[శ్రీమతి మద్దూరి బిందుమాధవి వెలువరించిన ‘సామెతల ఆమెత’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]ప[/dropcap]ద్యంలానే సామెత కూడా తెలుగు వారి ప్రత్యేక సొత్తు. సామెతలను మనం నిత్య జీవితంలో ఎంతగా ఉపయోగిస్తామో అందరికీ తెలిసిందే! కొంతమంది సంభాషణను “అదేదో సామెత చెప్పినట్టు” అంటూ మొదలుపెడతారు. మరికొందరు సందర్భోచితంగా మధ్యలోనో చివరలోనూ వాడతారు. దాదాపుగా ప్రతీ సామెతకీ ఆ సామెత ఎలా ఆవిర్భవించిందో తెలిపే ఓ కథ ఉంటుంది. ఆ కథలిప్పుడు మనకి తెలియక పోవచ్చు. ఆ సామెత ఉద్దేశం, ఎప్పుడు ఎలా ఉపాయోగించాలో తెల్సిసిన కొందరుంటారు. వారిలో విశ్రాంత బ్యాంక్ మానేజర్, రచయిత్రి శ్రీమతి మద్దూరి బిందుమాధవి ముఖ్యులు.
తెలుగు సామెతలని మరుగున పడనీయకుండా, వాటి ఆధారంగా చిన్న చిన్న కథలు అల్లి, సామెత కథల సంపుటులను వెలువరించారు రచయిత్రి. ‘సామెతల ఆమెత’ సామెత కథల నాల్గవ సంపుటి. సామెతలు అనే అంశంపై బిందుమాధవి గారి ఆరవ పుస్తకమిది.
ఈ పుస్తకంలో 40 కథలున్నాయి.
~
‘అయినవారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో’ అనే సామెత కథలో మనవడికి నచ్చిన బొమ్మని, వాడి కోసం ఎంపిక చేసిన బొమ్మని – తన మిత్రుడి మనవడికి ఇచ్చేస్తారు ఓ తాతయ్య. మనవడు చిన్నబుచ్చుకుంటాడు. ముఖం మాడ్చుకుని ఇంటికొచ్చిన కొడుకుని చూస్తూ, తన తండ్రి స్వభావాన్ని ప్రస్తావిస్తూ ‘తాత చిప్ప తర తరానా’ అనే మరో సామెతని ఉపయోగిస్తుంది ఆ పిల్లాడి తల్లి. మన బంధువుల్లో ఇలాంటి వ్యక్తులుంటారని, బయటకి చెప్పుకోలేని సున్నితమైన ఇబ్బందులు ఇవని రచయిత్రి అంటారు.
‘అని అనిపించుకోవడం అత్తగారి స్వభావం’ అనే సామెత కథలో బ్యాంకు ఉద్యోగినిల పని ఒత్తిడిని, ఉదయం పూట ఇళ్లల్లో వాళ్ళకెదురయ్యే హడావిడిని ప్రస్తావిస్తారు. లంచ్ బాక్స్‌లోకి ఎవరేం తెచ్చుకున్నారో చెప్పుకుంటూ, కమల అనే ఉద్యోగినిపై మాట విసురుతుంది మైథిలి. కమల చెప్పిన సమాధానం విని అందరూ బిత్తరపోతారు. అప్పుడు ‘అని అనిపించుకోవడం అత్తగారి స్వభావమ’ని మా అమ్మ చెప్పేది అంటుంది ఇందిర. ఈ సందర్భంలోనే ఈ కథలో ‘కత్తివేటుకు నెత్తురు చుక్క లేనట్టు’ అనే మరో సామెతను ప్రస్తావిస్తారు రచయిత్రి.
‘అయ్యవారిని చెయ్యబోతే కోతి అయ్యింది’ అనే సామెత కథలో రాజకీయ నాయకుడు వైద్య సిబ్బందిపై చేసిన ఒత్తిడి వల్ల, ఓ వృద్ధురాలు కంటి చూపుకు ఇబ్బంది కల్గిన ఉదంతం చెప్తారు. నేటి మన జీవితాలని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న మొబైల్ ఫోన్ల గురించి ‘ఆలికి అన్నం పెట్టడం లోకోపకారమా’ అనే సామెత కథలో చెప్తారు.
సమస్యలనేవి ప్రతి ఇంట్లోను ఉంటాయనీ, వాటినెల పరిష్కరించుకోవాలనేది ఇంటి వారి ఆలోచనా విధానం మీద.. వారి పరిణతి మీద ఆధారపడి ఉంటుందని చెప్తుంది ‘ఇంటింటికో ఇటుకల పొయ్యి..’ సామెత కథ. ఇదే కథలో ‘చిన్న గీత పక్కనపెద్ద గీత’ అనే మరో సామెతను సందర్భోచితంగా ఉదహరించారు రచయిత్రి.
‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడు’ అనే సామెత కథలో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునే రుక్మిణి గురించి, ఇంటి శుభ్రత గురించి పట్టింపు లేని మరో గృహిణి ప్రీతి గురించి చెప్తారు. పెద్దలెంత అనుభవంతో ఈ సామెత చెప్పారో అని అంటుందో పాత్ర. నిజం కదా!
ఇష్టం లేనప్పుడు తోటివారికి సాయం చేయకుండా ఉండేందుకు రకరకాల సాకులు చెప్పి తప్పించుకునే వారి గురించి చెప్పినది ‘ఉపకారం అంటే ఊళ్ళోంచి లేచిపోవటం’ అనే సామెత కథ. తమతో అవసరాలు తీరిపోయాకా, తమని పట్టించుకోని వ్యక్తుల గురించి చెప్తుంది ‘ఏరు దాటాకా తెప్ప తగలెయ్యడం’ అనే సామెత కథ. ఈ కథలోని పాత్రల్లాంటి వ్యక్తులు సమాజంలో కోకొల్లలు.
‘ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు..’ అనే సామెత కథలో మనుషుల స్వభావాలని వాళ్ళ ప్రవర్తన ద్వారా, మనస్తత్వం ద్వారా ఎలా గ్రహించవచ్చో వివరిస్తారు. ఎవరి పని వారికి మాత్రమే నచ్చి.. ఇతరుల మెప్పు పొందలేనప్పుడు వాడే సామెత ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ను కథగా మార్చి – రచయిత్రి కావాలనుకునే వెంకట లక్ష్మి ఆమె భర్త కాంతారావు ఏ విధంగా ప్రోత్సాహం అందించాడో చెప్తారు.
తమకి తెలిసో, తెలియకో కొన్ని పరిస్థితుల్లో చిక్కుకున్న వాళ్ళు ప్రయత్నం చేసినా బయట పడలేక పోవడాన్ని చెప్పే సామెత ‘కుడితిలో పడ్డ ఎలుక’. అయితే ఈ కథలో కుడితిలాంటి తనకిష్టంలోని సినీరంగానికి బలవంతంగా పరిచయం చేయబడిన ఓ హీరోయిన్ కూతురు మాత్రం – గట్టి నిర్ణయం తీసుకుని, తన సొంత మార్గం ఎంచుకుని, తాను అనుకున్న రంగంలో విజయం సాధిస్తుంది.
పని పట్ల శ్రద్ధ లేని వారికి పని చెబితే ఎలా ఉంటుందో ‘కొరివితో తల గోక్కున్నట్టే’ అనే సామెత కథలో చెప్తారు. అప్పులిచ్చి పుచ్చుకునే విషయంలో అందరూ పాటించవలసిన జాగ్రత్తల గురించి చక్కగా చెప్తుంది ‘కంచె మీద బట్ట చిరగకుండా తియ్యాలి’ అనే సామెత కథ. ఈ కథలోనే మరో సామెత ‘ఏట్లో పోసేటప్పుడైనా ఎంచి పొయ్యాలి’ను సందర్భోచితంగా వాడారు.
‘గత జల సేతు బంధనం’ అనే సామెత కథలో తన కొలీగ్‍కి సాయం చేయడంలో వెనుకంజ వేసి, తీరా అతని కుటుంబానికి నష్టం జరిగిపోయాకా బాధపడే శేఖర్ గురించి చెప్తారు రచయిత్రి. చిన్న వెనుకంజ ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమవుతుంది. ఈ కథలోనే మరో సామెత ‘సొమ్మూ పోయి శని పట్టినట్టు’ను సందర్భోచితంగా వాడారు.
కొన్ని కార్యాలాయాలలో ఎదుటి వారి ఉద్దేశాన్ని గ్రహించకుండా, అమాయకంగా వారి వలలో పడి, వారి పనులు చేసి పెట్టే సత్తెకాలపు సత్తయ్యల గురించి చెబుతుంది ‘గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు’ అనే సామెత కథ. ఈ కథలోనే మరో సామెత ‘నల్లేరు మీద బండి’ను సందర్భోచితంగా వాడారు.
సమస్య ఏమిటో, పరిష్కారం ఏమిటో సరిగా గుర్తించని పనిమంతులు తమకు తోచినట్టు పనులు చేసుకుపోయి.. వనరులు, ధనం వృథా చేస్తారని చెప్తుంది ‘గోటితో పోయేదానికి గొడ్డలి’ అనే సామెత కథ. అనారోగ్యాలు కలిగినప్పుడు, సొంత అభిప్రాయాలు ఏర్పర్చుకుని నిర్లక్ష్యం చేయకుండా, వైద్యుని సంప్రదించి తగిన చికిత్స పొందడం ఎంత అవసరమో ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అనే సామెత కథ చెబుతుంది.
నోరు అదుపు చేసుకుని, అనవసర వివాదాలకు దూరంగా ఉండడం ఎంత ముఖ్యమో ‘తినబోతూ రుచి’ అనే సామెత కథ వివరిస్తుంది. ‘తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసింది’ అనే సామెత కథలో తమ యజమాని మోసం చేయాలని ప్రయత్నించిన ఓ మాజీ డ్రైవరు, అతని స్నేహితుల వైనం వివరిస్తారు. ఈ కథలో ‘పాలు తాగి రొమ్ము గుద్దితే’, ‘ఊరికే పెట్టే అమ్మా నీ మొగుడితో సమానంగా పెట్టు’ అనే మరో రెండు సామెతలను సందర్భోచితంగా వాడారు రచయిత్రి.
తాము పై మెట్టు మీద ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు తన కంటే తక్కువగా ఉన్నారనే లోకువ భావం మంచిది కాదనీ, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరనీ, అందుకే తోటివారిని కించపర్చకూడదని ‘నవ్విన వాళ్ళముందే కాలు జారి పడ్డారు’ అనే సామెత కథలో చెప్తారు రచయిత్రి.
ఇద్దరు మాట్లాడుకుంటుంటే, వాళ్ళ మధ్య దూరి అనవసర ప్రసంగం చేసే వ్యక్తి గురించి ‘పానకంలో పుడక’ సామెత కథ చెబుతుంది. పిల్లలకి విచక్షణ నేర్పితే దుబారా ఖర్చులు చేయకుండా డబ్బుని సద్వినియోగం చేస్తారని చెబుతుంది ‘పిండి కొద్దీ రొట్టె’ అనే సామెత కథ.
సమస్య వచ్చినప్పుడే ధైర్యంగా నిలబడాలి, ఆలోచించి పరిష్కారం వెతుక్కోవాలని సూచిస్తుంది ‘మనసులో ఉన్నమాట సోదిలో వచ్చినట్టు’ సామెత కథ. చాలా ప్రాక్టికల్ సందేశమిది.
కుటుంబంలోని స్త్రీలలో ఎవరి ప్రాధాన్యం వారిదేననీ, ఆ విషయం వారికి అర్థమయ్యేలా చెయ్యటం పురుషుల పని అనీ, ఇంట్లో మగవాళ్ళు అలా ప్రవర్తించగలిగితే కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు రావని చెబుతుంది ‘ముందొచ్చిన చెవులకంటే..’ సామెత కథ.
భార్యాబిడ్డల సరదాలు కాదని అతిగా పొదుపు చేసి, ఓ మోసకారి బ్యాంకులో ఆ డబ్బుని పెట్టి, ఆ బ్యాంకు బిచాణా ఎత్తేస్తే లబోదిబోమంటాడు మురళి ‘మూసిపెడితే’ అనే సామెత కథలో. వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకునే నయవంచకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ కథ సూచిస్తుంది.
~
సమాజంలోని వ్యక్తులని నిశితంగా పరిశీలించి, వారి మనస్తత్వాలను, స్వభావాలను గుర్తించి పాత్రలుగా మలచి, చక్కని సన్నివేశాలు కల్పించి, సామెతలను థీమ్‍గా ఉపయోగిస్తూ శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారు అందించిన ఈ విందు పాఠకులకు పసందుగా ఉంటుందనడంలో సందేహం లేదు.
***
రచన: మద్దూరి బిందుమాధవి
పేజీలు: 179
ధర: ₹ 150
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్ 90004 13413
రచయిత్రి: ఫోన్: 94917 27272