సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-29

0
3

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[సంఘమిత్ర తన గతం గురించి చెబుతూంటుంది. ఆమె అసలు పేరు వైదేహి.  వైదేహి అత్తగారు, భర్త వల్ల పడుతున్న కష్టాలను పక్కింటి వసుంధర గమనిస్తూ ఉంటుంది. ఆమె మహిళా సంఘం నాయకురాలు. ముందు వైదేహిలో మార్పు తేవాలని నిర్ణయించుకుంటుందామె. అవకాశం దొరికినప్పుడల్లా వైదేహికి ధైర్యం చెబుతుంది. తన కోడలు వసుంధరతో మాట్లాడడం నచ్చని సత్యవతమ్మ వైదేహిని బెదిరిస్తుంది. ఈ విషయం తెలిసిన వసుందర – మహిళా సంఘం సభ్యులందరినీ వెంటేసుకుని వచ్చి సత్యవతమ్మని, మన్మథరావుని హెచ్చరించి వెళ్తుంది. ఆ తరువాత వైదేహి జీవితం పూర్తిగా మారిపోతుంది. మొదట మహిళా సంఘం సభ్యురాలవుతుంది. కాలక్రమంలో ప్రెసిడెంట్ అవుతుంది. తన పేరును సంఘమిత్రగా మార్చుకుంటుంది. భర్తని, అత్తగారిని తన అదుపాజ్ఞలలో పెడుతుంది. తన బలహీనతల దృష్ట్యా మన్మథరావు భార్య మాటలకి ఒప్పుకుంటాడు. ఇదీ నా కథ అంటూ ముగిస్తుంది సంఘమిత్ర. తను బాగా చదివి ప్రయోజకురాలై అమ్మకి సాంత్వన కలిగించాలని అనుకుంటుంది బిందు. తను జీవితంలో సక్సెస్ పొంది విజేతగా నిలుస్తే తనను పెంచినవారి సంతోషానికి హద్దులుండవని తలచి బాగా చదువుతుంటుంది శకుంతల. సిద్ధార్థ ఉద్యోగంలో స్థిరపడినా జీవితంలో ఇంకా సాధించాల్సినవి ఉన్నాయి. రవి తాత్కాలిక ఉద్యోగం చేస్తూ, ఎం.బి.ఎ. చదువుతున్నా, తను జీవితంలో మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి, అక్క ఇందిరని సుఖంగా చూసుకోవాలన్న తపన అతనిది. ఇలా ఈ నలుగురు తమ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి కృషి చేస్తుంటారు. సిద్ధార్థ తల్లి, తన మాజీ ఆడపడుచు రామలక్ష్మిలో మార్పు వచ్చినందుకు ఉమాదేవి సంతోషిస్తుంది. అయినా ఆ ఇంట్లో తన కూతురు ఎలా ఉంటుందోనన్న భయం ఆమెలో ఉంటుంది. కాలం గడుస్తుంది. ఇక చదవండి.]

అధ్యాయం-57

[dropcap]జీ[/dropcap]వితంలో ప్రతీ మనిషి ఏదో రోజున తను చేసిన మంచి చెడు పనులు బేరీజు వేసుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటాడు. శంకరం కూడా అదే పని చేస్తున్నాడు. ఉమాదేవి జీవితంలో తను ఆమె భర్తగా ప్రవేశించాడు. వైవాహిక జీవితంలో తను ఆమెను ఏం సుఖపెట్టగలిగాడు?

ఆమె జీవితాన్ని నరక ప్రాయంగా చేశాడు. అందుకు తను ఇప్పుడు సిగ్గు పడ్తున్నాడు. పశ్చాత్తాపం పడుతున్నాడు. తను ఎంత క్రూరంగా ప్రవర్తించాడు? ఎంత నిర్ధాక్షిణ్యంగా ఇంటి నుండి వెడలగొట్టాడు? ఇంటి నుండి వెళ్ళగొట్టే సమయంలో ఆమె గర్భిణి కూడాను. ఈ విషయం తెలిసి కూడా తను ఆమె మీద కనికరం చూపించలేదు.

తను ఆమెను ఎంత మనస్తాపానికి గురి చేసినా ఆమె ఆత్మవిశ్వాసం – ఆత్మనిబ్బరంతో సహన గుణాన్ని పాటిస్తూ జీవితంలో ఉన్నతంగా ఎదిగిపోయింది. కూతుర్ని కూడా ఉన్నతంగానే పెంచుకొచ్చింది. బిందు తన కూతురు. ఆ ఆలోచన తనకి ఆనందం ఇస్తే తన తండ్రి తనే అని తెలిస్తే తనని ఎంతగా అసహ్యించుకుంటోందో? ఆ ఆలోచనే తనని క్రుంగదీస్తోంది.

ఉమకి తను ముఖం చూపించలేదు. ఆనాడు దర్బం, అధికారం చూపించి ఉమను తన దారిలోకి తెచ్చుకుందామనుకున్నాడు. అయితే ఆనాటి ఉమ కాదు ఈ ఉమ అని తనకి తెలిసింది. దానికి తోడు సంఘమిత్ర లాంటి ఆడ బెబ్బులుల సహకారం ఆమెకుంది. ఆ సంఘమిత్రను తలుచుకోడానికే తనకి భయం వేస్తోంది. తనని తను చేసిన పనికి కటకటాల పాల్జేసే సమర్థురాలు కూడా.

భర్త ఆలోచన్లు కనిపెట్టింది కాత్యాయిని. తను అత్తవారింటిలో అడుగు పెట్టిన తొలి రోజుల్లో తనకి ఎటువంటి అనుభవాలు అయ్యోయో అటువంటి అనుభవాలే ఉమాదేవికి కూడా ఎదురయి ఉండవచ్చు. తను ఎదిరించి నిలబడలేకపోయింది. ఆవిడ ఎదిరించి పోరాడింది. ఆవిడితో ఫోనులో తను మాట్లాడినప్పుడే ఆమె వ్యక్తిత్వం, ఆవిడ ఆత్మస్థైర్యం తనకి అవగతమయ్యాయి. తను ఆవిడలాగా పోరాటం చేయలేదు కాని సహనాన్నే తన ఆయుధంగా చేసుకుని, ఆ ఆయుధంతోనే పోరాడింది.

తన రోజులు బాగుండచ్చు. తనకి అదృష్టం పట్టి ఉండచ్చు, ఏది అయితేనేం తన భర్తలో మార్పు అగుపించింది. మరి పిల్లలో? వాళ్ళ విషయంలో తను ఏం చేయలేకపోయింది. నుదుటి రాతను ఎవరూ తప్పించలేరు కదా! ఎలాగ జరగవల్సింది అలా జరుగుతుందని కర్మ సిద్ధాంతం అనుసరించడం ఆరంభించింది.

“ఏంటి ఆలోచిస్తున్నావు కాత్యాయినీ.”

“మీ గురించే.”

“ఏమని” చిన్నగా నవ్వుతూ అడిగాడు శంకరం. అంత వరకూ తను అనుభవించిన మనస్తాపాన్ని మరిచిపోతూ.

ఇప్పుడు తన భర్త ఇంత సౌమ్యంగా మాట్లాడుతున్నాడు కాని మొదట్లో చండశాసనుడే. “మీరు మరొకరి గురించి ఆలోచిస్తూ ఉంటే నేను మాత్రం మీ గురించే ఆలోచిస్తున్నాను,” అంది. తను ఎవరి గురించి ఆలోచిస్తున్నాడో ఆ విషయం భార్యకి తెలిసిపోయిందన్న విషయం గమనించిన శంకరం కొద్దిగా సిగ్గుపడ్డాడు. భార్య దగ్గర సూటిగా మాట్లాడ్డానికి బిడియపడ్డాడు.

“ఆ ఉమాదేవి గురించే కదా మీ ఆలోచన?”

మౌనం వహించాడు అతను.

“ఆవిడ వ్యక్తిత్తమేంటో నాకు తెలిసింది. ఆవిడితో ఫోనులో మాట్లాడినప్పుడే ఆవిడకి ఇప్పుడు కావల్సింది బంధం కాదు. బాధ్యత అదే తన కూతురి ఉజ్వల భవిష్యత్తు. అంతేకాని తెగిపోయిన బంధాన్ని గురించి ఆలోచించే స్థితిలో లేదు ఆవిడ.”

కాత్యాయిని మాటలకి మరింత క్రుంగిపోయాడు శంకరం. బాధపడ్తున్న అతడ్ని మరింత బాధకి గురిచేసి మనస్తాపం కలిగించడం కాత్యాయినికి ఇష్టం లేదు. అందుకే మరి మాట్లాడలేదు.

“కన్న కూతురు కూడా నన్ను అసహ్యించుకుంటోంది అన్న విషయమే నన్ను క్రుంగదీస్తోంది కాత్యాయిని.”

“ఆ అమ్మాయి తన తల్లికి జరిగిన అన్యాయం గురించి వింది. దానికి కారకులయిన వారి గురించి తెలుసుకుంది. వాళ్ళ మీద అసహ్యం పెంచుకుంది. ఆ భావం పోవాలంటే కొంత సమయం పట్టచ్చు. కాలమే ఈ సమస్యకి పరిష్కారం సూచిస్తుంది.”

“అంతే అంటావా?” శంకరం అన్నాడు.

అతని మనస్సు నిలకడగా లేదు. అశాంతిగా ఉంది. మనస్సులో కల్లోలం రేగుతోంది. తన మాటల్తో మరింత చికాకు పరచకూడదు. అతనికి ఓదార్పు, శాంతి కలిగించే బదులు మరింత అశాంతిని కలగ చేయకూడదు, అతడ్ని ఒంటరిగా వదిలిపెట్టాలి అని అనుకుంది కాత్యాయిని.

అయితే మరుక్షణంలోనే భర్తని అలా ఒంటరిగా వదిలిపెడ్తే అనేక లేనిపోని ఆలోచన్లతో టెన్షను పెరుగుతుంది. మనస్సు అల్లకల్లోల మవుతుంది. ఏదో వ్యాపకం ఉంటే కొంతయినా టెన్షను తగ్గుతుంది. అనుకున్న కాత్యాయిని “ఆఁ అన్నట్టు మరిచిపోయాను మిమ్మల్ని రమ్మనమని సర్పంచు గారు కబురు పెట్టారు వెళ్ళిరండి,” అంది.

గాఢంగా నిట్టూర్పు విడుస్తూ అతను లేచాడు.

అధ్యాయం-58

అది ఇంజనీరింగు ఆఖరి సంవత్సరం. ‘బిందు చదువుకి ఇంకా ఒక్క సంవత్సరమే ఉంది. చదువు పూర్తయ్యాక కూతురు ఇంకా చదువుకుంటానంటే చదివించాలి. లేకపోతే సిద్ధార్థను ఇష్టపడుతోంది కనుక పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్ళి చేయాలి,’ ఇలా సాగిపోతున్నాయి ఉమాదేవి ఆలోచన్లు.

సెలవులిచ్చారు కాలేజీకి. బిందు ఇంట్లోనే ఉంది. కూతురుతోనే ఆమెకి కాలక్షేపం. ఎందుకంటే ఉమాదేవికి కూడా సెలవులే కాబట్టి. ఆ తల్లి మనస్సుకి కొద్దిగా స్వస్థత చేకూరింది. ఈ కొత్త కొత్త బంధాలు – బాంధవ్యాల గొడవల్లో పడి బిందు చదువుకి ఎక్కడ భంగం కలుగుతుందోనని ఉమాదేవి ఆరాటం.

ఈ బంధాలు, బాంధవ్యాలను ప్రక్కకి పెట్టి మొదట కర్తవ్య నిర్వాహణ వేపు దృష్టి సారించాలన్నదే ఆమె భావన. ఎందుకంటే ఈ బంధాలు – బాంధవ్యాల వల్లనే తనకి జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. తన కష్ట పరిస్థితిలో స్నేహ బంధం తప్ప ఈ రక్త సంబంధం బాంధవ్యాలేవీ తనని ఆదుకోలేదు. అందుకే ఈ బాంధవ్యాల కోసం  ప్రాకులాడే కన్నా కర్తవ్యం నిర్వాహణకే తమ అత్యంత ప్రాముఖ్యత ఇచ్చింది. కూతురికి కూడా తను అటువంటి ఉపదేశమే చేసింది.

“మమ్మీ! సుందూ వాళ్ళ మమ్మీ కాత్యాయిని ఆంటీ వచ్చారు,” అంది బిందు. లోపల నుండి బయటకు వచ్చిన ఉమాదేవి కాత్యాయిని చూసి ఒక్కక్షణం అలా నిలబడిపోయింది. కాత్యాయినితో అప్పుడెప్పుడో ఫోనులో మాట్లాడింది కాని ప్రత్యక్షంగా చూడలేదు. ఆవిడ్ని చూడ్డం ఇదే మొదటిసారి.

తను ఒకానొకప్పుడు ఏ ఇంటిలో ఏ స్థానంలో ఉండేదో అదే స్థానంలో ఆవిడ ఇప్పుడు ఉంది. అయితే ఆ ఇంటిలో ఆ స్థానంలో ఉండడం అంటే కత్తి మీద సామే. నరక రూపంగా ఉండే ఆ ఇంటిని స్వర్గతుల్యంగా మలచుకుంది తన సహణ గుణంతో.

మరి తనో ఆ ఇంటి పరిస్థితుల్ని తట్టుకోలేకపోయింది. తట్టుకోవడానికి తగిన అవకాశం లభించలేదు. ఇమడలేదు కూడా. అయితే తను ఆ ఇంటి నుండి బయటపడ్డం తన అదృష్టమే అని తనకి అనిపించింది. ‘ఇంటిని నరకమయంగా లేక స్వర్గమయంగా మలుచుకోవడం ఆడదాని చేతిలోనే ఉందని నిరూపించింది ఈ కాత్యాయిని,’ అనుకుంటోంది ఉమాదేవి.

ఇలా ఉమాదేవి ఆలోచన్లు అలా సాగిపోతుంటే కాత్యాయిని ఆలోచన్లు మరోలా ఉన్నాయి. ‘ఈవిడలో ఎంత పవిత్రత, మేదస్సు ఉట్టిపడుతోంది. ఇలాంటి ఈవిడ గురించా అందరూ చెడింది అని ముద్రవేసింది. ఆవిడ్ని ఇంటి నుండి వెళ్ళగొట్టారు. పాపం ఎన్ని కష్టాలు అనుభవించిందో? ఎన్ని కష్టాలు అనుభవించినా తన కూతురు జీవితం తీర్చిదిద్దింది. పిల్లలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా పెద్దల చేతుల్లోనే ఉందనిపిస్తోంది’.

ఆలోచనా ప్రపంచం నుండి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఉమాదేవి. “రండి.. రండి..!” అంటూ ఆహ్వానించింది. కాత్యాయిని వచ్చి సోఫాలో కూర్చుంది. ఆ ఇద్దరి ఆడవాళ్ళ మధ్యా కొంత తడవు మౌనం రాజ్యమేలింది.

“మీ గురించి వినడమే కాని చూడ్డం తటస్థించలేదు.” మౌనం ఛేదిస్తూ అంది కాత్యాయిని.

“నేనూ అంతే!” అంది ఉమాదేవి నవ్వుతూ.

“మీ యడల ఆయన ప్రవర్తించిన తీరుకి ఇప్పుడు బాధపడుతున్నారు. పశ్చత్తాపం పడుతున్నారు,” అలా అంటున్న కాత్యాయిని వేపు ఉమాదేవి ఒక్కక్షణం చూసింది. ‘ఈవిడ మధ్యవర్తిత్వం వహించడానికి వచ్చిందా?’ ఉమాదేవి ఆలోచిస్తోంది. ఈ ప్రస్తావన ఉమాదేవికి ఇష్టం లేదని గ్రహించింది కాత్యాయిని.

ఉమాదేవి గొంతు సవరించుకుంది, “కాత్యాయిని గారూ! ఒక్క విషయం. బంధాలు – బాంధవ్యాలు గురించి ఆలోచించి తపించే రోజులు గడిచిపోయాయి. జీవితంలో సగ జీవితం ముగిసిపోయినట్టే. ఇప్పుడు నాకు ఈ విషయంలో ఏ ఆశలు – అభిలాషలూ లేవు. జీవిత చరమాంకంలో ఉన్నాను. ఒక విధంగా నాకు గత విషయాల్తో గత సంఘటనల్తో మనుష్యుల్తో నాకు సంబంధం లేదు. నేను ఈనాడు ఈ స్థితిలో ఉండడానికి కారణం స్నేహ బంధం. అదే సరస్వతితో నా స్నేహ బంధం. సృష్ఠిలో తియ్యనిది స్నేహం. అందుకే చెప్తున్నాను. మనిద్దరి మధ్యా ఏ బాంధవ్యం వద్దు. ఒక్క స్నేహ బంధం తప్ప. మనిద్దరం స్నేహితులుగా ఉండిపోడానికి నాకే అభ్యంతరం లేదు,” ఉంది ఉమాదేవి.

కాత్యాయిని మరేం మాట్లాడలేకపోయింది. ‘ఈవిడ ముందర కాళ్ళకి బంధం వేసింది, ఏ ప్రస్తావనా తేనీకుండా. చాలా తెలివైనది,’ అనుకుంది కాత్యాయిని.

“మీకు నచ్చని విషయాన్ని ప్రస్తావనకి తెస్తే క్షమించండి” అంది కాత్యాయిని.

“అబ్బే! అలాంటిదేం లేదు. మీరు మీ భర్త మానసిక స్థితి ఎలా ఉందో చెప్పారు. భార్యగా మీరు అలా స్పందించడంలో అలా మాట్లాడ్డంలో తప్పేం లేదు,” ఉమాదేవి అంది.

ఆ తరువాత ఆడవాళ్ళు నేటి సామాజిక స్థితి గతులు. లోకం తీరు అన్ని విషయాలూ మాట్లాడుకున్నారు.

బిందు సుందరి గురించి, మధు గురించి అడిగింది. కాత్యాయిని వాళ్ళిద్దరి గురించి చెప్పింది. సుందరీ తనూ ఒక తండ్రి పిల్లలు అని తెలిసిన నాడు నిర్వికారంగా ఉండిపోయింది బిందు. తమిద్దరూ ఒకే తండ్రి పిల్లలయినా, సుందూ తండ్రి ప్రేమను సంపాదించుకుంది. ఆ ప్రేమకి వంచితురాలయింది తను. ఇలా ఆలోచిస్తున్న బిందు గాఢంగా నిట్టూర్పు విడిచింది.

(ముగింపు త్వరలో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here