సంక్షిప్త హనుమ చరిత్ర

0
2

[box type=’note’ fontsize=’16’] బాలల కోసం హనుమంతుడి కథని సంక్షిప్తంగా వివరిస్తున్నారు ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి “సంక్షిప్త హనుమ చరిత్ర”లో. [/box]

ఉపోధ్ఘాతము

హనుమంతుని విశేష గుణాలు:

శ్రీరామ దూతః శిరస్సా నమామి

రఘురామ దూతః మనస్సా నమామి

శ్రీ హనుమంతుల వారు వాయుదేవుని ప్రసాదమున అంజానాదేవి, కేసరిలకు పుట్టిన తనయుడు. హనుమంతుడు గొప్ప రామభక్తుడు, సేవకుడు. చిరంజీవి. నిరంతర రామనామ పారాయణ ప్రియుడు. తలచినంతనే పలికే ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలను చిటికెలో తీర్చే దైవం. అంతే కాదు, చింతలు తీర్చి మనశ్శాంతిని కలిగిస్తాడు. శనిదేవుని అదుపులో నుంచి శని ప్రభావం తగ్గించి, బాధలను తగ్గిస్తాడు. వినయశీలి, నిరహంకారి. వాక్చతురుడు. సమయపాలన కలవాడు. మితభాషి. ఘోటక బ్రహ్మచారి. సమయోచిత వాక్చతురుడు. బ్రహ్మజ్ఞాని. గొప్ప యుద్ధ యోధుడు. పెద్దల ఎడ గౌరవము కలవాడు. తెలివిమంతుడు. సమయోచిత ప్రవర్తన కలవాడు. గొప్ప రామభక్తుడు. భయమును పోగొట్టువాడు. భక్తి తత్పరుడు. వ్యాకరణ కోవిదుడు. ఉపనిషత్ వేత్త. సకల సద్గుణరాశి. భక్తుల పాలిట కొంగు బంగారం వంటి వాడు. హనుమంతుడను నమ్మినవారికి ఎదురులేదు.  విజయములు తథ్యముగా కలుగును.

ఇన్ని విశేషణములు, విశేషములు కలిగిన హనుమంతుని కొలిచిన మనిషి జీవితము సార్థకము అను మాటలలో సంశయము, అతిశయోక్తి ఏమీ లేవు.

అట్టి హనుమంతుని గురించి క్లుప్తముగా తెలుసుకుందాము.

***

“అంజనా నందనం వీరం

జానకీ శోక నాశనం

కపీశ మక్ష హంతారం

వందే లంకా భయంకరం.”

వానర రాజు ‘కేసరి’. ఆయన భార్య ‘అంజనా దేవి’. వారు అన్యోన్య దంపతులు. వారికి చాలా కాలము సంతానము లేకపోవటం వలన అంజనా దేవి సంతానము కొఱకై తపస్సు ఆచరించింది.

అంతట వాయు దేవుడు శివుని అంశతో నున్న “దివ్య ఫలము”ను అంజనా దేవికి ఇస్తాడు.

అది తిన్న అంజనా దేవికి వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్ష దశమి, శనివారం నాడు ఆంజనేయస్వామి జన్మిస్తాడు.

హనుమ వాలములో దేవి కూడా తన శక్తిని విలీనము చేయుట వలన హనుమలో శివపార్వతుల అంశలు రెండూ ఉన్నాయి.

హనుమంతునికి “సుందరు”డనే నామధేయము కూడా ఉంది.

***

ఒకనాడు ఆకలిగొన్న హనుమకు ఆహారం తేవడానికి అరణ్యానికి వెళ్ళింది అంజనా దేవి. కానీ అంతలోనే ఆకలితో ఉన్న హనుమ ‘సూర్యగోళము’ను చూసి, అదేదే ‘ఎర్రని పండు’ అనుకుని తినడానికి ఆకాశానికి ఎగురుతాడు.

సరిగ్గా అప్పుడే గ్రహణకాలం. అందువల్ల సూర్యుని పట్టడానికి రాహువు వస్తాడు. హనుమ, రాహువుని బెదిరిస్తాడు. రాహువు భయపడి ఇంద్రుని శరణువేడుతాడు.

అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో ఆంజనేయస్వామిని కొట్టగా ‘హనుమ’ అంటే ‘దవడ’ వాచి వంకర పోతుంది. అందుకే ఆంజనేయస్వామికి “హనుమంతుడు” అనే పేరు వచ్చింది. వజ్రాయుధం దెబ్బకు హనుమంతుడు మూర్ఛబోయాడు.

అప్పుడు వాయుదేవుడు హనుమను తీసుకుపోయి, సపర్యలు చేస్తాడు. హనుమ పరిస్థితికి కోపం వచ్చి గాలిని బంధింప చేస్తాడు. గాలి లేనిదే ఎవరూ బ్రతకలేరు కదా! అందుకే మునులు, దేవతలు బ్రహ్మదేవుడి శరణు కోరుతారు.

అప్పుడు బ్రహ్మ, ఇతర దేవతలు, మునులు వచ్చి హనుమంతుని మూర్ఛ తీర్చి, కాపాడుతారు. అంతే కాక, ఎన్నో వరాలు ఇస్తారు.

అందులో ముఖ్యమైనవి – అగ్నివలన, జలము వలన, వజ్రాయుధం వలన భాధ కలగదని; అగ్ని, వరుణ, ఇంద్రాది దేవతలు; మృత్యువు దరి చేరదని యముడు; బ్రహ్మాస్త్రము, బ్రహ్మదండముల వలన హాని కలగదని బ్రహ్మ; తనలో శతాంశము తేజస్సు ఇచ్చి వేదాలు నేర్పుతానని సూర్యుడు, విద్యలు వశమవునని వాయుదేవుడు వరాలు ఇస్తారు.

దానితో వరబల గర్వితుడైన హనుమ మునులను బాధించగా, వారు ‘ఇతరులు తెలియపరిచే వరకూ నీ బలము నీకు తెలియద’ని శాపమిచ్చారు.

అందుకే హనుమను ‘నువ్వు ఇంత వాడివి, నీవు ఆ పని చేయగలవు’ అని పొగిడి, బలం గుర్తు చేసి పనులు సాధించుకునే వారు అందరూ.

కాలం గడవగా, హనుమ సకల విద్యాపారంగతుడయి, సోదరుడు వాలి చే ఓడించబడి రాజ్యభ్రష్టుడై ఋష్యమూక పర్వతంపై తిరుగుచున్న సుగ్రీవుని అనుచరుడయ్యాడు.

***

దశరథ మహారాజు కొడుకు శ్రీరామచంద్రుడు స్వయంవరంలో శివధనస్సును విరిచి, జనక మహారాజు కుమార్తె అయిన ‘జానకి’ని పరిణయమాడాడు.

పినతల్లి కైకకు తండ్రి ఇచ్చిన వరాల కారణంగా శ్రీరాముడు అరణ్య వాసమునకు బయలుదేరగా, పతివ్రతయగు భార్య సీత, భాతృ ప్రేమతో సోదరుడు లక్ష్మణుడు కూడా అరణ్యవాసానికి బయలుదేరారు.

సీతారామలక్ష్మణులు వనవాస దీక్షలో నున్నప్పుడు రాక్షసుడు అయిన లంకాధిపతి రావణుని చెల్లెలు “శూర్పణఖ” లక్ష్మణుని మోహించి కోరగా, లక్ష్మణుడు కోపించి శూర్పణఖ ముక్కు చెవులు కోసి పంపిస్తాడు.

అప్పుడు రావణాసురుడు చెల్లి కోరికపై వారున్న చోటికి పగతో వెళ్ళి సీతను చూసి మోహించి, సన్యాసి వేషము ధరించి సీతను మోసం చేసి చెఱపట్టి, లంకకు తీసుకుని వస్తాడు.

అంతట సీతను వెతుకుచూ రామలక్ష్మణులు కూడా ఋష్యమూక పర్వతం చేరుతారు.

వారిని చూచి సుగ్రీవుడు తనను చంపటానికి వాలి పంపియుండ వచ్చని భయపడి పారిపోవనెంచగా హనుమంతుడు  ధైర్యము చెప్పి, విప్రుని వలె వెళ్ళి, చక్కని  వాక్చాతుర్యము ప్రదర్శించి రాముని మనసు గెలుచుకుని వారి వృత్తాంతము తెలిసికొని, రాముణి, సుగ్రీవునికి మైత్రి ఏర్పరుచుతాడు.

రాముడు వాలిని సంహరించి, మళ్ళీ సుగ్రీవుని రాజుగా చేస్తాడు.

ప్రత్యుపకారముగా సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను సాయమిస్తాడు. అంగదుడు, నలుడు, నీలుడు మొదలైన వానర ప్రముఖులతో హనుమ దక్షిణ దిశగా బయలుదేరుతాడు.

హనుమలోని కార్య దీక్ష కాంచిన రాముడు తన “అంగుళీయకము” ఇచ్చి పంపుతాడు.

సీత గురించి జటాయువు సోదరుడు ‘సంపాతి’ ఇచ్చిన సమాచారము మేరకు లంకకు వెళ్ళటానికి హనుమంతుడు సిద్ధమౌతాడు. అందుకు సముద్రము దాటాలి. కాని శివాంశసంభూతుడు హనుమకి అది ఒక లెక్క కాదు కదా.

శ్రీరామ నామము జపించి ఆకాశమునెగిరాడు. మధ్యలో “మైనాకుడు” అనే పర్వతశ్రేష్ఠుడు సాగరుని సూచన ప్రకారము హనుమంతునికి ఆతిథ్యమివ్వడానికి సముద్రములోంచి బయటికి వస్తాడు. మైనాకుడు బంగారు పర్వతము. అప్పట్లో పర్వతాలలో ఉండే రేఖలను ఇంద్రుడు ఖండించబోగా హనుమ తండ్రి అయిన వాయుదేవుని సహాయము వలన రక్షింపబడతాడు మైనాకుడు. ఆ కృతజ్ఞతా భావముతో హనుమకి ఆతిథ్యమివ్వబోను “కార్యార్థి” అయిన హనుమ తన కరస్పర్శతోనే మైనాకుని సంతృప్తి పరచి ముందుకు సాగిపోయిన కార్యదీక్షాపరుడు.

“సరస” అనే నాగమాత అడ్డు పడి ఆహారము కమ్మని గద్దించిగా, సూక్ష్మరూపముతో నోటిలో ప్రవేశించి తిరిగి బయటికి వచ్చి తన బుద్ధిసూక్షత తెలుపుకుంటాడు.

“సింహిక” అనే జల రాక్షసి కబళించబోగా, తెలివితో ఆమెను సంహరించి తన తెలివిని, వీరత్వాన్ని చాటుకుంటాడు.

నూరు యోజనముల దూరములో నున్న లంకను ఒక్క బిగిలో లంఘించి, లంకను చేరిన వీరుడు, ధైర్యశాలి హనుమ.

లంకలో ప్రవేశించిన హనుమ తనను నిరోధించిన “లంకిణి” అనే రాక్షసిని ఓడించి ముందుకు సాహసుడు.

సూక్ష్మరూపములో లంకను శోధించి సీత జాడకు కనుగొని, ఆత్మ హత్యాప్రయత్నంలో ఉన్న ఆమెను వారించి “రామముద్రిక” నిచ్చి వారి క్షేమ సమాచారము తెలిపి ఓదార్చి, రామ లక్ష్మణులకు సీత జాడ తెలిపి, తీసికుని వత్తునని వారు రావణుని బారి నుంచి రక్షించే వార్త తెలిపి ధైర్యము చెప్పి, రాముణి గుర్తుగా సీతమ్మ వారిచ్చిన “చూడామణి”ని తీసుకుంటాడు.

కాని అంతటితో ఊరుకోలేదు హనుమ. “శత్రువులను జయంచాలంటే వారి బలము తమకి తెలియాలి. అలాగే మన బలము చూపి వారిని బెదిరించాలి. అప్పుడే వారు జంకుతారు” అనుకుని రావణునికి ప్రియమైన అశోకవనాన్ని ధ్వంసము చేస్తాడు.

రావణుడు తనపై పంపిన సైన్యాన్ని, మంత్రి కుమారులనీ, మహా బలశాలి జంబుమాలిని, రావణుని సేనాపతులైన విరూక్ష, యుపాక్ష, బాసకర్ణ మొదలైన వారినీ రావణ కుమారుడైన అక్షకుమారుని… ఇలా రావణడు పంపిన ఎందరో బలశాలులను వధిస్తాడు హనుమ.

అంతట రావణుడు ఇంద్రసమాన పరాక్రముడు, మాయావి అయిన తన కుమారుడు “ఇంద్రజిత్తు”ను పంపుతాడు. ఇంద్రజిత్తు ఎన్నో విధాలు హనుమను ఓడించ ప్రయత్నించి సాధించలేక చివరికి బ్రహ్మాస్త్రము సంధిస్తాడు. అప్పుడు హనుమ బ్రహ్మా పైగల గౌరవముతో లొంగిపోతాడు.

ఇంద్రజిత్తు హనుమను రావణుని కడకు తీసుకుపోతాడు. హనుమ ఏమాత్రమూ బెదరక పైనించి సుగ్రీవ సందేశము వినిపించి సీతను వదిలేయ్యమని హితవు పలుకుతాడు. వాలి చేతిలో ఒకసారి దెబ్బతిన్న రావణుడుకి రాముని బలము తెలుపుతూ, ఇంత బలశాలియిన రావణుని ఓడించిన వాలినే హతమార్చిన రాముని బలమెంతో తెలుసికోమని, లంకా నాశనం తప్పించుకోమని సీతను అప్పచెప్పమని హితవు చెపుతాడు. ఇది హనుమ వాక్చతుర్యాన్ని, దూత వినమ్రతనీ, కార్య సిద్ధికి కావలసిన లక్షణాన్ని తెలియచేస్తుంది.

కాని రావణుడు వినలేదు సరికాదా అగ్రహించి హనుమ తోకకు నిప్పుపెట్టాడు. ఆ నిప్పుతో “లంకా దహనం” చేస్తాడు. ఇది హనుమ ధీశక్తికి నిదర్శనం.

అందుకే ‘చూచి రమ్మంటే కాల్చి రావటం’ అనే లోకోక్తి పుట్టింది.

హనుమంతుడు తిరిగి వెళ్ళి, రామునికి సీతమ్మ వారిచ్చిన “చూడామణి”’ ఇచ్చి సీతాదేవి సమాచారము, రావణుని క్రూరత్వము తెలుపుతాడు.

అంతట రాముడు వానరులచే సముద్రముపై “వారధి” నిర్మింపచేసి లంకపై దండయాత్ర చేసి రావణుని సంహరించి, సీతమ్మని చెఱనుంచి విడిపించుతాడు.

అయితే సీతమ్మ వారిని కనుగొనుటలోను, అన్నిటిలోనూ ప్రముఖ పాత్ర పోషించినా ఎక్కువగా గర్వము లేక ఒక సైనికుడుగా, సేవకుడుగా మాత్రమే పరాక్రమము, విశ్వాసం చూపించాడు హనుమ.

ముఖ్యముగా యుద్ధ సమయమున లక్ష్మణుడు మూర్ఛిల్లగా సంజీవినీ పర్వతము తీసుకువచ్చి లక్ష్మణుకి కాక ఎందరో వానర ప్రముఖలను కూడా రక్షించాడు హనుమ.

ప్రతి చోట తన వీరత్వమును, సేవాభావనను, భక్తిభావాన్ని చూపించాడు కానీ, ఎక్కడా అహంభావము చూపించలేదు.

అందుకే రామపట్టాభిషేకము సమయమున రాముడు హనుమంతుని ఆలింగనము చేసి తన ప్రేమను అభిమానాన్ని హనుమ ఎడ చాటుకున్నాడు. అంటే అది హనుమ గొప్పదనానికి ఉదాహరణ కదా.

రాముడు అవతారము చాలించినను హనుమంతుడు (యముని) వరము వలన చిరంజీవియై నిరంతర రామనామ జపంతో బ్రహ్మచర్య దీక్షతో భూలోకములోనే ఉండి భక్తుల కష్టములు బారము తీరుస్తూ భక్తులకు కొంగు బంగారంలా అయ్యాడు. (అందుకే ఆయనను “లివింగ్ గాడ్” అంటారు)

హనుమంతుడు సూర్యుని పుత్రిక అయిన సువర్చలాదేవిని గురువు కోరికపై వివాహమాడినా బ్రహ్మచర్య దీక్షావ్రతము కొనసాగించాడు.

తనను పూజించిన వారి కంటే తన ప్రభువగు రాముని పూజించిన వారినే హనుమ ఎక్కువగా ప్రేమిస్తాడు అంటారు. అది హనుమ స్వామిభక్తి. ఎక్కడ రామనామం ఉంటే అక్కడ హనుమ నిలబడతాడు.

హనుమ చిరంజీవి. ఏడుగురు చిరంజీవులలో ఒకరు. ఇప్పటికీ హిమాలయాల్లో గుహల్లో హనుమంతుల వారిని చూశామని కొందరు చెబుతారు.

హనుమ తండ్రి వలే ప్రామదాత. అంటే వాయువు లేనిదే ఎవ్వరూ ఉండలేరు కూడా. అలాగే హనుమ లక్ష్మణుని, సీతాదేవిని, వానరులను ఎందరిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆత్మహత్యా ప్రయత్నములో ఉన్నప్పుడు రక్షిస్తాడు.

అందుకే ప్రాణాపాయములో ఉన్నా లేక రోగంలో ఉన్నా స్వామిని తలిస్తే మేలు జరుగుతుంది అంటారు.

హనుమంతునికి ధవళ వర్ణము అంటే ఇష్టము. తమలపాకులు, అప్పాలు, గారెలు, కొబ్బరి బొండాలు అంటే ఇష్టము.

‘సింధూర లేపనం’ అమిత ప్రీతి. ఎందుకంటే ఒక్కడు సీతాదేవి నుదుట సింధూరం ధరిస్తుండగా ఎందుకని అడుగుతాడు. అప్పుడు సీత అది రామునికి (అంటే భర్తకి) క్షేమదాయకం అని చెబుతుంది. అయితే అది రామునికి క్షేమమని ఇలాగనే నుదుట కొంచెము పెట్టుకొంటే అంత మంచిదయితే వళ్ళంతా రాసుకుంటే రామునికి ఇంకెంత క్షేమం అని తన వడలంతా రాసుకుంటాడు.

మంగళవారము, శనివారము స్వామికి ముఖ్యమైన రోజులు, ఎందుకంటే “మంగళవారము” హనుమ సీతమ్మను లంకలో చూసిన రోజు. “శనివారము” హనుమ పుట్టిన రోజు. మంగళవారము హనుమకి ఇష్టమైన రోజు. మంగళకరమైనది. దీనిని  “జయవారము” అని కూడా అంటారు.

స్వామి వర్ణము ఆకుపచ్చ. అందుకే సీతాన్వేషణలో ఆయన చెట్లలో కలసి పోయి సులభంగా రాక్షసుల కన్ను కప్పుతాడు.

హనుమ శత్రువులో విశేషాలను కూడా పొగుడుతాడు. ఉదా- రావణుని మెచ్చుకుంటాడు. తాను అంతగా గొప్పవాడయినా రాజు సుగ్రీవుని సచివుడిలానే కొలుస్తాడు, మంత్రిలా సలహాలనిస్తాడు.

హనుమలో గొప్ప త్యాగశీలత ఉంది. సీతామాత మొదట కనబడనప్పుడు తోటి వానరులను కాపాడటానికి ఆత్మార్పణకు సిద్ధమోతాడు. ఎంతుకంటే సీతమ్మ జాడ లేకపోతే మరణదండన అని సుగ్రీవాజ్ఞ.

అనేకచోట్ల హనుమంతునికి ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని “తిరకొండ”. హనుమంతుల వారు “సంజీవనీ పర్వతం” తీసెకెళ్లేటప్పుడు ఒక ముక్క విరిగి ఇక్కడ పడిందని చెబుతారు. అందువల్ల సంజీవనిలోని ఔషద గుణాలు అక్కడ ఉన్నాయని అక్కడి గాలి, నీరు, మట్టి రోగ సంహారకాలని అంటారు.

“నెట్టికంటిలోని” ఆంజనేయస్వామి దేవాలయము కూడా ప్రముఖమైనది.

“బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వ మరోకతా ।

అజాగ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణాద్భవేతే ॥”

అంటే హనుమంతుని పూజించిన వారికి మందమతితనం పోయి ధైర్యశాలి, కీర్తిమంతులు అవుతారని తెలుపుతోంది.

హనుమంతుడు శనిదేవుని తొక్కి ఉంచుతాడని అంటారు. అందువల్ల శని ప్రభవమున్న వారెవరైనా హనుమంతుడిని పూజిస్తే ఆయన శనిని అదుపులో ఉంచి బాధలు తగ్గిస్తాడు.

“అవిస్తరం, అసందిగ్దం

అవిలంభితం, అవ్యధం”

అంటే చెప్పదలచిన విషయాన్ని సూటిగా క్లుప్తంగా చక్కగా చెప్పాడు హనుమ అని కూడా తెలుపుతారు. అందరూ అలా మాట్లాడటం నేర్చుకోవాలని దీని భావం.

హనుమంతుని గురించి ఆయన వ్యక్తిత్వము స్వభావము తెలిసికొనుటకు సుందరకాండ చదవాలి. అంతేకాదు కష్టాల్లో ఉన్నప్పుడు సుందరకాండ పారాయణం చేస్తే (41 రోజులు) కష్టాలు తీరుతాయి అంటారు.

అట్టి మహానుభావుడు హనుమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

“ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।

తరుణార్క ప్రభోశాన్తం రామదూతం నమామ్యహం ॥”

అయిదుసార్లు ఈ శ్లోకం చదువుతూ ప్రదక్షిణం చేస్తే కష్టాలు తీరి, కోరికలు ఫలిస్తాయి. పుణ్యం వస్తుంది. స్వామి వారి కృపకు పాత్రులవుతారు.

హనుమంతునిలో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. అందులో కొన్నైనా ఒక్కటైనా  నేర్చుకుంటే పాటిస్తే మనిషి జన్మ ధన్యం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here