[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘సమత్వ దృష్టి’ అనే రచనని అందిస్తున్నాము.]
శ్లో:
సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్యబంధుషు
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే
(అధ్యాయం 6 – ధ్యానయోగం, శ్లోకం 9)
[dropcap]శ్రే[/dropcap]యోభిలాషులను, మిత్రులను, తటస్థులను, బంధుమిత్ర సపరివారగణాన్ని, మధ్యవర్తులను, మనల్ని ద్వేషించేవారిని, ప్రేమించేవారిని, శత్రువు, మిత్రులను కూడా సమబుద్ధితో చూసేవారిని ఆధ్యాత్మిక రంగంలో మరింత పురోభివృద్ధి సాధించినవారిగా పరిగణించవచ్చునని భగవానుడు పై శ్లోకంలో మానవాళికి సందేశం ఇస్తున్నాడు.
పై స్థితినే స్థితప్రజ్ఞత అంటారని పతంజలి యోగసూత్రాలు తెలియజేస్తున్నాయి. మనం కర్మలను భక్తితో చేసినప్పుడు, అది మన మనస్సుని పవిత్రం చేసి మన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని స్థిరపరుస్తుంది. మనస్సులోని అన్ని మలినాలు తొలగింపబడి నిర్మలత్వం పొందుతుంది. అట్టి మనస్సు ఇంద్రియాల వెంట పరుగులు తీయక చంచలత్వాన్ని వీడి స్థిరత్వాన్ని సాధిస్తుంది. అప్పుడు మనస్సు ప్రశాంతత పొందిన తరువాత, ధ్యానమే, మన ఉన్నతికి ప్రధాన ఉపకరణము అవుతుంది. ధ్యానము ద్వారా సాధకులు తమ మనస్సుని జయించటానికి, చివరకు ఈ మనస్సును ఆత్మలో లయం చేయడానికి శ్రమిస్తారు, ఎందుకంటే అశిక్షితమైన నిగ్రహింపబడని మనస్సు మన ప్రధాన శత్రువు, కానీ, సుశిక్షితమైన నియంత్రణలో ఉన్న మనస్సు మన మంచి మిత్రుడు అని భగవానుడు ఇదే గీతలో మరొక అధ్యాయంలో చెప్పాడు.
మిత్రుల పట్ల, శత్రువుల పట్ల వేరే వేరే విధంగా స్పందించటం తద్వారా ఉద్రేకపడదం, చంచలత్వం ద్వారా బోల్డంత దుఖాన్ని పోగు చేసుకోవడం మానవ సహజ స్వభావం. కానీ, ఆధ్యాత్మికతలో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న ఒక సాధకుని యొక్క మానసిక స్వభావము వేరుగా ఉంటుంది. ఈ సాధకులు ఈ సమస్త సృష్టిని భగవంతుని కన్నా అభేదముగా చూస్తారు. తద్వారా వారు అన్ని ప్రాణులను సమ దృష్టితో చూడగలుగుతారు. ఈ సమత్వ దృష్టిని సాధించడం ఎంతో అవసరం. వేదాలలో ఒక అద్భుతమైన శ్లోకం వుంది. ‘ఆత్మవత్ సర్వ భూతేషు యః పశ్యతి స పండితః’ అంటే ‘నిజమైన పండితుడు అందరినీ జీవాత్మలుగా చూస్తాడు, కాబట్టి తనలాంటి వారిగానే చూస్తాడు’. అందుకే సాయి అందరినీ భావూ అని, రమణమహర్షి అందరినీ వారు అని సంబోధించేవారు. ఇతరుల్లో మనల్నీ, మనలో ఇతరుల్నీ చూడాలని శ్రీకృష్ణుడు మనకు ఉపదేశించాడు. అంతిమంగా ప్రతి ఒక్కరిలో, ప్రతి చోటా ఆ పరమాత్మను చూడాలి.ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడే ఇది సాధ్యం. అయితే ఆ దిశగా సాధన ప్రారంభించడం అత్యావశ్యకం.
మానవ జీవితంలో సుఖదుఃఖాలు సంభవించడం అత్యంత సహజం. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోవడం మానవ నైజం. అప్పుడే మనస్సు తీవ్ర చంచలత్వానికి గురవుతుంది.కానీ, ‘ఈ రెండింటి విషయంలో మనిషి సమత్వం పాటించినప్పుడు ఏ విధమైన పాపమూ అతనిని బాధించదు’ అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చెప్పాడు.
మానవ ప్రవృత్తిని ధర్మ మార్గంలోకి మళ్లించడానికే శ్రీకృష్ణభగవానుడు ఈ గొప్ప సందేశం ఇచ్చాడు. కనుక, ప్రతి ఒక్కరూ సుఖదుఃఖాలు, జయాపజయాల పట్ల సమత్వభావనను అలవర్చుకోవాలి. ఇందుకు ధ్యానయోగం ఎంతగానో ఉపకరిస్తుంది.
ప్రతి రోజు కొద్ది సమయం కేటాయించి రోజు ఒక శ్లోకాన్ని చదివితే, ఆ భగవంతుని కృపతో పరోక్షంగా అన్ని ప్రశ్నలకు, సందేహాలకు, సమస్యలకు జవాబు మనకు తప్పక దొరుకుతుంది. అందుకే ప్రతి రోజు ఒక శ్లోకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మీరు ఎంతో చక్కదిద్దుకోగలుగుతారు అని మన ఆధ్యాత్మికవేత్తలు తెలియజేస్తున్నారు.