Site icon Sanchika

సమాంతరం-2

(ముఖ్యమంత్రి హత్య జరిగిన తర్వాత సుబ్రావ్ హంతకుడిని వెంబడించి తిరిగి వచ్చిన తర్వాత…. ఈ కథ మొదటి భాగం ఇక్కడ చదవచ్చు.)

[dropcap]తె[/dropcap]ల్లటి గోడలు.

పైన మెల్లగా చప్పుడు చేస్తూ తిరిగే సీలింగ్ ఫ్యాన్.

కిటికీ లోంచి పచ్చని లాన్స్, మధ్యగా ఎర్ర యిటుకలతో దారి.

ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అని తెలియడానికి నర్స్‌లు తెచ్చి ఇచ్చే బ్రెడ్ ముక్కలూ, లంచ్ ప్లేటు, డిన్నర్ ప్లేటు, మూడు పూట్లా వాడాల్సిన మందుల టాబ్లెట్లు – అవే గుర్తు – రోజులు గడిచినట్లు.

సుబ్రావ్ మెదడులో ఆలోచనలు మాత్రం జుయ్ జుయ్‌మని కందిరీగల రొదలా నలుమూలలుగా తిరుగుతునే వున్నాయి.

మైండ్ క్లీనిక్. మానసిక రోగుల చికిత్సాలయం.

తను పోలీస్ అఫీసర్ అని గుర్తుంది. భార్య అనిత కొడుకు అజయ్‌ని తీసుకొని ప్రతి ఆదివారం వస్తూంటుంది.

తనకిష్టమైన బిరియానీ చేసి తీసుకువస్తుంది.

“నాకేమయింది అనితా, ఎందుకు నన్నిక్కడే వుంచారు. డాక్టర్ ఏమయినా చెప్పాడా!”

అనిత కొంచెంగా నవ్వడానికి ప్రయత్నించేది. పెదాలు నవ్వుతున్నట్లున్నా, కనుకొలకుల్లో నీళ్ళు కనబడేవి.

“మీరు మానసిక షాక్‌లో వున్నారు అంటున్నారు. కొన్నాళ్ళు మందులు వాడాలి! అన్నీ బాగయిపోతాయి అని చెబుతున్నారు!”

“కాదు! కాదు! కాదు!” అరిచేవాడు. తన గొంతు హాస్పిటల్ కారిడార్లలో ప్రతిధ్వనించేది.

“నాకేమీ లేదు. నేను చెప్పేవన్నీ నిజం. ఆ చీకటి గూడెం పరిసరాల్లో ఒక అంతర్గత సమాజమేదో.. వుంది.. నేను చూశా..” అతని సమాధానం ముందే తెలిసినట్లుగా ఆమె నిర్లిప్తంగా వుండిపోయేది.

అతనికి ఆ నిర్లిప్తత ఇంకా ఎక్కువ బాధాకరంగా వుండేది.

“నాకు పిచ్చి లేదు. నేననేది నిజం!”

నర్స్ వచ్చేది. డాక్టర్ పరిగెత్తుకొని వచ్చేవాడు.

“ఏమయింది మేడమ్!”

మళ్ళీ మందులు. నిద్ర. మళ్ళీ మళ్ళీ వచ్చే కల.

ఎర్ర జెండాలు, సుత్తీకొడవలీ కత్తులతో అటు యిటు ఎగురుతూ వుండగా మధ్య రహదారిలో బారులు తీరిన యిధ్ధ ట్యాంక్‌లు, వాటిని మీద కూడా సుత్తీ కొడవలి గుర్తులు.

“కామ్రేడ్ సుబ్రతో, సుప్రీం లీడర్ నిన్ను పిలుస్తున్నారు.”

ఒక విశాలమైన గది. ఆకుపచ్చని యునిఫారాలు, ఎర్రని టోపీలతో భుజాల మీద మెడల్స్‌తో బలిష్ఠంగా వున్న సైనికాధికారులు.

“సుబ్రతో నీకు తెలుసుగా, శత్రువుని ఎలా తుదముట్టించాలో?”

సైలెన్సర్ బిగించిన గన్.

లేజర్ బులెట్.

మరోసారి. మరో రాత్రి. మల్లెపూల పర్‌ఫ్యూమ్ పరిమళంతో పొడుగ్గా బలిష్ఠంగా వున్న ఆమె తన పరిష్వంగంలో.. ‘సుబ్రతో, సుబ్రతో నిన్ను వదిలి వెళ్ళలేను. ఐ విల్ మిస్‌ యు.’

గుండెని పిండే ప్రేమ భావం, ఇది వరకే అనుభవించిన వేదన మళ్ళీ తుఫానులా.

జోరీగల రొదలా జ్ఞాపకాలు మెదడులో.

అనిత వెళ్ళిపోయేది. అజయ్ దీనంగా చూసి వెళ్ళిపోయేవాడు.

మరో ప్రపంచం. మరో జీవితం. మరో ఆదర్శం.. వుందా తనకి? వుంటే, మరి ఈ జీవితం?

ఈ వుద్యోగం, ఈ బాధ్యత, ఈ స్వామి భక్తి?

సుబ్రావ్‌కి తల పేలినట్లు ఆలోచనలు. సమాధానాల్లేని ప్రశ్నలు. ఇది తట్టుకోవడం కష్టంగా వుంది.

ఒక నెల పాటు ఇంటారాగేషన్, నిర్దాక్షిణమైన చిత్ర హింస అనుభవించినప్పుడు కూడా ఇంత బాధ లేదు.

“హత్య చేసిన వాడితో నీ సంబంధం ఏమిటి?”

“ఎందుకు ఎవరికి చెప్పకుండా వెంబడించావ్?”

“నీకు విప్లవకారులతో సంబంధాలు ఏమున్నాయి?”

“ఎందుకు సుప్రీప్ లీడర్, కామ్రేడ్ సేతుపతీ అని కొన్నిసార్లు కలవరించావ్?”

మళ్ళీ మళ్ళీ ఎలక్ట్రిక్ షాక్‌లు, మోకాలి చిప్ప మీద దెబ్బలు. తలక్రిందలుగా వ్రేలాడిగట్టి అరికాళ్ళ మీద వాతలు పడేలా కొట్టడం. గోళ్ళకింద గుండుసూదులు గుచ్చడం.

…చావకుండా బతకకుండా ఎన్ని రోజులు హింస పెట్టినా.. ఏమి చెప్పలేని తనని చివరికి మానసిక రోగిగా నిర్ణయించి ఇక్కడికి పడేసారు.

షైజోఫ్రీనియా అంతే. ఇతను హంతకుడో కాదో అనేది తేలలేదు.

బులెట్స్ ఇతని గన్ నుంచి రాలేదు. ఆ లేజర్ బులెట్స్ పేల్చే గన్నే ఇక్కడ లేదు, ఇతనికి లేదు.

కాని ఇతని ప్రవర్తన మాత్రమే అనుమానాస్పదం. మంచి ఆఫీసర్ కాబట్టి ఇంత వరకు స్వామిభక్తి విధేయతలు వున్న ఆఫీసర్ కాబట్టి మానసిక రోగిగానే నిర్ణయించారు.

అయినా అతనిని రహస్యంగా పరిశీలిస్తూనే వునారు.

సుబ్రావ్‌కి మాత్రం ఈ విషయం తేల్చుకోవాలనే వుంది. అది ఒక అణుచుకోలేని తీవ్రమైన అబ్సెషన్.

రాత్రి 8 గంటలకి డిన్నర్ ప్లేటు వస్తుంది. అప్పుడు భోజనం చేసి లైట్లు ఆర్పివేయిగానే నిద్రపోవాలి.

అయినా కెమెరాలో చూస్తూనే ఉంటారు.

పది గంటలకి వేసుకోవాల్సిన మందులు నిద్ర కలిగించేవీ, భ్రమలు తొలగించేవీ ఇస్తారు.

నర్స్ వృద్ధురాలు. దయగలది.

అందరూ తనని ద్వేషిస్తే ఈమె ప్రేమగా చూస్తుంది. తలుపు తీసి మరీ లోపలికి వచ్చి గ్లాసులో నీళ్ళు ఇచ్చి “ఈ రోజు ఎలావుంది సుబ్రావ్, తలనొప్పి తగ్గిందా, ఆలోచనలు తగ్గాయా” అని పరామర్శిస్తుంది.

ఆమెకి తనంటే మంచివాడని నమ్మకం. కానీ తప్పదు, నమ్మిన వాళ్ళనే మోసం చేయగలం. నిశ్చయించుకున్నాడు.

నర్సు మార్గరెట్ ‘సెరెనెస్’, ‘రెస్పెరిడోన్’ మాత్రలు ట్రేలో పెట్టి లోపలికి ప్రవేశిస్తూనే ఆశ్చర్యపోయింది. సుబ్రావ్ ఏడి? ‘సుబ్రావ్! ఎక్కడ?’

తలుపు చాటునుంచి ఒక్కసారి ఆమె నోరు మూసి లోపలికి తోసేశాడు. మెడ మీద గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. గెరిల్లా శిక్షణలో నేర్చుకున్నది ఈ విద్య.

ఆమె చప్పుడు లేకుండా స్పృహతప్పింది.

తొంగి చూశాడు. కారిడార్‌లో ఎవరూ లేరు, గార్డు ఏ బాత్‌రూంకో వెళ్ళినట్టున్నాడు.

పిల్లిలా అడుగులు వేసుకుంటూ నీడల్లో కలిసిపోతూ మెట్లు దిగి గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చేశాడు.

రిసెప్షన్‌లో ఏదో రాసుకుంటున్న నర్స్.

సెక్యూరిటీ గార్డ్ సింహద్వారం దగ్గర.

కాసేపట్లో అలారం మోగుతుంది. లైట్లన్నీ వెలుగుతాయి. సిసి కెమెరాలో తను కనబడకపోతే, ఐదు నిమిషాల్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు.

రిసెప్షన్ డెస్క్ మీద ఉన్న పేపర్ వెయిట్ తీసి పక్కనున్న గ్లాస్ డోర్స్ మీదకి గట్టిగా విసిరేశాడు.

పెద్ద చప్పుడు.

సెక్కూరిటీ గార్డ్, రిసెప్షనిస్ట్ ధ్వని వచ్చిన వైపు పరిగెత్తారు.

మెయిన్ డోరు నుంచి వాయువేగంతో బయటకి పరుగెత్తాడు సుబ్రావ్.

అక్కడి నుంచి లాన్స్‌లోకి, ఆ తర్వాత ఒక ఏంబులెన్స్ చాటుకి, తర్వాత వెనక్కి వెనక్కి నీడల్లోకి జరిగాడు. గోడలకి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏమీ లేదు.

కొంచెం టైం అయినాక హస్పిటల్ వెనక వైపు ప్రహారీగోడ నీడలో నడుచుకుంటూ వెళ్ళాడు.

హాస్పిటల్ లైట్లు వెలిగాయి.

సైరన్ మోగుతోంది.

గోడ నున్నగా వున్నా, పాకడం ఎక్కడం కష్టం.

అటు ఇటు వెదికాడు. ఒక చోట రాళ్ళగుట్ట వుంది.

దాని మీదగా ఎక్కి శ్వాస బిగించి చేతులు గోడ అంచు మీదకి చేర్చి ఒక్క దూకు దూకాడు.

అవతల ఏముందో తెలీదు.

కాని తప్పించుకోవాలి.

మరుక్షణం గోడ అవతల.

మురుగు కాలవలో… నీళ్ళు చిందిస్తూ పడిపోయాడు.

సో ఫార్ సో గుడ్!

ఇక తప్పించుకున్నట్లే. ఒక్కసారి శరీరం వూపి మురికి అంతా వదిలించుకున్నాడు.

***

రాత్రి రెండు గంటలు దాటి పదినిముషాలకి నిజంగా సిటీ అంతా తట్టుకోలేని నిద్రలోకి జారుకుంది. పోలీసుల చెకింగ్‌లు కూడా అయిపోయాయి. రెండో ఆట సినిమా నుంచి తిరిగి వెళ్ళేవాళ్లు, మిట్ నైట్ బిరియానీ తిని తూలుతూ ఇంటికి పోయేవాళ్ళు అందరూ కూడా రెండు గంటలకల్లా రోడ్లు ఖాళీ చేసేస్తారు.

హైటెక్ సిటీ మైండ్ క్లినిక్‌కి నాలుగు కిలోమీటర్ల దూరంలో జూబిలీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మత్తుగా మలుపు తిప్పిన స్కోడా కారు ఒక్క సారి సడెన్ బ్రేక్‌తో ఆగింది.

రోడ్డుకు అడ్డంగా క్రీనీడల్లోంచి తడిసిన మురికి బట్టల్లో వున్న ఆకారం ఆ కారుకు ఎదురుగా వచ్చేస్తోంది.

కారులో చక్రథరం ఒక్కడే వున్నాడు.

డ్రింక్ ఎక్కవయింది. దూరాన ఆఫీసులో ఎకౌంట్స్ చూసుకుని, సెక్రటరీ పిల్లతో కొంచెం రోమాన్స్ కూడా ప్రయత్నించి బయలుదేరేసరికి నీరసంగాను, మత్తుగాను వుంది. ఇలాంటప్పుడు డ్రైవరుని ‘లేటవుతుంద’ని ఇంటికి పంపించి తనే డ్రైవ్ చేస్తూంటాడు.

దయ్యమా? దొంగా? రౌడీనా? పిచ్చివాడా?

అద్దం మీద దడ దడ చప్పుడు.

“ఓపెన్, ఓపెన్” అని శబ్దం లేని పెదవుల చప్పుడు.

సుబ్రావ్ భయంకరంగా చింపిరి జుత్తుతో అర్ధరాత్రి నిద్రలేచి నెత్తరు తాగే రక్త పిశాచం జాంబీలా వున్నాడు.

గ్రహించిన చక్రధరం ఏక్సిలేటర్ నొక్కి స్పీడ్ పెంచేలోగానే..

అద్దం పగిలింది. తాళాలు లాగేసుకున్నాడు. సుశిక్షతమైన పోలీస్ ఆఫీసర్ సుబ్రావ్!

“సారీ! బట్ ఐ హావ్ టు డు దిస్!”

చక్రధరం నిముషంలో రోడ్ మీద పడివున్నాడు. స్కోడా దూసుకు పోయింది.

***

ఒక్కోక్కప్పుడు మెదడు మల్టీటాస్కింగ్ చేస్తూవుంటుంది.

శరీరం అసంకల్పిత ప్రతీకార చర్యలా (రిఫ్లెక్స్) డ్రైవింగ్ చేస్తుంటే, ఆలోచనలు కాంతి వేగంతో ప్రయాణిస్తున్నాయి. మనోఫలకంలో జీవన దృశ్యాలు మెరుపు కదలికలతో కనిపిస్తున్నాయి.

ఆ దేశం, ఆ ప్రాంతం లేక ఆ రాష్ట్రం లేక అదో ప్రపంచమా?

తన బొమ్మ తనకే కనిపిస్తోంది.

అతనికి ఒకసారి అస్పష్టంగా ఆ ప్రపంచంలోని స్మృతులు, మనోఘర్షణలు, సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. తాను తీసుకున్న శిక్షణా, మిలటరీ పాఠశాల, గెరిల్లా ట్రైనింగ్, స్నేహితులు.. అన్నింటికి మించి ఆమె.. ఆ మల్లెలూ, గంధం, చెమట కలిసిన శరీరపు పరిమళం..

ఆఖరి రోజు రాత్రి..

అతనికి అర్థం అవుతోంది. అత్మహత్యాదళంలోకి వెళ్ళబోతోంది కాబట్టి అంత ప్రేమతో, బాధతో.. ఆ రాత్రి.. అంత ప్రేమగా వుందేమో!

తన లాంటి తాను శవపేటిక దగ్గర రోదిస్తూ… “బీ బ్రేవ్! కామ్రేడ్!” అని వారిస్తూ సైనిక సహోద్యోగులు.. వారి ఈ జీవితం..

ఇక్కడ ఒక మిలిటరీ స్కూల్‌లో డెహ్రాడూన్‌లో శిక్షణ, పోలీస్ అకాడమీలో ట్రైనింగ్. పెళ్లి ఉద్యోగం.. ఇప్పుడు ముఖ్యమంత్రికే సెక్యూరిటీ గార్డుగా బాధ్యతగల ఉద్యోగం.

‘నాకు గుర్తుంది నాలాంటి వాడే అవతల షూట్ చేశాడు… దగ్గరవుతున్న అతని ఆకారం… లేజర్‌గన్‌తో గురి చూసి కాల్చి…’

కారు వేగంగా పొనిస్తున్నాడు. టోల్ గేట్ దగ్గర ఆగాలి. కానీ అడ్డంగా వున్న రాడ్‌ని కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు.

ఆశ్చర్యపోయిన టోల్ గేటు కిటికీలోని మనిషి ఫోన్‌తీసి అదుర్దాగా మాట్లాడసాగాడు. “కారు నెంబరు TS09 36781! ఆపండి. చాలా వేగంగా పోతున్నాడు!”

సుబ్రావ్ నేత్రాలు ఇప్పుడు దారి పక్కన పైన బోర్టుల వంక చూస్తున్నాయి. విజయవాడ దారిలో చీకటి గూడెం బోర్డు రావాలి. అక్కడే అక్కడే ఏదో వుంది.

వేగంగా వెళ్ళే కారులని దాటుకుని అతను విజయవాడ 125 కిమీ చీకటి గూడెం 4 కిమీ అన్న పక్కకు చూపించే బోర్డు దగ్గరగా వచ్చేసాడు.

సడెన్ బ్రేక్.

బయటికి దూకాడు.

చల్లని గాలి, దూసుకుపోతున్న కార్లు, ట్రక్‌లు హైవే మీద రొద చేస్తూ పోవడం. రోడు ప్రక్క ఎర్రటి లెట్లు… అంతరిక్షంలో నక్షత్రాల మినుకు మినుకు తప్ప ఏమీ లేదు.

దారి పక్క ఒక్క మర్రిచెట్టు పురాతన కాలంలోది మాత్రం వున్నది.

అతనికి క్రిందటిసారి కనిపించిన తను ఢీ కొట్టిన చెట్ట గుర్తుకు వచ్చింది.

దీనికి డాష్ కొడితే…

కోపం, నవ్వు కలగలిపి వచ్చేశాయి.

తనకి నిజంగా ఏవో మానసిక భ్రమలు, పిచ్చీ కలిగినట్లే వున్నాయి.

కారుని చెట్టుకి కొడితే కారు తగలడి తను చనిపోతాడు అంతే.

ఇక్కడ ఏమీ లేదు.

ఇదొక భ్రమ!

లేక కలా?

లేక షైజోఫ్రీనియా నిజంగానే?

నీరసంగా రోడ్డు పక్క కూలబడ్డాడు. దాహం వేస్తోంది. అలసట అతన్ని కమ్మేసి నిద్ర ముంచుకువచ్చింది.

పిచ్చివాడి లాగానే రొడ్డు పక్క ఒళ్ళు తెలియకుండా పడిపోయి నిద్రలో మునిగిపోయాడు.

రెండు గంటల తర్వాత కాని హైద్రాబాదు నుంచి వచ్చిన ఏంబులెన్స్, పోలీస్ వాహనాలు అతనిని కనిపెట్టలేదు.

***

“చెప్పు! ఎందుకు వెళ్ళావ్ అక్కడికి? అక్కడ ఏమి రహస్య సమావేశం వుంది?”

“తీవ్రవాదులా? విదేశీయులా? టెర్రరిస్టులా? ఎవరితోనయినా ఎపాయింట్‌మెంట్ లేకుండా ఎలా వెళ్లావ్?”

మళ్ళీ ప్రశ్నలు. కరెంటు షాక్ తలకి. మొకాళ్ళ మీద దెబ్బలు!

“నేనేం చెప్పలేను. క్రిందటిసారి అక్కడ నేను ఆ ప్రదేశంలోనే ఒక అనుభవం ఎదుర్కొన్నాను. అది ఒక మరొక భారతదేశం. కమ్యూనిస్టు జండాలతో నియింతృత్వంలో మిలటరీ ప్రభుత్వధినేతతో వుంది.”

‘..ఇతనికి పిచ్చైనా వుండాలి. లేక కావాలని మనని మభ్యపెట్టడానికి ఇలాంటి మాటలు చెబుతుండాలి.’

వాళ్ళు మెంటల్ హాస్పిటల్‌కి పట్టుకుని తీసుకొవచ్చి రెండు రోజులు ఇదే ఇంటరాగేషన్‌.. అంటే ప్రశ్నలు హింసా మొదలు పెట్టారు.

సబ్రావ్‌కి నిజంగానే తనకి మానసిక వ్యాధి అనే అనుమానం బలపడసాగింది.

ఆరు గంటల తర్వాత సైకియాట్రిస్ట్ వచ్చి అరిచాడు.

“ఇక చాలు! షైజోఫ్రీనిక్ రోగిని చిత్ర హింస చేస్తున్నారు. ఇది అనైతికం. నేను ఒప్పుకోను. ఇక ఆపండి. అతనివన్నీ భ్రమలు. ట్రీమ్‌మెంట్ ఇస్తాను!”

మిలిటరీ ఇంటలిజెన్స్ సిబ్బంది అధికారులు మౌనంగా వెళ్ళిపోయారు.

వృధ్ధుడైన డాక్టర్ కళ్లలో కరుణ, ఆప్యాయత.

“ముందు ఏమన్నా తిను.”

నర్స బ్రెడ్, పాలు తీసుకువచ్చి ఇచ్చింది.

“మందులు వేసుకో! నిద్రపో!”

కృతజ్ఞతగా చూసి “థ్యాంక్స్ డాక్టర్! కాని నేను నిజంగా చూసినవే చెప్పాను. అని భ్రమలు కావు!”

డాక్టర్ నవ్వి “సరే! ముందు మందులు వేసుకో!” అని వెళ్ళిపోయాడు.

నొప్పులు తగ్గి కడుపు నిండి మత్తులోకి జారాడు.

ఆ నిద్ర అర్ధరాత్రి వరకు సాగింది. ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. గదిలో నీలపు కాంతి తప్ప ఏమీలేదు.

ఠప్ మన్న చప్పుడుతో రెండు ఆకారాలు ప్రత్యక్షమయ్యాయి. లైటు వెలిగింది.

***

చిమ్మ చీకటి చుట్టుముట్టి మధ్యలో నీలం వెలుతురు. దానిలోంచి రెండు కాంతి పుంజాలు ‘హోలోగ్రామ్’లాగా ప్రత్యక్షమయితే..

అర్ధరాత్రి నిద్ర మ్తతులో, మందుల మత్తులో హఠాత్తుగా చూసిన వాడికి ఎలా వుంటుంది.

సుబ్రావ్‌కి చల్లటి చెమటలు పోసినట్లయి, గుండె వేగం హెచ్చయ్యి మళ్ళీ తగ్గినట్లనిపించింది.

ఘనీభవించిన మనష్య ఆకారాల్ని గుర్తు పట్టగలిగాడు.

అవే ఆలివ్ గ్రీన్ రంగు బట్టలు, ఎర్ర టోపీలు. తను అక్కడ చూసిన సెక్యూరిటీ గార్డులు.

‘జై పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ భారత్ కీ!’

“హలో కామ్రేడ్ ఎలా వున్నావు?” ఇద్దరూ ఒకే సారి అడిగారు.

సుబ్రావ్ తేరుకుని, బలహీనంగా “హలో కామ్రేడ్స్! నేను ఇక్కడ బందీనయివున్నాను. మానసిక రోగిలా చికిత్స చేస్తున్నారు. ఎలా బాగుంటాను? చెప్పండి ప్లీజ్. మీరెలా వచ్చారు? నేనెవర్ని? మీరెవరు? ఇది నిజమా భ్రమా?”

ఇద్దరిలో ఒకతను మధ్యవయస్కుడు. తెల్లని మీసాలతో గంభీరంగా వున్నాడు.

“అర్థం చేసుకోవడానికి నీకు కొంచెం కష్టం అవుతుంది. కానీ చెబుతాను విను కామ్రేడ్!”

వాళ్ళిద్దరూ ఆ గదిలో మంచం మీద కూర్చున్నా, సుబ్రావ్‌కి కాంతి పుంజాల్లోను మళ్ళీ మానవాకారాల్లోను కనిపిస్తూ నిలబడే చెప్పసాగారు.

ఒకరి చేతిలో ఒక చిన్న ఎర్రని బంతి లాంటి వస్తువు చూపించి అడిగాడు – “ఇది ఏమిటి?”

“ఎర్రని బంతి!”

“ఔను ఈ వస్తువు నీకు తెలిసినంత వరకూ ఒకే చోట ఒకే వస్తువులా వుంటుంది. అయితే ఇది అణువులుగానో, అణువులు కంటే స్వల్పమైన న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ లాంటి అతి చిన్న సబ్‌ఎటామిక్ పార్టికిల్స్ లాగానో వుంటే.. అదే అన్ని చోట్ల వుండవచ్చు నీకు తెలిసిన ఈ ప్రపంచం విశ్వం మరొకటి మరొక జియోమెట్రిక్ ప్లేన్‌లో ఇలా ఏర్పడవచ్చు. ఆ విశ్వంలో నీ లాంటి నువ్వే వుండచ్చు. ఇంకా ఎన్నో విధాల వేరే రకాల చర్యలు ప్రతిచర్యలు జరుగుతూ వుండవచ్చు!”

సుబ్రావ్ తల పట్టుకున్నాను.

“నాకు ఫిజిక్స్ రాదు! మీరు ఏం మాట్లాడుతున్నరో అర్థం కాలేదు. కాని మరొక సమాంతర ప్రపంచం ఇక్కడే ఎక్కడో వేరే రాజకీయ సిద్ధాంతం, చరిత్రతో వున్నది అని అర్థం అవుతోంది.”

ఇద్దరూ సంతోషంగా నవ్వూరు. “అది తెలిస్తే చాలు కామ్రేడ్! సమాంతర విశ్వంలో భారత్ ఎప్పుడో ఏర్పడింది. అది శ్రామిక రాజ్య నియంతృత్వంలో సమానత్వం, ప్రగతీ, శాస్త్ర పురోగతి సాధించింది. ఇక్కడున్న అన్యాయాలు,  ఈ సమాజంలోని అసమానత్వాన్ని ఎదుర్కొడానికే నిన్ను ఎన్నుకొంది..”

ఆ రాత్రి సుబ్రావ్ మెదడులోని అణువణువులో సందేశాలు, ఆ సమాంతర విశ్వంలోని చరిత్ర సిధ్ధాంతాలు.. ఇవే ఇవే మారుమ్రోగాయి.

“మరి అక్కడికి ఎలా వెళ్ళడం? అక్కడ మరో నేనున్నాను కదా.. అతనిని ఉపయోగించుకున్నారు కదా” నీరసంగా అడిగాడు సుబ్రావ్.

“అతన్ని నీవు చంపేశావ్. వీరిద్దరూ మేటర్, ఏంటీమేటర్‌లా ఒకరినొకరు సమీపించినప్పుడు జరిగే విస్ఫోటనానికే నీ మొదడు అల్లకల్లోలమైంది. నీకక్కడ వేరే జీవితం వుంది. లక్ష్యం వుంది. ఒక నిర్దిష్టమైన పాత్ర వుంది. అక్కడికి నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చాం!”

“ఎలా! ఎలా! చీకటి గూడెం దగ్గర నేను ప్రయత్నించాను. కానీ ఎలా… ఆ స్పేస్ లోకి నేను ఎలా వెళ్ళగలను? లేక మీరు ఎలా వెళ్ళగలరు? నేను ఒకసారి ఎలా వచ్చాను? నాలాంటి ఆ వ్యక్తి హంతకుడిగా ఎలా ఈ ప్రపంచంలోకి వచ్చాడు?”

నిశ్శబ్దం.

“ఇది కాలంలో ముందుకి వెళ్ళడం కాదు. కాలంలో వెనక్కీ కాదు. కాలంలోనే పక్కనే వెళ్ళడం. క్వాంటమ్ ఫిజిక్స్, వార్మ్‌హోల్స్ ఇవన్నీ నీకు తెలిసి వుంటే ఇవి అర్థం అయేవి. ఇప్పుడు అర్థం చేసుకోవడం అనవసరం. నువ్వు మాతో వస్తున్నాను అంతే. ఏదయ్యినా అనుకో, సబ్ఎటామిక్ పార్టికల్స్ గానో, ఆలోచనల రూపంలోనో నువ్వు మా పీపుల్స్ రిపబ్లిక్ భారత్‌లోకి ప్రవేశిస్తున్నావ్. వెల్‌కమ్! సుబ్రావ్! నువ్వొక యోధుడివి. నీకు ఇక్కడు పని లేదు!”

ఆ తర్వాత ఆ వెలుగులన్నీ ఆరిపోయి. ఒక్క మెరుపుతో గది చీకటిలో నిండింది.

***

ఆ మర్నాడు గది తెరిచిన నర్స్‌కీ, వార్డ్ బాయ్‍కీ ఖాళీ మంచం కనిపించింది. గోడలోని కిటికీ మాత్రం విరిగిపోయి దాని గాజు అద్దాలు పగిలిపోయి గది అంతా పడి వున్నాయి.

అక్కడ నివ్వురవ్వలు కాలిన నల్లటి బొగ్గు మరకలు గోడల మీద ఏర్పడ్డాయి.

“డామిట్! సుబ్రావ్ మళ్ళీ తప్పించుకున్నాడు” అన్నాడు సెక్యూరిటీ గార్డు. “నా వుద్యోగం పోయినట్లే!”

(ఇంకా వుంది)

Exit mobile version