Site icon Sanchika

ఆహ్లాదంగా సాగిపోయే ‘సమ్మోహనం’

[box type=’note’ fontsize=’16’] “మసాలాలు కూర్చిన, రొడ్డకొట్టుడు చిత్రాల నడుమ ‘సమ్మోహనం’ వో చల్లని గాలిలా కమ్మేస్తుంది. వొక రొమాంటిక్ చిత్రానికి సంగీత సాహిత్యాలు తప్పకుండా బాగుండాలి. ఇందులో ఆ బలం వుంది” అంటున్నారు పరేష్ ఎన్. దోషిసమ్మోహనం‘ సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap style=”circle”]వి[/dropcap]జయ్ (సుధీర్ బాబు) వో చిత్రకారుడు. పిల్లల పుస్తకానికి బొమ్మలు వేయడంలో ఆసక్తి కలవాడు. సినెమాలో నటించాలని వున్న తండ్రి (నరేష్), తల్లి (పవిత్రా లోకేష్), చదువుకుంటున్న వో చెల్లెలు. విజయ్ కి మాత్రం సినెమాల మీదా, అందులో పనిచేసే వాళ్ళ మీదా సదభిప్రాయం వుండదు. అలాంటిది వో సినెమా షూటింగ్ కి వాళ్ళ ఇంట్లో దిగుతుందో టీము. తనకు వో పాత్ర ఇస్తే షూటింగ్ కోసం ఇల్లునిస్తానన్న నరేష్ షరతు మీద. నాయిక వో పేరుపొందిన నటి సమీర (అదితి రావు హైదరి). కాబట్టి ఇంట్లో, స్నేహితుల్లో, చుట్టుపక్కలా హడావిడి యెక్కువవుతుంది. సమీర తెలుగమ్మాయి కాకపోవడం వల్ల సంభాషణలు చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. చూసి తండ్రీ కొడుకులిద్దరూ గట్టిగానే నవ్వేస్తారు. అయితే ఆశ్చర్యంగా అవమాన పడకుండా సమీర అతన్నే తనకు తెలుగు సంభాషణల్లో తర్ఫీదు ఇమ్మని కోరుకుంటుంది. అలా వాళ్ళు దగ్గరగా మసులుతున్న క్షణాల్లో ఇద్దరి మధ్యా ప్రేమ పుడుతుంది. మిగతా కథంతా ఆ ప్రేమ యెలాంటి మలుపులు తిరిగి, అపార్థాలకు తావిచ్చి చివరికి పతాకస్థాయికి చేరుకుంటున్నదన్నది మిగతా కథ.

కథా పరంగా చూస్తే ఇందులో కొత్తగా యేమీ లేదు. ఇలాంటి చిత్రాలు ఇదివరకు వచ్చినవే. అయితే చాలా సార్లు కథనం మనిషిని కట్టిపడేస్తుంది. సినెమా కాబట్టి సంభాషణలకంటే కూడా దృశ్యపరంగా కథను యెలా చెప్పబడిందో ప్రాముఖ్యత వహిస్తుంది. ఆ క్రెడిట్టు పూర్తిగా ఇంద్రగంటి మోహనకృష్ణకు దక్కుతుంది. యెక్కడా విసుగు అనిపించకుండా, ఆ నాయికా నాయకుల కథలో లీనమైపోయేలా చిత్రాన్ని తీశాడు. యెలాంటి సినెమా నేపథ్యం లేకపోయినా తన స్వశక్తి మీద ఆ స్థాయికి చేరుకున్న నాయిక, అయినా చాలా సరళంగా, అమాయకంగా, నిజాయితీగా నేలపైనే అడుగులు వేసే అమ్మాయి. అబ్బాయి మాత్రం అకారణంగా సినెమా వాళ్ళ పట్ల చిన్న చూపు కలిగిన పొగరుబోతులా అనిపిస్తాడు. కథలో, పాత్ర చిత్రీకరణలో పెట్టిన శ్రధ్ధ కనిపిస్తుంది. పిల్లలను అర్థం చేసుకుని, సపోర్ట్ చేసే తల్లి, నేను చిన్నపిల్లనేం కాదు, నాకు మంచీ చెడూ తెలుసు, నా విషయాల్లో పెత్తనాలు సహించను అని తెగేసి చెప్పే చెల్లెలు. అదితిరావ్ హైదరి బాగా చేసింది. సుధీర్ బాబు కూడా, ముందు ముందు ఇతని నుంచి మంచి సినెమాలు ఆశించవచ్చు. అదనంగా నరేష్ అందించిన హాస్యం. స్నేహితులుగా రాహుల్ రామకృష్ణ (రెండు నిముషాల పాత్ర చేసినా గుర్తుండిపోయే అబ్బాయి; సంభాషణలు చాలా బాగా చెప్పే నేర్పు), అభయ్ లు కూడా బాగా చేశారు. పవిత్ర లోకేష్‌ది కూడా చక్కని అభినయం. పి జి విందా సినెమేటోగ్రఫి అందంగా, ఆహ్లాదంగా వుంది. వివేక్ సాగర్ సంగీతమూ, పాటలూ బాగున్నాయి.

నరేష్ అప్పట్లో మంచి మంచి చిత్రాలు చేసి మనం మరచిపోలేకుండా చేసుకున్నాడు. అయితే ఈ రెండవ రాకడ కూడా చాలా ప్రతిభావంతంగా వుంది. హిందీలో రిషి కపూర్‌కి యెలా అయితే మంచి పాత్రలు వస్తున్నయో, మన దగ్గర నరేష్‌కి కూడా నటనావకాశం వున్న పాత్రలొస్తున్నాయి. సుధీర్ బాబు చిత్రం నేనిదే చూడటం. కాని మంచి నటుడు కనిపించాడు అతనిలో. వొక్క షాట్లోనే అతను ముఖమ్మీద క్రమంగా మారుతున్న భావాలు ప్రకటించడం గాని, సంభాషణల ఉచ్చారణగాని, ఆ vulnerability గాని అన్నీ సరిగ్గా పాత్రకు సరిపోయేలాగా చేశాడు. సమయానికి తగ్గ మాట (సిరివెన్నెల సీతారామశాస్త్రి), మనసైనదేదో (ఇంద్రగంటి శ్రీకాంతశర్మ), కనులలో తడిగా, చెలితార నా మనసారా (రామజోగయ్యశాస్త్రి) పాటలు బాగున్నాయి. మళ్ళీ మంచి సాహిత్యపు పాటలు వస్తున్నాయని celebrate చేసుకునే రోజులు. (ఇటీవలే వచ్చిన ఫిదా, కృష్ణార్జున యుద్ధం, రంగస్థలం లాంటి చిత్రాలు నా దృష్టిలో వున్నాయి.) వివేక్ సాగర్, చైత్ర అంబడిపూడి, హరిచరన్, కీర్తనలు కూడా బాగా పాడారు. వొక రొమాంటిక్ చిత్రానికి సంగీత సాహిత్యాలు తప్పకుండా బాగుండాలి. ఇందులో ఆ బలం వుంది.

మసాలాలు కూర్చిన, రొడ్డకొట్టుడు చిత్రాల నడుమ ‘సమ్మోహనం’ వో చల్లని గాలిలా కమ్మేస్తుంది. ‘గోల్కొండ హైస్కూల్ లాంటి చిత్రాలు తీసిన మోహనకృష్ణ మనకున్న మంచి దర్శకులలో వొకడుగా స్థిరపడ్డట్టే. ముఖ్యంగా మొదటి నుంచి చివరిదాకా కథంతా సినెమాటిక్ గా conceive చేసి అమలు పరచగలడు. ఈ దర్శకుని నుంచి మరిన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చు.

Exit mobile version