Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-15: సామెతలు మార్చండి సారులూ..!

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఇ[/dropcap]ల్లే కైలాసం అన్నారు

ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు..

మార్చండి సారులూ మీ మాటలూ, మీ సామెతలూ..

ఆ యిల్లు కళకళలాడడం కోసం

ఆ యిల్లు తళతళలాడడం కోసం

ఆ యిల్లు మిలమిల మెరవడం కోసం

ఆ యింట్లో లక్ష్మి గలగలలాడడం కోసం

ఆ యింట్లోవాళ్ళు పకపకా నవ్వడం కోసం

ఆ యింట్లోవాళ్ళు అన్నివిధాలా అభివృధ్ధి చెందడం కోసం

ఆ యింట్లో పెద్దాచిన్నా, ముసలీ ముతకా, పిల్లాపాపా అందరూ ఆనందంగా వుండడం కోసం

చుట్టపక్కాలు ఉత్తమాయిల్లాలు అనడం కోసం

భర్తపేరు తప్ప తనపేరే యెక్కడా వినిపించని తనదికాని యింటి కోసం

ఒక్కతై పగలూరాత్రీ చేసిన సేవలకి,

ఒక్కతై తనకంటూ ఒక్క నిమిషమైనా ఆలోచించని యిల్లాలికి

పెళ్ళైన పాతికేళ్ళకే వొంట్లో శక్తినంతా ఖర్చు పెట్టేసిన యిల్లాలికి

జీవితాన్నంతా గంధంచెక్కలా అరగదీసుకున్న ఆ యిల్లాలికి

అరవై యేళ్ళొచ్చేసరికి

ఓపిక తగ్గిపోయి, కీళ్ళు అరిగిపోయి

నడుం వంగిపోయి, కళ్ళు మసకబారి

నరాలు స్వాధీనం తప్పి, చేతులు వణుకుతుంటే

ఆ మాట కూడా పైకి చెప్పలేక,  కూర్చుని లేవలేనిస్థితిలో

జీవితంలో పడమటిసంధ్యకు చేరుకున్న ఆ యిల్లాలికి యిప్పుడు ఆసరా యెవ్వరో?

పొట్ట చేత పట్టుకుని వలసపోయిన పిల్లలు వచ్చి పక్కనుండలేరు

అవసరం తీరిన బంధుగణం వెనుతిరిగి చూడరు

కంచంలో అన్నం పెడితే తినడం తప్ప అత్తెసరు కూడా వేసుకోడం చేతకాని మొగుడు

యేం చేయాలో తెలియని అశక్తతతో

డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, మందులు తెచ్చి వేస్తూ

వయసులో ఓపికంతా యింటికే ఖర్చుపెట్టేసిన ఆ యిల్లాలిని చూసి

యేమీ చేయలేకా, చేయకుండా వుండలేకా

యింటికి కాదు ప్రాధాన్యం యిల్లాలి కివ్వాలని అన్నేళ్ళకి తెలుసుకుని

యిల్లాలిని కూడా తనతో సమానంగా చూడాలనే ఆలోచనకు బలమిచ్చి

ఇంటిని కాదు ముందు యిల్లాలిని చూడమని చెపుతూ

సామెతను కాస్తైనా మార్చండి సారులూ

అంటూ వేడుకుంటున్నాడీ లోకాన్ని..

 

 

Exit mobile version