సమాంతరం

2
2

[dropcap]హై[/dropcap]ద్రాబాద్, బషీర్‌బాగ్. 5-30 pm  ఏప్రిల్ 15,2030A.D.

చాలా పెద్ద మీటింగ్.

ఊరి బయట హైవే పక్కనున్న గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్థలానికి బయటి వూళ్ళ నుంచి, సిటీ నుంచి తండోపతండాలుగా ప్రజలు వివిధ వాహనాల్లో చేరుకుంటున్నారు.

రంగు రంగుల దృశ్యాలు, కలగాపులగంగా ధ్వనులు, అస్పష్టంగా… కల్లోలంగా.

అతను కుడి చేత్తో ఒక గిటార్ బాక్స్ లాంటిది పట్టుకుని తలవంచుకుని ఆజంఖాన్ బహుళ అంతస్తుల భవనం ముఖద్వారంలోకి ప్రవేశిస్తున్నాడు.

అంత చలిగా లేకపోయినా నల్లటి ఓవర్ కోటు మోకాళ్ళ దాకా, తలకి నల్లటి పడగలా వున్న కోట్ కాలర్ కప్పుకున్నాడు. కోటు లోపల మోకాళ్ళదాకా రబ్బర్ లాంటి సింథటిక్ మెటీరియల్‌తో చేసిన తొడుగులు, నల్లటి పాయింటెడ్ బూట్లు మీద బురద మరకలు.

బూట్ ఎడమ మడమ దగ్గర మాత్రం ఎర్రని నక్షత్రం గుర్తు తళుక్కుమంటోంది.

ఆజంఖాన్ బిల్డింగ్ 24 అంతస్తులు. లిఫ్ట్ 22వ అంతస్తు దాకా వుంది. అక్కడ బయటకు వచ్చాడు.

24వ అంతస్తుకి చకచకా ఎక్కేశాడు.

దుమ్ము పట్టిన మెట్లు. ఇక్కడ నిర్మానుష్యంగా వుంది. ఏవేవో ఇనప సామాన్లు, విరిగిన చెక్కముక్కలు, సిమెంటు పొడి, మట్టి, రాతి ముక్కలు చిందరవందరగా పడివున్నాయి.

ఒక కిటికీ దగ్గర కూర్చుని చకచకా ఆ గిటార్ బాక్స్‌ని తెరిచాడు. దాంట్లో నల్లగా మెరుస్తోంది టెలిస్కోపిక్ విజన్ వున్న లేజర్ గన్.

చకచకా దానికి సైలెన్సర్ అమర్చి మేగజైన్‌లో బుల్లెట్స్ లోడ్ చేసి సేఫ్టీ లాక్ తెరిచాడు.

మోకాళ్ళ మీద కూర్చుని వ్యూ ఫైండర్‌లో ఎర్రగా కనిపిస్తున్న ప్లన్ గుర్తుని ఫోకస్ చేసుకోసాగాడు.

***

ఆయనొక మహానాయకుడు. ‘నియంత’! రెండోసారీ, మూడోసారీ ఎన్నికయ్యి ప్రభుత్వంలో తిరుగులేని నాయకుడిగా ఆ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు.

‘ఫార్‌రైట్ వింగ్’ నాయకుడు. చాలా పెట్టుబడిదారీ స్వభావంగల వ్యక్తి అని పేరు. ధనవంతుల్నీ, వ్యాపారస్థుల్నీ పెట్టుబడీదారీ పారిశ్రామికవేత్తలనీ ప్రోత్సహించే విధానాలు అమలు జరిపి పారిశ్రామిక వృద్ధి రేటును 10 శాతం వరకు తీసుకొచ్చాడు.

రైతులు ‘దున్నే వాడిదే భూమి’ అంటే నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపించాడు, శాంతి భత్రతలు న్యాయ పరిపాలన పేరిట.

….పర్యావరణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. పరిశ్రమ పెట్టడానికి వీల్లేదన్న ఉద్యమకారులని ఎన్‌కౌంట్లర్ల పేరిట మట్టు పెట్టించాడు.

…ఆదివాసీల హక్కులు, నిర్మాణ రంగంలో వ్యవసాయ కూలీలు, కనీస వేతనం అంటే… వున్నది చాలు…పరిశ్రమలెలా పెంపొందుతాయి అని నచ్చజెప్పి పట్టించుకోలేదు.

అతను సైగ చేస్తే చాలు అడ్డం వచ్చిన వాళ్ళని పోలీసులు అదృశ్యం చేసేస్తారు.

అలాగే వృద్ధి చెందింది ఆర్థిక పరిస్థితి. దెబ్బతిన్నవాళ్ళు దెబ్బతినగా మిగిలిన వాళ్ళకి ఉద్యోగాలు, భద్రత మెరుగవుతున్నాయి. నివేదికలలో గ్రోత్ రేట్ పెరుగుతోంది.

పటిష్టమైన పోలీస్, తనని పొగిడే టీ.వీలు, పత్రికలు, దేవుడిలా ఆరాధించే అభిమాన సంఘాలు.. అపాయాలు కనిపెట్టే గూఢచారి వ్యవస్థ… ఇవన్నీ అతన్ని కాపాడుతున్నాయి.

ఈ రోజు వాళ్ళ ఎన్నికల మీటింగ్! ఎంత ధైర్యం లేకపోతే ఓపెన్ జీప్‌లో ప్రయాణిస్తాడు!

ముఖ్యమంత్రి ఎన్.ఎస్. త్రివేది (నిజానికి త్రివేదుల నరసింహ శాస్త్రి, అలా మార్చుకున్నాడు తన పేరు) చేతులు వూపుకుంటూ ప్రజల ధన్యవాదాలు, హర్షధ్వానాల మధ్య బషీర్‌బాగ్ మీదుగా వూరి బయట సభాస్థలి వైపు ప్రయాణిస్తున్నాడు.

సంజెకాంతులు ఎర్రగా అతని తల మీదా, తెల్లని కళ్లజోడు మీదా, అంత కంటే ధవళ వర్ణంలో వున్న అంగీ కుర్తాల మీద పత్రిఫలిస్తున్నాయి.

ఆయన చిరునవ్వుతో చేయి వూపుతున్నాడు.కోలాహలంగాసాగిపోతున్నదిప్రయాణంఊరేగింపులో. కానీ మరింత దట్టమైన ఎర్రటి రంగు అతని నుదుటి నుంచి మెడ మీదగా చారికలా ప్రవాహమైంది. నిశ్శబ్దంగా స్లో మోషన్‌లో ముందుకు వాలిపోయాడు త్రివేది. ఓ క్షణం ఎవరికీ ఏం జరిగిందో అర్థం కాలేదు.అందరూ అప్రతిభులై ఆగారు ఓ నిముషం.

జరిగింది అర్థమైన బాడీగార్డ్స్, పోలీసులు, గార్డులు హాహాకారాలు చేశారు. రణగొణధ్వనులు చెలరేగాయి.

ఆ గందరగోళంలో “బులెట్ ఆ భవనం మీద నుండి వచ్చింది, వెదకండి” అని ఒక ఆఫీసర్ మాత్రం ఆజంఖాన్ బిల్డింగ్ వైపు పరుగెత్తాడు. డజన్లకొద్దీ వున్న బాడీగార్డులు, నల్లటి రంగు యూనిఫారంలో వున్న జెడ్ కెటగిరీ భద్రత నిర్వహించే బ్లాక్ క్యాట్‌లు, స్థానిక పోలీసులు అందరూ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ వలయంలా ఏర్పడి ‘ఏంబులెన్స్, ఏంబులెన్స్!’ అని అరవసాగారు.

సెక్యూరిటీ ఛీఫ్ సుబ్రావ్ మాత్రం ఆజంఖాన్ టవర్స్ మెట్ల మీదుగా పరుగెత్తసాగాడు. మొదటి అంతస్తులో ఆగి లిఫ్ట్ బటన్ నొక్కాడు.

‘నో మిస్టేక్! నేను చూశాను! లేజర్ వెలుగు ఆ బిల్డింగ్ పై అంతస్తులో మెరిసింది. కాని మెట్ల మీదుగా వెళ్ళాలా, లిఫ్ట్‌లోనా! ఎలా హంతకుడిని పట్టుకోవడం?’ అనుకుంటూ 23వ నంబరు నొక్కాడు.

***

23వ అంతస్తు మీద నుంచి అతను చేతిలో గిటార్ బాక్స్ పట్టుకుని మెట్లు దిగసాగాడు. తాపీగా నల్లటి నీడలా…

***

5,6,7,8,9,10 లిఫ్ట్ అంకెలు మెల్లగా కదుల్తున్నాయి.

సెక్యూరిటీ ఆఫీసర్ సుబ్రావ్‌కి ఆదుర్దా ఆగలేదు. లిఫ్ట్ స్లోగా వెళ్తోందనిపించింది. లిఫ్ట్ స్టాప్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ 10 దగ్గర ఆగింది. బటన్ గట్టిగా నొక్కి బయటకు దూకాడు. పైనా కిందా కూడా ఫ్లోర్స్‌లో ఆఫీసులున్నాయి. ఇక్కడ కొంత మంది ఉద్యోగస్థులు, పనుల మీద వచ్చిన వాళ్ళు కిటికీల దగ్గర గుంపుగా నిలబడి కింద దృశ్యాలని చూస్తున్నారు.

హడావిడిగా పెద్ద గొంతులతో మాట్లాడుకుంటన్నారు.

లిఫ్ట్ బయటకి వచ్చిన సుబ్రావ్ మెట్ల వంక పైకి చూశాడు. వలయాలుగా తిరుగుతున్న మెట్ల పైన చకచకా దిగుతున్న నల్లకోటు వ్యక్తి కనిపించాడు.

పైనుంచి కింద నుంచి ఇద్దరి అకారాలు ఒకరినొకరు కలుసుకుంటున్నట్లున్నాయి. సుబ్రావ్ చేతిలో గన్ తీసుకొని మెట్లమీదగా పైకి పరిగెత్తాడు.

‘ఫ్లాష్! ఫ్లాష్!’ లైట్స్ తళుక్కున మెరిసి ఆరాయి. ‘ఢాం’ అనే చప్పుళ్ళతో బులెట్స్ మెట్లమీదగా పైకి వెళ్ళడం అందరూ గమనించారు.

పైన వ్యక్తి పరిగెత్తడం దూకడం, క్రింద ఫ్లోర్‌లో జనం అరుపులు!

సుబ్రావ్ సర్వీస్ రివాల్వర్ పేల్చుకుంటూ మెట్ల మీదగా పరిగెత్తాడు.

ధూళీ, పొగా, జనం హాహాకారాల మధ్య అతని మీద ఆ వ్యక్తి దూకడం, సుబ్రావ్ కిందపడటం జరిగిపోయింది.

చాలా బరువుగా వున్నాడు అతను. సుబ్రావ్ తేరుకుని చూసే లోపల క్రింది అంతస్తు మెట్ల మీదగా పరిగెత్తి అదృశ్యమయ్యాడు.

.. అతని పరుగు కూడా సామాన్యుల పరుగులా కాక ఒక వేగంతో కదిలిపోయే ఫోటోగ్రాఫ్‌లా వుంది.

అతని అంత వేగంగా కదిలాడు సుబ్రావ్.

స్వామి భక్తి! దేశ భక్తి! హంతకుడిని పట్టుకోవాల్సిందే!

క్రింది మెట్ల మీద నల్లటి కోటు ఆకారం సెల్లార్ వైపు దిగిపోయి అతనికి కనిపించింది.

పెద్ద మోటార్ బైక్… బహుశా చాలా శక్తివంతమైనది కిక్ స్టార్ట్ అవ్వడం… ఆ నల్ల కోటు, నల్ల టోపీ వ్యక్తి సెల్లార్‌లో భీకరమైన చప్పుడు చేసుకుంటూ దూసుకుపోవడం జరిగింది.

సుబ్రావ్‌కి ఓ క్షణం గగుర్పాటు! చుట్టూ చూశాడు. ఒక ఇన్నోవా కారు పార్కు చేసి వున్నది. ముందు అద్దం పగలగొట్టాడు గన్‌తో.

దాని అలారం కుయ్‌మని ఒక్క నక్క ఊళ లాగ అరవసాగింది.

గబగబా బానెట్ తెరిచి కొన్ని వైర్లు చేత్తో లాగేసాడు. కీ లేకుండా కారు స్టార్ట్ చేయడానికి రెండు వైర్లు కలిపాడు.

రెండు ప్రయత్నాలు తర్వాత ఇన్నోవా స్టార్ట్ అయింది.

ఇన్నోవాని సెల్లార్ నుంచి బయటకి దూకించాడు, ఎత్తుగా వున్న రోడ్డు మీదకి.

***

జనంలో కారుని మెలికలు తిప్పడానికి చాలా లాఘవంగా డ్రైవ్ చేయాల్సి వచ్చింది. ముందు వెళ్ళే నల్లకోటు టోపీ మోటార్ సైకిల్ ఎప్పుడో దూరమయింది. ఎలా?

సుబ్రావ్‌కి ఒకటే ఆలోచన! హంతకుడిని లొంగదీసుకోవాలి.

బహుశా అతను వెళ్ళే దారి హైవే కావచ్చు ఎటు వెళ్ళుంటాడు?

కింద జనం వున్న ప్రాంతం. ముఖ్యమంత్రి మోటార్‌కేడ్ ఆగిపోయిన ప్రాంతం చుట్టూ పోలీసులు, ప్రత్యేక రక్షణ దళాలు, బ్లాక్ క్యాట్స్ వలయంలా వున్నారు.

జేబులోంచి బ్యాడ్జ్ తీసి చూపించాడు సుబ్రావ్.

“అర్జంట్. గన్‌మ్యాన్‌ని ఫాలో అవుతున్నాను. దొరికాక, ఫోన్‌లో కాంటాక్ట్ చేస్తాను. మీరు ఇక్కడ నుంచి ఎవర్నీ పోనీకండి. అందరినీ చెక్ చేయండి” చెప్పాడు.

“ఓకె సార్” అంటూ సెల్యూట్ చేశాడు బ్లాక్ క్యాట్.

“కానీ మా కయితే ఎవరూ కనబడలేదు. ఆంజాఖాన్ బిల్టింగ్ నుంచి బయటకి ఎవరూ వచ్చినట్లు కనబడలేదు. కాని మీతో తోడుగా ఆఫీసర్ ఎవరూ లేరు. ఎలా వెళ్తారు సార్?”

“లేదు, అవసరం లేదు. డిఐజి గారికి డైరెక్ట్‌గా ఫోన్ చేస్తాను” చెప్పాడు సుబ్రావ్.

కారు దూసుకెళ్ళింది. కాని ఎటు వెళ్ళాలి? సుబ్రావ్ కళ్లు మూసుకుంటే విచిత్రంగా దూరంగా ఒక నలుసులా వున్న మోటార్ సైకిల్ ఫ్లైఓవర్ దిగుతూ కనిపించింది.

ఏక్సిలేటర్ నేలకంటా నొక్కాడు. తనకి కనిపిస్తున్నాడు, వాళ్ళకి ఎలా కనబడలేదు?

***

కోటీ, చాదర్‌ఘాట్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్ దాటుకుని ఎల్‌బినగర్ రింగ్‌రోడ్డు దాటి ORR దాటి నాలుగు లైన్ల జాతీయ రహదారి NH 65 మీద వేగంగా పోతున్నాడు సుబ్రావ్.

అతని కంటికి చట్టూ వున్నవీ, ఎదురుగా వచ్చేవీ ట్రాఫిక్ కార్లు కనబడటంలేదు. దూరంగా నలుసులా వున్న మోటార్ బైక్ మీది టోపీ ఆకారం మాత్రమే కనిపిస్తోంది.

అదే తదేకంగా! నిజంగా వుందా లేక… తన మనోనేత్రంలోనా?

తెలియదు..

క్రమంగా నిర్మానుష్యమైన హైవే. ఇంకా స్పీడ్‌గా పోనిచ్చాడు. ఫోర్‌ లైన్ హైవే మీద కిలోమీటర్లూ, వూర్లు దాటిపోతున్నాయి.

దగ్గరగా కనిపిస్తున్నాడు హంతకుడు. టోల్‌గేటు దగ్గర ఆగి ఏదో అరచి తన బాడ్జ్ చూపిస్తూ వేగంగానే పోతున్నాడు.

మరింత వేగంగా అతనిని ఓవర్ టేక్ చేసి అడ్డుగా వెళ్ళి ఆపాలి, లేదా కారు కిటికి లోంచి షూట్ చేయాలి.

సుబ్రావ్ వేగంగా స్టీరింగ్ తిప్పడంలో కారు అదుపు తప్పుతోంది. కళ్ళ కెదురుగా నల్లటి చారల డివైడర్ పెద్దగా కనిపిస్తోంది.

ఇంతలో ఏదో ఆరు చక్రాల ట్రక్. దాన్ని కూడా తప్పించగలిగాడు.

అడ్డంగా ఒక మహా వృక్షం. ఊడలతో, కొమ్మలతో… ఇదెలా వచ్చింది.

తల మీద పెద్ద చప్పుడు.

అంధకారం.

సుబ్రావ్‌కి స్పృహ తప్పే ముందు కనిపించింది –  ఒకే సైన్ బోర్జు. NH65 విజయవాడ 125 కిమీ. చీకటి గూడెం. నాలుగు కి.మీ. అన్న బాణం గుర్తుతో బోర్డు.

నల్లటి తారురోడ్డు, ఉపరితలం చీలినట్లు.

***

ఎక్కడో… ఏ సంవత్సరం.. ఎప్పుడో.. టైం.. తెలియదు..

చాలా ఎర్రరంగు వలయాలు కళ్ళముందు తిరుగుతున్నాయి.

దూరాన అస్పష్టంగా పాటలు, బృందగానం వినిపిస్తున్నాయి.

ఇంక్విలాబ్ జిందాబాద్… విప్లపం వర్ధిల్లాలి….

“కళ్ళు తెరువు కామ్రేడ్!” బరువైన కంఠస్వరం.

సుబ్రావ్ కళ్ళ తెరిచాడు. తల తిరిగిపోతోంది. అంతరిక్షయానం చేసి కిందికి దిగినట్లు కడుపులో తిప్పుతోంది.

అస్పష్టంగా నల్లటి ఆలివ్‌ గ్రీన్ యూనిఫారంలో వున్న వృద్ధ సైనికుడి రూపం!

కాసేపటికి భళ్ళున తెల్లవారినట్లు ప్రకాశవంతమైన కాంతి. తాను తెల్లని గోడల మధ్య ఈ తెల్లని బెడ్ షీట్ల మధ్య ఎర్రని రగ్గు కప్పుకుని..

గోడల మీద ఆలివ్ గ్రీన్ యూనిఫారంలో, పక్కకి వాలిన మిలిటరీ క్యాప్‌లతో ఒక వ్యక్తి, ఇతర ఆఫీసర్ల ఫోటోలు వరసగా తగిలించి వున్నాయి.

“లాంగ్ లివ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ భారత్!” వృద్ధ సైనికుడు అంటున్నాడు.

“సక్సెస్! కామ్రేడ్! నువ్వు నీకు అప్పగించిన పనిని చక్కగా చేశావ్! శత్రువుని హతమార్చావ్.”

“నేనా.. నేనా..”

లేచి కూర్చున్నాడు. వేగంగా బయటకి ఒక్క ఉదుటున పరిగెత్తాడు. ఆగు!ఆగు! అని ఎవరో వారిస్తున్నా సరే.

విశాలమైన రోడ్డు.

అటుయిటూ పెద్ద పెద్ద భవనాలు.

రోడ్డుకు అటు ఇటూ అవే ఫోటోలు. ఎర్ర రంగులో టోపీ తెల్ల గడ్డం తీవ్రంగా చూసే కళ్ళు. నవ్వే పెదాలు.

అవి ఎవరో నాయకుడివని తెలుస్తోంది. రోడ్డు పక్కగా ఎర్ర జెండాల తోరణాలు. గోడల మీద పెద్ద ఎర్ర నక్షత్రాలు.

కానీ ఎవరు?

సుబ్రావ్ మెదడులోని మెమరీ తెలిసిన ముఖాల ఫోటోలు వెదకసాగింది.

ఆగు… ఇది ఒకప్పటి విప్లవ పార్టీ జాతీయ చైర్మన్ సేతుపతి ముఖంలా వుంది కదా..

అతనే.. సేతుపతి. రంగరాజన్. సత్యపాతసింగ్, జయముఖర్జీ లాంటి వివిధ నామాలతో ప్రసిద్ధకెక్కిన అండర్‌గ్రౌండ్ నాయకుడు.

తను ‘వారి’ ప్రాంతంలోకి ఎలా వచ్చాడు. అసలు ఇది ఏ ప్రాంతం. ఛత్తీస్‌ఘడ్? ఒరిస్సా? బెంగాల్?

“కామ్రేడ్. భారత ప్రజా రిపబ్లిక్‌కి స్వాగతం. నిన్ను సుప్రీం లీడర్ చూడాలనుకుంటున్నారు. నిన్ను అభినందిస్తారు.”

“ఇది.. ఇది.. నేను.. నేను.. ఎక్కడ వున్నాను ఎలా వచ్చాను?”

ఆ వ్యక్తి నవ్వి అన్నాడు “కామ్రేడ్ మర్చిపోతున్నావా? షాక్‌లో వున్నావా? మన దేశం మన స్వతంత్ర్య మార్క్సిస్ట్ లెనినిస్ట్ ప్రజాస్వామ్య రిపబ్లిక్ భారత్.”

“సుప్రీం అంటే..”

“అయననే ఫీల్డ్ మార్షల్ సేతుపతి. నువ్వు చేసిన పనికి సంతోషించి వారు ‘ఆర్డర్ ఆఫ్ రిపబ్లిక్’ ఇస్తున్నారు.”

“నేను ఏం చేశాను.”

“ఆహా ఎంత వినయం. నువ్వు కామ్రేడ్ సుబ్రతో ముఖర్జీవి. అందరు విప్లవ యోధులకి, ఆదర్శ పురుషుడివి!”

సుబ్రావ్‌కి తలనొప్పిగా వుంది. కళ్ళు మూసుకుంటే అస్పష్టంగా భార్య అనిత ముఖం, పది సంవత్సరాల వయసు గల కొడుకు అజయ్ ముఖం… రోజు బై!బై! చెప్పే నవ్వే ముఖాలు.

అతనికి తల గిరగిరా తిరుగుతున్నట్లుంది.

కళ్ళు తెరిచాడు.

దూరాన మిలిటరీ వాహనాలు కనిపిస్తున్నాయి. వాటిలో యూనిఫారంలో వున్న సైనికులు కనిపిస్తున్నారు.

“నేను సుబ్రావ్‌ని. హైద్రాబాద్ పోలీస్ ఆఫీసర్‌ని. నాకేం తెలీదు. ఇక్కడ నేను వెంబడిస్తున్న గన్‌మాన్ ఏడి? నేను ఎవర్నీ చంపలేదు.”

అతను నవ్వసాగాడు.

“కామ్రేడ్ నువ్వు ఇంకా ల్యాగ్ పీరియడ్‌లో వున్నావు.”

అతని చేతిలో ఒక ఫోటో ఆల్బమ్. “చూడు నీ జీవితం ఇక్కడ.” అన్నాడు.

సుబ్రావ్ గబగబా ఫోటోలు తిప్పసాగాడు.

తలమీద ఏదో సమ్మెట పెట్టి కొట్టినట్టు.

వెర్టిగో… కళ్ళముందు రంగుల వలయాలు. ఆమె జుట్టు విరబోసుకుని నీలికళ్ళతో వుంది. నవ్వుతోంది. ఎక్కడివో జ్ఞాపకాలు. ఏవో మాటలు… ఏదో భాషలో…

క్రమంగా ఏదో అర్థం అవుతోంది.

“సుబ్రతో.. సుబ్రాతో..” బెంగాలీ భాష తనకి అర్థం అవుతోంది.

చివరి పేజీ

ఎర్ర జెండా. నక్షత్రం గుర్తు మధ్యలో‌ మిలిటరీ వాహనంలో వున్న నల్లటి శవపేటికని కప్పిన జెండా.

ఆలీవ్‌ గ్రీన్ యూనిఫారం సైనికులు… గన్ శాల్యూట్ చేస్తూ.

ఒక పెద్ద పూల దండతో నిలబడిన ఆ వ్యక్తి తనే.

“కామ్రేడ్ నీ భార్య దేశం కోసం పని చేస్తూ ఆత్మహత్యా దళంలో ఆహుతి అయిపోయింది.”

అతనికి పిడుగులు పడినట్లు, గుండెలు పిండినట్లు, ఏవో ఇది వరకే చూసిన భయంకర స్మృతులు. మర్చిపోయిన బాధ తిరిగి సలిపినట్లు.

“ఇది మరో దేశమా? లేక భారత్‌లో రాష్ట్రమా? నేను ఇక్కడ లేను! ఇక్కడ వున్నాను?”

“ఇది పీపుల్స్ భారత్ రిపబ్లిక్.”

“అయితే ఈ ఎర్ర జెండాలు, సైన్యం..”

“కామ్రేడ్. ఇది భారత్ రిపబ్లిక్. ప్రజా రిపబ్లిక్. విప్లవం 1948లోనే వచ్చింది. ఎందుకు అలోచిస్తున్నావ్. మర్చిపోయినావా?”

“అవును. జ్యామెట్రికల్ ప్లేన్స్ మధ్య మరో విశ్వం నుంచి ప్రయాణం చేసి వచ్చావ్ నువ్వు. కొంత కాలం ఈ బ్రెయిన్‌లో సందిగ్ధత, అయోమయం తప్పదు.

కాని నువ్వు ఇప్పుడు గొప్ప సాహసం చేశావ్.  రిపబ్లిక్ అంతా నిన్ను చూసి గర్వపడుతోంది. ఎక్కు  జీపు ఎక్కు, వెళ్దాం సుప్రీం కమాండర్ నివాసానికి.”

సుబ్రావ్‌కి తల దిమ్ముగా వుంది. అతని తలలో వివిధ రకాల తెరల మీద ఏవేవో దృశ్యాలు… అగస్టు పదిహేను 1947 త్రివర్ణ పతాకం ఎర్రకోట మీద.. కాని 1948 అర్ధరాత్రి సాయుధ విప్లవం. అంతర్యుద్ధం. హైద్రాబాద్.. ఢిల్లీ నగరాలు… సంకెళ్ళలో నాయకులు.

ఎర్రకోట మీద ఎర్ర జెండా.

మిలిటరీ యూనిఫారంలో ఆవేశంగా ఉపన్యసించిన నాయకుడు. పిడికిలి బిగించి “ఇంక్విలాబ్ జిందాబాద్”అంటూ.

ఎప్పుడో చిన్నప్పటినుండీ చెప్పుకున్నట్లు ప్రతి నవంబర్ 1న జరిగే ఎర్రజండా వందనాలు పాటలు, ఎర్ర జండాలు అలంకరించిన గ్రామాలు, రైతులు సహకార వ్యవసాయ సంఘాలు, సమావేశాలు. ఏవేవో జ్ఞాపకాలు..

“మరి అతను.. నేను వెంబడించిన ఆ నల్ల కోటు వ్యక్తి… హత్య చేసిన వ్యక్తిని వెంబడిస్తే పారిపోయి ఇక్కడికి వచ్చాడా?”

వాళ్ళ జీప్ కదిలింది.

అతను నవ్వాడు. “అది 21వ శతాబ్దంలో మేము చేసిన విజ్ఞాన శాస్త్ర పురోగతి. అది నువ్వే చూడు” అంటూ అతని తల మీద ఒక హెల్మెట్ లాంటిది పెట్టాడు. అది ఒక వర్చువల్ కెమెరా.

సుబ్రావ్‌కి ఇప్పుడు దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దూరాన ఆ వ్యక్తి. నల్ల కోటు, క్యాప్‌లో దగ్గరికి… ఇంకా దగ్గరికి వచ్చి.. తనలో ఐక్యం అయిపోయాడు అనే భ్రమ.

ఓపెన్ టాప్ జీప్‌లో స్లో మోషన్‌లో కూలిపోతున్న ముఖ్యమంత్రి… జనం అరుపులూ, కేకలూ.

చిందర వందరగా పడేసిన ఫోటోలలా దృశ్యాలు మెదడు ముందు.

“నో… నో… నో…”

సుబ్రావ్ జీప్ నుంచి దూకి పరుగెత్తసాగాడు. రెండు వాహనాలు ఆగాయి.

సుబ్రావ్ పరుగెత్తసాగాడు. ఇప్పుడు హంతకుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. తన పక్కనే వున్న ఒక సైనికుడి గన్ లాగి అతనికి గురి పెట్టాడు. అతని వెనకే పరుగెత్తున్నాడు.

హంతకుడి బింబం పరుగెత్తసాగింది.

“అతన్నిపట్టుకోండి. సమాంతర విశ్వపు ప్రయాణ బడలికలోనే వున్నాడు ఇంకా…”

“పట్టుకోండి! గన్ లాక్కోండి!” అరుస్తున్నాడు వెనుక ఆఫీసర్.

పొడుగ్గా నాలుగు లైన్ల హైవే. చివరగా పరుగెత్తున్న ఆకారం చిన్నచిన్నగా చీమలా అయిపోతోంది. ఎక్కడికో వెళ్ళిపోయింది.

సుబ్రావ్ పరుగెత్తున్నాడు.

“అతను వాళ్ళ ఆ ప్రపంచంలోకి పారిపోతున్నాడు. ఆపండి. అతను తననే షూట్ చేసుకుంటున్నాడు”

వెనక అరుపులు వినిపిస్తున్నాయి.

సుబ్రావ్ కళ్ల ముందు నవ్వుతూ వీడ్కోలు చెబుతున్న భార్య ముఖం. నుదుటిన బులెట్ నెత్తుటి చారికలో కూలిపోతున్న ముఖ్యమంత్రి త్రివేది చిత్రం… మారి మారి కనిపిస్తున్నయి.

అలానే గన్ తీసి ఎక్కుపెట్టి కాల్చాడు.

అతనికి విజయవాడ 125 కి.మీ.. చీకటి గూడెం అన్న బోర్డు కనిపిస్తోంది.

లేజర్ బులెట్… అంధకారంలోకి తోకచుక్కలా దూసుకెళ్ళింది.

దూరాన నల్లకోటు మనిషి రోడ్డు మీద కూలిపోవడం కనిపిస్తోంది. స్లో ఫోటోగ్రఫీలా.

సుబ్రావ్ కళ్ళ ముందు చివరగా కనిపించింది చీకటి గూడెం బోర్డు. ఆ తర్వాత నల్లటి తారు రోడ్డు మీద నెత్తుటి చారికలు.

***

డిసెంబర్ 2031. మైండ్ క్లినిక్, హైటెక్ సిటీ. 6.00 p.m.

“ఇన్ని నెలల నుంచీ అతనికి మళ్ళీ మామూలు తెలివితేటలు రాలేదు. ఎలెక్ట్రిక్ షాక్‌లు,  సైకియాట్రిక్ మందులన్నీ ఇచ్చాం” అన్నాడు సైకియాట్రిస్ట్ ప్రసాద్.

‘మైండ్ క్లినిక్, హైటెక్ సిటీ’లో సుబ్రావ్ చుట్టూ ఆందోళనగా భార్య.. కొడుకు అతనికేసి చూస్తున్నారు. పోలీస్ ఐజి, సైకియాట్రిస్ట్ ప్రసాద్, పక్కన ఇద్దరు నర్సులు వున్నారు.

“పోలీస్ ఫోర్స్‌లో చేరకముందే ఇతనికి మానసిక వ్యాధి వుందంటారా? అది మావాళ్లు ఎలా కనిపెట్టలేదో?”

“స్షైజోఫ్రీనియా, పారనాయిడ్ ఇల్యూషన్స్, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్.. ఏదైనా కావచ్చు. ఒకప్పుడు వాళ్ళు బయటకి సాధారణంగా వుంటారు.”

“తగ్గుతుందా?” భార్య ఆందోళనగా అడుగుతోంది.

“తగ్గుతుందమ్మా. ప్రయత్నిద్దాం.”

హఠాత్తుగా సుబ్రావ్ అరవసాగాడు – “విప్లవం వర్ధిల్లాలి! లాంగ్ లివ్ పీపుల్స్ రిపబ్లిక్! నన్ను మా దేశం పంపించేయండి! కామ్రేడ్ సేతుపతీ జిందాబాద్! పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ భారత్ వర్ధిల్లాలి!”

“నర్స్! లోరాజెపామ్ నాలుగు మిల్లీగ్రాం ఐవి అర్జెంట్.”

సుబ్రావ్ క్రమంగా మత్తులోకి జారాడు.

ఆ అచేతనంలో కూడా ఒకటే బోర్డు కనిపిస్తోంది NH65 విజయవాడ 125 కి.మీ. చీకటి గూడెంకి దారి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here