సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-20

0
1

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ఉగాది వచ్చింది. ప్రకృతి అంతా శోభాయమానంగా ఉంది. కానీ ప్రకృతిని ఆస్వాదించే స్థితిలో లేదు బిందు. ఆమెలో ఏదో అశాంతి. సిద్ధార్థ జ్ఞాపకాలే చుట్టుముట్టి ఉంటాయి. చదువు పూర్తయిన సిద్ధార్థ కాలేజీ నుంచి వెళ్ళిపోతాడు, ఇక తనకి కనిపించడన్న బాధతో ఉంటుంది బిందు. అన్నం తినకుండా కంచంలో పిచ్చి గీతలు గీస్తున్న కూతురిని ఏమిటా పరధ్యానం అని అడుగుతుంది ఉమాదేవి. నువ్వు సిద్ధార్థ గురించే ఆలోచిస్తున్నావు కదా అని అంటుంది. తల్లి మాటలకి జవాబు చెప్పదు బిందు. సిద్ధార్థని మరిచిపొమ్మని, చదువు మీద దృష్టి పెట్టమని బిందుని హెచ్చరిస్తుంది ఉమాదేవి. తనకి నచ్చకపోయినా, అతనికి ఆర్థిక సహాయం చేసినా ఊరుకున్నాననీ, ఇంతటితో దీనికి ముగింపు పలకమని చెప్తుంది. తల్లి మాటలు బిందుకు రుచించవు. అయినా జవాబివ్వదు. బిందూ సిద్ధార్థని ఇష్టపడినట్టే శకూ రవిని ఇష్టపడింది. కానీ ఆ విషయం రవికి చెప్పలేకపోతుంది. ఫేర్‍వెల్ రోజున కాలేజీ క్యాంపస్ కళకళలాడిపోతుంది. సీనియర్లు జూనియర్లు కబుర్లు చెప్పుకుంటూ సందడి చేస్తారు. సిద్ధూ తనకి దూరమవుతాడేమని బిందు భయపడుతుంది, శకూలో కూడా రవి దూరమవుతాడేమోనన్న సందేహం. అందరు విద్యార్థులు డైనింగ్ హాల్‍కి వెళ్తారు. అక్కడ అల్లరి చేస్తారు, సరదాగా గడుపుతారు. ఈ రోజు కర్రీ ఏమిటో తెలుసా అని ఒక కుర్రాడు గట్టిగా అరుస్తాదు. గుత్తి వంకాయ కూర అని మరో విద్యార్థి అరుస్తాడు. అప్పుడు సుకుమారి – సిద్ధార్థ చేత మరోసారి వంకాయ కూర తినిపించి – అని బిందూని అడుగుతుంది. తప్పదు, చేయాలి అని అందరూ అరుస్తారు. కూర తీసుకుని సిద్ధూ వద్దకి వెళ్తుంది. వాళ్ళంతా తినిపించమని చెప్పారు కదా అంటాడు సిద్ధూ. అవునంటుంది బిందు. అయితే తినిపించు అని నోరు తెరుస్తాడు. కూర నోట్లో పెడుతుంది బిందు. వాళ్ళిద్దరి మనసుల్లో మధురానుభూతులు చోటు చేసుకుంటాయి. కాలేజీ వదిలి వెళ్తున్నందుకు బాధపడతాడు సిద్ధూ. ఇక చదవండి.]

అధ్యాయం-39

[dropcap]“ఉ[/dropcap]మా! నేనూ నీతో ఫేర్‌వెల్ ఫంక్షనికి వచ్చి మీ అమ్మాయి డాన్సు పోగ్రాం చూద్దామనుకున్నాను, కాని లేడీస్ క్లబ్‌లో అర్జంటు మీటింగు ఉంది. అందుకే రాలేకపోతున్నాను సారీ!” అంది సంఘమిత్ర ఉమాదేవితో అంది.

“మీకు రావడం వీలు కాకపోతే మీరేం చేయగలరు?” అంది ఉమాదేవి.

ఈ మధ్య సంఘమిత్ర, ఆమె భర్త మన్మథరావులో కొద్దిగా మార్పు వచ్చినట్లనిపించింది ఉమాదేవికి. సంఘమిత్రలో అహంభావం స్థానంలో ఆప్యాయతను, మన్మథరావులో వెకిలి చేష్టల స్థానంలో హుందాతనాన్ని చూస్తోంది ఆమె. కాలమే వారిలో ఈ మార్పు తెచ్చింది అని అనుకుంది.

లేకపోతే టెంపర్ మనస్తత్వం గల సంఘమిత్రలో ఇలాంటి పాజిటివ్ థింకింగ్ ఎలా వచ్చింది అని తలచుకుంటూ ఉంటేనే ఆశ్చర్యమేస్తుంది. మన్మథరావు విషయంలోనూ అంటే అంత జుగుప్సకరంగా ప్రవర్తించే అతనిలో ఇలా పెద్దరికం – హుందాతనం రావడం కూడా అపురూపమైన విషయమే.

ఉమాదేవి ఒక్కొక్క పర్యాయం భావోద్వేగానికి గురయి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో రకరకాల ఆలోచన్లు ఆమెను చుట్టుముడ్తాయి. మనలో అహంకారానికి తావియ్యకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాలనుకుంటుంది. అంతే కాదు చెప్పింది ఒకటి మనస్సులో ఉన్నది వేరొకటి కాకుండా తన మనస్సులో మాట స్పష్టంగా చెప్పాలనుకుంటుంది.

ఒకవేళ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురయినా ఎవరినీ నిందించకుండా ఆ పరిస్థితుల్ని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటుంది. తను చేసే పనిలో ఏకాగ్రత కనబర్చాలనుకుంటుంది. అంతేకాదు ఉమాదేవి తను చేపట్టిన పనుల్లో శ్రద్ధాసక్తులు కనబరుస్తుంది కూడా.

తన చూపు – ఆలోచనలు ఎంత బాగుంటే తనకి జీవితంలో అంత ఎక్కువుగా మంచి జరుగుతుందనుకుంటుంది. సంస్కారవంతంగా ఉంటే అదే మనకి శ్రీరామరక్షగా నిలుస్తుందనుకుంటుంది. అయితే సమాజంలో కొంతమంది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తారు. అది వాళ్ళ సంస్కారానికే వదిలిపెట్టాలి.

జీవితంలో ప్రతి ఫలాపేక్ష ఎంత హెచ్చుగా ఉంటే జీవితం అంత దుర్లభంగా తయారవుతుంది. దాని స్థానంలో ప్రేమాభిమానాలుంటే సుఖశాంతులు కలుగుతాయి. సంఘమిత్రలో ఇప్పుడంటే మార్పు వచ్చింది. కాని అంతకు పూర్వమయితే ఎవరినో ఒకరిని హేళన చేయడం, వెక్కిరించడం, నిందించడం ఇవే దినచర్యగా పెట్టుకునేది. అంతేకాని తను చేస్తున్నదేంటి? చూస్తున్నదేంటి? దానిలోని గుణ దోషాల్ని పట్టించుకునే ఓపిక ఆమెకి ఉండేది కాదు.

పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా అగుపించినట్లే సంఘమిత్ర లాంటి వాళ్ళు లోకమంతా కరుడు గట్టిన దుర్మార్గంతో నిండిపోయిందని భావిస్తారు. ఎందుకంటే వారి చర్యలు దుర్మార్గపు చర్యలు కాబట్టి. ఇలాంటి వాళ్ళు తోటి వారిని ప్రేమగా చూడ్డానికి కాని ఆత్మీయంగా పలకరించడానికి కాని అంగీకరించరు.

ఇలాంటి మనుష్యులు స్వార్థం విడిచిపెట్టాలి. తనకి మంచి జరిగితే చాలు అనే స్వార్థపు ఆలోచనని విడిచిపెట్టాలి. తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే, తను బాగుంటుంది అన్న ఆలోచన రావాలి. అలా ఉన్ననాడు మనుష్యుల్లో మృగ్యమైపోతున్న మంచితనం తిరిగి వెలుగు చూస్తుంది.

“అంత దీర్ఘంగా ఆలోచనలు దేని గురించి?”

ఇందిర మాటల్తో ఆలోచనా ప్రపంచం నుండి బయటపడింది ఉమాదేవి.

“సంఘమిత్ర గురించే. ఆమెలో ఇంత తొందరగా ఇలాంటి మార్పు వస్తుంది అని అనుకోలేదు.”

“మన్మథరావులో కూడా మార్పు వచ్చింది కదా!”

“భార్యాభర్తలిద్దరిలో ఇంత తొందరగా ఇలాంటి మార్పు రావడం ఆశ్చర్యకరమైన విషయమే,” అన్న ఉమాదేవి ఇందిరతో “ఇందూ ఈ రోజు మధ్యాహ్నం స్కూలుకి సెలవు పెట్టి బిందు కాలేజీలో జరుగుతున్న ఫేర్‌వెల్ ఫంక్షనికి వెళ్లాము. బిందు డాన్సు పోగ్రామ్ కూడా ఉంది” అంది.

అలాగే అని తలూపింది ఇందిర. ఆమె భావాలు మరోలా ఉన్నాయి. ఈ మధ్యని శకూని రవి ఇష్టపడ్తున్నట్టు తనకి అనిపిస్తోంది. శకూ కూడా చాలా మంచి అమ్మాయిలా ఉంది. అన్ని విధాలా రవికి తగిన అమ్మాయి అని తనికి అనిపిస్తోంది. ‘ముందు వాళ్ళిద్దరూ జీవితంలో స్థిరపడిన తరువాత పెద్దవాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపిస్తే తన బాధ్యత తీరిపోతుంది,’ అని అనుకుంటోంది ఇందిర.

ఉమాదేవి, ఇందిర ఇద్దరూ కాలేజీ ఫంక్షన్‌కి వెళ్ళారు. కళాశాల ప్రాంగణమంతా చాలా సందడిగా ఉంది. అమ్మాయిలూ అబ్బాయిలూ కేరింతలు కొడ్తూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తల్లి వచ్చిందని తెలిసి మేకప్ రూమ్ నుండి బయటికి వచ్చిన బిందు తల్లి చేతిని ఆప్యాయతగా తన చేతిలోకి తీసుకుంది. కూతురు వేపు అపురూపంగా చూస్తోంది ఉమాదేవి. ఆ తల్లీ కూతుళ్ళ అనుబంధాన్ని అపురూపంగా వీక్షిస్తోంది ఇందిర.

“ఇతనే సిద్ధార్థ,” రవి ఉమాదేవికి, ఇందిరకి సిద్ధార్థను పరిచయం చేస్తూ అన్నాడు. ఆడవాళ్ళిద్దరూ సిద్ధార్థ పేరు వినడమే కాని అతడ్ని నేరుగా చూడలేదు. హుందాగా, గంభీరంగా ఉన్న అతడ్ని చూడగానే చాలా మంచివాడిలా అగుపిస్తున్నాడు. ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు అని అనుకున్నారు. ముఖ్యంగా ఉమాదేవి సిద్ధార్థ వేపు నిశితంగా చూస్తోంది. తన కూతురు ఇతడ్ని ఇష్టపడుతోంది అంటే అది దాని తప్పు కాదు. అంతగా బిందుని ఆకట్టుకున్నాడు ఇతను అనుకుంటోంది ఉమాదేవి.

బిందుది బెస్ట్ సెలక్షన్. ముందు ముందు బిందుకి, సిద్ధార్థకి పెళ్ళి జరిగితే చూడచక్కని జంట అని అనుకుంది ఇందిర.

సిద్ధార్థను చూస్తూ ఉంటే ఉమాదేవికి తనకి పరిచయం ఉన్న వ్యక్తి పోలికలు అతనిలో ఉన్నాయనిపించింది. ఇతను చాలా మంచివాడిలా అగుపిస్తున్నాడు. అతని మంచితనం అర్థం చేసుకునే తన కూతురు అతనికి ఆర్థికంగా సహాయపడింది. ఇప్పుడు ఆమెకి కూతురు చేసిన పనిలో గొప్పతనం అర్థమయింది.

ఇంతలో శకూ కూడా అక్కడికి వచ్చింది. ఆమెతో వచ్చిన వ్యక్తుల్ని పరిచయం చేస్తోంది. “మా నాన్నగారూ, అమ్మ సూర్యం, పద్మ” అంటూ తన వెంట వచ్చిన తల్లిదండ్రుల్ని శకూ పరిచయం చేసింది. “మీ గురించి విన్నాం గాని మిమ్మల్ని మాత్రం చూడ్డం ఇదే మొదటిసారి,” అన్నారు శకూ తల్లిదండ్రులు. “నేను కూడా శకూ ద్వారా మీ గురించి మీ మంచితనం గురించి విన్నాను,” అంది ఉమాదేవి.

“పోగ్రామ్ పూర్తయిన తరువాత తప్పకుండా మీరు మా ఇంటికి డిన్నరుకి రావాలి. ఈ రాత్రి మా ఇంట్లోనే ఉండాలి. ఈ రోజు మీరు మా అతిథులు. మా ఆతిథ్యం స్వీకరించాలి,” అన్నారు సూర్యం దంపతులు ఉమాదేవితో.

“తప్పకుండా,” అంది ఉమాదేవి. వారి కలుపుగోరు తనం, వినమ్రత అన్నీ ఆమెకి బాగా నచ్చాయి.

‘ఈ దంపతులు చాలా ఉత్తములు, సహృదయులుల్లా అగుపిస్తున్నారు. వీళ్ళ పెంపకంలో పెరిగిన శకూ కూడా ఉత్తమ గుణాలు గలిగినదే అవుతుంది’ ఇందిర అనుకుంటోంది.

అధ్యాయం-40

సిద్ధార్థ తల్లిదండ్రులు కూడా వచ్చారు. వాళ్ళు సూర్యం పద్మకి అయితే తెలుసుకాని మిగతా వాళ్ళకి తెలియదు. అందుకే సిద్ధార్థ తన తల్లిదండ్రుల్ని అక్కడున్న వాళ్ళకి పరిచయం చేయడం ఆరంభించాడు.

“ఉమా! బాగున్నావా?” అని అన్నాడు సిద్ధార్థ తండ్రి రామశాస్త్రి ఉమాదేవిని చూస్తూ.

అతడ్ని చూసిన ఉమాదేవి మొదట ఒక్కసారి తెల్లబోయి అంతలోనే తమాయించుకుంది. తన కలవరబాటు పైకి కనబడనీకుండా చిరునవ్వు ముఖం మీదకి తెచ్చుకుంది. అంత వరకూ ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారి గంభీరత చోటు చేసుకుంది. వాతావరణం వేడి ఎక్కుతోంది.

“రామలక్ష్మీ కులాసేయేనా?” సిద్ధార్థ తల్లితో అంది ఉమాదేవి. ఆమె మాటలు వినిపించుకోలేదు రామలక్ష్మి. మేకప్‌‌లో ఉన్న బిందుని అపురూపంగా చూస్తున్న రామలక్ష్మి ఉమాదేవి మాటలు విని ఆమె వేపు కొరకొర చూస్తూ ముఖం ప్రక్కకి త్రిప్పుకుంది. ఉమాదేవితో ఏం మాట్లాడలేదు రామలక్ష్మి. ఉమాదేవి చిన్న బుచ్చుకుంది ఆమె తీరు చూసి ముఖం దించుకుంది.

“లక్ష్మీ నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. నీ ప్రవర్తనకి ఉమ ఎంత బాధ పడుతోందో చూడు,” రామశాస్త్రి నెమ్మదిగా భార్యను మందలిస్తూ అన్నాడు.

“నేను ఆర్థికంగా పేదరాల్ని అయితే అవచ్చు కాని నీతికి, నిజాయితీకీ విలువిచ్చే దాన్ని. నీతి లేని చరిత్రహీనుల్ని వెనకేసుకొస్తారేంటి?” తీవ్ర స్వరంతో అంది రామలక్ష్మి. భార్యకి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయడం తనదే తప్పు, మూర్ఖురాలు, అహంభావి, అని అనుకున్న రామశాస్త్రి ఊరుకుండి పోయాడు.

అయితే రామలక్ష్మి పరుష వాక్యాలు ఉమాదేవిని గాయపరిచాయి. బాధపడింది. కలత చెందింది. ఆమె హృదయం బాధగా మూలిగింది. ఆ బాధను పైకి కనబడనీయకుండా గుండెల్లోనే దాచుకుంది. మౌనంగా ఉండిపోయింది.

మనం మౌనంగా ఉన్నా మన మనస్సు మౌనంగా ఉండదు. ఉండలేదు కూడా. మది నిండా రకరకాల ఆలోచన్లు పరచుకుంటాయి. గతాన్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో భూతకాలం తిరిగి వర్తమానంలో తనని బాధిస్తోందా? మానుతున్న గాయాన్ని తిరిగి కెలుకుతున్నట్లు అనిపిస్తోంది తనకి. మరిచిపోయిన గతం వాటి తాలూకా ఆలోచన్లు పురివిప్పి నృత్యం చేస్తున్నాయి మయూరంలా.

భావోద్వేగం – భావోద్రేకం ఆమెలో చోటు చేసుకుంటున్నాయి. ‘హే భగవాన్! తన జీవితం లాగే తన కూతురు జీవితం కూడా అవుతుందా? అలా అవకూడదు. అయితే సిద్ధార్థ చాలా మంచి వాడిలా అగుపిస్తున్నాడు. తల్లిలాగ అహంభావి మాత్రం కాదు. తండ్రి రామశాస్త్రిలా సాత్వికుడు అనిపిస్తోంది’ – తన మనస్సుకి నచ్చజెప్పుకుంటోంది ఉమాదేవి.

అక్కడ జరుగుతున్నవి వింటున్న దాన్ని బట్టి అక్కడున్న శ్రోతల మనస్సులో రకరకాల ఆలోచన్లు. అక్కడున్న అందరి మనస్సుల్లో మెదల్తున్న ఆలోచన ఒక్కటే ఉమాదేవికి, సిద్ధార్థ తల్లిదండ్రుల తెలుసా? ఒకవేళ తెలుస్తే ఎలా తెలుసు? అనేదే అయితే ఆ సమయంలో వాళ్ళ ఆలోచనకి సమాధానం దొరకలేదు.

ఇంతలో మేకప్ రూమ్ నుండి బిందుకి కబురు రావడంతో అటు వేపు భారంగా అడుగులేస్తోంది బిందు.

పోగ్రామ్ ఆరంభమయింది. ఎవరెవరో వచ్చి ఉపన్యాసాలు ఇస్తున్నారు. వినే మూడ్‌లో లేదు ఉమాదేవి. “ముద్దుగారే యశోదా!” అంటూ క్లాసికల్ డాన్సు చేస్తోంది బిందు. తల్లి ఆమెకి డాన్సు కూడా నేర్పించింది. కూతురు డాన్సు చూసి ఆనందించే స్థితిలో లేదు ఉమాదేవి. కుర్చీలో చేరబడి గంభీరంగా ఆలోచిస్తోంది.

మరిచిపోవడానికి ప్రయత్నించుతున్న తనకి గత సంఘటనలు వెంటాడుతున్నాయి. ఆమె నేత్రేంద్రియాలు, కర్ణేంద్రియాలు పని చేస్తున్నాయి. అయితే ఆమె చేతనావస్థ నుండి అచేతనావస్థకి చేరుకుంది. ఆమెను ఆ అవస్థ నుండి బయటకు తేవాలంటే ఏదో ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ఇందిర చేసింది.

“ప్రోగ్రామ్ అయిపోయింది,” ఆమె చెవి దగ్గర నోరు పెట్టి గట్టిగా అరిచినట్టు అంది ఇందిర. ఉలిక్కిపడి అచేతనావస్థ నుండి బయట పడింది ఉమాదేవి. “ఏంటి పోగ్రామ్ అయిపోయిందా?” అయోమయంగా పరిసరాలను చూస్తూ అంది ఉమాదేవి. అందరూ తన వంకే చూడ్డం గమనించిన ఆమె కొద్దిగా సిగ్గుపడింది.

“ఇంటికి వెళ్లాం రండి, అందరూ! ఈ రోజు మీ అందరూ మా అతిథులు” అన్నాడు సూర్యం నవ్వుతూ.

“ప్లీజ్! మరోలా అనుకోకండి. నా మూడేం బాగులేదు. నేను ఎక్కడికీ రాలేను. వెంటనే నేను మా ఇంటికి వెళ్ళాలి” అంది ఉమాదేవి.

ఇంతలోనే ఈమె మూడ్ ఇలా మారిపోయిందేంటి? సిద్ధార్థ తల్లిదండ్రుల్ని చూడగానే ఈమె మూడ్ మారిపోయింది. అంతవరకూ కూల్‌గా సంతోషంగా మాట్లాడిన ఈమెలో ఇంతలోనే ఇంత మార్పా?” అనుకుంటూ విస్తుపోతున్నారు సూర్యం, పద్మ.

“ఆంటీ ప్లీజ్! మా ఇంటికి రండి” అంది శకూ.

“మరో పర్యాయం వస్తామమ్మా. ఇప్పుడు మాత్రం రాలేను” సున్నితంగా తిరస్కరించింది శకూ కోరికను ఉమాదేవి.

“అక్కా! ఇంత వరకూ ఆనందంగా ఉన్న అక్కయ్య గారిలో ఈ మార్పేంటి? నీవేనా చెప్పు అక్కా!” అన్నాడు రవి ఇందిరతో.

ఇందిర ఏదో చెప్పబోతుండగా వారించింది ఉమాదేవి. ఆమె మనస్థితిని అర్థం చేసుకున్న అక్కడి వారు ఏం మాట్లాడ లేకపోయారు. బస్టాండు వేపు అడుగులేసారు ఉమాదేవి, ఇందిర, రవి, బిందు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here