[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[శంకరం తన బలహీనతల గురించి ఆలోచిస్తుంటాడు. శంకరం కొడుకు అల్లరిచిల్లరగా తిరుగుతూ గొడవలు ఇంటి మీదకి తెస్తుంటాడు. ఓ అభిమాన హీరో సంఘం నాయకుడిగా మరో హీరో అభిమానిపై దాడి చేసి గాయపరుస్తాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడ్ని పట్నం తీసుకెళ్ళి హాస్పటల్లో జాయిన్ చేసి ట్రీట్‌మెంటుకి డబ్బులిచ్చి బాధితుని తరుపు వాళ్ళకి క్షమాపణ తెలియజేసి వస్తాడు శంకరం. కొడుకు విచ్చలవిడిగా డబ్బు దుబారా చేయడం కూడా నచ్చదు శంకరానికి. ఈ విషయాన్నే తలచుకుంటూ భావోద్వేగానికి లోనవుతాడు. కాత్యాయని భర్త మానసిక అలజడిని గుర్తిస్తుంది. తనకు శంకరానికి పెళ్ళయిన పద్ధతిని, తాను కాపురంలో ఎదుర్కున్న సమస్యలని గుర్తు చేసుకుంటుంది. ఇంతలో భర్త పిలుస్తాడామెను. కొడుకు వల్ల వస్తున్న ఇబ్బందులని చెప్పి బాధపడతాడు. మొక్కగా ఉన్నప్పుడు వంచలేకపోయానని దిగులుపడతాడు. మధు విషయం వదిలేయమని, తనకి సుందరి విషయమే బెంగగా ఉందని అంటుంది. సిద్ధార్థకి సుందూని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని తనకి అనిపిస్తోందనీ, భర్తకు ఇచ్చిన మాటకి కట్టుబడి తన అభిప్రాయం చెప్పలేక మథనపడతున్నట్లున్నాడని అంటుంది. కూతురుని మార్చాలని అంటుంది. ఏం చేద్దామని శంకరం అడిగితే, వైజాగ్‍లో ఉన్న శంకరం బాబాయి కొడుకు సూర్యం వాళ్ళింట్లో సుందూని ఉంచి చదివిద్దాం అని సూచిస్తుంది. ఆ సలహా బావుందని అనుకుంటాడు శంకరం. మధుని తీసుకుని పొలం గట్టు మీదకి షికారుకు వెడతాడు సిద్ధార్థ. మంచి మాటలు చెప్పి మధుని మార్చాలన్నది సిద్ధార్థ ఉద్దేశం. అభిమాన సంఘం అనే విషవలయంలో చిక్కుకుపోతున్నావని మధుని హెచ్చరిస్తాడు సిద్ధార్థ. బావనికి ఓ జడపదార్థమని హేళన చేస్తాడు మధు. సినీరంగంలోని లోటుపాట్లను వివరంగా చెప్పబోతే – క్లాసు పీకద్దంటాడు మధు. అయినా తను చెప్పదలచుకున్న మాటలు మధుకి చెప్పేస్తాడు. మధులో మార్పు వస్తే మంచిదే, రాకపోతే అతని జీవితమంతే అనుకుంటాడు సిద్ధార్థ. ఇక చదవండి.]
అధ్యాయం-17
[dropcap]సె[/dropcap]లవులు అయిపోయి కాలేజీలోకి అడుగుపెట్టింది బిందు. ఎన్నాళ్ళ నుండో ఆ పరిసరాలకి, ఆ మనుష్యులకి దూరంగా ఉన్నామా అని అనిపించింది. శకుంతల కాలేజీకి రాలేదు. ‘ఏంటయి ఉంటుంది? శకూ కాలేజీకి రాలేదు’ అని అనుకుంది బిందు. ఒక్క క్షణం కూడా కాలేజీలో ఉండబుద్ధి పుట్టలేదు. శకుంతల ఇంటికి బయలుదేరింది. శకుంతల తల్లిదండ్రులు ఆమెను సాదరంగా ఆహ్వానించారు.
“బిందూ! సెలవుల్లో ఏంటి విశేషాలు?” అడిగింది శకుంతల.
“ఏవుంటాయి విశేషాలు, అంతా రోటీనే!”
“నాకు మాత్రం అన్నీ విశేషాలే. మా సుందూ కూడా మా ఇంట్లోనే ఉండి చదువుకోడానికి వస్తోంది. మనకి మంచి కంపెనీ ఇస్తుంది.”
“సుందా!”
“అవును మా నాన్నగారి కజిన్ కూతురు సుందరి. వాళ్ళ నాన్నగారు ఆ గ్రామంలో పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుడు. అతని ఇద్దరు పిల్లల్లో మధుకి చదువబ్బలేదు. సినీ హీరోల అభిమాన సంఘం పెట్టి కార్యక్రమాల్లో తలమునకలై ఉంటాడు. ఆడపిల్ల సుందరి కూడా తెలివైనదే కాని ఆ తెలివి తేటల్ని చదువులో పెట్టకుండా ఇతర వ్యాపకాల్లో పెడ్తుంది. వ్యర్థ ప్రసంగాలు, వెకిలి చేష్టల్తో అందర్నీ ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది.”
“అదేంటి బాబూ! అలాంటి అమ్మాయి నీ మధ్యకి వస్తే నీ చదువేం గాను? విచారించడం మానేసి సంతోషంగా స్వాగతిస్తున్నావేంటి?”
“చెప్పేది పూర్తిగా విను. సుందూ బావ ఈ ఊర్లోనే ఇంజనీరింగు చదువుతున్నాడట. అతనికి సుందూ నిచ్చి పెళ్ళి చేయాలని వాళ్ళ నాన్న తాపత్రయం. చదువుకున్న భర్తకి భార్యగా సుందరి ఉండాలంటే సుందరి కూడా కాస్తో కూస్తో చదువుకున్నదై ఉండాలి కదా! ఇక్కడయితే నాతో కూడా కలిసి సుందూ చదువుతుందని ఆ తండ్రి ఆలోచన.”
“అతని ఆలోచన దేవుడెరుగు. ఏమో బాబూ! నీవు ఇరకాటంలో పడ్డావు. నీ చదువుకి అంతరాయం కలుగుతుందేమో! ఇందు కోసమా ఈ రోజు నీవు కాలేజీకి గైరుహాజరు?”
“అవును ఆ సుందూతో జాగ్రత్తగా ఉంటానులే. చదువు విషయంలో నేను పెరఫెక్టు,” అంది శకుంతల.
“ఇంతకీ ఆ సుందరి తండ్రి కేరక్టరు ఏంటే? అతను చాలా గడుసువాడిలా ఉన్నాడు.”
“అతనా? బాగానే గమనించావే. నిజంగానే అతను చాలా గడుసువాడే. పైసా ఖర్చు పెత్తే పది పైసలు వస్తాయా రావా అని ఆలోచించే మనిషి, ఆలోచించి ఖర్చు పెట్టే మనిషి, రాజకీయ నాయకుడిలాగే మాట్లాడి అందర్నీ మెస్మరిజం చేసి తన పనులు నెరవేర్చుకుంటాడు.”
“అందుకే రాజకీయ నాయకుడిగా రాణిస్తున్నాడు,” అంది బిందు.
“కూతుర్ని ఇక్కడ చదివించడంలో మరో రహస్యం ఏంటో తెలుసా? సుందూ ఇక్కడ చదువుతే మేనల్లుడుకి కూతురు దగ్గరవుతుంది. ఇద్దరూ తరచూ కలుసుకుని ఒకరి భావాలు మరొకరు తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందని.”
“ఈ ఊర్లోనే ఇంజనీరింగు చదువుతున్న శాల్తీ ఎవరు చెప్మా?”
“నాకూ తెలియదు,” అంది శకుంతల.
శకుంతల, బిందూ వీధిలో వరండాలో అడుగు పెట్టారు. “హాయ్ శకూ!” అంటూ బొద్దుగా ఉన్న అమ్మాయి పరిగెత్తుతున్నట్లు వడివడిగా అడుగులు వేసుకుంటూ గేటు తీసుకుని లోనికి అడుగు పెట్టింది. ఆ అమ్మాయే సుందరి. ఆ అమ్మాయి తోనే జరీ కండువా, తెల్లని ఖద్దరూ లాల్చీ – పంచకట్టుతో ఉన్న వ్యక్తి ఓ స్త్రీ దిగారు. వాళ్ళే సుందరి తల్లిదండ్రులు శంకరం, కాత్యాయిని. “హాయ్ సుందూ! బాగున్నావా?” అంది శకుంతల.
“నేను ఎదురుగా ఇంత లావుపాటి ఆకారంలో అగుపడ్తూ ఉంటే అలా అడుగుతావేంటి శకూ?” గలగల నవ్వుతూ అంది సుందరి.
“సుందూ! బలే జోక్‌గా మాట్లాడుతావే?” అంటూ శకుంతల కూడా నవ్వింది.
“అంకుల్, ఆంటీ మీ ఇద్దరూ బాగున్నారా? శంకరాన్ని, కాత్యాయినిని పలకరించింది శకుంతల,
“బాగానే ఉన్నామమ్మా!” వాళ్ళ సమాధానం.
“శకూ! మళ్ళీ అదే ప్రశ్నా..! పెద్ద చదువే చదువుతున్నావు గాని అలా అడగడం మాత్రం బాగులేదమ్మా!” చేతులు గాలిలోకి ఊపుతూ అంటోంది సుందరి. ఆమె అభినయానికి అక్కడికి అప్పుడే వచ్చిన సూర్యం, అతని భార్య పద్మతో సహా అందరూ గట్టిగా నవ్వుకున్నారు. అందరూ ఒకర్ని మరొకరు కుశల సమాచారాలు అడిగిన తరవాత అందరూ భోజనాలకి లేచారు.
“సూర్యం! నా కోరిక అంగీకరిస్తావని అనుకోలేదురా!” సూర్యంతో అన్నాడు శంకరం భోజనం చేస్తున్న సమయంలో.
“అదేంటి అన్నయ్యా అలా మాట్లాడుతావు? మనమేం పరాయి వాళ్ళమా?”
“అది కాదురా సూర్యం. మా సుందూ వ్యవహారమే వేరు కదా. దాన్ని ఒక్క రోజు కూడా ఎవ్వరూ భరించలేరు. వట్టి వాగుడుకాయ,” శంకరం నవ్వుతూ అన్నాడు.
“పొండి నాన్నా! మీరెప్పుడూ అలాగే అంటారు,” అలిగినట్టు బుంగమూతి పెట్టింది సుందరి.
“తమాషాకి అన్నానే అమ్మలూ!” అన్నాడు శంకరం.
మరునాడు సుందరిని ట్యూషను సెంటర్లో జాయిను చేసి ఫీజు కట్టి పుస్తకాలు కొన్నాడు శంకరం.
ఏ పనైనా కష్టమేనా, ఇష్టమైనా దాన్ని పొందాలంటే ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి, అనుకుంది సుందరి. ‘అబ్బా! ఇన్ని పుస్తకాలు చదవాలా?’ అని అనుకున్న సుందరి ‘తప్పదు బావను పెళ్ళి చేసుకోవాలంటే ఇన్ని పుస్తకాలు చదవాలి. ఇంజనీరు గారి భార్యకి చదువు రాదంటే తనకీ, బావకీ కూడా నామోషీ కదా!’ తన మనస్సుని సమాధాన పర్చుకుంది.
“అమ్మలూ! హాస్టల్‌కి వెళ్ళి బావను చూసి వస్తాను” కూతురితో అన్నాడు శంకరం.
“నాన్నా! బావను ఓ మారు ఇంటికి తీసుకురావూ?” గోముగా అడిగింది. “అలాగే అమ్మలూ!” అన్న ఆ తండ్రి – ‘నిన్ను చదువు పేరుతో ఇక్కడ ఉంచడానికి కారణం మీరిద్దరూ తరుచుగా కలుసుకుంటారనే కదా!’ అని మనస్సులో అనుకున్నాడు.
“మా సుందూకి బావంటే వల్లమాలినంత అభిమానం ప్రేమ” అన్నాడు శంకరం నవ్వుతూ. అతను అలా అని అచటి నుండి కదలిపోయాడు.
“శకూ! ఈ హిమబిందు పాత సినిమాల్లో శ్రీదేవిలా లేదూ!” అంది సుందరి శకుంతలతో.
‘దీని సినీమా పిచ్చి పాడుగానూ!’ విసుగ్గా అనుకుంది శకుంతల.
“శ్రీదేవి గారూ! బావకి నన్ను ఇచ్చి పెళ్ళి చేద్దామనుకుంటున్నారు మా వాళ్ళు, బావ ఉద్దేశం మాత్రం నాకు తెలియలేదు కాని నాకు బావంటే నాన్న చెప్పినట్టు గొప్ప ప్రేమ. అయితే నా ఈ శరీరం సన్నబడ్డానికి తిండి మానేసేను. వొంటికి రోగం పట్టుకుంది. మీలా సన్నజాజి తీగలా నాజూకుగా తయారవడానికి ఏం చేయాలో చెప్పరూ..! బావ నన్ను పల్లెటూరి అవతారమని ఇష్టపడటం లేదని నాకనిపిస్తోంది,” బిందు రెండు చేతుటూ పట్టుకుని గట్టిగా కుదిపెస్తూ అంది సుందరి.
“సుందూ.. సుందూ..! నీకు పుణ్యం ఉంటుంది, బిందూ చేతులు వదిలి వెయ్యవే! దాని చేతులు పచ్చడయిపోతాయే,” శకుంతల అంది.
“నా శరీరం చూస్తే అందరికీ పరిహాసమేనా శకూ!” చిరు కోపంతో అంది సుందరి.
“సుందూ! నాజూకుగా అవాలంటే చిరుతిళ్ళు మానెయ్యాలి. క్రొవ్వు పదార్ధాలు వాడకం తగ్గించుకోవాలి. ఎక్కువగా నడవాలి.”
“ఈ శ్రీదేవి అలా అన్నీ పాటిస్తుంది కాబోలు చాలా నాజూగ్గా అప్పుడే విచ్చుకున్న తెల్ల గులాబీలా ఉంది” సుందరి మాటలకి శకుంతల, బిందూ నవ్వుకున్నారు.
“శకూ! చూడవే! శ్రీదేవి కూడా బిందు లాగే నవ్వుతుందే.”
“సుందూ! నీకు ఈ సినిమా పిచ్చి బాగానే ఉందే,” శకుంతల అంది.
“నేనయితే సినిమాలు బాగా చూస్తానమ్మాయ్! తిండేనా మానెయ్యగలను కాని రెండు మూడు రోజులకో మారయినా సినిమాలు చూడకపోతే ఉండలేదు ఈ సుందరి.”
సుందరి అలవాట్లు ఇక్కడ మార్చుకోక తప్పదు, అని అనుకున్న శకుంతల “ఇక్కడ నీ అలవాట్లు కొన్ని మార్చుకోక తప్పదు,” అంది.
“అమ్మ బాబోయ్! నీవు చెప్పు శ్రీదేవి. ఎవరి అలవాట్లు, అభిరుచులు వాళ్ళవి కాదా! మనది ప్రజాస్వామిక దేశమా లేక బానిస దేశమా?” ఆవేశంగా అంది సుందరి.
“సుందరి అలా ఉంటుంది కాని రాజకీయాలు బుర్రని పట్టించుకున్న మనిషి” అంది బిందు.
“ఎంతేనా రాజకీయ నాయకుడి కూతుర్ని కదా!” అంది సుందరి.
అధ్యాయం-18
“అమ్మలూ, అమ్మలూ. బావ వచ్చాడు” బయట నుండి తండ్రి మాటలు వినిపించగానే ఒక్కసారి సుందరిలో హుషారు వచ్చింది.
“అందమైన బావా.. ఆవు పాలకోవా! విందుగా.. పసందుగా నా ప్రేమ నందుకోవా?”
“బావా బావా.. పన్నీరు, బావను పట్టుకు తన్నారు” చిన్నపిల్లలా ఎగిరి గెంతుతూ పాడుతోంది సుందరి.
కొంతమంది తమలో ఉన్న భావోద్వేగాల్లో ఒకటైన సంతోషాన్ని ఇలా మాటలు, పాటల ద్వారా, చేతల ద్వారా వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తారు. అదే పని చేస్తోంది సుందరి.
“సుందూ.. సుందూ..! పాటలు ఆపవే తల్లీ. మీ బావ విన్నట్టయితే నీ చేతి దెబ్బలు తినలేనని ఒకటే పరుగు తీస్తాడు,” శకుంతల నవ్వుతూ అంది. బిందు కూడా నవ్వింది. వీరి నవ్వుల్తో తనకి ఏం సంబంధం లేనట్లు బయటకు నడిచింది సుందరి.
“హాయ్ బావా! ఎన్నాళ్ళయింది నిన్ను చూసి” సిద్ధార్థ చేతులు పట్టుకుని ఊపేస్తూ అంది సుందరి.
“ఈ మధ్యనే కదా మీ ఊరు వచ్చాను,” బలవంతాన ముఖం మీద చిరునవ్వు తెచ్చుకుని చేతిని విడిపించుకుంటూ అన్నాడు సిద్ధార్థ.
“అమ్మలూ! బావ రానంటే నేనే బలవంతాన్న తీసుకు వచ్చాను. బావని పరేషాన్ చేయకే” విసుక్కున్నాడు శంకరం.
“నాన్న ఎప్పుడూ ఇంతే. బావ వచ్చాడని నేను ఇలా సంతోషపడ్డం తప్పా?” అంది బాధగా సుందరి. కూతురు ముఖంలో బాధను గమనించిన ఆ పితృ హృదయం కూడా నొచ్చుకుంది. నచ్చజేప్పే ధోరణిలో “అది కాదే అమ్మలూ! బావని లోనికి రానీ!” అనునయంగా అన్నాడు. ఆ మాటలకి కూతురి మనస్సులో తిరిగి సంతోషం చోటు చేసుకుంది.
ఆ తండ్రీ కూతుళ్ళ మాట తీరు సిద్ధార్థకి నచ్చలేదు. చేదు మాత్ర మ్రింగినట్టు ముఖం పెట్టాడు. ఈ సుందూతోనా తన పెళ్ళి. తనెంతగా జీవితంలో మోసపోతున్నాడు? తనది ఒక విధంగా భానిస బ్రతుకు అయిపోయింది. సుందూని భార్యగా ఊహించడానికే కంపరంగా ఉంది. కాలేజీలో లావుపాటి సుకుమారి తన వెంటబడ్తూ హింసిస్తూ ఉంటే ఇక్కడ ఈ సుందరి బాధ. బాధతప్త హృదయంతో ఆలోచిస్తున్నాడు సిద్ధార్థ.
“శకూ.. శకూ.. శ్రీదేవీ ఓ శ్రీదేవీ! రండర్రా! మా బావొచ్చాడు. పరిచయం చేస్తాను,” గట్టిగా అరిచినట్టు పిలుస్తోంది సుందరి.
గదిలో నుండి హాలులోకి వచ్చిన బిందు, శకుంతల ఒక్కసారి విస్మితులయ్యారు. ఏదైనా అద్భుతమైన విషయాన్ని వీక్షిస్తున్నప్పుడు సహజంగా విస్మితులవడం సహజం. అందుకే వాళ్ళిద్దరూ అలా అయిపోయారు. సిద్ధార్థ పరిస్థితి కూడా అలాగే ఉంది. “సిద్దార్థ మీరా?” ఒకేమారు అన్నారు ఇద్దరూ.
“మొదటి ఇది చెప్పండి. మీరే్ంటి ఇక్కడ?”
“ఇదే మా ఇల్లు,” అంది శకుంతల. బిందుని చూడగానే అతని హృదయం పురి విప్పిన మయూరంలా నృత్యం చేస్తోంది. క్షణ కాలం క్రితం ముఖంలో కనిపించిన అయిష్ట భావాలు మచ్చుకేనా అగుపడలేదు అతని వదనంపై.
“ఇది మా ఇల్లే సిద్దార్ధ గారూ!” తిరిగి అంది శకుంతల.
“అంటే?”
“ఈ సుందూ తండ్రికి మా నాన్నగారు కజిన్. అంటే ఈ సుందరి నాకు చెల్లెలు అవుతుంది.”
“అయితే మన మధ్య పరిచయమే కాకుండా బంధుత్వం కూడా ఉందన్న మాట” అన్నాడు సిద్ధార్థ.
“శకూ! మీ ఇద్దరికీ ఈ సిద్ధార్థ తెలుసా?” శంకరం అడిగాడు అతని అనుమానం, భయం అతనిది. మానవుడు మనః స్థితే అటువంటిది. నమ్మకం స్థానంలో అపనమ్మకం, భయం కలిగితే మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. అతని కంఠంలో విస్మయమే కాకుండా అసూయలాంటి భావం కూడా తొంగి చూసింది.
అతని మదిలో రకరకాల ఆలోచన్లు. ఈ అమ్మాయి లిద్దరూ సిద్ధార్థకి తెలుసా? వీళ్ళది ఎలాంటి పరిచయం. వీళ్ళిద్దరూ తన కూతురు కన్నా అన్ని విధాలా యోగ్యులు. వీళ్ళని చూసిన, వీళ్ళతో పరిచయం ఉన్న తన మేనల్లుడు తన కూతుర్ని పెళ్ళాడటానికి అంగీకరిస్తాడా? అనేక సందేహాలు, ఆలోచన్ల నుండి బయటపడ్డాడు.
“సిద్దార్థ మాకు సీనియర్ అంకుల్,” అంది శకుంతల,
“అలాగా!” అన్నాడు శంకరం నవ్వుతూ. అయితే తన భావాలు పైకి అగుపడనీయకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంతలో సూర్యం, పద్మా కూడా అక్కడికి వచ్చారు.
వాళ్ళకి సిద్ధార్ధని పరిచయం చేస్తూ “వీడు నా చెల్లెలు కొడుకు. మేనల్లుడు. అంతేకాదు కాబోయే అల్లుడు కూడా!” గలగల నవ్వుతూ అన్నాడు.
“నమస్తే!” అని అన్నాడు సిద్ధార్థ. వాళ్ళు కూడా స్పందించారు.
“మామయ్యా! మీ వాళ్ళకి నన్ను పరిచయం చేసిన విధానం మాత్రం బాగులేదు. నీ చెల్లెలు కొడుకుని, మేనల్లుడుని, బాగానే ఉంది కాని కాబోయే అల్లుడుగా పరిచయం చేయడం మాత్రం బాగులేదు,” అన్నాడు సిద్ధార్థ.
“సిద్ధూ! రాజకీయ నాయకుడు నయినా నన్నే మించి పోయినట్టు మాట్లాడుతున్నావురా!” గట్టిగా నవ్వుతూ అన్నాడు శంకరం. మనస్సులో మాత్రం ‘వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు. కొంపదీసి వీడు చేయి జారిపోయేటట్టు ఉన్నాడే?’ అతనిలో భయం తొంగి చూసింది.
“సిద్ధూ! ఇవాళ కాకపోయినా రేపయినా ఈ సుందూ నీ పెళ్ళామేనురా!” అన్నాడు.
‘బావేంటి ఇలా అయిష్టంగా మాట్లాడుతున్నాడు. తనంటే బావకి ఇష్టం లేదా? తనని చూసి బావ ఆనందించటం లేదు,’ సుందరి ఆలోచన్లు సుందరివి. ఆ తండ్రీ కూతురు పరిస్థితి అపనమ్మకమే.
ఇవతల బిందూ మనస్సు అస్తవ్యస్తంగా ఉంది. తన నిధిని సుందరి లాక్కుంటోందా అన్న బాధ – ఆందోళన ఆమెను ఆవహిస్తున్నాయి. సిద్ధార్థ అంటే తన మనస్సులో ప్రేమ భావం మొలకెత్తింది. ఆ భావం మొగ్గలోనే త్రుంచి వేసుకునే విపత్కర పరిస్థితి కలుగుతోంది – ఇలా ఆలోచిస్తూ బాధపడుతోంది. ఆమె బాధ ఒక్క శకుంతలకి తప్ప ఎవ్వరికీ తెలియదు.
ప్రేమ ఉన్న దగ్గర అనురాగం, ఆప్యాయతలు ఉంటాయి. ఆరాధన కూడా ఉంటుంది. తను అభిమానించే వ్యక్తి తనకి దక్కడు అన్న అపనమ్మకం కలిగిననాడు తప్పకుండా ప్రేమికుడికి అయినా, ప్రియురాలికైనా బాధ ఉండడం సహజం ఇలా అనుకుంటుంది శకుంతల.
“పద్మా! ఈ సుందూ వెర్రి బాగుల పిల్ల. దీన్ని నీ కూతురిలా చూసుకోవాలి. అది ఏదేనా తప్పు చేస్తే తల్లి మనస్సుతో క్షమించు.” వెళ్తున్న సమయంలో కాత్యాయిని కన్నీళ్ళు పెట్టుకుంటూ అంది.
“అదేంటి అక్కా! అలా అంటావు? నాకు సుందూ, శకూ ఇద్దరూ సమానమే,” అంది పద్మ.
“నాకు తెలుసు పద్మా! నీది చాలామంచి మనస్సు అని. విశాల హృదయం అని అయితే బాధ కొద్దీ అలా అన్నాను. మరోలా అనుకోవద్దమ్మా!” తిరిగి అంది కాత్యాయిని.
“నిశ్చితంగా వెళ్ళండి. ఎటువంటి భయాలు, ఆందోళనలు మనస్సులో పెట్టుకోకండి,” తిరిగి పద్మ అంది.
కాత్యాయిని ఏ విధంగా అందో అవే మాటలు సూర్యంతో అన్నాడు శంకరం. పద్మ ఏ మాటలు అయితే చెప్పిందో అవే మాటలు సూర్యం శంకరంతో అన్నాడు.
“అన్నయ్యా! మీ మనస్సులో సందేహాలు తొలగించుకుని, వెళ్ళిరండి” అన్నాడు సూర్యం. తమ్ముడు దగ్గర సుందరిని వదిలి, శంకరం, కాత్యాయిని గ్రామానికి బయలుదేరారు.
(ఇంకా ఉంది)