రంగుల హేల 38: సమయచోరులు

13
2

[box type=’note’ fontsize=’16’] మన సమయాన్ని మనకే తెలీకుండా సునాయాసంగా లాగేసే చోరులనుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అప్రమత్తతతో ఉండాలని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల’ కాలమ్‌లో. [/box]

[dropcap]‘నం[/dropcap]దకిశోరుడు నల్లనయ్య, నవనీతచోరుడు కన్నయ్య’ అని కృష్ణుడి పాట ప్రేమగా పాడుకుంటాం. రేపల్లెలో స్త్రీలంతా వచ్చి “మీ చిన్ని కృష్ణుడు మా ఇంట్లో వెన్న తినేసాడంటే మా ఇంట్లో ఉట్టి మీదికెక్కి పాల మీగడ తినేసాడంటూ” యశోదకి ఫిర్యాదు చేసారని విన్నాం. బాల కిష్టయ్య అంటే అందరికీ ముద్దే. ముద్దులొలికే వాడు కదా! కొంటె కృష్ణయ్య! అందుకే అతని చిలిపితనాల గురించి కంప్లైంట్లు చేసినా కృష్ణుడంటే ఎవరికీ మనసుల్లో కోపం లేదు.

సరిగ్గా అలాగే నేటి కాలంలో కూడా మన సమయాన్ని లాఘవంగా మనకే తెలీకుండా దొంగిలించుకుపోయే ఆధునిక కిష్టమ్మలూ,కిష్టయ్యలూ (మనమూ ఈ గ్రూప్ లోనే ఉంటాం) బోలెడు మంది ఉన్నారు. వాళ్ళ మీద మనకి కోపం ఉండదు కానీ వాళ్ళు ఖచ్చితంగా దొంగలే. వాళ్ళు ఎత్తుకుపోయేది వెన్నలాంటి మన విలువైన సమయాన్నే! ఎలాగంటారా? చూద్దాం పదండి.

బంగారం దొంగలకు దొరక్కుండా లాకర్ లొచ్చాయి. డబ్బు ఎవరూ ఇంట్లో పెట్టుకోవడంలేదు. అందరూ ఆన్‌లైన్లో పంపుతున్నారు. అందుకుంటున్నారు అకౌంట్ల ద్వారా. అంచేత కాష్ దొంగల బాధ తప్పిపోయింది. అయితే టైమ్ దొంగల బారినుండి తప్పించుకోలేకపోతున్నాం. ఎంత జాగ్రత్తగా ఉన్నా మన చెయ్యి జారిపోయి గడిచిపోతూ ఉంటుంది కాలం. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మనకే తెలీకుండా మన టైమ్ మనీ పర్సు నుంచి టైమ్ మాయమైపోతుంది.

ఉదయం లేస్తూనే అనుకుంటాం. అబ్బ! ఈ రోజు ఆరుకే లేచాం. అంటే రాత్రి తొమ్మిది వరకూ చూసుకున్నా పదిహేను గంటలు. ఈ రోజంతా బోలెడు పనులు చేసెయ్యాలి. పదిహేను పనులు. చక చకా లిస్ట్ తయారు. నెల నుండీ చెయ్యక నిలవైపోతున్న పనుల పరంపర. గొప్ప ఉత్సాహంగా కాఫీ తాగేసి పేపర్ చదివేసి లిస్ట్ మరోసారి మననం చేసుకుని మొదటిపని చేసేయాలని నడుం బిగిస్తాం. అంతే! ఆ తర్వాత ఏమయిందో తెలీదు. రోజు సర్రున నడిచిపోతుంది, జారుడు బండమీద జారినట్టు. సాయంత్రానికి అవుట్‌పుట్ ఏంటయ్యా అంటే ఓ నాలుగు పనులు మాత్రం అవుతాయి. మిగిలిన సమయం ఎలా గడిచిందీ అనుకుంటూ ఆలోచిస్తే మరో పది నిముషాలు దండగ.

నిత్యం ఫోన్ ద్వారా వచ్చే ముఖ్యమైన బంధు మిత్రుల కుశలాలూ, విశేషాలూ ఎలాగూ తప్పవు. ‘అమ్మో! ఈ ఫోన్ ఎత్తకూడదు. ఎత్తామో గంట మటాష్’ అనుకుని ఫోన్ రింగ్‌ని అంజాన్ కొట్టి ఇంకో పని చేసుకుంటూ ఉంటే, అవతల ఫోన్‌లో ఉండే శాల్తీ (ముచ్చట్ల మాస్టరు) మన పక్కవాళ్ళకి ఫోన్ చేసేసి మనల్ని పట్టేసుకుంటుంది. ఇంకేముంది మనం వళ్ళు మరిచి దాహం వేసేవరకూ మాట్లాడేస్తాం. గంటన్నర టైమ్ హుష్ కాకీ. ఇష్టమైన మిత్రులో బంధువులో ఫోన్ చేస్తే గంట ఇట్టే గడిచిపోతుంది. పోనీ ఈ కాలక్షేపం మనసుకూ, శరీరానికి శక్తినిచ్చేదనుకుందాం. రోజుకో కాల్ అయినా టైమ్ కిల్లింగ్ దూతలది ఉంటుంది. వీళ్ళు చెప్పే కబుర్లు ఉట్టి హస్క్. వాళ్లతో మరోగంట ఆనందంగా హస్కేసుకుంటాం మనకీ అవిష్టం కాబట్టి. ఏం మాట్లాడామో ఎందుకు మాట్లాడామో మనకే తెలీదు. గడియారం వైపు చూసి నాలిక్కరుచుకుంటాం.

మన ఊపిరీ, శ్వాసా అయిన మన వాట్స్ఆప్ మన నిత్య టైమ్ దొంగ. నిద్ర లేవగానే స్నేహితుల గుడ్ మార్నింగ్ లతో మొదలైన వినియోగం, పడుకోబోయేముందు గుడ్ నైట్లతో ముగుస్తోంది. రాజుగారి వెన్నంటే ఉండే చెలికాడులాంటిది ఈ మొబైల్ ఫోన్. ఆత్మీయులు పంపే మెసేజ్‌లు క్షణం క్షణం వాళ్లతో మాట్లాడుతున్నట్టే ఉంటున్నాయి. మెడనొప్పులకీ, కుటుంబాల విచ్చిన్నానికీ కూడా ఈ స్మార్ట్ ఫోన్లు కారణం అవుతున్నాయని కొందరు సైకియాట్రిస్టుల పరిశోధన. ఇక ఫోన్‌లో మన మిత్రబృందం మనకి పెట్టే వీడియోలు, ఒక్కొక్కటీ అయిదేసి, ఆరేసి నిమిషాలే. అలాంటివి ఓ పది అంటే గంటే కదా! మనమూ కాస్త మంచి వీడియో ఏదైనా కళ్ళబడగానే దోస్తులందరికీ తోసేసి గొప్ప దేశ సేవ చేసినట్టు తృప్తిపడి పోతుంటాం.

మనం ఇంటి పనుల కంటే కాస్త విలువైన పనులేమైనా చేసేద్దామనుకుని వీర లెవెల్లో ఆలోచించి సహాయకులని పెట్టుకుంటాం కదా! సహాయకులిద్దరూ కలిసి మన జేబులో చెయ్యి పెట్టి ఓ మూడు గంటలు గుటుక్కు మనిపిస్తారు. వాళ్ళకోసం ఎదురుచూపు. వచ్చాక వాళ్ళకి సహాయం చెయ్యకపోతే ఎక్కడివక్కడే ఉంటాయన్న భయంతో వాళ్ళ వెనకే తిరుగుతూ వాళ్ళను ఉత్సాహపరచడానికి కాసిని కబుర్లు చెప్పాలి. ఇంట్లో వాళ్లతో మాట్లాడకపోయినా నష్టమేం లేదు. కానీ వీళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళు చేసే పనిలో జీవం ఉండదు. అందుకే వాళ్ళ తో బాత్‌చీత్ జరపాలి. నీరసంగా కనబడితే “అట్లున్నవేంది? చాయ్ చేద్దునా?” అని బుజ్జగించాలి. టీ చేసి ఇస్తూ “ఇంద, ఈ నాలుగు బిస్కట్లూ తిను” అంటేనే పనులు చకచకా అవుతాయి. లేదంటే ఈసురోమంటూ అర్ధమనస్కంగా అవుతాయి. వంట చేసే అమ్మాయి కూడా “ఇంతేనా, ఇలాగేనా అమ్మా?” అంటూ అన్నిటికీ సూచనలు అడుగుతూ సగం కుకింగ్ పని మనచేత చేయిస్తుంది. వాళ్ళు మన ఇంటి పనిలో సాయం చెయ్యడానికి వచ్చినా, వాళ్ళు చేసేపనిలో వాళ్ళు మనల్ని అసిస్టెంట్స్‌గా పెట్టుకున్నారన్న రహస్యం మనకి కూడా తెలీదు.

ఇప్పుడంటే లేవు గానీ, గతంలో మనం బాగా బతికిన రోజుల్లో బట్టలూ, బంగారాల షాపింగ్లూ తర్వాత టైలర్ షాపుల ప్రదక్షిణాలూ, ఆ పై చుట్టాలింటికి ఫంక్షన్‌లూ ఉండేవి. అవి రోజులు రోజుల్నే అమాంతం మింగేసేవి. వారం గిర్రున తిరిగేది.

ఇక మధ్యాహ్నాలు మన సొంత సమయం కదా ఎవరూ డిస్టర్బ్ చెయ్యరుకదా అని పాటలు గట్టిగా పాడుకుంటూ యూట్యూబ్‌లో అడుగు పెడితే జేబు నిండా డబ్బులు వేసుకుని ఎగ్జిబిషన్ కెళ్ళినట్టే. ఒళ్ళు తెలీదు. రంగుల రంగుల బుడగల్లా, తియ్యని నువ్వుల జీళ్ళలా నోరూరిస్తూ ఉంటాయా వీడియోలు. అవి రంగుల రాట్నాల్లా మనల్ని గిరా గిరా తిప్పుతాయి. మీ తలనొప్పి తగ్గాలంటే ఒకే ఒక చిట్కా అంటుందొక వీడియో. ఓపెన్ చేశామా అయిపోయామే! తియ్యని మాటలతో ఓ పావుగంట విసిగించి చివరికి రహస్యం చెబుతాడు. కళ్ళుమూసుకుని తలమీద తడి గుడ్డేసుకుని పడుకోమంటాడు అంతే! ఇది మన ఊతపదమే, వీడు చెప్పేదేంటి అని పళ్ళు నూరుకోవలసివస్తుంది మొత్తం చూసాక.

మీ అభిమాన దర్శకుడికి ఆ హీరోయిన్‌పై అభిమానం ఎందుకో తెలుసా? అని కాప్షన్‌తో ఉన్నవీడియో చూడగానే ఓహో వీళ్లిద్దరి గురించీ మనం విన్న రూమర్ నిజమే నన్నమాట అనేస్కుని ఎగిరి గంతేసి అది చూస్తాం. అరగంట విన్నాక ఏమీ ఉండదు వాళ్ళమ్మా వీళ్ళమ్మా ఎక్కడో ఊర్లో చెరువు గట్టున ఆడుకునే మిత్రులట. అందుకే ఒకళ్ళింట్లో మరొకళ్ళు లంచ్‌లు మింగుతారట. అంతేనట. ఆ ఫోటోలు ఒకటో రెండో పెడతారు. మన అరగంట అలా వేస్ట్ అయ్యాక ఆ భోజనాల ఫోటోలు చూసిన మనక్కూడా ఆకలేస్తుంది కదా! అప్పుడేదో ఒకటి మనమూ మింగాలి. ఇదీ వృథాయే కదా.

ఒకోసారి అద్భుతమైన కాంట్రవర్సి అని బిల్డప్పులిచ్చి పెట్టిన వీడియోలో కొత్త విషయం ఏమీ ఉండదు. మనం ఏవో మ్యాగజైన్లలో చదివిన వార్తలకే కాస్త రంగులు వేసి చెబుతారంతే. ఇంకా అనేక ఇతర సినిమా విశేషాల రహస్యాలన్నీ నిన్నటి ఇడ్లీలని పొడి చేసి వేసిన పోపులే. ఇలాగే మన టైం డబ్బులన్నీ నీళ్లలా ఖర్చయిపోతాయి మనల్ని బికార్లను చేస్తూ.

ఆశ కొద్దీ ఎప్పుడూ ఏదో ఒకటి చేసేస్తూ ఉండే మనకి చేతులు సహజంగానే నొప్పిగా ఉంటాయి. ‘ఇలా చేస్తే మీ చేతినొప్పులు మాయం’ అని ఒక వీడియో ఉంటుంది. ఇరవై నిముషాలు విన్నాక ఆవిడ చెప్పింది చేసే బదులు ఈ చేతినొప్పులే బావున్నాయి అనిపిస్తుంది. ఇంకా ఈ సంవత్సరం మీ రాశి ఫలితాలు ఇలా ఉంటున్నాయి. అన్న సోది ఒకటి తెరుస్తాం. ఓ అరగంట విన్నాక అందులో ఏమీ ఉండదు ప్రత్యేకించి. అసలు అన్ని రాశులవారికీ అవే ఫలితాలు రాస్తారు వెనుకా ముందూ చేసి అంతే అన్న రహస్యం మనకి తెలీదుగా. ఈ వీడియోల్లో అప్పుడప్పుడూ మనకి ఉపయోగపడే విషయాలుంటాయి. అవి సాధారణంగా అయిదు శాతం మాత్రమే మిగిలిన తొంభై ఐదూ మనల్ని ఫూల్ చేసేవే.

మన మదిని దోచే మరో మంచి ప్రదేశం ఫేస్‌బుక్. లాగిన్ అవగానే, అవన్నీ మనూరి వీధుల్లా ఉంటాయి. ఎటెళ్లినా మన స్నేహితుల సరదా సరాగాలే. వాళ్ళు రాసిన సాహిత్యం మొదలు కొని వాళ్ళు చేసిన వంటలూ, అనుభవాలూ, అనుభూతులూ, సూచనలూ, సలహాలూ, హిందీ తెలుగు పాటలూ ఒకటేమిటి మిత్ర బృందమంతా కలిసినంత సందడే సందడి. ఎటో ఆనందంగా కొట్టుకు పోతూ ఉంటాం, ఏ ఫోనో, కాలింగ్ బెల్లో మోగేవరకూ. కాలమెంత గడిచిందో హోషే ఉండదు. కంప్యూటర్ మూసేసేటప్పుడు దిగులుగా చూస్తాం ఆత్మీయ నేస్తాన్నివదిలి వెళుతున్నట్టుగా.

ఈ మధ్య జూమ్ మీటింగ్లు గంట నుండి మూడేసి, అయిదేసి గంటలుంటున్నాయి. వాటిని తప్పించుకున్నాగానీ, ఆ కార్యక్రమం రికార్డు అయ్యాక యుట్యూబ్ వీడియోలు మనకి ప్రేమతో పంపుతుంటారు. మన కవితొకటి మధ్యలో ఇరికించి పెట్టి చూసుకోమంటారు. అయిపోయింది. రెండు గంటల వీడియో మొత్తం చూసి తీరాల్సిందే కదా! ఇంకా ఇంట్లో వాళ్ళు మనల్ని బెదిరించి టీ.వీ ముందు కూర్చో బెట్టి చూపించే పాత సినిమాలూ, ఓటీటీ సినిమాలూ మన రోజుల్ని అమాంతం కబళించే డైనోసార్లు. అప్పుడప్పుడూ వాటి బారిన పడాల్సిందే,కాదంటే ఒంటిపిల్లి రాకాసివి అంటారని భయపడి ఊరుకుంటాం. ఒకోసారి ఇలా ఇంట్లో వాళ్ళు కూడా మన వ్యక్తిగత సమయాన్ని దోచేసే దోపిడీ దొంగలే.

మిత్రబృందం నుంచి చాలావరకు మనకు వచ్చే వీడియోలు పాతవే. పేరంటంలో పెట్టే జాకెట్టుముక్కల్లా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయవి. మనకి తెలీని విషయాలుండేవీ, చిట్టి చిట్టి వ్యాయామాలూ, రోజంతా నవ్వుకునే జోకులూ అప్పుడప్పుడూ ఉప్మాలో జీడిపలుకుల్లా వస్తుంటాయి. ఏ వీడియోలో ఏముందో అన్న ఉత్సుకతతో అన్నీ చూసేస్తుంటాం. ఓ అయిదు నిమిషాలకి కరువొచ్చిందా? చూద్దాం అనుకుంటాం. ఇవేమీ గంటలు కావు. చిల్లర నిమిషాలే. కానీ చిల్లరే మహాలక్ష్మి అన్నట్టు ఈ నిమిషాలన్నీ కలిసి గంటల్ని హారతి కర్పూరంలా హరించేస్తాయి. అలాగే పూటలూ, రోజులూ మాయం అవుతాయి. రాత్రి పడుకునేముందు ఈ రోజు ఏమేం చేసామో డైరీలో రాద్దామంటే ఏదీ ఉండదు పనికొచ్చేపని. సమయాన్ని ఇంత దుబారా చేస్తున్నామా? అని బాధతో నిద్ర కూడా పట్టదు.

మన సమయాన్ని ఫలానా విధంగానే ఖర్చుపెట్టాలి, పొదుపుగా వాడుకోవాలి అనుకునే టైం పూర్ వాళ్ళకి ఈ ఆలోచనలూ, జాగ్రత్తలూనూ. కొందరు సమయ ధనవంతులుంటారు. వాళ్ళు టైంని దర్జాగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళని చూస్తే మనకి భలే కుళ్ళుగా ఉంటుంది. ఎవరికో ఫోన్ చేసి అవతలి వాళ్ళు పెట్టేసేవరకూ కబుర్లేస్తారు. టీ.వీ ముందు గంటలు గంటలు హాయిగా కూర్చుంటారు. మధ్యలో ఒకో కునుకు తీస్తూ, రక రకాల ఛానళ్ల అలలపై చొప్పకట్టలా తేలుతూ ఆనందంగా ఉంటారు. వాళ్ళకి దిగులే లేదు. ఏదో సమయాన్ని సద్వినియోగం చేసేసుకోవాలనే తాపత్రయం ఉన్న మనలాంటి వాళ్ళకే ఈ కష్టాలన్నీ.

మన సమయాన్ని మనకే తెలీకుండా సునాయాసంగా లాగేసే చోరులనుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అప్రమత్తతతో ఉండాలి. లేకపోతే “ఏం చేశారండీ రోజంతా ? చిన్న రైటప్ రాసి ఇవ్వమంటే ఇవ్వకుండా?” అని ఎవరో ఒకరు మన నెత్తిన మొట్టికాయలు వేస్తారు. మన కాలం, కాలక్షేపం బఠానీల్లా లెక్కా, పత్రం లేకుండా ఖర్చైపోకుండా ఉండాలంటే శాస్త్రులు గారు చెప్పినట్టు మన పూనిక నిరంతరం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం పైనే ఉండాలి. సమయాపహరణ ఇక్కట్ల నుండి మన టైమ్‌ని జాగ్రత్తగా కాపాడుకోకుండా అమాయకంగా ఉన్నామంటే మన నోట్లే మట్టే.

అయితే, నిత్యం ఫోన్లో మన వారితో సంభాషణలు చేసుకుంటూ, హాయిగా నవ్వుకునే వీడియోలనీ, ముఖ్య వివరాలు అందించే మెసెజ్‌లనీ చూసి మనం సంతోషంతో తబ్బిబ్బవుతుంటాం. ఇవేమీ లేకపోతే, అసలు స్మార్ట్‌ఫోన్ లేకపోతే జిందగీ బర్ బాదే అనుకోండి. నిజానికి ఇదే ప్రస్తుతం మనకి కాస్త ఆటవిడుపు.లేకపోతే మనమంతా మతి తప్పి పోయి పిచ్చి చూపులు చూడవలసిన వాళ్లమే. ఈ వాట్సప్ వచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గింది. మనసులిప్పుడు సెకన్ల దగ్గరగా వచ్చాయి సుమా! కానీ గారెలెక్కువైతే చేదే కదా. అతి సర్వత్రా వర్జయేత్తే మరి. ఏమంటారు?

ఇదంతా చదివి మీరు నన్ను ‘సమయచోరా!’ అని తిడుతున్నారు కదూ! నాకు వినబడిందిలెండి. ఈ కాలమ్‌లో నేను తీసుకున్న కాలం ఓ అయిదారు నిముషాలు మాత్రమే!

అయితే కొన్ని టైమ్ సేవింగ్ టిప్స్ అంటే ఆ విషయమై చర్చించాను కాబట్టి ఆ సమయం వృథా అయినట్టుగా భావించక ఉపయోగకర సమయంగా గమనించ ప్రార్థన. అయిననూ కోపగించుకొనుచున్నయెడల మన్నించ మనవి. మన్నిక్కవుమ్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here