Site icon Sanchika

సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-6

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ఇందిర తన తమ్ముడు రవిని తీసుకుని ఉమాదేవి ఫ్లాట్‍కి వెళ్ళి పరిచయం చేస్తుంది. ఉమాదేవి తన కూతురు హిమబిందును పరిచయం చేస్తుంది. హిమబిందును చూడగానే విస్తుపోతాడు రవి. ఆమె పేరు హిమబిందు కదా అని అంటాడు. నీకెలా తెలుసని ఇందిర అడిగితే, ర్యాగింగ్ జరిగిన రోజున జరిగిన సంఘటనలని చెప్తాడు. ఉమాదేవి మనస్సు తేలిక పడుతుంది. కాలేజీలో బిందు యోగక్షేమాలు చూస్తాడు రవి అని ఊరట చెందుతుంది. బిందూ, రవీ, కాజేజీ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే, ఉమాదేవి, ఇందిరా తమ తమ మాటల్లో లీనమవుతారు. క్రితం సాయంకాలం మన్మథరావు తనింటికి వచ్చి ఎలా ఇబ్బందికి గురి చేశాడో ఉమాదేవికి చెప్తుంది ఇందిర. ఇక్కడ ఉండడం అంత శ్రేయస్కరం కాదని అనిపిస్తోందని అంటుంది. నిన్న తనకు ఎదురయిన పరిస్థితి ఒంటరిగా ఉన్న బిందుకు ఎదురయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించమని ఉమాదేవితో అంటుంది. మరో చోట ఇల్లు వెతుక్కోడం ఉత్తమం అని అంటుంది ఇందిర. అయితే ఈ సారి బిందు, తామిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం, ఒకరికొరరు ధైర్యంగా ఉండచ్చు, డబ్బు కూడా ఆదా అవుతుందని ఉమాదేవి అంటుంది. కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుందని అంటుంది ఇందిర. అలాంటి అవకాశాన్ని రానీయనని అంటుంది ఉమాదేవి. ఉమా వ్యక్తిగత జీవితం గురించి తను ప్రస్తావన తెస్తే ఆమె రియాక్షను ఎలా ఉంటుందని అడుగుతుంది ఇందిర. అటువంటి పరిస్థితే ఎదురయినప్పుడు నేను తప్పకుండా నా వ్యక్తిగత జీవితం గురించి చెప్తానంటుంది ఉమ. చూద్దాం అంటుంది ఇందిర. కాలేజీ క్యాంపస్‍లో సిద్ధార్థ ఓ చోట కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. అది గమనించిన రవి, సిద్ధార్థకి సాయం చేయాలనుకుంటాడు. తామిద్దరి పరిస్థితి ఒకలాంటిదే అని రవికి తెలుసు. పేదవాడైన సిద్ధార్థ తండ్రి తన కొడుకు భవిష్యత్తు కోసం బావమరిదిని ఆర్థిక సహాయం కోరుతాడు. చదువు సంధ్యలు, సంస్కారం లేని తన కూతురిని సిద్ధార్థ పెళ్ళి చేసుకుంటానంటే, అతని చదువుకి సాయం చేస్తానంటాడు వాళ్ళ మావయ్య. తండ్రి ద్వారా మేనమామ కోరిక విన్న సిద్ధార్థ బాధపడతాడు. చదువైనా మానేస్తాను, గానీ మావయ్య కోరికని అంగీకరించనని అంటాడు. తల్లిదండ్రులు పదేపదే ప్రాధేయపడగా ఒప్పుకుంటాడు. రవి సిద్ధార్థని పలకరిస్తాడు. భవిష్యత్తు గురించి దిగులు పడతాడు సిద్ధార్థ. తన పరిస్థితి కూడా అదేననీ, కాకపోతే తనకి అక్క సపోర్టు ఉందని గుర్తు చేసుకుంటాడు. మాటల సందర్భంగా తను అక్క వాళ్ళింటికి వెళ్ళినప్పుడు హిమబిందును అక్కడ చూశానని చెప్తాడు రవి. ఆమెతో మాట్లాడి ధైర్యం నూరిపోసి మరీ వచ్చానని అంటాడు. తన అక్కయ్య విషయం, ఉమాదేవి గురించి, హిమబిందు గురించి విపులంగా వివరిస్తాడు సిద్ధార్థకి. మంచి పని చేశావని అంటాడు సిద్ధార్థ. తన మాటలు విన్న సిద్ధార్థ కళ్ళలో ఆనందం తళుక్కుమనడం గమనిస్తాడు రవి. ఇక చదవండి.]

అధ్యాయం-11

[dropcap]రెం[/dropcap]డు రోజులు కాలేజీకి ఎగనామం పెట్టిన హిమబిందు మూడవ రోజున కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెట్టింది. రవి ఇచ్చిన ధైర్యమే ఆమెని కాలేజీలోకి అడుగుపెట్టేటట్టు చేసింది. అయినా ఆమెలో బితుకు పోలేదు. తడబడ్తున్న పాదాల్తో ముందుకు సాగుతోంది.

ఆ రోజు జరిగిన అనుభవంతో కాలేజీకి రావడానికే భీతిగా ఉంది. ఒక విధమైన కంపన. తల్లి మాటలు గుర్తుకొస్తున్నాయి. “పిచ్చి పిల్లా! ఇలా అయితే జీవితంలో ఎదురు దెబ్బలు తింటావు. ధైర్యంగా ఉండడం, ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా చలించకుండా ఉండటం నేర్చుకో,” అనేది.

తల్లి మాటలు తను పూర్తిగా సమర్థించలేదు. ‘ఎవరికేనా స్వతహాగా పుట్టుకతోనేనా – జీవితంలో అనుభవించిన ఎదురు దెబ్బల వలన ధైర్యం డాషింగ్ నేచరు వస్తుంది కాని, తనలాంటి వాళ్ళకి ఎలా వస్తుంది? అయితే ఈ విషయం మమ్మీకి తెలియదా? తెలుసు. ఆమె తనని ఇంకా వెనకేసుకొస్తూ సమర్థిస్తే తను మరింత పిరికిదానిలా తయారవుతుందని మమ్మీ భావన,’ ఇలా ఆలోచిస్తూ ముందుకు అడుగులేస్తోంది.

“వచ్చేవా తల్లీ! నిన్ను ఇబ్బందులకి గురి చేశామని అవమానపెట్టేసామని ఆ సిద్ధార్థ మా మీద విరుచుకుపడ్తున్నాడు. ప్లీజ్ హిమబిందూ! నీవు మంచి దానవమ్మా! నాకు ఒక్క రహస్యం చెప్పవూ? ఆడపిల్ల వంక కన్నెత్తి చూడని ఆ ఋష్యశృంగుడు నీ వల్లో ఎలా పడ్డాడు? ఏ విధంగా అతడ్ని వశపరుచుకున్నావు? ఆ మాత్రం నాకు చెప్పవూ? ఎన్ని పర్యాయాలు అతడ్ని వశపర్చుకోడానికి – ఆకర్షించడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్ధమయ్యాయి” బిందు రెండు చేతులూ పట్టుకుని ప్రాధేయపడ్తూ రహస్య విషయం తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతోంది ఆ లావుపాటి అమ్మాయి.

“మీరందరూ అనాగరికులు – దుష్టులు, దుర్మార్గులు, కంట్రీ బ్రూట్స్,” అంటూ విరుచుకుపడ్తున్నాడు సిద్ధార్థ అదే సమయంలో, ర్యాగింగ్ చేసిన సీనియర్ అబ్బాయిల మీద. అతనికీ తెలుసు బిందు కాలేజీకి వస్తుందని, రవి చెప్పాడు. అయితే తను ఇలా కోపం ప్రదర్శించకపోతే తిరిగి బిందుని ఇబ్బందులకి గురి చేస్తారు అని అందుకే అతను అబ్బాయిల మీద అలా విరుచుకుపడ్తున్నాడు.

“ఏంటిరా చిట్టి నాయనా? అలా చిందులేస్తున్నావు?” ఓ సీనియరు సిద్ధార్థని ఎదురు ప్రశ్న వేశాడు.

“లేకపోతే మీరు చేసిన పనేంటి? పాపం ఆ హిమబిందుని అలా హడలగొట్టారు. పాపం రెండు రోజుల నుండి కాలేజీకి రావడం మానేసింది జడిసిపోయి. ఈ ర్యాగింగ్ పేరుతో ఎదుటి వారి జీవితాల్తో ఆటలాడుకోవడమేనా మీ హబీ! అయితే ఒక్క విషయం అందరు అమ్మాయిలూ ఒక్కలాగే ఉండరు. కొంతమంది సున్నిత మనస్కులు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు ఇలాంటి అవమానాలను సహించలేరు.” ఆవేశంగా – ఉద్రేకంగా అరిచినట్టు అంటున్నాడు సిద్ధార్థ.

అతనిలో అంత ఆవేశం ఉంటుందని, అంత ఆవేశంగా మాట్లాడుతాడని ఎవ్వరూ అనుకోలేదు.

“ఒరే బుజ్జి నాయనా! పడ్డావురా ప్రేమలో. నీవో జడపదార్థమనుకున్నాము కాని నీలో కూడా ప్రేమ భావం అంకురించిందని ఇప్పుడు తెలిసింది. నీలో అటువంటి భావం కలిగించిన ఆ రెండు జడల అమ్మాయి అదే ఆ హిమబిందుకి ధన్యవాదాలు తెలియచేయాలి. ఇన్నాళ్ళూ ఈ అపర ఋష్యశృంగుడు ఓ జడ పదార్థం అనుకున్నాం. నీలో కూడా చైతన్యం వచ్చిందే!” ఓ సీనియర్ వ్యాఖ్యానిస్తున్నాడు.

“ఒరే కన్నా! మా మీద అలా విరుచుకు పడ్తున్నావు. నీ స్వప్న సుందరి, కలలరాణీ ఆ రెండు జడలమ్మాయి అదిగోనురా ఆ టుమ్ టుమ్‌తో మాట్లాడుతోంది. ఇప్పుడు నీ మనస్సు శాంతించిందా?” అన్నాడు మరో

సీనియర్.

సిద్ధార్థ దృష్టి చప్పున అట్నించి ఇటు తిరిగింది. అతని ముఖంలో సంతోష వీచికలు ఒక్కసారి కదిలాడాయి. హిమబిందు గడ్డం క్రింద చేయి పెట్టి బ్రతిమాలినట్లు మాట్లాడుతున్న లావుపాటి అమ్మాయిని చూశాడు సిద్ధార్థ. రాజకుమారిని ఎత్తుకు పోవడానికి వచ్చిన మంత్రకత్తెలా అనిపించింది ఆ లావుపాటి అమ్మాయి అతనికి.

గబగబా వెళ్ళి ఆ మంత్రకత్తె చేతిలో నుండి రాజకుమారిని రక్షించుకోవాలన్న తలంపు వెంటనే అతనికి వచ్చింది ఆ క్షణంలో. అయితే అందరూ ఆటపట్టిస్తారని ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. కాలేజీ వేపు అడుగులు వేశాడు.

ఎందుకంటే అందరూ సిద్ధార్థని, హిమబిందుని చూసి పగలబడి నవ్వుతూ, పాటలు పాడుతూ డాన్సు చేస్తున్నారు.

“రెండు రోజుల బట్టీ మీరెందుకు కాలేజీకీ రావటం లేదు?” శకుంతల అడిగింది హిమబిందుని.

“ఊరికే! వంట్లో నలతగా ఉంది. ”

“అబద్ధం.”

“నిజమే!” నొక్కి పలికింది బిందు.

“మిమ్మల్ని అలా అందరూ ఇబ్బందులకు గురి చేసినందుకు సిద్ధార్థ అందరి మీదా విరుచుకుపడ్డాడుట. అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు.” రహస్యం చెప్తున్నట్లు చెప్పింది శకుంతల. వినీ వినట్లు నటిస్తూ ఊరుకుంది బిందు.

“మరో మాట.”

“ఏంటి?”

“ఆ సిద్ధార్ధ వెరీ క్లవర్ స్టూడెంట్ అట. కాలేజీకే ఫష్టుట. అతని మాటలకి అందరూ విలువిస్తారట,” తిరిగి అంది శకుంతల,

“అలాగా!”

“ఇంకా వినండి.”

“ఏంటి?”

“ఆ సిద్ధార్థ మిమల్ని సపోర్టు చేస్తూ మాట్లాడుతూ ఉండటం అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. ఏ అమ్మాయి అందానికీ చలించని అతను మీ వేపు ఆకర్షితుడవడం వింతగాను, అది గొప్ప విషయంగానూ చర్చించుకుంటున్నారు.”

“దీనిలో నాకేం ప్రత్యేకత అగుపడటం లేదు. మానవత్వం ఉన్న వున్న మనిషిగా ఎదుటివారిని అవమానాల నుండి కాపాడానికి అతను నాకు సపోర్టు చేసి ఉండచ్చు, అని అనుకోవచ్చు కదా!”

“కొంత వరకూ అదీ నిజమే!” అలా మాట్లాడుకున్న తరువాత శకుంతల, హిమబిందు క్లాసు రూమ్ వేపు అడుగులు వేశారు.

సిద్ధార్థ మనస్సు ఆలోచన్ల సుడిగుండంలో చిక్కుకుంది. హిమబిందు కాలేజీకి వచ్చిందన్న సంతోషం ఎక్కువ సమయం అతడికి ఉండలేదు. అతని దృష్టింతా తన జీవితంపై కేంద్రీకరింపబడి ఉంది.

తన జీవితం ఏం జీవితం? తనదీ ఓ జీవితమేనా? తనదీ ఓ బ్రతుకేనా? బానిస బ్రతుకు బ్రతికే కంటే చావే శరణ్యం అనిపిస్తుంది ఒక్కొక్క పర్యాయం. అసలు తనకి మామయ్య కూతుర్ని పెళ్ళి చేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదు. తన చదువుకి, పెళ్ళికి లింకు పెట్టాడు మామయ్య. చదువైనా మానేస్తాడు కాని పెళ్ళికి ఏ మాత్రం అంగీకరించకూడదు అని తను అనుకున్నాడు.

అయితే తన తల్లిదండ్రుల ఆలోచన్లు వేరేగా ఉన్నాయి. తను జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, వాళ్ళ పిచ్చి కోరిక, ఆకాంక్ష. ఆ పెద్దల మనస్సు కష్టపెట్టడం ఇష్టం లేక ఇలా పెళ్ళికి తలూపవల్సి వచ్చింది.

చదువు వంకతో ఇన్నాళ్ళూ తన జీవితం ఇప్పటి వరకూ సాఫీగానే సాగింది. అయితే ముందున్నదే అసలైన సమస్య, గడ్డుకాలం. క్షణ క్షణం చస్తూ బ్రతుకుతూ బానిస బ్రతుకు బ్రతకాలి.

ఉద్యోగాల వేటలో పడాలి. ఈ రోజుల్లో ఎంత తెలివితేటలున్నా, డిగ్రీ ఉన్నా అగ్రకులంలో పుట్టిన తనకి ఉద్యోగం రావడం కష్టమే. మామయ్య రికమండేషను మీద ఉద్యోగం సంపాదించడం తనకి ఇష్టం లేదు. ఇలా సాగిపోతున్నాయి సిద్ధార్థ ఆలోచనలు.

అధ్యాయం-12

క్రమంగా కాలేజీ వాతావరణంలో మార్పు వస్తోంది. మొదట్లో జూనియర్స్‌ని ఆట పట్టించడానికి సీనియర్సు ర్యాగింగు చేశారే కాని ఆ తరువాత సీనియర్సు, జూనియర్సు యడల పాజిటివ్ గానే స్పందించడం ఆరంభించారు. వారికి తమ సహకారం కూడా అందించడం ఆరంభించారు.

హేళన చేయడం, వ్యంగ్యంగా మాట్లాడ్డం అసలు ఇప్పుడు లేనేలేవు. సీనియర్సు, జూనియర్సు మధ్య స్నేహపూరిత వాతావరణం ఏర్పడింది. రవి, సిద్ధార్థ దగ్గర సంకోచం పోయి ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు బిందు, శకుంతల.

బిందు అంటే ఇష్టపడ్తున్నాడు సిద్ధార్థ. శకుంతలంటే ఇష్టపడ్తున్నాడు రవి. వారు అలా ఇష్టపడ్డానికి వాళ్ళలో ఉన్న గుణాలు కావచ్చు. వ్యక్తిత్వం కావచ్చు, ఆకర్షణ కావచ్చు మరేదేనా కావచ్చు.

బిందులో ఉన్న అమాయకత్వం, నిర్మలత్వం సిద్ధార్థను ఆకర్షిస్తూ ఉంటే శకుంతలలోని స్థిరత్వం – గంభీరమైన వ్యక్తిత్వం, ధైర్యం రవిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఇద్దరికి ఇద్దరూ తమ భావాల్ని వాళ్ళ దగ్గర వెళ్ళడి చేయలేదు. వెళ్ళడి చేసే అవకాశం రాలేదు. తమకున్న పరిస్థితుల వల్ల కూడా తమ ఇష్టత తెలియ చేయటం లేదు.

సిద్ధార్ధ, రవి, బిందుని, శకుంతలని ఇష్టపడుతున్నారంటే ఆ ఇష్టంలోనే ప్రేమతత్వం ఉంది. అది పవిత్రమైన ప్రేమే కాని, తుచ్ఛమైన కామ భావం మాత్రం కాదు. నేడు యువత ప్రేమ అనే రెండున్నార అక్షరాల్ని సార్ధకత చేసుకోకుండా తుచ్ఛమైన కోరికల్ని శారీరిక వాంఛల్ని తీర్చుకోడానికి ప్రేమ అనే ముసుగు ధరింప చేయడం చాలా బాధాకరమైన విషయం.

ప్రేమ అనేది పవిత్రమైన విలువ కట్టలేని – విలువ కట్టడానికి కూడా సాధ్యపడని పవిత్రమైన ఆప్యాయతకి, అనురాగానికి మారు పేరు. అంతేకాని క్షణికమైన ఆవేశానికి, శారీరిక వాంఛలకి లొంగిన కామం మాత్రం కాదు. అలాంటిదే నిజమైన ప్రేమ.

రీడింగ్ రూమ్ నుండి బయటకు వచ్చి శకుంతల కోసం ఎదురు చూస్తోంది హిమబిందు.

“హిమబిందు గారూ!”

ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసిన ఆమె కనుదోయి క్షణం రెప్పలు పడకుండా ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయింది. ఒక వేపు ముఖంలో సిగ్గు అనే భావం తొంగి చూసింది. అతడ్ని చూడగానే శకుంతల మాటలు గుర్తుకు వస్తున్నాయి.

“అలా ఆశ్చర్యపోతున్నారేంటి? నేనూ సిద్ధార్ధని,” నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ.

బిందు కూడా నవ్వింది.

“ప్లీజ్! అలా లాన్లో ఓ క్షణం కూర్చుని మాట్లాడుకుందాం వస్తారా?” ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా లాన్ వేపు నడిచాడు. మరి వ్యతిరేకత చూపకుండా బిందు కూడా నడిచింది.

“మీరు రెండు రోజులు కాలేజీ మానేసి వచ్చిన తరువాత ఆ గున్న ఏనుగు పిల్ల ఏంటంటోది?” నవ్వుతూ అన్నాడు.

“ఎవరూ?”

“అదే ఆ సుకుమారి.”

ఆ లావుపాటి అమ్మాయి సుకుమారి మాటలు తలంపుకి రాగానే సిగ్గుతో ముఖం ఎర్ర బారింది బిందుకి.

“నేను వినకూడదా ఆ మాటలు?”

“ఊహూఁ..!” తల అడ్డంగా తిప్పింది.

“మరి చెప్పడానికి అభ్యంతరమేంటి?”

“ర్యాగింగ్ అయిన తరువాత అందరికీ చీవాట్లు వేసి నన్ను సపోర్టు చేసి మాట్లాడేరుట. మిమల్ని నేను ఏదో మంత్రం వేసి వశపర్చుకున్నానుట. తను ఎంత ప్రయత్నం చేసినా మిమ్మల్ని వశపరుచుకోలేక పోయిందట. ఆ వశీకరణ మంత్రమేదో చెప్పమంటోంది” సిగ్గు ఒక ప్రక్క అడ్డు పడ్తూ ఉంటే ఆ సిగ్గును దాచుకుంటూ అందామె.

ఆ మాటలు విని సిద్ధార్థ గలగలమని నవ్వాడు. “నిజమే! ఆ సుకుమారి నా దృష్టిలో పడ్డానికి – నన్ను ఆకర్షించడానికి తెగ ఆరాట పడ్తోంది. ఆమె ఆ ఆరాటం చూస్తూ వుంటే ఒక వేపు కోపం – అసహ్యం – మరో వంక జాలి కలుగుతోంది” అని, “మరో విషయం,” అన్నాడు సిద్ధార్థ.

“ఏంటి?”

“శకుంతల గారికి ఉన్న ధైర్యం మీకు లేదు.”

“ఆ ర్యాగింగు డే గురించేనా మీరు మాట్లాడేది. జరిగిపోయిన విషయాలు ఎందుకూ, ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం కదా!”

“నేను కామనుగా చెప్తున్నాను. ఆ ధైర్యం, డాషింగ్ నేచరు ఎవరో కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళలో అది లోపించడానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం మన పరిసరాలు. ఒక విధంగా మన పెద్దవాళ్ళు కూడా. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఉన్న ఆ డాషింగ్ నేచర్‍ని మొగ్గలోనే తుంచి వేస్తారు. ఆదిలోనే అణచి వేస్తున్నారు. పురిటిలోనే సంధి కొట్టేస్తున్నారు. సంప్రదాయాలు – సంస్కారం పేరుతో” ఆవేశంగా అన్నాడు.

“ఏవేవో మాట్లాడుతున్నారు మీరు.”

“సమాజంలో జరుగుతున్న అన్యాయం విషయమే. ఈ సమాజంలో మగపిల్లవాడికి ఇచ్చిన స్వేచ్ఛ స్వతంత్రం ఆడపిల్లలకి ఉండదు. ‘నీవు ఆడపిల్లవి అలా మగరాయుడులా తిరగద్దు’ అని ఆంక్ష పెడ్తారు. అప్పుడు ఆ ఆడపిల్ల నేను ఈ సమాజంలో అలా మగపిల్లవాడిలా ఉండకూడదు కాబోలు అనుకుంటూ అలాగే తన జీవితాన్ని మలుచుకుంటుంది. ఇది కొంతమంది ఆడపిల్లల విషయం. ఆధునికతను వొంట బట్టించుకున్న ఆడపిల్లయితే ఎదిరిస్తుంది, పోరాడుతుంది.

నేనూ మగవాడ్నే. అయితే మగవాడి అన్ని పనులూ నేను సమర్థించను. నన్ను స్త్రీ పక్షపాతి అనుకోండి మరేదేనా అనుకోండి కాని ఇదే మెంటాల్టీ నాది. మగవాడిలోని అహంకారం, స్వార్థం కూడా. అదే తనకన్నా ఆడది ఎదగకూడదన్న స్వార్థం వల్లనే సమాజంలో ఆడపిల్లలు ఇలా డాషింగ్ నేచర్ లేకుండా తయారవుతున్నారనుకుంటాను నేను.”

సిద్ధార్థలో ఎన్ని ఉన్నత భావాలున్నాయి. అందరిలోనూ ఇలాంటి భావాలే ఉంటే సమాజం ఎంత బాగుపడేది? హిమబిందు ఆలోచిస్తోంది.

“ఇప్పుడు కూడా ఆ ర్యాగింగు రోజునే తలుచుకుంటాను. ఆ రోజు నన్ను ర్యాగింగుకి గురి చేసిన వాళ్ళకి చీవాట్లు వేశారుట మీరు. ఇప్పుడు కూడా అందరూ ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. మీరే వాళ్ళకి చీవాట్లు పెట్టకపోతే ఇంకా ఎన్ని విధాలుగా నేను హింసకి గురి అయి ఉండేదాన్నో?” అంది బిందు.

“ఓస్ ఇంత చిన్న విషయానికేనా? మీ అభినందన?” గలగలమని నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ. అతను అలా నవ్వుతూ ఉంటే ఎర్రటి పెదవుల మధ్య ముత్యాల్లాంటి పలు వరస తళుక్కున మెరిసింది.

“ఈ పాటి ర్యాగింగ్‌కే మీరు భయపడ్డారు కాని మేము జూనియర్స్ ఉన్నప్పుడు మాకు జరిగిన విధంగా ర్యాగింగ్ జరిగితే – మాకు అనుభవమైన అనుభవాలు వింటే మరీ మీరు కంగారు పడిపోయి ఉండేవారు,” సిద్ధార్థ అన్నాడు.

“అంటే?”

“నేను ఈ కాలేజీలో జాయినయినప్పుడు మా సీనియర్సు ఏం చేశారో తెలుసా?”

“మీరు చెప్పందే ఎలా తెలుస్తుంది?” నవ్వుతూ అంది హిమబిందు. ఆమె జోక్‌కి అతనూ గలగలా నవ్వాడు.

“వెన్నెల రాత్రిలో సముద్రం ఒడ్డుకి జూనియర్స్‌ని తీసుకు వెళ్ళి వొంటి మీద నూలుపోగు కూడా లేకుండా నగ్నంగా చేయించి కబాడీ ఆడించేవారు.”

“ఛీ!” అంది హిమబిందు. అతను నవ్వాడు.

“దాన్తో అయిపోయిందా, రకరకాల బూతులు మాట్లాడేవారు. మా చేత మాట్లాడించేవారు. పిల్లి మొగ్గలు వేయించేవారు. డ్యాన్సులు చేయించేవారు. అమ్మాయిల తల్లో పూలు తీసుకు రమ్మనేవారు. గాడిదలా అరవమనేవారు. కుక్కలా మొరగమనేవారు – కుక్కలా మూత్రం విసర్జించమనేవారు,” చెప్పడం ఆపాడు సిద్ధార్ధ.

“అమ్మో!”

“ఇంకా నయం. మన వేపు ఈ ర్యాగింగ్ రూపం హింసాత్మకంగా లేదు కాని కొన్ని ప్రాంతాల్లో ఇది వికృత రూపం దాల్చి హింసాత్మకంగా తయారయి ప్రాణాలు తీసేదిగా ఉందనే దీన్ని బేన్ చేయడానికి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటోంది ఇప్పుడిప్పుడే.”

“హింసాత్మకంగానా?”

“అవును. ఎలక్ట్రికల్ హీటరు మీద మూత్ర విసర్జన చేయమంటారుట. ముళ్ళ మీద నడవమంటారుట. నానా హింసలకి గురి చేస్తారట.”

“అంత దారుణం గానా?”

“మరేంటి అనుకున్నారు.”

“మీకు మరో పర్యాయం కృతజ్ఞతలు.”

“మీ కృతజ్ఞతల భారం మోయలేను,” సిద్ధార్థ నవ్వుతూ అన్నాడు. బిందు కూడా నవ్వింది.

(ఇంకా ఉంది)

Exit mobile version