Site icon Sanchika

సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-5

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ఇందిర తన కుటుంబం గురించి, తన జీవితం గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. వాళ్ళ పనిమనిషి సింహాచలం ఉమాదేవి గురించి సంఘమిత్ర అన్న మాటలని ఇందిరకి చెపుతుంది. అలా ఒకరి మరొకరి గురించి అన్న మాటలను వేరొకరికి చెప్పకూడదని ఇందిర ఆమెకు చెప్తుంది. సింహాచలం క్షమించమని అడిగితే, తప్పు నీది కాదు, తప్పు ఆ సంఘమిత్రది అని అంటుంది. ఓ రోజు స్టాఫ్ రూమ్‍లో అలమారలో ఉన్న లైబ్రరీ పుస్తకాలు సర్దుతూ ఉంటుంది ఇందిర. కాస్త దూరంలో ఉన్న కళ్యాణి, సుమిత్ర అనే టీచర్లు పేపర్లు దిద్దుతూ ఉమాదేవి గురించి చెడుగా మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్న ఇందిరకి బాధేస్తుంది. తమలోని లోపాలని దాచిపెట్టి ఇతరుల సమస్యలని హేళన చేస్తున్నారని అనుకుంటుంది. అయితే ఆ మాటలని ఉమాదేవి వింటుంది. వాళ్ళిద్దరూ మాట మార్చి ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మీకే వస్తుంది అని అనుకుంటున్నాం అంటారు. ఉమాదేవి సెన్సిటివ్‍నెస్ తెలిసిన ఇందిర కలుగజేసుకుని, మన అవార్డుల కోసం మనమే అప్లయి చేసుకోడం నాన్సెన్స్ అని అంటుంది. ఉమాదేవి అక్కడ ఉండలేక, సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇందిరకి కూడా ఉమాదేవి వైవాహిక జీవితం గురించి తెలుసుకోవాలని ఉన్నా, అడిగితే ఉమాదేవి బాధపడుతుందేమనని ఎప్పుడూ అడగలేదు. మొదటిసారిగా ఆమెని కలిసిన రోజును గుర్తు చేసుకుంటుంది. తమ మధ్య స్నేహం బలపడిన విధానాన్ని తలచుకుంటుంది. సాయంత్రం ఉమాదేవి ఇంటికి వెళ్తుంది ఇందిర. దుఃఖిస్తూ ఉన్న ఉమని ఓదారుస్తుంది. మనసు చికాగ్గా ఉండి మర్నాడు కూడా స్కూలికి సెలవు పెట్టి ఇంట్లోనే ఉంది. రాగింగుకి భయపడిన హిమబిందు కాలేజీకి వెళ్ళకపోవడం చూసిన ఉమాదేవికి కోపం వస్తుంది. కూతురిని కసురుకుంటుంది. మనస్తాపం చెందిన హిమబిందు పడుకుండిపోతుంది. ఉమాదేవి ఆలోచనల్లో పడుతుంది. అక్కడ ఇందిర ఆలోచనలూ ఇలానే ఉంటాయి. సమాజంలో భద్రత లేని ఆడవాళ్ళ గురించే వాళ్ళ ఆలోచనలు. నిన్న సాయంత్రం ఉమాదేవి ఇంటి నుంచి ఇందిర తన ఇంటికి వచ్చేసరికి – వాళ్ళ ఫ్లాట్ ముందు నిలుచుని ఉంటాడు మన్మథరావు. వాళ్ళ ఆవిడ ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిందనీ, కాస్త ఫ్రిజ్ లోని చల్ల నీళ్ళు కావాలని అడుగుతాడు. ఇందిర ఇస్తుంది. నీళ్ళు తాగాకా కూడా అతను వెళ్ళకుండా, కాసేపు మీ ఇంట్లో కూర్చోవచ్చా అని అడుగుతాడు. కాదనలేక లోపలికి రమ్మని పిలుస్తుంది. అతను వచ్చి సోఫాలో కూర్చుంటాడు. అతనక్కడ కూర్చుని ఉంటే తాను లోపలికి వెళ్ళి పనిచేసుకోవడం సభ్యత కాదని అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటుంది. ఇంతలో అతను ఓ సంచిలోంచి చీర బయటకి తీసి, దాన్ని తీసుకోమని ఇందిరతో అంటాడు. ఇంతలో ఆమె స్టూడెంట్స్ రావటంతో అతను అక్కడ్నించి జారుకుంటాడు. గండం గడిచిందని భావిస్తుంది. తమ్ముడు రవి వస్తున్నాడని ఆ రోజు ఇందిర కూడా సెలవు పెడుతుంది. రవి రాగానే ఆప్యాయంగా ఆహ్వానిస్తుంది. తన అందరిని బాగు చేసి అక్క ఏకాకిగా మిగిలిపోయిందని రవి అంటాడు. ఉద్వేగానికి లోనవ్వదని అంటూ, మీరంతా ఉండగా నేను ఏకాకిని ఎలా అవుతాను అంటుంది ఇందిర. ఇక చదవండి.]

అధ్యాయం-9

[dropcap]ఇం[/dropcap]దిర ఉమాదేవి ఫ్లాటుకి తమ్ముడు రవిని తీసుకువెళ్ళి పరిచయం చేసింది. ఉమాదేవి ఇంకా విచారం నుండి బయటపడలేదు. లేని సంతోషాన్ని తెచ్చిపెట్టుకుంటూ రవిని ఆహ్వానించింది. ఉమాదేవిని చూడగానే రవికి ఆమె మీద పూజ్య భావం కలిగింది.

ఉమాదేవి తన కూతురు హిమబిందుని పరిచయం చేసింది రవికి. హిమబిందుని చూడగానే విస్మయంతో అతని కనుదోయి విప్పారింది. ఏదో వింత దృశ్యం చూస్తున్నట్టు ఏదో వింత విషయం విన్నట్టు ఉన్నాయి అతని చూపులు.

“ఏంటిరా అలా విస్తుపోతున్నావు?” అడిగింది ఇందిర తమ్ముడిని.

ర్యాగింగు రోజున తను కూడా అక్కడ ఉన్నాడు. ఇలా ర్యాగింగుకి జూనియర్సుని గురి చేయడం తనకిష్టం లేకపోయినా ఆ సమయంలో తను అక్కడ ఉండడం తప్పలేదు. సిద్ధార్థకి కూడా ఇలాంటివి ఇష్టం ఉండవు. బలవంతాన్న అతడ్ని బరిలోకి లాగారు సీనియర్సు. తను మాత్రం హిమబిందును చూశాడు గాని, ఆమె మాత్రం అంతమందిలో ఉన్న తనని గుర్తు పట్టలేదు.

“ఏంటిరా అలా ఆలోచిస్తున్నావు?”

“హిమబిందు కదూ ఈ అమ్మాయి,” అన్నాడు రవి.

ఈసారి ఆశ్చర్యపడవల్సి వచ్చింది ఆ ముగ్గురు ఆడవాళ్ళకి. “నీకెలా తెలుసు?” ఇందిర అడిగింది తమ్ముడిని.

ర్యాగింగు జరిగన సంఘటనలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు రవి. అతను చెప్పిన విషయాలు విన్న తరువాత ఉమాదేవి మనస్సు తేలిక పడింది. అంత వరకూ విచారంగా ఉన్న ఆమె మనస్సు తేలిక పడింది. తనకి తెలిసిన అబ్బాయి కాలేజీలో ఉన్నాడు. బిందు యోగక్షేమాలు బాగోగులు చూస్తాడు. ఆమెకి అండగా నిలబడతాడు అనే భావనే ఆమె మనస్సు తేలిక పడడానికి కారణం.

బిందు కూడా మొదట బిడియపడినా రవితో ఎన్నాళ్ళు నుండో పరిచయం ఉన్నవాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుకోవడం చూసి ఆడవాళ్ళిద్దరి హృదయాలూ దూదిపింజల్లా గాలిలో ఎగిరిపోతున్నట్టు తేలికపడ్డాయి.

బిందూ, రవీ, కాజేజీ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే, ఉమాదేవి, ఇందిరా వాళ్ళ వాళ్ళ మాటల్లో పడ్డారు. క్రితం సాయంకాలం మన్మథరావు తనింటికి వచ్చి ఎలా ఇబ్బందికి గురి చేశాడో ఉమాదేవికి వివరించింది.

“ఇంత తతంగం జరిగిందా? నాకు తెలియనే తెలియదు.”

“మీ బాధలో మీరు ఉన్నారు. అందుకే చెప్పలేదు. అయితే ఇక్కడ ఉండడం మాత్రం అంత శ్రేయస్కరం కాదని నా కనిపిస్తోంది,” అంది ఇందిర.

ఎత్తైన కొండ మీంచి అమాంతంగా పడిపోవడం ఉండకపోయినా చిన్న రాయి మీద నిర్లక్ష్యంగా వేసిన అడుగు మనల్ని క్రిందకు కూలదీస్తుంది. మన జీవితంలోనూ అంతే. అమాంతంగా అధోపాతాళానికి జారిపోవడం ఉండదు. అయితే జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న అవాంతరాలకు బెదిరిపోయినప్పుడే బ్రతుకులో విఫలమవుతాం.

“ఉమా నీవు చెప్పిన దాంట్లో నిజం ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలి అని మన పెద్దలు ఊరికే అనలేదు. మనం పెద్దవాళ్ళం ఎలాగేనా మేనేజ్ చేసుకుంటాము. బిందు చిన్న పిల్ల. నిన్న నాకు ఎదురయిన పరిస్థితి ఒంటరిగా ఉంటే ఎదురయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో.”

“పరిస్థితి ఊహించడానికే భయం వేస్తోంది ఇందూ!” అంది ఉమాదేవి.

“మనకి అనుకూలమైన ఫ్లాట్లు ఇద్దరికీ దగ్గర దగ్గరగా దొరకద్దూ! ఈ ఫ్లాట్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామంటే అయితే తప్పదు. రక్షణ లేని పరిసరాలలో దిన దిన గండం దీర్ఘాయుష్యు అన్నట్టు క్షణ క్షణానికి చచ్చి, బ్రతుకుతూ ఉండే కంటే మనకి అనువైన ప్రదేశం వెతుక్కోవడమే మంచిది,” ఇందిర అంది.

“అయితే నాదో విన్నపం.”

“ఏంటి?” ఇందిర అడిగింది.

“నీవు ఇంటి అద్దె మూడు వేలు చెల్లిస్తూ ఒక్కర్తివే ఉంటున్నావు. నేను ఇంటి అద్దె చెల్లిస్తూ ఇద్దరమే ఉంటున్నాం. ఇద్దరి మొత్తాన్ని ఆరు వేలు చెల్లిస్తున్నాం. అదే మూడు వేలకి ఒక ఫ్లాటు తీసుకుని అందరం ఒక దగ్గరే ఉంటే డబ్బుకి డబ్బు ఆదా అవుతుంది. భద్రత కూడా ఉంటుంది. రేపొద్దున్న బిందు చదువు అయి ఉద్యోగానికి వెళ్ళిపోయినా, పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళి పోయినా ఒక్కదాన్నే ఉండాలా. నీవు ఒక్కదానివే నేను ఒక్కదాన్నే,” అంది ఉమాదేవి.

“నీవు అన్నదీ నిజమే, నీ మాటల్లో నిజాయితీ నిజం ఉన్నాయి. అయితే దీన్లో కొన్ని చికాకులు కూడా ఉన్నాయి. మనం ఎంత సన్నిహితంగా ఉన్నా, కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది.”

“ఆ అవకాశం ఎప్పటికీ రాదు. రానీయను అని నీకు భరోసా ఇస్తున్నాను.”

“నిన్న స్కూల్లో కళ్యాణి, సుమిత్ర నీ వ్యక్తిగత జీవితాన్ని కించపరిచారని బాధపడ్డావు. ఎప్పుడేనా పొరపాటు వశాన్న నీ వ్యక్తిగత జీవితం గురించి నేను ప్రస్తావన తెస్తే నీ రియాక్షను ఎలా ఉంటుంది? దాన్ని తట్టుకోగలవా? బాధపడవా? అందుకే దూరంగా ఉండి రోజూ కలుస్తూ ఉంటేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను.” ఇందిర అంది.

“అటువంటి పరిస్థితే ఎదురయినప్పుడు నేను తప్పకుండా నా వ్యక్తిగత జీవితం గురించి చెప్తాను. నా జీవితం తెరిచిన పుస్తకం అని అప్పుడు నీకు తెలుస్తుంది. మన శ్రేయోభిలాషులు తప్ప మన వ్యక్తిగత విషయం గురించి ఎవరు పట్టించుకుంటారు,” ఉమాదేవి భరోసా ఇచ్చింది ఇందిరకి.

“చూద్దాం!” అని ఇందిర తన అంగీకారం తెలియజేస్తున్నట్లు.

అధ్యాయం-10

మనుష్యులకి మాటలంటే ఇష్టం. మౌనంగా ఉండడానికి చాలామంది ఇష్టపడరు. మాటల్తో పనులు జరుగుతాయని అందరూ అనుకుంటారు. పనులు మౌనంలోనే జరుగుతాయి. మనం ఇతరుల మీద సానుభూతిని, దయని మాటల్లో ప్రకటిస్తాం. అయితే కావల్సింది మాటలు కాదు చేతలు. మాటల్ని దాటి మౌనంలోకి అడుగు పెట్టినప్పుడే అది వీలవుతుంది.

సిద్ధార్థ మౌనంగా కూర్చుని దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. రవికి తెలుసు అతడు దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడో అని. అయితే రవి భావన – మౌనంగా ఉంటే పనులు జరగవు. మాటల ద్వారా మన సమస్య పరిష్కరించుకోవాలని, వాటి ద్వారానే పనులు జరుగుతాయని అతని నమ్మకం.

ఇలాంటి సమయంలో సానుభూతిని దయని చూపించడం కాదు, మాటలు అవీ ఉత్త మాటలు కాదు, సహాయపడే చేతలు కావాలి అని రవి భావన. అందుకే సిద్ధార్థ పరిస్థితి తెలుసు కాబట్టే అతనికి తన చేతనయినంత సహాయం చేయాలన్నదే రవి తలంపు.

ఇద్దరూ మధ్య తరగతి మనుష్యులే. సిద్ధార్థ సంగతి తనకి తెలుసు. సిద్ధార్థ తండ్రి పౌరోహిత్యం చేసుకుని గుట్టుగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అటువంటి అతనికి కొడుకుని పెద్ద చదువులు చదివించే స్తోమత లేదు. అలా అని అపారమైన తెలివి తేటలు గల కొడుకుని నిరాశ పర్చడం కూడా అతనికిష్టం లేదు.

జీవితంలో ఆర్థికంగా చిక్కులు ఎదుర్కుంటున్న అగ్రజాతిలో పుట్టడమే తన కొడుకు చేసుకున్న దురదృష్టమని బాధపడ్తూ ఉంటాడు. సాధారణంగా అపారమైన తెలివి తేటలు గల వాళ్ళ దగ్గర సరస్వతీ కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం ఉండదు. అడుగడుగునా దరిద్రం తొంగి చూస్తుంది వీళ్ళ ఇళ్ళల్లో. బాధ్యతలు, వాటికి తగ్గ ఆదాయం లోపిస్తుంది.

ఒక వేపు జీవితంలో అడుగడుగునా లోటు. లోపభూయిష్టమైన జీవితం. కోరికలు అనంతం. ఆ కోరికల్ని తీర్చుకోలేని నిస్సహాయ పరిస్థితి. కోరికలు తీరలేదని నిస్పృహ, నిరాశ, భావోద్వేగాలు.

జీవితంలో డబ్బు ఉన్న వాళ్ళందరూ సుఖపడ్డం లేదు కాని సుఖపడ్డానికి డబ్బు ఒక సాధనం. డబ్బు లేని వారు ఎందుకూ కొరగారు. డబ్బులేని వాడికి దాని విలువ తెలిసినట్లు డబ్బున్న వాడికి తెలియదు. అందనంత వరకే ఏ వస్తువుకైనా విలువ. ఆ వస్తువు అందిన తరువాత ఆ వస్తువు మీద నిర్లక్ష్య భావన. దానిని సక్రమంగా వినియోగించకపోవడం దాని విలువ గ్రహించకపోవడమే.

సిద్ధార్థ తండ్రి తన కొడుకు భవిష్యత్తు కోసం బావమరిదిని ఆర్థిక సహాయం అర్ధించాడు. అతని బావమరిది ఇవతల రాజకీయ రంగంలోను, అవతల ఆర్థిక రంగంలోను బాగా మంచి పలుకుబడి సంపాదించిన మనిషి. అయితే అతనిలోనూ స్వార్థం ఉంది. స్వార్థమే లేకపోతే మానవ మనుగడే లేదు. అయితే మనకున్న స్వార్థం ఎదుటివాళ్ళ జీవితాన్ని దెబ్బ కొట్టకూడదు.

అయితే ఇక్కడ మాత్రం ఈ స్వార్థం ఓ యువకుడి జీవితాన్ని అంధకారం చేయబోతోంది.

సిద్ధార్ధ మామయ్య కోరికలో స్వార్థముంది. ఆ స్వార్థం ఏంటంటే చదువు సంధ్యలు – సంస్కారానికి ఆమడ దూరంగా ఉన్న తన కూతుర్ని మేనల్లుడు పెళ్ళి చేసుకుంటే అతని చదువుకి సహాయం చేయడానికి తనకేం అభ్యంతరం లేదని.

తండ్రి ద్వారా మేనమామ కోరిక విన్న సిద్ధార్థ తల్లడిల్లిపోయాడు. కోపం కూడా వచ్చింది. “చదువైనా మానేస్తాను కాని ఆ స్వార్థపరుడి కోరిక వినేది లేదు.” ఖరాఖండీగా చెప్పేసేడు. అయితే తల్లిదండ్రులు పదేపదే ప్రాధేయపడగా తల్లిదండ్రులు తనని బ్రతిమాలడమేంటని అంగీకరించవల్సి వచ్చింది.

“సిద్ధూ!” పిల్చాడు రవి.

ఆలోచనా ప్రపంచం నుండి బయటపడ్డ సిద్ధార్థ రవి వేపు చూశాడు.

“ఏంటా దీర్ఘాలోచన?”

“బి.టెక్ ఫైనలియర్ – మన చదువు ఈ సంవత్సరంతో పూర్తవుతుంది. అప్పుడప్పుడు ఇంటి వాతావరణం గుర్తుకు వచ్చినా నా దృష్టిని చదువు మీద కేంద్రీకరించడం వలన ఇంటి విషయాలు గురించి ఆలోచిస్తూ బాధపడే అవకాశం కలగలేదు.

ఇక చదువు పూర్తవుతుంది. డిగ్రీ చేతికొస్తుంది. ఆ డిగ్రీ చేత పట్టుకుని జీవన పోరాటంలో ముందుకు దూసుకెళ్ళాలి. అలా వెళ్తున్న సమయంలో ఎన్నో అవరోధాలు – ఎన్నో ఆటంకాలు, ఎన్నో అపజయాలు. ఆశా నిరాశల మధ్య నలిగిపోయే జీవితం. ఇక్కడయితే అందరి మధ్యా ఛలోక్తులు, వినోదంతో జీవితం గడిచిపోతోంది. కాని బయటకు వెళ్ళిన తరువాత అంతా టెన్షన్.. టెన్షన్. అలాంటి జీవితం ఊహించడానికే భయంగా ఉంది,” అన్నాడు సిద్ధార్థ. అతని మాటల్లో ఆవేదన తొంగి చూస్తోంది.

‘తన జీవితం కూడా అదే. అంత మంచి అక్కయ్య లభించడం తను చేసుకున్న అదృష్టం. ఆమె త్యాగం కుటుంబ సభ్యుల జీవితాన్ని బాగుపర్చింది. కాని ఆమె మాత్రం మ్రోడులా మిగిలి పోయిందే అన్నదే తన బాధ. సిద్ధూ భావోద్వేగాల్లాంటివే తన భావోద్వేగాలు కూడా. ఇక్కడ ఉండే సమయంలో చదువులో లీనమవడం వల్ల ఇంటి సమస్యలు తనని అంత బాధించలేదు కాని, చదువు పూర్తి అయి ఇంటికి వెళ్ళిన తరువాత మళ్ళీ సమస్యల జీవితమే ఉద్యోగం దొరికే వరకూ.

ఉద్యోగాల వేటలో పరుగులు తీయాలి. ఆ పరుగులో పడ్తూ – లేస్తూ తిరిగి పరుగుపెడ్తూ జీవనాధారం దొరికే వరకూ అలా పరుగుపెడ్తూనే ఉండాలి. ఎంతమంది నిరుద్యోగ ఇంజనీర్లు, ఉద్యోగాల వేటలో పరుగు పెట్టటం లేదు,’ రవి ఆలోచన్లు ఇలా సాగిపోతున్నాయి.

“నా మాటల్తో నీకు కూడా మనస్తాపం కలిగించాను సారీ!”

“నీవు మనస్తాపం కలిగించడమేంటి? ఇద్దరం ఒక గూటి పక్షులమే. నీవి ఒక విధమైన సమస్యలయితే, నావి మరో విధమైన సమస్యలు. ఈ మధ్య తరగతి జీవితాలే సమస్యల పుట్ట.”

“మన సమస్యలు మనకి ఎప్పుడూ ఉన్నవే కాని, మీ అక్కయ్య గారి దగ్గరికి వెళ్ళి వస్తున్నావు. ఏంటి విషయాలు?” అడిగాడు సిద్ధార్థ.

“విషయాలంటే వింత విషయాలే, ఆశ్చర్యం కలిగించే విషయాలే.”

“నీకు అంత ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏంటబ్బా?” సిద్ధార్ధ అన్నాడు.

“హిమబిందును అక్కడ చూడ్డమే ఆశ్చర్యకరమైన విషయం.”

“ఏంటి హిమబిందుని అక్కడ చూశావా? పాపం ఈ ర్యాగింగుకి భయపడిపోయి, రెండు రోజుల నుండి కాలేజీకే రావటం లేదు.”

“చూడ్డమే కాదు. ఆమెతో మాట్లాడి ధైర్యం నూరిపోసి మరీ వచ్చాను,” అన్న రవి తన అక్కయ్య విషయం, ఉమాదేవి గురించి, హిమబిందు గురించి విస్తారంగా వివరించాడు సిద్ధార్థకి.

తన మాటలు విన్న సిద్ధార్థ కళ్ళలో ఆనందం తళుక్కుమనడం గమనించాడు రవి.

“గుడ్! మంచి పని చేశావు,” అన్నాడు సిద్ధార్థ.

(ఇంకా ఉంది)

Exit mobile version