Site icon Sanchika

సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-16

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ధర్మారావు తండ్రి ముకుందం తన ఆఫీసులో పని చేసే మీనాక్షిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ పెళ్ళి మీనాక్షి తండ్రికి ఇష్టం ఉండదు. ఆమెని తన గడప తొక్కవద్దని శాసిస్తాడు. మీనాక్షి అన్న భుజంగం మాత్రం చెల్లెలి మీద మమకారం చంపుకోలేక, తండ్రికి తెలియకుండా చెల్లెలి యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఉంటాడు. పెళ్ళయిన కొన్నిరోజుల వరకూ బాగానే ఉన్న ముకుందం, ఆ తర్వాత శాడిస్టు అవుతాడు. మీనాక్షిని ఉద్యోగం మాన్పిస్తాడు. అతనిలో నైతికత లోపిస్తుంది. మీనాక్షి తండ్రి చనిపోయినా, ఆమెని పుట్టింటికి పంపించడు ముకుందం. తాగుబోతుగా, తిరుగుబోతుగా మారిన ముకుందం భార్యని హింసిస్తుంటాడు. విషయం తెలిసిన భుజంగం బాధపడతాడు. ముకుందం దుర్వ్యసనాలకి బానిసై, ఇంటికి రావడం మానేస్తాడు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన ధర్మారావు అల్లరిచిల్లరగా తయారవుతాడు. జులాయిగా మారిన కొడుకుని సరిదిద్దాలని ప్రయత్నించి విఫలమవుతుంది మీనాక్షి. ఈ క్రమంలో అనారోగ్యానికి గురవుతుంది. చెల్లెలి విషయం తెలిసిన భుజంగం ఆమెని పట్నం తీసుకెళ్ళి వైద్య పరీక్షలు జరిపిస్తాడు. మీనాక్షికి కేన్సర్ అని తెలుస్తుంది. వాళ్ళని తన ఊరికి తీసుకొస్తాడు. మేనల్లుడిని  స్కూల్లో చేర్పిస్తాడు చెల్లెలికి మృత్యువు సమీపిస్తోందని గ్రహిస్తాడు. చనిపోయే ముందు తన కొడుకుని అల్లుడిగా చేసుకోమని భుజంగాన్ని కోరుతుంది మీనాక్షి. ధర్మారావు గుణాలు తెలిసిన భుజంగం మాట ఇవ్వడు. మీనాక్షి మరణిస్తుంది. మేనల్లుడిని సక్రమమార్గంలో పెట్టలేక బాధపడతాడు భుజంగం. మేనమామ క్రమశిక్షణ తట్టుకోలేక ఊరొదిలిపోయిన ధర్మారావు ఓ చిన్న సినీ నిర్మాతగా మళ్ళీ మేనమామ ఊళ్ళో అడుగుపెడతాడు. మేనమామ ముందు తన గొప్పతనం ప్రదర్శించాలనుకున్న ధర్మారావు తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఏయే పనులు చేసి నిర్మాత స్థాయికి చేరుకున్నాడో తలచుకుంటాడు. ఊరికి వస్తూ, తన సినిమాలో హీరోని కూడా తీసుకువస్తాడు. హీరోని చూడడానికి జనాలందరూ వస్తారు. సినిమాలంటే ఆసక్తి ఉన్న నటుడొకడు, గాయకుడు ఒకతను ధర్మారావుని కలుస్తారు. ఇక చదవండి.]

అధ్యాయం-31

[dropcap]ధ[/dropcap]ర్మారావు తన వైభవోపేతమైన జీవితం. తన పాప్యులారిటీ, సమాజంలో తన ఎంత స్థాయికి ఎదిగి ఎలా ఉన్నత స్థాయి గల వ్యక్తిగా చలామణి అవుతున్నాడో అవన్నీ చూపించడానికే రాజు వెడలె రవితేజముగా అన్నట్టు అట్టహాసంగా ఆ ఊరులో అడుగుపెట్టాడు. తను తీసిన సినిమాలో నటించిన వర్ధమాన హీరోను మరీ వెంటబెట్టుకుని వచ్చాడు. అలా హీరోను తీసుకొస్తే తనకి మరింత పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయని అతని ఉద్దేశం.

అసలే సినీ హీరో వచ్చాడని జనాలు విరగబడి వాళ్ళని చూడ్డానికి వచ్చారు. వాళ్ళు ఆ గ్రామంలో ఉండడానికి బసతోపాటు అన్ని ఏర్పాట్లు చేశారు మధు, అతని స్నేహితులు.

ధర్మారావు ఆ ఊరులో ఎందుకు వచ్చాడు? మామయ్య దృష్టిలో తను ఇప్పుడు ఆవారాగాడు కాదు. సంఘంలో ఓ ఉన్నత స్థాయికి ఎదిగిన మనిషి. తనకీ ఆస్తీ ఐశ్వర్యం, అంతస్తు అన్నీ ఉన్నాయి. ‘అందుకే తన వైభవం చూపించడానికి వచ్చాడు. రావడంలో మరో కారణం ఉంది. తాయారుని తన భార్యగా చేయమని అడగాలి. తన తల్లి కోరిక తీర్చమని అభ్యర్థించాలి,’ ఇదీ ముఖ్యంగా అతని ఆలోచన్లు.

మామయ్య ఇంటికి బయలుదేరాడు వచ్చీ రాగానే. అతను మామయ్య ఇంటికి వెళ్ళగానే తాయారు ఒక్కర్తే ఉంది. ఇదీ ఒకందుకు మంచిదే. తనని పెళ్ళి చేసుకోవడం తాయారుకి ఇష్టం ఉందో లేదో తెలుసుకోడానికి ఇది మంచి అవకాశం, ఇదీ అతని ఆలోచన.

“తాయారూ బాగున్నావా?” ధర్మారావు ఆమెను పలకరించాడు. తను ఎదురుగా నిక్షేపంగా ఉంటే ఇలా తనని అడుగుతున్న శాల్తీ ఎవరబ్బా అనుకుంటున్న తాయారు అతని వేపు తేరిబారి చూసింది. అయితే ధర్మారావుని పోల్చుకోలేకపోయి అతని శరీరాకృతిలో వచ్చిన పోలికలు వలన అలా పోల్చుకోవడంలో అసమర్థురాలయింది.

ఎర్రగా బుర్రగా, ఒడ్డు, పొడుగుతో ఉన్న ధర్మారావుని చూసి ‘ఎవరు ఇతను? తనని పేరు పెట్టి మరీ పిలుస్తున్నాడు’ అనుకుంటోంది.

“నేను తాయారు! నీ బావ ధర్మారావును,” అన్నాడు. అప్పుడు పోల్చుకుంది తాయారు అతడ్ని. అయితే సిగ్గుపడి లోపలికి పారిపోలేదు. సిగ్గుపడి మెలికలు తిరిగి పోలేదు. స్థిరంగా అలా నిలబడి ఉంది.

“నేను నిక్షేపంగా ఎదురుగా ఉంటే ‘బాగున్నావా’ అని అడుగుతావేంటి? రివటలా ఉండే నీవు భలే హేండ్‌సమ్‌గా తయారయి వచ్చి ఎదురుగా ఇలా నిలబడితే పోల్చుకోలేక పోయాను,” అంది తాయారు. ఆమె కాంప్లిమెంటుకి అతను ఉబ్బితబ్బిబ్బు అయ్యాడు, “థేంక్సు తాయారు!” అన్నాడు. “ఎందుకు థేంక్సు?” ఆమె అడిగింది. “నీవు నన్ను ఇలా పొగిడినందుకు అయినా నీవో సన్నజాజి తీగలా తయారవలేదూ?” అన్నాడు ధర్మారావు.

అతని పొగడ్తకి తాయారు పొంగిపోలేదు. అతనిలా కృతజ్ఞతలు తెలియజేయలేదు. తన తండ్రి “వీడు వెళ్ళి వెళ్ళి సినీ ఫీల్డులోకి అడుగు పెట్టాడు. అసలే నైతికతకి ఆమడ దూరంలో ఉన్న నేటి సినీ ఫీల్డులో ఉంటే వీడి నైతికత కూడా మృగ్యమైనట్టే” అని అంటాడు.

తను ఇంత ఉన్నత స్థాయికి ఎదిగినందుకు తనని తాయారు పొగడ్తల్తో ముంచేస్తుంది అనుకున్న అతనికి నిరాశ కలిగింది. ఉసూరుమంది అతని మనస్సు.

“ప్రస్తుత సినీ ఫీల్డులో నైతికత ఉండదని నేను విన్నాను,” సినీ ఫీల్డు మీద తన అభిప్రాయం చెప్పింది తాయారు.

“అయితే సినీ ఫీల్డులో ఉన్న వాళ్ళందరిలో నైతికత లోపించిందనా నీ ఉద్దేశం?”

“నేనలా అనటం లేదు. అయితే ఎక్కువ మంది నైతికతకి తిలోదికాలు ఇచ్చిన వాళ్ళు ప్రస్తుత కాలంలో ఆ ఫీల్డులో ఉన్నారు. అందుకే నైతికత ఉన్న వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తోంది. ఒక నావలో పాపులు, పుణ్యాత్ములూ ప్రయాణం చేస్తున్నారట. నదీ మధ్య స్థలంకి వచ్చేప్పటకి నావ మునిగి అందరూ చనిపోయారుట. ఈ దృశ్యం ఒక శిష్యుడు చూసి గురువు గారితో ‘ఆ నావలో పుణ్యాత్ములు కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు చనిపోయారు’ అని అడిగితే గురువు గారు ‘పాపుల్తో పుణ్యాత్ములు కూడా ఉండడం వల్లనే పుణ్యాత్ములు కూడా చనిపోయారు’ అని గురువు గారు సమాధాన మిచ్చారట,” అంది తాయారు.

“ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు?”

“అనైతిక మనుష్యుల మధ్య నైతికత గల మనుష్యులు ఉండటం వలన ఫీల్డులో ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తోంది.”

“అయితే అనైతికత ఒక్క సినీ ఫీల్డులోనే ఉందంటావు. అయితే ఒక్క విషయం నీవు మరచిపోతున్నావు. ఈ అనైతికత రాజకీయ రంగంలో కూడా ఉంది తెలుసా? తినడానికి సరియైన తిండి, కట్టుకోడానికి సరియైన బట్ట లేనివాడు కూడా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టగానే కోట్లకి పడగలెత్తుతున్నాడు. ఇలాంటి వాళ్ళందరూ ఇలా ఎలా కోట్లకి పడగలెత్తుతున్నారు? వీళ్ళందరూ నీతిగా ప్రవర్తిస్తున్నారా? నీతిగా సంపాదిస్తున్నారా? వీళ్ళలో అనైతికులు లేరా? అదంతా ఎందుకు? మీ నాన్ననే తీసుకో. అతను జిల్లా పరిషత్తు చైర్మన్. అతనికి పదవి పైసా ఖర్చు పెట్టకుండా వచ్చిందా? లక్షలకి లక్షలు ముడుపులు చెల్లించి ఖర్చు పెడ్తేనే వచ్చింది. అలా ఖర్చు పెట్టడానికి అతనికి డబ్బు ఎలా వచ్చింది? నీతిగా సంపాదించాడా? అనైతికతకి నీ తండ్రి దూరంగా ఉన్నాడనుకుంటున్నావా?” తండ్రిని ధర్మారావు అలా అంటూ ఉంటే తాయారుకి అతని మీద చాలా కోపం వచ్చింది. తమాయించుకుంది.

“బురదలో కమలం పుట్టినా ఆ కమలానికి బురద అంటదు.”

“అలా నీ తండ్రిని సమర్థిస్తూ నిన్ను నీవు మభ్యపెట్టుకుంటున్నావా?”

“అయితే నా తండ్రి నైతికతను విడిచి పెట్టిన వాడంటావు?”

“అలా నేను అనలేదు. కాని అన్ని రంగాల్లో అనైతికత ఉంది అని అంటున్నాను. అయినా ఇంత విశాలమైన భవనం ఆస్తి, అంతస్తు, భూమి పుట్ర సంపాదించాడంటే మామయ్య మడి కట్టుకుని ఉన్నాడా? ఒక్క మామయ్య విషయమే కాదు నేటి రాజకీయ నాయకులందరి పరిస్థితీ అలాగే ఉంది. లక్షలు, కోట్లు ఇచ్చి ఎలక్షన్లో సీటు సంపాదిస్తారు. వేలు, లక్షలు ఖర్చుపెట్టి ఓట్లు కొంటారు. గెలుస్తారు. ప్రజాసేవ అనే ముసుగులో పబ్బం గడుపుకుంటారు.”

“అయితే నా తండ్రి కూడా అలాంటి వాడే అని అంటావు?” పళ్ళు బిగువున వచ్చిన కోపాన్ని అణచి పెడ్తూ అంది తాయారు.

“నేను అనలేదు. నేటి రాజకీయ వాతావరణం గురించి చెప్తున్నాను”. అలా అన్న ధర్మారావు తాయారు తను అనుకున్నంత అమాయకురాలు కాదని గ్రహించాడు.

“ఆ విషయం అలా వదిలిపెట్టు. నీతో ముఖ్య విషయం మాట్లాడాలి. అదీ నీ పెళ్ళి విషయం.”

“అది చూసుకోవల్సింది నాన్న.”

“నిజమే! మొదట నీ అభిప్రాయం కావాలి కదా!”

“దేని గురించి”

“మా అమ్మ చనిపోతూ మామయ్యతో అన్న మాటలు గుర్తున్నాయా?”

“గుర్తు పెట్టుకున్నంత వయస్సు కాదు నాకు అప్పుడు.”

“నిజమే! నిన్ను తన కోడలిగా చేయమని అంటే నిన్ను నాకు ఇచ్చి పెళ్ళి చేయమని.”

“ఇవన్నీ పెద్దవాళ్ళు చూసుకునే విషయాలు”

“ఈ విషయంలో మనిద్దరి అభిప్రాయం ముఖ్యం”

“నాన్నగారికి తన బాధ్యత తెలుసు. నా కోసం తగిన సంబంధం వెతుకుతున్నారు.”

“అంటే నేను నీకు తగనా?”

“నీవు పదిహేను సంవత్సరాల వయస్సులో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఆ తరువాత నీ జీవితం ఎలా సాగిందో తెలియదు. ఇప్పుడు ఓ చిన్న సినీ నిర్మాతగా ఇలా ఈ ఊర్లో అడుగు పెట్టావు. పెళ్ళి చేసుకునే ముందు ఒకరి గురించి మరొకరికి తెలియాలి. ఒకరికి మరొకరు నచ్చాలి. ఒకళ్ళ అలవాట్లు మరొకరికి నచ్చాలి. ఒకరి వ్యక్తిత్వం, గుణాలు మరొకరికి నచ్చాలి. అలాంటిది ఇవేవీ నీ గురించి నాకు తెలియదు. అలాంటి సమయంలో నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాననుకున్నావు?”

“నా జీవితం తెరిచిన పుస్తకం. అవసరమైతే నా విషయాలు అన్నీ చెప్తాను. మొదట నీ అభిప్రాయం కనుక్కోవాలి. అన్నీ తెలుస్తే కదా నా అభిప్రాయం చెప్పేది.”

వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటున్న సమయంలో భుజంగరావు అక్కడికి వచ్చాడు. నిశ్శబ్దంగా నిలబడి వారి మాటలు వింటున్నాడు.

‘తన కూతురికి తన మీద ఎంత నమ్మకం? ఎంత విశ్వాసం? అయితే తను మాత్రం కూతురు అనుకున్నట్టుగా బురదలో పుట్టిన కమలమంత స్వచ్ఛమైన వాడు మాత్రం కాదు. అయితే ఆ బురదలోనే పొర్లుకు పోలేదు కూడా. తన నడి వయస్సులో భార్య చనిపోయింది. తాయారుకి అప్పుడు పద్నాలుగు సంవత్సరాలు. యవ్వనావస్థలోకి అడుగు పెడుతోంది. ఆ వయస్సులో తనకి తిరిగి పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు.

ఎంతేనా మానవులు జితేంద్రియులు కాదు కదా. తనకీ కోరికలున్నాయి. లైంగికానందం పొందాలనే ఉబలాటం ఉన్న వయస్సు. ఈ వయస్సులో ఆడ తోడు ఉండాలన్న ఆలోచన. అటువంటి సమయంలో తనకి సుమిత్రతో పరిచయం అయింది. ఆమె వితంతువు. ఆమెకి ఇద్దరు పిల్లలు. ఆమెకి మగతోడు లేదు. నా అన్న వాళ్ళు వదిలి వేశారు. అటువంటి సమయంలో తనని ఆశ్రయించింది. తనకి కూడా ఆడతోడు ఉండాలి. ఆమెకి మగతోడు ఉండాలి. ఆసరాగా నిలబడాలి. తనకి తోడుతో పాటు ఆడదాని సుఖం ఉండాలి.

ఆమె తనకి భార్య కాకపోయినా, భార్యలా సుఖాన్ని పంచి ఇచ్చింది. తను ఆమె పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేశాడు. ఆ పిల్లలు తనని తండ్రిలాగే భావిస్తారు. పట్టణంలో ఆమె ఉంటోంది. తన అప్పుడప్పుడు అవసరమైనప్పుడు పట్టణానికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఈ విషయం ఊరిలో కొందరికి తెలుసు. మనకెందుకు అని కొందరు ఊరుకుంటే మరికొందరు భార్య పోయిన వాడు కదా, మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. కోరికల్ని చంపుకోలేదు కదా! తన తంటా తాను పడ్తున్నాడు అని సర్దిచెప్పుకుని ఊరుకున్నారు. తాయారుకి కూడా ఈ విషయం చూచాయగా తెలుసు. అయినా ఎప్పుడూ తనని అడగలేదు. తన జీవితం సుఖంగా ఉంది కదా అని సరిపెట్టుకుని ఉండాలి.

అయితే కొన్ని కొన్ని రంగాలలో నైతికతకి స్థానం ఉండదు. నీతిగా బ్రతకాలనుకున్నా బ్రతకలేని పరిస్థితి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని అలా ఉండనీయరు. ఉండలేరు కూడా. లక్షలకి లక్షలు ఖర్చు పెడితే కాని పదవి రాని పరిస్థితి. మెరిట్లో విద్యార్థికి సీటు రాకపోతే విద్యా సంస్థల్లో విద్యార్థి లక్షలు ఖర్చు పెట్టి ఎలా సీటు సంపాదిస్తున్నాడో రాజకీయ రంగంలో కూడా అదే పరిస్థితి. పదవి కావాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి సంపాదించాలంటే నీతి మార్గంలో వెళ్తే లాభం లేదు. నేటి రాజకీయ రంగం పరిస్థితి ఇది. అందుకే సినీరంగం, రాజకీయ రంగం ఒక్కటే తను అనుకుంటాడు. ఈ రెండు రంగాల్లో వారసత్వ ప్రాబల్యం ఎక్కువ. గాడ్ ఫాదర్ ఉండాలి. లేకపోతే పలుకుబడి ఉండాలి. ఇవి లేని వాళ్ళకి ఎంత నైపుణ్యం ఉన్నా పనికిరాదు.

తను లైంగికానందం కోసం అందరి ఆడవాళ్ళ వెంటపడలేదు. ఒక్క ఆడదానితో సరిపుచ్చుకున్నాడు. అయితే అదీ అనైతికమే. తను కాదనలేదు. ప్రతీ తండ్రీ తను త్రాగుబోతు, తిరుగుబోతు అయినా, నీతిమంతుడు కాకపోయినా తన కూతురికి మాత్రం నీతిమంతుడైన భర్త కావాలని కోరుతాడు. తనూ అలా కోరడం తప్పా? అలా కోరడం తప్పుకాదని తన ఆలోచన ధర్మారావులో తను ఆశిస్తున్న గుణాలు లేవు. అందుకే అతడ్ని అల్లుడుగా చేసుకునే ఉద్దేశం తనకిలేదు,’ ఇలా సాగిపోతున్నాయి భుజంగరావు ఆలోచన్లు.

తల ప్రక్కకి త్రిప్పి చూసిన ధర్మారావు, తాయారు భుజంగరావుని చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.

“ఎప్పుడొచ్చారు నాన్నా?” అంది తాయారు.

“ఇప్పుడే!” అన్నాడు.

“బాగున్నావా మామయ్య?” ధర్మారావు అన్నాడు.

“అదేం ప్రశ్నరా? ఎదురుగా నిక్షేపంగా నిలబడి ఉంటే అలా అడుగుతావేంటి?” గలగల నవ్వుతూ అన్నాడు భుజంగరావు.

‘నీ పొగరు మాత్రం అలానే ఉంది’ కసిగా మనసులో అనుకున్న ధర్మారావు తనూ ఆ నవ్వులో పాలు పంచుకున్నాడు.

“ఏంటిరా సంగతి? పెళ్ళి చేసుకుని ఓ ఇంటి వాడవయ్యావా? లేక పైలా పచ్చీసుగా తిరుగుతున్నావా తిరుగుబోతులా? అసలే నీవు కాలు పెట్టింది సినిమా రంగం. ఆ రంగంలో అందరూ కాకపోయినా చాలామంది నైతికతకి ఆమడ దూరంలో ఉంటారు అని అంటారు.”

“రాజకీయ రంగం కన్నానా?”

బాగా దెబ్బ కొట్టాను అని తెగ సంబరపడ్తూ అన్నాడు ధర్మారావు.

అతని మాటలకి గలగల నవ్వుతూ “బాగా దెబ్బ కొట్టావురా!” అన్నాడు భుజంగరావు.

మామయ్యకి బాగా చురక అంటించాను అని అనుకుని తెగ సంబరపడిపోతున్నాడు ధర్మారావు.

“మనం ఏ రంగం ఎంచుకున్నా సాధ్యమైనంత మట్టుకు అనైతికతకిని దరిదాపుల్లో కూడా రానీయకూడదు. నైతిక ప్రవర్తనకి విలువియ్యాలి. ముఖ్యంగా సినీరంగం, రాజకీయ రంగం ఈ రెండు రంగాలలో ఉన్న వాళ్ళలో కొందరు కష్టపడి పైకి వచ్చి, నీతి నియమాలకి విలువిస్తూ ఉంటే మరికొందరు అనైతికతకి భానిసలయిన వాళ్ళే. ఈ మధ్య టి.వి.లో సినీ హీరోలు డ్రగ్సుకి అలవాటుపడి దొరికిపోయిన దృశ్యాలు చూడలేదా?” అన్నాడు భుజంగరావు.

‘తనేదో పెద్ద నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు. దీన్నే అంటారు. దెయ్యాలు వేదాలు వల్లించడం అని నేతి బీరకాయ చందంగా మాట్లాడుతున్నాడు’. కసిగా తన మనస్సులో అనుకుంటున్నాడు ధర్మారావు.

“నీవూ చూసే ఉంటావు, కొంతమంది రాజకీయ నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కోడం. మరికొందరు భూకబ్జాలు చేసి కోట్లకి కోట్లు అక్రమంగా ఆర్జించి దొరికిపోయిన వాళ్ళను కూడా చూపించారు. అయితే అన్ని రంగాల్లో అవినీతి పరులున్నారు. నీతిమంతులు కూడా ఉన్నారు. అందర్నీ ఒకే గాటకి కట్టలేము కదా?”

“అదీ నిజమే!” అది సరే. నీ విషయం చెప్పు.”

“అదే.. అదే..!”

“నసగకుండా చెప్పు.”

“అమ్మ చివరి కోరిక తీరుస్తావని..!” నసిగాడు ధర్మారావు.

“ఏంటి?” తెలియనట్టు అడిగాడు భుజంగరావు.

“తాయారు తన కోడలు అవాలన్న అమ్మ కోరిక.”

ఆ మాటలకి అంత వరకూ శాంతంగా మాట్లాడుతున్న భుజంగరావుకి చివ్వున కోపం వచ్చింది. ముఖం ఎర్రబడింది.

“అది అసంభవం”

ధర్మారావుకి కూడా కోపం వచ్చింది. “ఎందుకు? నాకేం తక్కువ? సమాజంలో నాకు పేరు ప్రతిష్ఠలు లేవా? అవి ఎలా వచ్చాయన్నది ముఖ్యం కాదు. ఉన్నాయా లేవా అన్నదే ముఖ్యం,” అన్నాడు.

“చిన్నప్పటి నుండి నీ చరిత్ర తెలిసిన నాకు నా కూతుర్నిచ్చి పెళ్ళి చేయడం నాకిష్టం లేదు.”

ఆ మాటలకి ధర్మారావు ముఖం కోపంతో ఎర్రబడింది. చివ్వున లేచి బయటకు నడిచాడు.

అధ్యాయం-32

భుజంగరావు జిల్లా పరిషత్ ఛైర్మన్. అతనికి సన్నిహితంగా మెలుగుతాడు శంకరం. అతనికి నమ్మినబంటుగా తిరుగుతాడు. మన శ్రేయోభిలాషులు అని అనుకున్న వారికి మన చుట్టూ తిరుగుతున్న వారికి బాసటగా నిలవాలి. వాళ్ళకి ఏ హానీ, నష్టం లభించకూడదని రాజకీయవాదుల్లో అందరికీ కాకపోయినా కొంత మందికేనా ఉంటుంది. అలాంటి భావం కలవాడు భుజంగం. తన బాగోగులు కోరేవారు కష్టాల్లో ఉంటే ఆ విషయం తెలిసినప్పుడు ఈపాటి ఆపాటి మానవత్వం ఉన్న మనిషి స్పందించక మానడు. అటువంటి స్పందించే గుణమే భుజంగంలో ఉంది.

రాజకీయవాదులకి స్వార్థమే పరమార్థం. వారు ఊసరవెల్లుల్లాంటి వాళ్ళు. రంగులు మారుస్తారు. ఏ ఎండకా గొడుగు పడతారు. ప్రజాసేవ అనే ముసుగులో ప్రజాసేవ చేస్తామని రాజకీయాల్లోకి అడుగుపెట్టి గెలిచిన తరువాత ఆ ప్రజాసేవ దేవుడెరుక, ఆ ప్రజల వేపు కన్నెతి చూడడానికేనా ఇష్టపడరు. తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లకి పడగలెత్తుతారు. అలాంటి వాళ్ళలో భుజంగరావుని జమ కట్టలేము. ఎందుకంటే అతనిలో కొద్దిపాటేనా మానవత్వం ఉంది. దానగుణం ఉంది.

అతని కూతురు తాయారు ఆమెలో కూడా తండ్రిలో ఉన్న మానవత్వ గుణాలే ఉన్నాయి. తన వాళ్ళు అని అనుకున్న వాళ్ళకి హాని జరుగుతుందని తెలిస్తే తల్లడిల్లిపోయే సంస్కార హృదయం ఉంది. ఆమెకి స్నేహితురాలు సుందరి. ఆమెకి తాయారు లోకం పోకడల గురించి చెప్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సుందరి బేలతనం చూసి జాలిపడుతుంది. బాధపడుతుంది.

సుందరి తెలివి తక్కువది మాత్రం కాదు. చదువంటే అబ్బలేదు కాని కొన్ని కొన్ని విషయల్లో ముందే ఉంటుంది అని అనుకుంటుంది తాయారు. తనకున్న తెలివితేటలు సుందరి సద్వినియోగ పరుచుకోదు అని తపన పడుతుంది. ఆమెకి కూడా కొన్ని ఇష్టాఇష్టాలుంటాయి తను కాదనదు. అయితే అన్ని ఇష్టాలూ వ్యసనాలుగా మారితే నష్టపోయేది మన జీవితమే అని అనుకుంటుంది తాయారు. తనతో పదవ తరగతి వరకూ చదవమని ఎంత బలవంతం చేసి, నచ్చజెప్పినా సుందరి తన చదువు మధ్యలోనే మానేసింది. తను మాత్రం టెన్తు పూర్తి చేసింది.

‘ఇదే కాదు ఈ సమాజంలో కొన్ని పనులు, సంఘటనలు కొన్ని కష్టమనిపిస్తాయి. కొన్ని ఇష్టమనిపిస్తాయి. ఇష్టమైన వాటిపై మక్కువ ఎక్కువ కావడం సహజమే. దాంతో కష్టమైన వాటిని దూరంగా ఉంచ ప్రయత్నిస్తాం. ఇష్టమైన వాటి మీదే దృష్టి పెడతాం. సుందరి స్వభావం అంతే. కష్టసుఖాల్ని సమానంగా చూడాలన్న తలంపే ఉండదు. చిన్న పిల్లల మనస్తత్వం. ఇంకెప్పుడు తెలుసుకుంటుందో లోకం పోకడ’ అని సుందరిని తలుచుకుంటూ బాధపడుతుంది తాయారు.

తను రాజకీయవాది కూతురు కనకనే ఇలా ఆలోచిస్తోంది. అది సహజమే. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. ఎదురుదెబ్బలు ఎదుర్కోడం జరుగుతుంది. అన్నింటినీ ఎదుర్కునే మనోధైర్యం కూడా ఉండాలి. అందుకే తను ఇలా ఆలోచిస్తోంది. జీవితం అంతే అడుగడుగునా సంఘర్షణే. ఎన్నో కష్టనిష్ఠూరాలు అనుభవించాలి. ఆ గుణమే లేదు సుందరిలో, తెల్లనివన్నీ పాలు అని నమ్మేరకం. అలాంటిది కాబట్టే తన బావ ధర్మారావు బారిన పడింది.

బావా, తనూ కొన్నాళ్ళు ఒకే చోట మెలిగారు. అత్తయ్య చనిపోతూ బావను తన తండ్రికి అప్పగిస్తూ “అన్నయ్యా! వీడు నీకు మేనల్లుడే కాదు. అల్లుడు కూడా అవాలనేదే నా ఆఖరి కోరిక” అంటూ కన్నుమూసింది. చిన్నప్పుడు అందరూ తమిద్దర్నీ కాబోయే భార్యాభర్తలనేవారు. అయితే ఆ రోజుల్లో తనకి బావ మీద ఇష్టతా లేదు అలా అని అయిష్టతా లేదు. ఆ చిన్న వయస్సులో భార్యాభర్తల బంధం గురించి ఆలోచించే వయస్సు కూడా కాదు తనది. ఆ బంధం గురించి తెలుసుకునే మనస్సు కూడా తనకి లేదు.

తను ఆరవ తరగతి చదువుతున్న రోజుల్లో బావ పదవ తరగతి చదువుతున్నాడు. అతని ప్రవర్తన, వ్యవహార శైలి తన తండ్రికి నచ్చలేదు. అతని చెడు స్నేహాలు అతడ్ని పెడదారి పట్టించడం ఆరంభించాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలకి విషయాలకి, కొందరు తీవ్రంగా స్పందిస్తారు. తన తండ్రి కూడా ఒక విషయంలో అలాగే స్పందించాడు. చీవాట్లు పెట్టాడు. మందలించాడు అయితే అవన్నీ దున్నపోతు మీద వాన చినుకులే అయ్యాయి.

అప్పుడు ఆ వయస్సులో తను బావ గురించి ఆలోచించ లేకపోయినా ఈ రోజు తను అతని మానసిక స్థితి గురించి ఆలోచిస్తోంది. వయస్సు చాలా చెడ్డది అంటారు. వయస్సులో ఉన్న కొంతమంది తమ భావోద్వేగాల్ని, కోరికల్ని అదుపులో ఉంచుకోలేకపోతారు. భావోద్రేక తీవ్రతలో ఎంతటి వారైనా విచక్షణా రహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆలోచనకు సైతం అవకాశం లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితిలో కొన్ని సందర్భాల్లో లాభపడినా మరికొన్ని సందర్భాల్లో నష్టపోతూ ఉంటారు.

భావోద్వేగాలకి లోనయినవారు తమకు తాము సంతృప్తులవాలని కోరుతారు. ఆరాటపడతారు. ఇలా ఆరాటపడ్తూ ప్రయత్నాలలో అనేక భావోద్వేగానికి, ఉద్రేకానికి లోనవుతారు. అటువంటి సమయంలో తమ ప్రయత్నాలు, పనులు ఉచితమైనవా కాదా అనే విషయాన్ని మరిచిపోతారు. బావ చేసిన పనీ అదే. భావోద్వేగానికి లోనయి అప్పుడే ప్రారంభ యవ్వనా వస్థలో అడుగుపెడ్తున్న అతను పాలేరు రంగడి భార్య చంద్రి చెయ్యి పట్టుకున్నాడు. చంద్రి ఊరుకుందా లేదు. లబోదిబో అంటూ నానా రభస చేసింది. రంగడు బావను చంపేస్తానని ఇంటి మీదకు వచ్చాడు.

తన తండ్రికి పరువు పోయినంత పనైయింది. ఎలాగో అలాగ నచ్చజెప్పి రంగడిని ఇంటికి పంపించేడు తండ్రి. నలుగురూ నానా విధాలుగా మట్లాడుకున్నారు. ఎప్పుడూ శాంతమూర్తిలా ఉంటే తన తండ్రి. ఎటువంటి పరిస్థితిలో చలించని తన తండ్రి ఉగ్రుడయ్యాడు. ఫలితంగా బావ మీద చెయ్యి చేసుకున్నాడు.

ఎంత శాంతస్వరూపులకయినా కొద్దో గొప్పో సమస్యలు, సంఘటనలు చిరాకుపరచక మానవు. కొందరి ప్రవర్తనలు ఇబ్బంది పెట్టకమానవు. కొన్ని పరిస్థితులు కకలావికలం చేయక మానవు. తన తండ్రి పరిస్థితీ అదే అయింది. బావ ప్రవర్తన అతని వివేకాన్ని నశింపచేసింది.

బావ ఆ తరువాత ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినవాడు ఈ రోజు ఓ చిన్న సినిమాకి నిర్మాతగా మారి గ్రామంలో అడుగుపెట్టాడు. వాళ్ళూ, వీళ్ళూ చెప్పిన మాటల్ని బట్టి నైతికతకి తిలోదికాలు ఇచ్చి అనైతిక జీవితం గడుపుతున్నాడని తను వింది.

అతను ఎలాపోతే తనకేం కాని అని ఊరుకోవడానికి వీల్లేని పరిస్థితి ఇప్పుడు తనది కాదు. తనని భార్యగా పొందాలన్న కోరికను తన తండ్రి ముందుంచాడు. అయితే తన తండ్రి అంత సులువుగా అతని ప్రస్తావన అంగీకరించే మనిషి కాదని తనకి తెలుసు. అందుకే ధైర్యంగా ఉండగలుగుతోంది. అయితే బావ వికృత చేష్టలకి, ఆడుతున్న వింత నాటకానికి పాపం సుందరి బలైపోతోంది. తను అలా జరగనీయకూడదు. అలా జరగనీయకుండా చూడాలి.

“ఏంటి తాయారు! అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?” తండ్రి అనునయంగా అడిగిన మాటలకి ఆలోచనా స్రవంతికి అడ్డుకట్ట వేసింది.

“బావను గురించే నాన్నా!”

“ఆ త్రాష్టుడి గురించి నాకు చెప్పకు.”

“బావ ఒక్కడి విషయం అయితే నేనూ అలాగే అనుకునేదాన్ని. సుందరిని కూడా ముగ్గులోకి లాగుతున్నాడు. మాయమాటలు చెప్పి తన వెంట త్రిప్పుకుంటున్నాడు”

“ఇంత పని చేస్తున్నాడా? అయితే ఆలోచించవలసిందే” భుజంగరావు కూతురితో అన్నాడు. భుజం మీద కండువా వేసుకుని బయటకు నడిచాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version