సమక్షంలో సాన్నిహిత్యం

8
3

[శ్రీ తుర్లపాటి నాగేంద్రకుమార్ రచించిన ‘సమక్షంలో సాన్నిహిత్యం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ప్ర[/dropcap]సాద్ మనసులో, దీర్ఘాలోచనల అంతర్మథనం కొనసాగుతోంది. రకరకాల పరిష్కార మార్గాలు, మెరుపులా మెరిసి, అంతర్ధానమౌతున్నాయి. ఈ సమస్యకి పరిష్కారం, సులువుగా తోచేటట్టు లేదు. ఉదయం నుంచి, అదే ధ్యాసలో ఉన్నాడు. ప్రసాద్, శరత్ చిన్ననాటి స్నేహితులు. కలసి చదివారు, ఆటలాడుకున్నారు. ఉద్యోగస్థులయినాక కూడా, వారి స్నేహంలో ఎలాంటి మార్పు లేదు. ఈ రోజు దాకా, వారి మధ్య ఎప్పుడూ, ఎలాంటి మనస్పర్ధలు లేవు, రావు. వారి స్నేహబంధం అలాంటిది. వారిరువురి తండ్రులు స్నేహితులు. ‘రైల్వే’ ఉద్యోగస్తులుగా, పదవీ విరమణ చేసారు. ఉద్యోగాల్లో ఉండగానే కూడబలుక్కుని, ఒకేచోట ఇళ్ళు కట్టుకున్నారు. ఆ రోజు ఉదయం తనకి, శరత్‌కి మధ్య జరిగిన సంభాషణని, మరో మారు గుర్తుచేసుకున్నాడు, ప్రసాద్.

ఆ రోజు ఆదివారం. ప్రతి ఆదివారంలానే, ప్రసాద్ ఆ రోజు ఉదయం, లాప్‌టాప్‌లో, ‘మెయిల్స్’ చెక్ చేస్తుండగా, శరత్ దీర్ఘంగా నిట్టూర్చుతూ, వచ్చాడు. కుర్చీని, ప్రసాదుకి దగ్గరగా జరుపుకుని, కూర్చున్నాడు. ముఖమంతా దిగులుగా, ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉంది. “రేయ్, శరత్, ఏంటి! ఇంత ప్రొద్దునే, వచ్చావు”, అని అంటుండగానే, “ప్రసాద్ కాఫీ కావాలా?” అంటూ, కేక వేస్తూ, ప్రసాద్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. “ఓ! నువ్వెప్పుడు వచ్చావు?” అని, శరత్‌ను పలకరించి, “సరే ఇద్దరికీ, కాఫీ తెస్తాను” అంటూ, వెళ్లారు.

మరోమారు, “ఏరా అలా ఉన్నావు”, అన్నాడు, ప్రసాద్. అంతలో ప్రసాద్ వాళ్ళమ్మగారు, కాఫీ తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్లారు. “కాఫీ తీసుకోరా”, అన్నాడు, ప్రసాద్. అయిష్టంగా, ఓ రెండు గుక్కలు తాగి, కప్పుని దూరంగా ఉంచాడు, శరత్. ఏదో చెప్దామన్నట్టుగా, కుర్చీలో ముందుకి జరిగి, అంతలోనే నిస్పృహగా, వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు. తనే చెప్తాడులే, అనుకుంటూ, లాప్‌టాప్ స్క్రీన్ వైపు దృష్టి సారించాడు, ప్రసాద్. ఓ ఐదు నిమిషాలు గడిచిన తరువాత, “ప్రసాద్” అంటూ, పిలిచాడు, శరత్. ఏదో చెప్పడానికి ఉపక్రమిస్తున్నటుగా. “ఊ.. చెప్పు”. అన్నాడు, ప్రసాద్, శరత్ వైపు చూస్తూ.

“నిన్ను విసిగిస్తున్నాననుకోకురా, ప్రసాద్! ఓ ‘ప్రాబ్లెమ్’ రా, నీకు తెలుసు కదా! దీపిక అంటే, నాకెంత ఇష్టమో, తను మాత్రం, నా ‘ఫీలింగ్స్’ అర్థం చేసుకోవట్లేదు”, అని చెప్పటం ఆపాడు, శరత్. ఓ నిమిషం ఆగి, “తనకి నేనంటే చాలా ప్రేమరా, నా దగ్గర ఉన్నంతసేపు, నేనే లోకంగా ఉంటుంది”, అన్నాడు.

ప్రసాదుకి, శరత్ ‘ఫియాన్సీ’గా, దీపికతో పరిచయం ఉంది. మూడేళ్ళుగా, వాళ్ళ మధ్య ఉన్న, ప్రేమానురాగాలు, అతనికి తెలుసు.

“సరే, అసలు, విషయం ఏమిటి?” అన్నట్టుగా చూసాడు, ప్రసాద్. శరత్, చెప్పసాగాడు. “నీకు తెలుసు కదా! దీపిక ఎవరితోను మాట్లాడటం, ‘క్లోజ్’గా ఉండటంలాటివి, నాకు నచ్చవని. మొన్నామధ్య, ఓ రోజు నేను వాళ్ళ ఆఫీసు కెళ్లేసరికి, పక్క సీటులో ఉన్న, కొలీగ్‌తో, నవ్వుతూ, ఏదో మాట్లాడుతోంది. ఏమిటి! అంటే, ఏమీ లేదు, అంది. నిన్న ఇంటినుంచి డైరెక్టుగా, వాళ్ళ టీమ్‌లో వాళ్ళు, ఓ ముగ్గురు క్లయింట్ దగ్గరకి వెళ్లారు. తిరిగి ఆఫీసుకి వచ్చేటప్పుడు, తన కొలీగ్ కారులో వచ్చిందట. ఎందుకు, వేరే వాళ్ళ కారులో రావాలి? క్యాబ్ లోనో, ఆటో లోనో రావచ్చు కదా! అని అడిగితే, ఏమవుతుంది అన్నది. ఇక నెక్స్ట్ వీకెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు, పిక్నిక్ ప్లాన్ చేశారట. వెళ్తానంటుంది, నాకేమో ఇష్టం లేదు. తనేమో, వెళ్ళక పొతే బాగుండదు, అంటోంది”, అంటూ, చెప్పడం ఆపాడు, శరత్.

“ఊ.. చెప్పు”, అన్నాడు, ప్రసాద్. “ఆ మధ్య, ఓ శనివారం, మేము సినిమాకి వెళదామని, ప్లాన్ చేసుకున్నాము. నేను, తనని పికప్ చేసుకొవడానికి, బయలుదేరుతుంటే, ఫోన్ చేసి, మా చుట్టాలొచ్చారు. వాళ్ల అమ్మాయికి పెళ్లి బట్టలు, నగలు కొందామని, హైదరాబాద్ వచ్చి, మా ఇంట్లో దిగారు. వాళ్లతో తనిష్క్‌కి, చెన్నై షాపింగ్ మాల్‌కి వెళ్ళాలి, అంటూ, ప్రోగ్రాం క్యాన్సిల్ చేసింది. ఏంటి! అలా చేసావు, అని అడిగితే, గతంలో, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు నాన్నగారికి చాలా సహాయం చేశారు, బావుండదు, వాళ్లకి తోడుగా వెళ్లు అని, అమ్మ చెప్పింది, నేనేమి చేసేది, అంది” అన్నాడు, శరత్.

“నువ్వు చెప్పడం అయిందా?” అన్నాడు, ప్రసాద్, శరత్ వైపు చూస్తూ. అయింది, అవ్వలేదు అన్నట్టుగా, అసహనంగా తల ఊపాడు, శరత్.

“ఇంతకీ, నీ ఉద్దేశం ఏమిటి? నువ్వు ఎలా చెపితే, అలా దీపిక ఉండాలని కోరుకుంటున్నావా!” అన్నాడు, ప్రసాద్. అవును అన్నట్టుగా, చూసాడు శరత్.

“అదేమిట్రా! దీపిక చిన్నపిల్ల కాదు. తను విద్యావంతురాలు, మనతో సమంగా చదువుకున్నది, జాబ్ చేస్తోంది. తనకి, ఓ వ్యక్తిత్వం ఉంటుంది కదా! నీ ఆలోచన సరైనదే, అంటావా!” అన్నాడు, ప్రసాద్.

“ఏమోరా, నాకు విసుగ్గా ఉంది. ఏమీ అర్థం కావటం లేదు. తనకి నేనంటే ఇష్టం, ప్రేమ అంటుంది. మరి, ఇలా చేస్తుంది. ఇలాగైతే, ఎలారా! రేపు, పెళ్ళయాక కూడా, ఇలాగే చేస్తే! నేను ఇక్కడున్నపుడే, ఇలా ఉంటే, రేపు నేను ‘స్టేట్స్’ వెళ్ళాలి కదా! అప్పుడు, తను ఎవరితో మాట్లాడుతుందో, ఎక్కడికి వెళ్తుందో, అన్న ఆలోచనలు, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి”, అంటూ చెప్పడం ముగించాడు, శరత్.

“సరే, నువ్వు చెప్పాలనుకున్నది, చెప్పావు. ఏమి చేయాలో ఆలోచిద్దాం. నాకు కాస్త టైం ఇవ్వు”, అన్నాడు, ప్రసాద్. “అలాగే, కానీ, నువ్వే ఎలాగైనా దీపికకి నచ్చ చెప్పాల్రా”, అన్నాడు శరత్. “సరేలే!” అన్నాడు, ప్రసాద్.

ఇప్పుడు, ప్రసాద్ ఆలోచిస్తున్నది, ఆ విషయమే. శరత్ సమస్యని, ఎలా పరిష్కరించాలి. నిజానికి, ఇది సమస్యేనా! సమస్య అయితే, ఈ సమస్య శరత్, దీపికల ఇద్దరిదీను. ఎందుకంటే, వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని, జీవితాన్ని పంచుకోవాలని, జీవితాంతం కలిసి వుండి, తమ కలల్ని పండించుకోవాలని కోరుకుంటున్నారు. మరి, ఇలాంటి సమస్యని ఎలా అధిగమించగలరు. జీవితం అంటే సుఖం, సంతోషం మాత్రమే కాదు. జీవితంలో అనేక రకాల పరిస్థితులు తారసిల్లుతాయి. అన్ని పరిస్థితులు, మనం కోరుకున్నట్టుగా ఉండవు. అందరి ఆలోచనలు, ఒకేలా ఉండవు. తమ, తమ అభిరుచులకనుగుణంగా వారి జీవన శైలి రూపు దిద్దుకుంటుంది. తమ చుట్టూ ఉన్న వారితో సంబంధ, బాంధవ్యాలు, వారి, వారి జీవన శైలికనుగుణంగా నెరపుతారు. వెరసి, అందరూ తనలాగే ఆలోచించాలని, తనలాగే ఉండాలని కోరుకోవటం, పచ్చి పాలలో, వెన్న వెతకడం లాంటిది. తోటి వారితో బంధం, సజావుగా సాగాలంటే పట్టు, విడుపులు ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని, జీవితం సాగించాలంటే, కావాల్సింది, పరస్పర అవగాహన. ఒకరికి, మరొకరి ఆలోచనా దృక్పథం పట్ల, గౌరవం. ముఖ్యంగా, వైవాహిక జీవితం, నమ్మకం, అవగాహనా అనే రెండు పట్టాలపై ప్రయాణించే, రైలు లాంటిది. వీటిలో, ఏది లోపించినా, రైలు పట్టాలు తప్పినట్టే.

ఈ విషయం శరత్‌కి ఎలా నచ్చ చెప్పాలి. నిజమే, దీపికపై శరత్‌కి చాలా ప్రేమ. కానీ ఆమెని శాసిస్తూ, ఇది చెయ్యద్దు, అది చెయ్యద్దు అనటం, ప్రేమలో భాగమా. అలా అయితే, ఆ ప్రేమకి దీపిక ఎలా స్పందిస్తుంది! అనుక్షణం, ఆంక్షలు విధిస్తున్నట్టుగా తోచదూ! ముందు, ముందు దీపికకి, శరత్ తనని ప్రేమిస్తున్నాడా! లేక తనని అనుమానిస్తున్నాడా! అన్న, భావన కలిగి, అలాంటి ప్రేమ, నాకు అక్కరలేదు అనుకున్నా, ఆశ్చర్యం ఏముంటుంది! ప్రేమ ఉన్న చోట స్వార్థం ఉంటుంది, అంటారు. కానీ ఆ స్వార్థం అవతలి మనిషిని, అనుమానిస్తున్నట్టుగానూ, అవమానిస్తునట్టుగాను ఉంటే, ఇవతల వారి ప్రతిస్పందన, ద్వేషంలా మారే అవకాశం ఎంతగానో ఉంది. ఆలా జరిగిన పక్షంలో, దిద్దుబాటుకి వీలు లేని పొరపాటు, వారి జీవితాల్లో చోటు చేసుకుంటుంది. కన్నకలలు, కల్లలుగా మారి, చివరికి కన్నీళ్లే మిగులుతాయి.

నిజమే! శరత్ దీపికని ప్రేమిస్తున్నాడు. కానీ, ఆ ప్రేమలో దీపిక, తనది కాకుండా పోతుందేమో, అన్న శంక కూడా ఉంది. అందుకే, ఏ పరిస్థితిలోనూ, ఆమె తనకు దూరం అవ్వకూడదనే ఉద్దేశంతో, ఆమె కదలికల్ని శాసిస్తున్నాడు. కానీ ఆమెకి ఓ వ్యక్తిత్వం ఉంది. విచక్షణా జ్ఞానం ఉంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోగల వయసు, మనసు ఉన్నాయి. ఈ విషయం, శరత్‌కి ఎందుకు స్ఫురించదు? అతని ఆలోచనలు ఇలాగే కొనసాగితే, వారిరువురూ భవిష్యత్తులో, పరస్పరం ద్వేషించుకునే అవకాశం, ఎంతైనా ఉంది. ఈ సమస్యని, ఎలాగైనా పరిష్కరించాలి. లేని పక్షంలో, శరత్, దీపికలు ఇద్దరూ, తాము కలలు కన్న, జీవితాన్ని కోల్పోతారు. అలా కాకూడదు, అనుకున్నాడు, ప్రసాద్.

***

ప్రసాద్ డాబా మీద పచార్లు చేస్తూ, శరత్ సమస్య గురించి ఆలోచిస్తున్నాడు. తెల్లవారుజామునే నిద్రలేచి, చీకటిని తరిమేస్తూ అరుదెంచే, ఉషాదేవి ఆగమనాన్ని తిలకించడమంటే ప్రసాద్‌కి చాలా ఇష్టం. తూర్పు దిక్కు ఆకాశం మెలమెల్లగా, నారింజ రంగుని సంతరించుకుంటోంది. పడమటి ఆకాశం చీకటి, వెలుగుల సంగమంలా ఉంది. కలకూజితాలు తమ గూళ్ళని విడిచి, ఆకాశంలో గుంపులుగా గిరికీలు కొడుతూ, సకల ప్రాణకోటికి, నిత్యకృత్యమైన, ఆహార సంపాదనకు అనువైన చోటుని నిర్ధారించుకుంటున్నాయి. వాటి కుహు.. కుహురావాలు, ఉషాదేవిని స్వాగతిస్తున్నట్టుగా ఉంది.

పిట్టగోడ దగ్గరికి వెళ్లి, రెండు చేతులు పిట్టగోడపై ఆనించి, ప్రకృతి కాంత సోయగాలు తిలకిస్తూ, ఆ ప్రాతః సమయ సౌందర్యానికి, ముగ్ధుడయ్యి, పరవశానికి లోనయ్యాడు, ప్రసాద్. వాళ్ళిల్లు, కంటోన్మెంట్ ఏరియాకి ఆనుకుని ఉన్న, అమ్ముగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. ఓ వైపు అంతా, రెసిడెన్షియల్ కాలనీలు, ఎదురుగా కొండ మీద దర్గా, మరో వైపు తరువుల చిటారు కొమ్మల, రెమ్మల పచ్చదనం, కనుచూపు మేరా ఆవరించింది. పచ్చదనం ఆచ్ఛాదనలో, ధరణీ మాత మురిసిపోతున్నట్టుంది. తీరం దాటి, ఎగసిపడిన అలల తాలూకు నీటి తుంపరలు, చెక్కిలిని ముద్దాడి జాలువారినట్టు, గత రాత్రి చల్లదనం తాలూకు మంచు బిందువులు, ఆకులతో జత కట్టి, ముద్దూ,ముచ్చట్లాడుతూ, వేకువ చిరు వేడిని తాళలేమంటూ, జాలువారిపోతున్నాయి. ఆకులనుంచి జాలువారుతున్న, మంచు బిందువులను తాకి, పులకరింతలపాలై, లేలేత సూర్య కిరణాలు, సప్తవర్ణాలు మిళితమైన చిరు నీటిగోళాలని సృష్టిస్తున్నాయి. మరు క్షణంలో, ఆ గోళాలు నేలని ముద్దాడి, మాయమౌతున్నాయి. ఆ ప్రాతః కాల దృశ్యాలు, కనువిందుగా ఉన్నాయి.

ప్రాతఃకాల సౌందర్యాన్ని, ఆకాశంలో గిరికీలు కొడుతున్న, పక్షులని గమనిస్తున్న, ప్రసాద్ మనసులో, అకస్మాత్తుగా, ఓ ఆలోచన మెదిలింది. ఈ పక్షుల జీవనసరళికి, మనుషుల జీవన సరళికి యెంత భేదం! పోల్చి చూడటం వృథా ప్రయాస కాదూ! అనేక రకాల, ఈ విహంగాల జీవనయానము ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది. వేకువనే లేచి, ఆహారం సంపాదనకి బయలుదేరుతాయి. సంధ్యా సమయంలో, నిషాదేవి ఆగమనాన్ని, తమ కిలకిలరావాలతో స్వాగతించి, తమ, తమ ఆవాసాలైన గూళ్ళకి చేరి, విశ్రాంతి తీసుకుంటాయి. ఈ మధ్యలో ఆహారం అందిన వెంటనే, వెనక్కి వచ్చి, గూటిలో ఉన్న, తమ పసికూనలకు అందజేస్తాయి. అదే వాటి దినచర్య. ప్రాణికి ప్రాథమిక అవసరమైన ఆహార సంపాదన, తాము తినడం, తమ పిల్లలకి అందించడం. ఆ పిల్లలేమో, ఎదిగి రెక్కలొచ్చి, ఎగిరే శక్తి సమకూరగానే, తమ ఆవాసాలని, తామే ఎంతో నైపుణ్యంతో నిర్మించుకుంటాయి. తమ ఆహారం, తామే సంపాదించుకుంటాయి. ఆపద సమయంలో, పక్షులు కలసికట్టుగా, తోటి విహంగానికి, సహాయం చేస్తాయి. దురదృష్టవశాత్తు మృత్యువాత పడిన, సహచర విహంగం చెంత చేరి, అసాధారణ కూతలతో ఆక్రోశిస్తూ, అంతిమ వీడుకోలు పలుకుతాయి. ఆ సమయంలో, వాటి కూతలలో వ్యక్తమయ్యే భావం హృదయవిదారకంగా ఉంటుంది. అలాటి గుణాలు, సకల జీవరాసులలోనూ బహిర్గతమౌతూ ఉంటాయి. ఒక్క మనుషుల్లో మాత్రం, అలాటి గుణాలు అరుదుగా, గోచరమౌతాయి. పైపెచ్చు, రాగద్వేషాలు, అసూయ, కుళ్ళు, కుత్సితం, మాయ, మర్మం, అవకాశవాదం, అనుమానాలు, అపోహల్లాంటి గుణాలు అదనం. తతిమ్మా జీవరాశులకు, మానవులకి మధ్య, ఈ వ్యత్యాసం ఏమిటో!

అలా సాగుతున్న, ప్రసాద్ ఆలోచనా పరంపర, అదాటున ఆగింది. ఆతని మనసులో, చటుక్కున, మెరుపులా ఓ ఆలోచన వచ్చింది. క్షణాల్లో, శరత్ సమస్య పరిష్కారదిశలో, ఓ ప్రణాళిక రూపుదిద్దుకుంది. కానీ శరత్ ఎలా స్పందిస్తాడో అనుకుంటూ, మెట్లు దిగి ఇంట్లోకి వెళ్ళాడు, ప్రసాద్.

***

నౌబత్ పహాడ్‌పై ఉన్న, బిర్లామందిర ప్రాంగణంలో, సెక్రెటరియేట్ వైపు ఉన్న, బాల్కనీ వద్ద నిలుచున్నాడు ప్రసాద్, శరత్ రాక కోసం, ఎదురు చూస్తూ. దూరంగా నెక్లెస్ రోడ్, ఇంకాస్త దగ్గరలో ట్యాంక్ బండ్, వాటి రెండిటి మధ్య, లీలగా కనిపిస్తున్న తథాగతుడి విగ్రహం, ఇవతల కట్టిన ఫ్లై ఓవర్ కనిపిస్తున్నాయి. ఆ తథాగతుని విగ్రహ ప్రతిష్ఠ, ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక. మొబైల్ ఫోన్‌లో టైం చూసాడు ప్రసాద్. ఆరు కావస్తోంది. చీకటి పడింది. డిసెంబర్ నెల, ఆఖరి వారం. మరో నాలుగు రోజుల్లో, నూతన సంవత్సరం అడుగిడుతుంది. చలిగాలి, మేనిని తాకుతూ రానున్న, సంక్రాంతి పండుగని, మరింత పెరగనున్న చలిని సూచిస్తోంది.

‘శరత్‌ని, ఆరుకల్లా రమ్మన్నాను, ఇంకా రాలేదే’ అనుకున్నాడు, ప్రసాద్. అంతలో వడివడిగా అడుగులు వేస్తూ వచ్చి, ఎదురుగా నిలుచున్నాడు, శరత్. ఆతని కళ్ళలో ఆత్రుత, దిగులు కలగలిసిన భావం తొంగిచూస్తొంది.

“రారా, ముందు స్వామివారి దర్శనం చేసుకుని మాట్లాడుకుందాం” అన్నాడు, ప్రసాద్. దర్శనమైనాక, “అక్కడ కూర్చుందాం పద” అంటూ, నాలుగడుగులు ముందుకి వేసి, క్రింద కూర్చున్నాడు ప్రసాద్. శరత్ కూడా వచ్చి ఎదురుగా చతికిలపడ్డాడు. పాలరాతి గచ్చు శుభ్రంగా ఉంది. విద్యుత్ దీపాల కాంతి ప్రతిబింబిస్తోంది. నిజంగా, బిర్లాలని మెచ్చుకోవాలి. వ్యాపార దృక్పథమే కాక, ఆధ్యాత్మికతా భావాలు కూడా వారిలో ఉండుంటాయి. ఇలాంటి చోట, ఎంతో ఖర్చుతో, పూర్తి పాలరాతితో, అద్భుతమైన ఆలయాన్ని నిర్మించటం హర్షణీయం, అనుకున్నాడు, ప్రసాద్.

తన సమస్యకి, ఏ పరిష్కారం చూపుతాడా! అని ఆతృతగా, ప్రసాద్ వంక చూస్తూ, ఇక ఆగలేక, “దీపికతో మాట్లాడావా? దీపిక ఏమంది?” అన్నాడు, శరత్, ప్రసాద్ మౌనాన్ని భరించలేనట్టుగా. “దీపికతో మాట్లాడాను, అంతా ఓకే, ఏం జరిగిందో చెప్పే ముందు, నీతో ఈ విషయం చర్చించాలి, ఏమంటావు?” అన్నాడు, ప్రసాద్. ‘అంతా ఓకే, అంటున్నాడు, మరి ఇంకా చర్చించాల్సింది ఏముంది! ఏదేమైనా, విషయం చర్చిస్తే పోయేదేముంది’, అనుకుంటూ, “వూ.. చెప్పు” అన్నాడు, శరత్.

కాసేపు మౌనంగా ఉన్న ప్రసాద్, “చూడు శరత్, నేనిప్పుడు నీతో చెప్పాలనుకునేవన్నీ, నీకు తెలియనివి కావు. నీ అంచనాలకి అనుగుణంగా, దీపిక ప్రవర్తించట్లేదని, నువ్వేర్పరచుకున్న అభిప్రాయం, దాని తాలూకు నిరుత్సాహం, నీ ఆలోచన సరైన దిశలో వెళ్లకుండా అడ్డుపడుతోంది. సరే ఇప్పుడు నేను చెప్పేది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు” అన్నాడు.

“నీకు తెలుసు కదా! ప్రపంచంలో, కోటానుకోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటిలో మనుషులు ఒకరు. ఈ జీవరాశులన్నీ, ప్రకృతి తమకి నిర్దేశించిన జీవనసూత్రాలను అనుసరిస్తూ, జీవిస్తూ ఉంటాయి, అవునా!” అన్నాడు ప్రసాద్. అవునన్నట్టుగా చూసాడు, శరత్. “అలాంటప్పుడు, మనుషులకి కూడా, ఆ సూత్రాలు వర్తిస్తాయి కదా! సూర్యోదయంతో మొదలయ్యే జీవరాశుల నిత్యకృత్యాలు, సూర్యాస్తమయానికి పూర్తవుతాయి. ఆ నిత్యకృత్యాలు ఏమిటి! ఆకలి తీర్చుకోవడానికి ఆహార సంపాదన, ఆహార సంపాదనలో అలసట కలిగినపుడు విశాంత్రి. ప్రకృతి నియమాల నిర్దేశానుసారం, రమారమి అన్ని ప్రాణులు, ఈ నిత్యకృత్యాలని వెలుగులోనే నిర్వర్తిస్తాయి. చీకట్లో ఏ ప్రాణీ, ఏ పనీ చేయలేదు. అందుకే ప్రకృతి, చీకటిని అంటే రాత్రిని, సకల జీవుల నిద్రావస్థకు నిర్దేశించింది. దీనినే, ‘బయోలాజికల్ క్లాక్’ అని నిర్వచిస్తున్నారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఎడిసన్ మహాశయుల విద్యుచ్ఛక్తి, మరియూ విద్యుత్ బల్బుల ఆవిష్కరణల, తదుపరి తరాల శాస్త్రవేత్తల ప్రయోగాల ద్వారా, విద్యుచ్ఛక్తి సామాన్య మానవులందరి అందుబాటులోకి, విస్తృత వినియోగం లోకి వచ్చింది. ఇప్పుడు మనం రాత్రికి, పగలుకి తేడా లేకుండా, ప్రకృతి విరుద్ధంగా జీవిస్తున్నాము. ఇది మంచికా, చెడుకా అన్నది, ఇప్పుడు అప్రస్తుతం. సారాంశం ఏంటి! జీవుల ప్రాథమిక అవసరాలు, ఆహారం, మైథునం, నిద్ర, అంతేనా”, అన్నాడు ప్రసాద్.

‘అవును’ అన్నట్టుగా, తలపకించాడు శరత్.

 ప్రసాద్ తాను చెప్పదలుచుకున్నది, కొనసాగించాడు. “మనుషులకి, మిగిలిన జీవరాశులకు భేదం, ‘ఆలోచనా, వివేచనా శక్తి’ అంటారు. కానీ, మనుషులకి ఆ శక్తి, ఎక్కువ పాళ్ళలో ఉంది అనటం, సబబేమో! అదలా ఉంచితే, మనిషి సుఖజీవనాభిలాషలో భాగంగా, తన ఆలోచనా, వివేచనా శక్తితో, ముందుగా ప్రకృతి వనరులని వినియోగము లోకి, తెచ్చాడు. నాగరికతాక్రమంలో, పలు శాస్త్రీయ ఆవిష్కరణలు, అందుబాటులోకి వచ్చాయి. వాటి ఫలితమే, ఈనాడు, మనం అనుభవిస్తున్న సౌకర్యాలు. ఆదిలో మనిషి కూడా, అన్ని ప్రాణుల మాదిరిగానే జీవించాడు. ఆహారం, విశ్రాంతి, మైధునం, నిద్రలకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇంతకు ముందు చెప్పినట్టుగా, ప్రకృతి వనరుల వినియోగం, నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు, మనిషి జీవనసరళిని ప్రభావితం చేస్తూ, మనిషి ప్రాథమిక అవసరాలకు మించిన కోరికలు, వాటి తాలూకు ఆలోచనలు పెంపొందాయి. స్వార్థానికి మనిషిని మరింత దగ్గిర చేసాయి. కాలక్రమేణా, నేను, నువ్వు!, నాది, నీది!, మీరు, మేము!, మీది, మాది! అనే భావనలు, మనిషిని తన స్వాభావిక జీవనమార్గాన్నించి దారి తప్పించాయి. ఇంకా, ఏదో కావాలని, తనది అనుకున్నది, తనది కాకుండా పోతుందేమో అన్న, స్వార్థ చింతన పెరిగిపోయింది. చంద్రుణ్ణి చేరగల జ్ఞానము సముపార్జించిన మనిషి, తన అంతరంగాన్ని, అసలైన అవసరాలని ఆకళింపు చేసుకోలేక, అసంతృప్తితో జీవిస్తున్నాడు. చివరికి, ఈ నాడు మనిషికి, ప్రాథమిక అవసరాలైన ఆహారం, నిద్రలకి సమయం కరువైపోయింది.

ప్రతి మనిషి ఒంటరిగా, ఈ లోకం లోకి వస్తాడు, చివరికి ఒంటరిగానే పోతాడు. కానీ జీవితకాలమంతా ఎప్పుడూ, ఎవరో ఒకరి తోడు కోరుకుంటాడు. అది స్వార్థమా! అవును! ఎంచేతనంటే, కోరుకునే ‘తోడు’ స్వంతానికి అంటే, తన కోసమే కదా! మన కుటుంబ వ్యవస్థలో, బాల్యంలో, తల్లితండ్రుల, తోబుట్టువుల, యవ్వనములో స్నేహితుల, యుక్తవయస్సు నుంచి భార్యాపిల్లల, వృద్ధాప్యంలో జీవితభాగస్వామిల తోడు చేకూరుతుంది” .

“సరే అసలు విషయానికొద్దాం, నువ్వు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, నువ్వు ప్రేమించే వాళ్ళు ఎవరు?” అడిగాడు, ప్రసాద్.

“ఇంకెవరు! అమ్మ, నాన్న, చెల్లి దీపిక, నువ్వు, ఇంకా కొద్దిమంది బంధువులు, స్నేహితులు” అన్నాడు, శరత్.

“సరే నీ పరోక్షంలో, మీ నాన్న, అమ్మ, చెల్లి వాళ్ళు, ఏంచేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరెవరిని కలుస్తారో, వారితో ఏం మాట్లాడుతారో, నీకు తెలిసే అవకాశం ఉందా!” అన్నాడు, ప్రసాద్.

“పరోక్షంలో, ఎవరి గురించి మాత్రం, ఎలా తెలుస్తుంది! వారు చెప్తేనే కదా! అయినా, వాళ్ళు చెప్తూ ఉంటారుగా! వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, నాకు తెలిసింది చెప్తాను. ఏముంది, నాన్నగారు, నే వారించినా, రిటైర్ అయినాక, రెస్ట్ తీసుకోకుండా, ప్రైవేట్ ఫర్మ్‌లో జాయిన్ అయ్యారు. ఇక అమ్మ, పూజలు, ఉపవాసాలు. ఆవిడది అదో లోకం, చెల్లి కాలేజీకి వెళ్తుంది, వేరే ఏవగేషన్స్ ఏమి లేవు. బాగా చదువుతుంది. మార్కులు బాగానే వస్తున్నాయి. తరువాత ఎంబీఏ చేస్తానంటోంది” అంటూ, ఇదంతా ఎందుకు? అన్నట్లుగా చూసాడు, శరత్.

“చూడు శరత్, ప్రతి మనిషికి తనకి ఏం కావాలో, తెలుసు. ఏం చేస్తే బాగుంటుందో, కాస్త ఆలోచిస్తే, తెలుస్తుంది. పసి పిల్లాడు కూడా, ఆకలి వేసినప్పుడు పాలు తాగుతాడు. సరే మీ నాన్నగారికి, ఖాళీగా ఉండటం ఇష్టం లేదు, అందుకే మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకి, కారులో వెళ్లే స్తొమత ఉన్నా, దుబారా ఎందుకు అని, టు వీలర్ పై వెళ్తున్నారు. ఆయనలా కష్టపడటం, నీకు ఇష్టం లేదు. కానీ అయన ఇష్టాన్ని కాదనడం కూడా నీకిష్టం లేదు. అందుకే, ఏమీ అనకుండా ఉరుకుంటున్నావు. కానీ అయన ఆఫీసుకి వెళ్లి వచ్చేలోపు, ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అని, ఎప్పుడన్నా ఆలోచించావా”, అన్నాడు ప్రసాద్.

“లేదు”, అన్నాడు శరత్.

“నువ్వు కరెక్ట్. ఎందుకంటే, ఆయన సమర్థులు, అనుభవజ్ఞులు. తన సంగతి, తాను, చూసుకోగలరు”, అన్నాడు, ప్రసాద్.

“ఇక మీ అమ్మగారి వ్యాపకం, పూజలు, ఉపవాసాలు. స్వామిజీ, గురువుగారు అంటూ, ఇరుగు పొరుగు వారితో కలిసి వెళ్తూ ఉంటారు. తాయత్తులు, రక్షలు అంటూ ఏవేవో తెస్తూ ఉంటారు. ఆమధ్య, ఓ రాగి పతకం, నిన్ను మెళ్ళో వేసుకోమన్నారని, అన్నావు, గుర్తుందా” ఆన్నాడు ప్రసాద్. “ఆ.. గుర్తుండటమేమిటి, ఆవిడ మాట కాదనలేక వేసుకున్నాను కదా!” అన్నాడు, శరత్. “దేవునిపై భక్తి, పూజలు వరకు పరవాలేదు కానీ, ఉపవాసాలు, స్వామీజీలు అంటూ వెళ్లడం, నాకిష్టం లేదు అన్నావు. కానీ ఆవిడ్ని, నువ్వు వారించలేదు. ఎందుకు?” అన్నాడు, ప్రసాద్. శరత్ జవాబివ్వలేదు. “ఎంచేతనంటే, నువ్వు ఆవిడ కనుసన్నల్లో మెలిగావు, పెరిగావు. ఆ ఉపవాసాలు అవీ, నీకిష్టం లేకపోయినా, ఆవిడ మాటకి, సంతోషానికి ఎదురు చెప్పలేక, ఉరుకున్నావు” అంటూ, చెప్పడం ఆపి, శరత్ వంక చూసాడు, ప్రసాద్. శరత్ ముఖంలో మార్పు కనిపించింది ప్రసాద్‌కి. ఏదో ఆలోచనలో మునిగినట్లుగా తోచింది.

“ఏమిటి, వింటున్నావా!” అన్నాడు, ప్రసాద్. “చెప్పు” అన్నాడు, శరత్.

“ఇక మీ చెల్లి విషయానికొద్దాం. తనంటే, నీకెంత ఇష్టమో నాకు తెలుసు. నువ్వు తనని చిన్ననాటి నుంచి ఎరుగుదువు. తనని, కంటికి రెప్పలా చూసుకుంటావు. మీరిరువురు కలసి ఆటలాడుకున్నారు, కలసి పెరిగారు. తనకి జాగ్రత్తలు చెపుతూనే, సాధ్యమైనంతవరకు, తాను కోరినవి నెరవేర్చావు. నీకూ, అంతగా ఇష్టం లేకపోయినా, ఇటీవల దసరా సెలవల్లో, మీ అమ్మా,నాన్నల్ని ఒప్పించి, తన క్లాస్‌మేట్స్‌తో పాటు, నార్త్ ఇండియా ఎక్స్‌కర్షన్ టూర్‌కి పంపావు. ఎందుకు! తనని నిరుత్సాహపరచడం, ఇష్టం లేక, అవునా!” అన్నాడు, ప్రసాద్.

ఇదంతా, ఎందుకు ప్రసాద్, చెపుతున్నాడన్నది, చూచాయగా అర్థం అవుతోంది, శరత్‌కి.

“ఇప్పుడు చెప్పు, శరత్, నీకిష్టం లేని, పనులు చేస్తున్నా, మీ అమ్మగారిని, నాన్నగారిని, చెల్లిని వారించడానికి నువ్వు ప్రయత్నించలేదు. ఎందుకు?” అన్నాడు ప్రసాద్.

ఏం చెప్పాలా అన్నట్టు, చూసాడు, శరత్.

“నేను చెపుతా, విను. ఎందుకంటే, వాళ్ళని, నువ్వు ప్రేమిస్తున్నావు. వాళ్ళు నీ తల్లితండ్రులు, తోబుట్టువు. వాళ్ళు, వాళ్ళకి నచ్చినట్టుగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలన్నదే, నీ ఆకాంక్ష. తమ విషయాలలో వారి ఇష్టాయిష్టాలు, నీకు నచ్చకపోయినా, వారితో నీకున్న అనుబంధం, సంబంధం ప్రభావితం కావు. వారు ఎప్పటికీ, నీ వారే. నీ తోడుగా ఉంటారు. కాబట్టి, వారి విషయంలో నీకు ఎలాంటి డిసప్పాయింట్‌మెంట్ లేదు”.

“ఇక నువ్వు, దీపిక ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, ప్రేమించుకుంటున్నారు. ఒకరికొకరు తోడుగా, జీవన సహచరులై ఉండాలన్నది, మీ కోరిక. కానీ, మీకు ఇంకా పెళ్లి జరగలేదు. అగ్ని సాక్షిగా, వేదమంత్రాలతో, ‘ధర్మేచ, కామేచ, మోక్షేచ’, ‘మమః జీవన హేతునా’ వంటి, పెళ్లి ప్రమాణాలతో ఏర్పడే, మన హైందవ సంప్రదాయ వివాహబంధము, దాంపత్య జీవితాన్ని ప్రసాదిస్తూ, రెండు జీవితాలని, ఏకం చేస్తుంది. ఈనాడు, ఈ తరానికి, సాంప్రదాయ వివాహం పట్ల, కొంత చులకన భావం ఏర్పడటం, మన దురదృష్టం. ప్రపంచీకరణ, గుడ్డిగా మన హావభావాల్లోనూ, ఆహార్యంలోనూ, విదేశీ సంస్కృతులను అనుసరించడమే, దానికి కారణం. కాకపోతే, మనకింకా సాంప్రదాయ వివాహంపై ఉన్న, పవిత్ర భావానికి, నమ్మకానికి, తరతరాలనుంచి, మనలో ప్రవహిస్తున్న, మన పూర్వీకుల రక్తం, దాని తాలూకు పూర్వ వాసనలు, మనం చూస్తున్న, మన తల్లితండ్రుల, పెద్దల వివాహబంధాలే కారణం. పూర్వ వాసనలు అంటే, ఈ రోజుల్లో, చాలామందికి ‘జీన్స్’ అని చెప్పాలి.

అలా అగ్నిసాక్షిగా, మీ పెళ్లి అయినాక, దీపిక నీ భార్యగా, మీ కుటుంబ సభ్యురాలౌతుంది. ఆ వివాహబంధానికున్న, పవిత్రత, బలం, భార్యాభర్తలను జీవితాంతం సుఖదుఃఖాలు పంచుకుంటూ, కలసి ఉండేలా చేస్తుంది. కానీ ఎక్కడో, అయినవారిలో వియ్యమంది, భార్యాభర్తలు ఇరువురూ, ఒకే చోట పెరిగిన వారి విషయంలో తప్ప, మిగిలిన వారిలో, భార్య తన పుట్టింటి వాతావరణంలో, సుమారుగా పాతికేళ్ళు గడుపుతుంది. పెళ్లితో, భర్తకు చేరువౌతుంది. భార్యాభర్తలిరువురికి, అవతలి వారి మనస్తత్వము, ఇష్టాయిష్టాలు ఏవీ తెలియవు. మీ విషయం కూడా అంతే కదా! మీ పరిచయం, ప్రేమ మూడేళ్ళ క్రితమే కదా, మొదలైంది. కానీ, పెళ్లి ద్వారా ఏర్పడే, ఇరువురి నైతిక హక్కులు, బాధ్యతలు మిమ్మల్ని కలిపి ఉంచుతాయి. కాలక్రమేణా, ఇంట్లో, పెద్దవారి మార్గనిర్దేశకతా సహాయంతో, ఒకరి అభిప్రాయాలకి, మరొకరు విలువ ఇస్తూ, పరస్పరం తమ ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు పంచుకోవడం ద్వారా, మీ దాంపత్యజీవితం సఫలీకృతమౌతుంది.

కానీ, నువ్వు అనుక్షణం, దీపిక కదలికల్ని శాసిస్తున్నావు. అది ఎంత వరకు సమంజసం. నీతో జీవితాంతం కలిసి ఉండబోయే దీపికని, ఆమె అభిప్రాయాలని, ఆలోచనలని పట్టించుకోకుండా, భాధ పెడ్తున్నానా! అని, ఎప్పుడూ నీకు తోచలేదా! మనిషి, తనది అనుకున్నది, తనకి దూరం అవుతుందేమో అని, అనుక్షణం తపన పడుతూ, అభద్రతాభావానికి గురవుతాడు. అదే, దీపిక పట్ల, నీ అసహనానికి, నిరుత్సాహానికి కారణం.

చూడు శరత్, సమస్య అనేది, గులాబీ మొక్కలాటిది. ముళ్ళుండే మొక్కకి పూసే, గులాబీకి అందరిని, సమ్మోహితుల్ని చేసే అందముంది. అలాగే, ప్రతి సమస్యకి, సందిగ్ధం, పరిష్కారం వెన్నంటే ఉంటాయి. సందిగ్ధం, మనల్ని ముందుకు వెళ్లనీయదు. ముల్లులా, మనసుని గుచ్చుతూ ఉంటుంది. మన వివేచేనా శక్తి, సమస్యకి అందమైన, ఆనందకరమైన పరిష్కారాన్నీ సూచిస్తుంది”.

“దీపిక, నీకు కాబోయే భార్య. భార్యాభర్తల మధ్య ఉండవలసింది, నమ్మకం, పరస్పర అవగాహన. ఆ రెండూ ఉన్న దంపతులు కలకాలం సుఖసంతోషాలతో ఉంటారు. దీపికకి నీపై నమ్మకం, అవగాహన, రెండూ ఉన్నాయి. అంతకు మించిన, ప్రేమ ఉంది. అందుకే, నీ ప్రవర్తనతో సర్దుకుపోతోంది. కానీ, నువ్వు ఇలాగే, ఆంక్షలు పెడుతూ ఉంటే, తనకి నీపై ఉన్న నమ్మకం, ప్రేమ సడలి, తనని నువ్వు అనుమానిస్తున్నావని, అవమానిస్తున్నావని ‘ఫీల్’ అవ్వచ్చు. ఏ మనిషి, తన మనసు చంపుకుని, తన వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టి, జీవించాలని అనుకుంటాడు! దీపికకి కూడా, వ్యక్తిత్వం, మనసు ఉన్నాయి, కదా! శరత్, ఇప్పుడు చెప్పు, నువ్వనేది, నిజంగా, ఓ సమస్యేనా?” అన్నాడు, ప్రసాద్.

శరత్ హృదయం తేలికైయింది. ఆతని మనసుని ఆవరించిన అపోహలు, అనుమానాలు పటాపంచలయ్యాయి. గ్రహణం విడిచిన, పౌర్ణమి జాబిల్లి వెన్నెలసోనల ప్రవాహం, అవనిని ఆవరించినట్టు, ఆతని మనసుని ప్రశాంతత ఆవరించింది. ఉన్నపళంగా, దీపికని కలిసి, తన ప్రవర్తనకి క్షమాపణలు అడగాలని, నిశ్చయించుకున్నాడు.

“ప్రసాద్, నువ్వు చెప్పింది, సెంట్ పెర్సెంట్ కరెక్ట్. అమ్మ, నాన్న, చెల్లి, దీపిక అందరూ, నాకు కావలిసిన వాళ్లే. అమ్మానాన్నవాళ్ళు చేసే, కొన్ని పనులు నాకు నచ్చకపోయినా, వాళ్ళ సంతోషం కోసం నేను ‘కాంప్రమైజ్’ అవుతాను. అటువంటిది, నన్ను, నన్నుగా ప్రేమిస్తూ, నాతో జీవితం పంచుకోవాలనుకుంటున్న దీపిక పట్ల స్వార్థంతో, ‘హార్ష్’గా ప్రవర్తించాను. థాంక్స్ రా ప్రసాద్, మెనీ మెనీ థాంక్స్” అంటూ ప్రసాద్‌, తన చేతులతో చుట్టేశాడు,శరత్.

“చివరిగా, ఒక విషయం శరత్, జీవితాంతం భర్తకు, భార్య ప్రియురాలే. భార్యకు, భర్త ప్రియుడే. ప్రియురాలి స్పందనలు, ‘మనసా, వాచా, కర్మణా’, ఇరువురూ, మరొకరి సమక్షంలో, సాన్నిహిత్యంలో, ఎలా ఉన్నారన్నది మాత్రమే, ఆలోచన చేయాల్సిన విషయం. పరోక్షంలో, వారి అడుగుజాడల ఆలోచనలు, ఆరాలు, అవగాహనా, విశ్వాసలేమికి నిదర్శనం” అంటూ ముగించాడు ప్రసాద్.

***

శరత్ స్టేట్స్‌కి వెళ్లి రావడం, తరువాత శ్రావణమాసంలో, శరత్, దీపికల పెళ్లి జరగడం, సతీసమేతంగా ‘స్టేట్స్’కి వెళ్లడం, వెంటవెంటనే జరిగిపోయాయి. శరత్, దీపికలు స్టేట్స్ వెళ్లి, ఓ సంవత్సరంన్నర, కావొస్తోంది. ప్రసాద్‌తో, చాటింగ్, ఆడియో, వీడియో కాల్స్ చేస్తూనే ఉన్నారు.

ఓ రోజు శరత్ ఫోనులో, “ఒరేయ్! దీపికకి డెలివరీ అయింది, పాప పుట్టింది, ఇద్దరూ క్షేమం. పాప పేరు, ‘సాత్విక’ అని నిర్ణయించాము” అన్నాడు. ఓ వారం రోజుల తర్వాత, పాప ఫోటోలు, వీడియో పంపాడు. పాప బొద్దుగా, ముద్దుగా ఉంది. పాప కళ్ళని తదేకంగా చూస్తున్న ప్రసాదుకి, ‘ఓ ప్రాబ్లెమ్ రా’ అంటూ, శరత్ తన వద్దకు రాకముందే, తనని కలిసి, శరత్ గురించి చెప్తూ, బాధగా కళ్లనీళ్లు పెట్టుకున్న దీపిక కళ్ళు, కళ్ళ ముందు మెదిలాయి. పాప కళ్ళు, అదే ‘సాత్విక’ కళ్ళు.., అవును, సాత్విక తల్లి పోలిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here