Site icon Sanchika

సమస్య తీరింది

[‘సమస్య తీరింది’ అనే పిల్లల కథ అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

[dropcap]క్లా[/dropcap]స్ రూమ్‌లో టీచర్ ఎవరూ లేనందున పిల్లలు తెగ మాట్లాడుకుంటున్నారు. వాళ్ల అరుపులు క్లాస్ రూమ్ దాటి బయటికి వినపడుతున్నాయి. రోజు వాళ్లకు క్లాస్ తీసుకునే మాస్టారు వేరే వూరికి ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళిపోయాడు. మారుమూల ఉన్న పల్లెటూరు కావడంతో ఎవరూ రావడం లేదు. ఒకవేళ వచ్చినా ఎక్కువ రోజులు ఉండడం లేదు. ఇప్పుడు కూడా సూర్యం మాస్టారు స్పౌజ్ పెట్టుకుని వేరే ఊరు వెళ్ళిపోయాడు.

ఉన్న టీచర్లు ఇద్దరు. అందులో ఒకరు వెళ్లిపోవడంతో పిల్లలు ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటూ, కొట్టుకుంటూ ఉన్నారు. చదువు సంగతి తర్వాత క్రమశిక్షణ అయిన నేర్పించాలి కదా. హెడ్ మాస్టర్ గారు తల బాదుకుంటున్నారు. ఎప్పుడూ ఇదే సమస్య – స్టాఫ్ ఉంటే కదా పాఠాలు బోధించే పని. ఏమి చేయాలో తోచడం లేదు.

ఆ వూర్లో రవి అనే ఒక యువకుడు ఉన్నాడు. పదవ తరగతి వరకూ చదువుకున్నాడు. యే ఉద్యోగం దొరకలేదు. ఎమ్మేలు, బియ్యేలు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు లేవు. పదవ తరగతి వాళ్లకు ఏమి ఉద్యోగాలు దొరుకుతాయి?. రవియే పని లేక ఖాళీగా ఉంటున్నాడు. ఊళ్ళో వాళ్ళకి చిన్న చితక సహాయాలు చేస్తుంటాడు. నీతి నిజాయితీతో పని చేస్తాడు. దేశ ప్రగతికి ఎలాంటి యువకులు అవసరమో ఖచ్చితంగా ఆ లక్షణాలు ఉన్న యువకుడు రవి.

ఒకరోజు హెడ్ మాస్టర్‌కు రవిని చూశాక ఒక ఆలోచన వచ్చింది. క్రమశిక్షణ తప్పుతున్న పిల్లలకు ఒక దారి చూపించలంటే ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకొన్నారు. అప్పుడు రవిని పిలిచి విషయం చెప్పారు. “నువ్వు రోజూ వచ్చి ఈ పిల్లలకు పాఠాలు చెప్పగలవా?” అని అడిగారు. అందుకు రవి “మాస్టారు, పాఠాలు అంటే నేనేమీ చెప్పగలను? ఏదో సరదా కబుర్లు ఆటలు తప్ప నాకేమి వచ్చు?” అన్నాడు.

“నీకు తెలిసినవే చెప్పు రవి, పిల్లలు దారి తప్పి కొట్టుకుంటున్నారు. పాఠాలు కాకపోయినా పర్వాలేదు. ఆటలు, పాటలు సరదా కబుర్లు ఏవైనా, అడించు పాడించూ. పిల్లలను గాలికి వదిలి వేయకుండా చూడు. నీకు ఈ సహాయం చేసినందుకు డబ్బులు ఏమీ రావు. ఇది ఉద్యోగమూ కాదు. కానీ మానవతా దృక్పథంతో చేసే మంచి పని. అంతే రవి!” హెడ్ మాస్టర్ నిదానంగా వివరించారు.

రవి ఆలోచించాడు. ఏది ఏమైనా మంచి పని చేసేందుకు వెనకడుగు వేయటం ఎందుకు? “మాస్టారు! నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెపుతా. పిల్లలు ఇష్టపడితే అలాగే రోజు వస్తాను. కొత్త మాస్టారు వచ్చేదాకా నాకు చేతయినంత చేస్తాను. కానీ పిల్లలు వింటారో లేదో” అన్నాడు రవి.

“ముందు ప్రయత్నించి చూడు రవి, పిల్లలు ఊరికే కలిసిపోతారు” అన్నారు హెడ్ మాస్టర్. “సరే” అని ఒప్పుకున్నాడు రవి.

ఆరోజు రవి స్కూలుకు వెళ్ళాడు. పిల్లలంతా ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు. వీళ్ళకి మాటలు చెప్పటం కంటే ముందు మన దారికి తెచ్చుకోవటం అవసరం అని భావించాడు. “పిల్లలూ! మీకు నేను ఒక ఆట అడిస్తాను. సరదాగా అడుకుందామా?” అడిగాడు రవి. పిల్లలు ఎవరూ రవి మాటలు వినలేదు. వాళ్ల గోలలో వాళ్ళున్నారు.

రవి బయటికి వచ్చి ఆరు గ్లాసులు తీసుకుని మరల క్లాస్ రూమ్ లోకి వెళ్ళాడు. వాటిని టేబుల్ మీద వరసగా పెట్టాడు. అప్పుడు కొంత మంది తల తిప్పి రవి వంక చూసాను. రవి మరల బయటికి వెళ్లి ఒక మగ్గు నిండా నీళ్ళు తీసుకుని వచ్చాడు. రవి నీళ్లను ఒక్కొక్క గ్లాసులో పోయటం మొదలు పెట్టాడు. ఇప్పుడు క్లాస్ లోని పిల్లలంతా ఉత్సాహంగా రవి వంక చూడటం మొదలు పెట్టారు. రవి మూడు గ్లాసుల్లో నీళ్ళు పోసాడు. తర్వాత మగ్గు కింద పెట్టేశాడు. పిల్లల్లో ఉత్సుకత పెరిగింది.

ఇప్పుడు రవి పిల్లల వంక తిరిగి ఈ గ్లాసులనీ చూడండి “మీకో మేజిక్ లాంటి అట చూపిస్తా” అన్నాడు. పిల్లలంతా కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారు. రవి అప్పుడు అన్నాడు “మీరు ఈ గ్లాసుల్ని చూసారా. మూడు గ్లాసుల్లో నీళ్ళు ఉన్నాయి. మూడు గ్లాసులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు గ్లాసులు మార్చి ఒక నీళ్ళ గ్లాసు, ఒక ఖాళీ గ్లాసు వచ్చేలా అమర్చాలి. ఒకసారికి ఒక గ్లాసు మాత్రమే తియ్యాలి” అన్నాడు రవి. పిల్లల్లో ఒకరు ముందుకొచ్చాడు. ఒక నీళ్ళ గ్లాసు తీశాడు. మరల ఖాళీ గ్లాసు తీసి అక్కడ పెట్టబోయేడు. అప్పుడు రవి అన్నాడు “సారీ, ఒకసారి మాత్రమే మార్చాలి. ఇప్పుడు రెండు గ్లాసులు మార్చినట్లు అయ్యింది కదా.”

ఇంకా చాలా మంది ప్రయత్నించారు కానీ రాలేదు. అప్పుడు రవినే చెప్పమన్నారు. రవి చూపించాడు, వరసగా ఉన్న మూడు నీళ్ళ గ్లాసుల్లో నుంచి మధ్య గ్లాసు తీసి, వరసగా ఖాళీగా ఉన్న మూడు గ్లాసుల్లో నీళ్ళు మధ్య గ్లాసులో పోసాడు. పిల్లలూ! ఇప్పుడు చూడండి. మొత్తం ఆరు గ్లాసులు గమనించండి. ఒకటి నిండు గ్లాసు, ఒకటి ఖాళీ గ్లాసు. కరెక్ట్‌గా వచ్చిందా?” అని అడిగాడు. పిల్లలంతా ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు.

ఆ రోజు నుంచి రవి చెప్పే ఆటలు పాటలు మాటలు వినటం మొదలు పెట్టారు. పిల్లల్లో క్రమశిక్షణ పెరిగింది. చక్కగా స్కూలుకు రావడం మొదలు పెట్టారు. అల్లరి తగ్గింది. రవి చిన్న చిన్న మాజిక్కులు చేసి చూపిస్తూ, మంచి విషయాలు నేర్పిస్తున్నారు. ఆ స్కూల్‌లో మాస్టారు లేరన్న సమస్య  తాత్కాలికంగా ఇలా తీరింది.

Exit mobile version