Site icon Sanchika

సమకాలీనం-8

[సమాజంలో సమస్యలని ఛందోబద్ధంగా, పద్యాల రూపంలో చర్చించాలనే ఆలోచనతో ప్రముఖ రచయిత, కవి శ్రీ పాణ్యం దత్తశర్మ గారు అందిస్తున్న పద్యకావ్యం.]

22. ఉచితాలు – అనుచితాలు – ఉత్పాదకత

కం॥
ఎన్నియొ పథకములిప్పుడు
పన్నుచు, సంక్షేమమనుచు, పాలకులటులన్
మిన్నగ నుచితము పేరిట
నెన్నియొ వరములను ప్రజలకిచ్చుచునుండన్

సీ॥
ఉత్పాకదతయను ఉరుతరశక్తిని
హరియించు పథకాల నమలుజేసి
సోమరితనమున తాము జడులు గాక
ప్రజలటు తమదైన శ్రమనువీడి
కష్టించి పని చేయు కార్యశీలత మాని
ఉచితాల కొరకు తామొగ్గి చేయి
పరతంత్రులైపోయి, భావి భారతమెల్ల
నిస్తేజ, నిర్వీర్య నిష్ఠమగుచు

తే.గీ.॥
నిలువ సంక్షేమ రాజ్యంబు కలుగునెటుల?
శ్రమ విహీనత గల్గునే, సంపదకట?
స్వంతమైనట్టి సదుపాధి శాశ్వతముగ
తమకు సమకూర్చు సర్కారు ధన్యమగును

చం॥
జనముకు డబ్బు పంచినవిశాలముగానది ‘సర్క్యులేషనై’
వినిమయ శక్తి పెంచునని పెక్కురు యార్థికవేత్తలందురే!
ధనమును దుర్విలాసముల తామొనరించరె వ్యర్థమట్లు, దీ
నినిగన, రాజకీయమున నేర్పుననోట్లను బొందు క్రీడయే!

సీ॥
బడికి పిల్లల పంప పంపించువేలలో
ప్రయివేటు బడులకు పంపవచ్చు
‘రైతు బంధ’ని యెడు రమణీయ పథకము
కౌలు రైతులకది కాదు వరము
ఎన్నో ఎకరాలున్న మిన్న భూస్వాములకు
పంట సాయము జేయవలెనె? ‘దళిత
బంధు’ పథకమున వారికి పది లక్ష
లిచ్చుట మంచిదే, లేని యదుపు

తే.గీ.॥
మార్గదర్శనమది లేక బాధ్యతగను
దానివెచ్చించు క్రమమును తాను ప్రభుత
పర్యవేక్షణ చేయక ఫలమదేమి?
ఉచిత పథకాలు కావలె రచితస్ఫూర్తి!

ఉపసంహారము

కం॥
సమకాలీనములైనవి
సామాజిక సంకటములు; సాకల్యముగన్
నామతి కొలదిగ జెప్పితి
క్షమియింపుడు, తప్పులున్న, కావగవలయున్

సీ॥
విశ్వజనీనమౌ విపుల దృక్పథమొండు
సర్వసమస్యల సమయజేయు
స్వార్థంబు, లోభము, సరిలేని యాశయు
సంఘవినాశంబు సంతరించు
సమదర్శనంబను శాశ్వతగుణమది
జనహితమును గూర్చి శాంతినిలుపు
ఎన్ని సంపదలున్న నేమిచ్చు ఫలము
నిశ్చలానందము నిత్యపథము

తే.గీ.॥
గాంధి, యంబేద్కరులు చూపు కరుణ, సమత
మన సనాతన ధర్మంపు మహిత దీప్తి
నిత్యరాజ్యాంగ బద్ధులై నేతలెపుడు
పాలనము జేయు దేశమ్ము పరిఢవిల్లు!
~
~
జైభారత్!
వసుధైక కుటుంబకమ్!
సర్వేజనాః సుఖినో భవంతు!
ఓం శాంతిః

ఈ పద్య కావ్య రచనలో ఉపయుక్త గ్రంథములు స్ఫూర్తిదాయక విషయములు

  1. మనుసిద్ధాంతం
  2. “మానుషి” (1978) స్త్రీల పత్రిక, జెండర్ స్టడీస్ (రూత్ వనిత)
  3. “వనజీవి రామయ్య” సామాజిక అటవీకరణ
  4. సామాజిక మాధ్యమం – ఎంత హానికరం? “వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం”
  5. “జానకి విముక్తి” – రంగనాయకమ్మ
  6. “ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్” – వర్జీనియా వూల్ఫ్
  7. “ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ” ఎర్నెస్ట్ హెమింగ్వే
  8. “యులిసెస్” ఎ.ఎల్ టెన్నిసన్
  9. “వాట్ ఈజ్ నోటా.” ది ఎకనామిక్ టైమ్స్ (4 ఏప్రిల్ 2019)
  10. “భారత రాజ్యాంగం” 42వ సవరణ “లౌకిక వాదం”
  11. “భారత రాజ్యాంగం” 37వ అధికరణం “ఆదేశిక సూత్రాలు” విద్య వైద్యం.
  12. భగవద్గీత
  13. “రాజయోగ’ ‘స్వామి వివేకానంద
  14. “ది అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్” – డా॥ బి.ఆర్. అంబేద్కర్
  15. “Conspicuous Consumption” (1899) థార్న్ వెబ్లెన్, 19వ శతాబ్దపు ఆర్థికవేత్త
  16. ‘Welfare Schemes’ Wikipedia
  17. “ఏకం సత్ విప్రాః బహుథావదన్తి” సూక్తి
  18. ‘సర్వత్ర సమదర్శినః” సూక్తి
  19. “జన్మనాజాయతే శూద్రః కర్మణాజాయతే ద్విజః” సూక్తి
  20. కె. విశ్వనాధ్ “సప్తపది” చలనచిత్రం
  21. “శతాబ్ది సూరీడు” “నవల” శ్రీమతి మాలతీ చందూర్

(సమాప్తం)

Exit mobile version