సమాయాత్తం కాక తప్పదని చెప్తున్న కరోనా విజృంభణ

0
2

[box type=’note’ fontsize=’16’] “నిబంధనలను కొద్దిగా సడలించినట్లయితే దాదాపు ఒకటిన్నర లక్షల మంది నిపుణుల సేవలు అందుబాటులోనికి తెచ్చుకోవడం ద్వారా కరోనాపై పోరాటానికి సాయుధ సంపత్తిని తగినంత సమకూర్చినట్లే” అంటున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

‘కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్’ – 100 సంవత్సరాల నాటి సంస్థ. దీన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బేన్ చేసిన కారణంగా సుమారు 40,000 మంది వైద్య నిపుణులు/స్పెషలిస్టులు అనర్హత పాలపడ్డారు. నిషేధం తొలగిస్తే వీరందరూ అర్హులై సేవలనందించగలుగుతారు. ‘సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్’, ‘ఇండియన్ సొసైటీ ఫర్ క్రిటికల్ కేర్ మెడిసిన్’, ‘ఇగ్నో’ లపై నిషేధాలు తొలగిస్తే మరింతమంది నిపుణులు, కమ్యూనిటీ కార్డియాలజీలో డిప్లొమో అందుకున్న వారి సేవలు అందుబాటులోకి వస్తాయి. రష్యాలో, చైనాలో శిక్షణ పొందిన యువ వైద్యులు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో అర్హులైన వైద్యులుగా సేవలందిస్తున్నారు. ‘మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ ప్రామాణిక పరీక్ష కోసం వీరందరూ ఎదురుచూస్తున్నారు. వీరిని సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో సేవలనందించడానికి మెడికల్ కౌన్సిల్ నియోగించవచ్చు. పై చర్యలు చేపడితే మనకి సుమారు లక్షన్నర మంది డాక్టర్లు తమ సేవలతో అందుబాటులోకి వస్తారు. మన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లకు స్పెషలిస్టుల, జూనియర్ డాక్టర్ల అవసరం వేల సంఖ్యలో వైద్యులు అందుబాటులోకి వస్తే గాని తీరదు. మనదేశంలో ఇంటెన్సివ్ కేర్ పడకల సంఖ్యే చాలా తక్కువ. అవీ వైద్య సేవల కొరతతో అల్లాడుతున్నాయి.

లక్షకు 29 అత్యవసర సేవల పడకలు ఉన్న జర్మనీలో మరణాల శాతం 0.3%గా నమోదవుతోంది. ఇటలీలో ఆ పడకల సంఖ్య లక్షకు 13 కాగా, మన దేశంలో 2.3. అత్యవసర వైద్య సదుపాయం అతి తక్కువగా ఉన్న ఈ స్థితిలోనే వైద్య సేవల కొరత ఉన్నప్పుడు అత్యవసర వైద్య సదుపాయాలను విస్తరించవలసివస్తే ఎదురుకాగల పరిస్థితులు ఎలా ఉంటాయి?

యునైటెడ్ కింగ్‌డమ్‌లో ‘జనరల్ మెడికల్ కౌన్సిల్’ వైద్య విద్యార్థులకు ఫైనల్ సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండా వారి పూర్వ పని సామర్థ్యాలను పరిశీలించి రికార్డులలో సమర్థులైన సందర్భాలలో వైద్య డిగ్రీలు ప్రదానం చేయమని వైద్య విశ్వవిద్యాలయాలన్నింటికీ సూచించింది.

ఎం.బి.బి.ఎస్ కోర్సు వ్యవధిని 10 నెలల కాలం తగ్గించి పరీక్షలు నిర్వహించకుండానే డిగ్రీ ప్రదానం చేయమని వైద్య విశ్వవిద్యాలయాలను ఇటలీ ప్రభుత్వం కోరింది. అలా చేయగలిగితే ఇటలీకి వెంటనే 10,000 మంది వైద్యులు అందుబాటులోకి వస్తారు.

ప్రపంచంలోని అనేక దేశాలలో ఆన్‌లైన్ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. టెలిమెడిసిన్ చాలా దేశాలలో చాలాకాలంగా ఉన్నదే. కరోనా వ్యాప్తి అధికమౌతున్న నేపథ్యంలో ఇటీవలే భారతదేశం ముందు జాగ్రత్త చర్యగా ఆన్‌లైన్ వైద్యసేవలకు అనుమతించడం జరిగింది.

ప్రిన్స్‌టన్ యూనివర్సిటిలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న రమణన్ లక్ష్మీనారాయణన్ ‘సెంటర్ ఫర్ డిసీజ్, డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ’ సంస్థకు వ్యవస్థాపక డైరక్టర్. 10 కోట్ల మంది జనాబా వరకు ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నట్లు, ప్రస్తుతం మరణాల రేటు/శాతం తక్కువగా ఉన్నప్పటికీ, వైరస్ వ్యాప్తి వేగం పెరిగిన కొద్దీ మరణాల శాతం పెరిగే ప్రమాదమూ కాదనలేనిదని హెచ్చరిస్తున్నారు. ఆయన ఆ హెచ్చరిక చేసి పది రోజులు కూడా కాలేదు. మన దేశంలో కూడా కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న సంఘటనలు అనుభవంలోకి వస్తున్నాయి. మార్చి 15 నాటికి కేవలం 100 కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఆ సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడమే దానికి తార్కాణం.

మన దేశంలో సుమారు 50 వేల మంది వైద్య నిపుణులు పరీక్షల కోసం నిరీక్షిస్తున్నారు. పల్మనాలజీ, కార్డియాలజీ, రేడియోలజీ, ఎనస్తీషియోలజీల వంటి రంగాలలో పరీక్షలకు, తయారై సిద్ధంగా ఉన్న వారికి అనుమతులిచ్చి వారి సేవలను వినియోగించుకోవచ్చు. ఇటలీ, యు.కె.ల మాదిరి చర్యలను చేపట్టి నిబంధనలను కొద్దిగా సడలించినట్లయితే దాదాపు ఒకటిన్నర లక్షల మంది నిపుణుల సేవలు అందుబాటులోనికి తెచ్చుకోవడం ద్వారా కరోనాపై పోరాటానికి సాయుధ సంపత్తిని తగినంత సమకూర్చినట్లే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here