Site icon Sanchika

సాంబమూర్తి సత్కారం

[dropcap]ఆ[/dropcap]నాటి దినపత్రికలనన్నిటిని ముందేసుకొని బరబరా తిప్పి తిప్పి చూస్తూ, వాటిల్లో తనకు పలమనేరులో జరగబోతున్న సత్కారం గూర్చి వేసిన విషయాన్ని చూసి ఒకటికి రెండు సార్లు చదువుకొని అమితానందభరితుడై తనలో తానే నవ్వుకొంటున్నాడు సాంబమూర్తి.

“ఏమిటండి మీలో మీరే నవ్వు కొంటున్నారు. ఎవరైనా చూస్తే ఏదో అనుకొంటారు” అంటూ అప్పటికే నాలుగు ఇడ్లీ, రెండు మినపట్లను దట్టంగా లాగించిన సాంబమూర్తికి పెద్ద గ్లాసు నిండా కాఫీనిస్తూ అంది భార్య కనకం.

“నా నవ్వు సంగతటుంచవే! నువ్వేమిటీ… రెండు పూటలకు సరిపడా టిఫన్ పెట్టి బుక్తాయాసాన్ని తెప్పించావ్? మితిమీరిన తిండి ఒంటికి చేటమ్మా. తెలుసా?” అంటూనే కాఫీ తాగి గ్లాసును ప్రక్కన పెట్టి భార్య బుగ్గను గోముగా గిల్లాడు అరవై అయిదేళ్ళ సాంబమూర్తి.

“ఆపండి సరసం. అయినా ఇదేమంత మితి మీరిన తిండి కాదు. మళ్ళీ మీరు ఏ వేళకు భోంచేస్తారోనన్న భయంతో అంత టిఫిన్ పెట్టాను. ఈ మధ్య మీరు బాగా తగ్గిపోయారండి. ఆఁ…” అంది కనకం ప్రేమతో.

“మై గాడ్! తగ్గానా!? నా వొళ్ళు కూడా నీకులాంటి ఊబకాయమే పిచ్చిదానా! నూటాపది కిలోల బరువున్నాను. తెలుసా! అడుగో… గంగరాజొస్తున్నాడు. వాడితో ‘కూర్చొండి అన్నయ్య గారూ! కాఫీ తెస్తాన’ని చెప్పి టిఫిన్ కాఫీలతో ముంచెత్తకు. మేము వెంటనే బయలుదేరాలి”  అంటుండగా జోలె సంచితో ఎంటరై “ఏరా సాంబా! వెళదామంటావా?” అన్నాడు గంగరాజు కిచెన్లోకి చూస్తూ.

“కనకం కిచెన్లో లేదురా! పెరట్లో పనిమీదుంది. నువ్వు పద” అంటూ లేచాడు సాంబమూర్తి. ఇద్దరూ కలసి రమణారెడ్డి, రేలంగిలా నవ్వుకొంటూ షేర్ ఆటో ఎక్కారు రైల్వే స్టేషనుకు. అంతలో గంగరాజు భార్య రాజ్యలక్ష్మి పిట్టగోడ వద్ద కొచ్చి”వదినా! పాపం మీ అన్నయ్యగారు ‘టైమైంది… సాంబడింట్లో టిఫిన్ తింటానులే’ అంటూ తొందరతొందరగా వచ్చారు. వారికి టిఫినేమైనా పెట్టావా?” అడిగింది.

“లేదొదినా! అన్నయ్యగారొస్తూనే ఇద్దరూ వాకిట్లో రెడీగా వున్న ఆటో ఎక్కేశారు. ఆకలయితే హోటల్లో తింటారేమోలే” అదేమంత ముఖ్యం కాదన్నట్టుగా చెప్పింది కనకం.

“భలేదానవే! మా వారు మొదటే షుగరు పేషంటు. కడుపులోకి ఏదేని పడక పోతే మైకం కమ్మి వొణుకొచ్చి పడి పోతారు. ఇంతకు అన్నయ్యగారు అదే… మీవారు భోంచేశారా?” తెలుసుకోవాలన్న వుద్దేశంతో ఆదుర్దాగా అడిగింది రాజ్యలక్ష్మి.

“ఓఁ… ఎంచక్కా నాలుగు ఇడ్లీలు, రెండు మినపట్లు తిని ఓ గ్లాసు కాఫీ తాగి త్రేన్చి మరీ వెళ్ళారు.”

“అలాగా! సరే వస్తా”అని మూతి మూడు వంకలు త్రిప్పుకొంటూ ‘దుర్మార్గురాలు. సన్మానం వాళ్ళాయనికి. పస్తులు పడి జోలె సంచి మోసుకొంటూ ఆయన వెంట తిరిగే ఖర్మ మా వారికి. దరిద్రం కాకపోతే వయస్సు మళ్ళిన రోజుల్లో సన్మానాలు, సత్కారాలంటూ మా వారిని వెంటేసుకుని తిప్పుతున్నాడేంటి? అయినా వాళ్ళనని ఏం లాభం. వీరికుండాలి బుధ్ధి’ అని గొణుక్కొంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది రాజ్యలక్ష్మి.

సాంబమూర్తి, గంగరాజులు సమవయస్కులు, మంచి స్నేహితులు. తెలుగువాళ్ళయిన వీళ్ళు పర రాష్ట్రంలో పుట్టి పెరిగి ఆ రాష్ట్రపు ప్రభుత్వపు శాఖల్లో వుద్యోగాలు చేసి బాధ్యతలన్నీ నిర్వర్తించి అరవై ఏళ్ళకు పదవి విరమణ పొంది ప్రస్తుతం ఊబకాయంతో సాంబమూర్తి, షుగరు వ్యాధితో గంగరాజు విశ్రాంత జీవితాలను గడుపు తున్నారు. ఇద్దరూ ఇళ్ళు కూడా ప్రక్క ప్రక్కనే కట్టుకున్నారు. తినడం, పడుకోవడం మాత్రమే వాళ్ళ సొంత ఇళ్ళలో. తతిమ్మా సమయాల్లో వాళ్ళు ఆ రెండిళ్ళలో ఎక్కడైనా వుంటారు.

ఊబకాయుడు సాంబమూర్తికి మాతృభాషపై మక్కువ ఎక్కువ. భాష వున్నతికి పాటు పడుతూ భాషా సేవకుడై పోయాడు. ఇరవై ఏళ్ళకు ముందే భాషకోసం ఓ సంస్థను స్ఠాపించాడు. నాటి నుంచి నేటి వరకూ తెలుగువాళ్ళనందరిని సంఘటితపరచి సభలు, సాంస్క్రతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కొనసాగుతున్నాడు. తెలుగు వారికోసం సాంబమూర్తి చేస్తున్న తెలుగు కార్యక్రమాలను పత్రికల్లో చదివి తెలుసుకున్న మన ఆంధ్ర దేశంలోని తెలుగు సంస్థలు కొన్ని ప్రతి ఏటా సాంబమూర్తిని పిలిపించి సన్మానించటమో లేక సత్కరించటమో చేస్తుంటాయి. ఆ కోవలో ఈ సారి చిత్తూరు జిల్లాలో వున్న పలమనేరులోని ప్రభుత్వపు వున్నత పాఠశాల వారు గిడుగు రామ్మూర్తి వారి జయంతి సందర్బంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొంటూ అందుకు సాంబమూర్తిని సత్కరించాలని ఆహ్వానించారు. అందుకే ఇవాళ స్నేహితుడు గంగరాజును వెంట పెట్టుకొని పలమనేరు వెళుతున్నాడు సాంబమూర్తి. ఇక్కడ ఓ ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలి. ఏమిటంటే… గంగరాజుకు ఇలాంటి వ్యాపకాలేమీలేవు. కాని స్నేహితుడు సాంబమూర్తికి ఎప్పుడూ ఒకడు తోడుండాలి. ఆ తోడు తనే అయి వుండాలంటూ అయిదేళ్ళుగా సాంబమూర్తి చెప్పినట్టు వింటూ ఆయన సంచిని మోస్తూ అవసరమైన చోట ఆయన కోరిక మేర తన్ను ఇంద్రుడు, చంద్రుడు అని ఆకాశానికెత్తేస్తూ వుంటాడు. అలా గంగరాజు చేయకపోతే సాంబమూర్తి అడుగుతాడు, అలుగుతాడు. అందుకే ఆవిషయంలో చాలా జాగ్రత్తగా వుంటాడు గంగరాజు. ఇవాళ కూడా ఆ సంగతిని వూహించుకొని సమయానికి స్నేహితుణ్ణి పలమనేరుకు చేర్చాలన్న ఆదుర్దాతో కాఫైనా తాక్కుండా సాంబమూర్తితో పాటు చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఉదయం ఆరు గంటల పది నిముషాలకు రైలెక్కారు కాట్పాడాకు. అక్కడినుంచి చిత్తూరుకు బస్సులో వెళ్ళి, మళ్ళీ చిత్తూరునుంచి పలమనేరుకు మరో బస్సులో వెళ్ళాలి. అందువల్ల ఎటూ కార్యక్రమం ప్రారంభం పదిన్నర గంటలకు కనుక కాట్పాడాలో దిగిన వెంటనే టిఫిన్ తిని రెండు గంటల వ్యవధిలో షార్పుగా వెళ్ళి అటెండు కావచ్చు ననుకొన్నారు ఇద్దరూ.

రైలు వెళుతోంది.

కాస్సేపటికి రైలు అరక్కోణం దాటింది. గంగరాజు కడుపులోని ప్రేవులు ‘ఆకలి’, ‘ఆకలి’ అంటూ అరవసాగాయి. తనతో తెచ్చుకున్న బాటిల్ నీళ్ళు మొత్తం తాగాడు… ఏం లాభం… నీళ్ళకు ఆకలి చల్లారదుగా పాపం! అందుకే అప్పుడే లోనికొచ్చిన సమోసాలోడిని ‘ఇదిగో అబ్బాయ్! ఓ అయిదు సమోసాలివ్వు’ అంటూ పది రూపాయల నోటును ఇవ్వబోయాడు.

“అవి మంచి నూనెతో చేసినవి కావురా! మరో పదినిముషాల్లో ట్రయిన్ దిగి హోటల్లో మంచి టిఫిన్ తిని వెళదాంలే” అని నోటును లాక్కొని జేబులో వుంచేసుకున్నాడు. సాంబమూర్తి. ఇక చేసేదిలేక గుటకలు మింగుతూ కూర్చొన్నాడు గంగరాజు.

రైలు అరక్కోణం దాటి కాస్త దూరం వెళ్ళి సిగ్నల్ లేక ఆగిపోయింది. అక్కడే ఓ అర్థగంట సమయం తరిగి పోయింది. గంగరాజుకు ఆకలి ఎక్కువయ్యింది. తీరా కాట్పాడాకు అర్థగంట ఆలస్యంతో తొమ్మిదిన్నరకు వెళ్ళింది ఆ ట్రెయిన్.

స్నేహితులిద్దరూ రైలు దిగి స్టేషనుకు దగ్గరలోనే మెయిన్ రోడ్డు మీదున్న అన్ అఫ్ఫీషియల్ బస్టాండులో నిలబడ్డారు. బస్సురాలేదు. సాంబమూర్తికి నిర్వాహకుల వద్దుంచి ఫోనొచ్చింది త్వరగా రమ్మని. వస్తున్నట్టు చెప్పాడు కాని తనకు టెన్షన్ మొదలయ్యంది. గంగరాజుకు ఆకలి మరీ ఎక్కువైయ్యింది.

“ఏరా! అటు టెర్మినెస్సు కెళ్ళి బస్సెక్కుదామా?” కూల్‌గా అడిగాడు సాంబమూర్తి.

‘దరిద్రుడు వాడు బాగా మెక్కాడుగా… అందుకే నా ఆకలి సంగతి మరచి పోయాడు’ అని మనసులో అనుకొని “నీ ఇష్టం రా”అన్నాడు గంగరాజు. వెంటనే అవతలి వేపుకు వెళ్ళి టెర్మినస్కు వెళుతున్న బస్సెక్కారు. కాస్త దూరం వెళ్ళేసరికి చిత్తూరు వైపు వెళ్ళే రెండు బస్సులు చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందే వెళ్ళిపోయాయి. సాంబమూర్తి గుండె గతుక్కుమంది. చేసేది లేక టెర్మినెసుకెళ్ళి పది గంటలకు బస్సెక్కారు. నిజానికి సభ నిర్వాహకులు కోరినట్టు ఒకరోజు ముందే వచ్చి లాడ్జిలో రెస్టు తీసుకొని మరుసటి రోజు బాగా ఫ్రెషప్ అయి కార్యక్రమ ప్రాంగణానికి వెళ్ళుంటే బాగుండేది. కాని ఆ లాడ్జికయ్యే ఖర్చులు నిర్వాహకులు ఇస్తారో లేక తనే భరించాల్సి వస్తుందోనన్న మీమాంసలో పడ్డ సాంబమూర్తి మనసు అందుకు అంగీకరించక పోయేసరికి ఉదయం ట్రెయినుకు బయలు దేరారు.అందుకే ఇన్ని తిప్పలు.

బస్సు చిత్తూరుకు చేరుకొంది. దిగి వెంటనే పలమనేరు బస్సెక్కారు. అంతలో కార్యక్రమం ప్రారంభమైందని ఫోనొచ్చింది సాంబమూర్తికి. బస్సులో వున్న తను ఏం చేయగలడు పాపం. ‘ఎలాగోలా కార్యక్రమానికి వస్తాములే సార్’ అని విసుగుతో చెప్పి వాచి చూసుకొని మరింత టెన్షన్‌కు గురైయ్యాడు.

పలమనేరులో బస్సు దిగారు. ఆటోలో ఎక్కి సభా ప్రాంగణం పేరు చెప్పి వెళ్ళమన్నారు. ఆటో రెండు వందల మీటర్లు నడిచింది. ఎదరే గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు. వస్తున్న ఆ జనం కార్యక్రమంనుంచేనని గ్రహించాడు సాంబమూర్తి.ఆటో దిగి అటు స్టేజివేపు చూశాడు. మైకులు విప్పుకొంటూ ఓ అబ్బాయి కనబడ్డాడు. సమయపాలన పాటించినా రైలు, బస్సుల ఆలస్యం కారణంగా బంగారంలాంటి సత్కారాన్ని పొందలేక పోయామేనన్న బాధతో మైకబ్బాయి వద్దకెళ్ళి “బాబూ! కార్యక్రమం అయిపోయినట్టుంది.దీనికి సంబంధించిన నిర్వాహకులు కూడా వెళ్ళిపోయారా?” అని అడిగాడు.

“లేదండీ! అదిగో ఆ గదిలో కూర్చొని భవిష్యత్ కార్యాచరణ గూర్చి చర్చించుకొంటున్నారు. నలభై మందికి భోజనాలు కూడా ఆర్డరిచ్చారు. వస్తూనే భోంచేసి వెళ్ళిపోతారట.ఇంతకు మీరెవరు సార్ “అడిగాడు మైకబ్బాయి.

“వీరి పేరు సాంబమూర్తి. ఈరోజు సత్కరించిన వారి లిస్టులో వీరి పేరు కూడా వుంది” చెప్పాడు గంగరాజు ఆకలి ఆయాసంతో. అవునన్నట్టు గంగిరెద్దులా తలాడించాడు సాంబమూర్తి.

“ఓఁ… చెన్నై నుంచి వస్తున్న సాంబమూర్తిగారు మీరేనా? సార్! మీకు తప్ప అందరికీ సత్కారం జరిగింది. వెళ్ళండి బహుశా నిర్వాహకులున్న ఆ గదిలోనైనా మిమ్మల్ని గౌరవించగలరేమో!” అని మైకబ్బాయి అంటుండగానే గబగబా అక్కడికి వెళ్ళారు స్నేహితులిద్దరూ.

సాంబమూర్తిని గుర్తించిన సంస్థ అధ్యక్షులు లేచి గబగబ దగ్గరకు వెళ్ళి”రండి సాంబమూర్తి గారూ!అశేష జన సందోహం మధ్య మిమ్మల్ని గౌరవించుకోకపోయినా మా సభ్యుల మధ్య గౌరవించుకొంటాం. గౌరవించుకొని తృప్తిపడతాం” అంటూ సభ మధ్యలో కుర్చి వేసి కూర్చోపెట్టి సాంబమూర్తి సేవలను కొనియాడి శాలువ కప్పి,చప్పట్లు కొట్టి, మెమేంటో చేతికిచ్చి చుట్టూ నిలబడి సెల్ ఫోన్లలో ఫోటోలు దిగారు.

స్నేహితునికి జరుగుతున్న సత్కారాన్ని ఎదరే కూర్చొని చూస్తూ చప్పట్లు కొడుతున్న గంగరాజు ఆకలికి కడుపులో ప్రేవులు అరుస్తుంటే కళ్ళు బయర్లు అలాగే క్రిందకు వొంగి పోయాడు. అది చూసిన నిర్వాహకులు షాక్‌కి గురి కాగా “ఏం పర్వాలేదు. ఎవరి వద్దనైనా బిస్కట్లు వుంటే ఇవ్వండి. రెండు తింటూనే వాడు లేచి కూర్చొంటాడు” అంటూ సాంబమూర్తి కుర్చీలోనుంచి లేచొచ్చి గంగరాజును లేపి కూర్చోబెడుతుండగా ఏకంగా భోజనాలతో ఆటో వచ్చి ఆగింది. వెంటనే సాంబారు అన్నం ప్యాకెట్టు విప్పి సాంబమూర్తే రెండు ముద్దలు తినిపించాడు గంగరాజుకు. ఇక ఉదయంనుంచి తిండిలేని గంగరాజు ఆవురావురంటూ అన్నం మొత్తం తిన్నాడు. వెంటనే వొంట్లోకి శక్తి వచ్చింది కాబోలు లేచి చెయ్యి కడుక్కొని వచ్చి “ఫ్రెండ్స్! నేను సాంబమూర్తి స్నేహితుణ్ణి. సమయ పాలన పాటించే వ్యక్తిని. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలన్న వుద్దేశంతో ఏమీ తినకుండా బయలుదేరిన నేను మార్గం మధ్యలో టిఫిన్ తిన వచ్చులేనని అనుకొన్నాను. కాని బాగా ఆలస్యమైన ఈ సందర్బంలో హోటలు కెళితే మరో అర్థగంట ఆలస్యమౌతుందని అలాగే కార్యక్రమానికి వచ్చాము. నేనిప్పుడు ఓకే! అలాగే మా వాడికి అంత పెద్ద సభలో ఈ గౌరవం దక్కలేదన్న బాధ నాకున్నా నిర్వాహకులైన మీ మధ్య జరగడం సంతోషమే. ఎలాగో! వచ్చిన పని పూర్తయ్యింది. మమ్మల్ని స్టేషనులో దిగబెట్టండి. ప్లీజ్!” అన్నాడు. అందరూ సరేనన్నట్టు చప్పట్లు కొట్టి భోజనాల ప్యాకెట్లను విప్పుకున్నారు.

ఏదేమైనా తను కడుపునిండా టిఫిన్ తిని షుగరు పేషంటైన స్నేహితుడు గంగరాజును అలా ఖాళీ కడుపుతో తీసుకు రావడం తన తప్పని గ్రహించిన సాంబమూర్తి “సారీరా గంగరాజూ! పొద్దాక నా సత్కారం గూర్చి ఆలోచిస్తూ నీ ఆకలి సంగతి మరచి పోయాను. నన్ను క్షమించరా” అంటూ గంగరాజును కౌగలించుకున్నాడు. గంగరాజు పేలవంగా నవ్వాడు.

Exit mobile version