Site icon Sanchika

సమస్య అలా సమాప్తం అయింది

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘సమస్య అలా సమాప్తం అయింది’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

(ఈ హాస్య కథ కల్పితం. ఎవరినీ ఉద్దేశించినది కాదు. మద్యపానం సమస్యలకు పరిష్కారమని చెప్పటం రచయిత ఉద్దేశం కాదు.)

[dropcap]కాం[/dropcap]తం సుబ్బారావుని మెడ పట్టుకుని బయటికి గెంటేసింది. దాంతో దబేల్మంటూ బయటకొచ్చి పడిపోయాడు. అవి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కావడంతో ఎవరూ చూడలేదు. పైగా సెకండ్ ఫ్లోర్. వెంటనే లేచి ఫ్యాంట్ అదీ దులుపుకున్నాడు, చుట్టూ చూశాడు, ‘అమ్మయ్య ఎవరూ చూడలేదు, బతికిపోయాను’ అనుకుంటుండగానే ఎదురు ఫ్లాట్ అతను డోర్ తెరిచి “ఏంటండీ ఆ శబ్దం” అంటూ అడిగాడు ఒక నవ్వు నవ్వి అటు, ఇటు తలతిప్పి చూస్తూ.

“ఏమీ లేదండి నేనే. బనీన్లోకి గండు చీమ దూరితే, దబ,దబా గెంతాను. దాంతో అది కిందపడి మీ ఫ్లాట్ వైపే వెళ్ళడం చూశాను” చెప్పాడు సుబ్బారావ్ పళ్లికిలిస్తూ

“మా ఫ్లాట్ వైపా” అంటూ కంగారుగా కట్టుకున్న లుంగీని కాస్త పైకి లాక్కుని, తలుపు మూసుకొని లోనికి పోయాడు.

తర్వాత కాంతం తలుపు తీస్తుందేమోనని నెమ్మదిగా తలుపు కొట్టాడు. కానీ ఫలితం లేదు. ఫోన్ చేశాడు రిప్లై లేదు. ఇక అక్కడ ఉండడానికి మనసు రాలేదు. నెమ్మదిగా నడుచుకుంటూ అపార్ట్మెంట్ సెల్లార్లోకి వచ్చాడు. అతనికి ఏం చేయాలో పెరుగుపోలేదు. జరిగింది గుర్తు చేసుకుంటూ, ‘ఛ, ఛ నాకు ఇలా జరగాల్సిందే. అవును, నేను ఈరోజు మా ఆవిడ్ని జ్యువెలరీ షాప్‌కి తీసుకెళ్లి, తనకి ఒక నగ కొంటానని చెప్పాను. ఎందుకంటే, రేపు ఆమె పుట్టినరోజు కాబట్టి. కానీ నాకు ఇవాళ అందాల్సిన చీటి డబ్బులు అందలేదు. దాంతో ఈరోజు కొనలేకపోయాను. దాంతో ఆమెకి కోపం నషాలానికి అంటి, నాపై ఉమెన్ హ్యాండ్లింగ్ చేసింది. అయినా రాను రాను భర్త అంటే గౌరవం, మర్యాద మన్ననా లాంటివన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి. అయినా బంగారమే భాగ్యమా? భర్త ఎందుకూ పనికిరానివాడా!’ అని అసహనంగా అనుకుంటూ జేబులోని సిగరెట్ తీసి వెలిగించి, గట్టిగా పీల్చి వదిలాడు. అయినా సరే అతని మనసులో బాధ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ పోయింది. దాంతో కాలుస్తున్న సిగరెట్ నేలకేసి కొట్టి, ‘మొత్తం మూడంతా పాడైపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి! ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళదామంటే నాకు ప్రస్తుతం ఫ్రెండ్స్ లేరు, ఈ బరువుని ఎలా తగ్గించుకోవాలి’ అనుకుంటూ తనలో తానే తెగ నలిగిపోయాడు. తర్వాత కొంత సేపటికి, తన ఫ్రెండు రామారావు ఒకప్పుడు చెప్పిన సలహా గుర్తొచ్చింది. ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా, బార్‌కి వెళ్లి ఒక మూడు పెగ్గులు కొడితే చాలు, ఆ సమస్య సమాప్తం అయిపోతుంది అని చెబుతూ ఉండేవాడు. సరే ఈ ఒక్క రోజు తను బార్‌కి ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నాడు మనసులో. అనుకున్నదే తడవుగా తన కారు తీసి, అక్కడున్న మంచి బార్లలో ఒకటి సెలెక్ట్ చేసుకుని, అక్కడ కార్ ఆపి బార్లోకి దూరాడు. లోనికి వెళ్ళి కూర్చోగానే, బేరరు వచ్చి, మెనూ ఇచ్చి నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ మెను కార్డులో ఏవేవో పేర్లు ఉన్నాయి. అవి అతనికి పరిచయం లేదు, ఎందుకంటే మందు కొట్టడం ఇదే మొదటిసారి. పైగా భార్య మెడబట్టి గెంటడం కూడా ఇదే మొదటిసారి. అందుకే మందు తాగి ఆ అవమానాన్ని మరిచిపోవాలని నిర్ణయించుకుని ఇలా బారుకొచ్చేసాడు. బేరర్ తన టేబుల్ దగ్గరకి రాగానే “ఇందులో బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను, వాడ్కా ఇలా ఏదో ఒకటి మూడు పెగ్గులు తెచ్చి నా మొహాన కొట్టు. దాంట్లో నంచుకోవడానికి ఏదో ఒకటి, అంటే కారం బఠానీలు, వేరుశనగ పలుకులు, బంగాళదుంప చిప్స్ ఇంకా ఏదైనా సరే ఓ రెండు ప్లేట్లు పట్టుకొచ్చి తగలడు” చెప్పి అతన్ని పంపించేసాడు. తర్వాత ఆ మెనూ పక్కన పడేసాడు. అతను వెళ్ళిన పది నిమిషాల్లోనే ఒక చిన్న బాటిల్‌తో తిరిగి వచ్చి, “ఇదిగోండి సార్ ఇందులో మూడు పెగ్గులు ఉంటాయి. వేసుకోండి” అంటూ అక్కడ ఒక గ్లాసు, ఒక సోడా, కూల్ డ్రింక్ పెట్టేసి, “మీకు ఏది ఇష్టమో అది సెలెక్ట్ చేసుకుంటారని వాటర్, డ్రింకు తెచ్చాను” అని నవ్వేసి అతను ఆ టేబల్ నుండి వేరే టేబుల్ కి వెళ్లిపోయాడు.

సరే అని ఆ మందు తాగడం మొదలు పెట్టాడు. కటిక చేదు, పైగా ఘాటుతో గొంతు మండిపోయింది. అయినా సరే ఆర్డర్ చేసాక తాగక తప్పుతుందా అని మూడు అంటే మూడు పెగ్గులు ఎలాగోలా బలవంతంగా తాగాడు. ‘ఈ చేదును ఎలా తాగుతారో. ఇది తాగితే ఉన్న సమస్య పోయి, మనసు తేలికై పోతుందని చెప్పాడు, కానీ నాకు బాధ పోలేదు సరికదా, ఎక్కువైంది. పైగా నోరు కూడా పాడైపోయింది. యాక్ ఛ, ఛ’ అనుకున్నాడు ముఖం చిట్లిస్తూ. ‘దీనికంటే మా ఆవిడ తిట్లే నయం. అయినా చెప్పింది చెప్పినట్టు చేసేయాలి. లేకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ నగని ఆవిడ ఇప్పుడు ఈరోజు కొత్తగా అడిగిందా? పోయిన సంవత్సరం అడిగింది. ఇప్పుడు కొనిస్తాను, అప్పుడు కొనిస్తానని సంవత్సరంగా ఊరించి, ఈరోజు కొని తెస్తానని బిల్డప్ ఇచ్చాను. తీరా నగ తేకపోయేసరికి ఆమెకి కోపం వచ్చి నన్ను మెడ పట్టుకుని బయటికి తోసేసింది. అయితే ఆమె నా మెడ పట్టుకోవాలని పట్టుకోలేదు. వీపు మీద చేయేద్దాం అనుకుంది, కానీ నేను కొంచెం వంగేసరికి ఆ చెయ్యి నా మెడ మీద పడింది. అయినా ఒక ఐదు నిమిషాలు కూడా అక్కడ నించోకుండా చకచకా ఇలా బార్‌కు రావడం నాదే తప్పు. ఇంకెప్పుడూ ఇలా చేయకూడదు’ అనుకుంటూ బిల్లు కట్టేసి, మళ్లీ తన ఫ్లాట్‌కి వెళ్లి భార్యకి ఫోన్ చేశాడు. వెంటనే ఆమె తలుపు తీసింది. బుద్ధిగా లోపలికి నడిచి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. ఆమె అతని వంకే చూస్తూ, ఏదో అనుమానం వచ్చినట్టు వాసన చూస్తూ “మీరు తాగారా” అడిగింది సీరియస్‌గా.

ఇప్పుడు కాదని చెప్పినా ప్రయోజనం ఉండదు, కాబట్టి నిజం ఒప్పుకోవడమే మంచిది అని మనసులో అనుకుంటూ “అవును కాంతం, కొంచెం తీసుకున్నాను. మనసు కొంచెం బాధపడింది, అందుకనే అలా బార్‌కి వెళ్ళాను. కానీ ఇదే మొదటి సారి, చివరి సారి” అంటూ భయంభయంగా ఆమె వైపు చూసాడు.

ఆమె సుబ్బారావు చేతులు పట్టుకుని “నన్ను క్షమించండి, పాపిష్టి దాన్ని. నగ కొనిస్తానని కొనివ్వకపోతే నాకు మహా కోపం వచ్చేసింది. దాంతో బయటికి తోసేసాను. అయితే మీరు వెళ్లిపోగానే, అపార్ట్మెంట్ అంతా వెతికి, వెతికి వచ్చాను. మీ కార్ లేకపోవడం చూసి, వలవలా ఏడ్చాను. అది మీకు కనిపించిందా? కనిపించలేదు కదా! మీకు చాలా సార్లు ఫోన్ చేశాను. కానీ మీరు ఎత్తలేదు. అందుకనే ఏం చేయాలో తెలీక ఇలా మిమ్మల్ని తలుచుకుంటూ, కుమిలిపోతున్నాను. మీరు నే చేసిన పనికి మనసు పాడు చేసుకుని, మందు కొట్టొస్తారని మాత్రం అనుకోలేదు. నన్ను క్షమించండి, ఇంకెప్పుడూ అలా ప్రవర్తించను” అంటూ అతని రెండు కాళ్లు పట్టుకుంది. దాంతో సుబ్బారావ్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ-

“మందు తాగితే సమస్య సమాప్తం అయిపోతుందీ అని రామారావ్ అంటే ఏవిటో అనుకున్నాను. నిజవేనన్నమాట” అని మత్తులో అమాయకంగా సణుగుతూ ఆమెని నెమ్మదిగా పైకి లేపాడు.

Exit mobile version