[శ్రీమతి వి. నాగజ్యోతి రచించిన ‘సమాంతరాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఒ[/dropcap]కరి మనసొకరు తెలుసుకోరు
అహంభావాన్ని వదలరు
త్యాగానికి సర్దుబాటుకు
సరైన భేదం తెలుసుకోక
తమ జీవిత త్యాగం
విఫలమైందని వాపోతారు
మా గురించి తెలియకనే
ఉపమానంగా మమ్ము చూపుతారు
ఒకే ధ్యేయంగా ప్రయాణిస్తూ
ఎందరినో గమ్యానికి చేరుస్తూ
మధ్య మధ్య మేమొకరికొకరం
చేరువౌతూ మళ్ళీ దూరమౌతూ
వేరొకరి తోడుతో
నిరంతరం సమాంతరంగా
ప్రయాణం సాగిస్తే,
ఏ కోణంలో చూస్తారో మరి
ఆ భగ్న ప్రేమికులు,
ఆ కవి వరేణ్యులు,
కళ్ళ ముందు కనిపించినా కాంచని
మహానుభావులెందరో
వారి కలం మమ్మేనాడు కలపలే
అయినా మా జంట
పిన్నలకూ పెద్దలకూ కన్నుల పంటే
మమ్ము చూడగానే వారి కళ్ళలో
ఆనందం పెల్లుబుకుతుంది.
మాపై నడిచే భారమైన బండిపై
ఎందరెందర్నో మోస్తూ
తమ తమ వాళ్ళతో కలిపితే
వారు మాకిచ్చిన బిరుదు
ఎన్నటికీ కలవని రైలు పట్టాలమని.