సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-15

0
3

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[తను సిద్ధార్థకి ఆర్థికంగా సాయం చేసేందుకు సిద్ధమయిన సంగతి కాలేజీలో అందరికీ తెలిసినా, రవి మాత్రం తనని ఎందుకు అడగలేదా అని అనుకుంటుంది బిందు. ఓసారి రవి కలిసినప్పుడు అదే మాట అతనిని అడుగుతుంది. తెలుసనీ, విన్నానని చెప్తాడు. మరి ‘మీ అమ్మగారి రియాక్షన్ ఏమిటి?’ అని అడుగుతాడు. అమ్మకి తెలుసని, అమ్మ తనని క్షమించిందనీ, సిద్ధూకి సాయం చేయడానికి ఒప్పుకుందనీ చెప్తుంది. ఆకర్షణలకి లోనయి చదువు పాడుచేసుకోవద్దని హెచ్చరించిందని చెప్తుంది. తాను బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసిన సంగతి ఇందిరా ఆంటీ చూశారనీ, ఆమె అమ్మకి చెప్పి ఉంటారని అంటుంది. ‘అయితే మా అక్క మీద నీకు కోపం వచ్చిందా’ అని రవి అడిగితే, ‘అదేం లేదు ఆవిడ నా మేలు కోరే అమ్మకి చెప్పారు’ అని అంటుంది బిందు. ఇకపై ప్రతి అడుగూ ఆలోచించి వేయమని రవి బిందూకి చెప్తాడు. నిరాశకి లోనయిన సిద్ధార్థ కాలేజీ మానేసి రూమ్‍లో సామాన్లు అన్ని సర్దుకుని ఊరికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో బిందూ, శకుంతల అతని గదికి వెళ్తారు. అప్పుడు శకుంతల – సిద్ధార్థ తనకి ఇచ్చిన మాట సంగతి గుర్తు చేస్తుంది. అయితే ఆమె కోరిక తన ఆత్మగౌరవానికి భంగం కలిగించకూడదంటాడు సిద్ధార్థ.  అప్పుడు బిందూ సంచీలోంచి డబ్బు తీసి ఎదురుగా ఉన్న బల్లపై పెడుతుంది. సిద్ధూ చదువు ఆగిపోకూడదని బిందూ చేసిన సాహసమిది అని చెప్తుంది శకుంతల. బిందూ తనకి సాయం చేయటమేమిటని విస్తుపోతాడు సిద్ధూ. డబ్బు తీసుకోమని శకుంతల ఒత్తిడి చేస్తుంది. దాని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని అంటాడు సిద్ధూ. ఈ విషయం బిందూ వాళ్ళకి అమ్మకి తెలిస్తే అని అడుగుతాడు. ఆవిడకి తెలుసని అంటుంది శకుంతల. ఆ డబ్బు వద్దంటాడు సిద్ధూ. కానీ శకుంతల అప్పుగా నైనా తీసుకోమని ఒత్తిడి చేస్తుంది. చివరికి ఒప్పుకుంటాడు అతను. బిందూ ధన్యవాదాలు చెప్తుంది. శకుంతల, బిందూ అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక చదవండి.]

అధ్యాయం-29

[dropcap]మా[/dropcap]నవ జీవితంలో మధురమైన దశ బాల్యం. మనిషి మీద జీవిత పర్యంతం ప్రభావం చూపేది కూడా బాల్య దశే. అటువంటి ఆహ్లాదకరమైన బాల్యం, అనుభూతుల జ్ఞాపకాలు అందరికీ ఉండవు. మల్లెపూవు లాంటి బాల్యం పరిసరాల ప్రభావంతో ఇంటి వాతావరణ పరిస్థితుల వలన మసక బారిపోతుంది.

నైతికత లోపించి, అనైతిక వాతావరణంలో మసలుతున్న పిల్లల మీద ఆ వాతావరణం ప్రభావం తప్పకుండా పడుతుంది. ధర్మారావు తండ్రి ముకుందం తన ఆఫీసులో పని చేస్తున్న మీనాక్షిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఈ ప్రేమ పెళ్ళి మీనాక్షి తండ్రికి సుతారం ఇష్టం లేదు. తన అభీష్టానికి వ్యతిరేకంగా కూతురు పెళ్ళి చేసుకునేసరికి అతను తట్టుకోలేకపోయాడు. భావోద్రేకానికి లోనయ్యాడు. కూతుర్ని ఇంటి గడప ఎక్కద్దని శాసించాడు.

మీనాక్షి అన్న భుజంగం మాత్రం చెల్లెలు మీద మమకారం చంపుకోలేకపోయాడు. తండ్రీకీ కూతురు మీద మమకారం ఉంది కాని తన మమకారాన్ని గుండెల అడుగు పొరల్లో దాచేసుకుని పైకి కఠినంగా వ్యవహరించాడు. ఎన్నో రాత్రులు బాధపడ్తూ నిద్ర లేని రాత్రులు గడిపాడు. కన్నుల్లో చిందిన కన్నీటిని దాచుకునేవాడు. భార్యతో పాటు తను కూడా

ఈ సంఘటన జరగక ముందే చనిపోతే ఎంత బాగుండును అని వాపోయేవాడు. తండ్రికి తెలియకుండా భుజంగం చెల్లెలు యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఉండేవాడు. అయితే ఈ విషయం తండ్రికి కూడ తెలుసు. కూతురు మీద మమకారం చంపేసుకున్నట్టు నటించేవాడు.

పెళ్ళి అయిన కొన్ని రోజులు వరకూ ముకుందం, మీనాక్షీ సంసారం సవ్యంగానే సాగింది. పెళ్ళవగానే భార్యని ఉద్యోగం మానిపించాడు ముకుందం. అతనిలో రాను రాను నైతికత లోపించి, అనైతికత చోటు చేసుకుంది. శాడిస్టులా తయారయ్యాడు. మీనాక్షి తండ్రి చనిపోయినా ఆమెను పుట్టింటి గడప తొక్కనీయలేదు.

అటువంటి అనైతిక వాతావరణంలో మసలుతున్న పిల్లల మీద ఆ వాతావరణ ప్రభావం తప్పకుండా పడుతుంది. కొడుకు ధర్మారావు మీద ఆ ఇంటి వాతావరణ ప్రభావ చూపించడం సహజం.

ముకుందం రాను రాను తాగుబోతు, తిరుగుబోతుగా మారాడు. భార్య మీనాక్షి అతని దృష్టిలో తనకు వంట చేసి పెట్టే వంటమనిషి, పడకటింటిలో సుఖాన్ని ఇచ్చే మరబొమ్మ. ఇదే అతని భావన. అతని దృష్టిలో భార్యకి ఏ విలువలేదు. క్లబ్బుల్లో తాగి తందనాలాడ్డం, జూదం, సాని కొంపలకి వెళ్ళి అర్ధరాత్రో ఇంటికి రావడం, కారణం లేకుండానే భార్యని చితక బాదడం ఇదే అతని అలవాటుగా మారింది.

ఈ విషయం తెలిసి మీనాక్షి అన్నయ్య చాలా బాధపడేవాడు. ఏం చేయలేని పరిస్థితి. మీనాక్షికి రాజేశ్వరత్తయ్య పోలికి వచ్చేసిందనుకుని బాధపడేవాడు. భుజంగరావు మేనత్త కూడా ప్రేమించి పెళ్ళి చేసుకుంది. మొగుడు ఆమెను సరిగా చూసుకోకుండా బోగం వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగేవాడు. అత్తయ్య జీవితం అందుకే అర్ధంతరంగా ముగిసిపోయింది. అందుకే తన తండ్రికి ప్రేమ పెళ్ళిళ్ళ మీద సదభిప్రాయం లేదు. అందుకే అతను మీనాక్షి పెళ్ళిని సమర్థించలేదు. ఇలా ఆలోచిస్తాడు భుజంగరావు ఒక్కొక్క పర్యాయం.

ముకుందం ఒక్కొక్క పర్యాయం బోగం వాళ్ళని ఇంటికి తెచ్చుకుని భార్య, ఎదుగుతున్న కొడుకు ముందే వాళ్ళతో కులకడమే అతని దినచర్యగా మారింది. మీనాక్షి ఏం చేయలేని అసహాయురాలు. వర్తమానం ఆమెను కృంగదీస్తూ ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన ఆమెను మరింత కలవరపెట్టేది.

ఒక ప్రక్క భర్త వ్యసనాలు, రెండో ప్రక్క పెరుగుతున్న కొడుకు. తన అసహాయ స్థితి వీటి మధ్య నలిగిపోతోంది ఆమె జీవితం. ఆనందం, సుఖం లేని ఈ జీవితం ఎందుకు? మృత్యువు తనని కబళించినా ఎంత బాగుండును? వేదాంత ధోరణిలో అనుకునేది ఓ పర్యాయం. తనని తొందరగా ఈ కష్టాలు నుండి విముక్తి చేయమని దేవుడ్ని ప్రార్థించేది.

మానవ జీవితంలో ఈ కష్టాలు, ఆపదలు, పరీక్షల్లాంటివి. ఇవి లేకపోతే మానవుడు, భగవంతుడ్ని తలుచుకోకుండా అతని అస్తిత్వాన్నే మరిచిపోయి ఉండేవాడు. అందుకే దేఁవుడు ఈ పరీక్షలకి, బాధలకి గురి చేస్తున్నాడు. అనుకుని విరక్తిగా నవ్వుకునేది మీనాక్షి.

ముకుందం క్రమంగా ఇంటికి రావడమే మానేశాడు. ఎవతితోనో సహజీవనం చేస్తున్నాడు అని మీనాక్షి చూచాయగా వింది. ఇవతల కొడుకు అదుపు తప్పి వక్ర మార్గం పట్టడం ఆమెను మరింత బాధకి గురి చేస్తోంది. చదువు మానేసి అల్లరి పిల్లల్తో గోళీలాట ఆడుకోవడం, తగవులు పెట్టుకోవడం, చిన్న చిన్న దొంగతనాలు కూడా చేయడం, ఎవరో కాల్చి పారేసిన సిగరెట్టు పీకలు నోట్లో పెట్టుకుని పీకలు పీల్చడం, కొడుకు ఈ చర్యలు ఆమెని మరింత మనస్తాపానికి గురి చేస్తూ ఉండేవి.

ఆమెకి ఎన్నో కోరికలు ఉండేవి. వాటిని తీర్చుకోవాలన్న ఆశ ఉండేది. చక్కని కుటుంబం, యోగ్యుడైన భర్త, మంచి సంతానం. సుఖమైన సంసార జీవితం ఇవే ఉంటే ఎంత బాగుండును? అని అనుకునేది మీనాక్షి ఒక్కొక్క పర్యాయం. తన మనస్సుని కోరికలకి దూరంగా ఉంచడం ఆమెకి సాధ్యం కాలేదు.

అయితే ఆమె వైవాహిక జీవితంలో ఆ కోరికలు ఏవీ, తను అనుకున్నట్టు అవలేదు. చక్కని కుటుంబం ఉండాలన్న ఆమె కోరిక కోరికగానే మిగిలిపోయింది. యోగ్యుడైన భర్త లభించాలన్న ఆమె కోరిక ఎండమావే అయింది. వ్యసనపరుడు అయిన భర్త, నిత్యం తనని పెడ్తున్న నరకయాతనలు ఆమెను నిస్సహాయురాల్ని చేశాయి. పోనీ యోగ్యులైన మంచి సంతానం పొందాలన్న మీనాక్షి కోరిక కూడా నెరవేరలేదు. జులాయిగా తిరుగుతున్న కొడుకుని ఎలా సక్రమమైన మార్గంలో పెట్టాలో తెలియని అయోమయ పరిస్థితి ఆమెది.

భర్త సరిగా ఇంటికి రావటం లేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా సమాజంలో కొంతమంది ఆదవాళ్ళకి వాక్ స్వాతంత్ర్యం రాలేదు. ఆర్థిక స్వాతంత్య్రం రాలేదు. అద్దె చెల్లించమని ఇంటి యజమాని సతాయిస్తున్నాడు. ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ మధ్య ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతింది.

అశాంతి వాతావరణంలో ఆరోగ్యం కూడా దూరంగా వెళ్ళిపోతోంది. ఆశ అడుగంటిన నాడు నిరాశ అక్కడ చేరుకుని మనిషిని నైరాశ్యానికి గురి చేస్తుంది. మీనాక్షి పరిస్థితి అదే అయింది.

అన్నయ్య భుజంగరావుకి చెల్లెలు అనారోగ్య పరిస్థితి, బావమరిది వ్యవహారం అన్నీ తెలిసాయి. రక్త సంబంధం అతడ్ని ప్రశాంతంగా ఉండనీయలేదు. చెల్లెలు ఇంటికి వెళ్ళి చెల్లెల్ని తనింటికి తీసుకువచ్చాడు.

చెల్లెలు వాంతి చేసుకుంటే రక్తం పడ్డం చూసి కంగారు పడిన అతను మీనాక్షిని పట్నం తీసుకెళ్ళి వైద్య పరీక్షలు జరిపించాడు. కేన్సరు వ్యాధి సోకింది చెల్లిలకని తెలసి తల్లడిల్లిపోయాడు. ముకుందం మీద విపరీతమైన కోపం వచ్చింది అతనికి. వెళ్ళి ముకుందాన్ని చెడామడా తిట్టాలన్నంత కోపం వచ్చింది అతనికి. అయితే మీనాక్షి అతడ్ని వారించింది.

ఈ సమయంలో భావోద్వేగాలకి గురవడం కాదు. చెల్లెలు ఆరోగ్యం గురించి ముందు దృష్టి నిలపాలి అని అనుకున్న అతను ఆమెకి వైద్యం చేయిస్తున్నాడు. అయితే ఆ వైద్యం ఆమె శరీరం మీద పనిచేయటం లేదు. రోజు రోజుకి ఆమె మృత్యువుకి సమీపిస్తోంది అని తెలిసి ఆ అన్న తల్లడిల్లిపోయాడు.

మేనల్లుడు ధర్మారావును పాఠశాలలో చేర్పించినా అతని చదువు సక్రమంగా లేదని గ్రహించాడు. ఓ రోజు మీనాక్షి అన్నయ్య చేతిలో కొడుకు చేయి ఉంచి “అన్నయ్యా! నేను ఎక్కువ రోజులు బ్రతకను. ఈ విషయం ఎవ్వరూ చెప్పకపోయినా నాకు తెలుసు. అయితే నాది ఒక్కటే కోరిక నీ మేనల్లుడ్ని నీ అల్లుడిగా చేసుకోవాలి,” అంది.

భుజంగరావు ఆలోచన్లలో పడ్డాడు. ఇది తన కూతురి జీవిత సమస్య. పెద్దయ్యాక తన కూతురి మనోభావాలు ఎలా ఉంటాయో? తన కూతురి జీవితాన్ని ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా చేయలేడు. అందుకే మాట ఇవ్వటానికి తటపటాయించాడు భుజంగరావు.

‘చెల్లెలు వైద్యానికి వెరవకుండా ఎంత డబ్బు అయినా ఖర్చు పెడ్తాను. ఆమె జీవితం సుఖంగా ఉండడానికి మరే కోరికనయినా నెరవేరుస్తాను కాని మేనల్లుడ్ని మాత్రం అల్లుడుగా మాత్రం చేసుకోవడం అసాధ్యం,’ ఇలా ఆలోచిస్తున్నాడు భుజంగరావు.

కోరికల్లా ఆలోచనలకి కూడా అంతం అన్నది ఉండదు. మనం ఎప్పుడూ ఖాళీగా కూర్చోము. మెదడులో ఏవో ఆలోచనలు వచ్చి చేరుతూనే ఉంటాయి. ఒక్కొక్క పర్యాయం మన ఆలోచనల ప్రకారం పనలు జరగవు.

“ఏంటి ఆలోచిస్తున్నావు అన్నయ్య? నీకు నా కోరిక ఇష్టం లేదని తెలుస్తోంది. అవునులే, ఆ తండ్రి పోలికలే ఈ కొడుక్కి వస్తాయని, నీకు భయం కదూ! ఈ జులాయి వెదవకి నా కూతుర్ని ఇచ్చి పెళ్ళి ఎలా జరిపిస్తాను అని ఆలోచిస్తున్నావు కదూ!” మీనాక్షి బాధగా అంది.

“లేదు.. లేదు..” అన్నాడు భుజంగరావు తడబడ్తూ.

“నాకు తెలుసు,” అంది మీనాక్షి బాధగా.

ఆ సమయంలో చెల్లెలకి ఏ మాటా ఇవ్వలేదు భుజంగరావు. ఒకవేళ మాట ఇచ్చి ఆ మాట ప్రకారం నడుచుకోపోతే తను ఆమెను మోసం చేసిన మోసగాడుగా మిగిలి పోతాడు. అందుకే మాట ఇవ్వడానికి తటపటాయించాడు.

“నాకు తెలుసులే. నీకు నా కోరిక తీర్చడం ఇష్టం లేదని. వదిలేయ్! వాడి నుదుటి రాత ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది.” అంది మీనాక్షి అన్నయ్యతో. మరో రెండు రోజులకే ఆమె ఈ లోకాన్ని విడిచి పెట్టిపోయింది. భార్య చనిపోయిన వార్త విన్న ముకుందం రాలేదు. జరగవల్సిన తంతంతా భుజంగరావే జరిపించాడు.

శ్రాద్ధ కర్మ చేసి శ్మశాన వాటికిలో కాకికి పిడచ పెట్టాడు. ఏ కాకి అది ముట్టుకోడానికి రాలేదు. చనిపోయిన వారి ఆత్మలు కాకి రూపంలో వచ్చి ఆ పిదచ తింటాయని మన వాళ్ళ విశ్వాసం.

“మీ చెల్లెలు గారికి ఏవో తీరని కోరికలున్నాయి. అందుకే కాకి వచ్చి ఆ పిడచ తినటం లేదు” పురోహితుడు అన్నాడు. అతని మాటలకి భుజంగరావు మౌనం వహించాడు. చెల్లెలు కోరిక ఏంటో అతనికి తెలుసు. అయితే ఆ కోరిక తీర్చలేని అసమర్థుడు తను అనుకుని బాధపడ్డాడు.

మేనల్లుడ్ని సక్రమమైన మార్గంలో పెంచాలని భుజంగరావు ఆలోచన. అయితే అతని ఆలోచనలు కన్న కలలు కల్లలయ్యే పరిస్థితి అగుపడుతూ ఉంటే బాధ పడేవాడు అతను.

అధ్యాయం-30

అనుకోని సంఘటనలు అప్పుడప్పుడు మనకి తారసపడ్తూనే ఉంటాయి. అలాంటి సంఘటనే జరిగింది. చిన్నప్పుడే ఆ గ్రామాన్ని ఇంటిని వదిలిపెట్టి ఆవారాగాడు అని పేరు పడ్డ ధర్మారావు ఆ గ్రామానికి ఓ చిన్న సినీ నిర్మాతగా అడుగుపెట్టాడు. ఒకానొక సమయంలో అతను అవమానాలకి గురై అందరి చేత చీత్కరించబడివాడే. అయితే నిరాశ పడలేదు. అందరూ తనని ఆదరించే రోజు రాకపోతుందా అని అనుకున్నాడు.

నిరాశ పడ్డం అంటే చీకటి గదిలో బందీ అయి వెలుగు రేఖ కానరాని జీవనం. ఆ చోట నుండి బయటపడలేమన్న భావోద్వేగం. ఆశ అడుగంటి ఇక జీవితంలో ఎదుగుదల ఉండదన్న నిస్పృహ. అటువంటి వాతావరణం నుండి ఆసరా వెతుక్కుని అడుగులు వేయగలుగుతే ఏదో మార్గం అగుపించక మానదు.

ధర్మారావు కూడా అలాగే అడుగు వేశాడు. అపజయాల్ని విజయాలుగా మలుచుకున్నాడు. అవమానాన్ని ఎదుర్కున్నాడు. చీత్కారాల్ని సహించాడు. జీవిత లక్ష్యం వేపు దృష్టి సారించాడు. అందుకే ఈనాడు తనకి అవమానం జరిగిన గ్రామంలోకి ఓ చిన్న సినిమా నిర్మాతగా అడుగుపెట్టాడు. తను తీసిన సినిమాలో నటించిన వర్తమాన హీరోను వెంటబెట్టుకుని మరీ వచ్చాడు. సినీ గ్లామరు ఉంటే ఏ గ్రామంలో ప్రజలు తనని చీకొట్టారో గ్రామ ప్రజలే తనకి తనకి నీరాజనాలు పడుతూ ఉంటే పిచ్చిగా నవ్వుకున్నాడు.

ప్రజల భావాలు తెలుసు అతనికి. బలహీనతలు తెలుసు. సినీ గ్లామరు మాటున ప్రజల బలహీనతల్ని తనకి అనుకూలంగా మలుచుకునే నేర్పును ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న తరువాత తెలుసుకున్నాడు.

అతని జీవితంలాగే ఆ గ్రామ స్వరూపమే మారింది. చిన్నపాటి బస్తీలా తయారయింది. సినీ నిర్మాత హీరోని వెంట బెట్టుకుని వస్తున్నాడని తెలిసిన ఆ ప్రాంత ప్రజలు విరగబడి వచ్చారు. ఇసక వేస్తే రాలనంత మంది జనాలు. ‘దీన్నే అంటారు రాళ్ళు విసిరిన ఊర్లో పూలు జల్లించుకోవడం అంటే అని అనుకుని ఆనందపడుతున్నాడు. నేటి రోజుల్లో ప్రతీ ఒక్కరిలో సినిమా పిచ్చి ఎంతగా పెరిగిపోయింది, పిచ్చి జనాలు’ ఇలా ఆలోచిస్తున్న అతని మనస్సు గతంలోకి మళ్ళింది.

తన గతం ఒక పీడకల. తలుచుకోడానికి తన గత జీవితంలో ఏం గొప్పతనం ఉంది కనుక? ఆ గత స్మృతుల్ని తలుచుకోడానికే భయమేస్తోంది. అసహ్యం అంతకన్నా వేస్తోంది. అప్పుడు తన ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేదికాదు. అందమైన బాల్యం, మధురమైన బాల్యం తనకి ఎండమావే అయింది. అటువంటి బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటే ముందు తల్చుకోవల్సింది అమ్మ గురించి స్మృతులే. బాల్యంలో అన్ని వేళలా ప్రేమతో పెనవేసుకునేది అమ్మయే. తను ఎన్ని కష్టాలు అనుభవించినా పిల్లల కోసం త్యాగం చేసేది అమ్మే.

అయితే తన తల్లి జీవితం వడ్డించిన విస్తరికాదు. అడుగడుగునా భర్త నిరాదరణ తన్నులు, వేధింపులు, కష్టాలు, కన్నీళ్ళు ఏడుపుల్తో ఆమె జీవితం గడిచిపోయింది. పిల్లలు సక్రమంగా పెరగాలంటే ఇంటి వాతావరణం సక్రమంగా ఉండాలి. తాగుబోతు, తిరుగుబోతు తండ్రి, అశాంతి ఇంటి వాతావరణం ఇవన్నీ తనని పెడ త్రోవ పట్టించాయి.

‘మృత్యువుతో పోరాటం చేస్తున్న తన తల్లి ఆఖరి కోరిక ఏంటి? మామయ్య కూతురు తాయారుతో తన పెళ్ళి జరిపించమని, అయితే మామయ్య తన తల్లి కోరిక తీర్చడానికి అంగీకరించలేదు. ఆమెకి మాటివ్వలేదు. అశాంతితో, తీరని కోరికతో తన తల్లి జీవితం అంతమయి పోయింది. ఆమె ఆత్మ క్షోభించడానికి కారకుడు ఎవరు? మామయ్య.’ ఇలా ఆలోచిస్తున్న అతనికి వచ్చిన కోపం ఫలితంగా పళ్ళు పటపట కొరికాడు.

తన మనస్సులో మామయ్యని కసిగా తిట్టుకున్నాడు. అతని దృష్టిలో తను ఆ వయస్సులో అల్లరి చిల్లరగా తిరుగుతున్న ఆవారాగాడు. అందుకే తల్లికి మాట ఇవ్వలేదు. తాయారుకి కూడా తనంటే సదభిప్రాయం లేదు. మరి ఇప్పుడో తను యోగ్యుడై తిరిగి వచ్చాడు. ఆస్తి, అంతస్తులో ఓ మెట్టు ఎదిగాడు. అందరూ తనకి నీరాజనాలు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయో గమనించాలి. తాయారుని తన దానిగా చేసుకుంటానని తన మనస్సులో కోరిక బయటపెట్టాలి.

తాయారు కన్నా అందగత్తెలు తనకి దొరక్కపోరు. అయితే తల్లి కోరిక తీర్చి ఆమె ఆత్మకి శాంతి కలిగించాలనే తన తపన.

తన జీవితం ఎలాగ గడిచిందో తలుచుకోడానికే కంపరంగా ఉంది. బాధపడినప్పుడే బాల్యం గుర్తుకు వస్తుంది. జ్ఞాపకాల తడి ఇంకా ఆరలేదు. ఇల్లు వదిలిపెట్టి వచ్చిన తరువాత తను ఎన్ని ఆటుపోట్లుకి గురి అయ్యాడు. జీవితం గడపడానికి ఫుట్‌పాత్‌ల మీద పడుకున్నాడు. పంపు నీళ్ళు త్రాగి ఆకల్ని కడుపులో దాచుకున్నాడు. హోటల్లో పనికి కుదిరి అందరూ తిన్న టిఫిను ప్లేట్లు కడిగేవాడు. సైకిల్ షాపులో సైకిల్ రిపేరు చేసే పని చేసేవాడు. పచారీ షాపులో పద్దులు వ్రాసేవాడు. సిటీ క్లబ్‌కు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారు. అక్కడ వాళ్ళు సిగరెట్లు త్రాగుతూ పేకాట ఆడుతూ ఉంటే మధ్య మధ్య వాళ్ళ గ్లాసుల్లో విస్కీ పోసి నీళ్ళు వేసి, గ్లాసులో ఐసు ముక్కలు వేసి అందించేవాడు. వేడి వేడి జీడిపప్పు పకోడీ ప్లేట్లో వేసి త్రాగుతున్న వాళ్ళకి అందించేవాడు.

అలా సిటీ క్లబ్‌కి వచ్చిన వాళ్ళలో ప్రముఖ సినీ నిర్మాత ఉన్నాడు. సిటీ క్లబ్‌లో చకచకా అన్ని పనులూ చక్కబెడ్తున్న తనని చూసి ముచ్చటపడి తన దగ్గర పనిచేసే పనివాడిగా పెట్టుకున్నాడు. సిటీ క్లబ్‌లో పని చేస్తున్నప్పుడే తనకి కూడా తాగడం అలవాటు అయింది. తండ్రికి తగ్గ కొడుకు అనచ్చు కాని తనకి మాత్రం పరిసరాల ప్రభావం వల్లనే త్రాగుడు అలవాటు అయింది అని అనుకుంటాడు.

పని చేస్తే సినీ ఫీల్డులోనే పనిచేయాలి. అక్కడ అందరికీ అన్నీ అందించే బాయ్‌గా చేరినా జీవితమే జీవితం. అక్కడ సీనియర్ ఆర్టిస్టులు తనని చులకనగా చూసినా మరి కొంతమంది ఎంతో ఆప్యాయతగా చూసుకునేవారు.

అక్కడ పనితోపాటు కొత్త కొత్త అలవాట్లు కూడా అబ్బాయి. వయస్సు వస్తోంది. ఆకలి వేసినప్పుడు తిండి తినాలి. వయస్సు వచ్చినప్పుడు లైంగికానందం కావాలి. ఆ వాతావరణంలో లైంగికానందానికి, పీకల దాకా త్రాగడానికి కొదవే లేదు. సినీ ఫీల్డులో చేరుదామని వచ్చి అవకాశాలు రాక, బాట తప్పిన బ్రతుకు అనుభవిస్తున్న ఎంతమందో అమ్మాయిలతో తనకి పరిచయం అయింది. వాళ్ళతో లైంగికానందం కూడా తను పొందాడు. వెరైటీలు మార్చేవాడిగా తను మారిపోయాడు.

ఎప్పుడూ ఒక్కళ్ళ పొందే లభిస్తే జీవితం బోరు అనిపిస్తుంది. అనుకుని కొత్త రుచుల కోసం వెంపర్లాడేవాడు. అనేక జూనియర్ ఆర్టిస్టుల్తో తనకి శారీరిక సంబంధం ఉంది. రేవ్ పార్టీలకి వెళ్ళేవాడు. పబ్బులు, క్లబ్బులకి వెళ్ళేవాడు. ఇలాంటి జీవితం గడుపుతున్నా తను మాత్రం తన పని దగ్గర జాగ్రత్తగా ఉండేవాడు. సినీ పెద్దల అభిమానప్రాతుడు కూడా అయ్యాడు.

ఒక్క లైంగికానందమే కాదు. ఇన్ని సుఖాలు లభిస్తున్నప్పుడు పెళ్ళి ఎందుకు అని అడగవచ్చు. ఒక్క లైంగికానందమే పరమార్థం కాదు తనకి. తనది అనుకోడానికి ఓ కుటుంబం ఉండాలి. పిల్లల్ని కనాలి. వాళ్ళ ఆటపాటల్తో ముద్దు ముచ్చట్లతో మురిసిపోవాలి. ఇలాంటి కోరిక కూడా తనకుంది. ఎంతమంది ఆడవాళ్ళతో పరిచయం ఉన్నా పెళ్ళి చేసుకున్న భార్యకి ఉన్న హుందాతనం, గౌరవ స్థానం, మిగతా వాళ్ళకి ఉంటుందా? కేవలం వాళ్ళు కేవలం లైంగికానందం ఇచ్చిన వాళ్ళు మాత్రమే.

అందుకే తనని బడుద్దాయిగా భావిస్తున్న మామయ్యకి తన హోదాని చూపించడానికే ఇలా ఈ ఊరు వచ్చాడు తను. వస్తూ తను ఒక్కడే రాలేదు. తను తీసిన సినిమాలో నటించిన వర్తమాన హీరోను కూడా మరీ వెంటబెట్టుకుని వచ్చాడు.

నేటి యువత సినీ హీరోలంటే పడిచస్తున్నారు. తమకి నచ్చిన సినీ హీరోను పిచ్చిగా ఆరాధిస్తున్నారు. వాళ్ళ కోసం రక్తదానాలు చేస్తున్నారు. హీరోల పుట్టిన రోజున స్వంత డబ్బు ఖర్చు పెట్టి పండ్లు పంచుతున్నారు. బట్టలు పంచుతున్నారు. అన్నదానాలు చేస్తున్నారు. వేడుకగా జరుపుకుంటున్నారు. సినీ హీరోలు, హీరోయిన్ల మీద అభిమానులకి ఎంతగా పిచ్చి అభిమానం పెరిగిందంటే గుడులు కట్టిస్తున్నారు. అవసరమయితే తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదు. సినీ హీరోల నుండి అభిమానులకి ఒక్క పైసా ముట్టకపోయినా ఇవన్నీ చేస్తారు.

సినీ హీరోలంటే ఇంత పిచ్చి ముదిరి పోయింది నేటి యువతలో. తాము ఇక్కడున్నన్నాళ్ళూ ఉండడానికి అన్ని సదుపాయాల్తో బస ఏర్పాటు చేస్తారు. టిఫిన్లు, భోజనం సప్లయి చేస్తారు. తాము అడిగిన వన్నీ సప్లయి చేస్తారు. అయితే ఈ అభిమానులు, అభిమాన సంఘాల వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మెలగాలి. అలా మెలిగితే సినీ గ్లామరుని అడ్డుపెట్టుకుని ఆ గ్లామర్‌ను క్యాష్ చేసుకోడానికి వినియోగించవచ్చు.

ఇలా సాగిపోతున్నాయి ధర్మారావు ఆలోచన్లు. ‘ఏటేటి? ఆ అల్లరి సిల్లరగా తిరిగే ధర్మారావే!’ అని అనుకుని విస్తుపోతున్నారు అక్కడ జనాలు. అతని వలన ప్రయోజనం పొందాలనుకున్న కొంతమంది ధర్మారావు చుట్టూ ఎగబడ్తున్నారు.

ఆ ఊరులో మన్మథరావు నిజంగా మన్మథుడే. అతడు అంత అందంగా ఉంటాడు. అనేక నాటకాల్లో హీరో వేషాలు వేసి నటించి మెప్పిస్తాడు. ఒకటి, రెండు టి.వి. సీరియల్లో కూడా నటించాడు. అతను ధర్మారావు తనకి సినిమాలో నటించే ఛాన్సు ఇస్తాడేమో అని అనుకుంటున్నాడు.

వెంకటరావు నవలలు వ్రాస్తాడు. కథలు వ్రాస్తాడు, సంభాషణలు వ్రాస్తాడు. అతను వర్ధమాన రచయిత. తన చేత సినిమా తీయడానికి కథ వ్రాయించి, మాటలు వ్రాయించి సినిమాలో తనకి అవకాశం ఇస్తాడేమో అని అతను చూస్తున్నాడు.

సుబ్బారావు చక్కగా పాడుతాడు. పాడుతా తీయగా పోగ్రామ్‌లో కూడా పాల్గొన్నాడు. తను సినిమాలో పాడ్డానికి ధర్మారావు అవకాశం ఇస్తాడేమో అని అతని ఆశ. తన అభిమాన హీరో దగ్గరికి తీసుకెళ్ళి అతనితో తనకి పరిచయం కలిగిస్తాడేమో అని అతని ఆశ. ఇలా ఒక్కళ్ళు ఒక్కక్క విధమైన కోరికలతో ధర్మారావు చుట్టూ చేరుతున్నారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here