సమకాలీనం-1

2
2

[సమాజంలో సమస్యలని ఛందోబద్ధంగా, పద్యాల రూపంలో చర్చించాలనే ఆలోచనతో ప్రముఖ రచయిత, కవి శ్రీ పాణ్యం దత్తశర్మ గారు అందిస్తున్న పద్యకావ్యం.]

[dropcap]ఈ[/dropcap] పద్యకావ్యములో పరిగ్రహించిన సమకాలీన సామాజిక సమస్యలు – సూచిత పరిష్కారాలు

  1. పురుషాధిక్యత – స్త్రీల సమస్యలు
  2. పర్యావరణ సమస్యలు
  3. సామాజిక మాధ్యమాలు – సెల్‍ఫోన్ వ్యసనం
  4. పిల్లలపై లైంగిక హింస
  5. పెద్ద పెద్ద విగ్రహాల ప్రతిష్ఠాపన
  6. వృద్ధుల సమస్యలు
  7. ఎన్నికలు – ‘నోటా’
  8. రైతులు వారి కష్టాలు
  9. ఉద్యోగం – ఉపాధి
  10. కులవివక్ష
  11. మేధావుల వలస
  12. వి.ఐ.పి. దర్శనాలు – భక్తుల సమస్యలు
  13. లౌకిక వాదం, మతతత్త్వం
  14. ఆడపని – మగపని (శ్రమ విభజన)
  15. వినిమయవాదం యువత (కన్స్యూమరిజం)
  16. వైధవ్యం – వివక్ష
  17. అపరకర్మలు – తద్దినాలు – వ్యాపారీకరణ
  18. కార్పొరేట్ విద్య – ప్రభుత్వ విద్య
  19. వైద్యం – సామాన్యునికి పూజ్యం
  20. దోపిడీ – ఎవరి పరిధిలో వారు
  21. ఆడంబర వివాహాలు
  22. ఉచితాలు అనుచితాలు – ఉత్పాదకత

***

ఇష్టదేవతాస్తుతి

ఉ॥
మ్రొక్కెద విఘ్ననాథునికి మోచన చేయుమటంచునడ్డముల్
అక్కున జేరి పార్వతికి, నా పరమేశ్వరు ముద్దు తీర్చుచున్
నిక్కమునైన తత్త్వమును నేర్పెడు వేల్పుకు, దంతి, దాంతుకున్
మిక్కిలివైన మానవుల మేటి సమస్యల తీర్చికావగన్
~
కం॥
సంగీతము సాహిత్యము
అంగంగాములందు నిండి యఖిలజ్ఞానం
బంగన రూపము దాల్చిన
బంగారపుతల్లి వాణి బ్రస్తుతి జేతున్
~
సీ॥
శ్రీమదహోబిల శిఖరాన నెలవొంది
భక్తకోటిగాంచు భవ్యకాంతి
యాదగిరీశుడై యస్తోక తేజంబు
వెలయించు దేవుండు వేదనుతుడు
సింహాచలములోన చిత్యమౌవారాహ
చందన రూపుడౌ శాశ్వతుండు
మంగళగిరిపైన మహిమల జూపెడు
పానకాల ప్రభువు పద్మనాభు

తే.గీ.॥
లచ్చిగూడిన నరసింహు రామచంద్రు
బాల ప్రహ్లాద వరదు శ్రీ పాదములకును
మ్రొక్కి జిక్కుదు పరమైన మోదమందు
కావ్య రచనను వెన్నంటి కావ; విభుని
~

అవతారిక

కం॥
సమదర్శన యోగంబది
సమరసభావంబు బెంచి సంఘము గాచున్
సామాజిక కష్టంబులు
సమకాలీనములు వాని సాధించతగున్

చం॥
మనుషుల స్వార్థముల్ మహితమైన విశృంఖల చిత్తవృత్తు, లే
మనినను నోర్చుకోని యొక మానసిక స్థితియన్, యహంకృతుల్
మనదగు మేలు మాత్రమును మంచిగనెంచి, జనంబుమంచికై
మనపరిధిన్ కనీసము విమర్శ యొనర్చని కుంచితార్ధమున్

కం॥
ఈ గుణములు మానవులను
సాగిలపడజేయు జటిల సర్వసమస్యా
రాగాళి యెదుట, వీనిని
వీగుచు, లోకంపు హితము వెలిగించతగున్

***

కావ్య ప్రారంభము:

1. పురుషాధిక్యత స్త్రీల సమస్యలు

తే.గీ.॥
ఆది నుండియు పురుషుడె యధికుడంచు
అతివ నన్నింట త్రొక్కుచు బ్రీతినొందు
మగమహారాజులందరు సగము చావ
వెలుగుచుండెనవ మహిళ వివిధగతులు

మ॥
తగ కండక్టరు నుండి పైలటుగ బల్ ధ్యానశ్రమా బాధ్యతల్
మగవారందరు నీసు జెందగ విధిన్ పండించు భామామణుల్
సిగలోపువ్వులు భారతమ్మకు; మదిన్ చెన్నొందు శక్తిన్, సదా
రగిలే స్ఫూర్తికి పట్టుగొమ్మలు; భళా! లాలిత్య గంభీరులే!

కం॥
గతమును త్రవ్విన తెలియును
సతతము వారెటుల పురుష సన్నిధి మిగులన్
అతిదీనత కృశియించిరొ
నతమస్తకులైచరించి నానావిధిగన్

తే.గీ.॥
స్త్రీకి స్వాతంత్ర్యమర్హంబె? స్త్రీల బుద్ధి
సతత ప్రళయాంతకంబని శాస్త్రములను
మిగుల ఘోషించి వారిని జగమునందు
అబలలను ముద్రవేసిరి అతి వివక్ష

కం॥
మెరుగైన సగమటంచును
నెఱవొగిడెను తెల్లవాడు; నిచ్చలు తనదౌ
వరమగు సగమని శివుడును
మరిమెచ్చెను; కాని నిజము మహినదికాదే?

చం॥
అనెదరు మాతరంభయని యన్నము, ప్రక్క నమర్చు వేళలన్
వినుతిగ మంత్రియంద్రు, వినువీధిన నిల్పి హితైషియామెగాన్
మనమున భేద భావమణు మాత్రము గల్గినజాలు, వెంటనే
పనులకు దాసి యౌను, క్షమమందున మేదిని యౌన దేమియో?

సీ॥
కళలలో రాణింప గడు యీర్ష్య మగనికి
పదవిలో రాణింప పతికి భయము
కార్యాలయములోన కావించు పనులను
సామర్థ్యమును జూపసైపలేరు
శాసనసభలలో సరిభాగమివ్వంగ
దొరతనమునకును తీరుకాదు
వ్యాపార రంగాన వారి నేర్పును జూచి
మగవారి కండ్లలో మంటలెగయు

తే.గీ.॥
ముదిత నేర్వని విద్యలే భువిని గలవె
అమిత ప్రేమను నేర్పింప నతివకెపుడు
కాని సూక్ష్మంబు నరసిన గలుగు యెఱుక
వనిత కేవలమొక గుమ్మ వట్టి బొమ్మ

కం॥
చదువును నుద్యోగంబును
పదిలముగా తండ్రియాస్తి భాగము, సభలన్
కుదిరిన నేబది శాతము
ముదితల తలరాత మార్చి ముదమును గూర్చున్

తే.గీ.॥
“ఎచట మహిళలు పూజల నెన్నిగానిన
నచట దేవతలుందురు” యనెడి మాట
వినుచు “పూజలు మాకేల విశ్వమందు
గౌరవము చాలు” యని బల్కు నారినగుచు

తే.గీ.॥
లైంగికంబైన హింసను రాటుదేలి
పాలబుగ్గల పసిదైన వగ్గు ముసలి
ఆడదైనను చాలు కామాసురులకు
వారికురిశిక్ష తగినట్టి వైనమగును

2. పర్యావరణ సమస్యలు

కం॥
తరువే తెరువది బ్రతుకుకు
మరి దానిని కొట్టివేసి మరుభూమిగనీ
ధరమార్చిన మనుగడ యెటు?
అరయుడు జనులార! ఇంగితంబది లేదే?

శా॥
భూతాపంబది వందరెట్లగుచు తా భూగోళమేమండగా
పాతాళంబున భూమి గర్భజలముల్ పారాడె తామెక్కడో
నూతుల్ చెర్వులు యేర్లు యెండి తెరిచెన్ నోళ్లన్ జలాభావమై
యాతాయాతములైన వర్షములహో! ఆయెన్ గదా పూజ్యముల్

కం॥
ఋతు ధర్మంబులు దప్పగ
నతివృష్టియు వరదలెపుడు యవనిని కలచున్
గతియే జలముకు జలధియె?
మతి దానిని పట్టియుంచ మనిషికి తరమే!

ఉ॥
మొక్కలు నాటునుత్సవము మొక్కుబడే కదనాయకాళికిన్
చక్కగ ఛాయ చిత్రము పసందుగ తీయుచు,, ఫేసుబుక్కునన్
మక్కువ తోడ బెట్టెదరు, మానుచు పోషణ, దీనినందురే
అక్కరతో వనోత్సవము? అట్టిది వ్యర్థ ప్రచార దుగ్ధయే!

తే.గీ.॥
చెట్టునుగాచిన గాచును
గట్టిగ మనమను గడనుచు గదిమిరి ప్రాజ్ఞుల్
ఇట్టి విధంబున చెట్లను
పట్టున నరకంగ క్రుంగు ప్రకృతి మిగులన్

మ॥
సమతౌల్యంబను దృక్పథంబు జనియెన్ సారించె దృష్టిన్ సదా
క్రమమౌ స్వీయ వినాశమందు, చెరువుల్ కావించెనావాసముల్
క్షమతో ధాత్రి సహించి నిల్వ, ఘనమౌ కాలుష్యపున్ కోరలన్
సమయింపంగ జనాళి పూనికొనియెన్ స్వార్థంబె లక్ష్యంబుగాన్

ఉ॥
నీటిని డబ్బు పెట్టికొను నీచపు సంస్కృతి దాపురించె, నా
నాటికి నీటి లబ్ధియును, నచ్చిన చల్లని గాలియున్, ప్రజా
కూటమి కోలుపోయె, ప్రతికూలపు గాలలు వీచుచుండగా
నోటమినొందె మానవుడు ఓపికలేక కృశించె నక్కటా!

తే.గీ.॥
గాలికరువయి జనులెల్ల గాసిలగను
ముక్కు గొట్టంబు నొకదాని మొక్కవోని
ప్రాణవాయు ప్రసారంబు పట్టి నిలుప
పెట్టి తిరిగెడు కాలము లిట్టెవచ్చె

కం॥
హైవేలు రింగురోడ్లని
యేవో అభివృద్ధి పనులు నెంతయు జేయన్
కావే యవి వ్యర్థంబులు
లేవనమరి గాలి, నీరు? లేమియె మేలే?

ఉ॥
ముందుగ నూహ చేసి మనముందు తరమ్ములు రావివేముకున్
పొందుగ పెండ్లి చేసి తగపూజలు సేయగ నాగదేవతన్
ముందున నిల్పినారు; మతమొప్పెను చెట్లకు రక్షగాధరన్
అందుకు వారు ధన్యులు చిరంతనమైన సుదూర దృష్టిచే

సీ॥
చెన్నయి నగరాన చెన్నొందు వటమది
చిరకాలమున నుండి వరలుచుండు
తిమ్మమ్మ మర్రి తానమ్మగా నిలుచుచు
రాయలసీమలో రాజిగాంచు
మానులలో తలమానిక మైనట్టి
మహబూబునగరాన మహితవటము
యిటువంటి పెనుచెట్లు ఇలనుగాచుచునుండు
జాతి సంపదలయి శాశ్వతముగ

తే.గీ.॥
తనరు రామయ్య వనజీవి త్యాగధనుడు
వనములను గాచి భూమికి ప్రాణమొసగె
పథము జూపెడివాడెపో భావిగురుడు
వనము వృద్ధిని పొందగ వసుధ మురియు

కం॥
జగతికి వరమది తరువే
తగ తెరువును జూపు ప్రాణధారులకెపుడున్
జగమున తరువుల లేమిన్
అగణిత మగు సర్వనాశమది తధ్యమగున్

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here