[సమాజంలో సమస్యలని ఛందోబద్ధంగా, పద్యాల రూపంలో చర్చించాలనే ఆలోచనతో ప్రముఖ రచయిత, కవి శ్రీ పాణ్యం దత్తశర్మ గారు అందిస్తున్న పద్యకావ్యం.]
6. వృద్ధుల సమస్యలు
కం॥
వృద్ధాప్యము సహజంబది
సిద్ధము మరణంబు, కాని, చింతించతగున్
పద్ధతిగా జీవించుచు
నిద్ధర మనపేరు నిలువ నిత్యముకాగన్
చం॥
మరణము పొంచి ఉన్నదని మానగరాదు త్వదీయ కృత్యముల్
చిరముగ నీదు సేవలను చేకుర జేసి సమాజ శ్రేయమున్
విరళముగా రచింపుచు పవిత్ర విశిష్ట సజీవరేఖలన్
తరయుము జన్మ సంద్రమును తాత్త్విక చింతన తోడనిత్యమున్
తే.గీ.॥
వయసు తనువుకు మాత్రమే, మనసుకెపుడు
నిత్యయవ్వన భాగ్యంబు నిచ్చెధాత
నూతనోత్సాహమున వృద్ధ తతి మరింత
ఊపు నివ్వగ జాలును ఉర్వికెపుడు
ఉ॥
పిల్లలపెంచి, వారికటు విద్యల గూరిచి, పెండ్లి చేసి, నీ
యుల్లము సంతసింప గిటు నుండిన చాలును. వారు నిన్ను తా
మొల్లక పోషణంబునకు మోక్షము నిచ్చిన వారి ఖర్మయే!
కల్లయె బాంధవంబు, సరికాదు మనోవ్యధ, సత్యమియ్యదే
సీ॥
నీదైన ప్రత్యేక నేర్పు తానొకటుండు
దానిని వదలక పనిని చేసి
నీకనుచు ప్రత్యేక నిజగౌరవంబది
తప్పక నీకటు యొప్పియుండు
నీవైన బంధాల నీవు పాటించుచు
బంధనాతీతమౌ భవ్యదృష్టి
ఆధ్యాత్మికంబైన యపురూప దృక్పథ
మవనియంతయు నీదె యనెడు తత్త్వ
తే.గీ.॥
దివ్య సంపదనిచ్చును తీరువెతయు
తామరాకును తనదైన తడిని వదల
కెట్లు నీరము బిందువై ఇలను జారు
ఇట్లు పొందుము బంధనా తీతపథము
కం॥
భారత సంస్కృతి పెరయగు
వరలెడు వృద్ధావ్రమములు బ్రతుకులుమారెన్
మారెను పిల్లల మనములు
మారుట తథ్యంబు ముసలివారలకైనన్
తే.గీ॥
ఆత్మగౌరవ మదిలేక యనువు కాదు
నిలువకూడదు మరియొక్క నిముసమైన
పృథ్వివిపులంబు మనకెంత పొట్టగడువ?
ప్రేమచూపని పిల్లల వీడవలయు
శా॥
రాజీధోరణి కొంత కావలయు నీ రాగాలలోకంబునన్
మాజీలన్ మరి లెక్కచేయరు కదా పాలించి పోషించగన్
ఈ జీవన్మృతి కంటె మేలు కుహనా ప్రేమల్ మదిన్ నిల్చునే?
రాజీ వాక్షు పదంబు జేరుటయె; పేరాశల్ పుత్రప్రేమల్ దయల్
ఉ॥
పెన్షను భారమయ్యె మన పెద్ద ప్రభుత్వ విధానమందు, బల్
టెన్షను నిండె వృద్ధులకు, ఢీకొన జాలరు యేలువారలన్
మ్యాన్షను లొద్దు మాకు ప్రతిమాసము పింఛను చాలు దేవరా!
మెన్షను చేయలేనివెత, మీకది యర్థముకాదదెన్నడున్
ఆ.వె.॥
మనసు తనువు నెపుడు తన వ్యాపకంబును
వీడకెపుడు, కొంత నడక తోడ
మితపు భోజనంబు నతిగనాలోచించ
కుండ నుండుటయును కోరతగును
7. ఎన్నికలు – నోటా
కం॥
నోటాయను నొక యాయుధ
మోటరు చేతికిలభించె మోమాటముతోన్
చేటును దెచ్చెడి వారికి
ఓటును వేయకను వారి నోడించుటకున్
ఉ॥
బ్యాలటు పత్రమందు నొక బారుగనుండెడు పేర్ల, గుర్తులన్
వీలుగ చూసి, యెల్లరిని వీడుచు, పైనిటునున్న వారిలోన్
చాలరునాకు యెవ్వరని, చక్కగ ‘నోట’కు ఓటు గుద్దినన్
మేలగు దేశమాతకు సమీప భవిష్యము దానిదే సుమా!
ఆ.వె.॥
ఎవరు నచ్చనపుడు ఏమైన చేయగ
మనకు ముందులేదు మంచియదను
ఉన్నరాళ్లలోన చిన్నరాయిని తీసి
తలను మోదుకొనగ వలసి వచ్చె
కం॥
కానీ, ఇప్పుడు నోటా
తానే యభ్యర్థియగుచు ధాటిగానిలిచెన్
తనకెవరు నచ్చలేదని
మన ఓటరు నేడు తెలుపు మారిన విధమున్
కం॥
విసిగిన ప్రజలటు ‘నోట’కు
పొసగి, మోజారిటిని గూర్చి పోడిమి జూపన్
అసలుకే మోసము వచ్చిన
దిసమొలలగు నాయకాళి దిగ్భ్రాంతులుగాన్
ఉ॥
అప్పుడు ఏమి చేయవలె? నందరునోడగ, రాష్ట్రపాలుడే
చొప్పడి శాస్త్రవేత్తలను, శోభగ మంచి కళానురక్తులన్
నప్పిన పండితోత్తముల, నమ్మకమైన మహాధికారులన్
చప్పున పిల్చి, ఏర్పడగ సాధ్యము చేయతగున్ ప్రభుత్వమున్
పంచచామరము॥
ప్రజా ప్రభుత్వమేర్పడంగ పౌరులెల్లనొక్కటై
సజావు నేతలన్ కునీతి స్వార్థ హీనులన్ సదా
అజాగళస్తనంబుగాని ఆత్మశుద్ధివర్యులన్
భజించి తేల్చి పంపవారు భావినేతలైచనన్
కం॥
ప్రతిశాఖకు నారంగము
నతినిష్ణాతుండె సచివు; డాతనిపైనన్
సతతము పెత్తనమేమియు
మతి చేసెడు నొక ప్రధానమంత్రియెలేడే!
తే.గీ.॥
పరగు యవినీతి యనువైన బంధుప్రీతి
వారసత్వపు జాడ్యము వక్రబుద్ధి
అలస నిర్లక్ష్య దృక్పథమంతులేని
ఆధిపత్యపు దాహంబు లంతరించు
కం॥
‘నోటా’కే మన ఓటని
వాటముగా దేశ ప్రజలు వచియించుచు, తా
మోటమి యెరుగని ఎన్నిక
దీటుగ గెలిపించుకొంద్రు దీపితమతులై
8. రైతులు, వారి కష్టాలు
కం॥
రైతే రాజనుమాటది
రాతయెగద నీటి మీద రైతులవెతలే
ఈతరి మనమును కలుచును
రైతన్నను బ్రోచు ప్రభుత రానేరాదా?
సీ॥
విత్తనంబులు జూడ విరివిగా కల్తీవి
పురుగుమందులు సైతమోడె యవియు
పురుగుల చంపక పూని రైతులచంపు
ఆత్మహత్యలకెంతొ యనువుగాను
అమ్మబోతె యడివి అటుకొన కొరివిగ
ధరలు నింగినినంటి ధాటి జూపు
మద్దతు ధరలను భ్రమజూపి రైతుల
దోచుచుండిరి వారి దుఃఖమకట!
తే.గీ॥
తీరునన్నట్టి యాశలు తీరె, వారు
పంటనారంగ బెట్టగ పడునువాన
తడిసిపోయిన యాపంట దాముగొనగ
మిగుల యగ్గువ ధరయెప్రాప్తించుచివర
ఉ॥
ఆరగబెట్ట ధాన్యమును నచ్చట షెడ్లను వేయలేరొకో?
చేరగ పంట చింతవిడి శీతల రక్షణ శాలలందు, నే
మారగ వీలులేని యొక మార్కెటు సుస్థిథి నివ్వజాలినన్
తీరవె రైతు కష్టములదేమి బృహత్తరయత్నసాధ్యమా?
తే.గీ.॥
జగతి నుత్పత్తిదారుడు తగినధరను
తాను నుత్పత్తి చేసిన దాని కడుగు
అట్టిహక్కులు రైతను కలవిగాదె
నిత్యపరతంత్రమతనికి నింపు యిడుము
తే.గీ.॥
తగటమోటను పండించి దానినమ్మ
బోయినప్పుడు ధరజూడ పుట్టిముంచు
దారి ఖర్చులకేనియు దొరకకపుడు
బాటమీదనె పోయుదు రటుల, నిజము!
శా॥
వందేభారతురైళ్లు, వంతెనలుబల్వాటంపుదారులన్
అందం బొప్పెడు పెద్ద బొమ్మలు సదాయాకాశహర్మ్యాలు, మీ
ముందే రూపును దిద్దుకోగవగచే మూర్తీభవద్ధెన్యులన్
సందేహింపక రైతుమిత్రులకు మీసాయంబునందించరే!
కం॥
టోకున కొను వ్యాపారులు
తేకువ చిల్లరగనమ్ము తెలివగువారల్
నీకంటె మెరుగు, కర్షక!
సాకెడు నీ చేయి విరువ సర్వులు ఘనులే!
సీ॥
మంచి విత్తనములనెంచి రైతులకిచ్చు
బాధ్యత సరకారువారిదగును
సహజ సేంద్రియమైన చక్కని ఎరువుల
సమకూర్చుకొనుటకు సాయమిచ్చి
పురుగు మందుల నాణ్యమును జూచి బాగుగ
కల్తీ వణుజుల కట్టడించి
ఎంత పండిన పంట చింత లేదను రీతి
ధర నిర్ణయించెడు తగిన హక్కు
తే.గీ.॥
పంటలను యారబోయంగ మంచి షెడ్లు
శీతలంబయిన గిడ్డంగులతిశయింప
రైతు జీవితమదిగాదె ప్రీతిమయము
రైతు బ్రతికిన దేశంబు రీతిమారు
కం॥
ఋణమాఫీలెందుకు, దా
రుణ సిద్ధాంతములు బాసి రోదించెడు స
ద్గుణ నిధులగు రైతన్నల
మరణపు యంచులకు ద్రోయ మనకది తగునే!
శా॥
వర్షాలెప్పుడు కర్షకాళినటులన్ వంచించు; వారెప్పుడున్
హర్షంబేమియు లేక వానలతిగా, అట్లున్న భావంబుగా
శీర్షంబంటిన నష్టముల్ మిగులగా శీఘ్రంపు సాయంబునే
వర్షింపంగ ప్రభుత్వముల్ కనెడుగా ప్రాపున్, మనశ్శాంతియున్
ఆ.వె.॥
రైతు రాజ్యమంచు మాయమాటలు చెప్పు
నాయకాళి తనదు నటన మాని
చిత్తశుద్ధితోడ శ్రేయంబు నొసగెడు
పథక రచనచేయ ఫలితముండు
(సశేషం)