సమకాలీనం-2

0
2

[సమాజంలో సమస్యలని ఛందోబద్ధంగా, పద్యాల రూపంలో చర్చించాలనే ఆలోచనతో ప్రముఖ రచయిత, కవి శ్రీ పాణ్యం దత్తశర్మ గారు అందిస్తున్న పద్యకావ్యం.]

3. సామాజిక మాధ్యమాలు; సెల్‌ఫోన్ వ్యసనం

కం॥
పుట్టిన పిల్లలు ఫోనును
పట్టుచు ఫీచరులనన్ని పరిశీలనతోన్
ఇట్టె వశంబును చేయగ
దిట్టపు బాల్యంబుజచ్చె ధీహీనతతోన్

సీ॥
కంటి జబ్బులువచ్చె చంటిపిల్లలకును
చురుకు తనము బాసిసుక్కుచుంద్రు
ఆటల యాసక్తి అణుమాత్రమును లేక
స్థూలకాయము లొచ్చి సుఖము లేక
అమ్మయు, నాన్నయు ననిశంబు ఫోనుతో
సహజీవనము జేసి సంతసింప
పిల్లల పోషణ, ప్రేమయు ముచ్చట
అంతరించగ వారి చెంత లేక

తే.గీ.॥
నిండు పరివారబంధముల్ నిలిచిపోవ
లుప్తవవ్వగ, నేకాకులో యనంగ
తావివీడిన నిస్సార జీవితాన
మనెడు శవముల బోలిక మసలు చుంద్రు

కం॥
సతతము రాక్షస క్రీడా
రతులై, సెల్‌ఫోనునాడి, రక్తిగచూడన్
అతిపాశవికాత్మక
మతులై మన యువత బాయు మానవస్ఫూర్తిన్

ఉ॥
చూచుచు ‘పోర్ను’ దృశ్యముల సుంతయు సిగ్గును లేక ఫోనులో
కాచిన యవ్వనంబునవికారత శీలము గోలుపోవుచున్
నీచపు వీడియోలను పనేయదిగా నిడి, మైథున క్రియల్
దాచుచు, డబ్బునివ్వమని దారుణ ‘బ్లాకుమెయిల్’ యొనర్చుచున్

కం॥
అష్టమ వ్యసనము లేదను
కష్టము లేకుండ ఫోను గడుబానిసలై
స్పష్టము పతనముగావగ
నష్టమె తన మనుగడెపుడు నరజాతులకున్

తే.గీ.॥
ఫేసుబుక్కున కపటపు ప్రేమజూపి
ఆడవారిని వలవేసి అదిమిపట్టి
మాయమాటల ధనమునే మార్చి గుంజి
నిస్సహాయుల జేతురు నీచగతిని

సుగంధి॥
‘స్వీయచిత్రప్రాప్తి’ సెల్ఫి వింతమోజుగాదొకో?
తీయు చోట కీడుపొంచి తిష్టవేసి యుండినన్
మాయదారి చావు వారి ప్రాణముల్ హరించగా
చేయరే తమంత తాము చేటు దెచ్చు చేతలన్

మ॥
ఘనమౌ ‘వాట్సపు’ మాధ్యమంబు జనమున్ గావించి తాబానిసన్
తన గ్రూపున్, పెర గ్రూపటంచు సతమున్ తాజేయు ‘ఫార్వర్డు’లన్
తన సొంతంబొక పోస్టులేక ‘శుభముల్’, ‘ధన్యోస్మి’ ‘సంతాపముల్’
పని పాటన్నది లేక పంపుచు మహా పాశాహి సందష్టులై.

ఉ॥
ఛానెలులన్ని వార్తల బ్రసారము జేయును, నమ్మతగ్గవే
కానగలేము, ఏలికల కట్టి విధేయులు దూరదర్శనుల్
మానుచు వృత్తినైతికత మాపుదురే నిజమైన వార్తలన్
ఆనతినిచ్చు పాలకుల కమ్ముడువోదురు శీలహీనులై

కం॥
కూరలు తరిగెడు కత్తియె
తరుగును కుత్తుకలు గూడ తగుమాత్రముగన్
చేరిన సంఘపు మాధ్యమ
ఝరిలో, మనయునికిగాచు, జాగృతమగుచున్

4. పిల్లలపై లైంగిక హింస

తే.గీ.॥
చిట్టి పాపలమేనులు పట్టితడిమి
దుష్ట పైశాచికానంద ధూర్తులగుచు
మనుజ రూపానవర్తించు మగమృగాలు
అట్టివారికి తగు శిక్ష యంగ ఛిత్తి

ఉ॥
లైంగిక హింస కేసులను లజ్జయుసిగ్గునులేక కోర్టులన్
పొంగుచు నిందితుల్ నిలువ, పోడిమి వాదన జేయు దుర్మతుల్
అంగడిలోన న్యాయమును అమ్మెడి నీచులు, చిట్టిపాపలన్
సంగతివీడి, చట్టములు సాగును నత్తలవోలె మెల్లగా

కం॥
అమ్మా! నిను నీవే ఇక
లెమ్మా, రక్షించుకొనగ రేయును బవలున్
కొమ్మా యిటు పెప్పరు స్ప్రే
తెమ్మా నిందితులలోన ధీరతచావన్

కం॥
యుద్ధపు విద్యలనేర్పుచు
నౌద్ధత్యము చూపునట్టి యవసరమిదియే
క్రుద్ధత మగరాక్షసులను
పద్ధతిగా మట్టుచెట్టు ప్రళయాత్మికవై

చం॥
తరతమ భేదభావములు తప్పక నేర్పెదమమ్మ, తల్లిరో!
పురుషుడు నిన్ను తాకినను పూనిక నీవు గ్రహించునట్లుగన్
గురువులు తల్లిదండ్రులును కూరిమి శిక్షణ నివ్వగా వలెన్
మరిమరి బోధ చేసి, యను మానముగల్గిన తోసివేయగన్

సీ॥
పురుష వరాహంబు ఫూత్కారమొనరించి
చిట్టి తల్లులపైన చేయివేయ
మహితమౌ మనసంఘ మాధ్యమంబది నిల్చి
ఒక గొంతు నినదించి సకలముగను
ఫేస్బుక్కు వాట్సాపు భీతియేమియు లేక
నిరసనపోస్టులన్ నింపివేయ
నిందితులన్ కడు నిండ భయమది తాము
చంటిపాపల తాక జంకుబుట్టు

తే.గీ॥
బాధితా క్రందనార్తలౌ బాలికలను
సొంతపాపల పోలిక నంతులేని
ఉద్యమంబులు నడిపించి ఊరడించి
న్యాయమును పొందగా జేయు నదియె స్ఫూర్తి

కం॥
దిశచట్టము, ‘షీ’ టీములు
వశమునుగావించు న్యాయమందించిన, నీ
దేశము మొత్తము క్షేమము
నాశించును నీకు తల్లి! హాయిగమనుమా!

చం॥
పొరుగున నుండునంకులును పూనిక జూపును నిన్ను తాకగన్
అరమరలేక టీచరని యాతని యక్కున చేరబోకుమా!
పురుషుడు వాడు; నిన్ను కొనిపోయెడివాడును స్కూలు బస్సులో
నిరతము నిన్ను దోచుకొను నేర్పును జూపును నమ్మరాదికన్

తే.గీ.॥
బాలికారక్షణంబది ప్రభుత విధియు
మనకు కర్తవ్యమంచును మదిని తెలిసి
అందరొకటిగ గూడుచు నాడపిల్ల
గాచుకోవలె పురుషోగ్ర కాననమున

5. పెద్ద పెద్ద విగ్రహాల ప్రతిష్ఠాపన

చం॥
ఒక మహితాత్ముడీధరను నుద్భవమంది, మహత్త్వబోధనల్
సకల ప్రపంచ మానవులు శాశ్వత జ్ఞానము నొంద జేయగాన్
రకరకమైన విగ్రహములాయనకున్ తగగట్టి, నిల్పుచున్
వికసితబుద్ధిహీనులయి వీడరెయాతని తత్త్వసంపదన్

కం॥
శిరసున వజ్ర కిరీటము
వరసింహసన పీఠి తనకు భక్తులమర్పన్
వైరాగ్యపులోతులనే
నరులకు బోధించు సాయినాథుడు నవ్వున్

తే.గీ॥
సర్వసత్తాక గణ తంత్ర సార్వభౌమ
భారతావని నిర్మించె వల్లభాయి
అతని బొమ్మను నింగిలో నంత యెత్తు
కోట్ల ధనమును వెచ్చించి కూర్చనేల?

సుగంధి॥
మించువేడ్క రూపుగట్టి మేటి విగ్రహంబులన్
పెంచి యెత్తు మిన్నునంట పేరుగాంచనేలొకో?
పంచవచ్చు పేదవారి బాధ దీర్పనాధనం
బించుకైన సంతసింత్రు బీదవారలెల్లరున్

శా॥
బాబాసాహెబుకై యమోఘ ప్రతిమన్ పాలించు సర్కారులే
శబాసుల్ మరి కోరి నిల్ప జనముల్ సాశ్చర్య విభ్రాంతులై
శోభేయియ్యది యంచు బల్క మదిలో, శోధించి మేధావులున్
ఆభీమ్రావటు మామనస్సులను తాహాయిన్ ప్రకాశింపదే!

కం॥
సమతాస్ఫూర్తిని తనదౌ
సుమహిత మత దీప్తి నిలిపి శోధించిన యా
రామానుజులకు విగ్రహ
మేమాత్రము? దానికింత మిక్కిలి తగునే?

ఆ.వె.॥
విగ్రహంబులనెలకొల్పు వెర్రిమాని
ఆ ధనంబున పేదల నాదుకొనుడు
వారు జనములగుండెనున్నారు సతము
అంత ఎత్తున బొమ్మలైనంత సరియె?

ఉ॥
ఎండకు నెండి, వానలకు నెంతయు నానుచు, పక్షి రెట్టలన్
మెండుగ మీద దాల్చుచును, మీరు నిరాదరణంబు సేయ, నీ
దండగమారి విగ్రహ విధానము మాకదియేల? యంచు, మా
కండగ గుండె నిండు జనగమ్యులు బల్కరె? మీరు మారరే?

ఉ॥
బొమ్మలు కాదు ముఖ్యమటు బోధలె ముఖ్యము కాని, మీరటుల్
నమ్మిన వారితత్త్వమును నైష్టికతన్ తగనాచరించుచున్
నెమ్మనమందు నిల్పుకొని నిత్యము నా మహహనీయ బోధనల్
సమ్మతితో గ్రహించి మన సంఘపు బాగను కాంతినింపరే

తే.గీ.॥
ఎంత ఎత్తైన విగ్రహంమంత గొప్ప!
సుంత సువివేకమది మీకు స్ఫూర్తినిచ్చు
పరగ పర్యాటకంబును బాగుచేయ
ఘనుల బొమ్మలు కావలెననుట సరియె

కం॥
ప్రతిమలు ఏకాగ్రతకున్
శృతమార్గములంతె కాని, శోధించగ నా
హిత తత్త్వమె పరమార్థము
అతి యెప్పుడు వర్ణనీయమదె యెఱుక గదా!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here