సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-25

0
2

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ఉమాదేవి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా శంకరంతో ఆమె పెళ్ళి జరిగిపోతుంది. సుకుమార్ ప్రేమ విషయం తెలిసి పెళ్ళిలో గొడవవుతుంది. మధ్యవర్తులు రాజీ చేస్తే, ఉమాదేవిని కాపురానికి తీసుకువెళ్తారు. భర్త శారీరికంగా, మానసికంగా హింసిస్తే; అత్తగారు, చిన్న ఆడపడుచు సూటిపోటి మాటలతో వేధిస్తారు. ఉమాదేవితో ఇంటి పనంతా చేయించి, కడుపు నిండా అన్నం కూడా పెట్టరు. చిన్న ఆడపడుచు భర్త రామశాస్త్రి, పెద్దాడపడుచు మాత్రం ఉమాదేవి మీద జాలి చూపించేవారు. ఊరట కలిగించేలా మాట్లాడేవారు. కొంతకాలానికి ఉమ గర్భవతి అవుతుంది. అయినా ఆమెకు పని తప్పదు. ఒకరోజు రక్తం మరకలున్న రుమాలుని దాని గురించి అడుగుతాడు శంకరం. మౌనంగా ఉండిపోతుంది ఉమ. ఒక బెత్తం తీసుకుని గొడ్డుని బాదినట్టు బాదుతాడు శంకరం. కొంత సేపయ్యాకా, ఉమ తిరబడుతుంది. భర్త ఇంట్లోంచి బయటకు తోసేస్తాడు. పుట్టింటికి వెళ్తుంది ఉమాదేవి. వదినలు విసుక్కుంటారు. అక్కడా చుక్కెదురవుతుంది. చివరికి సిగ్గు విడిచి తన శరీరంపై గాయాలని వదినలకి చూపుతుంది ఉమ. ఒక్క క్షణం పాటు చలించినా, సర్దుకుపోమని చెప్పి హితబోధ చేస్తారు. అన్నలు కూడా మౌనం వహించడంతో, అక్కడ ఉండడానికి మనస్కరించక బయటకి వచ్చేస్తుంది ఉమ. కనీసం అన్నం తిని వెళ్ళు అని కూడా అనరు వదినలు. ఇక చదవండి.]

అధ్యాయం-49

[dropcap]ఒ[/dropcap]క విధంగా ఉమాదేవి అత్తవారింటి నుండే కాదు, పుట్టినింటి నుండి కూడా తరిమి వేయబడింది. ‘ఇప్పుడు నన్ను ఆదుకునే ఆప్తులెవరు? ఈ పరిస్థితిలో నాకు చావే శరణ్యం. జీవితంలో నేను చిత్తుగా ఓడిపోయాను. ఇక జీవించే ఓపిక – జీవించాలన్న ఆశ లేవు. ఎలాంటి జీవితం ఎలా తయారయింది,’ ఇలా ఆలోచిస్తూ ముందుకు అడుగులేస్తోంది ఉమాదేవి.

చచ్చిపోవాలి – చచ్చిపోవాలి. చావే తన జీవితానికి పరిష్కారం అని ఆలోచిస్తున్న ఆమెలో వెను వెంటనే మరో రకమైన భావాలు. నేనయితే చచ్చిపోవాలనుకుంటున్నాను కాని, నా కడుపులో మరో ప్రాణి పెరుగుతోంది. ఆ ప్రాణిని అంతం చేసే అధికారం తనకెవరు ఇచ్చారు? ఆ అధికారం తనకి లేదు. ఇలా ఆత్మ సంఘర్షణలో సతమతమవుతూ అడుగులేస్తోంది ఉమ. నీరసంతో శరీరం జోగుతోంది. కళ్ళు బైర్లు క్రమ్ముతున్నాయి. గుడిని సమీపించింది. ఆ మందిర ప్రాంగణాన్ని చూస్తూ ఉంటే ఆమెకి అలౌకికమైన ఆనందం వెనువెంటనే గుండెల్ని పిండి చేసేటంత ఆవేదన కలుగుతున్నాయి.

సుకుమార్, తను ఈ గుడి ప్రాంగణంలోనే మాట్లాడుకున్నారు. తన మీద అతనికున్న ప్రేమను అతను ఇక్కడే వెల్లడి చేశాడు. అతని మీద తనకి ఇక్కడే ప్రేమ భావం కలిగింది. ఆ మధురమైన క్షణాలు తనకి ఆనందం కలిగిస్తూ ఉంటే ఆ పవిత్రమైన దేవాలయం ప్రాంగణంలోనే అతని రక్తం చిందింది. అతని బ్రతుకు బుగ్గిపాలయిన సంఘటన ఆమెకి విషాదాన్ని కలిగిస్తోంది.

తామిద్దరూ తమ తమ ప్రేమ విషయాన్ని చర్చించుకున్న స్థలం దగ్గరున్న ఉసిరి చెట్టు నీడన పెట్టి వుంచి ఉమా అలా కూర్చుండిపోయింది. నీరసంతో కళ్ళు మూసుకుని ఉన్నాయి. ఒకవేపు ఆకలి దహించి వేస్తూ ఉంటే మరో వంక నాలుక పిడచకట్టుకు పోతోంది. గొంతుక దాహంతో ఎండిపోతోంది.

క్రమేపి కాలం కరిగిపోతోంది. సంధ్య చీకట్లు నలుమూలల నుండి తరుముకొస్తున్నాయి. గూళ్ళు వదిలి ఉదయం బయటకు వెళ్ళిన పక్షులు తిరిగి గూళ్ళకి చేరుకుంటున్నాయి. వాటి అరుపులు కర్ణపటాల్ని చిల్లులు పరుస్తున్నాయి. సంధ్య దీపం పెట్టడానికి పూజారి గారు గుడికి వచ్చారు. ఉసిరి చెట్టు క్రింద పెట్టి పెట్టుకుని నీరసంగా చెట్టుకి చేరబడి కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్న ఉమాదేవిని చూసి మొదట ఎవరో అనుకుని ఆశ్చర్యంగా చూశారు. తేరిబార చూసిన తరువాత అమెను పోల్చుకుని ముఖం చిట్లించారు.

ఆమె వైవాహిక జీవితం సంతృప్తిగా లేదు. పెళ్ళిలోనే గొడవలు జరిగిన విషయం తెలిసి మొదట ఆయన మనస్సుకి తృప్తి కలిగింది. తన శాపం ఊరికే పోతుందా? ఉసురు తగలకుండా ఉంటుందా? తనకి మనస్తాపం కలిగించిన వాళ్ళకి ఈ శిక్ష తగినదే అని తన మనస్సుకి ఆయన సమాధాన పరుచుకున్నారు.

“ఇలాగేనా మమ్మల్ని బ్రతకనీయవా తల్లీ! మానిపోతున్న గాయాన్ని కెలికినట్లు అవుతుంది నిన్ను చూడగానే” పూజారి గారి కంఠంలో కఠినత్వం తొంగి చూసింది. నీరసంగా కళ్ళు తెరిచిన ఉమాదేవి పూజారి గారి వేపు దీనంగా చూసింది. ఆమె దీనత్వపు చూపులు పూజారి గారి కఠినత్వపు పొరల్ని ఛేదించాయి. ఆయన మనస్సు ఆమె దీన అవస్థను చూసి కలుక్కుమంది.

“ఆకలి.. దాహం!” నెమ్మదిగా గొణుక్కుంటోంది ఉమాదేవి.

ఏవో బాధలు అనుభవిస్తోంది అత్తవారింటిలో అని అనుకున్నారు ఆయన. కాని ఇలా ఆమెను వీధిన పడేసే దుస్థితికి పుట్టినింటి వాళ్ళు మెట్టినింటి వాళ్ళు తీసుకు వస్తారని ఆయన అనుకోలేదు. వెంటనే ఆయన అరటి పళ్ళు – చెంబుడు నీళ్ళు తీసుకుని వచ్చి ఇచ్చారు.

అరటి పండు వొలుచుకుని తినాలన్న ఆలోచన కరువైన ఆమె తొక్కలు తియ్యకుండానే తింది. ఆమెను ఆ స్థితిలో చూడగానే పూజారి గారి కళ్ళల్లో కన్నీటి తెర తళుక్కుమంది. అరటి పళ్ళు ఆరగించి చెంబుడు నీళ్ళు త్రాగింది ఉమాదేవి. కొద్ది సేపటికి ఆమెకి సేద తీరింది. మాట్లాడ్డానికి కొద్దిగా శక్తి వచ్చింది. నీరసం మాత్రం కొద్దిగా ఉంది. ఆకలి కొద్దిగా తగ్గింది.

“పూజారి గారూ! నా జీవితం చివరకు ఎలా తయారయిందో చూశారా! ఆనాడు మీరు నన్ను శపించినట్టే అయింది. మీకు మనస్తాపం కలిగించినందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నాను. మీకు పుత్ర వియోగం కలిగించిన పాపిష్టిదాన్ని. నాకు ఈ శిక్ష తగినదే. నేను చేసిన ఆ పాపమే నన్ను ఈ పరిస్థితికి తీసుకు వచ్చింది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా పుట్టింటి వారు తగిలేసారు.

ఇక నన్ను కట్టుకున్న వాడు నానా చిత్ర హింసలకు గురి చేసి బయటకు గెంటాడు. చచ్చిపోదామనుకున్నాను కాని ఆ పని చేయలేకపోయాను. నా కడుపులో ఊపిరి పోసుకుంటున్న ప్రాణిని చంపే అధికారం నాకు లేదు అని తిరిగి ఆలోచించి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. మీరు నా తండ్రిలాంటివారు. అందుకే మనస్సులో మాట చెప్పుకోడానికి ఎవ్వరూ లేరని కుమిలి పోతున్న నేను ఆప్తులుగా మిమ్మల్ని భావించి నా బాధ మీ ముందు ఉంచుతున్నాను” వస్తున్న కన్నీరు పైట చెంగుతో తుడుచుకుంటూ అత్తవారింటిలో తన జీవితం ఎలా సాగిందో పూజారి గారికి వివరించింది ఉమాదేవి.

ఆమె పడ్డ కష్టాలు విని చలించారు పూజారి గారు. “ఇంత దారణంగా ఉందా నీ జీవితం? ఇలా ఉందని అనుకోలేదమ్మా! ఎన్ని కష్టాలు అనుభవించావో? లోపలికి పదమ్మా! భోజనం చేద్దువుగానివి. తిండి తిని ఎన్నాళ్ళయిందో?” ఆయన కంఠంలో జాలి సానుభూతి – వాత్సల్యం ఒక్కసారి కలిగాయి. మరి మాట్లాడకుండా అతని వెనకాలే నడిచింది ఉమాదేవి.

ఆబగా – ఆత్రుతగా, ఆవురావురుమంటూ భోజనం చేస్తున్న ఆమె వంక చూస్తూ గాఢంగా నిట్టూర్పు విడిచారు పూజారిగారు.

“పెళ్ళికాక ముందు ఇంత తృప్తిగా – కడుపు నిండా భోజనం చేసాను. తిరిగి ఇన్నాళ్ళ తరువాత ఈ రోజు తృప్తిగా భోజనం చేసాను పూజారి గారూ!” అంది ఉమాదేవి. ఆమె మాటలు, ఆయన హృదయాన్ని కలిచి వేసాయి. ఎలాంటి జీవితం ఎలా మారింది అనుకుంటూ గాఢంగా నిట్టూర్పు విడిచారు.

“సరస్వతి ఎలా ఉంది పూజారి గారూ?”

“బాగానే ఉందమ్మా! దానికి దొరికిన భర్త కూడా చాలా మంచివాడు. ఇద్దరూ స్కూలు స్థాపించి దాన్ని నడుపుతున్నారు. కొడుకు జీవితం నాశనం అయిపోయిందని కుమిలి పోతున్న నాకు సరస్వతి జీవితం సంతృప్తినిస్తోంది.”

“పోనీలెండి,” వాళ్ళని భగవంతుడు చల్లగా చూడాలి.”

“మొదట నీ సంగతి చెప్పు. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు?”

“తెగిపోయిన గాలి పటాన్ని నేను. నన్ను కడుపులో పెట్టుకుని ఆదరించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళాలో, ఎవ్వరి దగ్గరకు వెళ్ళాలో నిర్ణయించుకోలేని అయోమయ పరిస్థితిలో ఉన్నాను, పూజారి గారూ! నా జీవితం ఇలా ఉంది,” కళ్ళు తుడుచుకుంటూ అంది ఉమాదేవి.

పూజారి గారికి ఆమె మీద జాలి మరింత పెరిగింది. “వయస్సులో ఉన్న ఆడ కూతురివి. అందులోనూ ఉత్త మనిషివి కూడా కాదు. నా దగ్గరే, ఇక్కడే నిన్ను ఉంచుదామంటే నీ వాళ్లు నన్ను బ్రతకనీయరు. నా కొడుక్కి పట్టిన గతే నాకు పడుతుంది. అయితే నీ సమస్యకి ఓ పరిష్కారముంది,” అతను చెప్పుకుపోతున్నారు.

“ఏం పూజారి గారూ!” కుతూహలంగా అడిగిన ఉమాదేవి ఆయన ఏం చెప్తాడో అని ఎదురు చూస్తోంది.

“సరస్వతి, ఆమె భర్త ఈ పరిస్థితిలో నిన్ను ఆదుకోగలరు. ఆ మాత్రం నమ్మకం నాకు ఉంది. నీకు సమ్మతమయితే రేపు ఉదయాన్నే నిన్ను నేను అక్కడ దింపి వస్తాను,” అన్నారు.

ఆయన చెప్పింది ఉమకి సబువుగా తోచింది. ఈ పరిస్థితిలో తనని ఆదుకునేందుకు ఎవరూ కనిపించటం లేదు. ఆసరా కూడా కనిపించటం లేదు, అనుకున్న ఉమాదేవి “సరే!” మీ ఇష్టం అంది.

అధ్యాయం-50

సరస్వతిని చూడగానే ఉమాదేవిలో తిరిగి దుఃఖం పొంగి పొర్లుకొస్తోంది. సరస్వతి గుండెల్లో తల వుంచి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయి – విస్తుపోయి చూస్తున్నారు సరస్వతి, ఆమె భర్త.

తన అన్నయ్య జీవితం నాశనం అవడానికి ఉమయే కారణం అన్న కోపం సరస్వతికి లేదు. స్నేహితురాలి దీన పరిస్థితికి ఆమె చలించిపోయింది. పూజారి గారు ఉమ దీన పరిస్థితి వివరించి చెప్తుంటే సరస్వతి ఆమె భర్త చాలా బాధపడ్డారు. తన గుండెల మీద తల ఆన్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న స్నేహితురాలి వీపు మీద ఆప్యాయతగా నిమురుతూ గాఢంగా నిట్టూర్పు విడిచింది సరస్వతి. మామగారు చెప్పిన మాటలు విని సరస్వతి భర్త కూడా చలించాడు.

“నీ జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు,” సరస్వతి అంది.

“ఇదంతా నా నుదుటి రాత” చేత్తో తలబాదుకుంటూ వెక్కిళ్ళు మధ్య అంది ఉమ. స్నేహితురాలి దగ్గర కరువు తీరా ఏడ్చిన తరువాత ఆమె మనస్సు కొంత తేలిక పడింది. సరస్వతి ఉమని లేడీ డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళి చెకప్ చేయించింది. సరియైన పోషణ లేక కడుపులో పిండం పెరుగుదల సరిగా లేదని చెప్పింది డాక్టరు. పిండం పెరుగుదలకి మందులు రాసి ఇచ్చింది డాక్టరు. అంతేకాదు ఉమకి కూడా రక్తహీనత ఉందని చెప్పి ఉమకి కూడా మందులు వ్రాసి ఇచ్చింది.

మందులు క్రమం తప్పకుండా వాడిస్తూ పళ్ళూ – పాలు ఇస్తూ ఇన్ని సదుపాయాలు చేస్తే కాని ఉమాదేవి కోలుకోలేదు.

“చాలా ఇంప్రూవ్‌మెంటు వచ్చింది. ఇక ఈవిడకి, బిడ్డకి ఏం పరవాలేదు,” అని లేడీ డాక్టరు చెప్పిన తరువాత ఉమాదేవి, సరస్వతి ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు.

“సరస్వతీ! నేను వచ్చి మీ దంపతులకి అన్ని విధాలా చాలా శ్రమను కలిగించాను. ఇలా ఊరికే తింటూ కూర్చుంటే నాకు సిగ్గుగా ఉంది,” స్నేహితురాలి మాటలు సరస్వతి నచ్చలేదు. “ఇకపై నీ నోటి వెంబడి అటువంటి మాటలు రానీయకు” మెత్తగా మందలించింది సరస్వతి. “ఉమా! సృష్టిలో తియ్యనిది ఏంటో తెలుసా? అదే స్నేహం. స్నేహితురాలిగా నిన్ను ఆపద సమయంలో ఆదుకోపోతే ఈ స్నేహానికి విలువేంటి? అర్థం ఏంటి?” అంది తిరిగి సరస్వతి.

తనకి ఇటువంటి మంచి స్నేహితురాలుండడం, ఆ స్నేహితురాల్ని సపోర్టు చేస్తూ ఆమెకి వెన్ను దన్నుగా నిల్చిన మంచి భర్త ఉండడం ఎంత అదృష్టం? ముఖ్యంగా ఆపద సమయంలో వాళ్ళ సహాయ సహకారాలు తనకి అందడం తన అదృష్టం, ఉమాదేవి అనుకుంటోంది.

ఉమకి నెలలు నిండుతున్నాయి. నెలలు నిండుతున్న కొద్దీ ఆరాటం – ఆందోళన, ఆత్రుత అందరిలోనూ చోటు చేసుకుంటున్నాయి. సరస్వతి ఉమకి ధైర్యం చెప్తూనే ఉంది. అయితే ఉమ తన బాధల్ని మరిచిపోలేదు. మరిచిపోయినట్టు నటిస్తోంది అంతే. సుడిగుండంలో చిక్కుకున్న నావలాంటి తన జీవితాన్ని తను ఎలా మరిచిపోగలదు? తన గత జీవితాన్ని తల్చుకుంటూ ఉంటే మిగిలేది మనస్తాపం మాత్రమే. ఇలా అనుకునేది ఉమాదేవి.

గర్భంలో ఉన్న శిశువు భూమ్మీద పడ్డానికి కాలం సమీపిస్తోంది. డాక్టరు చెప్పినట్లే నార్మల్ డెలివరీ అయి ఆడపిల్ల పుట్టింది. పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే ఉమ నిర్లిప్తంగా నిర్వికారంగా ఉండిపోయింది. తన జీవితానికే ఓ గమ్యం లేదు. అటువంటి సమయంలో పుట్టిన ఈ ఆడపిల్లను తను ఎలా పెంచగలదు? తను పడ్తున్న అగచాట్లే చాలు. ఏం సుఖపడదామని ఈ సమాజంలో ఆడపిల్లగా పుట్టింది. ఎలా తను కూతుర్ని పెంచగలదు? ఇలా ఆలోచిస్తోంది ఉమ.

“ఉమా చూడవే! నీ కూతురు సూర్యకాంతిలో తెల్లగా మెరుస్తున్న మంచు బిందువులా ఎంత తెల్లగా ఉండి ముద్దోస్తోందే!” అంది సరస్వతి. ఉమ కూడా కూతురు వేపు చూసింది. నిజంగానే పాప చాలా బాగుంది. అంతా తన పోలికే. అయితే జీవితం గడపడంలో తన పోలిక రాకూడదు. బుద్ధులు తనవి వచ్చినా పరవాలేదు. తండ్రి తరుపువాళ్ళు కోడంటికం రాకూడదు, అని అనుకుంటోంది ఉమాదేవి మనస్సులో.

“ఉమా! నీ కూతురికి ఇప్పుడే నేను నామకరణం చేస్తున్నానే.”

“ఏం పేరు?” కుతూహలంగా అడిగింది ఉమాదేవి.

“హిమబిందు.”

“ఆ పేరు పాపకి బాగుంటుందే? నీది బెస్ట్ సెలక్షను పేరు పెట్టడంలో,” సరస్వతిని మెచ్చుకుంటూ అంది ఉమ.

కాలం ఎవరికోసం ఆగకుండా ముందుకు పరుగులు తీస్తోంది. ఆ కాలంతో పందెం కట్టి పరుగులు తీయబోయే వారు ఆ కాల వేగానికి తట్టుకోలేక బోర్లాపడి ఎదురుదెబ్బలు తింటున్నారు. కాలంతో పాటే మానవుల మనుగడలో మార్పులు రాసాగాయి. ఆ కాల మహిమ వలన కొందరు తమ తనువులు చాలించి జ్ఞాపకాల్ని మాత్రమే మిగిల్చి పోతుంటే మరికొందరు ఈ భూమి మీద క్రొత్తగా అడుగుపెడ్తున్నారు.

హిమబిందు తప్పటడుగులు వేస్తోంది. వచ్చీరాని ముద్దు ముద్దు మాటల్తో అందరికీ మురిపాలు అందిస్తోంది. ఉమాదేవి ఒక వేపు ప్రైవేట్లు చెప్తూ వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడయినట్లు సరస్వతికి చేదోడు వాదోడుగా ఉంటూ మరో ప్రక్క కష్టపడి చదువుతూ డిగ్రీ కంప్లీటు చేసింది.

పట్టుదల ఉండాలే కాని ఆ పట్టుదలే ఉంటే మానవుడు సాధించలేనిది ఏదీ లేదని రుజువు చేసి చూపించిది ఉమాదేవి. సరస్వతీ వాళ్ళూ నడుపుతున్న పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిగా చేరి మెల్లమెల్లగా ట్రైనింగు పూర్తి చేయడమేంటి? మెల్లగా గవర్నమెంటు స్కూల్లో మంచి జీతం మీద ఉద్యోగం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. వస్తే అవకాశాలు అలాగే కల్సివస్తాయి. అలా కల్సి రాకపోతే జీవితంలో అన్నీ కష్టాలే. సరస్వతీ ఆమె భర్త తనని ఆదుకోకబోతే తన జీవితం ఏం అయి ఉండేదో? రోజూ ఈ మాటల్ని ఒకసారయినా అనుకుంటుంది ఉమాదేవి.

ఒడ్డుకు చేరుకోగానే తెప్ప తగలేసే స్వభావం గల మనుష్యులున్న ఈ మానవ సమాజంలో తాము చేసిన ఉపకారం ఉమాదేవి మరిచిపోకుండా ఉండడం సరస్వతీ వాళ్ళకీ ఆనందాన్ని కలిగించింది.

వైకుంఠపాళీ ఆటలో లాగ పాములనే కష్టాల బారినపడినా, వాటిని అధిగమిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈనాడు కూతురి జీవితం తన జీవితంలా అవకూడదు అన్న దృఢ నిశ్చయంతో ఒక్కొక్క అడుగు తూచి తూచి వేస్తూ జీవన బాటలో బాటసారిలా నిరంతర ప్రయాణం చేస్తూ అలసట కలిగినప్పుడు కొద్దిగా ఆగి తిరిగి జీవన బాటలో ముందుకు సాగిపోతోంది ఉమాదేవి. అంతవరకూ తను జీవితం ఎలా గడుపు కొచ్చింది వ్రాసింది. ఆమె. వాటిని రవి చదివాడు. అతని మనస్సు నిండా బాధ.

తల్లి పడ్డ కష్టాలు తెలుసుకున్న బిందు కళ్ళల్లో కన్నీటి తెర తళుక్కుమంది. ఇందిర హృదయం బాధగా ముల్గింది. పెళ్ళవకుండా మ్రోడులా తన జీవితం మిగిలిపోయింది అని తను బాధపడింది. పెళ్ళయి కూడా ఎన్నో కష్టాలు భరించి ఉమాదేవి జీవితం అలాగే మిగిలిపోయింది. అని అనుకుని గాఢంగా నిట్టూర్పు విడిచింది.

“ఉమా జీవితంలో ఇంత విషాదం దాగి ఉందని నేను అనుకోలేదు. నీ స్థానంలో నేనే ఉంటే కథ మరోలా ఉండేది. నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు మహిళా సంఘాల సహకారమేనా తీసుకోవల్సింది. మహిళా సంఘాల సహకారంతో ఆ సమయంలో నేనుంటే నీ తరపున పోరాటం చేసి ఉండేదాన్ని!” సంఘమిత్ర అంది.

‘ఇప్పుడు ఎవరు ఎలా అనుకుంటున్నా జరగవల్సిన అనర్థం ఎలాగూ జరిగిపోయింది,’ అనుకుంది ఉమాదేవి.

‘తన తల్లి జీవితంలో ఇంత విషాదం దాగి ఉందా? ఇంత విషాదాన్ని తన గుండెల్లో దాచుకుని పైకి ఎంత నిబ్బరంగా ఉండగలిగింది. నిండు కుండలా తొణక్కుండా ఉండే ఆమెకి నమస్కరించాలి. ఆమె పడ్డ కష్టాలు తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తోంది. ఆ సుందరి తండ్రి శంకరం తనకి కూడా తండ్రా? అతను అంత కఠినాత్ముడా? అతను పైకి అలా అగుపడడే? ఎవరు చెప్పగలరు? కొంతమంది పైకి అలా ఉంటారు. తను తండ్రి గురించి తల్లిని అడిగితే అందుకే కసురుకునేది. బాధపడేది. తన తండ్రి ఇంత మానవత్వం లేని మనిషా?’ బిందూ ఆలోచిస్తోంది.

ఇటు సిద్ధార్థ ఆలోచన్లు మరోలా ఉన్నాయి. తన మామయ్య ఇంత కఠినాత్ముడా? కాత్యాయిని అత్త వచ్చి తన సహనంతో అతడ్ని ఓ దారికి తెచ్చింది. ఆవిడ కూడా అత్తవారింట్లో ఎన్నో బాధలను భరించింది. తన తల్లి కూడా ఉమత్త యడల కఠినంగా ప్రవర్తించింది. తన తల్లి ప్రవర్తన తనకే ఇప్పుడు అమానుషం అని అనిపిస్తోంది. పగవాళ్ళకేనా ఇటువంటి జీవితం వద్దు.

“సిద్ధార్థ! సుకుమార్, నన్ను ప్రేమించడం నిజం. అతని ఆలోచన తెలుసుకున్న తరువాత అతడ్ని నేను కూడా ప్రేమించిన మాట నిజం. అయితే అది మానసిక సంబంధం వరకే. ఎప్పుడూ మా శరీరాలు ఏకమవలేదు. తుచ్ఛమైన కోరికలకి లొంగిపోలేదు. అటువంటి మా పవిత్రమైన స్నేహన్ని, సాంగత్యానికి తుచ్ఛమైన సంబంధం అంటగట్టిది ఈ లోకం. కొంతమంది వికృత స్వభావం గల వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. మా పవిత్రమైన ప్రేమకి గుర్తుగా సుకుమార్ రక్తంతో తడసిన రుమాలు మాత్రం నా దగ్గర ఉంది. అలా దాన్ని నా దగ్గర అట్టి పెట్టుకోవడం లోకం దృష్టిలో నేరమయితే నేనేమీ జవాబియ్యలేను. సుకుమార్ జ్ఞాపకాలు నన్ను అంటిపెట్టుకున్నాయి. ఆ పవిత్రమైన ప్రేమకి గుర్తుగా నేను ఈ రుమాలు దాచాను,” అంటూ ఆ రక్తంతో తడిసిన రుమాలు ఉమాదేవి అందరికీ చూపించింది.

అందరి ఆలోచన్లు ఒకటే. దీనిలో అనైతికం ఏదీ లేదు. వాళ్ళిద్దరి ప్రేమ – వారి సంబంధం పవిత్రమయినవి. అటువంటి పవిత్రమైన ప్రేమకి వెలకట్టలేము.

“మా ఇందరి సంబంధం మానసికమైనది తప్ప నీచమైన శారీరిక సంబంధం మాత్రం కాదు. నా మాట నమ్ముతావు కదూ సిద్ధార్థా!” అలా అంటున్న సమయంలో ఉమాదేవి గొంతుక బొంగురు బోయింది. కంఠంలో దీనత్వం అగుపిస్తోంది. కళ్ళల్లో కన్నీటి తెర తళుక్కున మెరిసింది.

“నమ్ముతాను, మీ ఇద్దరిదీ పవిత్ర ప్రేమని. అయితే నేను ఒక్కడినీ నమ్మితే చాలదు. సమాజంలో ఈ నగ్న సత్యాన్ని నిర్భయంగా వెల్లడి చేయడానికి మీరు ఎందుకు ప్రయత్నించలేదు. మీ చుట్టూ గిరి గీసుకుని కూర్చున్నారే తప్ప నేను ఏ తప్పు చేయలేదు అని నిర్భయంగా వెల్లడి చేయకపోవడం మీ బలహీనత. అయింది ఏదో అయింది, ఈ అపోహలు తొలగిపోయి నిజాలు బయటపడే కాని కొంతమంది జీవితాలు బాగుపడవు. అపార్థాలకి అమాయకపు మనుష్యుల జీవితాలు విచ్ఛిన్నమవుతాయి. అందరూ రంగుటద్దాల మాటున మనుష్యుల్ని చూసి వారి గుణగణాలు అంచనా వేస్తున్నంత కాలం పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఆ రంగుటద్దాల్ని తీసి వేసి మనుష్యుల గుణగణాలు, వారి ప్రవర్తన నిశితంగా చూసిన నాడే యథార్థం అవగతమవుతుంది,” సిద్ధార్థ గంభీరంగా అన్నాడు.

ఆ తరువాత అతను రవి చదిన ఉమాదేవి వ్రాసిన కాగితాలు పట్టుకుని బయటకు నడిచాడు. అక్కడున్న వాళ్ళందరూ అతని వేపే చూస్తూ అలా నిలబడిపోయారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here