సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-18

0
2

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ధర్మారావు సుందరికి వల వేస్తున్నాడని భుజంగరావుకి చెప్తుంది తాయరు. ఆ సంగతి చూస్తానంటూ బయటకి వెళ్తాడు భుజంగరావు. సినిమాల పిచ్చి ఉన్న మధు ధర్మారావు బృందానికి అవసరమైన పనులు చేసి పెడుతూ, ధర్మారావుని ఓ కంట కనిపెడుతుంటాడు. ధర్మారావుకి తను చేసినవన్నీ వృథా అని అనిపిస్తుంది మధుకి. అతని మీద అనుమానం వస్తుంది. పైగా తన చెల్లెలు సుందరితో రాసుకుని పూసుకుని తిరగడం నచ్చదు. సుందరిని వారించినా, అన్న మాట వినదు. ఓ రోజు ఇంట్లో చెప్పకుండా ధర్మారావు కారులో అతనితో పాటు పట్నానికి బయలుదేరుతుంది. అది చూసిన మధు వారిని రహస్యంగా అనుసరిస్తాడు. ఓ పేరున్న ఎ.సి. హోటల్ దగ్గర కారు ఆపుతాడు ధర్మారావు. ఆ హోటల్లోనే ఓ రూమ్‌లో అతని తీసే సినిమాలో నటించే యువ హీరో ఉంటాడు. సుందరిని అతని గదిలోకి తీసుకువెళ్తాడు ధర్మారావు. ముందే ప్లాను వేసుకున్నట్టు ఆ గదిలో టిపాయి మీద మందు బాటిల్సు, గ్లాసులు, జీడిపప్పు పకోడీ అన్నీ ఉంటాయి. ఆ యువ హీరో వీరిద్దర్నీ ఆహ్వానిస్తాడు. ఆ వాతవరణం సుందరిలో భయం కలిగించి, అనుమానం పెంచుతుంది. ఆమెలో అంతర్మథనం మొదలవుతుంది.  ఈలోపు హీరో, ధర్మారావు ఆమెని ఒత్తిడి చేస్తారు. సినీ ఫీల్డులో ఉన్నవాళ్ళకి ఇవన్నీ మామూలు విషయాలే, ఇలాంటి వాటికి అలవాటు పడాలని అంటారు. ఆ పద్మవ్యూహం నుంచి బయటపడడం ఎలా అని సుందరి ఆలోచిస్తుంది. హోటల్ బయట ఉన్న మధు సుందరిని ఎలా రక్షించాలాని ఆలోచిస్తుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సూర్యం మధుని పలకరించి ఇక్కడెందుకు ఉన్నావని అడుగుతాడు. మధు జరిగినదంతా చెప్తాడు. సూర్యానికి పరిస్థితి అర్థమవుతుంది. మధుని తీసుకుని హోటల్ మేనేజరు దగ్గరికి వెళ్ళి పరిస్థితి అంతా వివరిస్తాడు. వాళ్ళు చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులని, వాళ్ళని తామేమీ అనలేమని అంటూ, వాళ్ళున్న గది నెంబరు చెప్తాడు మేనేజర్. మధుతో కలిసి అక్కడికి వెళ్ళిన సూర్యం తలుపు బాదుతాడు. విసుక్కుంటూ తలుపు తెరుస్తాడు హీరో. సుందరి నోట్లో బలవంతాన్న మందు పోయబోతుంటాడు ధర్మారావు. సుందరి పెనుగులాడుతూ ఉంటుంది. తన వాళ్ళని చూసేప్పటికి సుందరికి ఆనందం, ధైర్యమే కాకుండా ఒక్కసారి దుఃఖం కూడా పొంగిపొర్లు కొచ్చి, ఒక్కసారిగా బయటకు పరిగెత్తుకొస్తుంది. పోలీసు కంప్లయింట్ ఇస్తానని సూర్యం అంటే, మీ అమ్మాయి మా గదికి వచ్చింది, ఏం చేసుకుంటారో చేసుకోండని అంటాడు ధర్మారావు. సుందరిని జాగ్రత్తగా ఇంటికి చేర్చి అన్నయ్య శంకరాన్ని మందలిస్తాడు. తన పెంపకంలో లోపం ఉందని అంగీకరిస్తాడు శంకరం. మొదట్నించి తాను చెప్తున్నా, భర్త తన మాట వినలేదని అంటుంది కాత్యాయిని. ఇంజనీరింగ్ కాలేజీలో కేంపస్ ఇంటర్వ్యూలు పూర్తవుతాయి. సిద్ధార్థకి ఉద్యోగం వస్తుంది. రవి తీసుకున్న ట్రేడ్ వారికి ఉద్యోగాలు రాలేదు. రవి అప్‍సెట్ అవుతాడు. ఉద్యోగం దొరికిన సిద్ధార్థ అదృష్టవంతుడని భావిస్తాడు. మరుక్షణంలో తాను అసూయ పడుతున్నాడా అని తనని తాను ప్రశ్నించుకుంటాడు రవి. సిద్ధూ రవికి ఉద్యోగం రానందుకు బాధపడతాడు. అక్కయ్య తనని ఎం.బి.ఏ కాని, ఎమ్.టెక్ కాని చదివిద్దామనుకుంటోదని అబద్ధం చెప్తాడు రవి. అలాంటి అక్కయ్య ఉన్న రవి అదృష్టవంతుడని అంటాడు సిద్ధూ. ఇంతలో బిందూ, శకుంతల సిద్ధార్థకి అభినందనలు తెలియజేయడానికి అక్కడికి రావడంతో వాతావరణం తేలిక పడుతుంది. ఇక చదవండి.]

అధ్యాయం-35

[dropcap]రెం[/dropcap]డు రోజులు సెలవులు వచ్చాయని రవి ఇందిర దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పటి నుండి తమ్ముడి ప్రవర్తన గమనిస్తూనే ఉంది ఇందిర. ఏదో అన్యమనస్కంగా ఉన్నాడు. అతనిలో ఏదో అసంతృప్తి. ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. పరధ్యానంగా ఉంటాడు.

‘రవి ఎందుకలా ఉన్నాడు? కారణం తెలుసుకోవాలి’ అని అనుకుంది ఇందిర. తమ్ముడికి భోజనం వడ్డిస్తోంది.

“సిద్ధార్థకి కేంపస్‍లో జాబు వచ్చిందిట కదా? బిందు చెప్పింది.” అంది.

“వాడు చాలా అదృష్టవంతుడు,” ముక్తసరిగా అన్నాడు రవి.

“నీవు దురదృష్టవంతుడివా?”

“అలా అని కాదు. అయినా నాకు నీలాంటి అక్కయ్య అండ ఉండగా నేను దురదృష్టవంతుడ్ని ఎలా అవుతాను?” నవ్వుతూ అన్నాడు రవి ఇందిరతో. తమ్ముడు అలా అంటున్నా అతని కళ్ళల్లో నీలి నీడల్ని గమనించింది ఇందిర.

“సిద్ధార్థ కేంపస్‍లో సెలక్టు అవడం నీవు హర్షించలేకపోతున్నావా?”

“ఛీ.. ఛీ..! నేను అంత సంకుచిత మనస్తత్వం గలవాడనా అక్కా! సిద్ధూ నాకు మంచి స్నేహితుడు.”

“రవి! ఒక్క విషయం. మనకి బాధలు, బాధ్యతలు, సమస్యలూ వచ్చినప్పుడు ఇది నా కర్మ అనుకుని కర్మ సిద్ధాంతం వల్లించుకోవడం పొరపాటు. ఇది నా కర్మ అని అనుకోకూడదు. కర్మ అంటే పని చేయాలి అని అనుకుని ఎవరైనా మనల్ని క్రిందకు లాగడానికి ప్రయత్నిస్తే నేల మీద కొట్టిన బంతి పైకి ఎగిరినట్టు మనం కూడా బంతి లాగే మీదకు ఎగరాలి. అణచివేత నుండి బయటపడి ఉన్నతంగా ఎదగాలి,” అంది ఇందిర తమ్ముడితో.

అక్కయ్య తనలో నిరాశని తొలగించి స్పందన కలగజేయడానికే అలా మాట్లాడుతోంది అని అనుకున్నాడు రవి.

“అసలికి నాకు, నేను అన్న భావం వదిలి వేస్తే స్వ-పర అనే భావం ఉండదు. మనస్సు ఉన్నంత వరకూ నేను, నాకు అని తాపత్రయం ఉంటూనే ఉంటుంది. అందుకే మన మనసు నుండి నేను, నాకు అనే భావం తొలగించాలి,” తిరిగి అంది ఇందిర.

అక్కయ్య మాటలు ఒక్కొక్కసారి అర్థం కావడం కష్టం. మెదడుకి పని కల్పించినా తెలుసుకోలేని నిగూఢ అర్థం వచ్చే మాటలు ఆమెవి అనుకున్నాడు రవి

“నావన్నీ పిచ్చి పిచ్చి మాటలూ వాటిని పట్టించుకోకు. సిద్ధూ కేంపస్ సెలక్టు అయ్యాడు. నీవు అవలేక పోయావని బాధపడకు రవీ! ఎం.బి.ఏ చేద్దువు గాని, లేకపోతే ఎమ్.టెక్ చదువుదుగాని,” ఇందిర తమ్ముడితో అంది. ఆమె ఆ ఓదార్పును పాజిటివ్‌గా ఆస్వాదించే స్థితిలో లేడు రవి.

తను సిద్ధార్థతో తనని తన అక్కయ్య పై చదువులు చదివిస్తుందని చిన్న అబద్ధం ఆడిన మాటలు నిజం అవబోతున్నాయి అని తెలిసినప్పుడు ఒకింత సంతోషం కలిగింది. మరికొంత బాధ కలిగింది రవికి.

“ఇప్పటికి నీవు చదివించిన చదువు చాలు. ఇంకా నిన్న బాధ పెట్టాలా అక్కా!” బాధగా అన్నాడు రవి.

“ఏంటిరా నీ మాటలు వింతగా ఉన్నాయి.”

“ఇప్పటికే ఏ అక్కా చేయని త్యాగం నీవు నీ తోబుట్టువుల కోసం చేశావు, అది చాలు. మరి ఇకపై నిన్ను బాధ పెట్టదల్చుకోలేదు. ఈ నా చదువు అయిపోగానే ఏదైనా జాబు చూసుకుంటాను,” రవి అన్నాడు.

“ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీలు తామర తంపరగా వెలిసి ఉన్న నేటి పరిస్థితుల్లో ఇంజినీరింగు పట్టుబద్రులు నిరుద్యోగుల కుప్పలు తెప్పలుగా రోడ్ల మీద ఉద్యోగాన్వేషణలో తిరుగుతున్నారు. సత్తా ఉన్నవాడు, రికమండేషను, పరపతి పలుకుబడి ఉన్న వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఉద్యోగాన్వేషణలోనే కాలం గడిపేస్తున్నారు.”

‘అక్కయ్య చెప్పిన మాట నిజమే. నేడు ఇంజనీరింగు పట్టభద్రుల పరిస్థితి అలాగే ఉంది. అయినా ఎవ్వరూ ఆ చదువు చదవడం వదిలి పెట్టలేదు,’ ఇలా ఆలోచిస్తున్నాడు రవి.

“రవీ! ఒక్క విషయం. నాకే పిల్లలుంటే వాళ్ళని చదివించమా? మీ అందరూ నా పిల్లలేనురా. మీరు ఎలా అనుకుంటున్నారో నాకు తెలియదు కాని నేను మాత్రం అలా అనుకుంటున్నాను. మీ భవిష్యత్తే నా భవిష్యత్తు. మీ కష్ట సుఖాలే, నా కష్ట సుఖాలు. అందుకే నిన్ను పై చదువులు చదివిస్తాను అని అంటున్నాను. ప్లీజ్! నా కోరికకు నెగిటివ్‌గా జవాబియ్యకు,” ఇందిర బాధగా అంది.

అక్కయ్య మాటలకి విచలితుడయ్యాడు రవి. భావోద్వేగంతో ఒక్కసారి కొట్టుమిట్టాడాడు. అతని కళ్ళల్లో సన్నని కన్నీటి తెర తళుక్కున మెరిసింది. అతని మన స్థితి ఆమెకు అవగతమయింది. అయితే ఆమె ఆలోచన ఒక్కటే. తన జీవితం ఎలాగూ మ్రోడు బారిపోయింది. తనని ఆశ్రయించిన వాళ్ళ జీవితం పచ్చగా కళకళలాడాలి. తన వాళ్ళు తన జీవిత చరమాంకంలో తనని చూస్తారా లేదా? ఆదుకుంటారా లేదా అన్న ప్రశ్నని విడిచిపెట్టి తన వాళ్ళు అనుకున్న వాళ్ళకి తనకి తోచిన ఏ పాటి సహాయాన్నైనా అందించాలన్నదే తన లక్ష్యం.

‘ఇక తన విషయమా? ఇంచుమించుగా మధ్య తరగతి కుటుంబాల్లో పెద్ద కూతురిగా పుట్టిన ప్రతీ ఆడపిల్ల పరిస్థితీ తన పరిస్థితి లాగే ఉంటుంది. వాళ్ళ జీవన సరళి ఇంచుమించుగా తన జీవన సరళిలాగే ఉంటుంది. బాధ్యతల నడుమ నలిగిపోవల్సిందే. కోరికల వలయాన్ని ఛేదించుకుని తన చుట్టూ గిరి గీసుకుని కూర్చోవాలి. తన పరిధిలోకి ఎవ్వరినీ రానీయకూడదు. తను ఎవ్వరితో కలవకూడదు. అలా ఒంటరిగా తన జీవితం అంతం అయిపోవల్సిందే.

భోజనం చేసే సమయంలో మనస్సు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అయితే తన చేసిన పనేంటి? భోజన సమయంలో వాతావరణాన్ని తను గంభీరంగా మార్చేసింది,’ ఇలా ఆలోచిస్తోంది ఇందిర.

“రవీ! నీకు గుత్తి వంకాయ కూరంటే ఇష్టం తిను” అని కొసరి కొసరి వడ్డిస్తోంది. అక్క మనస్సు కష్ట పెట్టడం ఇష్టం లేక రవి కూడా కృత్రిమ నవ్వు ముఖంపై తెచ్చుకుని అయిష్టంగానే భోజనం కానిస్తున్నాడు. అతని మనస్సులో అక్క జీవితం పై బాధ ఉంది. జాలి ఉంది. సానుభూతి ఉంది. ఆవేదన ఉంది.

అధ్యాయం-36

మనుష్యుల మనస్సు చాలా విచిత్రమయినది. అది మనిషి అవచ్చు, వస్తువవచ్చు. ఆ మనిషి మీద, వస్తువు మీద మనిషి తన మనసులో మమకారం, ఆప్యాయత పెంచుకుంటే ఆ మనిషి, ఆ వస్తువు మనిషికి దూరమవుతాయని తెలిసిన నాడు ఆ మనిషి మనస్సు కలత బారడం సహజం.

ఆ భావోద్వేగమే బాధ. మన వాళ్ళు అనుకున్న వాళ్ళు దూరమవుతున్నారంటే ఆ భావోద్వేగం సహజమే కదా! మనవాళ్ళు అని అనుకున్న వాళ్ళ మీద మనకి తెలియకుండానే ఆప్యాయత పెంచుకుంటాము. అనురాగం, మమత ఏర్పరుచుకుంటాయి. వాళ్ళ ఎడబాటు మనల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. మనస్సు కలత బారుతుంది.

ఫలితం కళ్ళల్లో కన్నీరు ఉబుకుతుంది. మనస్సులో ప్రశాంతత కరువవుతుంది. ఏకాగ్రత దెబ్బ తింటుంది. అన్యమనస్కంగా రోజులు గడిపే పరిస్థితి వస్తుంది. అదే ఆడదయితే వ్యతిరేక పరిస్థితులు తనకి ఎదురయినప్పుడు తన దుఃఖావేశాన్ని ఆపుకోలేక బయటపడుతుంది కాని మగవాడి విషయంలో అలా కాదు. అలా అని మగవాడికి బాధ, దుఃఖం ఉండవా అంటే, అదీ కాదు. అతనికీ ఉంటాయి భావోద్వేగాలు, భావోద్రేకాలు. అయితే ఆడది బయట పడినంత సులువుగా అతను బయటపడడు. అతను తన భావ మనోవికారాన్ని అదుపు చేసుకుంటాడు. మనస్సులోనే పదిలంగా దాచుకుంటాడు. అంతేకాని బయటపడడు.

పై చెప్పిన పరిస్థితి ఒకరిద్దరి పరిస్థితి కాదు. ఏకంగా నలుగురి మానసిక స్థితి. రెండు ప్రేమ జంటల భావోద్వేగాల విషయం. అసలు విషయానికి వస్తే బిందు సిద్ధార్థ మీద ప్రేమ పెంచుకుంది. ఆపేక్ష పెంచుకుంది. సిద్ధార్థ కూడా ఆమె మీద అనురక్తి పెంచుకున్నాడు. ఇలాగే జరిగింది రవి, శకుంతల విషయంలో.

అయితే ఒక్క విషయం. మగవాడు తన ప్రేమను బయటకి వ్యక్తం చేసినంత సులువుగా ఏ ఆడపిల్లా తన ప్రేమను బయటకు వ్యక్తం చేయలేదు. అది ఆమె బలహీనత అనుకోవచ్చు, లేక సంఘ కట్టుబాట్లు, తను పుట్టి పెరిగిన వాతావరణం, లేక మరేదేనా అని అనుకోవచ్చు.

సిద్ధార్థ అయితేనేమి రవి అయితేనేమి, వాళ్ళకి బిందు మీద శకుంతల మీద ప్రేమ భావం ఉన్నా ఆ భావాన్ని బయటకు వ్యక్తం చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి, వాళ్ళ మీదున్న బాధ్యతలు వాళ్ళను వెనక్కి లాగుతున్నాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సమస్య.

‘తను జీవితంలో స్థిరపడి, అక్కయ్య కష్టాల్ని దూరం చేయాలి. ఆమెకి మానసిక సాంత్వన కలగచేయాలి’ అన్నదే రవి ఆలోచన.

తన తల్లి తన కోసం పడ్తున్న ఆరాటం, తపన గమనించిన బిందు తన తల్లి కలలు సాకారం చేయాలి. జీవితంలో ఆమె ఎన్నో ఎదురు దెబ్బలు తింది. తనలా తన కూతురి జీవితం కాకూడదు అన్న తల్లి ఆకాంక్ష నెరవేర్చాలి – అన్నదే బిందు ఆలోచన అయితే శకుంతల ఆలోచన మరోలా ఉంది.

తనని కన్న తల్లిదండ్రులు తనకి జన్మనిచ్చిన తరువాత ఏ మురికి కుప్ప తొట్టిలోనో పారేయకుండా జన సంచారమున్న ప్రదేశంలో విడిచి పెట్టడం వల్లనే ఓ పుణ్య దంపతులు తనని చేరదీసి, చదివిస్తూ తనని ఇంతదాన్ని చేస్తున్నారు. తాను వాళ్ళకి కళంకం తెచ్చే ఏ పనీ చేయలేదు. అలా చేస్తే అది విశ్వాస ఘాతకం కింద వస్తుంది. వాళ్ళు పరువు బజారుకీడ్చినట్టు అవుతుంది. తనని పెంచిన వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసినట్టు అవుతుంది.

ఇలా సాగిపోతున్నాయి ఆ నలుగురి ఆలోచన్లు. వాళ్ళ ఆలోచనల్ని అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు నలిగిపోయేది ఆ నలుగురు జీవితాలే.

‘నన్ను నీవు ప్రేమించకపోతే కత్తి పోట్లకి గురవుతావు. యాసిడ్ నీ మీద పోసి నీ ఆకారాన్ని వికారంగా చేస్తాను’ అనే క్రూరమైన మనస్తత్వాలు కావు సిద్ధార్థది, రవిది. అలాగే ‘ప్రేమించిన వారు లభించలేదు ఎందుకొచ్చింది ఈ జీవితం’ అని ఏ పురుగుల మందో త్రాగో లేక శరీరానికి నిప్పంటించుకునో లేక మేడ మీద నుండి దూకో తమ జీవితాన్ని అంతం చేసుకోడానికి ప్రయత్నించే బలహీనమైన మనస్తత్వం గల వాళ్ళు కాదు బిందు, శకుంతల.

ఆ నలుగురిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. విధి ఎలా ఆడిస్తే అలా ఆడడమే మానవ జీవితం. విధి ఆడించే వింత నాటకంలో పాత్రలు మాత్రమే మానవులు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here