘నేను ఇచ్చిన డబ్బు తీసుకుని సిద్ధార్థ తన చదువు సాగించాలి. డబ్బును తీసుకునేటట్టు అతడ్ని ఒప్పించే పూచీ నీదే’ అంది బిందు.

“నాదో మాట, కోరిక కూడా.”

“చెప్పాలి.”

“అవసరం వచ్చినప్పుడు చెప్తాను. నా కోరిక కాదనకూడదు.”

“తప్పకుండా,”

ఇద్దరూ లేచారు.

అధ్యాయం-26

కాలేజీ విడిచి పెట్టారు. కాలేజీ ప్రాంగణం నుండి బయటకు నడుస్తోంది శకుంతల.

“శకుంతల గారూ!”

తల పైకెత్తి చూసింది. ఎదురుగా రవి. అతడ్ని చూసినా, అతనితో మాట్లాడినా ఆమె మనస్సు పురివిప్పిన మయూరంలా నృత్యం చేస్తుంది. ఆమెకి తనకి తెలియకుండా అలౌకిక ఆనందం కలుగుతుంది. తను అతడ్ని ప్రేమిస్తోందా? మునపటిలాగే ప్రశ్న వేసుకుంది. అయితే అవచ్చు, సమాధాన పరుచుకుంది.

“నేను విన్నది నిజమేనా?”

“దేని గురించి?”

“సిద్ధూ చదువు ఆపు చేస్తున్నాడన్న విషయం గురించి.”

“అవును.”

“ఇంత అకస్మాత్తుగా సిద్ధూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి? అతని ఆ నిర్ణయాన్ని నేను సమర్థించలేకపోతున్నాను. అంగీకరించలేక పోతున్నాను. అవివేకమైన నిర్ణయాన్ని నేను హర్షించను.”

“మన అంగీకారాలతో అతనికి సంబంధం లేదు. అయినా అతని బాధలు అతనికుంటాయి. అందుకే అంటారు పీత కష్టాలు పీతకుంటాయని.”

“నేను సిద్ధూనే సూటిగా అడిగితే బాధపడతాడని అడగలేదు. కారణం మీకు తెలుస్తే చెప్తారా?”

“కారణాలు ఏముంటాయి? మధ్య తరగతి మనుష్యులకి, వాళ్ళ కష్టాలు, సమస్యలూ, ఒడిదొడుకులూ, మనస్పర్థలూ మామూలే కదా! ఇవే కదా వాళ్ళ నేస్తాలు.”

“చెప్పేదేదో సూటిగా చెప్పచ్చు కదా!”

“అర్థం చేసుకోలేరా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ మధ్య తరగతి మనిషి అయిన సిద్ధార్థని మేనమామ డబ్బు ఖర్చుపెట్టి చదివిస్తున్నాడు. అలా చదివించడంలో అతని స్వార్థం అతనిది. తన కూతుర్ని అతనికి ఇచ్చి పెళ్ళి చేసి అల్లుడుగా తెచ్చుకోవాలని, అయితే చదువు సంధ్యలకి, సంస్కారానికి ఆమడ దూరంలో ఉన్న అతని కూతుర్ని పెళ్ళి చేసుకోవడం ఈ మధ్య తరగతి మనిషికిష్టం లేదు. అతను ఓ అమ్మాయి మీద మనస్సు పారేసుకున్నాడు. ఈ విషయం తెలిసి మేనమామ చదువుకి ఆర్థిక సాయం చేయడానికి తిరస్కరించాడు. అవమానించి అతనికి మనస్తాపం కలిగించాడు. ఆత్మాభిమానం మెండుగా గల సిద్ధార్థ చదువు మానేద్దామని నిర్ణయించుకున్నాడు.”

“సిద్ధార్థ మనస్సు పారేసుకున్న అమ్మాయి బిందు కదూ!”

“నా నోటితో చెప్పించాలనా మీ ఉద్దేశం?” చిన్నగా నవ్వుతూ అంది శకుంతల, రవి కూడా చిన్నగా నవ్వాడు.

రవి ఆలోచిస్తున్నాడు. వయస్సు పెరుగుతున్న కొలదీ జీవితంలో ఎన్ని సమస్యలూ? ఎన్ని కష్టాలూ? ఏ సమస్యలూ, కష్టాలు తెలియని బాల్యం రోజులు ఎంత బాగా ఉండేవి? మానవ జీవితంలో మరుపురాని మధుర దశ బాల్యం. అమ్మ ఒడిలో నుండి వీధి బడిలోకి అడుగుపెట్టిన రోజుల్లో తోటి పిల్లలతో ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలూ, మధుర స్మృతులు, పాఠశాల రోజులు, మదిలో మెదులుతున్నప్పుడల్లా తిరిగి బాల్యం రోజులు వస్తే ఎంత బాగుండును అని అనిపిస్తుంది. బాల్యం ఏ ఆచ్ఛాదనం లేనిది. భావ కాలుష్యాలు లేని స్వచ్ఛమైన అనుభూతులతో నిండినది. సుఖదుఃఖాలతో సంబంధం లేని ఆనందం నిత్య ప్రవాహ రూపంగా ఉంటుంది. బాల్యంలో ఆనందం నిత్య స్రవంతిగా ఉంటుంది. బాల్య స్మృతులు గుర్తుకు వచ్చినప్పుడు మనస్సు అవిజ్ఞతమైన ఆనందంలో మునిగిపోతుంది.

“బావనా ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టున్నారు?” రవిని ఆట పట్టిస్తూ అంది శకుంతల. ఉలిక్కిపడి బాహ్య జగత్తులోకి అడుగుపెట్టాడు.

“మధురమైన బాల్యం రోజులు తిరిగి వస్తే ఎంత బాగుండును? అని ఆలోచిస్తున్నాను.”

“నిజమే! బాల్యం అందరికీ మధురమైనదే. పరిస్థితిలెంత మారినా, ఎన్ని ప్రాకృతికానుభావాలు కోల్పోయినా బాల్యం ఎప్పుడూ బాల్యమే. ప్రతీ మనిషి జీవితంలో బాల్యం ఓ సువర్ణ సుప్రభాతం. పిల్లల మనస్సు తెల్లకాగితం లాంటిది. కల్లాకపటం ఎరుగనిది. ఉల్లాసం, ఉత్సాహం, సంతోషం ఆటపాటల బాల్యం ఎవరికైనా అమూల్య వరమే. ఉరుము ఉరుముతే, మెరుపు మెరిస్తే ఆకాశాన్న హరివిల్లు విరుస్తే మనదనుకుంటారు పిల్లలు. సున్నితత్వం, చవలత్వం, సృజనాత్మకత సౌందర్య దృష్ఠి అన్ని బాల్యం నిండా తొణికిసలాడుతుంటాయి. అరవిరసిన పువ్వులా స్వచ్ఛంగా బాల్యంలో మాత్రమే మనం నవ్వగలుగుతాం. అరమరికలు లేకుండా.”

“అయ్య బాబోయ్! నాకు అర్థం కాని పదాలతో బాల్యం గురించి అలా మాట్లాడేస్తున్నారు శకుంతల గారూ!” నవ్వుతూ అన్నాడు రవి. ఆమె కూడా ఆ నవ్వులో పాలు పంచుకుంది.

“అయితే శకుంతల గారూ! అందరి బాల్యాలూ అంత ఆనందకరమైనవి మాత్రం కాదు. కొంతమంది ధనవంతులు ఇళ్ళల్లో పుడతారు, మరికొందరు పూరి గుడిసెల్లో జీవన యాత్ర సాగిస్తారు. అయితే అందరూ బాల్యాన్ని అనుభవిస్తారు. ధనవంతుల పిల్లలు ప్లే స్కూళ్ళు, కాన్వెంటుల్లో చదువుతారు. బీద పిల్లలు వీధి బడుల్లో విద్యనభ్యసిస్తారు. అయితే ఆటలు, చదువులు వేరైనా అనుభూతులు, మాత్రం ఒక్కటే. బాల్యం అందరికీ ఒక్కటే, అది తిరిగిరాని మధుర జ్ఞాపకం. ఆ ఆహ్లాదకరమైన బాల్యం, అనుభూతుల జ్ఞాపకాలు మాసిపోని బాల్యం అందరికీ ఉండకపోయినా కొంతమందికి మనసు పొరల్లో రంగు రంగు దృశ్యాల రూపంలో కదలాడుతూ ఉంటుంది. అలాంటి బాల్య జ్ఞాపకాలన్నింటినీ అక్షరాల్లో నింపి, భావ చిత్రాల్లో నింపి, పద బందాల్లో బంధించి రంగుల కలలతో రంగరించి సరికొత్త ఇమేజనరీతో బాల్యపు మధురాను భూతులు పరిమళిస్తాయి.”

“ఇప్పుడు మీరు నాకు తెలియని పదాల్తో మాట్లాడుతున్నారు.” ఇలా అంటూ శకుంతల చిన్నగా నవ్వింది.

నిజమే! బాల్యం రవి, శకుంతల దృష్టిలో చాలా మధురమైనది. ఎడారిలో ప్రయాణిస్తున్న మనిషికి ఒయాసిస్ కనిపిస్తే ఎలా ఉంటుందో అలాంటిదే బాల్యం. ఇది జీవితానికి తొలిమెట్టు. ఒక మల్లెపూల వనం. చిగురించిన ఆశాలత లెన్నో అల్లుకునే సమయం అది.

“శకుంతల గారూ!”

“ఊఁ!! చెప్పండి.”

“అంత అందమైన బాల్యం ఇప్పుడు పిడికిలి వేళ్ళ సందుల్లోంచి ఇసకలా జారిపోతోంది. అరచేతికి అంటిన మట్టి మరకలా మిగిలిపోయింది. బాల్యానికి పాపం తెలియదు. పుణ్యం తెలియదు. ఎండా, వానా, కష్టం, సుఖం మాయామర్మం తెలియని వయస్సు బాల్యానిది. బాల్యమనే ముత్యపు చిప్పలో నిర్మలత్వాన్ని పొదిగిన స్వాతి ముత్యం బాల్యం. ఈర్ష్యా, ద్వేషం, పగ అసలే తెలియని వయస్సు అది. నిర్మలత్వానికి, స్వచ్ఛతకి, బాల్యం, ఆదర్శంగా నిలుస్తుంది. ఈ బాల్యం కష్టనష్టాలు, కులగోత్రాలు తెలియనిది. డబ్బు లోపిస్తే కుమిలిపోనిది. ధన గర్వంతో అహంకరించనిది. అలాంటి బాల్యం నేడు విషమ సంస్కృతి, ప్రపంచీకరణ నేపద్యంలో నలిగిపోతాంది. మసిబారిపోవడం చూస్తేంటే చాలా బాధగా ఉంటుంది,” రవి అన్నాడు.

“మనం బాల్యం అనే భావ జాలంలో మునిగి తేలుతున్నాం. కాని నేటి మనకళ్ళెదుట ఉన్న వాస్తవిక పరిస్థితిని మరిచిపోతున్నాం.”

“సిద్ధార్థ గురించే కదా!”

“అవును.”

“సిద్ధార్థను ఆర్థికంగా ఆదుకోవడంలో అసమర్థుడ్ని నేను. అలాంటి నేను అతనికి ఎలా సహాయపడగలను?”

“నా పరిస్థితీ అంతే!”

“మరి ఇప్పుడెలా?”

“బిందు అతడ్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకు వచ్చింది.”

“అతడు అంగీకరిస్తాడా? అసలే అతను ఆత్మాభిమానం గల మనిషి,”

“అతడ్ని ఒప్పించే బాధ్యత బిందు నాపై ఉంచింది.”

“బిందు ఈ పని వాళ్ళ అమ్మగారికి చెప్పే చేస్తోందా? ఆవిడ ఈ పనికి అంగీకరిస్తారా?” సందేహం వెలిబుచ్చాడు రవి.

“ఒప్పిస్తానంది. వాళ్ళ మమ్మీకి తెలిసినా పరవాలేదు,” అంది.

సంధ్య చీకట్లు నలు దిశలా తరుముకొస్తున్న సమయమది. ఇద్దరూ వాళ్ళ వాళ్ళ నివాసాలకి బయలుదేరారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here