సమకాలీనం-5

0
2

[సమాజంలో సమస్యలని ఛందోబద్ధంగా, పద్యాల రూపంలో చర్చించాలనే ఆలోచనతో ప్రముఖ రచయిత, కవి శ్రీ పాణ్యం దత్తశర్మ గారు అందిస్తున్న పద్యకావ్యం.]

12. వి.ఐ.పి. దర్శనాలు – భక్తుల సమస్యలు

కం॥
అధికారము వెలిగెడి తరి
విధిగా తిరుపతికి వచ్చు విభవముదనరన్
మాధువుని మరచిపోవును
అధికారము లుప్తమైన, నది తప్పుకదా!

సీ॥
రాజకీయ పదవి రాణించుచున్నచో
వేంకటేశ్వరు జూడ వేగవచ్చు
రాజ్యాంగపదవిలో రాజసం బొప్పగ
నేడుకొండలవాని జూడవచ్చు
న్యాయమూర్తి పదంబునధివసించెడివేళ
తిరుమలేశుని జూచు తేరగాను
సినిమాల వెలుగొందు ఘనతారగా సైత
మాది దేవునిగన నరుగు దెంచు

తే.గీ.॥
ఒక్కసారియె యనుకొన్న పెక్కుసార్లు
వేంకటాద్రిని దర్శించు వీరివలన
భక్త జనమున కెంత ఇబ్బంది కలుగు?
క్యూలనాపుచు, జనులెల్ల క్రుద్ధులవగ

కం॥
వేచుచు గంటల తరబడి
యాచిన్మయుజూడవచ్చున స్తోక ప్రజల్
తోచక తిరుపతికొచ్చెడు
రాజరికపు పోకడలను రౌద్రతగనరే?

తే.గీ.॥
పరగ మేదిని నేలు భూపాలుడైన
మనగ చెప్పులు కుట్టు సామాన్యుడైన
నొకటి పరమాత్మ దృష్టిలో, నుర్వినెల్ల
సమత జూడగ కనిపించు సత్యపథము

శా॥
నానా కష్టములన్ భరించి మదిలో నారాయణున్ నిల్పుచున్
కోనల్ కొండలనెక్కి వేంకటపతిన్ గోవిందనామంబులన్
ఆనందంబుగ, భక్తి పెంపునను తామారీతి దర్శించగాన్
ఈ నేతల్, ప్రముఖుల్ విశేష ఘనతన్ ఈరీతి రానొప్పునే?

తే.గీ.॥
దేవదేవుని యెదుటనా? నీవు చూపు
పిచ్చి యాధిక్య భావన? వీడు భ్రమను
దర్శనంబును నీ కివ్వ తగదు యటుల
కనుము యహమును విడుచుచు కామజనకు

కం॥
సమదర్శనయోగంబును
అమలిన భక్తియునుగూడి నంతనెకలుగున్
సమహిత దర్శన భాగ్యము
తమమే నశియించి సత్య తత్త్వము తెలియన్

ఆ.వె.॥
లక్షలాది భక్తులాతురతను కదల
నీవు మాత్రమటుల నిముసమందె
స్వామి దర్శనమును సాధించెదవు, వారి
నందరి నటు నిలిపి, న్యాయమిదియె?

ఉ॥
స్వామిని వచ్చి చూచెనని వార్తలు రాసి ప్రసార మాధ్యమా
లేమియు జంకులేక పలు రీతులగున్, ఘనకార్యమోయనన్
తామటు కీర్తిచాటెదరు దానిని వార్తగ నెంచబాడియే?
దేమునినుద్ధరించెదరె తేరగ దర్శనమంది వారటుల్

13. లౌకికవాదం, మత తత్త్వం

చం॥
మనది మతప్రమేయముగ పాలనసాగెడు రాజ్యమెప్టుగా
దని, మన పూర్వనేతలు వదాన్యత జూపిరి రాజ్యగ్రంథమున్
కొనకొని యేమతంబయిన కోరిక మేరకు నాదరింపగా
తన వర పౌరులందరికి దక్కెను హక్కు, విశాలభావనన్

తే.గీ.॥
సత్యమొక్కటె; దానినే సంతులెల్ల
వివిధమగు రీతులైనట్లు విప్పి చెబుదు
రన్ని మతముల సారంబు నదియునొకటే
దీని నెరిగిన వాడె పో ధీరమతుడు

తే.గీ.॥
అల్పసంఖ్యాక వర్గాలనాదరింప
కొన్ని చట్టములొనరించి కూర్మితోడ
వారు యెటువంటి కొతుకును బాయుటకును
దేశ రాజ్యాంగమది తాను తీర్చికూర్చె

కం॥
భారత దేశమునందున
వేరగు యస్తిత్వమది, వివేకము తోడన్
తీరగు ఘనసిద్ధాంతము
పేరిమితో వ్రాసిరపుడు ప్రేమాస్పదులై

కం॥
మైనారీటీల ఓట్లను
వైనముగా బొంద కొన్ని పార్టీలెపుడున్
పూనిక మేలొనరించెడు
గానము వినిపించు వారికనయముహితులై

తే.గీ.॥
కొన్ని మత తత్త్వ పార్టీలు కోరిమిగుల
నధిక సంఖ్యాక ప్రజలను అనునయించు
నదియు దోషమె, మతమెప్టు యగునతీత
మైన విషయము, వరపరిపాలనందు

కం॥
మతసామరస్య దీక్షా
రతులై ప్రజలెల్ల సహన లక్షితులగుచున్
మతమను హద్దును దాటక
నతిధీరత మనగనగును నతిశయయశముల్

చం॥
మతమును గైకొనన్, వివిధ మార్గములన్ తగ సుప్రచారమున్
సతతము జేయ, మారగను, శాశ్వత హక్కు లభించె; దానినే
వితరణ తోడ జేయవలె వీడుచు దుర్వినియోగ హీనతన్
మత సహనంబె రక్ష మన మానవజాతికి, లౌకికార్థికిన్

తే.గీ.॥
“ఆకలంచును నిరుపేదలలమటింప
వారికెందుకు మతమ”నె స్వామియెపుడొ
విశ్వసువివేకమానంద విశదమయ్యె
యానరేంద్రుని మాటల నరసిచూడ

కం॥
భావోద్వేగపు వీచిక
సవి, మీదగు మూఢభక్తి, సారవిహీనం
బవిరళ క్రతు పరమార్థము
కావింపుడు మానసికము కలుగును వెలుగే!

14. ఆడపని – మగపని (శ్రమవిభజన)

తే.గీ॥
ఆడవారికి వేరుగా, చూడ పురుషు
లకును వేరైన పనులని రాసిలేదు
పనియటన్నను పనియే! సవాలు కాదు
లైంగికంబగు ముద్రది రద్దునొందె

చం॥
ముదితలు నేర్వలేనిదని భూమిని విద్యయె లేదటంచుదా
విదితము ‘చిల్కమర్తికవి వేడ్కగ జేసెను; ఎట్టిదేనియున్
సుదతులు చేయజాలుదురు సుంతసుశిక్షణ నివ్వగల్గినన్
మదినతి శ్రద్ధతోడ, పరిపాలన సైతము, నేర్పుమీరగన్

కం॥
స్త్రీ వాదము మగవారిని
కావించుటకాదు నింద, కాదది మహిళల్
భావించు దమన దృక్పథ
మావేశవిహీనమైన మగు తౌల్యమగున్

మ॥
ఒక స్త్రీవాదిటు బల్కె “మీరుసుతులన్ యొప్పించుడీ, వంటయున్
సకలంబౌ గృహ కృత్యముల్ మనుగడన్ సాఫల్య మొందించు చే
యక వానిన్ మగవారు తప్పుకొనగా నౌనే? పనుల్ ఆడవై,
వికటించే మగవై రహించునె భువిన్, వెర్రిన్ వీడి తర్కించుడీ!

ఆ.వె.॥
ఇరువురాలుమగలు తరతమ హీనత
ఇంటి పనుల పంచు కొంటిమంచు
కొలువు విధుల మిగుల కూర్మిని నేర్పున
నెఱపు వెసులు బాటు కోరుకొనరె?

తే.గీ.॥
వంటొచ్చిన మగడని, తన
కంటే మెరుగైన రీతి, కమ్మనివంటల్
వంటింట్లో చేస్తాడని
అంటే తన భార్య; ధన్యుడౌ గాదె యికన్

కం॥
పాత రోజులు కావివి రీతి మారె
భార్య కనువైన విధమున భర్త యెపుడు
అన్ని పనులను తోడుగా నున్నతరము
దీని జూడగ హర్షంబు, తీరుమనసు

కం॥
సుకుమారులు యబలల్ మరి
యిక మీదట గారు మహిళలే పనినైనన్
చకచక నైపుణ్యముతో
వికసిత మతి చేయజాలి వెలుగుదురిలలో!

15. వినిమయవాదం – యువత (కన్స్యూమరిజం)

కం॥
మాలులు, మల్టీప్లెక్సులు
హేలగ బలహీనతలను హెచ్చింపుచు, నా
కీలలు యువతను క్రమ్మగ
నాలింపరు మంచిమాట, యవివేకముతోన్

చం॥
నిరతము వస్తుజాలమును నేటి తరంబు అమర్చుకోగ, చే
కురునటు తృప్తి; కాని తమకున్న ధనంబున సింహభాగమున్
మరి మరి ఖర్చుబెట్ట ప్రతి మాసము కంతులు గట్టి, వ్యర్థమై
సిరియటుబోవ గ్రుంగెదరు సేమము దప్పి, రుణంబుపెంపునన్

తే.గీ.॥
‘ఫాల్సుప్రిస్టేజి’ కొరకెప్టు పాకులాడి
వస్తువులనెల్లకొని వాని మస్తుగాను
ఇల్లునింపుచు సంతృప్తి త్రుళ్లుయువత
వినిమయంబునె భావించు ఘనమటంచు

తే.గీ.॥
బాగుజేయుట నచ్చరు పారవేత్రు
ఎన్ని ‘ఎక్స్ఛేంజి ఆఫరుల్?’ ఎచట జూడ
పాత వస్తువునమ్మిన ‘వంద’లొచ్చు
కొత్త వస్తువు ‘వేలలో’ కొనగవలయు

కం॥
‘యూజండ్త్రో’ పద్ధతియే
రోజుకు రోజుకును మనకు రూఢిగ నిలిచెన్
నిజమిది మనుషుల సైతము
త్యజియింతురు వాడుకొనిన తదనంతరమున్

కం॥
‘డీమార్టులు’ ‘స్పెన్సర్లు’ను
ఏమాత్రము జంకులేక నెన్నియె పధకాల్
ఏమార్చుచు ప్రకటించగ
ఈమాయను బడని యువత ఇప్పుడు గలదే?

తే.గీ.॥
వస్తుకాంక్షది మితిమీర బాయు సుఖము
ఖర్చుపెట్టుట యదిగాదు ఘనత యెపుడు
పొదుపు చేయుట యెసుగుణమదియె నిలుచు
భావివెలుగొంద జేసెడు ప్రథమ సూక్తి

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here