సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-26

0
2

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[పుట్టింటి నుంచి బయటకి వచ్చేసిన ఉమాదేవి గుడికి వెళ్ళి కూర్చుంటుంది. ఆమెని చూసిన పూజారి మొదట కసురుకున్నా, తరువాత జాలి పడి తమ ఇంటికి తీసుకువెళ్ళి అన్నం పెట్టిస్తారు. నీ పరిస్థితి ఏమిటి అని అడిగితే, జరిగినదంతా చెబుతుంది ఉమాదేవి. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అంటే ఏం చేయాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియడం లేదు అంటుంది. అప్పుడాయన తన కూతురు సరస్వతి ఇంట్లో దింపుతానంటారు. సరేనంటుంది ఉమ. మర్నాడు ఉమని ఆయన సరస్వతి వాళ్ళింట్లో దింపుతారు. స్నేహితురాలి దీన పరిస్థితికి సరస్వతి చలించిపోతుంది. పూజారి గారు ఉమ దీన పరిస్థితి వివరించి చెప్తుంటే సరస్వతి, ఆమె భర్త చాలా బాధపడతారు. సరస్వతి ఉమని డాక్టర్ వద్దకి తీసుకెళ్ళి మందులు ఇప్పిస్తుంది. ధైర్యం చెబుతుంది. ఉమ నెలలు నిండి ఆడపిల్లను ప్రసవిస్తుంది. పాపని చూడడానికి వచ్చిన సరస్వతి పాపకి హిమబిందు అని పేరు పెడుతుంది. పాప పెరుగుతూంటుంది. ఉమాదేవి ప్రైవేట్లు చెబుతూ, డిగ్రీ చదివి పాసవుతుంది. సరస్వతీ వాళ్ళూ నడుపుతున్న పాఠశాలలోనే టీచర్‍గా చేరుతుంది. కొన్ని రోజులకి గవర్నమెంటు స్కూల్లో మంచి జీతం మీద ఉద్యోగం వస్తుంది. వాళ్ళు చేసిన ఉపకారాన్ని మరిచిపోకుండా ఉండి, సరస్వతీ వాళ్ళకీ ఆనందాన్ని కలిగిస్తుంది ఉమాదేవి. జీవన బాటలో బాటసారిలా నిరంతర ప్రయాణం చేస్తూ కూతురిని పెంచి పెద్ద చేసి – ఈనాటి స్థితికి వచ్చింది ఉమాదేవి. కాగితాలు చదవడం పూర్తి చేసిన రవి మనస్సు నిండా బాధ ఆవరిస్తుంది. బిందు క్రుంగిపోతుంది. ఇందిర, సంఘమిత్ర కూడా బాధపడతారు. తన మావయ్య స్వభావం తెలిసిన సిద్ధార్థ విస్తుపోతాడు. తనదీ, సుకుమార్‍దీ కేవలం మానసిక సంబంధమే తప్ప శారీరికం కాదని నమ్ముతావు కదా, అని ఉమాదేవి సిద్ధార్థతో అంటుంది. నమ్ముతానని అంటాడు సిద్ధార్థ. అయితే అసలు సత్యాన్ని ప్రపంచానికి నిర్భయంగా వెల్లడి చేయలేకపోవడం మీ బలహీనత అని అంటాడు. రవి చదివిన ఉమాదేవి వ్రాసిన కాగితాలు పట్టుకుని బయటకు వెళ్ళిపోతాడు సిద్ధార్థ. ఇక చదవండి.]

అధ్యాయం-51

[dropcap]మ[/dropcap]నం ఎక్కడ ఉంటే అక్కడ సంపూర్ణంగా ప్రతిపలం ఉండాలి, ఫలించాలి. మనిషి ఒక చోట మనసు మరొక చోట అన్నట్టు ఉండకూడదు. మన ఆలోచన, ఆచరణ సందర్భానికి తగ్గట్టుగా ఉండాలి. ఎప్పుడూ గతాన్నే తలుచుకుంటూ కూర్చుంటే వర్తమానంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యపడదు.

మనకి సమస్యలు వచ్చినప్పుడే మానసిక స్థైర్యం అవసరం. మానసికంగా కృంగిపోతే సమస్యల చెంత మోకరిల్లినట్టే. మనం బలహీనపడితే సమస్యలకి దాసోహం అయినట్టే. వాపోతే మన అశక్తతను తెలియపరచడమే. వర్తమానంలో మభ్యపడకుండటం ముఖ్యం. నేడు జాగ్రత్తగా వ్యవహరించకపోతే రేపు ఉండదు.

భవిష్యత్తుని ఊహించుకుంటూ నిచ్చెన ఎక్కుతున్నప్పుడు ప్రతి అడుగు పైకి పడుతుండాలే తప్ప వెనుకకు చూసుకుంటూ ముందుకు వేస్తామంటే కుదరదు. భవిష్యత్తు విషయంలోనూ అంతే.

గత అనుభవంతో మరింత బాధ్యతగా భవిష్యత్తులోకి పయనిస్తూ ఉండాలి. వర్తమానాన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే భవిష్యత్తు లేనట్టే. మనం ఎదగాలంటే ఎప్పటికప్పుడు వర్తమానాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. జీవితంలో కర్మా చరణ మానవ ధర్మం. అది బాధ్యత కూడా. ప్రతీ వ్యక్తి జీవితంలో ప్రత్యేక వ్యక్తులుగా ఎదగాలి. అదే ప్రతీ ఒక్కరి ఆలోచన. అందుకే ఆచి తూచి అడుగువేయాలి. మానవ జన్మకు నిత్య కర్మ అవసరం. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అలా చేయకపోతే జీవితమే గడవదు. అది జీవితం అనిపించుకోదు కూడా.

అంతేకాదు భావ మనోవికారాల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే మన జీవితంలో భావోద్వేగాలు, భావోద్రేకాలు సహజం. మనలో వ్యతిరేక భావానికి తావివ్వకూడదు. అలా తావిస్తే జీవితంలో సంఘర్షణ తప్పదు. ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన తరువాత విభిన్న అభిప్రాయాలు దానికి కలపటం అంత సులభం కాదు. మనం సరియైన నిర్ణయానికి రాకపోవడం వల్ల శరీరం సైతం సహకరించదు. మన భావాలూ సహకరించవు.

ఇలా అనుకుంటున్న ఉమాదేవిలో రకరకాల ఆలోచన్లు. రకరకాల భావోద్వేగాలు, భావోద్రేకాలు. తను తన గత జీవితాన్ని అందరి ముందుంచింది. దీనివల్ల మంచి జరిగిందా? లేకపోతే హానా అని ఆలోచించే పరిస్థితిలో లేదు. తన మనస్సు తేలికపరుచుకోడానికి తన గత జీవితం చెప్పలేదు. ఆమె బాధంతా ఒక్కటే తనది మచ్చలేని జీవితం. అలా తను ఒక్కర్తీ అలా అనుకుంటే సరిపోదు. తన చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మాలి. తన వాళ్ళు అనే వాళ్ళు నమ్మాలి. వాళ్ళకి నమ్మకం కలిగించాలి. అందుకే సిద్ధార్థకి తను తన గత జీవితం గురించి చెప్పింది.

తన గత జీవితాన్ని కాగితాల్లో వ్రాసి అందరి ముందూ ఉంచిన తరువాత ఉమాదేవి ఏం సంతోషంగా లేదు. తన గత జీవితం తెలిసిన తరువాత కూతురు మనోభావాల్లో మార్పు వస్తుంది. అసలే సున్నిత మనస్కురాలు. డిప్రెషనుకి కూడా లోనయ్యే అవకాశం ఉంది కూడా. ఈ సంఘర్షణల మధ్య కూతురు చదువు ఎలా సాగుతుంది? తన కూతురు సుఖంగా, సంతోషంగా ఉండగలదా? ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న ఉమాదేవికి ఆ రోజు స్కూలుకి వెళ్ళాలనిపించలేదు. ఇందిరకి సి.యల్ వ్రాసి ఇచ్చింది.

తల్లి ఆలోచన్లు ఇవతల ఇలా ఉంటే అవతల కూతురు ఆలోచన్లు మరోలా సాగిపోతున్నాయి. తన తల్లి జీవితంలో ఇంత విషాదం, అగాధం దాగి ఉందా? తన జన్మకి కారకుడయిన వ్యక్తి తన తల్లిని ఇంటి నుండి గెంటేసిన తరువాత మరో ఆడదానితో తన జీవితం పంచుకున్నాడు. పెళ్ళి చేసుకుని పిల్లల్ని కన్నాడు. సుఖమైన సంసారిక జీవితం గడుపుతున్నాడు.

మరి తన తల్లో? మ్రోడుబారిన జీవితం గడుపుతోంది. ఈ సమాజంలో ఒక్క ఆడదానికేనా శిక్ష. చేసిన తప్పులో ఆడదానితో పాటూ మగవాడికి కూడా బాధ్యత లేదా? ఆడది తప్పు చేయకపోయినా దాన్ని తప్పు అని వేలెత్తి చూపిస్తున్న మగవాడు తను చేసిన తప్పును కప్పి పుచ్చుకుంటున్నాడు.

ఇలా ఆలోచిస్తున్న బిందుకి ఆ రోజు కాలేజీకి వెళ్ళాలనిపించలేదు. అందుకే సెలవు పెట్టి ఇంట్లో కూర్చుంది. పెరట్లో పూల మొక్కలు మధ్య చెట్ల నీడలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తోంది.

శకుంతల కాలేజీకి వచ్చింది కాని, బిందు కాలేజీకి ఆ రోజు రాలేదు. శకుంతలకి ఏం తోచలేదు. అంతా శూన్యమనిపించింది. ‘తన తల్లి గత జీవితం తెలుసుకున్న తరువాత బిందు మనోభావాలు ఎలా ఉన్నాయో? సానుకూలంగా ఉంటే పరవాలేదు. ప్రతికూలంగా ఉంటేనే సమస్య. అసలే సున్నిత మనస్కురాలు, చప్పున డిప్రెషనుకి లోను కాకుండా చూడాలి,’ ఇలా అనుకున్న శకుంతల కాలేజీకి సెలవు పెట్టి బస్సులో బిందు దగ్గరికి బయలుదేరింది. బస్సు ముందుకు పోతుంది. శకుంతలలో ఆలోచన్లు కూడా ఆ బస్సుతో పోటీ పడ్తున్నాయి.

***

ఆ రోజు సిద్ధార్థ వచ్చాడు. అతని చేతిలో పేపర్లు ఉన్నాయి. అతని ముఖం ఆవేశంతో నిండిపోయింది. ఆవేదనతో పోటీ పడుతోంది ఆవేశం.

అతను వచ్చేప్పటికి రామశాస్త్రి సూర్యానికి, పద్మకి, తనకి – ఉమాదేవి అదే బిందు తల్లి అత్తవారింటిలో ఎన్ని బాధలుపడింది, ఎన్ని ఆరళ్ళకి గురయింది, ఉమ మంచితనం, ఆమె నిర్దోషత్వం అన్నీ తెలియచేసాడు. “నేను ఆ ఇంట్లో ఉన్నాను కనుక నాకన్నీ తెలుసు. నా భార్య అదే రామలక్ష్మి కూడా ఆమెను వదిలిపెట్టలేదు, సాధించుకుని తింది. ఇప్పుడయితే ఇలా ఉంది కాని అప్పుడు పులే. అన్నయ్యతో వదిన మీద చాడీలు చెప్పి కొట్టించేది. నానా చాకిరీ చేయించేది,” రామశాస్త్రి బాధగా అన్నాడు.

శకుంతల రామలక్ష్మి వేపు చూసింది. ఆవిడ ముఖంలో పశ్చత్తాపంతో బాటు బాధా భావం అగుపించింది. సిద్ధార్థ పేపర్లు తల్లి మీద విసరికొత్తూ “అమ్మా! నీవు ఇంత స్వార్థపరురాలివీ, కఠినాత్మురాలివి అని అనుకోలేదు” అన్న మాటలు మరింత ఆమెను మనస్తాపానికి గురి చేశాయి.

రామలక్ష్మి ముందు పడేసిన కాగితాలు వరుస క్రమంలో పెట్టి అక్కడ రవి ఏ విధంగా ఉమాదేవి గత జీవితాన్ని అందరికీ చదివి వినిపించాడో అదే పని శకుంతల ఇక్కడ చేసింది. విన్న వాళ్ళ అందరి మనస్సులోనూ బాధ, సానుభూతి, అయితే జరిగిపోయిన దానికి ఎవరూ ఏం చేయలేరు.

సిద్ధార్థ్ పెరట్లోకి వెళ్ళి మల్లె పందిరి క్రింద గంభీరంగా ఆలోచిస్తూ విచారంగా కూర్చుని ఉన్నాడు. అతని మనస్సు అస్తవ్యస్తంగా ఉంది. ఉమాదేవి యడల తన తల్లి ప్రవర్తన అతనికి కంపరం కలిగిస్తోంది. అయితే తల్లినేం అనలేదు.

“బావా!” శకూ పిల్చింది. తల పైకెత్తి చూశాడు. అతని చూపుల్లో అనేక భావాలు. ఆ భావాల్ని అర్థం చేసుకుంది శకుంతల. “బావా! నీ భావాలు నాకు తెలుసు. అయితే ఒక్క విషయం. అత్తయ్య కూడా ఈ ఆధునిక సమాజంలో ఒక సభ్యురాలే. మనష్యులందరూ ఆదర్శవంతులు,  నీతిమంతులు, అయితే సమాజం ఏనాడో ఉన్నత స్థాయిలో ఉండేది. మనుష్యుల్లో కూడా కొంతమంది సంకుచిత స్వభావాలు వున్న వాళ్ళు ఉంటారు. అది వారి బలహీనత. వాళ్ళ బలహీనతల్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి. జాలిపడాలి. వారిని సక్రమమైన మార్గంలో తేవడానికి ప్రయత్నించాలి. వారి నెగిటివ్ ఆలోచనల్ని పాజిటివ్‌గా మార్చుకోవాలే కాని వారి మీద కోపగించుకోకూడదు,” అంది శకుంతల.

“నీ అంత సహనం, విశాల దృక్పథం నాకు లేదు శకూ! ఒక అమాయకురాలికి అన్యాయం జరిగిందనేదే నా బాధ,” సిద్ధార్థ అన్నాడు.

***

బస్సు గమ్యం చేరుకోగానే తన ఆలోచనకి స్వస్తి చెప్పి క్రిందకి దిగి ఆటోలో ఉమాదేవి ఇంటి వేపు బయలుదేరింది శకుంతల. ఇంటికి వెళ్ళిన తరువాత అక్కడ దృశ్యం ఆమెను కలిచివేసింది. ఉమాదేవి తన గదిలో మూడీగా కూర్చుని ఉంటే, బిందు పెరట్లో దీర్ఘాలోచనలో మునిగి తేలుతోంది. వంట చేసుకుని తిన్న గుర్తులు అగుపించలేదు. ఆకల్ని కూడా మరిచిపోయి ఆ తల్లీ కూతుళ్ళు ఆలోచన్లతో కడుపు నింపుకుంటున్నారు. “ఆంటీ!” శకూ పిల్చింది.

తృళ్ళిపడి బాహ్య స్థితికి వచ్చింది ఉమాదేవి, ఎదురుగా శకుంతల.

“ఈ రోజు బిందు కాలేజీకి రాలేదని తెలిసిన వెంటనే మరి ఉండలేక ఇలా వచ్చాను. అయినా ఆంటీ, మీ గత జీవితం ఓ పీడకల అని మరిచిపోవడానికి ప్రయత్నిచాలి కాని మీరే ఇలా దిగులుగా కూర్చుంటే బిందు పరిస్థితి ఏంటనేది ఆలోచించారా? నేను మీకు చెప్పేటంతటి దాన్ని కాను కాని చెప్తున్నాను,” శకుంతల అంది.

“నిజమే! చిన్నదానినైనా బాగా చెప్పావమ్మా! బిందూ గురించే నా దిగులంతా.”

“బిందూకి మనమంతా లేమా?” అంది శకూ.

బిందుని మామూలు స్థితిలోకి తేవడానికి చాలా ప్రయత్నించి సఫలీకృతురాలైంది శకూ. బిందు ముఖంపై తిరిగి చిరునవ్వు చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంది. అప్పుడు వంట చేసుకుని భోజనాలు చేశారు. వచ్చే సమయంలో శకుంతల ఉమాదేవితో ఇలా అంది, “ఆంటీ నాది ఓ సలహా. చిన్నదానినయినా నా మాట మన్నిస్తారు కదూ!”

“తప్పకుండా! చెప్పమ్మా!”

“మా చదువులు పూర్తయ్యే వరకూ మీరు ప్రశాంతంగా ఉండాలి. బిందూని కూడా ప్రశాంతంగా ఉంచాలి. ఏ సమస్యలూ దరి రానీకూడదు. ఇప్పుడు మా లక్ష్యం చదవడమే. మా పనిని మమ్మల్ని చేసుకోనిండి.”

“తప్పకుండా!” అంది ఉమాదేవి. తేలిక పడ్డ మనస్సుతో బయలు దేరింది శకుంతల.

అధ్యాయం-52

కాలం ధనస్సు నుండి వదలిపెట్టిన బాణంలా ముందుకు దూసుకుపోతోంది. ఆ కాలంతో పాటే మనుష్యుల మనుగడలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బిందు, శకుంతల చదువు మీద కాన్సన్‌ట్రేట్ చేస్తూన్నారు. ఇతర విషయాల్ని వాళ్ళు పట్టించుకోవటం లేదు.

సిద్ధార్థకి కేంపస్ ఇంటర్వ్యూలో సెలక్టు అయ్యాడు కదా. చదువు పూర్తవగానే మంచి కంపెనీలో మంచి జీవితంలో అతనికి ఉద్యోగం వచ్చింది. అతని తల్లిదండ్రులు కష్టాలు తీరాయి. సిద్ధార్థ కూడా తల్లి చేసిన తప్పుల్ని మరిచిపోయినట్టే. శకుంతల అతనికి నచ్చజెప్పడం వల్ల తల్లి మీద అతనికి  కోపం రాలేదు, ఆమె బలహీనతకి జాలిపడ్డాడు. కొంతమంది స్వభావాలింతే అని సరిపెట్టుకున్నాడు.

ఇక రవి విషయానికి వస్తే అతను ఓ ప్రైవేటు ఇంజనీరింగు కాలేజీలో పార్టు టైమ్ లెక్చరర్‌గా చేరాడు. ఇవతల కాలేజీలో విద్యా బోధన చేస్తూనే ఎం.బి.ఏ ప్రైవేటుగా చదువుతున్నాడు. మంచి ఉద్యోగం కోసం దరఖాస్తులు కూడా పంపుతున్నాడు.

“రవీ! ఇప్పుడు నీకీ ఉద్యోగం అవసరమా? మంచి ఉద్యోగం రావాలంటే నీ క్వాలిఫికేషన్సు పెంచుకోవచ్చు కదా! ఎం.బి.ఏ.లో జాయినవు,” అంది అక్క ఇందిర. అతనికి అక్క మాటలు రుచించలేదు. ఇప్పుడు తనకి ఉద్యోగం అవసరమా అని ప్రశ్నించుకుంటే తప్పకుండా అవసరమే. తను చిన్నప్పటి నుండి చూస్తున్నాడు, అక్క ఇందిర ఇంటిలోని సభ్యుల పోషణ కోసం కష్టపడ్తూనే ఉంది. తన సుఖాన్ని త్యాగం చేసి తన వాళ్ళ కోసం తన జీవితాన్నే పణంగా పెట్టింది.

క్రొవ్వొత్తి తన కాలి కరిగిపోతూ – ఆ బాధను భరిస్తూనే చుట్టు ప్రక్కల వారికి వెలుతురు ఇస్తుంది. తన అక్క కూడా అంతే. తను బాధపడినా, ఆ బాధను మనస్సులోనే దాచుకుని తన వాళ్ళకి ఆర్థికంగా సహాయ పడుతోంది. మరోసారి రవి తన అక్క త్యాగాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.

“నీవు కూడా ఎంతకని కష్టపడుతావు అక్కా! ఇంత వరకూ కష్టపడింది చాలు. అయినా నాకు కూడా కష్టపడ్డంలోని విలువ తెలియాలి కదా! అందుకే నన్ను కష్టపడనీ. ఇలాగేనా నీకు భారంగా ఉండకుండా ఉండాలని.”

“నాకు నీవు భారమా?” బాధగా అంది ఇందిర.

“అలాగని కాదు. ఎన్నాళ్ళు నీ మీద డిపెండ్ అయి ఉంటాను కనుక. స్వశక్తి మీద ఇక మీదటేనా ఎదగాలని నాకూ అనిపిస్తోంది ఇప్పుడు,” రవి అన్నాడు.

“నీ ఆలోచనా మంచిదే.”

“అందుకే నా పనికి సపోర్టుగా నిలబడు.”

“నా సపోర్టు నీకు ఎప్పుడూ తప్పకుండా ఉంటుంది.”

అందరి పరిస్థితీ ఏదో కొంత మెరుగ్గా ఉన్నా ఉమాదేవి పరిస్థితి మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. ఆమె మనస్సు నిలకడగా లేదు. భూతకాలం వర్తమాన కాలం కంటే భవిష్యత్తే ఆమెకి బాధని కలిగిస్తోంది. ఆందోళన కలిగిస్తోంది. ఆమెకి ఒక్కటే టెన్సను. అభద్రతా భావం ఆమెను వెంటాడుతూనే ఉంది.

మొన్నటి వరకూ జీవితంలో ఏ సమస్య లేకుండా జీవితం సాఫీగా సాగిపోయింది. ఆమె ఎవ్వరినీ పట్టించుకునేది కాదు. కూతురే ఆమెకి సర్వస్వం. కూతురే లోకం. అలాంటి ఆమె జీవితంలో ఈ మధ్యనే అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పులే ఆమెకి ఆందోళనకి గురి చేస్తున్నాయి. తన గతం గురించి ఇంత తొందరగా చెప్పే పరిస్థితి ఇంత త్వరగా వస్తుందని ఆమె ఊహించలేదు.

తన గతం గురించి చెప్పకపోతే ఒక సమస్య. చెప్తే మరొక సమస్య. ఎదురయ్యాయి. అంతకు పూర్వం తన గురించి పట్టించుకోని వారు కూడా ఇప్పుడు తన ఉనికి కోసం ఆరా తీస్తారు. మరుగున పడిన బాంధవ్యాలను బంధంగా మార్చడానికి ప్రయత్నిస్తారు. ఆ బంధాలు ఏనాడో తెగిపోయాయి. ఎవ్వరితోనూ తనకి ఇప్పుడు బంధాలు లేవు, అనుబంధాలు లేవు. బాంధవ్యాలు అంతకన్నా లేవు.

తనూ తన కూతురూ ఈ పరిసరాల నుండి దూరంగా, ఈ మనుష్యులకి దూరంగా పారిపోవాలనిపిస్తోంది ఒక్కొక్క పర్యాయం.

ఈ ఆలోచన్లతో తను స్కూలు వర్కు సరిగా చేయలేకపోతోంది. పరధ్యానం ఎక్కువయి పోయింది. ఆలోచన్లు ఎక్కువయి పోయాయి. పిల్లల పరీక్ష పేపర్లు దిద్దినప్పుడు తప్పు చేస్తోంది. ‘మేడమ్! నా మార్కులు తప్పుగా కౌంట్ చేశారు’ అంటూ విద్యార్థుల తరుచుగా ఫిర్యాదు చేస్తున్నారు. లెసన్ చెప్తున్నప్పుడు కూడా ఏకాగ్రత కనబర్చలేకపోతోంది తను.

“హెచ్.ఎమ్ గారు పిలుస్తున్నారు అమ్మ గారూ!” బంట్రోత్తు అప్పన్న అన్నాడు. ఉమాదేవి హెడ్ మిస్ట్రస్ రూమ్లోకి వెళ్ళింది.

“నమస్తే! మేడమ్!” అంది ఉమాదేవి.

“ఓ ఉమాదేవి గారా! రండి, కూర్చోండి” అంది ఆవిడ. “ఈ మధ్య మీరు వర్కు మీద కాన్సన్‌ట్రేట్ బాగా చేయలేకపోతున్నారు. ఎనీ ప్రోబ్లమ్! వాట్ హేపండ్?” అంది హెడ్ మిస్ట్రస్ జ్యోతి.

“నథింగ్ మేడమ్!” ఉమాదేవి అంది.

“నో! మీకు ఏదో ప్రోబ్లమ్ ఉంది ఉమాదేవి” ఆవిడ అంది. “యువర్ హెల్త్ ఈజ్ వెల్?”

“వెల్ మేడమ్!”

హెడ్ మిస్ట్రెస్ జ్యోతి కొద్ది సేపు మౌనంగా ఉమాదేవి వేపు చూసింది. ఆమె గంభీరంగా ఉంది. ఆమె చూపుల్ని తట్టుకోలేక ఉమాదేవి నేల వేపు చూస్తోంది.

“ఉమాదేవి! మీ గురించి నాకు అన్నీ తెలుసు. మీరు నా దగ్గర ఏదీ దాచవల్సిన అవసరం లేదు. ఇందిర గారు నాకు అన్నీ చెప్పారు,” అంది జ్యోతి.

ఉమాదేవి ఇంకేం మాట్లాడగలదు? మౌనంగా ఊరుకోవడం తప్పించి ఏం చేయలేకపోయింది.

“ఉమాదేవి గారూ! నేను చెప్పేది సావకాశంగా వినండి. నేను చెప్పింది విన్న తరువాత మీలో మార్పు వస్తుందేమో అని అనుకుంటున్నాను. మనం ప్రస్తుతం ఆందోళన యుగంలో జీవిస్తున్నాం. మన చుట్టూ ఉన్న గజిబిజ సమస్యలు మనల్ని చికాకు పరుస్తాయి. ఇలాంటి సమయంలో హాయిగా రిలాక్స్‌డ్‍‌గా ఉండేవారు తక్కువ మంది ఉంటారు.

మరి కొంతమంది పైకి ప్రశాంతంగా ఉంటారు కాని ఒత్తిడి లేకుండా మాత్రం ఉండరు. అదీ నాలాగ. నాకూ అనేక సమస్యలూ – ఒత్తిడిలూ ఉన్నాయి. అందుకే అంటారు పీత కష్టాలు పీతవని. ఒత్తిడి, ఆత్రుత, ఆందోళన వలన అనేక రోగాలు, మానసిక వికారాలు, మనల్ని ఆశ్రయిస్తాయి. ముఖ్యంగా ఓర్పు అనేది మనకు ఉండాలి. అది లేనివాళ్ళు ఇతరుల మీద సానుభూతితో వ్యవహరించలేరు.

ప్రశాంతంగా మనశ్శాంతిలో రిలాక్స్‌డ్‍‌గా ఉండి జీవితాన్ని అనుభవించగలిగితేనే విజయాలు సాధించినట్లు అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విషయాన్నీ మరీ సీరియస్‌గా తీసుకుని ఒత్తిడితో నలిగిపోకూడదు. రిలాక్స్‌డ్‍‌గా ఉండడం నేర్చుకోవాలి.

ప్రస్తుతం మధ్య తరగతి మనుష్యుల జీవన పోరాటంలో విపరీతమైన ఒత్తిడికి గురైపోతున్నారు. జీవన సరళిలో కొద్దిగా మార్పులు చేసుకుంటే రిలాక్స్‌డ్ జీవితాలు గడప గలుగుతారు. అందుకే మనం ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలి. మనం మన శక్తి సామర్థ్యాలను బేరీజు వేసుకుని లక్ష్యాలు నెరవేర్చుకుని సాధన చేస్తే అధిక ఒత్తిడికిలోను కాకుండా విజయం సాధించగలం.

మీ మీద వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తులపై మీకు భావోద్రేకాలుంటే మీకు అనారోగ్య సమస్య తప్పకుండా కలుగుతుంది. మీ దృష్టిని, మీకు అభిరుచి ఉన్న పనిలో పెడ్తే చాలా వరకూ మీరు రిలాక్స్‌డ్ జీవితం గడిపిన వారవుతారు. హాబీకి రిలాక్స్ చేయగల శక్తి ఉంది.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే రిలాక్సు అయి తీరాలన్న విషయం దృష్టిలో పెట్టుకోవాలి. గత వైఫల్యాన్ని మరచిపోవాలి. వాటిని తలుచుకుని కుమిలి పోకూడదు. కొత్త ప్రయత్నాలలో విజయం సాధించగలమా? అనే సందేహం ఉండకూడదు. ఇలా చేస్తేనే ప్రగతి పథం వేపు అడుగులు వేయగలం,” ఆవిడ ఆపారు.

“ఉమాదేవి నేను మీకు క్లాసు పీకాను కదూ! మీకు చిరాగ్గా ఉంది. కదూ! ఎందుకొచ్చింది ఈ సోది అని అనుకుంటున్నారు కదూ!” నవ్వుతూ అంది జ్యోతి.

“లేదు మేడమ్! మీరు చెప్పినవన్నీ సెంట్ పెర్సంట్ కరక్టు. మీ మాటలు వింటూ ఉంటేనే రిలాక్స్‌డ్‍‌గా ఉంది,” ఉమాదేవి అంది.

“గుడ్!నేను చెప్పిన విషయాలు ఆచరించడానికి ప్రయత్నించండి,”  ఆవిడ అంది. ఇంతలో బెల్ మోగడంతో ఇద్దరూ లేచారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here